మానవ బలహీనత యెహోవా శక్తిని ఘనపరుస్తుంది
“నేను ఆనందంగా ఉండే ఉత్సాహవంతురాలినైన పూర్తికాల సేవకురాలినని అందరూ అనుకునేవారు. సమస్యల్లోవున్న ఇతరులకు సహాయపడ్డంలో నేనెప్పుడా ముందుండేదాన్ని. అయితే అదే సమయంలో నేను లోలోపల క్షీణించిపోతున్నట్లు భావించేదాన్ని. కలతపర్చే తలంపులూ మానసిక వ్యధ నాపై ఎంతో ప్రభావాన్ని చూపేవి. ప్రజల్లో నుండి దూరంగా పారిపోవాలనే కోరిక నాలో ప్రారంభమైంది. నేను ఇంట్లో పక్కపైనే ఉండిపోవాలని అనుకునే దాన్ని. నెలలతరబడి, యెహోవా, నన్ను చావనియ్యి అని వేడుకునేదాన్ని.”—వనెసా.
పైన పేర్కొనబడిన ఉదాహరణలో వలెనే, “అపాయకరమైన కాలముల”లో జీవించడం మూలంగా కలిగే ప్రభావాలను యెహోవా సేవకులు అప్పుడప్పుడూ అనుభవించవలసి రావడం సహజమే. (2 తిమోతి 3:1) కొందరు కృంగిపోవచ్చు కూడా. (ఫిలిప్పీయులు 2:25-27) అయితే నిరాశా భావాలు ఎక్కువకాలం కొనసాగితే అవి మన శక్తిని హరించివేయవచ్చు, ఎందుకంటే బైబిలు ఇలా చెబుతుంది: “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” (సామెతలు 24:10) అవును, మనం నిరుత్సాహం చెందినప్పుడు మనకు శక్తి అవసరం అంటే, బహుశా “బలాధిక్యము” అని అపొస్తలుడైన పౌలు పేర్కొన్నది కూడా మనకు అవసరం కావొచ్చు.—2 కొరింథీయులు 4:7.
యెహోవా దేవుడు అపరిమితమైన శక్తికి మూలం. ఆయన సృష్టిని మనం పరీక్షించినప్పుడు ఇది మనకు అవగతమౌతుంది. (రోమీయులు 1:20) ఉదాహరణకు, సూర్యున్ని పరిశీలించండి. సూర్యుని నుండి వచ్చే 2.4 కోటి కోట్ల అశ్వశక్తి యొక్క ఎడతెగని ప్రవాహాన్ని భూమి అడ్డగిస్తుంది. అయితే, సూర్యున్నుండి వెలువడే రెండు వందల కోట్ల శక్తిలో కేవలం ఒక భాగాన్ని మాత్రమే అది సూచిస్తుంది. సూపర్ జయింట్‌లని పిలువబడే నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నగా ఉంటాడు. వాటిలో ఒకటి అరైయాన్ నక్షత్రరాశిలోని రైగల్ అనే నక్షత్రం, అది మన సూర్యుని కంటే 50 రెట్లు పెద్దదిగా ఉండి 1,50,000 రెట్ల ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది!
అలాంటి ఆకాశ శక్తిమూలాలకు సృష్టికర్త, మరింత “అధికశక్తి”ని కలిగివుండాలి. (యెషయా 40:26; కీర్తన 8:3, 4) వాస్తవానికి, యెహోవా “సొమ్మసిల్లడు అలయడు” అని ప్రవక్తయైన యెషయా పేర్కొన్నాడు. ఎవరైనా మానవబలహీనత మూలంగా అలసిపోయామని భావిస్తే వారితో తన శక్తిని పంచుకునేందుకు దేవుడు సుముఖంగా ఉన్నాడు. (యెషయా 40:28, 29) ఆయన దాన్నెలా చేస్తాడనేది క్రైస్తవ అపొస్తలుడైన పౌలు విషయంలో ప్రదర్శించబడింది.
శ్రమలను అధిగమించడం
తాను సహించవలసివున్న ఒక అడ్డంకును గురించి పౌలు కొరింథీయులకు చెప్పాడు. ఆయన దాన్ని “శరీరములో ఒక ముల్లు” అని పిలిచాడు. (2 కొరింథీయులు 12:7) ఆ “ముల్లు” ఆరోగ్య సమస్య అయివుంటుంది, బహుశ అది చూపు మాంద్యం అయివుండవచ్చు. (గలతీయులు 4:15; 6:11) లేక అబద్ధ అపొస్తలులనూ మరియు తన అపొస్తలత్వాన్నీ పనినీ సవాలు చేసిన ఇతర కలత కలిగించే వారిని పౌలు సూచిస్తుండవచ్చు. (2 కొరింథీయులు 11:5, 6, 12-15; గలతీయులు 1:6-9; 5:12) ఏది ఏమైనప్పటికీ, “శరీరములో” ఉన్న ఈ “ముల్లు” పౌలుకు విపరీతంగా శ్రమ కలిగించింది, అది తీసివేయబడాలని ఆయన పదే పదే ప్రార్థించాడు.—2 కొరింథీయులు 12:8.
అయితే, యెహోవా పౌలు విన్నపాన్ని అంగీకరించలేదు. బదులుగా, ఆయన పౌలుకు ఇలా చెప్పాడు: “నా కృప నీకు చాలును.” (2 కొరింథీయులు 12:9) దీని ద్వారా యెహోవా ఏమని చూపాడు? పౌలు యొక్క గత చరిత్రను అంటే ఆయన క్రైస్తవులను హింసించడాన్ని మనం పరిశీలించినప్పుడు, ఆయన దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండటం కూడా అపార కృప మూలంగానే, ఇక అపొస్తలునిగా సేవ చేయడం గురించైతే చెప్పనే అక్కర్లేదు!a (జెకర్యా 2:8; ప్రకటన 16:5, 6 పోల్చండి.) శిష్యునిగా ఉండగల ఆధిక్యతే “చాలు” అని యెహోవా పౌలుకు చెబుతూ ఉండి ఉండవచ్చు. జీవితంలోని వ్యక్తిగత సమస్యలను అద్భుత రీతిలో తీసివేయడంతోపాటు అది జరుగదు. వాస్తవానికి, కొన్ని కష్టాలు అదనపు ఆధిక్యతల మూలంగా కూడా రావచ్చు. (2 కొరింథీయులు 11:24-27; 2 తిమోతి 3:12) ఏది ఏమైనప్పటికీ, పౌలు “శరీరములో”ని తన “ముల్లు”ను అలాగే సహించవలసిందే.
అయితే యెహోవా పౌలు ఎడల ఎంతమాత్రం నిర్దయగా ప్రవర్తించడం లేదు. బదులుగా, ఆయనిలా చెప్పాడు: “బలహీనతయందు నా శక్తి పరిపూర్ణ మగుచున్న[ది].” (2 కొరింథీయులు 12:9) అవును, పౌలు తన పరిస్థితిని ఎదుర్కునేందుకు యెహోవా ప్రేమపూర్వకంగా ఆయనకు శక్తినిస్తాడు. అలా పౌలు “శరీరములో” ఉన్న “ముల్లు” ఒక గుణపాఠం అయ్యింది. ఆయన తన స్వంత శక్తిపై కాక యెహోవా శక్తిపై ఆధారపడడాన్ని అది ఆయనకు నేర్పింది. పౌలు ఈ పాఠాన్ని బాగా నేర్చుకున్నాడని తెలుస్తుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఫిలిప్పీయులకు ఇలా వ్రాశాడు: “నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలిప్పీయులు 4:11, 13.
మీ విషయం ఏమిటి? మీరు “శరీరములో ఒక ముల్లు”ను, బహుశా మీకు ఎక్కువ చింతను కలిగించే ఏదైనా పరిస్థితిని అనుభవిస్తున్నారా? అలాగైతే, ఆదరణను పొందండి. యెహోవా ఆ అడ్డంకును అద్భుతరీతిలో తీసేయక పోవచ్చుగానీ, మీరు మీ జీవితంలో రాజ్యాసక్తులను ముందుంచుతుండగా దాన్ని ఎదుర్కునేందుకు కావలసిన జ్ఞానాన్నీ శక్తినీ ఆయన మీకు అనుగ్రహించగలడు.—మత్తయి 6:33.
అనారోగ్యం లేక వయస్సు పైబడడం మూలంగా క్రైస్తవ సేవలో మీరు చేయాలనుకున్నంత చేయలేకపోతుంటే, నిరాశ చెందకండి. ఆ శ్రమ యెహోవాకు మీరు చేసే సేవను అడ్డగిస్తుందని భావించే బదులు, ఆయనపై మీరు మరింత ఆధారపడేందుకు అదొక అవకాశంగా దాన్ని పరిగణించండి. ఒక క్రైస్తవుని విలువ అతడు ఎంత సేవ చేస్తున్నాడు అనేదాన్నిబట్టి కాక అతడి విశ్వాసాన్ని మరియు ప్రేమ యొక్క లోతునుబట్టి కొలవబడుతుంది. (మార్కు 12:41-44 పోల్చండి.) మీ పూర్ణ ప్రాణముతో యెహోవాను ప్రేమించడమంటే మీకు సాధ్యమైనంత శ్రేష్ఠమైన రీతిలో మీరాయనను సేవించడమనే అర్థం గానీ ఇతరులకు సాధ్యమైనంత శ్రేష్ఠమైన రీతిలో సేవించడమని అర్థం కాదు.—మత్తయి 22:37; గలతీయులు 6:4, 5.
మీ “శరీరములో ఒక ముల్లు” జీవితంలోని ఒక పరిస్థితి మూలంగా, అంటే మీ ప్రియమైన వారి మరణం మూలంగా అయితే, బైబిలు ఇస్తున్న ఈ ఉపదేశాన్ని అనుసరించండి: “నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:22) సిల్వియా అనే పేరుగల ఒక క్రైస్తవురాలు అదే చేసింది. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే, తనతో 50 ఏళ్లు కాపురం చేసిన తన ప్రియమైన భర్తను అలాగే తొమ్మిదిమంది ఇతర కుటుంబ సభ్యులను ఆమె మరణమందు కోల్పోయింది, వారిలో ఆమె ఇద్దరు చిన్న మనుమలు కూడా ఉన్నారు. “యెహోవా గనుక సహాయం చేయకపోయి ఉంటే నాకు దుఃఖనివృత్తే ఉండేదికాదు. అయితే నేను ప్రార్థనలో గొప్ప ఆదరణను పొందుతాను. నేను యెహోవాతో ఎడతెగని సంభాషణను కొనసాగిస్తాను. నేను సహించేందుకు కావలసిన శక్తిని ఆయన నాకిస్తాడని నాకు తెలుసు” అని సిల్వియా చెబుతుంది.
“సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” దుఃఖించే వారు సహించేందుకు వారికి శక్తిని ఇవ్వగలడని తెలుసుకోవడం ఎంత ఆదరణకరంగా ఉంటుందో కదా! (2 కొరింథీయులు 1:3; 1 థెస్సలొనీకయులు 4:13) దీన్ని గుణగ్రహిస్తూ, ఈ విషయాన్ని గురించి పౌలు యొక్క ముగింపును మనం అర్థం చేసుకోగలం. ఆయనిలా వ్రాశాడు: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.”—2 కొరింథీయులు 12:10.
అపరిపూర్ణతలను తట్టుకోవడం
మన మొదటి తలిదండ్రుల నుండి మనందరమూ కూడా అపరిపూర్ణతను సంతరించుకున్నాము. (రోమీయులు 5:12) దాని ఫలితంగా, తుచ్ఛమైన శరీర కోరికలకు వ్యతిరేకంగా మనం పోరాడవలసి ఉంది. “ప్రాచీనస్వభావము” యొక్క లక్షణాలు మనం అనుకున్న దానికంటే మనపై మరింత శక్తివంతమైన పట్టును కలిగి ఉన్నాయనే విషయాన్ని గ్రహించడం ఎంత హృదయ విదారకంగా ఉంటుందో కదా! (ఎఫెసీయులు 4:22-24) అలాంటి సమయాల్లో మనం అపొస్తలుడైన పౌలు వలె భావించవచ్చు, ఆయనిలా వ్రాశాడు: “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.”—రోమీయులు 7:22, 23.
ఇక్కడ కూడా యెహోవా అనుగ్రహించే శక్తి నుండి మనం లాభం పొందవచ్చు. వ్యక్తిగత బలహీనతతో పోరాడేటప్పుడు, ప్రార్థనలో ఆయన వైపు తిరగడాన్నీ అదే సమస్యను గురించి మీరు ఆయనను ఎన్నిసార్లు సమీపించవలసి వచ్చినప్పటికీ ఆయనను క్షమాపణ కోరడాన్నీ మానుకోకండి. తన అనుగ్రహం మూలంగా, “హృదయములను పరిశీలన చేయు”వాడైన యెహోవా, మీ యథార్థత యొక్క లోతును చూడగలడు మరియు మీకు స్వచ్ఛమైన మనస్సాక్షిని ఇవ్వగలడు. (సామెతలు 21:2) యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా, శరీర బలహీనతలకు వ్యతిరేకంగా మీరు మీ పోరాటాన్ని కొనసాగించేందుకు మీకు అవసరమైన శక్తిని అందించగలడు.—లూకా 11:13.
ఇతరుల అపరిపూర్ణతలతో వ్యవహరించేటప్పుడు కూడా మనకు యెహోవా శక్తి అవసరం. ఉదాహరణకు, ఒక తోటి క్రైస్తవుడు “కత్తిపోటువంటి మాటలు” మనతో పలుకవచ్చు. (సామెతలు 12:18) అది ప్రాముఖ్యంగా మరింత అవగాహన కలిగి ఉండవలసిన వారని మనం భావించే వారి నుండి వచ్చినప్పుడు అది మనకు బాధ కలిగించవచ్చు. మనం అతిగా కలత చెందవచ్చు. యెహోవాను వదిలి వెళ్లిపోయేందుకు కొందరు దాన్ని ఒక కారణంగా తీసుకున్నారు, అది అన్నిటికంటే పెద్ద తప్పు!
అయితే, ఒక సమతూకమైన దృక్పథం మనం ఇతరుల బలహీనతల ఎడల సరైన దృక్కోణాన్ని కలిగి ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. అపరిపూర్ణ మానవుల నుండి మనం పరిపూర్ణతను అపేక్షించలేము. “పాపము చేయనివాడు ఒకడును లేడు” అని జ్ఞానియైన సొలొమోను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. (1 రాజులు 8:46) దాదాపు ఏడు దశాబ్దాలు యెహోవాకు నమ్మకంగా సేవ చేసిన అభిషిక్త క్రైస్తవుడైన ఆర్థర్ ఇలా పేర్కొన్నాడు: “తోటి సేవకులలో ఉండే బలహీనతలు మన క్రైస్తవ స్వభావాన్ని పరీక్షిస్తూ, యెహోవా ఎడల మనకున్న యథార్థతను నిరూపించుకునేందుకు మనకు అవకాశాలను కలిగిస్తాయి. మానవులు మాట్లాడే మాటలు లేక చేసే పనులు మనం యెహోవాను సేవించడం విషయంలో అడ్డు వచ్చేందుకు మనం అనుమతిస్తున్నట్లయితే మనం మానవులకే సేవ చేస్తున్నామని అర్థం. అంతే కాకుండా, మన సహోదరులు కూడా యెహోవాను ప్రేమిస్తుండి ఉంటారు. మనం వారిలోని మంచిని చూసేందుకు ప్రయత్నిస్తే, వారు మనం అనుకున్నంత చెడ్డవారు కాదని మనం త్వరలోనే గ్రహిస్తాము.”
ప్రకటించేందుకు కావలసిన శక్తి
పరలోకానికి ఆరోహణం కాకముందు యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందు[రు].”—అపొస్తలుల కార్యములు 1:8.
యేసు చెప్పినట్లుగానే, ఈ పని నేడు యెహోవాసాక్షుల ద్వారా భూ వ్యాప్తంగా 233 దేశాల్లో జరుపబడుతుంది. యెహోవాను గురించిన జ్ఞానాన్ని పొందేందుకు ఇతరులకు సహాయం చేయడానికి వారు సమిష్టిగా, ప్రతి సంవత్సరం 100 కోటి కంటే ఎక్కువ గంటలు గడుపుతున్నారు. ఈ పనిని సాధించడం ఎల్లవేళలా సులభం కాదు. కొన్ని దేశాల్లో రాజ్య ప్రచారకుల పని నిషేధించబడింది లేక నిర్బంధించబడింది. అయితే ఈ పనిని ఎవరు చేస్తున్నారో కూడా ఆలోచించండి, బలహీనులైన, అపరిపూర్ణ మానవులు, వారిలో ప్రతి ఒక్కరికీ తమ స్వంత సమస్యలూ చింతలూ ఉన్నాయి. అయినప్పటికీ ఆ పని కొనసాగుతోంది, దాని ఫలితంగా, గత మూడు సంవత్సరాల్లో, పది లక్షలకంటే ఎక్కువమంది ప్రజలు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకుని, నీటి బాప్తిస్మం ద్వారా తమ సమర్పణను సూచించారు. (మత్తయి 28:18-20) నిజంగా, ఈ పని దేవుని శక్తి ద్వారా మాత్రమే సాధించబడుతుంది. జెకర్యా ప్రవక్త ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగు[ను].”—జెకర్యా 4:6.
మీరు సువార్త ప్రచారకులైతే, మీరు కూడా ఆ గొప్ప పనిలో భాగాన్ని కలిగి ఉన్నట్లే, అదెంతటి చిన్న సహాయం అయినప్పటికీ మీరు భాగాన్ని కలిగి ఉన్నట్లే. మీరు ఎన్ని ‘ముల్లులను’ సహిస్తున్నప్పటికీ, “మీరు చేసిన కార్యమును, మీరు . . . ఆయన నామము ఎడల చూపిన ప్రేమను” యెహోవా మరచిపోడని మీరు నిశ్చయతను కలిగి ఉండవచ్చు. (హెబ్రీయులు 6:10) కాబట్టి మద్దతు కొరకు అధిక శక్తికి మూలమైన ఆయనపై ఆధారపడడంలో కొనసాగండి. మనం యెహోవా శక్తి మూలంగానే సహించగలమనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి; ఆయన శక్తి మన బలహీనతల్లో పరిపూర్ణం చేయబడుతుంది.
[అధస్సూచీలు]
a “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” గనుక, మానవులు ఎవరైనప్పటికీ దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండగలగడమే దేవుని కృపకు నిదర్శనం.—రోమీయులు 3:23.
[26వ పేజీలోని చిత్రం]
ప్రకటనాపని యెహోవా శక్తి ద్వారానే సాధించబడుతుంది