ప్రభువు పేరిట రహస్యత్వం
పందొమ్మిది వందల తొంభైఐదు మార్చిలో జపాన్‌లోని టోక్యోనగరమందలి భూగర్భ రైలుమార్గంపై జరిగిన విషవాయు దాడి 12 మందిని హతమార్చింది, వేలాదిమందిని రోగగ్రస్థుల్ని చేసింది. అది ఓ రహస్యం బట్టబయలు కావడానికి దోహదపడింది. ఓమ్ షిన్‌రక్యోగా (సర్వోన్నత సత్యం) పేరుగాంచిన ఓ మత సంస్థ, రహస్య లక్ష్యాల్ని అన్వేషించడంలో ఉపయోగించేందుకు శారిన్ విషవాయుగారాన్ని రహస్యంగా సమకూర్చుకుంది.
ఓ నెల తర్వాత, అమెరికాలోని ఒక్లహోమ నగరంలోని ఫెడరల్ భవనం బాంబు ప్రేలుడులో ధ్వంసమైపోయి, 167 మంది చావుకు కారణమైంది. ఈ దాడిలో టెక్సాస్‌లోని వాకోనందున్న డావిడియన్ మత శాఖతోపాటు ప్రభుత్వ ప్రతిష్ఠంభన వర్గానికి కచ్చితంగా రెండేళ్లక్రిందటే కొంతమేరకు సంబంధమున్నట్లు రుజువులు సూచిస్తున్నట్లున్నాయి. ఆ సమయంలోనే అదే మతానికి చెందిన దాదాపు 80 మంది సభ్యులు మరణించారు. ఆ బాంబు ప్రేలుడు, అనేకమంది ప్రజలకు రహస్యంగావున్న విషయాన్ని ఇలా బట్టబయలు చేసింది: అమెరికాలో ఇప్పుడు కార్య నిర్వహణలోవున్న అనేక పారామిలిటరీ సైనిక గుంపులు, ఎంతలేదన్నా వాటిలో కొన్నైనాసరే ప్రభుత్వ విద్రోహక చర్యకు రహస్యంగా పథకం వేస్తున్నట్టుగా అనుమానించబడ్డాయి.
తర్వాత, 1995వ సంవత్సరం ముగుస్తుండగా, కాలిపోయిన 16 మృత దేహాలు ఫ్రాన్స్‌లోని గ్రనోబల్ నగరానికి సమీపంగావున్న అడవి ప్రాంతంలో దొరికాయి. వాళ్లు, ఆర్డర్ ఆఫ్ ది సోలార్ టెంపుల్ మత సభ్యులుగా ఉండేవారు. ఇది, స్విట్జర్లాండ్ కెనడా దేశాల్లో 1994 అక్టోబరు నెలలో అంటే దాని 53 మంది సభ్యులు హత్య చేయబడినప్పుడో లేక ఆత్మహత్య చేసుకున్నప్పుడో వార్తల్లోకి వచ్చిన ఓ చిన్న మతశాఖ. కానీ ఈ విషాదకరమైన సంఘటన జరిగిన తర్వాత కూడా, ఆ మతశాఖ కార్యనిర్వహణలో కొనసాగింది. ఈనాటి వరకూ దాని ఉద్దేశ్యాలూ, లక్ష్యాలూ రహస్యంగానే ఉన్నాయి.
మత రహస్యత్వపు అపాయాలు
అలాంటి సంఘటనల్నిబట్టి, మత గుంపులపై అనేక ప్రభుత్వాలు ఓ కన్నువేసి ఉంచడం ఆశ్చర్యాన్నేమైనా కల్గిస్తుందా? ఒకని నమ్మకాన్ని తప్పుగా ఉపయోగించుకుంటూ, ఒకడు తాను ఏకీభవించని లక్ష్యాల్ని తానే వెంబడించేలా వానిని చేసే రహస్య సంస్థలకు—అవి మతపరమైనవైనా కాకపోయినా—మద్దతునివ్వాలని నిశ్చయంగా ఎవ్వరూ కోరుకోరు. అయితే, అనుమానాస్పద వైఖరిగల రహస్య సంస్థల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రజలు ఏమి చేయవచ్చు?
స్పష్టంగా, రహస్య సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని అనుకుంటున్న వారెవరైనా, దాని నిజమైన లక్ష్యాల్ని తెల్సుకోవడం జ్ఞానయుక్తమైన పని. స్నేహితులనుండీ, పరిచయస్థులనుండీ వచ్చే ఒత్తిడికి తలొగ్గక, నిర్ణయాలు భావోద్రేకాలపైగాక వాస్తవాలపై ఆధారపడి ఉండాలి. రాబోయే పర్యవసానాల్ని వేటినైనా అనుభవించబోయేది, నిర్ణయం తీసుకున్న వ్యక్తేననీ ఇతరులు కాదనీ గుర్తుంచుకోండి.
గౌరవింపదగినవికాని దృక్పథాలున్న అపాయకరమైన గుంపులకు దూరంగా ఉండడంలో విఫలంకాని పద్ధతి, బైబిలు సూత్రాల్ని అనుసరించడమే. (యెషయా 30:21) ఇందులో, రాజకీయ తటస్థ వైఖరిని అనుసరించడమూ, ఇతరుల ఎడలా శత్రువుల ఎడలా ప్రేమను చూపించడమూ, ‘శరీరకార్యాల్ని విడనాడడమూ’ దేవుని ఆత్మఫలాల్ని అలవర్చుకోవడమూ చేరివున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, యేసు లోకసంబంధికానట్టే నిజ క్రైస్తవులూ లోకసంబంధులు కారు. మరి ఇది లోకసంబంధమైన రహస్య సమాజాల్లో భాగంవహించకుండా ఉండేలా చేస్తుంది.—గలతీయులు 5:19-23; యోహాను 17:14, 16; 18:36; రోమీయులు 12:17-21; యాకోబు 4:4.
యెహోవాసాక్షులు, తమ విశ్వాసాన్ని ప్రాముఖ్యమైనదిగా ఎంచి దాని ప్రకారం జీవించేందుకు దాపరికంలేకుండా ప్రయత్నించు ఆసక్తిపరులైన బైబిలు విద్యార్థులు. ప్రపంచవ్యాప్తంగా, ‘శాంతిని వెదకి దానిని వెంబడిస్తున్న’ మతగుంపుగా వారు సుపరిచితులే. (1 పేతురు 3:11) యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే వారి పుస్తకం, సరియైన విధంగానే ఇలా చెబుతోంది: “యెహోవాసాక్షులు ఏవిధమైన భావంలోనూ రహస్యమైన ఓ సంస్థకాదు. అందరికీ లభ్యమయ్యే ప్రచురణల్లో, బైబిలు ఆధారితమైన వారి నమ్మకాలు పూర్తిగా వివరించబడ్డాయి. అంతేగాక, కూటాల్లో జరిగేదాన్ని చూడ్డానికీ వినడానికీ అక్కడకు రమ్మని ప్రజల్ని ఆహ్వానించేందుకు వారు ప్రత్యేకంగా ప్రయత్నిస్తారు.”
నిజమైన మతం నిశ్చయంగా రహస్యమైనది కాదు. యెహోవాసాక్షులుగా తమ గుర్తింపును మరుగు చేసుకోకూడదనీ లేక తమ సంకల్పాన్ని అస్పష్టంగా ఉంచకూడదనీ సత్య దేవుని ఆరాధికులు ఉపదేశించబడ్డారు. యేసు తొలి శిష్యులు యెరూషలేమును తమ బోధతో నింపివేశారు. వాళ్లు తమ నమ్మకాల్నిబట్టీ, కార్యకలాపాల్నిబట్టీ వాళ్లు మరుగునగాక బాహాటంగానే ఉన్నారు. నేడు యెహోవాసాక్షుల విషయంలోనూ అది వాస్తవమే. నియంతృత్వ సామ్రాజ్యాలు ఆరాధనా స్వేచ్ఛను దురుద్దేశపూర్వకంగా అదుపులో పెట్టినప్పుడు, క్రైస్తవులు దాచుకోకుండా బహిరంగంగా ధైర్యంతో సాక్ష్యమిచ్చినందువల్ల వారిపైకి నిర్బంధంగా తీసుకువచ్చిన పరిస్థితినిబట్టి వాళ్లు “పరిపాలకునిగా మనుష్యులకుగాక దేవుని”కి విధేయత చూపిస్తూ, తమ కార్యకలాపాన్ని యుక్తిగానూ నిర్భయంగానూ కొనసాగించడం సమంజసమైన విషయమే.—అపొస్తలుల కార్యములు 5:27-29, NW; 8:1; 12:1-14; మత్తయి 10:16, 26, 27.
యెహోవాసాక్షులు ఓ రహస్యమైన మతమనో లేక మతశాఖయనో మీరనుకుంటే, అది బహుశా మీకు వాళ్లను గురించి తెలియకపోవడం మూలంగానే అయ్యుండొచ్చు. మొదటి శతాబ్దంలోని అనేకమంది పరిస్థితి అదే.
రోమ్‌లో అపొస్తలుడైన పౌలు “యూదులలో ముఖ్యులైనవారి”తో సమావేశమవ్వడాన్ని గూర్చి అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం మనకు చెబుతోంది. వాళ్లు ఆయనతో ఇలా అన్నారు: “ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన వినగోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.” (అపొస్తలుల కార్యములు 28:16-22) ప్రత్యుత్తరంగా పౌలు “దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు . . . వివరముగా” తెలియజేశాడు, “కొందరు నమ్మిరి.” (అపొస్తలుల కార్యములు 28:23, 24) నిజ క్రైస్తవత్వాన్ని గూర్చిన అసలైన నిజాల్ని పొందడం నిశ్చయంగా వాళ్లకు శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చింది.
బహిరంగంగానూ, బాహాటంగానూ దేవుని సేవించేందుకు సమర్పించుకున్నవారిగా యెహోవాసాక్షులు, వాస్తవాల్ని తెల్సుకోవాలని శ్రద్ధకల్గివున్న ఎవరికైనా తమ కార్యకలాపాన్ని గూర్చిన, నమ్మకాల్ని గూర్చిన సరళమైన వాస్తవాల్ని తెలియజేసేందుకు సంతోషిస్తారు. వారి విశ్వాసాన్ని గూర్చి తగినవిధంగా తెల్సుకున్న స్థితిలో ఉండేందుకు, మీయంతట మీరే ఎందుకు పరిశోధించకూడదు?
[6వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు తాము ఏమైవున్నామో, ఏమి చేస్తున్నామో తెలియజేసేందుకు సంతోషిస్తారు