కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 2/1 పేజీలు 8-13
  • యెహోవా నిబంధనల దేవుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నిబంధనల దేవుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అబ్రాహాముతో చేసిన నిబంధన
  • “పాత నిబంధన”
  • ధర్మశాస్త్ర నిబంధన ద్వారా ఆశీర్వాదాలు
  • ఇశ్రాయేలులో మతమార్పిడి చేసుకొన్న వ్యక్తులు
  • యెహోవా అబ్రాహాము సంతానాన్ని ఆశీర్వదిస్తాడు
  • క్రొత్త నిబంధన అవసరమైంది
  • క్రొత్త నిబంధన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నిబంధనలు వాటియందు దేవుని నిత్య సంకల్పము చేరియున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మీరు “యాజక రూపమైన రాజ్యముగా” ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • దేవుని నిబంధనలనుండి నీవు ప్రయోజనము పొందెదవా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 2/1 పేజీలు 8-13

యెహోవా నిబంధనల దేవుడు

“నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధనచే[యబోతున్నాను.]”—యిర్మీయా 31:31.

1, 2. (ఎ) సా.శ. 33 నీసాను 14 రాత్రి, యేసు ఏ ఆచరణను ప్రారంభించాడు? (బి) తన మరణానికి సంబంధించి యేసు ఏ నిబంధనను ప్రస్తావించాడు?

సా.శ. 33 నీసాను 14 రాత్రి, యేసు తన పన్నెండుమంది అపొస్తలులతో పస్కా పండుగను ఆచరించాడు. తాను వారితో కలిసి భుజించే ఆఖరి భోజనమిదేననీ, త్వరలోనే తాను తన శత్రువుల చేతిలో మరణించబోతున్నాననీ యేసుకు తెలుసు గనుక, ఆయన తన సన్నిహిత శిష్యులకు ప్రాముఖ్యమైన అనేక సంగతుల్ని వివరించేందుకు ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు.—యోహాను 13:1–17:26.

2 యూదా ఇస్కరియోతును పంపించివేసిన తర్వాత, క్రైస్తవులకు ఆజ్ఞాపించబడిన మతపరమైన ఏకైక వార్షిక ఆచరణను, అంటే తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను యేసు ఈ సమయంలోనే ప్రారంభించాడు. ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి—మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి—దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.” (మత్తయి 26:26-28) యేసు అనుచరులు ఆయన మరణాన్ని సరళమైన రీతిలోనూ, గౌరవప్రదమైన రీతిలోనూ జ్ఞాపకం చేసుకోవాలి. యేసు తన మరణానికి సంబంధించి ఒక నిబంధనను ప్రస్తావించాడు. లూకా సువార్తలోని ఆ వృత్తాంతమందు అది “క్రొత్త నిబంధన” అని పిలువబడింది.—లూకా 22:20.

3. క్రొత్త నిబంధనకు సంబంధించి ఏ ప్రశ్నలు వేయబడ్డాయి?

3 క్రొత్త నిబంధన అంటే ఏమిటి? అది క్రొత్త నిబంధనయైతే, పాత నిబంధననేది ఒకటి ఉందని దాని భావమా? మరితర నిబంధనలేవైనా దానితో సంబంధాన్ని కల్గివున్నాయా? “పాపక్షమాపణ నిమిత్తము” నిబంధన రక్తము చిందించబడుతుందని యేసు చెప్పాడు గనుక ఇవి ప్రాముఖ్యమైన ప్రశ్నలైవున్నాయి. అలాంటి క్షమాపణ మనందరికీ ఎంతో అవసరం.—రోమీయులు 3:23.

అబ్రాహాముతో చేసిన నిబంధన

4. క్రొత్త నిబంధనను అర్థంచేసుకోవడానికి ఏ ప్రాచీన వాగ్దానం మనకు సహాయపడుతుంది?

4 క్రొత్త నిబంధనను అర్థం చేసుకోవడానికి, మనం యేసు భూపరిచర్యకు మునుపు దాదాపు 2,000 సంవత్సరాలు వెనక్కి, అంటే అబ్రాము (తర్వాత అబ్రాహాము అని పిలువబడ్డాడు), అతని భార్యయైన శారయితోసహా (తర్వాత శారా అని పిలువబడింది) తెరహూ అతని కుటుంబమూ కల్దీయుల ఊరను పట్టణంలో నుండి ఉత్తర మెసపొటొమియాలోని హారాను అనే పట్టణానికి ప్రయాణించిన సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. తెరహు మరణించేంత వరకూ వాళ్లక్కడే ఉన్నారు. అటు తర్వాత, యెహోవా ఆజ్ఞతో 75 ఏళ్లవాడైన అబ్రాహాము గుడారాల్లో సంచార జీవనాన్ని జీవించేందుకు యూఫ్రటీసు నదిని దాటి, నైరుతిదిశగా కనాను దేశానికి ప్రయాణించాడు. (ఆదికాండము 11:31–12:1, 4, 5; అపొస్తలుల కార్యములు 7:2-5) సా.శ.పూ. 1943లో అది జరిగింది. అబ్రాహాము ఇంకా హారానులో ఉండగనే, యెహోవా ఆయనతో ఇలా చెప్పాడు: “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడు[ను.]” అబ్రాహాము కనానులోనికి ప్రవేశించిన తర్వాత, యెహోవా దానికిలా చేర్చాడు: “నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెద[ను.]”—ఆదికాండము 12:2, 3, 7.

5. అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానం ఏ చారిత్రక ప్రవచనంతో ముడిపెట్టబడింది?

5 అబ్రాహాముకు చేయబడిన వాగ్దానం, యెహోవా చేసిన వాగ్దానాలలో మరొక దానితో సంబంధాన్ని కల్గివుంది. నిజానికి, అది అబ్రాహామును మానవజాతి చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా, అంటే రాయబడిన ప్రవచనాల్లోకెల్లా మొట్టమొదటిదైన ప్రవచన నెరవేర్పులో ఒక లింకుగా చేసింది. ఏదెను వనంలో ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత, యెహోవా వారిరువురికి తీర్పు తీర్చాడు. అదే సందర్భంలో, హవ్వను మోసగించిన సాతాన్ని సంభోదిస్తూ “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని” ఆయన అన్నాడు. (ఆదికాండము 3:15) అబ్రాహాముతో యెహోవా చేసిన నిబంధన సాతాను క్రియలను లయపరచబోయే సంతానం ఆ మూలపురుషుని వంశావళిలో నుండి వస్తుందని సూచించింది.

6. (ఎ) అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానం ఎవరి ద్వారా నెరవేరుతుంది? (బి) అబ్రాహాము నిబంధన అంటే ఏమిటి?

6 యెహోవా చేసిన వాగ్దానం సంతానానికి సంబంధించినది గనుక, ఎవరి ద్వారానైతే ఆ సంతానం వస్తుందో ఆ కుమారుడ్ని అబ్రాహాము కల్గివుండాలి. కానీ, ఆయనా శారా ఇరువురూ వృద్ధులైపోయారు, వారికింకా పిల్లలు కలుగలేదు. అయితే చివరకు, వారి పునరుత్పత్తి శక్తుల్ని అద్భుతంగా పునరుజ్జీవింపచేస్తూ యెహోవా వారిని ఆశీర్వదించాడు. శారా అబ్రాహాముకు ఒక కుమారుడ్ని అంటే ఇస్సాకును కన్నది. ఆ విధంగా, సంతానాన్ని గూర్చిన ఆ వాగ్దానాన్ని యెహోవా కొనసాగించాడు. (ఆదికాండము 17:15-17; 21:1-7) అనేక సంవత్సరాల తర్వాత, అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత, తన ప్రియ కుమారుడైన ఇస్సాకును బలి అర్పించేందుకు ఆయన సుముఖత చూపించేంత స్థాయివరకూ ఆయన విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత, యెహోవా తన వాగ్దానాన్ని అబ్రాహాముకు మరలా తెలియజేశాడు: “నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:15-18) విస్తృతపర్చబడిన ఈ వాగ్దానం, తరచూ అబ్రాహాము నిబంధన అని పిలువబడుతుంది, తర్వాతి క్రొత్త నిబంధన దీనితో సన్నిహితంగా ముడిపెట్టబడి ఉంటుంది.

7. అబ్రాహాము సంతానం సంఖ్యలో ఎలా వృద్ధిచెందనారంభించింది, ఐగుప్తులో నివసించడానికి వారిని ఏ పరిస్థితులు నడిపించాయి?

7 కాలక్రమేణా, ఇస్సాకుకు ఏశావు, యాకోబు అను ఇద్దరు కవలపిల్లలు కలిగారు. వాగ్దాన సంతానపు పూర్వికునిగా యెహోవా యాకోబును ఎన్నుకున్నాడు. (ఆదికాండము 28:10-15; రోమీయులు 9:10-13) యాకోబుకు 12 మంది కుమారులు కలిగారు. స్పష్టంగా, అబ్రాహాము సంతానం వృద్ధిచెందనారంభించే సమయమిదే. యాకోబు కుమారులు పెరిగి పెద్దవారై, వారిలో అనేకులకు తమవైన స్వంత కుటుంబాలను కల్గివున్నప్పుడు, క్షామం వారంతా ఐగుప్తుకు అంటే దైవిక ఏర్పాటుననుసరించి యాకోబు కుమారుడైన యోసేపు మార్గాన్ని సిద్ధపర్చిన చోటుకి తరలి వెళ్లేలా చేసింది. (ఆదికాండము 45:5-13; 46:26, 27) కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కనానులో క్షామం తొలగిపోయింది. కానీ మొదట్లో అతిథులుగానూ, అటు తర్వాత బానిసలుగానూ యాకోబు కుటుంబం ఐగుప్తులోనే ఉండిపోయింది. అబ్రాహాము యూఫ్రటీసును దాటి 430 సంవత్సరాలు గడిచిన తర్వాత, సా.శ.పూ. 1513లో స్వాతంత్ర్యాన్ని పొందేందుకు యాకోబు సంతానాన్ని మోషే ఐగుప్తునుండి బయటకు తీసుకొచ్చాడు. (నిర్గమకాండము 1:8-14; 12:40, 41; గలతీయులు 3:16, 17) అబ్రాహాముతో తాను చేసిన నిబంధనకు యెహోవా ఇప్పుడు ప్రత్యేక అవధానాన్ని ఇవ్వబోతున్నాడు.—నిర్గమకాండము 2:24; 6:2-5.

“పాత నిబంధన”

8. సీనాయి పర్వతం దగ్గర యాకోబు సంతానంతో యెహోవా ఏ నిబంధన చేశాడు, అబ్రాహాము నిబంధనతో దీనికి ఏ సంబంధం ఉంది?

8 యాకోబూ, అతని కుమారులూ ఐగుప్తుకు తరలివెళ్లినప్పుడు వాళ్లది విస్తృత కుటుంబం, అయితే వాళ్ల సంతానం జనసాంద్రతగల గోత్రాల ఒక పెద్ద గుంపుగా ఐగుప్తును విడిచిపెట్టింది. (నిర్గమకాండము 1:5-7; 12:37, 38) యెహోవా వారిని కనానుకు తీసుకురావడానికి ముందు, ఆయన వారిని దక్షిణదిశగా అరేబియాలో ఉన్న హోరేబు (లేక సీనాయి) పర్వతపాదం దగ్గరకు నడిపించాడు. అక్కడ, ఆయన వారితో ఒక నిబంధన చేశాడు. “క్రొత్త నిబంధన”తో పోల్చగా ఇది “పాత నిబంధన” అని పిలువబడింది. (2 కొరింథీయులు 3:14) పాత నిబంధన ద్వారా, యెహోవా తాను అబ్రాహాముతో చేసిన తన నిబంధనను ఉపమానరీతిలో నెరవేర్చాడు.

9. (ఎ) అబ్రాహాము నిబంధన ద్వారా యెహోవా ఏ నాలుగు విషయాల్ని వాగ్దానం చేశాడు? (బి) ఇశ్రాయేలుతో యెహోవా చేసిన నిబంధన ఏ ఇతర ఉత్తరాపేక్షలు లభ్యమయ్యేలా చేసింది, ఏ షరతుపై?

9 ఈ నిబంధనలోని షరతులను యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఇలా వివరించాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందు[రు.]” (నిర్గమకాండము 19:5, 6) అబ్రాహాము సంతానం (1) ఒక గొప్ప జనమవుతుందనీ, (2) తమ శత్రువులపై విజయాన్ని పొందుతుందనీ, (3) కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటుందనీ, (4) జనాంగాలకు ఆశీర్వాదాల్ని తెచ్చే ఒక మాధ్యమంగా ఉంటుందనీ యెహోవా వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీయులు తన ఆజ్ఞలకు విధేయతచూపిస్తే, వాళ్లు “యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను” తయారవుతూ, ఆయన ప్రత్యేక ప్రజగా ఈ ఆశీర్వాదాల్ని పొందగలరని ఇప్పుడు ఆయన బయల్పర్చాడు. ఈ నిబంధనలోకి ప్రవేశించడానికి ఇశ్రాయేలీయులు అంగీకరించారా? ముక్తకంఠంతో వాళ్లు ఇలా జవాబిచ్చారు: “యెహోవా చెప్పినదంతయు చేసెద[ము.]”—నిర్గమకాండము 19:8.

10. యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఒక జనాంగంగా ఎలా సంస్థీకరించాడు, మరి ఆయన వారినుండి ఏమి అపేక్షించాడు?

10 అందుకే, యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఒక జనాంగంగా సంస్థీకరించాడు. ఆరాధననూ, పౌర జీవనాన్ని క్రమపర్చే చట్టాల్ని ఆయన వారికి ఇచ్చాడు. ఆయన వారికి ఒక గుడారాన్నీ (తర్వాత, యెరూషలేములో ఆలయాన్నీ), గుడారంలో పవిత్ర సేవను చెల్లించేందుకు యాజకత్వాన్నీ ఏర్పాటు చేశాడు. నిబంధనను అనుసరించడమంటే యెహోవా చట్టాలకు విధేయత చూపించడమనీ, మరి విశేషంగా ఆయనను మాత్రమే ఆరాధించడమనీ భావం. “నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” అనేది ఈ చట్టాలకు మూలకేంద్రమైన పది ఆజ్ఞల్లో మొదటిది.—నిర్గమకాండము 20:2, 3.

ధర్మశాస్త్ర నిబంధన ద్వారా ఆశీర్వాదాలు

11, 12. పాత నిబంధనలోని వాగ్దానాలు ఇశ్రాయేలు విషయంలో ఏ యే రీతుల్లో నెరవేరాయి?

11 ధర్మశాస్త్ర నిబంధనలోని వాగ్దానాలు ఇశ్రాయేలు విషయంలో నెరవేరాయా? ఇశ్రాయేలు ‘పరిశుద్ధ జనాంగంగా’ తయారయ్యిందా? ఆదాము సంతానంగా ఇశ్రాయేలీయులు పాపులు. (రోమీయులు 5:12) అయినప్పటికీ, ధర్మశాస్త్రం క్రింద, వాళ్ల పాపాలు పరిహరించడానికి బలులు అర్పించబడేవి. వార్షిక పాపప్రాయశ్చిత్తార్థ దినాన అర్పించబడే బలుల గురించి యెహోవా ఇలా తెలియజేశాడు: “మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.” (లేవీయకాండము 16:30) కాబట్టి, ఇశ్రాయేలు నమ్మకంగా విధేయత చూపించినప్పుడు, అది ఒక పరిశుద్ధ జనాంగంగా యెహోవా సేవ కొరకు పరిశుభ్రపర్చబడింది. అయితే ఈ పరిశుభ్రమైన స్థితి ధర్మశాస్త్రానికి వాళ్లు చూపించే విధేయతపైనా, క్రమంగా బలులు అర్పించడంపైనా ఆధారపడివుంది.

12 ఇశ్రాయేలు “యాజకరూపమైన రాజ్యము”గా తయారైందా? నిబంధన చేయబడినప్పటినుండీ, అది యెహోవా పరలోకపు రాజుగాగల రాజ్యమైంది. (యెషయా 33:22) అంతేగాక, ధర్మశాస్త్ర నిబంధనలో మానవ రాజరికం కొరకైన ఏర్పాట్లు కూడా చేరివున్నాయి గనుక, యెరూషలేములో పరిపాలిస్తున్న రాజులు యెహోవాకు ప్రాతినిధ్యం వహించారు. (ద్వితీయోపదేశకాండము 17:14-18) అయితే, ఇశ్రాయేలు ఒక యాజకుల రాజ్యమేనా? గుడారంలో పవిత్రసేవను చెల్లిస్తున్న యాజకత్వం దానికివుంది. ఇశ్రాయేలీయులకూ, ఇశ్రాయేలీయులుకాని వారికీ గుడారం (తర్వాత, ఆలయం) పవిత్రారాధనా కేంద్రంగా ఉండేది. మానవజాతికి బయల్పర్చబడిన సత్యానికి ఏకైక మాధ్యమం ఆ జనాంగమే. (2 దినవృత్తాంతములు 6:32, 33; రోమీయులు 3:1, 2) లేవీయ యాజకులు మాత్రమేకాదుగాని విశ్వాసులైన ఇశ్రాయేలీయులందరూ యెహోవా ‘సాక్షులే.’ యెహోవా ‘స్తోత్రమును ప్రచురము చేయడానికి’ రూపొందించబడ్డ ఆయన ‘సేవకుడే’ ఇశ్రాయేలు. (యెషయా 43:10, 21) యెహోవా తన ప్రజల పక్షంగా ప్రదర్శించిన శక్తిని చూసిన వినయమనస్కులైన అనేకమంది విదేశీయులు పరిశుద్ధ ఆరాధనవైపుకు ఆకర్షించబడి, మతమార్పిడి చేసుకున్నారు. (యెహోషువ 2:9-13) కానీ నిజానికి అభిషేకించబడిన యాజకులుగా సేవచేసింది ఒక్క గోత్రం మాత్రమే.

ఇశ్రాయేలులో మతమార్పిడి చేసుకొన్న వ్యక్తులు

13, 14. (ఎ) మతమార్పిడి చేసుకొన్నవారు ధర్మశాస్త్ర నిబంధనలో భాగస్వాములు కారని ఎందుకు చెప్పవచ్చు? (బి) మతమార్పిడి చేసుకొన్నవారు ధర్మశాస్త్ర నిబంధన క్రిందకు ఎలా వచ్చారు?

13 అలా మతమార్పిడి చేసుకొన్న వ్యక్తుల స్థానమేమిటి? యెహోవా తన నిబంధనను చేసినప్పుడు, అది ఇశ్రాయేలీయులతో మాత్రమే చేయబడింది; “అనేకులైన అన్యజనుల సమూహము” హాజరైనప్పటికీ, వాళ్లు పాలివారిగా ప్రస్తావించబడలేదు. (నిర్గమకాండము 12:38; 19:3, 7, 8) ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానం కొరకైన విమోచన క్రయధనాన్ని లెక్కించినప్పుడు, వీరి ప్రథమ సంతానాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. (సంఖ్యాకాండము 3:44-51) దశాబ్దాల తర్వాత, కనాను దేశం ఇశ్రాయేలీయుల గోత్రాల మధ్య విభజించబడినప్పుడు, ఇశ్రాయేలీయులుకాని విశ్వాసుల కొరకు ప్రత్యేక భూమంటూ ఏదీ కేటాయించబడలేదు. (ఆదికాండము 12:7; యెహోషువ 13:1-14) ఎందుకు? ఎందుకంటే ధర్మశాస్త్ర నిబంధన మతమార్పిడి చేసుకొన్న వ్యక్తులతో చేయబడలేదు. కానీ మతమార్పిడి చేసుకొన్న పురుషులు ధర్మశాస్త్రానికి లోబడి సున్నతి చేయించుకున్నారు. వాళ్లు దాని నిబంధనల్ని ఆచరించారు, దాని ఏర్పాట్లనుండి వాళ్లు ప్రయోజనాన్ని పొందారు. మతమార్పిడి చేసుకొన్నవాళ్లూ, ఇశ్రాయేలీయులూ ధర్మశాస్త్ర నిబంధన క్రిందకి వచ్చారు.—నిర్గమకాండము 12:48, 49; సంఖ్యాకాండము 15:14-16; రోమీయులు 3:19.

14 ఉదాహరణకు, మతమార్పిడి చేసుకొన్న ఒక వ్యక్తి అనుకోకుండా ఎవరినైనా చంపితే, ఇశ్రాయేలీయునివలే అతడు ఆశ్రయపురానికి పారిపోవొచ్చు. (సంఖ్యాకాండము 35:15, 22-25; యెహోషువ 20:9) ప్రాయశ్చిత్తార్థ దినాన, “ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తము” బలి అర్పించబడేది. సమాజంలో ఒక భాగంగా, మతమార్పిడి చేసుకొన్న ప్రజలు కట్టడల్లో భాగంవహించి బల్యర్పణ ద్వారా ప్రయోజనాన్ని పొందారు. (లేవీయకాండము 16:7-10, 15, 17, 29; ద్వితీయోపదేశకాండము 23:7, 8) మతమార్పిడి చేసుకొన్న ప్రజలు ధర్మశాస్త్ర నిబంధన క్రిందవున్న ఇశ్రాయేలుతో ఎంత సన్నిహితంగా సహవసించేవారంటే, సా.శ. 33 పెంతెకొస్తునాడు యూదుల తరుపున ‘రాజ్యం యొక్క మొదటి తాళపుచెవి’ ఉపయోగించబడినప్పుడు వాళ్లు కూడా ప్రయోజనం పొందారు. తత్ఫలితంగా, “యూదుల మతప్రవిష్టుడును [మతమార్పిడి చేసుకొన్నవాడును] అంతియొకయవాడును అగు నీకొలాసు” క్రైస్తవుడయ్యాడు, యెరూషలేము సంఘావసరతల గురించి శ్రద్ధవహించడానికి నియమించబడిన “మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యుల”లో ఆయన ఒకడై ఉన్నాడు.—మత్తయి 16:19; అపొస్తలుల కార్యములు 2:5-10; 6:3-6; 8:26-39.

యెహోవా అబ్రాహాము సంతానాన్ని ఆశీర్వదిస్తాడు

15, 16. అబ్రాహాముతో యెహోవా చేసిన నిబంధన, ధర్మశాస్త్ర నిబంధన క్రింద ఎలా నెరవేరింది?

15 అబ్రాహాము సంతానము ధర్మశాస్త్ర నిబంధన క్రింద ఒక జనాంగంగా సంస్థీకరించబడడంతో, ఆ మూలపురుషునికి తాను చేసిన వాగ్దానం ప్రకారంగా యెహోవా వారిని ఆశీర్వదించాడు. మోషే తర్వాతవాడైన యెహోషువ, సా.శ.పూ. 1473లో ఇశ్రాయేలును కనాను దేశంలోకి నడిపించాడు. అటు తర్వాత, ఇశ్రాయేలు గోత్రాల మధ్య జరిగిన దేశ విభజన, అబ్రాహాము సంతానానికి ఆ దేశాన్ని ఇస్తానని యెహోవా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఇశ్రాయేలు నమ్మకంగా ఉన్నప్పుడు, వారి శత్రువులపై వారికి విజయాన్ని చేకూరుస్తానని తాను చేసిన వాగ్దానాన్ని యెహోవా నెరవేర్చాడు. దావీదు రాజు పరిపాలనలో ఇది విశేషంగా వాస్తవమైంది. దావీదు కుమారుడైన సొలొమోను కాలంనాటికి, అబ్రాహాముకు చేయబడిన వాగ్దానంలో మూడవ అంశం నెరవేరింది. “యూదావారును ఇశ్రాయేలువారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.”—1 రాజులు 4:20.

16 అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలు ద్వారా జనాంగాలు తమనుతాము ఎలా ఆశీర్వదించుకుంటాయి? ఇప్పటికే ప్రస్తావించినట్లుగా, జనాంగాల మధ్య యెహోవా ప్రతినిధియైన ఇశ్రాయేలు ఆయన ప్రత్యేక ప్రజయైవుంది. ఇశ్రాయేలు కనానులోకి ప్రవేశించడానికి కొంచెం ముందు, మోషే ఇలా అన్నాడు: “జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి.” (ద్వితీయోపదేశకాండము 32:43) విదేశీయుల్లో అనేకమంది ప్రతిస్పందించారు. ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులతోపాటూ బయటకు వచ్చిన “అనేకులైన అన్యజనుల సమూహము” అరణ్యంలో యెహోవా శక్తిని చూశారు, ఆనందించుడని మోషే ఇచ్చిన ఆహ్వానాన్ని విన్నారు. (నిర్గమకాండము 12:37, 38) తర్వాత, మోయాబీయురాలైన రూతు ఇశ్రాయేలీయుడైన బోయజును పెండ్లిచేసుకొని, మెస్సీయ పూర్వికురాలైంది. (రూతు 4:13-22) సహజ ఇశ్రాయేలీయుల్లో అనేకులు అవిశ్వాసులైనప్పుడు, కేనీయుడైన యెహోనాదాబూ, అతని సంతతీ, కూషీయుడగు ఎబెద్మెలెకూ సరియైన సూత్రాలకు హత్తుకోవడం ద్వారా తమను తాము వేరుపర్చుకున్నారు. (2 రాజులు 10:15-17; యిర్మీయా 35:1-19; 38:7-13) పర్షియన్‌ సామ్రాజ్యం క్రింద, అనేకమంది విదేశీయులు మతమార్పిడి చేసుకొని, ఇశ్రాయేలుతో కలిసి వారి శత్రువులతో పోరాడారు.—ఎస్తేరు 8:17.

క్రొత్త నిబంధన అవసరమైంది

17. (ఎ) ఇశ్రాయేలు ఉత్తర దక్షిణ రాజ్యాల్ని యెహోవా ఎందుకు నిరాకరించాడు? (బి) చిట్టచివరిసారిగా యూదులు నిరాకరించబడడానికి ఏది నడిపించింది?

17 అయితే, దేవుని వాగ్దాన పూర్తి నెరవేర్పును పొందాలంటే, దేవుని ప్రత్యేక జనాంగం నమ్మకంగా ఉండాలి. అది నమ్మకంగా ఉండలేదు. నిజమే, విశిష్టమైన విశ్వాసాన్ని కల్గివున్న ఇశ్రాయేలీయులు ఉన్నారు. (హెబ్రీయులు 11:32–12:1) అయినప్పటికీ, వస్తుదాయక ప్రయోజనాల కొరకు అపేక్షిస్తూ, అనేక సందర్భాల్లో జనాంగం అన్యదేవతల వైపు తిరిగింది. (యిర్మీయా 34:8-16; 44:15-18) కొంతమంది వ్యక్తులు ధర్మశాస్త్రాన్ని తప్పుగా అన్వయించారు లేక దాన్ని అలక్ష్యం చేశారు. (నెహెమ్యా 5:1-5; యెషయా 59:2-8; మలాకీ 1:12-14) సొలొమోను మరణించిన తర్వాత, ఇశ్రాయేలు ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యం తిరుగుబాటుచేసేదిగా రుజువైనప్పుడు, యెహోవా ఇలా ప్రకటించాడు: “నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును.” (హొషేయ 4:6) నిబంధన విషయంలో దక్షిణ రాజ్యం తప్పిపోయినందున అది కూడా తీవ్రంగా శిక్షించబడింది. (యిర్మీయా 5:29-31) యూదులు యేసును మెస్సీయగా నిరాకరించినప్పుడు, యెహోవా వారిని కూడా నిరాకరించాడు. (అపొస్తలుల కార్యములు 3:13-15; రోమీయులు 9:31–10:4) చివరకు, అబ్రాహాము నిబంధన సంపూర్ణంగా నెరవేరేలా చూసేందుకు యెహోవా ఒక క్రొత్త ఏర్పాటును చేశాడు.—రోమీయులు 3:20.

18, 19. అబ్రాహాము నిబంధన సంపూర్ణమైన రీతిలో నెరవేరగలిగేలా యెహోవా ఏ క్రొత్త ఏర్పాటును చేశాడు?

18 ఆ క్రొత్త ఏర్పాటే క్రొత్త నిబంధన. “ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధనచేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. . . . ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు” అని యెహోవా చెప్పినప్పుడు దాన్ని ప్రవచించాడు.—యిర్మీయా 31:31-34.

19 యేసు సా.శ. 33 నీసాను 14న ప్రస్తావించిన క్రొత్త నిబంధన అదే. తన శిష్యులకూ యెహోవాకూ మధ్య వాగ్దానం చేయబడిన ఆ నిబంధన ఏర్పాటు చేయబడుతుందనీ, దానికి తాను మధ్యవర్తిననీ యేసు ఆ సందర్భంలో బయల్పర్చాడు. (1 కొరింథీయులు 11:25; 1 తిమోతి 2:5; హెబ్రీయులు 12:24) తదుపరి శీర్షికలో మనం చూడబోతున్నట్లే, అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానం ఈ క్రొత్త నిబంధన ద్వారా మరింత మహిమాయుక్తమైన, శాశ్వతమైన నెరవేర్పును కల్గివుంటుంది.

మీరు వివరించగలరా?

◻ అబ్రాహాము నిబంధనలో యెహోవా ఏమని వాగ్దానం చేశాడు?

◻ శరీరసంబంధ ఇశ్రాయేలు విషయంలో యెహోవా అబ్రాహాము నిబంధన ఎలా నెరవేరేలా చేశాడు?

◻ మతమార్పిడి చేసుకొన్నవాళ్లు పాత నిబంధననుండి ఎలా ప్రయోజనాన్ని పొందారు?

◻ క్రొత్త నిబంధన ఎందుకు అవసరమైంది?

[9వ పేజీలోని చిత్రం]

ధర్మశాస్త్ర నిబంధన ద్వారా, యెహోవా తాను అబ్రాహాముకు చేసిన నిబంధనను ఉపమానరీతిలో నెరవేర్చాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి