కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 1/1 పేజీలు 3-5
  • సత్యం జీవితాలను రూపాంతరమయ్యేలా చేస్తోంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్యం జీవితాలను రూపాంతరమయ్యేలా చేస్తోంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవితంలో ఓ సంకల్పం
  • ఒక క్రొత్త కుటుంబం
  • యౌవనంలో ఎదురైన దుఃఖం నుండి ఉపశమనం పొందడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • “నేనాయనకు కళ్లు, ఆయన నాకు కాళ్లు”
    తేజరిల్లు!—1992
  • బైబిలు జీవితాలను మారుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • ఒకప్పుడు గొడవలు, కొట్లాటలే నా ప్రపంచం
    బైబిలు జీవితాలను మారుస్తుంది
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 1/1 పేజీలు 3-5

సత్యం జీవితాలను రూపాంతరమయ్యేలా చేస్తోంది

నేడు అనేకమంది ప్రజల జీవితాలు దుర్భరంగానూ, సంక్లిష్టంగానూ ఉన్నాయన్నది విచారకరమైన విషయమే అయినా అది వాస్తవం. సంతోషాన్ని కనుగొనడం అలాంటి ప్రజలకు సాధ్యమవుతుందా? కొంతమంది వ్యక్తులు నేరగాళ్లు, వాళ్లు తమ తోటివ్యక్తులకు హానికల్గిస్తారు. వాళ్లు ఎన్నటికైనా సమాజంలో నిజాయితీగల సభ్యులుకాగలరా? ఈ రెండు ప్రశ్నలకు అవుననేదే జవాబు. ప్రజలు మారగలరు. జీవితాలు రూపాంతరం చెందగలవు. “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని అపొస్తలుడైన పౌలు రాసినప్పుడు అదెలా సాధ్యంకాగలదో ఆయన చూపించాడు.—రోమీయులు 12:2.

‘సంపూర్ణమైన దేవుని చిత్తము’ అనే ప్రస్తావన, పౌలు పై మాటల్ని రాయడానికి 20కన్నా ఎక్కువ సంవత్సరాల ముందు తన శిష్యులకు యేసు చెప్పిన విషయాన్ని జ్ఞప్తికి తేవొచ్చు. యేసు ఇలా చెప్పాడు: “[మీరు] సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయు[ను.]” (యోహాను 8:31, 32) “సత్యము” అంటే బైబిల్లో మన కొరకు భద్రపర్చబడిన దైవ ప్రేరేపిత సమాచారమనీ, మరి విశేషంగా దేవుని చిత్తాన్ని గూర్చిన సమాచారమనీ యేసు భావం. (యోహాను 17:17) బైబిలు సత్యం నిజంగా ప్రజల్ని స్వతంత్రుల్ని చేస్తుందా? దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం జీవితాలు నిజంగా రూపాంతరమయ్యేలా చేస్తోందా? నిశ్చయంగా అది చేస్తుంది. కొన్ని ఉదాహరణల్ని పరిశీలించండి.

జీవితంలో ఓ సంకల్పం

కొంతకాలం క్రిందట, జిబ్రాల్టర్‌లో మోయ్‌సెస్‌ అనే వ్యక్తి విచారంగా ఉండేవాడు. “నేనో త్రాగుబోతును, వీధుల్లో పడుకునేవాన్ని. నా జీవితం చిన్నాభిన్నమైపోయిందని తలంచాను. నాపై దయ చూపించమనీ, నాకింకొక రోజంటూ లేకుండా చేయమనీ ప్రతీరాత్రీ నేను దేవున్ని అడిగేవాన్ని. నేను పనికిమాలినవాన్నీ, పనీపాటా ఇల్లూ ఆసరా లేనివాన్నీ అయితే, ఎందుకీ లోకంలో ఉన్నానని దేవున్ని ప్రశ్నిస్తూ ఏడ్చేసేవాన్ని. నేనెందుకు బ్రతకాలి?” అని అతడు అంటున్నాడు. అప్పుడొక సంఘటన జరిగింది.

మోయ్‌సెస్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “రాబర్టో అనే ఒక యెహోవాసాక్షిని నేను కలుసుకున్నప్పుడు, దేవుడు నా ప్రార్థనను విన్నాడని నేను గ్రహించాను. రాబర్టో బైబిల్నీ, దేవుడు మీ నుండి ఏమి కోరుతున్నాడు? అనే బైబిలు పఠన సహాయక ప్రతినొకదాన్ని నాకిచ్చాడు.a నేను రాత్రుళ్లు పడుకునే బెంచిపై ప్రతిరోజూ మేమిద్దరమూ బైబిల్ని పఠించేవాళ్లం. ఓ నెలగడిచిన తర్వాత, రాబర్టో నన్ను యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరంలో జరిగే కూటానికి తీసుకెళ్లాడు. త్వరలోనే, బైబిలు సత్యం పూర్తిగా నా దృక్పథాన్ని మార్చేసింది. నేనిక వీధుల్లో పడుకోవడం, త్రాగడం లేక పొగత్రాగడం మానేశాను. నా జీవితం మారిపోయింది, నేను సంతోషంగా ఉన్నాను. నేను త్వరలోనే బాప్తిస్మం తీసుకొని ఆయన సాక్షుల్లో ఒకనిగా యెహోవా సేవచేయాలని ఆశిస్తున్నాను.”

ఎంతటి రూపాంతరమో కదా! ప్రజలకు నిరీక్షణలేకపోవడానికి కారణం, తరచూ వాళ్లకు జ్ఞానం కొదవుగా ఉండడమే. దేవుని గురించిగానీ లేక ఆయన అద్భుతమైన సంకల్పాల్ని గురించిగానీ వాళ్లకు తెలియదు. మోయ్‌సెస్‌ విషయంలో, ఆయన ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు, అది తన జీవనశైలిని మార్చుకోవడానికి ఆయనకు కావలసిన బలాన్ని ధైర్యాన్ని ఇచ్చింది. “నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును” అని కీర్తనల గ్రంథకర్త దేవునికి చేసిన ప్రార్థన మోయ్‌సెస్‌ విషయంలో జవాబైవుంది.—కీర్తన 43:3.

బెలీజ్‌లో డాన్యల్‌ ఇలాంటి అనుభవాన్నే కల్గివున్నాడు. డాన్యల్‌ వీధుల్లో పడుకునేవాడు కాదు—ఆయనకు గౌరవప్రదమైన ఉద్యోగముంది. కానీ 20 ఏళ్లుగా అతడు మాదకద్రవ్యాలకూ, మద్యపానానికీ బానిసైపోయాడు, దుర్నీతికరమైన జీవితాన్ని గడిపాడు. కాథొలిక్‌గా పెరిగినప్పటికీ, డాన్యల్‌ జీవితంలో ఏ విధమైన అర్థాన్నీ చూడలేకపోయాడు, మరి అతడు దేవుని ఉనికినే సందేహించాడు. సహాయాన్వేషణలో ఆయన వివిధ చర్చీలకు వెళ్లాడు కానీ చర్చికి వెళ్లే అనేకమంది అతని స్నేహితులూ, మరి పాదిరీలుగా ఉన్న కొంతమంది స్నేహితులూ మాదకద్రవ్యాలకూ లేదా అమిత మద్యపానానికీ బానిసలైనట్టు అతడు కనుగొన్నాడు. ఈలోగా, అతని భార్య అతనికి విడాకులివ్వడానికి సిద్ధమైంది.

నిరాశతో డాన్యల్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లో చేరాడు. తాను అక్కడనుండి వచ్చిన తర్వాత, తనకు సహాయం లభ్యంకాకపోతే తాను మరలా త్వరలోనే మాదకద్రవ్యాలకు బానిసగాక తప్పదని అతనికి తెలుసు. అయితే ఏ విధమైన సహాయం? రిహాబిలిటేషన్‌ సెంటర్నుండి బయటకు వచ్చిన రెండ్రోజుల తర్వాత, 1996 మే నెలలో, డాన్యల్‌ ఒక యెహోవాసాక్షి దగ్గరకు వెళ్లి, “దయచేసి నాతో బైబిలు పఠనం చేయండి” అనే విన్నపంతో ఆయన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. డాన్యల్‌తో వారానికి రెండుసార్లు బైబిలు పఠనం చేయడానికి ఆ సాక్షి ఏర్పాటు చేశాడు, డాన్యల్‌ త్వరలోనే తన జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మల్చుకోవడం ఆరంభించి, తన పాత స్నేహితులకు బదులుగా, మాదకద్రవ్యాలకూ లేదా మత్తుపానీయాలకూ బానిసలుకాని క్రైస్తవులతో స్నేహంచేశాడు. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అని బైబిలు చెబుతున్న విషయం వాస్తవమని డాన్యల్‌ ఆ విధంగా కనుగొన్నాడు (సామెతలు 13:20) త్వరలోనే ఆయన ఇలా చెప్పాడు: “పరిశుభ్రమైన మనస్సాక్షిని కల్గివుండడమంటే ఏమిటో నేను నా జీవితంలో మొట్టమొదటిసారి తెలుసుకున్నదిప్పుడే.” డాన్యల్‌ జీవితం కూడా రూపాంతరంచెందింది.

ప్యూర్టోరికోలో, మరొక వ్యక్తి గుర్తించదగిన రూపాంతరాన్ని పొందాడు. అతడు జైల్లో ఉన్నాడు, ఎంతోమందిని చంపినందున అపాయకరమైన వ్యక్తిగా దృష్టించబడ్డాడు. బైబిలు సత్యం అతన్ని మార్చగల్గిందా? అవును, ఒక యెహోవాసాక్షి అతనికి కావలికోట, తేజరిల్లు! పత్రికల కొన్ని ప్రతుల్ని ఇచ్చాడు, త్వరలోనే అతడు మరిన్ని కావాలని అడిగాడు. అతనితో బైబిలు పఠనం ప్రారంభమైంది. బైబిలు సత్యం అతని హృదయాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించగా, అతనిలో వస్తున్న మార్పులు అందరికీ స్పష్టంగా కన్పించాయి. అతనిలో వచ్చిన మార్పులకు మొదటి నిదర్శనం అతడు తన పొడవైన జుట్టును కురచగా క్షవరంచేయించుకొని, పిచ్చిపిచ్చిగా పెరిగిన గెడ్డాన్ని గీయించుకోవడమే.

నిజంగా పశ్చాత్తాపపడి, తమ జీవనశైలిని మార్చుకున్న పాపుల్ని దేవుడు క్షమిస్తాడని బైబిలు చెబుతోంది. పౌలు ఇలా రాశాడు: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? . . . మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, . . . మీరు కడుగబడితి[రి.]” (1 కొరింథీయులు 6:9, 11) నిస్సందేహంగా, “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని” అపొస్తలుల కార్యములు 24:14, 15 వచనాల్లో ఉన్న మాటలు ఓదార్చినట్లుగానే పై మాటలు ఆ వ్యక్తిని ఓదార్చాయి. అతడిలా అన్నాడు: “నా మూలంగా ప్రాణాల్ని కోల్పోయినవారిని నేను క్షమాపణను వేడుకోగల్గేలా మృతుల పునరుత్థానం జరిగేటప్పుడు నేను అక్కడుండాలని కోరుకుంటున్నాను.”

ఒక క్రొత్త కుటుంబం

విషాదకరమైన గతాన్నికల్గివున్న ఓ యౌవనుడు, అర్జెంటీనాలో యెహోవాసాక్షుల పూర్తికాల సువార్తికుడైన లూయిస్‌కు ఒకరోజు పరిచయం చేయబడ్డాడు. పుట్టగానే తల్లిదండ్రులచే విడిచిపెట్టబడ్డ ఇతడు, వివిధ సంస్థల్లో పెరిగాడు. అతనికి దాదాపు 20 ఏళ్లవయస్సు వచ్చినప్పుడు, వాళ్లమ్మను గురించిన వివరాలు తెలుసుకొని ఆమె దగ్గర నివసించాలని నిర్ణయించుకున్నాడు. అతడు బాగా కష్టపడి పనిచేసి సంపాదించి, డబ్బును కూడబెట్టి వాళ్లమ్మ ఉండే నగరానికి వెళ్లాడు. అతని దగ్గరున్న డబ్బంతా అయిపోయేంతవరకూ ఆమె అతన్ని తన దగ్గర ఉండనిచ్చి, తర్వాత అతన్ని వెళ్లిపొమ్మంది. ఈ తిరస్కారం అతడు ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది.

అయితే, లూయిస్‌ ఈ యౌవనస్థునితో బైబిలు సత్యాన్ని పంచుకున్నాడు. “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును” అనే అభయం ఆ సత్యంలో చేరివుంది. (కీర్తన 27:10) తననెన్నటికీ ఎడబాయని పరలోకపు తండ్రి తనకు ఉన్నాడనే విషయాన్ని ఆ యౌవనస్థుడు తెలుసుకున్నాడు. ఓ క్రొత్త కుటుంబంలో అంటే యెహోవా కుటుంబంలో ఒక సభ్యుడైనందుకు అతడు ఇప్పుడు సంతోషిస్తున్నాడు.

అదే దేశానికి చెందిన మరొక వ్యక్తి తాను కావలికోట పత్రికను ఇష్టపడతానని యెహోవాసాక్షుల్లో ఒకరికి చెప్పాడు. ఎందుకు? ఎందుకంటే అది అతని వైవాహిక జీవితాన్ని కాపాడింది. ఒకనాడు, ఈ వ్యక్తి తను పనిచేసే స్థలాన్నుండి వెళ్తుండగా ముఖపత్రంపై పెద్దక్షరాలతో “విడాకులు” అనే శీర్షికాంశం ఉన్న కావలికోట పత్రికను చెత్తబుట్టలో చూశాడు. అతని వైవాహిక జీవితం సమస్యల్లో కూరుకుపోయినందున, అతనూ, అతని భార్యా చట్టపరంగా విడిపోవడానికి అవసరమైన చర్యల్ని చేపట్టనారంభించారు, అతడు ఆ పత్రికను తీసుకొని, దాన్ని చదవనారంభించాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి, తన భార్యతో కలిసి దాన్ని చదివాడు. ఆ పత్రికలో ఉన్న బైబిలు ఆధారిత సలహాల్ని అన్వయించుకోవడానికి ఆ దంపతులు ప్రయత్నించారు. (ఎఫెసీయులు 5:21–6:4) త్వరలోనే, వారి బాంధవ్యం మెరుగుపడింది. వాళ్లు వేరైపోవడానికి చేపట్టిన చట్టపరమైన చర్యల్ని ఆపివేసి, సమైక్య వైవాహిక దంపతులుగా ఇప్పుడు బైబిల్ని పఠిస్తున్నారు.

ఉరుగ్వేలో, లూయిస్‌ అనే మరో వ్యక్తి విచారంగా ఉండేవాడు. మాదకద్రవ్యాల వ్యసనమూ, అభిచారమూ, విగ్రహారాధన, మత్తుపానీయాల దుర్వినియోగమూ—అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన వాటిలో కొన్ని మాత్రమే. చివరకు, లూయిస్‌ పూర్తిగా నిరాశకులోనై, నాస్తికునిగా మారాడు. జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఒక స్నేహితుడు అతనికిచ్చాడు.b ఇది యెహోవాసాక్షులతో క్లుప్తమైన పరిచయానికి దారితీసింది, కానీ లూయిస్‌ త్వరలోనే మత్తుపానీయాల వైపుకూ, మాదకద్రవ్యాల వైపుకూ మరలాడు. విచారంతో బహుగా క్రుంగిపోయిన తరుణంలో, చెత్తతో నిండివున్న గోతిలో తాను కూర్చొని ఉన్నట్లు కనుగొని, దేవుని నామాన్ని గురించి అంత నిర్దిష్టంగా అతనికి తెలియనందున అతడు “యేసుక్రీస్తు తండ్రికి” తన ప్రార్థనను సంభోదిస్తూ ప్రార్థించాడు.

లోకంలో తాను ఉనికిలో ఉండడానికి ఏదైనా కారణముంటే ఆ కారణాన్ని చూపించమని అతడు దేవున్ని అడిగాడు. “ఆ మరుసటి రోజు, పరిచయస్థుడొకరు తనకిక ఎంత మాత్రం ఉపయోగపడని ఓ పుస్తకాన్ని ఇచ్చాడు” అని లూయిస్‌ నివేదిస్తున్నాడు. దాని పేరు? “ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!”c తన ప్రశ్నకు జవాబిచ్చేందుకు ఆ పుస్తకం అతనికి సహాయపడింది. దేవునికి ఎలా సేవ చేయాలో తనకు చూపించే మతాన్ని కనుగొనడంలో సహాయపడమని లూయిస్‌ మరలా ప్రార్థించాడు. ఎంత ఆశ్చర్యమో కదా! డోర్‌బెల్‌ మ్రోగింది, ఇద్దరు యెహోవాసాక్షులు బయట నిలబడి ఉన్నారు. లూయిస్‌ వాళ్లతో బైబిల్ని పఠించడం వెంటనే మొదలుపెట్టాడు. అతడు త్వరితగతిని పురోభివృద్ధి చెందాడు, బాప్తిస్మం తీసుకున్న సాక్షిగా ఉండేందుకు ఆశీర్వదించబడ్డానని ఇప్పుడు భావిస్తున్నాడు. అతడు పరిశుభ్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, తమ జీవితాల్లో సంకల్పాన్ని కనుగొనేందుకు ఇతరులకు కూడా సహాయపడుతున్నాడు. అతని విషయంలో, కీర్తన 65:2లోని ఈ మాటలు నిజమయ్యాయి: “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు.”

ఫిలిప్పీన్స్‌లో, అలెన్‌ ఉద్యమకారునిగా ఉండేవాడు. అతడు “భవిష్యతరాలు సమానత్వాన్ని అనుభవించగలిగేలా ప్రభుత్వాన్ని కూలద్రోయాలనే” ధ్యేయాన్ని కల్గివున్న ఒక సంస్థకు చెందినవాడు. అయితే, ఒకరోజు అతన్ని యెహోవాసాక్షులు కలుసుకున్నారు, మానవజాతి విషయంలో దేవుని సంకల్పాన్ని గురించి బైబిల్లో నుండి తెలుసుకున్నాడు. ఆ సంకల్పంలో ఈ ప్రేరేపిత వాగ్దానం కూడా చేరివుంది: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:10, 11) అలెన్‌ ఇలా అన్నాడు: “మా ఉద్యమం దేని కోసం పోరాడుతుందో అది ఎంతోకాలం క్రిందట బైబిల్లో వాగ్దానం చేయబడిందని నేను త్వరలో కనుగొన్నాను. మేమెంతగానో అపేక్షిస్తున్నవన్నీ దేవుని రాజ్యంలో అనుగ్రహించబడతాయి.” అలెన్‌ ఇప్పుడు దేవుని రాజ్యానికి మద్దతునిస్తున్నాడు, బైబిలు సత్యంలో విశ్వాసాన్ని కల్గివుండేందుకు ఇతరులకు సహాయపడుతున్నాడు.

దేవుని వాక్య సత్యమైన బైబిల్ని ప్రజలు లక్ష్యపెట్టినప్పుడు, వారి జీవితాలు రూపాంతరం చెందాయి. నిశ్చయంగా, రక్షించబడిన మానవజాతియంతా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవితాలను మల్చుకునే కాలం వస్తోంది. అదెంతటి రూపాంతరమై ఉంటుందో కదా! అప్పుడు, ఈ ప్రవచనం నెరవేరుతుంది: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.”—యెషయా 11:9.

[అధస్సూచీలు]

a వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రచురించినది.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించింది.

c వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రచురించినది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి