రాజ్య ప్రచారకుల నివేదిక
అలాస్కాలో దేవుడు వృద్ధి కలుగజేస్తున్నాడు
మంచుతోనూ హిమంతోను కప్పబడిన నేలక్రిందవున్న చాలా చిన్నదైన ఒక విత్తనం మొలకెత్తే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అలాస్కాలో మూడు నెలలపాటు మాత్రమే ఉండే వేసవి కాలంలో, మూడు మిల్లీమీటర్లు మాత్రమే చుట్టుకొలతగా గల క్యాబేజీ విత్తనం, 40 కిలోల పరిమాణం వరకూ పెరగవచ్చు! అవును, బంజరు భూమనీ మంచుతో కప్పబడిన బీడు భూమనీ ఒకప్పుడు అనేకులు అనుకున్న ఈ ప్రాంతం పుష్కలంగా పంటలను పండించగలదు.
అలాస్కానందలి ఆధ్యాత్మిక ప్రాంతం విషయంలో ఇది మరింత వాస్తవమై ఉంది. సంవత్సరంలో చలికాలం ఎక్కువగా ఉండే ఆ దేశంలో, యెహోవాసాక్షులు రాజ్య విత్తనాలను విత్తుతూనే ఉన్నారు. భూమ్మీద ఇతర ప్రాంతాల్లో చేస్తున్నట్లుగానే, సారవంతమైన నేలలుగా వున్న హృదయాల్లోని విత్తనాలకు దేవుడు వృద్ధి కలుగజేస్తున్నాడు.—1 కొరింథీయులు 3:6, 7.
● వనీస్సా అనే పేరుగల ఒక యౌవన సాక్షి పాఠశాల బస్సులో వెళ్లేటప్పుడు, ఆన్ అనే తోటి విద్యార్థి ఎప్పుడూ ఒక్కర్తే కూర్చోవడాన్ని గమనించింది. ఆన్ దుఃఖంగా ఉన్నట్లు కనిపించేది, కాబట్టి తన ప్రక్కన వచ్చి కూర్చోమని వనీస్సా ఆన్‌ను పిలిచింది. ఆన్ దుఃఖంగా ఉండడం ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు! ఎందుకంటే ఆమె తల్లి గుండెపోటు మూలంగా మరణించింది, కొంత కాలం గడిచిన తర్వాత ఆమె తండ్రి క్యాన్సర్ మూలంగా మరణించాడు. అందుకే ఆన్ తన బంధువులవద్ద అలాస్కాలో నివసిస్తోంది.
ఒక శనివారం ప్రాంతీయ పరిచర్య చేస్తున్నప్పుడు వనీస్సా తన క్రొత్త స్నేహితురాలి ఇంటి వద్ద ఆగి ఆమెకు దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రొషూర్ను ఇచ్చింది. ఆ తర్వాతి సోమవారం ఆన్ పాఠశాలలో ఈ యౌవన సాక్షిని వెదికి పట్టుకుంది. ఆన్‌కు అనేక బైబిలు ప్రశ్నలు ఉన్నాయి, వాటికి వనీస్సా జవాబులు ఇవ్వగలిగింది. “మీ కూటాలు ఎక్కడ జరుగుతాయి?” అని ఆమె అడిగింది. ఆ సాయంత్రం ఆన్ రాజ్యమందిరంలో జరిగే కూటానికి మొదటిసారి హాజరయ్యింది.
యేసు వాగ్దానం చేసినట్లుగానే అనేకమంది ‘తండ్రులనూ తల్లులనూ’ కనుగొనడానికి ఈ 17 ఏళ్ల అనాధ బాలికకు ఎంతో సమయం పట్టలేదు. (మత్తయి 19:29) సంతోషంగా, చిరునవ్వులు నవ్వుతున్న ఆన్, యెహోవాకు తాను చేసుకున్న సమర్పణకు సూచనగా “దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశంలో నీటి బాప్తిస్మం తీసుకోవడాన్ని తిలకించడం ఎంతో ఆనందమయమైన సందర్భంగా ఉండినది!
● అలాస్కా సువిశాల ఆర్కిటిక్ ప్రాంతపు సుదూర ప్రదేశాల్లోని—అక్కడ గ్రామానికీ గ్రామానికీ మధ్య వందల కిలోమీటర్ల ఎడం ఉంటుంది—150 కంటే ఎక్కువ సముదాయాల్లో విత్తనాలు విత్తేందుకు వాచ్ టవర్ సొసైటీకి చెందిన ట్విన్ ఇంజన్ ఎయిర్‌ప్లేన్ ఉపయోగించబడింది. క్రమ బైబిలు పఠనం ద్వారా పొందే ఆధ్యాత్మిక పురోభివృద్ధి, ఉత్తరప్రత్యుత్తరాల పైనే ఆధారపడుతుంది. ఉత్తరాలు వ్రాయడమనేది అనేకులకు కష్టంతో కూడిన పనిగా అనిపిస్తుంది గనుక, విద్యార్థిలోని ఆసక్తిని సజీవంగా ఉంచేందుకు ఒక బైబిలు బోధకుడు ఎంతో సృజనాత్మకతను కలిగి ఉండవలసి ఉంటుంది. దీనినెలా సాధించవచ్చు?
ఎడ్నా కాథీలు ఒకరి నుండి ఒకరు 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో నివసిస్తున్నప్పటికీ కాథీ ఒక చక్కని పురోభివృద్ధికరమైన బైబిలు పఠనాన్ని నిర్వహించింది. పఠన సహాయక పుస్తకంలోని ప్రశ్నలను ఎత్తి వ్రాయకుండా, జవాబులు వ్రాసేందుకు ప్రశ్నకూ ప్రశ్నకూ మధ్య ఖాళీ స్థలాన్ని విడిచిపెడుతూ ప్రశ్నల వర్క్‌షీట్ నొకదాన్ని కాథీ తయారు చేసింది. ఎడ్నా దానిలో జవాబులను వ్రాసి పంపించిన తర్వాత, ఏ విషయాన్నైనా స్పష్టం చేయాల్సిన అవసరముంటే ఆ విషయాన్ని స్పష్టపర్చే వ్యాఖ్యానాలను కాథీ అందులో పొందుపరచి రిప్లై వ్రాసేది. కాథీ ఇలా అంటోంది: “నేను మా ‘పఠనం’ కొరకు బుధవారం సాయంత్రాలను కేటాయించాను, నేను ఇతర బైబిలు పఠనాలకు ఎలాగైతే నియమం తప్పకుండా వెళ్తానో అలాగే దీనికి కేటాయించిన సమయానికి హత్తుకునే ఉండేందుకు ప్రయత్నిస్తాను. నేను ఎడ్నాకు నా చిరునామా వ్రాసి, స్టాంపు అంటించిన కవరును కూడా పంపించాను. ఉత్తరాల రాకపోకలకు రెండు వారాలు పట్టేది గనుక, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సాగే పఠనం కాస్త మందకొడిగా సాగుతున్నట్లు అనిపించేది.”
ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా పది నెలలపాటు పఠనం చేసిన తర్వాత ఆంకరేజ్‌లో జరిగిన జిల్లా సమావేశంలో కాథీ ఎడ్నాలు ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు వారికి కలిగిన ఆనందాన్ని ఊహించండి! అలాస్కాలో అక్కడక్కడా విసిరివేయబడినట్లున్న అనేక గ్రామాల నుండి బైబిలు విద్యార్థులూ ఆసక్తిగల ఇతరులూ హాజరైనందుకు సాక్షులు ఎంతో సంతోషించారు.
పెరుగుదల కొన్నిసార్లు మందకొడిగా సాగినట్లు అనిపించినప్పటికీ, కొన్ని “విత్తనాలు” సత్యపు వెలుగును చూసినప్పుడు త్వరగా మొలకెత్తుతాయి. సగటున, అలాస్కాలో ప్రతి సంవత్సరము వందకంటే ఎక్కువమంది యెహోవా యొక్క క్రొత్త స్తుతికర్తలు బాప్తిస్మం పొందుతున్నారు! వృద్ధి కలుగజేస్తున్నందుకు “యెహోవా, నీకు వందనాలు” అని మనం చెబుతాము!