క్రొత్త నిబంధన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు
“ఈయనయైతే [యేసైతే] . . . మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు.”—హెబ్రీయులు 8:6.
1. ఏదెనులో వాగ్దానం చేయబడిన ‘స్త్రీ సంతానంగా’ ఎవరు రుజువయ్యారు, మరి అతని ‘మడిమె మీద’ ఎలా కొట్టబడింది?
ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత, హవ్వను మోసగించిన సాతానుపై యెహోవా తీర్పును ఇలా ప్రకటించాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదు[వు.]” (ఆదికాండము 3:15) సా.శ. 29లో యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఏదెనులో వాగ్దానం చేయబడిన సంతానం చివరకు ప్రత్యక్షమైంది. సా.శ. 33లో హింసాకొయ్యపై ఆయన మరణించినప్పుడు, ఆ ప్రాచీన ప్రవచనంలోని ఓ భాగం నెరవేరింది. సాతాను, సంతానం యొక్క ‘మడిమె మీద కొట్టాడు.’
2. యేసు చెప్పిన మాటల ప్రకారంగా, ఆయన మరణం మానవాళికి ఎలా ప్రయోజనకరమవుతుంది?
2 ఆ గాయం ఎంతో వేదనకరమైన బాధను కల్గించినప్పటికీ, సంతోషకరమైన విషయమేంటంటే అది శాశ్వతమైనది కాదు. అమర్త్యమైన ఒక ఆత్మగా యేసు మృతులలోనుండి లేపబడి, పరలోకంలో ఉన్న తన తండ్రి దగ్గరకు ఆరోహణమయ్యాడు. “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా” చిందించబడిన తన రక్తం యొక్క విలువను ఆయన అక్కడ అర్పించాడు. ఆ విధంగా, ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి: “విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (మత్తయి 20:28; యోహాను 3:14-16; హెబ్రీయులు 9:12-14) యేసును గూర్చిన ప్రవచన నెరవేర్పులో క్రొత్త నిబంధన ఓ కీలక పాత్రను పోషిస్తోంది.
క్రొత్త నిబంధన
3. క్రొత్త నిబంధన మొట్టమొదటిగా ఎప్పుడు అమలులోనికి వచ్చినట్టు కనబడింది?
3 యేసు తాను మరణించడానికి కొంత ముందు, తాను చిందించే రక్తం “[క్రొత్త] నిబంధన రక్తము” అని తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 26:28; లూకా 22:20) ఆయన పరలోకానికి ఆరోహణమైన పదిరోజుల తర్వాత, యెరూషలేములో మేడగదిలో సమకూడిన ఇంచుమించు 120 మంది శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఈ క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చినట్టు కనబడింది. (అపొస్తలుల కార్యములు 1:15; 2:1-4) ఈ 120 మంది శిష్యుల్ని క్రొత్త నిబంధనలోకి తీసుకోవడం “మొదటి” నిబంధనయైన ధర్మశాస్త్ర నిబంధన ఇక వ్యవహారంలో ఉండదని చూపించింది.—హెబ్రీయులు 8:13.
4. పాత నిబంధన విఫలమయ్యిందా? వివరించండి.
4 పాత నిబంధన విఫలమయ్యిందా? విఫలం కాలేదు. నిజమే, పాత నిబంధన స్థానంలో ఇప్పుడు మరొకటి వచ్చింది గనుక శరీర సంబంధ ఇశ్రాయేలు ఇక దేవుని ప్రత్యేక ప్రజ కాదు. (మత్తయి 23:38) కానీ, అది ఇశ్రాయేలీయులు చూపించిన అవిధేయతనుబట్టీ, వాళ్లు యెహోవా అభిషిక్తుడ్ని నిరాకరించడాన్నిబట్టీ అలా జరిగింది. (నిర్గమకాండము 19:5; అపొస్తలుల కార్యములు 2:22, 23) అయితే, ధర్మశాస్త్ర నిబంధన తీసివేయబడక ముందు, అది ఎంతో నెరవేర్చింది. శతాబ్దాలుగా అది దేవుడ్ని సమీపించడానికొక మార్గాన్నీ, అబద్ధమతాన్నుండి కాపుదలనూ అనుగ్రహించింది. అది క్రొత్త నిబంధన ముంగుర్తుల్ని కల్గివుంది. దాని క్రింద ఎడతెగకుండా అర్పించబడిన బలులు, మానవులు పాప మరణాలనుండి విముక్తి పొందాల్సిన ఆవశ్యకతను చూపించాయి. నిజానికి, ధర్మశాస్త్రం ‘క్రీస్తు నొద్దకు నడిపించడంలో బాలశిక్షకుడయ్యింది.’ (గలతీయులు 3:19, 24; రోమీయులు 3:20; 4:15; 5:12; హెబ్రీయులు 10:1, 2) అయినప్పటికీ, అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదం క్రొత్త నిబంధన ద్వారానే పూర్తి స్థాయిలో నెరవేరుతుంది.
అబ్రాహాము సంతానం ద్వారా జనాంగాలు ఆశీర్వదించబడ్డాయి
5, 6. అబ్రాహాము నిబంధన యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక నెరవేర్పులో అబ్రాహాము సంతానం ఎవరు, మరి ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని పొందిన మొట్టమొదటి జనాంగం ఏది?
5 యెహోవా అబ్రాహాముతో ఇలా వాగ్దానం చేశాడు: “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:18) పాత నిబంధన క్రింద, దీనహృదయులైన అనేకమంది విదేశీయులు అబ్రాహాము జాతీయ సంతానమైన ఇశ్రాయేలుతో సహవసించడం ద్వారా ఆశీర్వదించబడ్డారు. అయితే, దాని ప్రాథమిక ఆధ్యాత్మిక నెరవేర్పులో, అబ్రాహాము సంతానం పరిపూర్ణుడైన ఒక మానవుడై ఉన్నాడు. “అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు—సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే—నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు” అని పౌలు చెప్పినప్పుడు ఆయన ఆ విషయాన్ని వివరించాడు.—గలతీయులు 3:16.
6 అవును, అబ్రాహాము సంతానం యేసే. శరీర సంబంధ ఇశ్రాయేలుకు సాధ్యమైన దేనికన్నా మరింత మిన్నయైన ఓ ఆశీర్వాదాన్ని జనాంగాలు ఆయన ద్వారా పొందుతాయి. నిజానికి, ఈ ఆశీర్వాదాన్ని పొందిన మొట్టమొదటి జనాంగం ఇశ్రాయేలే. సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, అపొస్తలుడైన పేతురు యూదుల గుంపుతో ఇలా అన్నాడు: “ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో—నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపె[ను.]”—అపొస్తలుల కార్యములు 3:25, 26.
7. అబ్రాహాము సంతానమైన యేసు ద్వారా ఏ జనాంగాలు ఆశీర్వదించబడ్డాయి?
7 త్వరలోనే, ఆ ఆశీర్వాదం సమరయులకూ, అటు తర్వాత అన్యజనాంగాలకూ విస్తరించింది. (అపొస్తలుల కార్యములు 8:14-17; 10:34-48) సా.శ. 50 నుండి 52 సంవత్సరాల మధ్యకాలంలో, ఆసియా మైనర్‌లోని గలతీయలోని క్రైస్తవులకు పౌలు ఇలా రాశాడు: “దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగాచూచి—నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.” (గలతీయులు 3:8, 9; ఆదికాండము 12:3) గలతీయలోని అనేకమంది క్రైస్తవులు ‘అన్యజనులైనప్పటికీ,’ వాళ్లు తమ విశ్వాసాన్నిబట్టి యేసు ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఏ విధంగా?
8. పౌలు కాలంలోని క్రైస్తవుల విషయానికొస్తే, అబ్రాహాము సంతానం ద్వారా వచ్చే ఆశీర్వాదంలో ఏమి చేరివుంది, చివరకు ఎంతమంది అలాంటి ఆశీర్వాదాన్ని పొందుతారు?
8 వారి నేపథ్యం ఏదైనప్పటికీ గలతీయలోని క్రైస్తవులకు పౌలు ఇలా చెప్పాడు: “మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దానప్రకారము వారసులైయున్నారు.” (గలతీయులు 3:29) ఆ గలతీయుల విషయానికొస్తే, అబ్రాహాము సంతానం ద్వారా వచ్చే ఆశీర్వాదంలో వాళ్లు క్రొత్త నిబంధనలో పాలివారిగా ఉండడమూ, అలాగే అబ్రాహాము సంతానమందు యేసుతో సహవసిస్తూ యేసు సహవారసులుగా ఉండడమూ చేరివున్నాయి. ప్రాచీన ఇశ్రాయేలు జనాభా వివరణ మనకు తెలియదు. ఇశ్రాయేలు “సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమైం[దని]” మాత్రమే మనకు తెలుసు. (1 రాజులు 4:20) అయితే, ఆధ్యాత్మిక సంతానంలో యేసు సహవాసుల తుది సంఖ్య 1,44,000 అని మనకు తెలుసు. (ప్రకటన 7:4; 14:1) మానవజాతిలోని “ప్రతి వంశములోనుం[డీ], ఆ యా భాషలు మాటలాడువారిలోనుం[డీ], ప్రతి ప్రజలోనుం[డీ], ప్రతి జనములోనుం[డీ]” ఆ 1,44,000 మంది బయటకు వస్తారు, మరి వాళ్లు అబ్రాహాము నిబంధన ఆశీర్వాదాల్ని ఇంకా పొందని ఇతరులు వాటిని పొందేలా చేయడంలో భాగం వహిస్తారు.—ప్రకటన 5:9.
ప్రవచనం నెరవేరింది
9. క్రొత్త నిబంధనలో ఉన్నవారు యెహోవా న్యాయవిధిని తమలోనే ఎలా కల్గివుంటారు?
9 క్రొత్త నిబంధనను ప్రవచిస్తున్నప్పుడు, యిర్మీయా ఇలా రాశాడు: “ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.” (యిర్మీయా 31:33) ప్రేమనుబట్టి యెహోవా సేవచేయడమనేది క్రొత్త నిబంధనలో ఉన్నవారి ముఖ్య లక్షణమైవుంది. (యోహాను 13:35; హెబ్రీయులు 1:9) యెహోవా ధర్మవిధి వారి హృదయాల్లో రాయబడింది, మరి వారు ఆయన చిత్తాన్ని చేయాలని ఎంతగానో అభిలషిస్తారు. నిజమే, ప్రాచీన ఇశ్రాయేలులో విశ్వాసులైన కొంతమంది వ్యక్తులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎంతగానో ప్రేమించారు. (కీర్తన 119:97) కానీ, అనేకమంది అలా ప్రేమించకపోయినా జనాంగంలో ఓ భాగంగానే ఉండేవారు. దేవుని ధర్మవిధి గనుక హృదయంలో రాయబడి ఉండకపోతే క్రొత్తనిబంధనలో ఎవ్వరూ నిలిచివుండలేరు.
10, 11. క్రొత్త నిబంధనలో ఉన్నవారి విషయానికొస్తే, ఏ విధంగా యెహోవా ‘వారి దేవుడై’ ఉంటాడు, వాళ్లంతా ఆయన్ని ఎలా ఎరుగుదురు?
10 క్రొత్త నిబంధనలో ఉన్న వారిని గురించి యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “నేను వారికి దేవుడనై యుందును. వారు నాకు జనులగుదురు.” (యిర్మీయా 31:34) ప్రాచీన ఇశ్రాయేలులో, అనేకులు అన్యజనుల దేవతలను ఆరాధించినా, వారు ఇశ్రాయేలీయులుగానే ఉన్నారు. క్రొత్త నిబంధన ఆధారంగా, శరీర సంబంధ ఇశ్రాయేలును తొలగించడానికి “దేవుని ఇశ్రాయేలు” అనే ఆధ్యాత్మిక జనాంగాన్ని యెహోవా సృష్టించాడు. (గలతీయులు 6:16; మత్తయి 21:43; రోమీయులు 9:6-8) అయితే, యెహోవాను ఆరాధించడాన్ని, ఆయన్ని మాత్రమే ఆరాధించడాన్ని విడిచిపెడితే, ఏ ఒక్కరూ ఆధ్యాత్మిక క్రొత్త జనాంగంలో ఓ భాగంగా ఉండలేరు.
11 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు.” (యిర్మీయా 31:34) “యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని” చెబుతూ ఇశ్రాయేలులో అనేకమంది యెహోవాను ఊరకనే అలక్ష్యం చేసేవారు. (జెఫన్యా 1:12) యెహోవాను అలక్ష్యంచేసినా లేక పవిత్రారాధనను కలుషితం చేసినా దేవుని ఇశ్రాయేలులో ఎవ్వరూ పాలివారిగా ఉండలేరు. (మత్తయి 6:24; కొలొస్సయులు 3:5) ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు “తమ దేవుని నెరుగు” ప్రజలై ఉన్నారు. (దానియేలు 11:32) ‘అద్వితీయ సత్యదేవుడ్ని గూర్చిన, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని గైకొనడంలో’ వాళ్లు సంతోషిస్తారు. (యోహాను 17:3, NW) అసమానమైన రీతిలో, యేసు మాత్రమే ‘దేవుడ్ని బయలు పరిచాడు’ గనుక యేసును గూర్చి తెలుసుకోవడం దేవుని గూర్చిన వారి జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.—యోహాను 1:18; 14:9-11.
12, 13. (ఎ) క్రొత్త నిబంధనలో ఉన్నవారి పాపాల్ని యెహోవా దేని ఆధారంగా క్షమిస్తాడు? (బి) పాపాల్ని క్షమించే విషయంలో, క్రొత్త నిబంధన పాత నిబంధనకన్నా ఏవిధంగా ఉన్నతమైనది?
12 చివరగా, యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.” (యిర్మీయా 31:34) మోషే ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులు విధేయత చూపించాల్సిన వందలాది రాతపూర్వక కట్టడలు చేరివున్నాయి. (ద్వితీయోపదేశకాండము 28:1, 2, 15) ధర్మశాస్త్రాన్ని మీరిన వాళ్లంతా తమ పాపాలను పరిహరించుకొనేందుకు బలులను అర్పించేవారు. (లేవీయకాండము 4:1-7; 16:1-31) ధర్మశాస్త్ర సంబంధమైన తమ క్రియలద్వారా తాము నీతిమంతులంకాగలమని అనేకమంది యూదులు విశ్వసించడం మొదలుపెట్టారు. అయితే, క్రైస్తవులు తాము తమ సొంత క్రియలద్వారా నీతిని ఎన్నటికీ సంపాదించలేరని గ్రహిస్తారు. వాళ్లు పాపాన్ని విడనాడలేరు. (రోమీయులు 5:12) క్రొత్త నిబంధన క్రింద, యేసు బల్యర్పణ ఆధారంగా మాత్రమే దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానాన్ని కల్గివుండడం సాధ్యమవుతుంది. అయితే, అలాంటి స్థానం ఓ బహుమానం, దేవుని నుండి వచ్చిన ఉచిత కృపావరం. (రోమీయులు 3:20, 23, 24) యెహోవా తన సేవకుల నుండి ఇప్పటికీ విధేయతను కోరుతున్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్న వారు “క్రీస్తు విషయమై[న] ధర్మశాస్త్రము” క్రింద ఉన్నారని పౌలు చెబుతున్నాడు.—1 కొరింథీయులు 9:21.
13 అందుకే, క్రైస్తవులకు కూడా పాపము నిమిత్తమై ఒక బల్యర్పణ ఉంది, కానీ అది ధర్మశాస్త్ర నిబంధన క్రింద అర్పించబడిన బలులకన్నా ఎంతో విలువైనది. పౌలు ఇలా రాశాడు: “[ధర్మశాస్త్ర నిబంధన క్రిందనున్న] ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. [యేసైతే] పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, . . . దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.” (హెబ్రీయులు 10:11, 12) క్రొత్త నిబంధన క్రిందనున్న క్రైస్తవులు యేసు బల్యర్పణయందు విశ్వాసాన్ని ఉంచుతారు గనుక, యెహోవా వారిని నీతిమంతులనీ, పాపంలేని వారనీ, మరావిధంగా తన ఆధ్యాత్మిక కుమారులుగా అభిషేకించబడే స్థానంలో ఉన్నారనీ ప్రకటిస్తున్నాడు. (రోమీయులు 5:1; 8:33, 34; హెబ్రీయులు 10:14-18) మానవ అపరిపూర్ణతనుబట్టి వాళ్లు పాపం చేసినప్పుడు, వాళ్లు యెహోవా క్షమను అర్థించవచ్చు, మరి యేసు అర్పించిన బలి ఆధారంగా యెహోవా వారిని క్షమిస్తాడు. (1 యోహాను 2:1, 2) అయితే, పాపం చేయడాన్ని వాళ్లు ఇష్టపూర్వకంగా ఎంపికచేసుకుంటే, వాళ్లు తమ నీతియుక్తమైన స్థానాన్నీ, క్రొత్త నిబంధనలో పాలివారిగా ఉండే ఆధిక్యతనూ కోల్పోతారు.—హెబ్రీయులు 2:2, 3; 6:4-8; 10:26-31.
పాత నిబంధన, క్రొత్త నిబంధన
14. ధర్మశాస్త్ర నిబంధన క్రింద ఏ సున్నతి అవసరమైంది? క్రొత్త నిబంధన క్రింద ఏ సున్నతి అవసరం?
14 పాత నిబంధనలో పురుషులు, తాము ధర్మశాస్త్రం క్రింద ఉన్నామనడానికి సూచనగా సున్నతి చేయించుకునేవారు. (లేవీయకాండము 12:2, 3; గలతీయులు 5:3) క్రైస్తవ సంఘం ఆరంభమైన తర్వాత, యూదులుకాని క్రైస్తవులు కూడా సున్నతి చేయించుకోవాలని కొంతమంది భావించారు. కానీ యెరూషలేములో ఉన్న అపొస్తలులు, పెద్దలు దేవుని వాక్యంచే పరిశుద్ధాత్మచే నడిపించబడినవారై అది ఆవశ్యంకాదని గ్రహించారు. (అపొస్తలుల కార్యములు 15:1, 5, 28, 29) కొన్ని సంవత్సరాల తర్వాత, పౌలు ఇలా అన్నాడు: “బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు.” (రోమీయులు 2:28, 29) శరీర సంబంధ యూదుల విషయంలో కూడా యెహోవా దృష్టిలో అక్షరార్థ సున్నతికి ఇక ఏ విధమైన ఆధ్యాత్మిక విలువా లేదు. క్రొత్త నిబంధనలో ఉన్నవారికైతే, శరీర సున్నతిగాక హృదయ సున్నతి చెయ్యబడాలి. యెహోవా దృష్టికి అప్రీతికరమైన లేక అపవిత్రమైన ప్రతీ దానినీ తమ తలంపులలో నుండీ, కోరికల్లో నుండీ, దృక్పథంలో నుండీ తొలగించుకోవాలి.a ఈ విధంగా ఆలోచనా సరళులను మార్చే పరిశుద్ధాత్మ యొక్క శక్తికి నేడు అనేకులు సజీవ సాక్ష్యంగా ఉన్నారు.—1 కొరింథీయులు 6:9-11; గలతీయులు 5:22-24; ఎఫెసీయులు 4:22-24.
15. రాజ్యసంబంధ పరిపాలనాధిపత్యానికి సంబంధించి శరీరసంబంధ ఇశ్రాయేలూ దేవుని ఇశ్రాయేలూ ఎలా పోల్చబడ్డాయి?
15 ధర్మశాస్త్ర నిబంధన ఏర్పాటులో, యెహోవాయే ఇశ్రాయేలు రాజు, మరి కాలక్రమేణా యెరూషలేములోని మానవ రాజుల ద్వారా ఆయన తన సర్వాధిపత్యాన్ని నిర్వహించాడు. (యెషయా 33:22) ఆధ్యాత్మిక ఇశ్రాయేలైన దేవుని ఇశ్రాయేలు యొక్క రాజు కూడా యెహోవాయే. సా.శ. 33 నుండీ, “పరలోకమందును భూమిమీదను . . . సర్వాధికారము”ను పొందిన యేసుక్రీస్తు ద్వారా ఆయన పరిపాలిస్తున్నాడు. (మత్తయి 28:18; ఎఫెసీయులు 1:19-23; కొలొస్సయులు 1:13, 14) 1914లో స్థాపించబడిన దేవుని పరలోక రాజ్యానికి రాజుగా యేసును దేవుని ఇశ్రాయేలు నేడు గుర్తిస్తుంది. ప్రాచీన ఇశ్రాయేలు రాజులైన హిజ్కియా, యోషీయా, విశ్వాసులైన ఇతర రాజులకన్నా యేసు ఎంతో శ్రేష్ఠుడైన రాజు.—హెబ్రీయులు 1:8, 9; ప్రకటన 11:15.
16. దేవుని ఇశ్రాయేలు ఎలాంటి యాజకవర్గమైవుంది?
16 ఇశ్రాయేలు, ఒక రాజ్యం మాత్రమే కాదుగానీ అభిషేకించబడిన యాజక వర్గాన్ని కూడా కల్గివుంది. సా.శ. 33లో దేవుని ఇశ్రాయేలు శరీరసంబంధ ఇశ్రాయేలు స్థానంలోకి వచ్చి, యెహోవా ‘సేవకుని’గానూ, ఆయన ‘సాక్షులు’గానూ తయారైంది. (యెషయా 43:10) ఇశ్రాయేలును సంభోదిస్తూ యెషయా 43:21, నిర్గమకాండము 19:5, 6లలో రాయబడివున్న యెహోవా మాటలు, అప్పటినుండీ దేవుని ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు అన్వయించాయి. దేవుని క్రొత్త ఆధ్యాత్మిక జనాంగం ఇప్పుడు “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై” ‘యెహోవా గుణాతిశయాల్ని ప్రకటించ’ బాధ్యులై ఉన్నారు. (1 పేతురు 2:9) పురుషులూ, స్త్రీలూ, దేవుని ఇశ్రాయేలులో ఉన్న వారంతా సమిష్ఠిగా ఒక యాజకరూపమై ఉన్నారు. (గలతీయులు 3:28, 29) అబ్రాహాము సంతానంలోని ద్వితీయ భాగంగా, వాళ్లు ఇప్పుడు “జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి” అని చెబుతారు. (ద్వితీయోపదేశకాండము 32:43) ఆ ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో భూమిపై ఇప్పటికీ మిగిలివున్న వాళ్లు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]”గా రూపొందారు. (మత్తయి 24:45-47) వారి సహవాసమందు మాత్రమే దేవునికి పవిత్ర సేవ చెల్లించడం, అంగీకృతంకాగలదు.
దేవుని రాజ్యం—చివరి నెరవేర్పు
17. క్రొత్త నిబంధనలో ఉన్నవారు ఎలాంటి జననాన్ని చవిచూస్తారు?
17 సా.శ.పూ. 1513 తర్వాత జన్మించిన ఇశ్రాయేలీయులు జన్మతః ధర్మశాస్త్ర నిబంధనలోనికి వచ్చారు. క్రొత్త నిబంధనలోనికి యెహోవా తీసుకొనే వాళ్లు కూడా జన్మించాల్సివుంది అంటే వాళ్లు ఆధ్యాత్మిక జననాన్ని పొందాల్సివుంది. “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా[నని]” యేసు చెప్పినప్పుడు ఆయన ఈ విషయాన్ని నీకొదేమను పరిసయ్యునితో ప్రస్తావించాడు. (యోహాను 3:3) ఈ క్రొత్త జననాన్ని పొందిన మొదటి అపరిపూర్ణ మానవులు, సా.శ. 33 పెంతెకొస్తునాడు సమకూడిన 120 మంది శిష్యులే. క్రొత్త నిబంధన క్రింద నీతిమంతులని ప్రకటించబడి, వారు తమ రాజ్యసంబంధమైన స్వాస్థ్యానికి “సంచకరువుగా” పరిశుద్ధాత్మను పొందారు. (ఎఫెసీయులు 1:14) దేవుని దత్తపుత్రులుగా అయ్యేందుకు వాళ్లు ‘ఆత్మమూలముగా జన్మించారు,’ అది వారిని యేసు సహోదరుల్ని చేసింది. ఆ విధంగా, వాళ్లు ‘క్రీస్తుతోడి వారసులయ్యారు.’ (యోహాను 3:6; రోమీయులు 8:16, 17) వాళ్లు ‘క్రొత్తగా జన్మించడం’ అద్భుతమైన ఉత్తరాపేక్షలకు మార్గాన్ని తెరచింది.
18. మరలా జన్మించడం, క్రొత్త నిబంధనలో ఉన్నవారికి ఏ అద్భుతకరమైన ఉత్తరాపేక్షల్ని పొందేందుకు అవకాశాన్ని తెరుస్తుంది?
18 క్రొత్త నిబంధనకు మధ్యవర్తిత్వం నెరపుతున్నప్పుడు, “నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా . . . నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను” అని చెబుతూ యేసు తన అనుచరులతో అదనపు నిబంధననొకదాన్ని చేశాడు. (లూకా 22:29) దానియేలు 7:13, 14, 22, 27 వచనాల్లో రాయబడిన విశిష్టమైన దర్శన నెరవేర్పుకు ఈ రాజ్య నిబంధన మార్గాన్ని సిద్ధపరుస్తోంది. “మహావృద్ధుడగు” యెహోవా దేవుడు “మనుష్యకుమారుని పోలిన యొక[నికి]” రాజ్యాధికారాన్ని ఇవ్వడాన్ని దానియేలు చూశాడు. తర్వాత, “ఆ పరిశుద్ధులు రాజ్యము నేల[డాన్ని]” దానియేలు చూశాడు. యెహోవా దేవుని నుండి 1914లో పరలోక రాజ్యాన్ని పొందిన ‘మనష్యకుమారుని పోలినవాడు’ యేసే. ఆయనతోపాటూ ఆ రాజ్యంలో పాలివారిగా ఉండే “పరిశుద్ధులు” ఆయన ఆత్మాభిషిక్త శిష్యులే. (1 థెస్సలొనీకయులు 2:12) ఏ విధంగా?
19, 20. (ఎ) క్రొత్త నిబంధనలో ఉన్నవారికి, అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానం ఏ చివరి మహిమకరమైన నెరవేర్పును కల్గివుంటుంది? (బి) ఏ ఇతర ప్రశ్నలను పరిశీలించాల్సిన అవసరముంది?
19 అభిషిక్తులైన వీరు మరణించిన తర్వాత, పరలోకంలో రాజులుగానూ, యాజకులుగానూ యేసుతోపాటూ సేవ చేసేందుకు ఆయనవలే మరణం నుండి అమర్త్యమైన ఆత్మ ప్రాణులుగా తిరిగి లేపబడతారు. (1 కొరింథీయులు 15:50-53; ప్రకటన 20:4, 6) ఎంతటి మహిమాయుక్తమైన నిరీక్షణో కదా! కేవలం కనాను దేశంలోనేగాక “వారు భూలోకమందు ఏలుదు[రు.]” (ప్రకటన 5:9) వాళ్లు ‘తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొంటారా’? (ఆదికాండము 22:17) అవును, పునరుత్థానులైన ఈ అభిషిక్తులు శత్రువైన మతవేశ్య మహాబబులోను నాశనాన్ని చూసినప్పుడూ, “ఇనుపదండముతో” జనాంగాల్ని ఏలడంలోనూ సాతాను తలను చితుకకొట్టడంలోనూ వాళ్లు యేసుతోపాటూ భాగం వహించినప్పుడూ నిశ్చయమైన విధంగా వాళ్లు శత్రువుల గవిని స్వాధీనపర్చుకుంటారని చెప్పగలం. ఆ విధంగా, ఆదికాండము 3:15లో ఉన్న ప్రవచన తుది వివరణ నెరవేర్పులో వాళ్లు ఓ భాగాన్ని కల్గివుంటారు.—ప్రకటన 2:26, 27; 17:14; 18:20, 21; రోమీయులు 16:20.
20 అయినప్పటికీ, అబ్రాహాము నిబంధనలోనూ, క్రొత్త నిబంధనలోనూ నమ్మకస్థులైన ఈ 1,44,000 మంది వ్యక్తులు మాత్రమే చేరివున్నారా? అని మనమడగవచ్చు. దీని తర్వాత శీర్షికలో మనం చూడబోతున్నట్టుగా, ఈ నిబంధనలలో ప్రత్యక్షంగాలేని ఇతరులూ వారి ద్వారా ఆశీర్వదించబడతారు.
[అధస్సూచి]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, 470వ పేజీ చూడండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ క్రొత్త నిబంధన మొట్టమొదటిగా ఎప్పుడు అమలులోనికి వచ్చినట్టు కనబడింది?
◻ పాత నిబంధన ద్వారా ఏమి సాధించబడింది?
◻ అబ్రాహాము సంతానం ప్రధానంగా ఎవరైవున్నారు, మరి ఆ సంతానం ద్వారా జనాంగాలు ఏ క్రమంలో ఆశీర్వదించబడ్డాయి?
◻ 1,44,000 మందికైతే, అబ్రాహాము నిబంధన యొక్క, క్రొత్త నిబంధన యొక్క వాగ్దానాల చివరి నెరవేర్పు ఏమైవుంది?
[15వ పేజీలోని చిత్రం]
పాపాలకు క్షమాపణ పొందడమనేది పాత నిబంధనక్రింద ఉన్న వారికన్నా క్రొత్త నిబంధన క్రింద ఉన్నవారికి లోతైన భావాన్ని కల్గివుంది