వేరే గొఱ్ఱెలు, క్రొత్త నిబంధన
“విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు[న్న] . . . అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను.”—యెషయా 56:6, 7.
1. (ఎ) యోహాను దర్శనం ప్రకారంగా, యెహోవా తీర్పు వాయువులు వెనుకకు పట్టుకొనబడినప్పుడు ఏది పూర్తిచేయడం జరిగింది? (బి) యోహాను ఏ విశిష్టమైన సమూహాన్ని చూశాడు?
ప్రకటన గ్రంథంలోని నాల్గవ దర్శనంలో, ‘దేవుని ఇశ్రాయేలులోని’ సభ్యులందర్నీ ముద్రించడం పూర్తయ్యేంతవరకూ యెహోవా తీర్పులనే వినాశకర వాయువుల్ని వెనకకు పట్టుకొని ఉండడాన్ని అపొస్తలుడైన యోహాను చూశాడు. అబ్రాహాము సంతానంలో ప్రధాన భాగమైన యేసు ద్వారా ఆశీర్వదించబడే మొదటివారు వీరే. (గలతీయులు 6:16; ఆదికాండము 22:18; ప్రకటన 7:1-4) అదే దర్శనంలో, యోహాను “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి[న], యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము”ను చూశాడు. వాళ్లు “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.” (ప్రకటన 7:9, 10) “గొఱ్ఱెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని” చెప్పడంలో తామూ అబ్రాహాము సంతానం ద్వారా ఆశీర్వదించబడ్డామని గొప్ప సమూహం చూపిస్తోంది.
2. గొప్ప సమూహం ఎప్పుడు కనబడింది, మరి అదెలా గుర్తించబడింది?
2 వెనుకటికి 1935లో ఈ గొప్ప సమూహం గుర్తించబడింది, మరి నేడు సంఖ్యలో 50 లక్షలకన్నా ఎక్కువమంది ఉన్నారు. యేసు “మేకలలోనుండి గొఱ్ఱెలను” వేరుపర్చునప్పుడు మహాశ్రమను తప్పించుకోవడానికి ముద్రించబడినవారైన దాని సభ్యులు నిత్యజీవం కొరకు వేరుపర్చబడతారు. గొఱ్ఱెలదొడ్డిలను గూర్చిన యేసు ఉపమానంలోని ‘వేరే గొఱ్ఱెలలో’ గొప్పసమూహానికి చెందిన క్రైస్తవులు ఉన్నారు. వాళ్లు పరదైసు భూమిపై నిరంతరం జీవించేందుకు నిరీక్షిస్తారు.—మత్తయి 25:31-46; యోహాను 10:16; ప్రకటన 21:3, 4.
3. క్రొత్త నిబంధనకు సంబంధించి అభిషిక్త క్రైస్తవులూ, వేరే గొఱ్ఱెలూ ఏ విధంగా భిన్నంగా ఉన్నారు?
3 అబ్రాహాము నిబంధన ఆశీర్వాదం 1,44,000 మంది విషయంలోనైతే, క్రొత్త నిబంధన ద్వారా చేకూరుతుంది. ఈ నిబంధనలో భాగస్థులుగా, వాళ్లు “కృప” క్రిందకూ, “క్రీస్తు విషయమై[న] ధర్మశాస్త్రము” క్రిందకూ వస్తారు. (రోమీయులు 6:15; 1 కొరింథీయులు 9:21) అందుకే, దేవుని ఇశ్రాయేలులోని 1,44,000 మంది సభ్యులు మాత్రమే యేసు మరణ జ్ఞాపకార్థ సమయంలో చిహ్నాల్లో భాగం వహించగలరు. మరి వారితో మాత్రమే యేసు, రాజ్యం కొరకైన తన నిబంధనను చేశాడు. (లూకా 22:19, 20, 29) గొప్ప సమూహానికి చెందిన సభ్యులు ఆ క్రొత్త నిబంధనలో భాగస్థులుకారు. అయినప్పటికీ, వాళ్లు దేవుని ఇశ్రాయేలుతో సహవసిస్తారు, వాళ్లతోపాటూ వారి ‘దేశంలో’ నివసిస్తారు. (యెషయా 66:8, NW) కాబట్టి వాళ్లూ యెహోవా దేవుని కృప క్రిందకూ, క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రం క్రిందకూ వస్తారని చెప్పడం సహేతుకమైనదే. క్రొత్త నిబంధనలో పాలివారుకాకపోయినప్పటికీ, వాళ్లంతా లబ్దిదారులే.
“విదేశీయులు,” ‘దేవుని ఇశ్రాయేలు’
4, 5. యెషయా ప్రకారంగా, ఏ సమూహం యెహోవాకు పరిచర్య చేస్తుంది? (బి) యెషయా 56:6, 7 వచనాలు గొప్ప సమూహం విషయంలో ఎలా నెరవేరాయి?
4 యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమునచేరు అన్యులను [“విదేశీయులను,” NW] నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును.” (యెషయా 56:6, 7) ఇశ్రాయేలులో, ఇశ్రాయేలీయులుకాని “విదేశీయులు” యెహోవా నామాన్ని ప్రేమించి, ధర్మశాస్త్ర నిబంధనలోని షరతులకు విధేయత చూపిస్తూ, విశ్రాంతిదినాన్ని ఆచరిస్తూ, దేవుని ‘ప్రార్థన మందిరమైన’ ఆలయంవద్ద బలులను అర్పిస్తూ ఆయన్ని ఆరాధిస్తారని దీని భావం.—మత్తయి 21:13.
5 మన కాలంలో, ‘యెహోవా పక్షమునచేరు విదేశీయులు’ గొప్ప సమూహమే. వీళ్లు దేవుని ఇశ్రాయేలు సహవాసంలో యెహోవాకు పరిచర్య చేస్తారు. (జెకర్యా 8:23) వాళ్లు దేవుని ఇశ్రాయేలువలే అంగీకృతమైన బలుల్ని అర్పిస్తారు. (హెబ్రీయులు 13:15, 16) వాళ్లు దేవుని ‘ప్రార్థనామందిరమైన’ ఆయన ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధిస్తారు. (ప్రకటన 7:15 పోల్చండి.) వారపు విశ్రాంతిదినాన్ని ఆచరిస్తారా? అభిషిక్తులైనా లేక వేరే గొఱ్ఱెలకు చెందిన వారైనా దీన్ని ఆచరించాలని ఆజ్ఞాపించబడలేదు. (కొలొస్సయులు 2:16, 17) అయినప్పటికీ, పౌలు అభిషిక్త హెబ్రీ క్రైస్తవులకు ఇలా తెలియజేశాడు: “దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క [దేవుని యొక్క] విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.” (హెబ్రీయులు 4:9, 10) ‘దేవుని నీతికి’ లోబడి ధర్మశాస్త్ర క్రియల ద్వారా తమనుతాము సమర్థించుకునే ప్రయత్నాన్ని విరమించుకున్నప్పుడు ఆ హెబ్రీయులు ఈ “విశ్రాంతి”లోనికి ప్రవేశించారు. (రోమీయులు 10:3, 4) యెహోవా యొక్క నీతికి తమనుతాము లోబర్చుకోవడం ద్వారా అభిషిక్తులైన అన్య క్రైస్తవులు కూడా అదే విధమైన విశ్రాంతిని అనుభవిస్తారు. ఆ విశ్రాంతిలో గొప్ప సమూహం వారితోపాటు చేరుతుంది.
6. వేరే గొఱ్ఱెలు నేడు క్రొత్త నిబంధన క్రిందకు ఎలా వస్తారు?
6 అంతేగాక, ప్రాచీనకాలంలోని విదేశీయులు ధర్మశాస్త్ర నిబంధన క్రిందకు తమకు తాముగా ఎలా వచ్చారో అలాగే వేరే గొఱ్ఱెలూ క్రొత్త నిబంధన క్రిందకు వస్తారు. ఏ విధంగా? దానిలో భాగంవహించే వారిగా కాదుగానీ, దానితో చేరివున్న చట్టాలకు లోబడడం ద్వారా, మరి దాని ఏర్పాట్లనుండి ప్రయోజనం పొందడం ద్వారా దాని క్రిందకు వస్తారు. (యిర్మీయా 31:33, 34 పోల్చండి.) తమ అభిషిక్త సహవాసులవలే, వేరే గొఱ్ఱెల ‘హృదయంలో’ యెహోవా ధర్మవిధి రాయబడివుంది. యెహోవా దేవుని ఆజ్ఞల్నీ, సూత్రాల్నీ వాళ్లెంతగానో ప్రేమించి, వాటికి విధేయత చూపిస్తారు. (కీర్తన 37:31; 119:97) అభిషిక్త క్రైస్తవులవలే, వాళ్లు యెహోవాను ఎరుగుదురు. (యోహాను 17:3) సున్నతి విషయమేమిటి? క్రొత్త నిబంధనను ఏర్పాటు చేయడానికి దాదాపు 1,500 సంవత్సరాల ముందు, మోషే ఇశ్రాయేలీయులకు ఇలా ఉద్బోధించాడు: “మీ హృదయమునకు సున్నతి చేసికొ[నవలెను.]” (ద్వితీయోపదేశకాండము 10:16; యిర్మీయా 4:4) తప్పనిసరిగా చేయించుకోవాల్సిన శరీరసంబంధమైన సున్నతి ధర్మశాస్త్రంతోపాటూ గతించిపోగా, అభిషిక్తులూ వేరే గొఱ్ఱెలూ తమ హృదయాల్ని ‘సున్నతి’ చేయించుకోవాలి. (కొలొస్సయులు 2:11) యేసు చిందించిన “నిబంధన రక్తము” ఆధారంగా యెహోవా వేరే గొఱ్ఱెల అపరాధాన్ని చివరకు క్షమిస్తాడు. (మత్తయి 26:28; 1 యోహాను 1:9; 2:2) దేవుడు 1,44,000 మందిని స్వీకరించినట్లు వేరే గొఱ్ఱెలను ఆధ్యాత్మిక కుమారులుగా స్వీకరించడు. కానీ అబ్రాహాము దేవుని స్నేహితునిగా నీతిమంతుడని ప్రకటించబడిన రీతిలోనే దేవుడు వేరే గొఱ్ఱెల్ని నీతిమంతులని ప్రకటిస్తాడు.—మత్తయి 25:46; రోమీయులు 4:2, 3; యాకోబు 2:23.
7. వేరే గొఱ్ఱెలకు నేడు ఏ ఉత్తరాపేక్ష తెరవబడింది, అబ్రాహామువలే ఎవరు నీతిమంతులని ప్రకటించబడ్డారు?
7 మరి 1,44,000 మంది విషయానికొస్తే, వారిని నీతిమంతులుగా ప్రకటించడమనేది పరలోక రాజ్యంలో యేసుతో పాలించే నిరీక్షణను వాళ్లు కల్గివుండేందుకు మార్గాన్ని తెరుస్తోంది. (రోమీయులు 8:16, 17; గలతీయులు 2:16) వేరే గొఱ్ఱెల విషయానికొస్తే, దేవుని స్నేహితులుగా వారిని నీతిమంతులని ప్రకటించడమనేది గొప్ప సమూహంలోని భాగంగా అర్మగిద్దోనును తప్పించుకోవడం ద్వారానైనా లేక ‘నీతిమంతుల పునరుత్థానం’ ద్వారానైనా సరే భూ పరదైసులో నిత్యజీవ నిరీక్షణను హత్తుకొనేందుకు వారిని అనుమతిస్తోంది. (అపొస్తలుల కార్యములు 24:15) అలాంటి నిరీక్షణను కల్గివుండడమూ, విశ్వాధిపతి స్నేహితునిగా ఉండడమూ, ఆయన “గుడారములో అతిథిగా” ఉండడమూ ఎంతటి ఆధిక్యతో కదా! (కీర్తన 15:1, 2) అవును, అబ్రాహాము సంతానమైన యేసు ద్వారా అభిషిక్తులూ, వేరే గొఱ్ఱెలూ అద్భుతమైన విధంగా ఆశీర్వదించబడ్డారు.
గొప్ప ప్రాయశ్చిత్త దినం
8. ధర్మశాస్త్ర నిబంధన క్రింద అర్పించబడిన ప్రాయశ్చిత్తదిన బలులు దేనికి ముంగుర్తుగా ఉన్నాయి?
8 క్రొత్త నిబంధనను గూర్చి చర్చిస్తున్నప్పుడు, ధర్మశాస్త్ర నిబంధన క్రిందవున్న వార్షిక ప్రాయశ్చిత్త దినాన్ని గూర్చి పౌలు తన పాఠకులకు జ్ఞాపకం చేశాడు. ఆ దినాన, యాజకవర్గమైన లేవీ గోత్రం కొరకొకటీ, యాజకవర్గంకాని 12 గోత్రాల కొరకు మరొకటీ వేర్వేరుగా బలులు అర్పించబడేవి. ఇవి పరలోక నిరీక్షణతోవున్న 1,44,000 మందీ, భూ నిరీక్షణగల లక్షలాదిమందీ ప్రయోజనాన్ని పొందబోయే యేసు అర్పించిన గొప్ప బలికి ముంగుర్తుగా ఉన్నాయని ఎంతో కాలం క్రిందటే వివరించబడింది.a ప్రాయశ్చిత్త దిన నెరవేర్పులో, యేసు అర్పించిన బలి ప్రయోజనాలు క్రొత్త నిబంధన క్రింద గొప్ప ప్రాయశ్చిత్త దినం ద్వారా నిర్వహించబడతాయి అని పౌలు చూపించాడు. ఈ గొప్ప దినానికి ప్రధాన యాజకునిగా, యేసు మానవులకు “నిత్యమైన విమోచన”ను సంపాదించడంలో తన పరిపూర్ణ ప్రాణాన్ని ప్రాయశ్చిత్త బలిగా అర్పించాడు.—హెబ్రీయులు 9:11-24.
9. క్రొత్త నిబంధనలో ఉన్నవారిగా, అభిషిక్తులైన హెబ్రీ క్రైస్తవులు దేన్ని హత్తుకోగలిగారు?
9 మొదటి శతాబ్దంలోని అనేకమంది హెబ్రీ క్రైస్తవులు అప్పటికీ “[మోషే] ధర్మశాస్త్రమందు ఆసక్తి” కల్గివుండేవారు. (అపొస్తలుల కార్యములు 21:20) అయితే, సముచితంగానే పౌలు వారికిలా జ్ఞాపకం చేశాడు: “మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన [యేసు] మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.” (హెబ్రీయులు 9:15) హెబ్రీ క్రైస్తవుల పాపాల్ని బహిర్గతం చేసిన పాత నిబంధననుండి వాళ్లను క్రొత్త నిబంధన విడుదల చేసింది. క్రొత్త నిబంధన మూలంగా, “నిత్యమైన [పరలోక] స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును” వారు హత్తుకొనగలిగారు.
10. అభిషిక్తులూ, వేరే గొఱ్ఱెలూ దేనినిబట్టి దేవునికి కృతజ్ఞులై ఉంటారు?
10 ‘కుమారునియందు విశ్వాసముంచు ప్రతివాడూ’ విమోచనక్రయధన బలి నుండి ప్రయోజనాన్ని పొందుతాడు. (యోహాను 3:16, 36) పౌలు ఇలా అన్నాడు: “క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును.” (హెబ్రీయులు 9:28) నేడు, యేసు కొరకు ఆసక్తితో కనిపెడుతున్న వారిలో దేవుని ఇశ్రాయేలులోని మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులూ, అలాగే గొప్ప సమూహంగా రూపొంది, నిత్యమైన స్వాస్థ్యమును కూడా కల్గివున్న లక్షలాదిమందీ ఉన్నారు. క్రొత్త నిబంధనను బట్టీ, అది తీసుకొచ్చే జీవదాయక ఆశీర్వాదాల్నిబట్టీ ఈ రెండు తరగతులకు చెందిన వారూ దేవునికి కృతజ్ఞులై ఉంటారు. ఆ ఆశీర్వాదాల్లో మహా ప్రాయశ్చిత్త దినమూ, పరలోక అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడైన యేసు పరిచర్యా చేరివున్నాయి.
పవిత్ర సేవలో బిజీగా ఉండడం
11. యేసు అర్పించిన బలి ద్వారా పరిశుభ్రపర్చబడిన మనస్సాక్షులతో, అభిషిక్తులూ, వేరే గొఱ్ఱెలూ సంతోషంగా ఏమి చేస్తారు?
11 పాత నిబంధన క్రింద అర్పించబడిన పాపపరిహారార్థ బలులతో పోల్చినప్పుడు క్రొత్త నిబంధన ఏర్పాటులో యేసు అర్పించిన బలికున్న ఉన్నతమైన విలువను హెబ్రీయులకు రాసిన తన పత్రికలో పౌలు నొక్కి చెప్పాడు. (హెబ్రీయులు 9:13-15) యేసు అర్పించిన శ్రేష్ఠమైన బలి “నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు [మన] మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధి” చేయగల్గుతుంది. హెబ్రీ క్రైస్తవుల విషయానికొస్తే, ‘నిర్జీవక్రియల్లో’ “మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము[లు]” కూడా చేరివున్నాయి. నేటి క్రైస్తవుల విషయానికొస్తే, ఆ ‘నిర్జీవ క్రియల్లో’ నిజమైన పశ్చాత్తాపాన్ని చూపగా దేవుడు క్షమించిన గత పాపాలు కూడా చేరివున్నాయి. (1 కొరింథీయులు 6:9-11) పరిశుభ్రపర్చబడిన మనస్సాక్షులతో, అభిషిక్త క్రైస్తవులు ‘జీవంగల దేవునికి పవిత్ర సేవ’ చేస్తారు. మరి గొప్ప సమూహమూ అలాగే చేస్తుంది. “గొఱ్ఱెపిల్ల రక్తము” ద్వారా తమ మనస్సాక్షులను పరిశుభ్రం చేసుకున్నవారై, వారు “రాత్రింబగళ్లు . . . [దేవుని] సేవి[స్తూ]” ఆయన గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో ఉన్నారు.—ప్రకటన 7:14, 15.
12. మనకు “విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత” ఉందని మనమెలా చూపిస్తాం?
12 అంతేగాక, పౌలు ఇలా అన్నాడు: “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.” (హెబ్రీయులు 10:22) మనకు “విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత” ఉందని మనమెలా చూపించగలం? పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన [పరలోక] నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:23-25) మన విశ్వాసం సజీవంగా ఉంటే మనం కూడా ‘సమాజంగా కూడడాన్ని’ మానుకోం. ప్రేమ చూపడానికీ సత్కార్యాలు చేయడానికీ మన నిరీక్షణ అటు పరలోక సంబంధమైనదైనా లేక ఇటు భూసంబంధమైనదైనా సరే దాన్ని బహిరంగంగా ప్రకటించే ప్రాముఖ్యమైన పని కొరకు బలపర్చబడేందుకూ మన సహోదరుల్ని ప్రోత్సహించడానికీ అలాగే వారిచే ప్రోత్సహించబడడానికీ మనం సంతోషిస్తాం.—యోహాను 13:35.
“నిత్యమైన నిబంధన”
13, 14. ఏయే రీతుల్లో క్రొత్త నిబంధన నిత్యమైన నిబంధనయైవుంది?
13 నూట నలుబది నాలుగువేల మందిలో చివరివారు తమ పరలోక సంబంధమైన నిరీక్షణ పొందినప్పుడు ఏమి జరుగుతుంది? క్రొత్త నిబంధన అన్వయింపు ఆగిపోతుందా? అప్పుడు, దేవుని ఇశ్రాయేలులో శేషించబడిన సభ్యులెవరూ భూమిపై ఉండరు. ఆ నిబంధనలో భాగంవహించే వారందరూ యేసుతోపాటూ “[ఆయన] తండ్రి రాజ్యములో” ఉంటారు. (మత్తయి 26:29) అయితే, హెబ్రీయులకు రాసిన తన పత్రికలో పౌలు చెప్పిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం: “గొఱ్ఱెల గొప్ప కాపరి[ని] . . . నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి . . . సమాధానకర్తయగు దేవుడు [లేపాడు.]” (హెబ్రీయులు 13:20; యెషయా 55:3) క్రొత్త నిబంధన ఏ భావంలో నిత్యమైన నిబంధన?
14 మొదటిగా, ధర్మ శాస్త్ర నిబంధనవలే ఇది ఎన్నటికీ మార్చబడదు. రెండవదిగా, యేసు రాజ్యాధిపత్యం ఎలా శాశ్వతమైనదో దాని నిర్వహణా ఫలితాలు కూడా అలానే శాశ్వతమైనవి. (1 కొరింథీయులు 15:27, 28తో లూకా 1:33 పోల్చండి.) యెహోవా సంకల్పాల్లో పరలోక రాజ్యం ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్గివుంది. (ప్రకటన 22:5) మూడవదిగా, క్రొత్త నిబంధన ఏర్పాటు నుండి వేరే గొఱ్ఱెలు ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటారు. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో విశ్వాసులైన మానవులు ఇప్పుడు చేస్తున్నట్లుగానే “రాత్రింబగళ్లు [యెహోవా] ఆలయములో ఆయనను సేవించ”డంలో కొనసాగుతూ ఉంటారు. యేసు ‘నిబంధన రక్తం’ ఆధారంగా క్షమించబడిన వారి గత పాపాల్ని యెహోవా మరలా వాటిని త్రవ్వి బయటికి తీయడు. యెహోవా స్నేహితులుగా నీతియుక్తమైన స్థానాన్ని అనుభవించడంలో వాళ్లు కొనసాగుతారు, మరి ఆయన ధర్మవిధి వారి హృదయాల్లో ఇంకా రాయబడే ఉంటుంది.
15. క్రొత్త లోకంలో తన భూసంబంధమైన ఆరాధకులతో యెహోవా సంబంధాన్ని వర్ణించండి.
15 అయితే ‘నేను వారి దేవుడనై ఉన్నాను వారు నా ప్రజలై ఉన్నారు’ అని ఈ మానవ సేవకులతో యెహోవా చెప్పగల్గుతాడా? అవును, చెప్పగల్గుతాడు. “ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు. దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.” (ప్రకటన 21:3) వాళ్లు, యేసుక్రీస్తు పరలోకపు పెండ్లికుమార్తె అయిన ‘ప్రియమైన పట్టణం’ యొక్క భూసంబంధ ప్రతినిధులగు “పరిశుద్ధుల శిబిరము”గా తయారౌతారు. (ప్రకటన 14:1; 20:9; 21:2) యేసు చిందించిన ‘నిబంధన రక్తంలో’ వారికున్న విశ్వాసాన్నిబట్టీ, భూమిపై ఉన్నప్పుడు దేవుని ఇశ్రాయేలుగా ఉన్న పరలోకపు రాజుల ఎడలా, యాజకుల ఎడలా వారు చూపించిన విధేయతనుబట్టీ ఇదంతా సాధ్యమౌతుంది.—ప్రకటన 5:10.
16. (ఎ) భూమిపై జీవించడానికి పునరుత్థానం చేయబడిన వారి కొరకు ఏవి వేచివున్నాయి? (బి) వెయ్యేళ్ల ముగింపులో ఏ ఆశీర్వాదాలు రానైవున్నాయి?
16 భూమిపై పునరుత్థానం చేయబడిన మృతుల విషయమేమిటి? (యోహాను 5:28, 29) అబ్రాహాము సంతానమైన యేసు ద్వారా “ఆశీర్వదించబడ”డానికి వాళ్లు కూడా ఆహ్వానించబడతారు. (ఆదికాండము 22:18) వాళ్లు కూడా యెహోవా నామాన్ని ప్రేమించి, ఆయనకు పరిచర్య చేస్తూ, అంగీకృతమైన బలుల్ని అర్పిస్తూ, ఆయన ప్రార్థనా మందిరంలో పవిత్ర సేవను చేస్తూ ఉండాల్సివుంది. అలా చేసేవారు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. (యెషయా 56:6, 7) వెయ్యేళ్లు ముగిసేనాటికి, యేసుక్రీస్తు పరిచర్య ద్వారా మరి ఆయన 1,44,000 మంది సహ యాజకుల పరిచర్య ద్వారా విశ్వాసులైన వారంతా మానవ పరిపూర్ణతకు తీసుకు రాబడతారు. వాళ్లు దేవుని స్నేహితులుగా నీతిమంతులని కేవలం ప్రకటించబడడమేగాక వాళ్లు నీతిమంతులై ఉంటారు. వాళ్లు ఆదాము నుండి వారసత్వంగా పొందిన పాప మరణాలనుండి పూర్తిగా స్వతంత్రించబడినవారై ‘బ్రతుకుతారు.’ (ప్రకటన 20:5; 22:2) అదెంతటి ఆశీర్వాదమో కదా! మనకున్న నేటి అవగాహన దృష్ట్యా చూస్తే, యేసుక్రీస్తు యొక్క, 1,44,000 మంది యొక్క యాజకత్వపు పని అప్పుడు పూర్తవుతున్నట్టు కన్పిస్తోంది. గొప్ప ప్రాయశ్చిత్త దిన ఆశీర్వాదాలు పూర్తిగా అన్వయించబడతాయి. అంతేగాక, యేసు “తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్ప[గిస్తాడు.]” (1 కొరింథీయులు 15:24) మానవజాతికి చివరి పరీక్షొకటి ఉంటుంది, అటు తర్వాత సాతానూ అతని దయ్యాలూ ఎన్నటికీ లేకుండా నాశనం చేయబడతారు.—ప్రకటన 20:7, 10.
17. మన కొరకు వేచివున్న ఆనందం దృష్ట్యా, మనలో ప్రతి ఒక్కరమూ ఏమి చేయాలని నిశ్చయించుకోవాలి?
17 అటు తర్వాత ఆరంభమవ్వబోయే ఉత్తేజపరచే శకంలో ‘నిత్య నిబంధనకు’ అసలు ఏదైనా పాత్రంటూ ఉంటే అది ఏ పాత్ర పోషిస్తుంది? దాన్ని గురించి చెప్పడం మనవంతు కాదు. ఇంతవరకూ యెహోవా బయల్పర్చింది ప్రస్తుతానికి సరిపోతుంది. అది మనల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతోంది. ‘క్రొత్త ఆకాశములలో, క్రొత్త భూమిలో’ భాగంగా నిత్యజీవాన్ని గూర్చి తలంచండి! (2 పేతురు 3:13) ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేందుకైన మన అభిలాషను ఏదీ బలహీనపర్చకూడదు. స్థిరంగా నిలబడడం అంత సులభంకాకపోవొచ్చు. పౌలు ఇలా అన్నాడు: “మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.” (హెబ్రీయులు 10:36) అయినా, జ్ఞాపకముంచుకోండి, అధిగమించవలసిన ఏ సమస్యనైనా, జయించవలసిన ఏ వ్యతిరేకతనైనా మన కొరకు వేచివున్న ఆనందంతో పోలిస్తే అవి వెలవెలపోతాయి. (2 కొరింథీయులు 4:17) కాబట్టి, మనలో ఎవ్వరమూ “వెనక్కు తీసి, నాశనం అయ్యేవారం కాము.” బదులుగా, “నమ్మకం కలిగి ఆత్మ [“ప్రాణ,” NW] రక్షణపొందేవారమే”నని రుజువుచేసుకుందాం. (హీబ్రూవారికి లేఖ 10:39, పవిత్ర గ్రంథం వ్యాఖ్యానసహితం) మనలో ప్రతి ఒక్కరి నిత్య ఆశీర్వాదం కొరకు మనమంతా నిబంధనల దేవుడైన యెహోవాయందు పూర్ణ నమ్మకాన్ని ఉంచుదాం.
[అధస్సూచి]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన క్రొత్త భూమిలోనికి తప్పించుకొని వెళ్లడం (ఆంగ్లం), అధ్యాయం 13, చూడండి.
మీరు అర్థంచేసుకున్నారా?
◻ అబ్రాహాము సంతానం ద్వారా అభిషిక్త క్రైస్తవులేగాక ఎవరు కూడా ఆశీర్వదించబడుతున్నారు?
◻ క్రొత్త నిబంధన ద్వారా ఆశీర్వదించబడిన వారిగా వేరే గొఱ్ఱెలు, పాత నిబంధన క్రింద మతమార్పిడి చేసుకున్నవారిని ఎలా పోలివున్నారు?
◻ గొప్ప ప్రాయశ్చిత్తార్థ దినం ద్వారా వేరే గొఱ్ఱెలు ఎలా ఆశీర్వదించబడ్డారు?
◻ క్రొత్త నిబంధనను ‘నిత్యమైన నిబంధన’ అని పౌలు ఎందుకు పిలిచాడు?
[21వ పేజీలోని బాక్సు]
ఆలయంలో పవిత్రసేవ
యెహోవా దేవుని గొప్ప ఆధ్యాత్మిక ఆలయ భూసంబంధమైన ఆవరణంలో గొప్పసమూహము అభిషిక్త క్రైస్తవులతోపాటూ ఆరాధిస్తోంది. (ప్రకటన 7:14, 15; 11:2) అన్యుల కొరకు ప్రత్యేకించబడిన ఆవరణలో వాళ్లున్నారనే నిర్ధారణకు రావడానికి ఏ విధమైన కారణమూ లేదు. యేసు భూమిపై ఉన్నప్పుడు, ఆలయంలో అన్యుల ఆవరణ ఉండేది. అయినప్పటికీ, సొలొమోను, యెహెజ్కేలుల దైవప్రేరేపిత ప్రణాళికల్లో అన్యుల ఆవరణ కొరకు ఎటువంటి ఏర్పాటూ లేదు. సొలొమోను ఆలయంలో, ఇశ్రాయేలీయులూ మతమార్పిడి చేసుకున్న ప్రజలూ, పురుషులూ, స్త్రీలూ కలిసి ఆరాధించే వెలుపలి ఆవరణ ఉండేది. ఇది, గొప్ప సమూహం పవిత్ర సేవ చెల్లిస్తున్నట్లు యోహాను చూసిన ఆధ్యాత్మిక ఆలయపు భూసంబంధ ఆవరణకు ప్రవచనాత్మక నమూనాయైవుంది.
అయితే, యాజకులూ లేవీయులూ మాత్రమే గొప్ప బలిపీఠమున్న లోపలి ఆవరణలోనికి ప్రవేశించగలరు; యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలరు; ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలడు. భూమిపైనున్న అభిషిక్త క్రైస్తవుల అసమానమైన ఆధ్యాత్మిక పరిస్థితికి ఛాయారూపంగా లోపలి ఆవరణా, పరిశుద్ధ స్థలమూ ఉన్నాయని అర్థమౌతుంది. మరి అతి పరిశుద్ధ స్థలం అభిషిక్త క్రైస్తవులు తమ పరలోకపు ప్రధాన యాజకునితోపాటుగా అమర్త్యమైన జీవాన్ని పొందే పరలోకానికి చిత్రీకరణగా వుంది.—హెబ్రీయులు 10:19, 20.
[23వ పేజీలోని చిత్రం]
మన కొరకు వేచివున్న ఆనందం దృష్ట్యా, మనం ‘నమ్మకం కలిగి ఆత్మ [“ప్రాణ,” NW] రక్షణపొందుదాం’