కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 6/1 పేజీలు 19-23
  • యెహోవా యథార్థవంతునిగా ఉంటాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా యథార్థవంతునిగా ఉంటాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంకల్పరహితమైన తొలి జీవితం
  • ఓ క్రొత్త యథార్థతను ప్రదర్శించడం
  • ఇంగ్లాండ్‌లో పూర్తికాల పరిచర్య
  • ఆఫ్రికాలో విస్తృతమైన పరిచర్య
  • తిరిగి ఆఫ్రికాకు
  • ఇంగ్లాండ్‌లోని క్రొత్త పరిస్థితులు
  • ఒక మిషనరీ నియామకం మా గృహంగా మారింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మన ప్రపంచవ్యాప్త సౌభ్రాతృత్వం ద్వారా బలపడ్డాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా నాకు ఊహకందని దీవెనలు ఇచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • సరైన ఎంపికలు చిరకాల ఆశీర్వాదాలను తెచ్చాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 6/1 పేజీలు 19-23

యెహోవా యథార్థవంతునిగా ఉంటాడు

పీటర్‌ పాలిసర్‌ చెప్పినది

అది 1985 డిశంబరు నెల. కెన్యాలోని నయిరోబీ నందలి అంతర్జాతీయ విమానాశ్రయంలో మేము దిగుతుండగా మాలో ఉత్తేజం పెల్లుబికింది. నగరంలోకి కారులో వెళ్తుండగా, సుపరిచితమైన దృశ్యాలూ ధ్వనుల మూలంగా మధుర స్మృతులు మదిలో మెదిలాయి.

మేము, యెహోవాసాక్షుల “విశ్వాసంగా ఉండేవారు” అనే జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు కెన్యాకు వచ్చాము. పన్నెండు సంవత్సరాల క్రితం మా పనిపై నిషేధం విధించబడినందున నేనూ నా భార్యా కెన్యా వదలి వెళ్లేందుకు వత్తిడి చేయబడ్డాము. మేము అక్కడ బేతేలులో నివసించేవాళ్లము, అది యెహోవాసాక్షుల బ్రాంచి భవనాలకు ఇవ్వబడిన పేరు. దాన్ని దర్శించేందుకు మేము తిరిగి వెళ్లేసరికి మా కొరకు ఎంతో ఆనందభరితమైన విషయం వేచి ఉంది!

ఒక యౌవన సాక్షి బేతేలులో మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేసేందుకు సహాయం చేస్తుంది, ఆమె రెండేళ్ల పాపగా ఉన్నప్పటినుండీ మాకు తెలుసు. అక్కడున్న బేతేలు కుటుంబంలోని వారిలో కనీసం ఆరుగురు సభ్యులు, వాళ్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పటినుండీ మాకు తెలుసు. వారు ఇప్పుడు యౌవనులుగా తమ కుటుంబాలతోపాటూ పరిచర్యలో ఇంకా చురుకుగా ఉన్నారనే విషయాన్ని చూడటం మాకెంతో ఆనందాన్ని కలిగించింది! “యథార్థవంతుల యెడల నీవు యథార్థవంతుడవుగా నుందువు” అనే బైబిలు వాగ్దానానికి అనుగుణంగా మన దేవుడైన యెహోవా వారి ఎడల శ్రద్ధ వహించాడు. (2 సమూయేలు 22:26) నా తొలి జీవితానికీ, ఈ యౌవనులు గడుపుతున్న ప్రతిఫలదాయకమైన జీవితానికీ మధ్య నేనెంత గొప్ప వ్యత్యాసాన్ని కనుగొనగలిగానో!

సంకల్పరహితమైన తొలి జీవితం

నేను 1918 ఆగస్టు 14న ఇంగ్లాండ్‌నందలి స్కార్‌బరాలో జన్మించాను. రెండు సంవత్సరాల తర్వాత మా అమ్మ, సవతి అక్క కెనడాకు వెళ్లారు, కాబట్టి నేను తర్వాతి మూడు సంవత్సరాలూ మా నాన్న, నానమ్మ, మేనత్తలతో కలిసి ఉండేవాన్ని. నాకు ఐదేళ్లున్నప్పుడు అమ్మ నన్ను అపహరించి కెనడాలోని మాంట్రీయల్‌కు తీసుకెళ్లింది. నాలుగు సంవత్సరాల తర్వాత మా నాన్నతోపాటు ఉండడానికీ పాఠశాలకు వెళ్లడానికి ఆమె నన్ను మళ్లీ ఇంగ్లాండ్‌కు పంపింది.

మా అమ్మా, సవతి అక్క నాకు దాదాపు ప్రతి ఆరు నెలలకోసారి ఉత్తరం వ్రాసేవారు. వారి ఉత్తరాల్లో చివరన నేను మంచి పౌరునిగా ఉండాలనీ రాజుకూ దేశానికీ యథార్థంగా ఉండాలనీ తాము ఇష్టపడుతున్నామని వ్రాసే వారు. నా జవాబులు వాళ్లకు బహుశ నిరాశను కలిగించి ఉంటాయి, ఎందుకంటే నేను జాతీయవాదమూ మరియు యుద్ధమూ తప్పని నేననుకుంటున్నట్లు వారికి వ్రాశాను. అయినప్పటికీ, స్పష్టమైన నడిపింపు లేకపోవడం మూలంగా, నా కౌమార దశలో నేను సంకల్పరహితమైన జీవితాన్ని గడిపాను.

అప్పుడు 1939 జూలైలో, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేందుకు ఆరు వారాల ముందు, నన్ను బ్రిటీష్‌ సైన్యంలోకి చేర్చుకున్నారు. నాకప్పటికింకా 20 ఏళ్లే. త్వరలోనే మా పటాలం ఉత్తర ఫ్రాన్సుకు పంపబడింది. జర్మనీ వారి విమానం మాపై దాడి చేసినప్పుడు యౌవనులమైన మేము మా రైఫిల్‌లను వారివైపుకు గురిపెట్టి కాల్చేవాళ్లం. మేము భయంతో జీవించే వాళ్లము. దగ్గరికొస్తున్న జర్మనీ వారి సైన్యాలను తప్పించుకునేందుకు మేము వెనక్కు పారిపోయాము, మరి 1940 జూన్‌ మొదటి వారంలో డన్‌కిర్క్‌ దగ్గరనుండి ఉపసంహరించుకున్న వారిలో నేను కూడా ఉన్నాను. సముద్ర తీరంలో మొత్తం పదాతదళమంతా చెల్లాచెదురుగా చచ్చిపడి ఉన్న దృశ్యం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ భయం కలుగుతుంది. నేను పీడకలలాంటి ఆ సంఘటనను తప్పించుకుని, ఒక చిన్న సరుకుల ఓడలో తూర్పు ఇంగ్లాండ్‌నందలి హారిచ్‌ చేరుకున్నాను.

ఆ మరుసటి సంవత్సరం అంటే 1941 మార్చిలో నేను భారతదేశానికి పంపబడ్డాను. అక్కడ నేను ఉపకరణాల మెకానిక్కుగా తర్ఫీదు పొందాను. ఇన్‌ఫెక్షన్‌ మూలంగా ఆసుపత్రిలో కొంతకాలం గడిపిన తర్వాత, భారతదేశ రాజధానియైన ఢిల్లీలోని ఒక సైనిక స్థావరానికి నేను బదిలీ చేయబడ్డాను. ఇంటి నుండి దూరంగా, ఇంకా అస్వస్థునిగా ఉన్న నేను భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాను. మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుందనే విషయాన్ని గురించి నేను ప్రాముఖ్యంగా ఆలోచించేవాడిని.

ఓ క్రొత్త యథార్థతను ప్రదర్శించడం

ఢిల్లీలో ఒక తోటి ఆంగ్లేయుడైన బెర్ట్‌ గేల్‌ నా రూమ్‌మేట్‌. ఒకరోజు “మతం అపవాదికి సంబంధించినది” అని అతడు అన్నాడు, ఆ వ్యాఖ్యానం నాలో ఆసక్తిని రేకెత్తించింది. అతడి భార్య ఒక యెహోవాసాక్షి అయ్యింది, మరి ఆమె నియత కాలంలో బైబిలు ప్రచురణలను అతడికి పంపించేది. వాటిలో ఒకటైన నిరీక్షణ (ఆంగ్లం) అనే చిన్నపుస్తకం నా ఆసక్తిని చూరగొన్నది. పునరుత్థాన నిరీక్షణను గురించి అందులో ఉన్న చర్చ నాకు నిజమైన మనశ్శాంతినిచ్చింది.

మరి 1943 తొలిభాగంలో, బెర్ట్‌ ఒక ఆంగ్లో ఇండియన్‌ పౌరుడైన టెడ్డీ గ్రూబర్ట్‌తో మాట్లాడాడు, అతడు సైనిక స్థావరంలో మాతోపాటూ పని చేసేవాడు. టెడ్డీ ఒక యెహోవాసాక్షి అనే విషయం మాకు తెలిసినప్పుడు మేమెంతో ఆశ్చర్యపోయాము. మరి 1941లో యెహోవాసాక్షుల ప్రచురణలపై నిషేధం విధించబడినప్పటికీ, ఢిల్లీలో సాక్షులు జరుపుకునే కూటాలకు అతడు మమ్మల్ని తీసుకెళ్లాడు. ఆ చిన్న సంఘంలో, నేను నా జీవితంలో మొదటిసారిగా నిజమైన వాత్సల్యపూరితమైన సహవాసాన్ని చూశాను. గ్రీసు వాడైన బాసిల్‌ సాటోస్‌ అనే ఒక వృద్ధ క్రైస్తవ సహోదరుడు, నా ఎడల వ్యక్తిగత ఆసక్తి కనపరచి నా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మనం ఎందుకు వృద్ధులమై మరణిస్తాము, పునరుత్థానం మరియు దేవుడు వాగ్దానం చేసిన నీతియుక్తమైన నూతన లోకం వంటి వాటిని గురించిన నా ప్రశ్నలకు ఆయన స్పష్టమైన బైబిలు సమాధానాలనిచ్చాడు.—అపొస్తలుల కార్యములు 24:15; రోమీయులు 5:12; 2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4.

ప్రాముఖ్యంగా 1942లో ప్రచురించబడిన శాంతి—అది నిలువగలదా? (ఆంగ్లం) అనే చిన్నపుస్తకం నా ఆసక్తిని చూరగొన్నది. అది నానాజాతి సమితియే “ఎఱ్ఱని మృగము” అనే విషయాన్ని స్పష్టం చేసింది. (ప్రకటన 17:3) ప్రకటన 17వ అధ్యాయం 11వ వచనాన్ని ఉదహరిస్తూ, ఆ పుస్తకం ఇలా చెప్పింది: “నానాజాతి సమితి ‘ఉండినదియు ఇప్పుడు లేనిదియునై’ ఉన్నదని ఇప్పుడు చెప్పవచ్చు.” అది ఇలా కొనసాగింది: “ప్రాపంచిక దేశాల సంఘం ఇప్పుడు మళ్లీ పైకి లేస్తుంది.” 1945లో, అంటే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు కచ్చితంగా అదే జరిగింది!

సాక్షుల ప్రచురణలపై నిషేధం ఉన్నప్పుడు, నేను క్రొత్తగా కనుగొన్న నా స్నేహితులకు సహాయం చేయగలిగాను. శాంతి—అది నిలువగలదా? అనే చిన్నపుస్తకాల కార్టన్‌ ఇక్కడికి వచ్చినప్పుడు, దాన్ని భద్రపర్చేందుకు సంఘం నాకు దాన్ని ఇచ్చేది. నిషేధించబడిన ప్రచురణల గురించి సైనిక శిబిరాన్ని గాలించాలని ఎవరనుకుంటారు? నేను కూటాలకు హాజరైన ప్రతీసారీ నా వెంట కొన్ని చిన్నపుస్తకాలను తీసుకుని వెళ్లి సహోదరులకు ఇచ్చేవాన్ని. తమ ఇళ్లను గాలిస్తారనే భయం సహోదరులకు కలిగినప్పుడు నేను వారి వ్యక్తిగత బైబిలు ప్రచురణలను కూడా నా వద్ద దాచాను. చివరకు, 1944 డిశంబరు 11వ తేదీన నిషేధం ఎత్తివేయబడింది.

మా సైనిక విభాగాల వేర్పాటు సందర్భంలో ఏర్పాటు చేయబడిన 1943 క్రిస్ట్‌మస్‌ వేడుకల సమయంలో, క్రైస్తవ బోధల ఎడలగల నా యథార్థత పరీక్షకు గురైంది. యేసు చలిగా ఉండే డిశంబరు నెలలో జన్మించలేదని మరియు తొలి క్రైస్తవులు క్రిస్ట్‌మస్‌ వేడుకలు జరుపుకోలేదనీ నేను తెలుసుకున్నాను గనుక నేను అందులో భాగంవహించేందుకు నిరాకరించాను.—లూకా 2:8-12 పోల్చండి.

మరి 1944 డిశంబరు 27 నుండి 31 వరకు జబల్‌పూర్‌లో “ఐక్యపర్చబడిన ప్రకటనకర్తలు” అనే సమావేశం జరిగినప్పుడు, దానికి హాజరైన దాదాపు 150 మందిలో నేనూ ఉన్నాను. అనేకమంది సమావేశ ప్రతినిధులు ఢిల్లీనుండి 600 కంటే ఎక్కువ కిలోమీటర్లు రైలులో ప్రయాణం చేసి వచ్చారు. ఆ బయలు ప్రదేశంలోని అద్భుతమైన వాతావరణాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను, నేను అక్కడ యెహోవా సంస్థను క్రియాశీలంగా చూశాను.

సమావేశ ప్రతినిధుల కొరకు పాఠశాల హాళ్లల్లో వసతి ఏర్పాటు చేయబడింది, మేము అక్కడ రాజ్య గీతాలను ఆలపించాము, ఆనందభరితమైన క్రైస్తవ సహవాసాన్ని అనుభవించాము. ఆ సమావేశ సమయంలో నేను బహిరంగ ప్రకటనాపనిలో భాగంవహించడం ప్రారంభించాను. ఆ పని నాకు అప్పటినుండీ ఎంతో ఇష్టమైన పనిగా మారింది.

ఇంగ్లాండ్‌లో పూర్తికాల పరిచర్య

నేను 1946లో ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చి, త్వరలోనే వుల్‌వర్‌టన్‌ సంఘంతో సహవసించడం ప్రారంభించాను. అక్కడ పదిమంది రాజ్య ప్రచారకులే ఉన్నప్పటికీ, వాళ్లు నన్ను తమ స్వంత మనిషిలా చూసుకున్నారు మరియు నేను భారతదేశంలో నా సహోదరులతో ఉన్నప్పుడు అనుభవించిన అదే సంతృప్తిని ఇక్కడ అనుభవించాను. ఆ సంఘంలో విరా క్లిఫ్‌టన్‌ యథార్థవంతురాలైన, వాత్సల్యంగల వ్యక్తిగా పేరు పొందింది. పయినీరుగా—పూర్తికాల పరిచారకులను అలా పిలుస్తారు—ఉండాలని నాకున్న కోరికే ఆమెకూ ఉందనే విషయాన్ని నేను తెలుసుకున్నప్పుడు, మేము 1947 మే 24న వివాహం చేసుకున్నాము. నేను ఒక పాత కారవాన్‌ను లేక ఒక సంచార గృహాన్ని తీసుకుని దాన్ని మరమ్మతు చేశాను, మరి ఆ తరువాత సంవత్సరమే మేము మా మొదటి పయినీర్‌ నియామకాన్ని అందుకున్నాము, అది హన్‌టింగ్‌డన్‌ అనే పల్లె ప్రాంతం.

ఆ దినాల్లో మేము మా సైకిళ్లపైన గ్రామీణ ప్రాంతాలకు ఉదయాన్నే వెళ్లిపోయేవాళ్లం. మేము దినమంతా ప్రకటనాపని చేసేవాళ్లం, సాండ్‌విచ్‌లు తినేందుకు మధ్యాహ్న సమయాల్లో కేవలం కొంతసేపు ఆగేవాళ్లం. మేము సైకిళ్లపై ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు గాలి ఎంత హోరుగా వీచినా లేక వర్షం ఎంత కుండపోతగా కురిసినా, మేము ప్రభువు పనిలో సంతోషంగా సంతృప్తిగా ఉండేవాళ్లము.

కొంతకాలానికి మేము మా పరిచర్యను విస్తృతపర్చుకోవాలనీ ఇతర దేశాల ప్రజలతో “సువార్త”ను పంచుకోవాలనీ ఆశించాము. (మత్తయి 24:14) కాబట్టి అమెరికానందలి న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌లో ఉన్న గిలియడ్‌ మిషనరీ పాఠశాలకు హాజరయ్యేందుకు మేము దరఖాస్తులు పంపాము. చివరకు, మమ్మల్ని గిలియడ్‌ యొక్క 26వ తరగతికి ఆహ్వానించారు, ఆ తరగతి వారు 1956 ఫిబ్రవరిలో పట్టభద్రులయ్యారు.

ఆఫ్రికాలో విస్తృతమైన పరిచర్య

మాకు ఆఫ్రికాలోని ఉత్తర రొడేసియాకు (ఇప్పుడు జాంబియా) మిషనరీ నియామకం లభించింది. మేము అక్కడికి వెళ్లిన వెంటనే, ఆ దేశంలోని బేతేలులో సేవ చేసేందుకు మమ్మల్ని పిలిచారు. నా బేతేలు పనిలో భాగంగా నేను తూర్పు ఆఫ్రికాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపే వాడిని. మరి 1956లో తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కెన్యాలో కేవలం నలుగురు సాక్షులే ఉండేవారు, మరి ఉత్తర రొడేసియాలో 24,000 కంటే ఎక్కువమంది ఉండేవారు. అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవ చేయగలగడం ఎంత బాగుంటుందోనని నేనూ విరా ఆలోచించడం ప్రారంభించాము.

తర్వాత, అనుకోకుండా, నాకు గిలియడ్‌ పాఠశాలకు రమ్మని మరో ఆహ్వానం లభించింది, ఈసారి పైవిచారణకర్తల కొరకు పది నెలల కోర్సు ఉంది. విరాను ఉత్తర రొడేసియాలో వదిలేసి, అప్పట్లో గిలియడ్‌ పాఠశాల నెలకొని ఉన్న న్యూయార్క్‌ పట్టణానికి నేను ప్రయాణించి వెళ్లాను. మరి 1962 నవంబరులో మా కోర్సును ముగించిన తర్వాత, కెన్యాలో బ్రాంచి కార్యాలయాన్ని స్థాపించేందుకు నాకు అక్కడికి నియామకం ఇవ్వబడింది. ఈ సమయానికల్లా కెన్యాలో వందకంటే ఎక్కువమంది సాక్షులున్నారు.

విరాను కలుసుకునేందుకు ఉత్తర రొడేసియాకు నేను తిరిగి వస్తున్నప్పుడు, నేను కెన్యాలోని నయిరోబీలో కొంత సమయం కొరకు ఆగ వలసి ఉంది. అయితే నేను వచ్చినప్పుడు, గిలియడ్‌ యొక్క 25వ తరగతి విద్యార్థి అయిన బిల్‌ నిస్‌బెట్‌, నన్ను కలిసి నేను వెంటనే కెన్యాలోకి ప్రవేశించేందుకు అధికారిక అనుమతిని పొందగల అవకాశం ఉందనే వార్తను తెలియజేశాడు. మేము వలస అధికారులను కలిశాము, మరి కొన్ని నిమిషాల్లోనే, నేను ఐదు సంవత్సరాలు అక్కడ పని చేసేందుకు అనుమతిని పొందాను. కాబట్టి నేను ఉత్తర రొడేసియాకు ఎన్నడూ తిరిగి వెళ్లనేలేదు; కానీ దానికి బదులుగా విరా నయిరోబీకి వచ్చి నన్ను కలుసుకుంది.

మా కొరకే సిద్ధం చేయబడిన స్వాహిలీ భాషా కోర్సుకు హాజరైన తర్వాత, మేము చిన్న నయిరోబీ సంఘంతో కలిసి పరిచర్యకు వెళ్లాము. కొన్నిసార్లు మేము స్వాహిలీ భాషలో మా సందేశాన్ని చదివిన తర్వాత, “నాకు ఇంగ్లీషు అర్థం కాదండీ!” అని గృహస్థులు అనేవారు. అలా జరిగినప్పటికీ మేము పట్టుదలతో కృషి చేసి క్రమంగా భాషా అడ్డంకును అధిగమించాము.

మా ప్రాంతంలో యెరూషలేము, యెరికో వంటి బైబిలు పేర్లు ఉండే పెద్ద పెద్ద భవంతులు కూడా ఉండేవి. ఆసక్తి వెంటనే వృద్ధి చేయబడేది, మరి ఆ ప్రాంతాల నుండి అనేకమంది క్రొత్త రాజ్య ప్రచారకులు వచ్చారు. ఈ ప్రజలపై బైబిలు సత్యం ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపింది! రాజ్యం ఎడల యథార్థత యెహోవా ప్రజల మధ్య ఐక్యతను తీసుకురాగా, తమ తెగ ఉన్నతమైనదనే భావాలు కనుమరుగయ్యాయి. చివరకు తెగాంతర వివాహాలు కూడా జరిగాయి, అది సాక్షులు కాని వారిలో ఎంతో అసాధారణమైన విషయం.

క్రొత్త రాజ్య ప్రచారకులు సత్యాన్ని ఆసక్తితో హత్తుకున్నారు. ఉదాహరణకు, సామ్సన్‌ అనే వ్యక్తి బైబిలు సత్యాలు తన స్వంత ప్రాంతంలో వ్యాపించాలని ఎంత ఆసక్తి కలిగి ఉండేవాడంటే, పయినీర్‌లను పంపమని అతడు ఎప్పుడూ అడుగుతూ ఉండేవాడు. వాస్తవానికి, వారికి వసతిని ఏర్పాటు చేసేందుకు అతడు ఊకంబానీ ప్రాంతంలోని తన ఇంట్లో మరో గదిని కూడా నిర్మించాడు. త్వరలోనే అక్కడ రాజ్య ప్రచారకుల ఒక క్రొత్త సంఘం స్థాపించబడింది.

తూర్పు ఆఫ్రికా దేశమైన ఇతియోపియాలోని మన సహోదరులను నేను అనేకసార్లు సందర్శించాను. వారు చెరసాలలో వేయబడటం, కొట్టబడటం జరుగుతున్నప్పటికీ మరియు ఎడతెగని నిఘా ఉన్నప్పటికీ, పరిచర్యలో నెలకు సగటున 20 కంటే ఎక్కువ గంటలు గడిపేవారు. ఒకసారి, రెండు బస్సుల నిండా సహోదర సహోదరీలు ప్రమాదభరితమైన కొండ ప్రాంతాలను దాటి కెన్యాలో ఒక జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు ఒక వారంపాటు ప్రయాణించారు. వారు తమ దేశంలో రాజ్య ప్రచురణలు లభ్యమయ్యేలా చేసేందుకు ఉపయోగించిన ఉపాయాలు చాలా మెచ్చుకోదగినవి. కెన్యాలో ఉన్న మేము వారికి వాటిని సరఫరా చేయగలిగినందుకు ఎంతో సంతోషించాము.

కెన్యాలోని మా పనిపై 1973లో అధికారిక నిషేధం విధించబడింది, మరి మిషనరీలు దేశం వదిలి వెళ్లాలని ఒత్తిడి చేయబడ్డారు. అప్పటికల్లా కెన్యాలో 1,200 కంటే ఎక్కువమంది సాక్షులు ఉన్నారు, మరి మాకు మరిచిపోలేని వీడ్కోలు ఇచ్చేందుకు వీరిలో అనేకులు విమానాశ్రయానికి వచ్చారు. వారు అలా రావడం చూసి ఒక తోటి ప్రయాణికుడు మీరు పేరుపొందిన వ్యక్తులా అని మమ్మల్ని అడిగాడు. నేనూ విరా ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చాము, అక్కడ మాకు ఒక నియామకం ఇవ్వబడింది, కానీ మేము ఆఫ్రికాకు తిరిగి వెళ్లాలని అపేక్షించాము.

తిరిగి ఆఫ్రికాకు

అలా కొన్ని నెలల తర్వాత, పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘానా రాజధానియైన ఆక్రాలోని బేతేలుకు మా క్రొత్త నియామకాన్ని అందుకున్నాము. ఇక్కడ నా నియామకాల్లో ఒకటి, మన సహోదరులు అక్కడ అనుభవిస్తున్న కష్టాలను ముఖాముఖిగా చూసేలా చేసింది. నేను బేతేలు కుటుంబానికి అవసరమైన ఆహారం మరియు ఇతర సరఫరాల కొనుగోలు విషయం ఎడల శ్రద్ధ వహిస్తుండగా, ఆహార పదార్థాల విపరీతమైన ధరను బట్టి నేనెంతో ఆశ్చర్యపోయాను. అవసరమైన వస్తువులను కొనడం తరచూ సాధ్యమయ్యేది కాదు. పెట్రోలు కొరత మరియు స్పేర్‌ పార్టుల కొరత అదనపు సమస్యలను తెచ్చాయి.

నేను అక్కడ సహనం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాను, ఘానాలోని మన సహోదరులు దాన్ని అప్పటికే అలవర్చుకున్నారు. లంచాల ద్వారా జీవితావసరాలను తీర్చుకోవాలనే శోధనను ఎదిరిస్తూ వారు కనపర్చిన ఆనందభరితమైన దృక్ఫథాన్ని చూడటం ఎంతో ప్రోత్సాహకరంగా ఉండినది. దాని ఫలితంగా, ఘానాలోని యెహోవాసాక్షులు వారి యథార్థత విషయమై ఎంతో పేరుపొందారు, మరి అనేకమంది అధికారుల దగ్గర మంచి పేరును కలిగివున్నారు.

వస్తు రూపేణ కొరత ఉన్నప్పటికీ వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నారు. దేశవ్యాప్తంగా, దాదాపు ప్రతి ఇంటా మన బైబిలు ప్రచురణలు ఉన్నాయి. మేము 1973లో ఘానాకు వచ్చినప్పుడు 17,156 మంది రాజ్య ప్రచారకులు ఉండేవారు, 1981లో ఆ సంఖ్య 23,000 కంటే ఎక్కువకు పెరగడాన్ని మేము చూశాము. భారత, ఆఫ్రికా దేశాల్లో సంవత్సరాల తరబడి తీవ్రమైన ఎండకు గురి కావడం మూలంగా ఆ సంవత్సరంలో నాకు చర్మ క్యాన్సరు వచ్చింది, అందునుబట్టి మేము ఘానాను వదలి క్రమమైన చికిత్స కొరకు ఇంగ్లాండ్‌కు వెళ్లక తప్పలేదు.

ఇంగ్లాండ్‌లోని క్రొత్త పరిస్థితులు

తిరిగి రావడం మూలంగా నా పరిచర్య విషయంలో నేను అనేక సర్దుబాట్లను చేసుకోవలసి వచ్చింది. దేవున్ని మరియు బైబిలును గౌరవించే ప్రజలతో చక్కగా మాట్లాడటం నాకు బాగా అలవాటైపోయింది. కానీ లండన్‌లో నేను అలాంటి దృక్పథాన్ని ఎక్కువగా కనుగొనలేదు. బ్రిటన్‌లోని సహోదరుల ఓర్పును చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆత్మీయ రీతిలో “విసికి చెదరియున్న” ప్రజల ఎడల సహానుభూతిని వృద్ధి చేసుకోవలసిన అవసరతను ఇది నాకు చూపింది.—మత్తయి 9:36.

మేము ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత, విరా 1991 సెప్టెంబరులో తన 73వ ఏట మరణించేంత వరకూ లండన్‌ బేతేలులో మేమిరువురమూ పని చేశాము. అన్ని సంవత్సరాలు పరిచర్యలో నాతో పాటు కలిసి పని చేసిన అంతటి విశ్వాసయోగ్యమైన సహచరిని కోల్పోవడం ఎంతో కష్టాన్ని కలిగించింది. నేను ఆమె లేని లోటును అనుభవిస్తున్నాను. దాదాపు 250 మంది సభ్యుల బేతేలు కుటుంబం నుండి లభిస్తున్న చక్కని మద్దతునుబట్టి నేను ఆనందంగా ఉన్నాను.

యెహోవా సంస్థ యొక్క పురోగమనాన్ని వీక్షించగలగటం మరియు అనేకులు పూర్తికాల సేవను తమ జీవిత విధానంగా చేసుకోవడాన్ని చూడటం ఎంతో గొప్ప ఆధిక్యతని నేను వాస్తవంగా భావిస్తున్నాను. “యెహోవా . . . తన భక్తులను విడువడు” గనుక అంతకంటే గొప్ప జీవిత విధానం మరొకటి లేదని నేను మీకు హామీ ఇవ్వగలను.—కీర్తన 37:28.

[23వ పేజీలోని చిత్రం]

మేము 1947 నుండి 1955 వరకూ ఇంగ్లాండ్‌లో పయినీరింగ్‌ చేశాము

[23వ పేజీలోని చిత్రం]

భారతదేశంలోని ఒక సమావేశ సమయంలో పరిచర్య పనిలో మొదటిసారి

[23వ పేజీలోని చిత్రం]

ఉత్తర రొడేసియాలో మేము మిషనరీలుగా ఉన్నప్పుడు

[23వ పేజీలోని చిత్రం]

1985లో, మేము 12 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్న స్నేహితులతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి