జీవం కొరకైన పరుగు పందేన్ని విడిచిపెట్టకండి!
“మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”—హెబ్రీయులు 12:1.
1, 2. ఈ అంత్యదినాల్లో ఉద్వేగభరితమైన ఏ సంఘటనలు యెహోవా సేవకుల్ని పులకరింపచేశాయి?
మనం ఉద్వేగభరితమైన, సంక్లిష్టమైన కాలాల్లో జీవిస్తున్నాం. 80 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రిందట, 1914లో దేవుని పరలోక రాజ్యానికి రాజుగా యేసు సింహాసనాసీనుడయ్యాడు. ‘ప్రభువు దినమూ’ దానితోపాటూ ఈ విధానపు ‘అంత్యకాలమూ’ ఆరంభమయ్యాయి. (ప్రకటన 1:10; దానియేలు 12:9) అప్పటినుండీ, జీవం కొరకైన క్రైస్తవుని పరుగు పందెం మరింత ఆవశ్యకమైనదయ్యింది. యెహోవా సంకల్పాల్ని నెరవేర్చడానికి నిరాటంకంగా కదులుతున్న యెహోవా పరలోక రథమైన ఆయన పరలోకసంస్థతో ముందుకు సాగేందుకు దేవుని సేవకులు తీవ్రంగా కృషిచేస్తున్నారు.—యెహెజ్కేలు 1:4-28; 1 కొరింథీయులు 9:24.
2 పరుగు పందెంలో దేవుని ప్రజలు నిత్యజీవం వైపు ‘పరిగెడుతుండగా’, వాళ్లు ఆనందాన్ని కనుగొన్నారా? అవును, నిశ్చయంగా కనుగొన్నారు! యేసు సహోదరుల్లో శేషించినవాళ్లు సమకూడడాన్ని చూసి వాళ్లు పులకించిపోయారు, 1,44,000 మందిలో శేషించినవారి చివరి ముద్ర ముగింపుకు వస్తోందని గ్రహించి వాళ్లు ఆనందించారు. (ప్రకటన 7:3, 4) అంతేగాక, “భూమి పైరు”ను కోయడానికి యెహోవా నియమిత రాజు తన కొడవలిని బలంగా విసిరాడనే విషయాన్ని గ్రహించడంలో వాళ్లు ఉత్తేజితులయ్యారు. (ప్రకటన 14:15, 16) మరి అదెంత గొప్ప కోతనో కదా! (మత్తయి 9:37) ఇంతవరకూ, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి[న], యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము”లో 50 లక్షలకన్నా ఎక్కువమంది సమకూడారు. (ప్రకటన 7:9) ఆ సమూహాన్ని ఎవడూ లెక్కింపజాలడు గనుక చివరకు అదెంత గొప్పసమూహమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు.
3. ఎలాంటి ఆటంకాలున్నా, మనం ఆనందభరితమైన స్ఫూర్తిని అలవర్చుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి?
3 నిజమే, పరుగు పందెంలో మనం వేగాన్ని పెంచుతుండగా సాతాను మనం తొట్రుపడేలా చేయడానికి లేదా మన వేగాన్ని తగ్గించివేసేందుకు ప్రయత్నిస్తాడు. (ప్రకటన 12:17) అంత్యకాలాన్ని గుర్తించే యుద్ధాలూ, కరువులూ, తెగుళ్లూ, మరితర కష్టాలూ ఉన్నప్పటికీ పరుగెడుతూనే ఉండడం అంత సులభమైన విషయమేమీ కాదు. (మత్తయి 24:3-9; లూకా 21:11; 2 తిమోతి 3:1-5) అయినప్పటికీ, పరుగు పందెం ముగింపు సమీపిస్తుండగా మన హృదయాలు ఆనందంతో గంతులు వేస్తాయి. “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి” అని తన కాలంలోని తోటి క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఉద్బోధించిన స్ఫూర్తిని ప్రతిబింబించడానికి మనం కృషి చేస్తాం.—ఫిలిప్పీయులు 4:4.
4. ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులు ఏ స్ఫూర్తిని చూపించారు?
4 ఆ మాటల్ని పౌలు ఎవరికైతే సంబోధించాడో ఆ క్రైస్తవులు తమ విశ్వాసమందు ఆనందాన్ని కనుగొన్నారనడంలో సందేహమేమీ లేదు, ఎందుకంటే వారికి పౌలు ఇలా చెప్పాడు: “ప్రభువునందు ఆనందించుడి [“ఆనందిస్తూ ఉండండి,” NW].” (ఫిలిప్పీయులు 3:1) ఫిలిప్పీయుల సంఘం ఉత్సాహంతోనూ, ఆసక్తితోనూ సేవచేసిన ఔదార్య, ప్రేమలుగల సంఘం. (ఫిలిప్పీయులు 1:3-5; 4:10, 14-20) అయితే మొదటి శతాబ్దంలోని క్రైస్తవులందరిలోనూ అలాంటి స్ఫూర్తిలేదు. ఉదాహరణకు, హెబ్రీయులు పుస్తకాన్ని పౌలు ఎవరికైతే రాశాడో ఆ యూదా క్రైస్తవుల్లో కొందరు చింతకు కారణమయ్యారు.
“విశేష జాగ్రత్త కల్గివుండవలెను”
5. (ఎ) మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఏర్పడినప్పుడు హెబ్రీ క్రైస్తవులు ఏ స్ఫూర్తిని కల్గివున్నారు? (బి) సా.శ. 60 దరిదాపుల్లో ఉన్న కొంతమంది హెబ్రీ క్రైస్తవులకున్న స్ఫూర్తిని వర్ణించండి.
5 ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి క్రైస్తవ సంఘం సహజ యూదులతోనూ, యూదామత ప్రవిష్ఠులతోనూ రూపొందించబడింది, సా.శ. 33లో అది యెరూషలేములో స్థాపించబడింది. అదెటువంటి స్ఫూర్తిని కల్గివుండేది? దాని ఉత్సాహానందాల్ని గూర్చి తెలుసుకోవడానికి అపొస్తలుల కార్యములు పుస్తకంలోని మొదటి అధ్యాయాల్ని చదివాల్సిందే. (అపొస్తలుల కార్యములు 2:44-47; 4:32-34; 5:41; 6:7) అయితే, దశాబ్దాలు గడుస్తుండగా, పరిస్థితులు మారిపోయాయి, జీవం కొరకైన పరుగు పందెంలో అనేకమంది యూదా క్రైస్తవులు వెనుకబడిపోయారు. దాదాపు సా.శ. 60లో ఉన్న వారి పరిస్థితిని గురించి ఒక రిఫరెన్సు గ్రంథమిలా చెబుతోంది: “అది ఉదాసీనతతోనూ, అలసటతోనూ కూడివున్న, నెరవేరని ఉత్తరాపేక్షలను గూర్చిన, సఫలంకాని నిరీక్షణలను గూర్చిన, ఉద్దేశపూర్వక వైఫల్యాలను గూర్చిన, ఆచరణ సంబంధమైన అవిశ్వాసాన్ని గూర్చిన ఒక పరిస్థితి. వాళ్లు క్రైస్తవులే అయినా తమ పిలుపును గూర్చిన మహిమ విషయంలో వారికి అంతంత మాత్రపు మెప్పుదలే ఉంది.” అభిషిక్త క్రైస్తవులు అలా ఎలా కాగలిగారు? (దాదాపు సా.శ. 61లో) హెబ్రీయులకు పౌలు రాసిన పత్రికలోని కొన్ని భాగాల్ని పరిశీలించడం, ఈ ప్రశ్నకు జవాబును పొందేందుకు మనకు సహాయపడుతుంది. అదే విధమైన బలహీన ఆధ్యాత్మిక స్థితిలోనికి జారిపోకుండా జాగ్రత్తపడేందుకు అలాంటి పరిశీలన నేడు మనందరికీ సహాయపడుతుంది.
6. మోషే ధర్మశాస్త్రం క్రింద ఉండి ఆరాధించడానికీ, యేసుక్రీస్తునందలి విశ్వాసం ఆధారంగా ఆరాధించడానికీ మధ్యనున్న కొన్ని వ్యత్యాసాలు ఏవి?
6 మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తున్నామని చెప్పుకునే ఒక విధానమైన యూదామతం నుండి హెబ్రీ క్రైస్తవులు బయటికి వచ్చారు. బహుశా అనేక శతాబ్దాలుగా యెహోవాను సమీపించడానికున్న ఏకైక మార్గంగా ఆ ధర్మశాస్త్రం ఉన్నందునా, మరి అది యాజకత్వంతోనూ, క్రమంగా అర్పించే బలులతోనూ, యెరూషలేములోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయంతోనూ ఒక ఆకర్షణీయమైన ఆరాధనా విధానంగా ఉన్నందునా అది అనేకమంది యూదా క్రైస్తవుల విషయంలో ఒక ఆకర్షణగా పనిచేయడంలో కొనసాగినట్లు అనిపిస్తుంది. క్రైస్తవత్వం దానికి భిన్నమైంది. “ప్రతిఫలముగా కలుగబోవు [భవిష్య] బహుమానమందు దృష్టి”ని ఉంచి, “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై[న]” మోషేకున్న ఆధ్యాత్మిక దృక్పథాన్ని పోలినదాన్నే ఇదీ కోరుతోంది. (హెబ్రీయులు 11:24-27) అనేకమంది యూదా క్రైస్తవుల్లో అలాంటి ఆధ్యాత్మిక దృక్పథం కొరవడింది. ఉద్దేశపూర్వకంగానే పరిగెట్టడానికి బదులుగా వాళ్లు పరుగు పందెంలో తొట్రుపడుతూ ఉండేవారు.
7. జీవం కొరకైన పరుగు పందెంలో మనం పరిగెట్టే పద్ధతిని ఈ విధానం అంటే మనం బయటికి వచ్చిన ఈ విధానం ఎలా ప్రభావితం చేస్తుంది?
7 నేడు కూడా అలాంటి పరిస్థితే ఉందా? పరిస్థితులు కచ్చితంగా అలానే లేవనే విషయాన్ని త్రోసిపుచ్చలేం. అయినప్పటికీ, స్వాతిశయ విధానం నుండి క్రైస్తవులు బయటకు రావాలి. లోకం ఉత్తేజపరిచే అవకాశాల్ని ఇస్తుంది, అదే సమయంలో ప్రజలపై పెనుభారాల్ని అది మోపుతోంది. అంతేగాక, సంశయాత్మక వైఖరి సర్వసాధారణమైపోయిన దేశాల్లో, విషయాల ఎడల స్వార్థాన్నీ, నేనే ముందు అనే అభిప్రాయాన్నీ కల్గివున్న ప్రజలుగల దేశాల్లో మనలో అనేకులం జీవిస్తున్నాం. మనల్ని ప్రభావితం చేయడానికి అలాంటి విధానాన్ని మనం అనుమతిస్తే, మన “మనోనేత్రములు” సులభంగా మసకబారిపోవొచ్చు. (ఎఫెసీయులు 1:17) మనం ఎక్కడకి పరిగెడుతున్నామో స్పష్టంగా గ్రహించలేకపోతే, జీవం కొరకైన పరుగు పందెంలో మనం బాగా ఎలా పరిగెత్తగలం?
8. ధర్మశాస్త్రం క్రింద ఆరాధించడంకన్నా క్రైస్తవత్వాన్ని ఉన్నతమైనదిగా చేసే కొన్ని విషయాలేవి?
8 యూదా క్రైస్తవుల్ని ప్రోత్సహించేందుకు, మోషే ధర్మశాస్త్రంకన్నా క్రైస్తవ విధానానికి ఉన్న ఉన్నతత్వాన్ని గురించి పౌలు వారికి జ్ఞాపకం చేశాడు. నిజమే, ఆ ధర్మశాస్త్రం క్రింద శరీరసంబంధ ఇశ్రాయేలు జనాంగం యెహోవా ప్రజగా రూపొందించబడ్డప్పుడు, తన ప్రవక్తల ద్వారా యెహోవా వారితో మాట్లాడాడు. కానీ నేడు ఆయన “కుమారుని ద్వారా” మాటలాడుతున్నాడు, “ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయనద్వారా ప్రపంచములను నిర్మించెను” అని పౌలు చెబుతున్నాడు. (హెబ్రీయులు 1:2) అంతేగాక, దావీదు వంశావళి నుండి వచ్చిన తన ‘తోడివారైన’ రాజులందరికన్నా యేసు మహోన్నతుడు. ఆయన దేవదూతలకంటె కూడా ఉన్నతుడు.—హెబ్రీయులు 1:5, 6, 9.
9. పౌలు కాలంలోని యూదా క్రైస్తవులవలే, యెహోవా చెబుతున్న వాటిపై మనం ‘మరి విశేష జాగ్రత్త నిలపాల్సిన’ అవసరం ఎందుకుంది?
9 కాబట్టి, పౌలు యూదా క్రైస్తవులకు ఇలా సలహా ఇచ్చాడు: “మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.” (హెబ్రీయులు 2:1) క్రీస్తును గూర్చి తెలుసుకోవడమనేది ఓ అద్భుతమైన ఆశీర్వాదమైనా, మరింత అవసరమైవుంది. తమ చుట్టూ ఉన్న యూదా ప్రపంచ ప్రభావాన్ని నిష్ఫలం చేయడానికి వారు దేవుని వాక్యంపై మరింత అవధానాన్ని నిలపాల్సిన అవసరముంది. ఈ లోకం నుండి అదే పనిగా వస్తున్న ప్రచారానికి మనం గురౌతున్న దృష్ట్యా, యెహోవా చెబుతున్న వాటిపై ‘మరి విశేష జాగ్రత్త నిలపాల్సిన’ అవసరం మనకు కూడా ఉంది. మంచి పఠన అలవాట్లను వృద్ధిచేసుకోవడమూ, వేసుకున్న షెడ్యూలు ప్రకారంగా బైబిల్ని చదవడమూ అని దాని భావం. హెబ్రీయులకు రాసిన తన పత్రికలో అటు తర్వాత పౌలు చెబుతున్నట్లుగా, కూటాలకు క్రమంగా హాజరవ్వడమూ, ఇతరులకు మన విశ్వాసాన్ని గురించి ప్రకటించడమూ అని కూడా దీని భావమైవుంది. (హెబ్రీయులు 10:23-25) మన దివ్యమైన నిరీక్షణను గూర్చిన దృష్టిని మనం కోల్పోకుండా ఉండేలా ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండేందుకు అలాంటి కార్యశీలత మనకు సహాయపడుతుంది. యెహోవా ఆలోచనలతో మన మనస్సుల్ని నింపుకుంటే, మనల్ని కృంగదీయడానికో లేదా సంయమనం కోల్పోయేలా చేయడానికో ఈ లోకం మనకు చేయగల వేటి మూలంగానూ మనం కృంగిపోం లేక సంయమనం కోల్పోం.—కీర్తన 1:1-3; సామెతలు 3:1-6.
“ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి”
10. (ఎ) యెహోవా వాక్యంపై మరి విశేష జాగ్రత్త నిలపనివారికి ఏమి సంభవించగలదు? (బి) మనం ‘ఒకనికొకడు’ ఎలా ‘బుద్ధి చెప్పుకోగలం’?
10 ఆధ్యాత్మిక విషయాల ఎడల మనం మరింత అవధానాన్ని ఉంచకపోతే, దేవుని వాగ్దానాలు మరీ అవాస్తవికమైనవిగా కన్పించనారంభించవచ్చు. సంఘాలు పూర్తిగా అభిషిక్త క్రైస్తవులతో రూపొందించబడి, అపొస్తలుల్లో కొందరు ఇంకా సజీవులుగా ఉన్న మొదటి శతాబ్దంలోనే ఇది సంభవించింది. పౌలు హెబ్రీయుల్ని ఇలా హెచ్చరించాడు: “సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. . . . పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు—నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.” (హెబ్రీయులు 3:12-13) “జాగ్రత్త” అని పౌలు ఉపయోగించిన పదం, మెలకువగా ఉండాల్సిన అవసరతను నొక్కిచెబుతోంది. అపాయం ముంచుకురాబోతోంది! విశ్వాసలేమి అంటే “పాపము” మన హృదయాల్లో పెరగవచ్చు, మరి మనం దేవుని దగ్గరకు రావడానికి బదులుగా ఆయనకు దూరమైపోగలం. (యాకోబు 4:8) “ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి” అని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదర సహవాస ఉత్తేజం మనకు అవసరం. “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.” (సామెతలు 18:1) అలాంటి సహవాసం కొరకైన అవసరత సంఘ కూటాలకూ, సమావేశాలకూ, సభలకూ క్రమంగా హాజరయ్యేలా నేడు క్రైస్తవుల్ని ప్రేరేపిస్తుంది.
11, 12. కేవలం క్రైస్తవ మూలోపదేశాల్ని తెలుసుకోవడంతోనే మనమెందుకు తృప్తిపడకూడదు?
11 తర్వాత తన పత్రికలో, పౌలు ఈ అమూల్యమైన సలహాను ఇస్తున్నాడు: “కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు. . . . వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీయులు 5:12-14) స్పష్టంగా, యూదా క్రైస్తవుల్లో కొందరు తమ అవగాహనను విస్తృతపర్చుకోవడంలో విఫలులయ్యారు. ధర్మశాస్త్రాన్ని గూర్చిన, సున్నతిని గూర్చిన వృద్ధియైన వెలుగును అంగీకరించడంలో వాళ్లు మందగించిపోయారు. (అపొస్తలుల కార్యములు 15:27-29; గలతీయులు 2:11-14; 6:12, 13) వారపు విశ్రాంతిదినమూ, వార్షిక పాపప్రాయశ్చిత్తార్థ బలి దినమూ వంటి పారంపర్యాచారాల్ని ఇంకా విలువైనవిగానే కొందరు పరిగణించి ఉండవచ్చు.—కొలొస్సయులు 2:16, 17; హెబ్రీయులు 9:1-14.
12 అందుకే, పౌలు ఇలా చెబుతున్నాడు: “క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.” (హెబ్రీయులు 6:1) తాను తీసుకునే ఆహారంపై మరింత అవధానాన్ని నిలిపే మారథాన్ రన్నర్ సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పరుగు పందెంలో బాగా నిలదొక్కుకోగల్గుతాడు. అదే విధంగా, ప్రాథమిక ‘మూలోపదేశాలకే’ తనను తాను పరిమితంచేసుకోక ఆధ్యాత్మిక పౌష్టికాహారాన్ని తీసుకోవడంపై మరింత అవధానాన్ని నిలిపే క్రైస్తవుడు పరుగు పందెంలో బాగా నిలదొక్కుకొని దాన్ని పూర్తి చేయగల్గుతాడు. (2 తిమోతి 4:7 పోల్చండి.) సత్యం యొక్క “వెడల్పు పొడుగు లోతు ఎత్తు”లను తెలుసుకోవడంలో ఆసక్తిని పెంపొందించుకోవాలని దీని భావం, ఆ విధంగా సంపూర్ణులమగుటకు సాగిపోదాం.—ఎఫెసీయులు 3:15-18.
“మీకు ఓరిమి అవసరమై యున్నది”
13. గత కాలాల్లో హెబ్రీ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఎలా చూపించారు?
13 సా.శ. 33 పెంతెకొస్తు తదనంతర కాలంలో, భయంకరమైన వ్యతిరేకతవున్నా యూదా క్రైస్తవులు స్థిరంగా నిలబడ్డారు. (అపొస్తలుల కార్యములు 8:1) పౌలు ఇలా రాసినప్పుడు బహుశా ఆయన మనస్సులో ఇది ఉండివుండవొచ్చు: “అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.” (హెబ్రీయులు 10:32) విశ్వాససహితమైన అలాంటి సహనం దేవుని ఎడల వారికిగల ప్రేమను చూపించి, ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యాన్నిచ్చింది. (1 యోహాను 4:17) విశ్వాసలేమిని బట్టి దాన్ని త్రోసిపుచ్చవద్దని పౌలు వారికి ఉపదేశిస్తున్నాడు. ఆయనిలా ఉద్బోధిస్తున్నాడు: “మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.—ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.”—హెబ్రీయులు 10:35-37.
14. అనేక సంవత్సరాలుగా యెహోవాకు సేవచేసిన తర్వాత కూడా సహించుకోవడానికి ఏ వాస్తవాలు మనకు సహాయపడాలి?
14 మరి నేడు మన సంగతేమిటి? క్రైస్తవ సత్యాన్ని మొదట నేర్చుకున్నప్పుడు మనలో అనేకులం ఆసక్తిపరులం. మనలో ఆ ఆసక్తి ఇంకావుందా? లేక ‘మొదట మనలో ఉన్న ప్రేమను మనం వదిలిపెట్టామా’? (ప్రకటన 2:4) బహుశా ఎంతోకొంత నిరాశకు లోనై లేక అర్మగిద్దోనుకోసం కనిపెట్టడంలో అలసిపోయి మనం చల్లబడిపోయామా? అయితే, కొంచెం ఆగి, ఆలోచించండి. సత్యానికి ఇంతకుముందున్న ప్రభావమేమీ తగ్గిపోలేదు. యేసు ఇంకా మన పరలోకపు రాజే. పరదైసు భూమిపై నిత్యజీవాన్ని మనమింకా నిరీక్షిస్తున్నాం, యెహోవాతో మన బాంధవ్యాన్నింకా కొనసాగిస్తూనే ఉన్నాం. “వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును” అనే విషయాన్ని ఎన్నటికీ మర్చిపోకండి.
15. యేసువలే, కొంతమంది క్రైస్తవులు తీవ్రమైన హింసను ఎలా సహించుకున్నారు?
15 అందుకే, హెబ్రీయులు 12:1, 2లో రాయబడిన పౌలు మాటలు మరింత తగినవై ఉన్నాయి: “మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును [విశ్వాసలేమిని] విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” ఈ అంత్యదినాల్లో దేవుని సేవకులు సహించినవి అనేకం ఉన్నాయి. వేదనభరితమైన మరణాన్ని పొందేంతవరకూ నమ్మకంగా ఉన్న యేసువలే, మన సహోదర సహోదరీల్లో కొందరు క్రూరమైన హింసల్ని అంటే ఖైదీ శిబిరాల్లో వేయబడడం, వేధించబడడం, అత్యాచారానికి గురికావడం, మరణానికి గురికావడం వంటి హింసల్ని నమ్మకంగా సహించారు. (1 పేతురు 2:21) మనం వారి యథార్థతను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, వారి ఎడల ప్రేమతో మన హృదయాలు ఉప్పొంగడం లేదా?
16, 17. (ఎ) తమ విశ్వాసానికి ఎదురైన ఏ సవాళ్లతో అనేకమంది క్రైస్తవులు పోరాడాల్సివచ్చింది? (బి) దేన్ని జ్ఞాపకం ఉంచుకోవడం జీవం కొరకైన పరుగు పందెంలో పరిగెడుతూనే ఉండడానికి మనకు సహాయపడుతుంది?
16 అయితే, పౌలు తర్వాత చెప్పిన ఈ మాటలు అనేకమందికి అన్వయిస్తాయి: “మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.” (హెబ్రీయులు 12:4) అయినప్పటికీ, ఈ విధానంలో సత్యమార్గమనేది మనలో ఎవరికైనా సరే అంత సులభమైనదేమీ కాదు. ఎగతాళిని తాళుకుంటూ లేక పాపం చేయాలనే ఒత్తిడిని నిరోధిస్తూ, ఉద్యోగ స్థలాల్లోనో, పాఠశాలల్లోనో ‘పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసే తిరస్కారం’ మూలంగా కొందరు నిరుత్సాహానికి గురయ్యారు. (హెబ్రీయులు 12:3) దేవుని ఉన్నత ప్రమాణాల్ని అనుసరించాలనే కొందరి కృతనిశ్చయాన్ని బలిష్టమైన శోధన తుడిచివేసింది. (హెబ్రీయులు 13:4, 5) మత భ్రష్టులు, తమ విషపూరిత ప్రచారాన్ని విన్న కొద్దిమంది వ్యక్తుల ఆధ్యాత్మిక సంయమనాన్నీ ప్రభావితం చేశారు. (హెబ్రీయులు 13:9) వ్యక్తిత్వ విభేదాలు ఇతరుల ఆనందాన్ని దోచుకున్నాయి. వినోదానికీ, తీరికవేళ కార్యకలాపాలకూ ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, కొంతమంది క్రైస్తవులను బలహీనుల్ని చేసింది. ఈ విధానంలో జీవించడం మూలంగా వచ్చే సమస్యలనుబట్టి అనేకులు ఒత్తిడికి గురైనట్టు భావిస్తున్నారు.
17 నిజమే, ఈ పరిస్థితుల్లో ఏదీ ‘రక్తము కారునంతగా నిరోధించేలా’ రూపుదాల్చలేదు. కొన్ని పరిస్థితులు మనకుగా మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలవల్ల ఏర్పడవచ్చు. కానీ అవన్నీ మన విశ్వాసానికి ఓ సవాలుగా నిలబడతాయి. అందుకే సహించడం విషయంలో యేసు చూపించిన మహోన్నత మాదిరిపై మన దృష్టిని నిలపాలి. మన నిరీక్షణ ఎంత అద్భుతమైనదో మనమెన్నడూ మర్చిపోకూడదు. యెహోవా “తన్ను [నిండు హృదయంతో] వెదకువారికి ఫలము దయచేయు” వాడనే మన ఒప్పుదలను మనమెన్నటికీ కోల్పోకూడదు. (హెబ్రీయులు 11:6) అప్పుడు, జీవం కొరకైన పరుగు పందెంలో పరిగెడుతూ ఉండేందుకు కావాల్సిన ఆధ్యాత్మిక బలాన్ని మనం కల్గివుంటాం.
మనం సహించగలం
18, 19. యెరూషలేములో ఉన్న హెబ్రీ క్రైస్తవులు పౌలు ప్రేరేపిత సలహాను లక్ష్యపెట్టారని ఏ చారిత్రాత్మక సంఘటనలు సూచిస్తున్నాయి?
18 పౌలు రాసిన పత్రికకు యూదా క్రైస్తవులు ఎలా ప్రతిస్పందించారు? ఈ పత్రిక హెబ్రీయులకు రాయబడిన దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత, యూదయ ప్రాంతం యుద్ధదాడికి గురైంది. “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి” అని యేసు చెప్పిన మాటల్ని నెరవేర్చుతూ, రోమా సైన్యం సా.శ. 66లో యెరూషలేమును చుట్టుముట్టింది. (లూకా 21:20) అయితే, ఆ కాలంలో యెరూషలేములో ఉండే క్రైస్తవుల ప్రయోజనార్థమై యేసు ఇలా చెప్పాడు: “అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.” (లూకా 21:21) అందుకే, రోమ్తో జరిగిన ఆ యుద్ధం ఒక పరీక్షను ముందుంచింది: యూదుల ఆరాధనకు కేంద్రస్థానమూ, దివ్యమైన దేవాలయమున్న ప్రాంతమూ అయిన యెరూషలేమును ఆ యూదా క్రైస్తవులు విడిచిపెడతారా?
19 అకస్మికంగా, కారణమేంటో తెలియకుండా, రోమా సైన్యం వెనక్కి వెళ్లిపోయింది. బహుశా, మతాభిమానులైన యూదులు తమ పవిత్ర నగరాన్ని దేవుడు కాపాడుతున్నాడనడానికి రుజువుగా దీన్ని దృష్టించి ఉండొచ్చు. మరి క్రైస్తవుల విషయమేమిటి? వాళ్లు విడిచిపెట్టి పారిపోయారని చరిత్ర మనకు చెబుతోంది. తర్వాత, సా.శ. 70లో రోమన్లు వెనక్కి వచ్చి, ఘోరమైన ప్రాణనష్టాన్ని కల్గిస్తూ యెరూషలేమును పూర్తిగా నాశనంచేశారు. యోవేలు ప్రవచించిన ‘యెహోవా దినము’ యెరూషలేముపైకి వచ్చింది. అయితే, విశ్వాసులైన క్రైస్తవులు అక్కడ లేరు. వాళ్లు ‘రక్షించబడ్డారు.’—యోవేలు 2:30-32; అపొస్తలుల కార్యములు 2:16-21.
20. ‘యెహోవా యొక్క మహాదినము’ సమీపిస్తుందని తెలుసుకోవడం మనల్ని ఏయే రీతుల్లో ప్రేరేపించాలి?
20 ‘యెహోవా యొక్క మరొక మహాదినము,’ ఈ విధానమంతటినీ త్వరలోనే ప్రభావితం చేస్తుందనే విషయం నేడు మనకు తెలుసు. (యోవేలు 3:12-14) ఆ దినం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. అయితే, అది తప్పక వస్తుందనే అభయాన్ని దేవుని వాక్యం మనకు ఇస్తోంది! అది ఆలస్యంకాదని యెహోవా చెబుతున్నాడు. (హబక్కూకు 2:3; 2 పేతురు 3:9, 10) అందుకే, మనం ‘విన్న సంగతులయందు మరి విశేష జాగ్రత్త’ నిలుపుదాం. “సులువుగా చిక్కులబెట్టు పాపము” అయిన విశ్వాసలేమిని విడనాడదాం. ఎంతకాలం పడితే అంతకాలం వరకూ సహించుకోవడానికి నిశ్చయించుకోండి. గుర్తుంచుకోండి, యెహోవా దేవుని దివ్యమైన రథంలాంటి పరలోక సంస్థ ముందుకు కదులుతూనే ఉంది. అది దాని సంకల్పాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి మనమంతా జీవం కొరకైన పరుగు పందెంలో విడిచిపెట్టకుండా పరిగెడుతూనే ఉందాం!
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ ఫిలిప్పీయులకు పౌలు ఇచ్చిన ఏ ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం, జీవం కొరకైన పరుగు పందెంలో సహించుకోవడానికి మనకు సహాయపడుతుంది?
◻ మన అవధానాన్ని మళ్లించేందుకైన ఇహలోకపు ఉద్దేశాన్ని ప్రతిఘటించేందుకు మనకు ఏది సహాయపడుతుంది?
◻ పరుగు పందెంలో సహించుకునేందుకు మనం ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోగలం?
◻ ఒక క్రైస్తవున్ని చల్లబడిపోయేలా చేసే కొన్ని విషయాలు ఏవి?
◻ సహించుకునేందుకు యేసు మాదిరి మనకెలా సహాయపడగలదు?
[8, 9వ పేజీలోని చిత్రం]
రన్నర్స్వలే క్రైస్తవులు తమ అవధానాన్ని మళ్లించేందుకు దేన్నీ అనుమతించకూడదు
[10వ పేజీలోని చిత్రం]
యెహోవా సంకల్పాన్ని నెరవేర్చడాన్నుండి ఆయన పరలోకపు దివ్యమైన రథాన్ని ఏదీ ఆటంకపర్చలేదు