“నీ కృప జీవముకంటె ఉత్తమము”
కాల్వన్ హెచ్. హోమ్స్ చెప్పినది
అది 1930 డిసెంబరు నెల, నాన్న దగ్గర్లోని పొరుగువారిని దర్శించి ఇంటికి వచ్చేసరికి నేను అప్పుడే ఆవులనుండి పాలు పితకడం ముగించాను. ఆయన తన జేబులోనుండి ఒక నీలిరంగు పుస్తకాన్ని బయటకు తీస్తూ “నేను చదివేందుకు వైమన్ ఈ పుస్తకాన్ని నాకిచ్చాడు” అని అన్నారు. దాని పేరు విడుదల (ఆంగ్లం), దాన్ని వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించింది. అంతగా పుస్తకాలు చదవని నాన్న, ఆ పుస్తకాన్ని రాత్రి చాలా పొద్దుపోయేంత వరకూ చదివారు.
తర్వాత, వెలుగు మరియు సమాధానపడుట (ఆంగ్లం) వంటి శీర్షికలుగల, అదే ప్రచారకులు ప్రచురించిన ఇతర పుస్తకాలను కూడా నాన్నగారు తెచ్చుకున్నారు. ఆయన అమ్మవద్ద ఉన్న పాత బైబిలు తీసుకుని, కిరోసిన్ దీపం వెలుగులో రాత్రి చాలా పొద్దుపోయే వరకూ చదువుతూ ఉండేవారు. నాన్నగారిలో చాలా మార్పు వచ్చింది. మా అమ్మా, మా చెల్లెళ్లూ నేనూ మా పాత కట్టెల పొయ్యి చుట్టూ కూర్చుని ఉండగా ఆయన ఆ శీతాకాలం మా అందరితో ఎన్నో గంటలు మాట్లాడారు.
ఈ పుస్తకాలను ప్రచురించే ప్రజలు బైబిలు విద్యార్థులని పిలువబడుతున్నారనీ, వారు చెప్పేదాని ప్రకారం మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామనీ నాన్న చెప్పారు. (2 తిమోతి 3:1-5) ప్రపంచాంతం సమయంలో భూమి నాశనం చేయబడదనీ కానీ దేవుని రాజ్యం క్రింద అది ఒక పరదైసుగా మార్చబడుతుందనీ ఆయన వివరించారు. (2 పేతురు 3:5-7, 13; ప్రకటన 21:3, 4) అది నాకు నిజంగా చాలా ఆసక్తికరంగా అనిపించింది.
మేము కలిసి పని చేస్తున్నప్పుడు నాన్నగారు నాతో మాట్లాడటం ప్రారంభించారు. దేవుని నామం యెహోవా అనే విషయాన్ని ఆయన వివరించినప్పుడు మేము మొక్కజొన్న కంకులను వొలుస్తున్నట్లు నాకు బాగా జ్ఞాపకముంది. (కీర్తన 83:18) అలా, 1931 వసంతంలో, అంటే నాకు కేవలం 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను యెహోవా ఎడలా ఆయన రాజ్యం ఎడలా దృఢమైన స్థానాన్ని వహించాను. ఇంటివెనక ఉన్న పాత ఆపిల్ తోటలో నేను యెహోవాకు ప్రార్థించి ఆయనను నేను ఎల్లప్పుడూ సేవిస్తానని గంభీరంగా వాగ్దానం చేశాను. మన ఆశ్చర్యకరుడైన దేవుని కృప నా హృదయాన్ని అప్పటికే కదిలించింది.—కీర్తన 63:3.
అమెరికాలోని మిస్సోరీ నందలి సెయింట్ జోసెఫ్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో మరియు కాన్సాస్ నగరానికి దాదాపు 65 కంటే తక్కువ కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలంలో మేము నివసించే వాళ్లం. మా ముత్తాతగారు 19వ శతాబ్దపు తొలి భాగంలో ఆ పొలంలో నిర్మించిన ఒక చెక్క క్యాబిన్‌లో నాన్నగారు జన్మించారు.
పరిచర్య కొరకు తర్ఫీదు
1931 వేసవిలో, ఒహాయో నందలి కొలంబస్‌లోని ఒక సమావేశంలో వాచ్‌టవర్ సొసైటీ అప్పటి అధ్యక్షుడైన జోసెఫ్ రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన “రాజ్యము, ప్రపంచ నిరీక్షణ” అనే బహిరంగ ప్రసంగాన్ని మా కుటుంబం రేడియోలో విన్నది. అది నా హృదయాన్ని ప్రేరేపించింది, ఈ ప్రాముఖ్యమైన బహిరంగ ప్రసంగమున్న ఒక చిన్న పుస్తకాన్ని నాన్నతోపాటు కలిసి మాకు తెలిసిన వాళ్లకు పంచిపెట్టడంలో భాగం వహించగలిగినందుకు నేనెంతో ఆనందించాను.
1932 వసంతకాలంలో, నేను యెహోవాసాక్షుల కూటానికి మొట్ట మొదటిసారి హాజరయ్యాను. యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్త అయిన జార్జ్ డ్రేపర్‌గారు సెయింట్ జోసెఫ్‌లో ఇవ్వనున్న ప్రసంగాన్ని వినేందుకు మా పొరుగతను నాన్ననూ నన్నూ ఆహ్వానించాడు. మేమక్కడికి చేరుకునే సరికి, ఆ కూటం సగం అయిపోయింది, దృఢ కాయుడైన జే. డి. డ్రెయర్‌గారి వెనక నాకు స్థలం దొరికింది. తర్వాత ఆయన నా జీవితంలో ప్రాముఖ్యమైన పాత్ర వహించారు.
1933 సెప్టెంబరులో, కాన్సాస్ నగరంలో నాన్నగారితో పాటు నేను ఒక సమావేశానికి హాజరయ్యాను, అక్కడ బహిరంగ ప్రకటనాపనిలో నేను మొదటిసారి భాగం వహించాను. నాన్నగారు నాకు మూడు చిన్న పుస్తకాలు ఇచ్చి ఇలా చెప్పమని చెప్పారు: “నేను దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటిస్తున్న ఒక యెహోవాసాక్షిని. మీరు జడ్జి రూథర్‌ఫోర్డ్ గారి ప్రసంగాలు రేడియోలో తప్పక విని ఉంటారు. ఆయన ప్రసంగాలు ప్రతి వారం 300 కంటే ఎక్కువ రేడియో స్టేషన్‌లలో ప్రసారం చేయబడుతున్నాయి.” తర్వాత నేను చిన్న పుస్తకాన్ని అందించాను. ఆ సాయంత్రం, మళ్లీ మా పొలానికి తిరిగి వచ్చిన తర్వాత నేను ఆవుల పాలు పితుకుతూ, అది నా జీవితంలోని చిరస్మరణీయమైన దినమని నేను అనుకున్నాను.
కొంతకాలానికే శీతాకాలం ప్రారంభమైంది, మేము ఎక్కువగా ప్రయాణించడం సాధ్యమయ్యేది కాదు. కానీ బ్రదర్ డ్రెయర్, ఆయన శ్రీమతి మమ్మల్ని దర్శించి, శనివారం సాయంత్రం మా ఇంటికి వచ్చి రాత్రి అక్కడే ఉండిపోయేందుకు ఇష్టపడతావా అని నన్ను అడిగారు. డ్రెయర్ గారి ఇంటికి వెళ్లేందుకు పది కిలోమీటర్లు నడవటం యోగ్యమైనదే అని నాకు అనిపించింది, ఎందుకంటే ఆ మర్నాడు నేను వాళ్లతో కలిసి పరిచర్యలో పాల్గొనగలిగాను, సెయింట్ జోసెఫ్‌లో కావలికోట పఠనానికి హాజరవ్వగలిగాను కూడా. అప్పటినుండి, ఆదివారాల్లో పరిచర్యను నేను చాలా అరుదుగా మానుకున్నాను. బ్రదర్ డ్రెయర్ గారి తర్ఫీదు మరియు సలహాలు ఎంతో విలువైనవిగా నిరూపించబడ్డాయి.
1935 సెప్టెంబరు 2న, కాన్సాస్ నగరంలో జరిగిన ఒక సమావేశంలో యెహోవాకు నేను చేసుకున్న సమర్పణను తుదకు నీటి బాప్తిస్మం ద్వారా సూచించగలిగాను.
జీవితకాల కెరీర్ ప్రారంభమవ్వడం
1936 తొలి భాగంలో, నేను పయినీరుగా లేక పూర్తికాల పరిచారకునిగా సేవ చేసేందుకు దరఖాస్తు పెట్టుకున్నాను, పయినీరు సహవాసి కొరకు వెదుకుతున్న వారి పట్టికలో నన్ను కూడా చేర్చారు. దాని తర్వాత కొంత కాలానికే, వ్యోమింగ్ నందలి అర్వాడకు చెందిన ఎడ్వర్డ్ స్టెడ్‌నుండి నేను ఒక ఉత్తరాన్ని అందుకున్నాను. తాను చక్రాల కుర్చీలోనే జీవితం గడుపుతున్నాడనీ పయినీరు సేవ చేసేందుకు తనకు సహాయం అవసరమనీ ఆయన వివరించాడు. నేను వెంటనే ఆయన ప్రతిపాదనను అంగీకరించాను, 1936 ఏప్రిల్ 18న నేను పయినీరుగా నియమించబడ్డాను.
బ్రదర్ స్టెడ్‌ను కలిసేందుకు నేను వెళ్లడానికి ముందు, అమ్మ నాతో ఒంటరిగా మాట్లాడింది. “బాబూ, నిజంగా నువ్వు చేయాలనుకుంటున్నది ఇదేనా?” అని అమ్మ అడిగింది.
“మరోలా జీవిస్తే ఇక జీవితానికి ఎలాంటి విలువా ఉండదు” అని నేను సమాధానమిచ్చాను. యెహోవా యొక్క కృప దేనికన్నా కూడా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని నేను గుణగ్రహించాను.
టెడ్‌తో పాటూ పయినీరు సేవ చేయడం అద్భుతమైన తర్ఫీదునిచ్చింది, బ్రదర్ స్టెడ్‌ని మేము టెడ్ అని పిలిచేవాళ్లం. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు, ఆయన రాజ్య వర్తమానాన్ని ఎంతో చక్కగా అందించే వాడు. అయితే టెడ్ వ్రాయడం, మాట్లాడటం మాత్రమే చేయగలిగే వాడు; రూమెటాయిడ్ ఆర్థరైటిస్ మూలంగా ఆయన కీళ్లన్నీ పట్టుకుపోయాయి. నేను ఉదయాన్నే నిద్ర లేచి ఆయనకు గడ్డం గీసి స్నానం చేయించి, టిఫిన్ చేసి ఆయనకు తినిపించే వాణ్ని. తర్వాత నేను ఆయనకు బట్టలు వేసి, పరిచర్యకు ఆయనను సిద్ధం చేసే వాణ్ని. ఆ వేసవిలో మేము వ్యోమింగ్ మరియు మంటానలో పయినీరు సేవ చేశాము, మరి రాత్రుల్లో బయలు ప్రాంతాల్లో పడుకునే వాళ్లం. టెడ్ తన పికప్ ట్రక్‌పై నిర్మించబడిన ప్రత్యేకమైన క్యాబ్‌లో పడుకునే వాడు, నేను నేలపై పడుకునే వాణ్ని. అదే సంవత్సరంలో తర్వాత, టెనస్సీ, అర్కన్‌సాస్ మరియు మిస్సిసిపీలలో పయినీరు సేవ చేసేందుకు నేను దక్షిణం వైపుకు వెళ్లాను.
1937 సెప్టెంబరులో, ఒహాయో నందలి కొలంబస్‌లో జరిగిన పెద్ద సమావేశానికి నేను హాజరయ్యాను. నేను హాజరైన పెద్ద సమావేశాల్లో అదే మొదటిది. అక్కడ ఫోనోగ్రాఫ్ ఉపయోగంతో ప్రకటనాపనిని మరింత తీవ్రతరం చేసే ఏర్పాట్లు చేయబడ్డాయి. మేము ఫోనోగ్రాఫ్‌ను ఉపయోగించిన ప్రతి సందర్భాన్నీ ఒక సెటప్ అని పిలిచే వాళ్లం. ఒక నెలలో నేను 500 సెటప్‌లు నిర్వహించాను మరి 800 కంటే ఎక్కువమంది ప్రజలు విన్నారు. తూర్పు టెనస్సీ, వర్జీనియా, మరియు పశ్చిమ వర్జీనియా యొక్క అనేక నగరాల్లో సాక్ష్యమిచ్చిన తర్వాత, ప్రత్యేక పయినీరుగా ఒక క్రొత్త యోగ్యతతో సేవ చేసేందుకు అంటే అప్పుడు జోన్ సర్వెంట్ అని పిలువబడుతుండిన ప్రయాణ పైవిచారణ కర్త సందర్శించిన ప్రాంతాలను అన్నింటినీ సందర్శించేందుకు నన్ను ఆహ్వానించారు.
నేను పశ్చిమ వర్జీనియాలోని సంఘాలనూ ఐసొలేటెడ్ గుంపులనూ దర్శించి—ఒక్కో గుంపుతో రెండు నుండి నాలుగు వారాల చొప్పున గడుపుతూ—సర్క్యూట్‌సేవలో నాయకత్వం వహించాను. ఆ తర్వాత, 1941 జనవరిలో నన్ను జోన్ సర్వెంట్‌గా నియమించారు. అప్పటికల్లా మా అమ్మా, క్లార, లోయస్, రూత్ అనే నా ముగ్గురు చెల్లెళ్లు రాజ్యం పక్షంలో తమ స్థానం వహించారు. కాబట్టి ఆ సంవత్సరం వేసవిలో సెయింట్ లూయస్ నందు జరిగిన సమావేశానికి మా కుటుంబం మొత్తం హాజరైంది.
సమావేశం జరిగిన కొంతకాలానికే, 1941 నవంబరు చివరలో జోన్ పని ఆగిపోతుందని జోన్ సర్వెంట్‌లకు తెలుపబడింది. ఆ మరుసటి నెల అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించింది. నన్ను, పరిచర్యలో నెలకు 175 గంటలు వెచ్చించవలసిన ప్రత్యేక పయినీరు సేవలో నియమించారు.
ప్రత్యేక సేవాధిక్యతలు
1942 జూలైలో, నేను విదేశాల్లో సేవ చేసేందుకు సుముఖంగా ఉన్నానా అని అడుగుతూ నాకు ఒక ఉత్తరం అందింది. నాకు సమ్మతమేనని నేను ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత, బేతేలుకు అంటే న్యూయార్క్ నందలి బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి నేను ఆహ్వానించబడ్డాను. అదే సమయంలో దాదాపు 20 మంది అవివాహిత సహోదరులను ప్రత్యేక తర్ఫీదు నిమిత్తమై పిలిపించారు.
ప్రకటనాపని తగ్గుముఖం పట్టిందనీ మరియు సంఘాలను ఆధ్యాత్మికంగా దృఢపర్చేందుకు మాకు తర్ఫీదు ఇవ్వబడుతుందనీ వాచ్‌టవర్ సొసైటి యొక్క అప్పటి అధ్యక్షుడైన నేథన్ హెచ్. నార్ వివరించాడు. “సంఘంలోవున్న సమస్య ఏమిటనేది మాత్రమే కాదు మేము తెలుసుకోదలుచుకున్నది, అయితే దాని విషయమై మీరు ఏమి చేశారనే దాన్ని కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము” అని ఆయన చెప్పాడు.
బ్రదర్ నార్ తర్వాత, సంస్థ అధ్యక్షునిగా ఫ్రెడ్ ఫ్రాంజ్ 1977లో బాధ్యతలు చేపట్టాడు. మేము బేతేలులో ఉన్నప్పుడు, ఆయన ఒక ప్రసంగంలో ఇలా చెప్పాడు: “రెండవ ప్రపంచ యుద్ధం అంతమౌతుంది, ఒక గొప్ప ప్రకటనాపని ప్రారంభమౌతుంది. యెహోవా సంస్థలోకి లక్షలాదిమంది ఇంకా సమకూర్చబడతారనే విషయంలో సందేహమే లేదు!” ఆ ప్రసంగం నా ఆలోచనావిధానాన్ని పూర్తిగా మార్చివేసింది. నియామకాలు ఇవ్వబడినప్పుడు, నేను టెనస్సీ మరియు కన్‌టకీ రాష్ట్రాలలోని సంఘాలన్నిటినీ దర్శించాలని తెలుసుకున్నాను. మేము సహోదరులకు సేవకులు అని పిలువబడే వాళ్లం, ఆ తర్వాత ఆ పేరు సర్క్యూట్ పైవిచారణ కర్తగా మారింది.
నేను 1942 అక్టోబరు 1న అంటే నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడే సంఘాలను దర్శించడం ప్రారంభించాను. ఆ సమయంలో కొన్ని సంఘాలను చేరుకునేందుకుగల ఏకైక మార్గం కాలినడకో లేక గుర్రపు స్వారీనో మాత్రమే. కొన్నిసార్లు నాకు బస ఏర్పాటు చేసిన కుటుంబంతో పాటూ ఒకే గదిలో నేను పడుకునే వాణ్ని.
నేను 1943 జూలైలో, టెనస్సీనందలి గ్రీనెవిల్లీ సంఘాన్ని దర్శిస్తున్నప్పుడు, వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క రెండవ తరగతికి హాజరయ్యేందుకు ఆహ్వానించబడ్డాను. గిలియడ్‌లో, “వినిన సంగతుల . . . యందు మరి విశేష జాగ్రత్త కలిగి” ఉండటం మరియు “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై” ఉండటం అంటే వాస్తవంగా ఏమిటో నేను నేర్చుకున్నాను. (హెబ్రీయులు 2:1; 1 కొరింథీయులు 15:58) పాఠశాల కోర్సులు జరిగిన ఆ ఐదు నెలలూ చాలా త్వరగా గడిచిపోయాయి 1944 జనవరి 31న స్నాతకోత్సవ దినం రానే వచ్చింది.
కెనడాకూ ఆ తర్వాత బెల్జియంకూ
మాలో చాలా మందిని, యెహోవాసాక్షుల కార్యకలాపాలపైనుండి ఇటీవలనే నిషేధం ఎత్తివేయబడిన కెనడాకు నియమించారు. నన్ను ప్రయాణ పనికి నియమించారు, కొన్ని సంఘాల మధ్య చాలా ఎక్కువ దూరాలు ప్రయాణం చేయవలసి ఉండేది. నేను ప్రయాణిస్తుండగా, నిషేధం సమయంలో కెనడాలో మన ప్రకటనాపని ఎలా కొనసాగిందనే విషయాన్ని గురించిన అనుభవాలను వినడం ఎంతో ఆనందకరంగా ఉండేది. (అపొస్తలుల కార్యములు 5:29) ఒకే రాత్రిలో కెనడానందు ఆ చివర నుండి ఈ చివర వరకూ ప్రతి గృహంలో ఒక చిన్న పుస్తకాన్ని పంచిపెట్టడం జరిగిన, బ్లిట్జ్ అనబడే దాని గురించి అనేకులు నాకు చెప్పారు. 1945 మేలో యూరప్ నందు యుద్ధం ముగిసిందనే విషయాన్ని వినటం ఎంతటి సువార్త!
ఆ వేసవిలో, సస్‌కాచ్‌వన్ నందలి ఓసేజ్ అనే ఒక చిన్న టౌన్‌లోని సంఘాన్ని దర్శిస్తున్నప్పుడు, నేను బ్రదర్ నార్ నుండి ఒక ఉత్తరాన్ని అందుకున్నాను, అందులో ఇలా ఉంది: “బెల్జియంకు వెళ్లే ఆధిక్యతను నేను నీకు అందిస్తున్నాను. . . . ఆ దేశంలో చేయవలసిన పని ఎంతో ఉంది. అది యుద్ధం చేత పీడింపబడుతున్న దేశం, మన సహోదరులకు సహాయం అవసరం, వారికి అవసరమైన సహాయాన్నీ ఆదరణను అందించేందుకు అమెరికానుండి ఎవరినైనా పంపించడం సరైన విషయంగా అనిపిస్తుంది.” ఆ నియామకాన్ని అంగీకరిస్తూ నేను వెంటనే జవాబిచ్చాను.
1945 నవంబరులో, పెద్ద వయస్కుడైన ఆల్షేషన్ సహోదరుడైన చార్లెస్ ఐచర్‌తో ఫ్రెంచిని అధ్యయనం చేస్తూ నేను బ్రూక్లిన్ బేతేలులో ఉన్నాను. నేను బ్రాంచి కార్యకలాపాల్లో కొంత త్వరిత తర్ఫీదును కూడా పొందాను. యూరప్‌కు వెళ్లే ముందు నేను మిస్సోరీలోని సెయింట్ జోసెఫ్ నందలి నా కుటుంబీకులనూ స్నేహితులనూ ఒకసారి చూసివచ్చాను.
డిసెంబరు 11న, నేను న్యూయార్క్ నుండి క్వీన్ ఎలిజబేత్‌లో ప్రయాణమయ్యాను, నాలుగు రోజుల తర్వాత నేను ఇంగ్లండ్ నందలి సౌతాంప్‌టన్‌కు చేరుకున్నాను. నేను బ్రిటన్ బ్రాంచిలో ఒక నెల రోజులు ఉండి అదనపు తర్ఫీదును పొందాను. దాని తర్వాత, 1946 జనవరి 15న, నేను ఇంగ్లీష్ ఛానల్ దాటి బెల్జియం నందలి ఆస్టెండ్ చేరుకున్నాను. అక్కడనుండి నేను బ్రసెల్జ్‌కు రైల్లో వెళ్లాను, అక్కడ బేతేలు కుటుంబమంతా నన్ను కలిసేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చింది.
యుద్ధం తర్వాత ఉద్ధృతమయిన కార్యకలాపం
బెల్జియంలో జరుగుతున్న రాజ్యపనిని పైవిచారణ చేయడం నా నియామకం, అయితే నాకు ఆ భాష మాట్లాడటం కూడా రాదు. ఆరు నెలల్లో, నేను సాధారణ సంభాషణకు తగినంత ఫ్రెంచి నేర్చుకున్నాను. నాజీ ఆక్రమణ జరిగిన ఐదు సంవత్సరాల్లో ప్రకటనాపనిని కొనసాగించేందుకు తమ జీవితాలను ప్రమాదంలో పడవేసుకున్న వారితో కలిసి పని చేయగలగటం ఒక ఆధిక్యత. వారిలో కొందరు నిర్బంధ శిబిరాలనుండి ఇటీవలనే విడుదలయ్యారు.
పనిని సంస్థీకరించి బైబిలు సత్యాల కొరకు ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పంచిపెట్టేందుకు సహోదరులు చాలా ఆతురతతో ఉన్నారు. కాబట్టి సమావేశాలు జరిపేందుకూ ప్రయాణ పైవిచారణ కర్తలు సంఘాలను దర్శించేందుకూ ఏర్పాట్లు చేయబడుతున్నాయి. బ్రూక్లిన్ ప్రధాన కార్యాలయ ప్రతినిధులైన నేథన్ నార్, మిల్టన్ హెన్షెల్, ఫ్రెడ్ ఫ్రాంజ్, గ్రాంట్ సూటర్, మరియు జాన్ బూత్‌ల ప్రోత్సాహకరమైన సందర్శనాలు మాకు లభించాయి. ఆ తొలి దినాల్లో, నేను సర్క్యూట్ పైవిచారణ కర్తగా, జిల్లా పైవిచారణ కర్తగా, బ్రాంచి పైవిచారణ కర్తగా సేవ చేశాను. 1952 డిసెంబరు 6న, అంటే బెల్జియంలో దాదాపు ఏడు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, బెల్జియం బ్రాంచిలోనే పని చేస్తున్న ఈమీలీయ వానాప్స్‌లవుచ్‌ను నేను వివాహం చేసుకున్నాను.
కొన్ని నెలల తర్వాత, 1953 ఏప్రిల్ 11న, నన్ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిచి, నేను ఆ దేశంలో ఉండటమనేది బెల్జియం యొక్క భద్రతకు ప్రమాదకరమైనదని నాకు చెప్పారు. స్టేట్ కౌన్సిల్‌కు నా కేసు విషయంలో అప్పీలు చేయబడుతుండగా దాని విషయమై వేచి ఉండేందుకు నేను లగ్జెంబర్గ్‌కి వెళ్లాను.
1954 ఫిబ్రవరిలో, నేను ఆ దేశంలో ఉండటం ఆ దేశానికి ప్రమాదకరమైనదనే తీర్పును బెల్జియం కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఉన్నతపర్చింది. నేను బెల్జియంకు వచ్చినప్పటి నుండీ దేశంలో సాక్షుల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయిందనీ, అంటే 1946లో 804 ఉన్నది 1953కల్లా 3,304కు పెరిగిందనీ అనేకమంది యౌవన సాక్షులు క్రైస్తవ తటస్థత విషయంలో గట్టి తీర్మానం తీసుకుంటున్నారు గనుక దాని ఫలితంగా బెల్జియం యొక్క భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే రుజువులను వారు అందించారు. అలా, నన్నూ, ఈమీలీయను స్విట్జర్లాండ్‌కు నియమించారు, అక్కడ ఫ్రెంచి మాట్లాడే ప్రాంతంలో మేము సర్క్యూట్ పనిలో సేవ చేశాము.
క్రైస్తవ పెద్దలకు విస్తృత తర్ఫీదునిచ్చేందుకై ఏర్పాటు చేయబడిన రాజ్య పరిచర్య పాఠశాల న్యూయార్క్ నందలి సౌత్ లాన్‌సింగ్ నందు 1959లో స్థాపించబడింది. యూరప్‌లో ఈ పాఠశాల యొక్క తరగతులలో బోధించేందుకు తర్ఫీదు తీసుకోవడానికి నన్ను ఆహ్వానించారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు, మిస్సోరీలోని సెయింట్ జోసెఫ్‌లో ఉన్న నా కుటుంబాన్ని నేను దర్శించాను. నేను అక్కడ నా ప్రియమైన తల్లిని చివరిసారి చూశాను. ఆమె 1962 జనవరిలో మరణించింది; 1955 జూన్‌లో నాన్నగారు చనిపోయారు.
1961 మార్చిలో ఫ్రాన్స్‌నందలి పారిస్‌లో రాజ్య పరిచర్య పాఠశాల ప్రారంభమైంది, ఈమీలీయ నాతోపాటూ వచ్చింది. జిల్లా పైవిచారణ కర్తలు, సర్క్యూట్ పైవిచారణ కర్తలు, సంఘ పైవిచారణ కర్తలు, అలాగే ప్రత్యేక పయినీర్‌లు ఫ్రాన్స్, బెల్జియం మరియు స్విట్జర్లాండ్‌ల నుండి వచ్చారు. తర్వాతి 14 నెలల్లో, నాలుగు వారాల కోర్సు ఉండే ఈ తరగతి యొక్క 12 తరగతులను నేను నిర్వహించాను. తుదకు, 1962 ఏప్రిల్‌లో ఈమీలీయ గర్భవతి అనే విషయం మాకు తెలిసింది.
పరిస్థితులకు సర్దుకుపోవడం
మాకు శాశ్వత నివాస అనుమతి ఉన్న స్విట్జర్లాండ్ నందలి జెనీవాకు మేము తిరిగి వచ్చాము. అయితే, అక్కడ ఇళ్ల కొరత తీవ్రంగా ఉన్నందున నివసించేందుకు ఒక స్థలాన్ని కనుగొనడం అంత సులభం కాలేదు. ఉద్యోగం సంపాదించడం కూడా అంత సులభంగా లేదు. తుదకు జెనీవా మధ్యభాగంలోని ఒక పెద్ద డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో నాకు ఉద్యోగం లభించింది.
నేను పూర్తికాల పరిచర్యలో 26 సంవత్సరాలు గడిపాను, కాబట్టి మారిన పరిస్థితులకు అలవాటు పడటానికి నాకు చాలా సవరణలు అవసరమయ్యాయి. నేను డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో పని చేసిన మరియు మా ఇద్దరు కుమార్తెలైన లూయీ, యూనిస్‌లను పెంచడంలో సహాయపడిన ఆ 22 సంవత్సరాల్లో కూడా, మా కుటుంబం ఎల్లప్పుడూ రాజ్యాసక్తులను ముందుంచింది. (మత్తయి 6:33) 1985లో నేను ఉద్యోగ విరమణ పొందిన తర్వాత, నేను సబ్‌స్టిట్యూట్ సర్క్యూట్ పైవిచారణ కర్తగా సేవ చేయడం ప్రారంభించాను.
ఈమీలీయ ఆరోగ్యం అంత బాగా లేదు, అయినప్పటికీ ఆమె పరిచర్యలో తనకు వీలైనదంతా చేస్తుంది. లూయిస్ దాదాపు పది సంవత్సరాలు పయినీరుగా సేవ చేసింది. 1993 వేసవి సమయంలో మాస్కోలో జరిగిన ఎంతో అద్భుతమైన అంతర్జాతీయ సమావేశాన్ని ఆమెతో పాటూ ఆనందించడం చిరస్మరణీయమైన ఆధ్యాత్మిక సందర్భంగా ఉండినది! దాని తర్వాత కొంతకాలానికి, ఆఫ్రికా నందలి సెనెగల్‌కు సెలవులలో వెళ్లినప్పుడు మహాసముద్రంలో ఈత కొడుతూ లూయిస్ తన ప్రాణం కోల్పోయింది. భూస్థాపన విషయంలో శ్రద్ధ వహించేందుకు నేను సెనెగల్‌కు ప్రయాణించి వెళ్లినప్పుడు మన ఆఫ్రికా సహోదరులూ మిషనరీలూ చూపించిన ప్రేమ మరియు దయ నాకెంతో గొప్ప ఆదరణనిచ్చాయి. పునరుత్థానమందు లూయీని చూసేందుకు నేనెంతో పరితపిస్తున్నాను!—యోహాను 5:28, 29.
ప్రేమ పూర్వక సహవాసి యొక్క యథార్థమైన మద్దతును నాలుగు కంటే ఎక్కువ దశాబ్దాలుగా ఆనందించగలిగినందుకు నేను కృతజ్ఞుడను. వాస్తవానికి, నేను కష్టాలనూ వ్యథలనూ అనుభవించినప్పటికీ, యెహోవా కృప మధురంగా ఉండినది అది జీవితాన్ని జీవించ యోగ్యం చేసింది. “నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును” అని కీర్తనల గ్రంథకర్త చెప్పిన మాటల్లో మన దేవుడైన యెహోవాను గురించి ప్రకటించేందుకు నా హృదయం కదిలింపబడింది.—కీర్తన 63:3.
[26వ పేజీలోని చిత్రం]
మేము ఫోనోగ్రాఫ్‌తో ప్రకటనాపనిని విస్తృతం చేశాము
[26వ పేజీలోని చిత్రం]
1936లో నా తలిదండ్రులు
[26వ పేజీలోని చిత్రం]
1948లో బెల్జియంలో వీధి సాక్ష్యమివ్వడం