ఎందుకింత రహస్యత్వం?
“రహస్యమంత భారమైంది మరేదీ లేదు” అని ఓ ఫ్రెంచ్ సామెత చెప్పుకుంటోంది. మనకో రహస్యం తెల్సినప్పుడు సంతోషించడానికిగల కారణాన్నీ, అయితే దాన్ని గురించి మాట్లాడలేక పోయినప్పుడు కొన్నిసార్లు మనం నిస్పృహకులోనవ్వడానికిగల కారణాన్నీ ఇది వివరించగలదా? అయినా, శతాబ్దాలుగా అనేకమంది ప్రజలు, ఓ సమిష్టి లక్ష్యాన్వేషణ కోసం రహస్య వర్గాల్లో చేరడంద్వారా రహస్యత్వాన్ని ఆదరించారు.
ఈ రహస్య సమాజాలకు నాంది పల్కిన ప్రాచీన సమాజాల్లో, ఈజిప్టు గ్రీసు రోమ్‌ల్లో కనుగొనబడిన రహస్య మతాలు ఉన్నాయి. తర్వాత ఈ వర్గాల్లో కొన్ని తమ మత సంబంధాల నుండి వైదొలగి, రాజకీయ ఆర్థిక లేక సామాజిక స్వభావాన్ని మరింతగా సంతరించుకున్నాయి. ఉదాహరణకు, మధ్యయుగంనాటి యూరప్‌లో వ్యాపార సహకార సంఘాలు రూపొందించబడినప్పుడు, వాటి సభ్యులు ప్రధానంగా తమ ఆర్థిక భద్రత కోసమే రహస్యత్వాన్ని ఆశ్రయించారు.
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెలియజేసిన ప్రకారంగా, ఆధునిక కాలాల్లో రహస్య వర్గాలు తరచుగా మాననీయ కారణాల్నిబట్టీ, బహుశా “సామాజిక, ఉదార సంకల్పాలను”బట్టీ, అలాగే “ధర్మాదాయ, విద్యా కార్యక్రమాల్ని నిర్వహించడం” కోసమూ రూపొందించబడ్డాయి. కొన్ని మిత్రసంస్థలూ, యూత్‌క్లబ్‌లూ, సామాజిక క్లబ్‌లూ మరితర గ్రూప్‌లూ కూడా రహస్య వర్గాలే, లేదా పాక్షికంగానైనా రహస్యమైనవే. సాధారణంగా, ఈ వర్గాలు స్వభావరీత్యా చూస్తే హానికరమైనవేమీ కావు. వీటి సభ్యులు కేవలం రహస్యాల్ని దాయడంలో థ్రిల్‌ను పొందుతారు. రహస్య నియమాల పరిచయ కార్యక్రమం, భావోద్రేకంగా బలమైన ముద్రనువేసి సౌహార్దత్వ ఐక్యతా బంధాల్ని బలపర్చుతుంది. సభ్యులు అన్యోన్యభావననూ, ఉద్దేశ్యభావననూ పొందుతారు. ఈ విధమైన రహస్య సమాజాలు, సభ్యులుకాని వారికి సాధారణంగా ప్రమాదకరమైనవికావు. రహస్యాల్ని తెల్సుకోకపోవడం మూలంగా సభ్యులుకానివారు పోగొట్టుకునేదేమీ లేదు.
రహస్యత్వం అపాయాన్ని సూచిస్తున్నప్పుడు
రహస్య వర్గాలన్నీ రహస్యంగా ఉండడంలో ఒకే స్థాయిలో ఉండవు. కానీ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వ్యక్తపరుస్తున్నట్లుగా “రహస్యాల్లో రహస్యాల్ని” కల్గివున్న వర్గాలు, ఒకవిధమైన అపాయాన్ని తీసుకువస్తాయి. అది ఇంకా ఇలా వివరిస్తోంది: “మారు పేర్లనూ, కఠిన పరీక్షల్నీ, రహస్యోద్ఘాటనల్నీ ఉపయోగించడం ద్వారా” టాప్ రేంక్‌ల్లోవున్న సభ్యులు యుక్తిగా “తమ్మునుతాము వేరుపర్చుకొని,” తద్వారా “లోయర్ రేంక్‌లోవున్న వారు ఉన్నతాధికార స్థాయిల్ని చేరుకొనేందుకు అవసరమైన ప్రయత్నాన్ని చేసేలా” ప్రేరేపిస్తారు. అలాంటి వర్గాల్లో అపాయం ఉంటుందనేది స్పష్టమైన విషయమే. లోయర్ రేంక్‌ల్లో ఉన్నవారు ఇంకా ఆ స్థాయికి ఎదగనందున, వారికి సంస్థ నిజమైన గమ్యాలు పూర్తిగా తెలియకపోవచ్చు. ఏ వర్గం యొక్క లక్ష్యాలూ, వాటిని సాధించేందుకు అవలంభించే పద్ధతులూ పాక్షికంగా మాత్రమే తెలుస్తాయో, మరి నిజానికి వాటిని ఏ వర్గమైతే పూర్తిగా వివరించదో ఆ వర్గంలో చేరడం సులభమే. కానీ అలాంటి గుంపులోనికి ప్రవేశించిన ఓ వ్యక్తి, తాను దాని నుండి విముక్తి పొందడం కష్టమనే విషయాన్ని ఆ తర్వాత గ్రహిస్తాడు; అతడు రహస్యత్వపు సంకెళ్లచే కట్టిపడవేయబడినట్టుగా ఉంటాడు.
అయితే, చట్ట విరుద్ధమైన లేక నేరపరమైన లక్ష్యాల్ని వెంబడిస్తూ తన ఉనికిని మరుగుపర్చుకోవడానికి ఓ వర్గం ప్రయత్నిస్తున్నప్పుడు, రహస్యత్వం మరింత అపాయాన్ని సూచిస్తుంది. దాని ఉనికీ, దాని సాధారణ లక్ష్యాలూ ముందుగా తెలిసినవైతే, అది దాని సభ్యుల వివరాల్నీ, దాని స్వల్పకాలిక ప్రణాళికల్నీ రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించొచ్చు. తమ ఉగ్రవాద దాడులతో ప్రపంచాన్ని అప్పుడప్పుడూ దిగ్భ్రాంతినొందిస్తున్న ఉద్రేకపూరిత ఉగ్రవాద వర్గాల విషయంలో ఇది వాస్తవమే.
అవును, వ్యక్తులకూ, యావత్ సమాజానికీ రహస్యత్వం అపాయకరమైనది కాగలదు. అమాయక బలిపశువుల్ని హింసాత్మకంగా ఎరకుగురిచేసే రహస్య టీనేజ్ గేంగ్‌ల్ని గురించీ, సీక్రెటివ్ మాఫియావంటి నేర అసోసియేషన్‌లను గురించీ, కు క్లుక్స్ క్లాన్‌వంటి శ్వేతోన్నతాధికార వర్గాల్ని గురించీ ఆలోచించండి.a ప్రపంచ శాంతి భద్రతల్ని సాధించేందుకు అడ్డదిడ్డమైన ప్రయత్నాల్ని కొనసాగిస్తున్న ప్రపంచవ్యాప్తంగావున్నటువంటి అనేక ఉగ్రవాద వర్గాల్ని గురించైతే ప్రస్తావించాల్సిన అవసరమేలేదు.
ఇప్పటి వరకూ అవి ఏమిచేస్తున్నాయ్?
1950లలో, ప్రచ్ఛన్నయుద్ధ ఫలితంగా, అనేక పశ్చిమ యూరోపియన్ దేశాల్లో రహస్య వర్గాలు సంస్థీకరించబడ్డాయి. ఈ రహస్య వర్గాలు, పశ్చిమ యూరప్‌ను జయించడానికి సోవియట్ దేశాలు ఎన్నటికీ ప్రయత్నించకుండా అరికట్టేందుకు చేసే ఉద్యమాలకు ఆధారంగా పనిచేయడానికే సంస్థీకరించబడ్డాయి. ఉదాహరణకు, జర్మన్ భాషా వార్తా పత్రికయైన ఫోకస్ ప్రకారంగా, “ఈ కాలంలోనే ఆస్ట్రియానందు 79 రహస్యాయుధ డిపోలు” స్థాపించబడ్డాయి. ఈ వర్గాల్ని గురించి యూరోపియన్ దేశాలన్నింటికీ కూడా తెలియకపోయి ఉండవచ్చు. 1990ల తొలి భాగంలో ఓ వార్తా పత్రిక వాస్తవికంగా ఇలా రిపోర్టు చేసింది: “ఈ సంస్థల్లో నేడెన్ని కొనసాగుతున్నాయో, ఇప్పటివరకూ అవి ఏమి చేస్తున్నాయో అనే విషయం ఇంతవరకూ తెలియదు.”
అవును, అది వాస్తవమే. బహుశా ఈ క్షణంలోనే, మన ఊహలకందనంత తీవ్రమైన ముప్పును తీసుకువస్తున్న రహస్య వర్గాలెన్ని ఉన్నాయో నిజంగా ఎవరెరగ్గలరు?
[అధస్సూచీలు]
a ఈ అమెరికా వర్గం, తమ చిహ్నంగా కాలుతున్న సిలువను ఉపయోగించడం ద్వారా ప్రాచీనకాల రహస్య సమాజాల మతపరమైన మూలకాల్ని కొన్నింటిని పదిలపర్చుకుంది. గతంలో ఇది, దాని సభ్యులు తెల్లని అంగీలనూ దుప్పట్లనూ ధరించుకొని నల్లవారికీ, కాథోలిక్కులకూ, యూదులకూ, విదేశీయులకూ మరి సంస్థీకరింపబడిన శ్రామికవర్గానికీ వ్యతిరేకంగా రాత్రివేళల్లో ఆకస్మిక దాడుల్ని చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తపర్చారు.