కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 6/1 పేజీలు 7-12
  • యెహోవా—రహస్యాల్ని బయల్పర్చే దేవుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా—రహస్యాల్ని బయల్పర్చే దేవుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సర్వశక్తిమంతుడే అయినా ప్రేమగలవాడు
  • యెహోవా ఉపయోగిస్తున్న ప్రతినిధుల ఎడల తగిన గౌరవం చూపడం
  • బాహాటంగానా లేక రహస్యంగానా?
  • తెలియజేయాలా, తెలియజేయకూడదా?
  • క్రైస్తవులు దాయకూడని ఓ రహస్యం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “పవిత్ర రహస్యంలో . . . దేవుని తెలివి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దోహదపడే ఒక ఏర్పాటు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 6/1 పేజీలు 7-12

యెహోవా—రహస్యాల్ని బయల్పర్చే దేవుడు

“మర్మములను [రహస్యాల్ని] బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు.”—దానియేలు 2:28.

1, 2. (ఎ) యెహోవా తన బద్ధశత్రువునుండి ఏ విధంగా భిన్నంగా ఉన్నాడు? (బి) మానవులు ఈ తేడాను ఎలా ప్రతిబింబిస్తారు?

సర్వోన్నతుడునూ, ప్రేమగల విశ్వాధిపతీ, అద్వితీయ సృష్టికర్తయునైన యెహోవా, జ్ఞాన న్యాయాలు మూర్తీభవించిన దేవుడై ఉన్నాడు. తన గుర్తింపునూ, తన పనుల్నీ, లేక తన సంకల్పాల్నీ మరుగుపర్చుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన తన నిర్ణయకాలంలో, తన చిత్తంచొప్పున తననుతాను బయల్పర్చుకుంటాడు. ఈ విషయంలో ఆయన తన బద్ధశత్రువగు అపవాదియైన సాతానుకు భిన్నంగా ఉన్నాడు. సాతాను తన నిజ గుర్తింపునూ, ఉద్దేశాల్నీ మరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

2 యెహోవా, సాతానూ ఒకరికొకరు భిన్నంగా ఉన్నట్లుగానే వారి ఆరాధికులూ భిన్నంగా ఉన్నారు. సాతాను నాయకత్వాన్ని అనుసరించేవారు, వంచనామోసాలచే గుర్తించబడతారు. వాళ్లు, అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ, తమ్మునుతాము ప్రయోజనకారులుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఆశ్చర్యపోనక్కర్లేదని కొరింథులోని క్రైస్తవులకు తెలియజేయబడింది. “ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు.” (2 కొరింథీయులు 11:13, 14) మరోవైపున, క్రైస్తవులు తమ నాయకునిగా క్రీస్తువైపు చూస్తారు. ఆయన భూమిపై ఉన్నప్పుడు, తన తండ్రియైన యెహోవా దేవుని వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. (హెబ్రీయులు 1:1-3) ఆ విధంగా, క్రైస్తవులు క్రీస్తును అనుసరించడం ద్వారా, సత్యవంతుడూ, దాపరికంలేనివాడునూ వెలుగుమయుడునూ అయిన దేవుడగు యెహోవాను అనుకరిస్తున్నారు. తమ గుర్తింపునుగానీ, తమ పనుల్నిగానీ లేక తమ సంకల్పాల్నిగానీ మరుగుపర్చుకోవాల్సిన అవసరం వాళ్లకూ లేదు.—ఎఫెసీయులు 4:17-19; 5:1, 2.

3. యెహోవాసాక్షులుగా మారిన ప్రజలు “రహస్య మతశాఖ”లో చేరేందుకు ఒత్తిడి చేయబడ్డారనే అభియోగాన్ని మనమెలా త్రిప్పికొట్టొచ్చు?

3 యెహోవా, తనకు సముచితమనిపించిన సమయాల్లో తన సంకల్పాల్ని గూర్చిన, భవిష్యత్తును గూర్చిన మానవులకు ఇంతకు మునుపు తెలియని వివరాల్ని ఆయన బయల్పరుస్తాడు. ఈ భావంలో, ఆయన రహస్యాల్ని బయల్పర్చే దేవుడు. ఆ విధంగా, ఆయన్ని సేవించాలని కోరుకునే ప్రజలు, బయల్పర్చబడిన అలాంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆహ్వానించబడ్డారు—అవును, దాన్ని తెల్సుకోవాలని ఉద్బోధించబడ్డారు కూడా. యూరోపియన్‌ దేశాల్లోని ఓ దేశమందు 1,45,000 మందికిపైగానున్న సాక్షులపై 1994లో జరిపిన సర్వేలో, సగటున వారిలో ప్రతీ ఒక్కరూ తాము సాక్షులుకావడానికి ఎంపిక చేసుకోక మునుపు వ్యక్తిగతంగా యెహోవాసాక్షుల బోధల్ని మూడేళ్లు పరిశోధించారనే విషయం వెల్లడైంది. వాళ్లు ఏ విధమైన ఒత్తిడికీ లోనుకాకుండా, తమ ఇష్టం చొప్పునే ఎంపిక చేసుకున్నారు. వాళ్లు స్వేచ్ఛాచిత్తాన్నీ, స్వేచ్ఛాపూర్వకమైన క్రియనూ చేయడంలో కొనసాగుతూ ఉన్నారు. ఉదాహరణకు, వాళ్లలో కొందరు క్రైస్తవుల కొరకైన ఉన్నత నైతిక ప్రమాణాలతో ఏకీభవించకపోయినందున, అటు తర్వాత సాక్షులుగా కొనసాగడానికి సుముఖత చూపించలేదు. అయితే, గత ఐదేళ్ల కాలంలో మునుపటి సాక్షులైన వీళ్లలో అధికశాతం, సాక్షులుగా తమ సహవాసాన్నీ, కార్యకలాపాన్నీ పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యల్ని గైకొనడం ఆసక్తికరమైన విషయం.

4. నమ్మకమైన క్రైస్తవుల్ని ఏది కలతపర్చనక్కర్లేదు, ఎందుకని?

4 మునుపటి సాక్షుల్లో అందరూ తిరిగి రాలేదనుకోండి. వారిలో కొందరు ఒకప్పుడు, క్రైస్తవ సంఘంలో బాధ్యతాయుతమైన స్థానాల్ని నిర్వహించారు. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదు. ఎందుకంటే యేసు సన్నిహిత అనుచరుల్లో ఒకడైన అపొస్తలుడగు యూదా కూడా తప్పిపోయాడు. (మత్తయి 26:14-16, 20-25) కానీ క్రైస్తవత్వం గురించే కలతచెందడానికి ఇదొక కారణమా? యెహోవాసాక్షులు కొనసాగిస్తున్న తమ విద్యాసంబంధమైన కార్యకలాప సాఫల్యాన్ని ఇది నిర్వీర్యం చేస్తుందా? యూదా ఇస్కరియోతు విద్రోహక చర్య దేవుని సంకల్పాల్ని నిలిపివేయలేక పోయినట్లుగానే ఇది ఎన్నటికీ దాన్ని నిర్వీర్యం చేయలేదు.

సర్వశక్తిమంతుడే అయినా ప్రేమగలవాడు

5. యెహోవా యేసుక్రీస్తులు మానవుల్ని ప్రేమిస్తున్నారని మనకెలా తెలుసు, వాళ్లీప్రేమను ఎలా చూపించారు?

5 యెహోవా ప్రేమాస్వరూపియైన దేవుడు. ఆయన ప్రజల ఎడల శ్రద్ధ కల్గివున్నాడు. (1 యోహాను 4:7-11) ఆయన మహోన్నతుడైనప్పటికీ, మానవుల్ని తన స్నేహితులుగా చేసుకోవడంలో ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన ప్రాచీన సేవకుల్లో ఒకని గురించి, మనమిలా చదువుతాం: “అబ్రాహాము దేవుని [“యెహోవాను,” NW] నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను . . . మరియు దేవుని [“యెహోవా,” NW] స్నేహితుడని అతనికి పేరుకలిగెను.” (యాకోబు 2:23; 2 దినవృత్తాంతములు 20:7; యెషయా 41:8) మానవ స్నేహితులు గోప్యమైన విషయాల్నిగానీ లేక రహస్యాల్నిగానీ పంచుకున్నట్లుగానే, యెహోవా తన స్నేహితులతో కూడా పంచుకుంటున్నాడు. ఈ విషయంలో యేసు తన తండ్రిని అనుకరించాడు, ఇది ఆయన తన శిష్యుల్ని తన స్నేహితులుగా చేసుకొని, వారితో రహస్యాల్ని పంచుకున్నాడనే వాస్తవమందు స్పష్టమౌతోంది. ఆయన వారితో ఇలా చెప్పాడు: “దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.” (యోహాను 15:15) యెహోవా, ఆయన కుమారుడూ, మరి ఆయన స్నేహితులూ ఆంతరంగిక సమాచారాన్నిగానీ లేక ‘రహస్యాల్ని’గానీ కలిసి పంచుకోవడం, వారిని విడదీయలేని ప్రేమాంకిత బంధమందు ఐక్యపరుస్తున్నాయి.—కొలొస్సయులు 3:14.

6. తన ఉద్దేశ్యాల్ని మరుగుపర్చుకోవాల్సిన అవసరం యెహోవాకు ఎందుకులేదు?

6 “తానే కర్త అవుతాడు” అని యెహోవా అను నామానికిగల భావం. అది, ఆయన తన సంకల్పాల్ని నెరవేర్చడం విషయంలో తానెలా అవ్వాల్సివుందో అలా అయ్యే ఆయన సామర్థ్యాన్ని సూచిస్తోంది. మానవులవలెగాక, తన ఉద్దేశాల్ని నెరవేర్చకుండా ఇతరులు తనను అణగద్రొక్కుతారని భయపడి, వాటిని మరుగుచేయాల్సిన అవసరం యెహోవాకు లేదు. ఆయన విఫలుడుకాడు అనే విషయం స్పష్టం, గనుకనే ఆయన తానుచేయ సంకల్పించిన వాటిలో అనేకమైన వాటిని, తన వాక్యమైన బైబిల్లో బాహాటంగా బయల్పర్చాడు. ఆయన ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నా . . . వచనము . . . నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలముచేయును.”—యెషయా 55:10, 11.

7. (ఎ) యెహోవా ఏదెనులో ఏమని ప్రవచించాడు, దేవుడు సత్యవంతుడని సాతాను ఎలా రుజువుచేశాడు? (బి) 2 కొరింథీయులు 13:8 వచనంలోని సూత్రం ఎల్లప్పుడూ ఏ విధంగా నిజమౌతుంది?

7 ఏదెనులో తిరుగుబాటు జరిగిన తదనంతరం త్వరలోనే, యెహోవా తనకూ తన బద్ధశత్రువైన సాతానుకూ మధ్య కొనసాగుతున్న వివాదపు తుదిఫలితాన్ని క్లుప్తంగా బయల్పర్చాడు. దేవుని వాగ్దాన సంతానం శాశ్వతంగా కాకపోయినా బాధాకరమైనరీతిలో కొట్టబడగా, సాతాను చిట్టచివరకు నాశనమయ్యేలా కొట్టబడతాడు. (ఆదికాండము 3:15) సా.శ. 33లో, క్రీస్తు యేసు మరణానికి కారణమవ్వడంద్వారా అపవాది ఆ సంతానమైన ఆయన్ని నిజంగానే కొట్టింది. ఆ విధంగా, సాతాను లేఖనాన్ని నెరవేర్చి, అదే సమయంలో యెహోవాను సత్యానికి దేవుడని రుజువుచేశాడు. అలా చేయడం, కచ్చితంగా సాతాను ఉద్దేశం కాదు. సత్యం ఎడలా, నీతి ఎడలా అతనికిగల విద్వేషమూ, అలాగే గర్వభరితమైన, పశ్చాత్తాపంలేని అతని వైఖరీ, అతడేమి చేయబోతాడని దేవుడు ప్రవచించాడో దాన్ని చేయడానికే వాన్ని కచ్చితంగా నడిపించాయి. అవును, సాతానుతోపాటూ, సత్య వ్యతిరేకులందరి విషయంలోనూ ఈ సూత్రం నిజమౌతుంది: “మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.”—2 కొరింథీయులు 13:8.

8, 9. (ఎ) సాతాను దేన్ని ఎరుగును, కానీ ఇది యెహోవా సంకల్పాల నెరవేర్పుకు ముప్పును తెస్తుందా? (బి) యెహోవా వ్యతిరేకులు ఏ స్పష్టమైన హెచ్చరికల్ని నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు?

8 దేవుని రాజ్యం 1914లో అదృశ్యంగా స్థాపించబడిన తరుణంలో, ప్రకటన 12:12 ఇలా అన్వయించబడింది: “అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నా[డు].” కానీ, సాతాను తనకు మిగిలిన సమయం కొంచెమేనని గ్రహించడం, అతడు తన విధానాన్ని మార్చుకోవడానికి కారణమౌతుందా? అలా చేయడం, యెహోవాయే సత్యానికి దేవుడనీ, సర్వోన్నత పరిపాలకునిగా ఆయనే ఆరాధనకు పాత్రుడనీ సాతాను గుర్తించినట్టు అవుతుంది. అయితే, ఈ వాస్తవాలన్నిటినీ అపవాది గ్రహించినప్పటికీ, తన ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడడంలేదు.

9 సాతాను లోక విధానంపై తీర్పును అమలుచేసేందుకు క్రీస్తు వచ్చేటప్పుడు జరగబోయేదాన్ని గురించి యెహోవా బాహాటంగానే బయల్పరుస్తున్నాడు. (మత్తయి 24:29-31; 25:31-46) ఈ విషయంలో, ప్రపంచ పాలకుల్ని గురించి ఆయన వాక్యమిలా ప్రకటిస్తోంది: “లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని [“శాంతి భద్రతలున్నాయని,” NW] చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.” (1 థెస్సలొనీకయులు 5:3) సాతాను మాదిరిని అనుసరించేవారందరూ ఈ స్పష్టమైన హెచ్చరికను నిర్లక్ష్యంచేస్తారు. తమ దుష్ట హృదయాల్నిబట్టి వాళ్లు అంధులయ్యారు. ఇది, వాళ్లు తమ దుష్టత్వాన్నిబట్టి పశ్చాత్తాపం చెందకుండా యెహోవా సంకల్పాలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నించే తమ ప్రణాళికావ్యూహాల్ని మార్చుకోకుండా చేస్తోంది.

10. (ఎ) 1 థెస్సలొనీకయులు 5:3వ వచనం ఎంతమేరకు నెరవేరి ఉండవచ్చు, కానీ యెహోవా ప్రజలెలా ప్రతిస్పందించాలి? (బి) విశ్వాసంలేని ప్రజలు భవిష్యత్తునందు దేవుని ప్రజల్ని వ్యతిరేకించడంలో ఎందుకు మరింత దురాక్రమణదారులుగా అవుతారు?

10 విశేషంగా 1986 నుండీ అంటే ఐక్యరాజ్యసమితి ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ శాంతి సంవత్సరంగా ప్రకటించినప్పటి నుండీ, శాంతి భద్రతల్ని గురించి చర్చించుకోవడంలో లోకం పూర్తిగా మునిగిపోయింది. ప్రపంచ శాంతిని కాపాడేందుకు ప్రయత్నించడంలో కచ్చితమైన చర్యల్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రయత్నం కొంతమేరకు సఫలీకృతమైనట్టు కనబడుతోంది. ఈ ప్రవచన నెరవేర్పు యావత్తూ ఇదేనా లేక దిగ్భ్రాంతినొందించే ఓ రకమైన భవిష్యద్‌ ప్రకటన కోసం మనం ఎదురుచూడొచ్చా? ఆ విషయాన్ని, యెహోవా తన నియమిత కాలంలో స్పష్టపరుస్తాడు. ఈలోగా, “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు” ఆత్మీయంగా మేల్కొని ఉందాం. (2 పేతురు 3:11, 12) శాంతి భద్రతల్ని గూర్చిన మరిన్ని చర్చలతో సమయం గడుస్తుండగా, ఈ హెచ్చరికను గూర్చి తెలిసీ దాన్ని నిర్లక్షపెట్టేందుకే ఎంపికచేసుకున్న కొంతమంది వ్యక్తులు, యెహోవా తన మాటను నెరవేర్చడనీ లేక నెరవేర్చలేడనీ తలంచడంలో మరింత తిరస్కార స్వభావులుగా కావొచ్చు. (ప్రసంగి 8:11-13; 2 పేతురు 3:3, 4 పోల్చండి.) కానీ, యెహోవా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడని నిజ క్రైస్తవులు ఎరుగుదురు!

యెహోవా ఉపయోగిస్తున్న ప్రతినిధుల ఎడల తగిన గౌరవం చూపడం

11. దానియేలు యోసేపులు యెహోవాను గురించి ఏమి నేర్చుకున్నారు?

11 నియో బబులోను సామ్రాజ్య పాలకుడైన రాజగు నెబుకద్నెజరు కల్లోలపర్చే ఓ స్వప్నాన్ని కని, దాన్ని మర్చిపోయిప్పుడు, ఆయన సహాయాన్ని అర్థించాడు. ఆయన యాజకులుగానీ, గారడీవిద్యగలవారుగానీ, శకునగాండ్రుగానీ ఆయన కనిన స్వప్నమేంటో, దాని భావమేంటో వివరించలేక పోయారు. అయితే, దేవుని సేవకుడైన దానియేలు దాన్ని వివరించగలిగాడు. అంతేగాక, ఆ స్వప్నాన్నీ దాని భావాన్నీ తన స్వంత జ్ఞానం మూలంగా బయల్పర్చడంలేదని నిస్సంకోచంగా ఒప్పుకున్నాడు. దానియేలు ఇలా తెలియజేశాడు: “మర్మములను [“రహస్యాల్ని,” NW] బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను.” (దానియేలు 2:1-30) శతాబ్దాల క్రిందట, దేవుని మరో ప్రవక్తయైన యోసేపు కూడా, యెహోవాయే రహస్యాల్ని బయల్పర్చువాడని తెలుసుకున్నాడు.—ఆదికాండము 40:8-22; ఆమోసు 3:7, 8.

12, 13. (ఎ) దేవుని మహాగొప్ప ప్రవక్త ఎవరు, మరి మీరెందుకు అలా చెబుతారు? (బి) ‘పవిత్ర రహస్యాల విషయములో దేవుని గృహనిర్వాహకులు’గా నేడు ఎవరు సేవచేస్తున్నారు, మరి మనం వారిని ఎలా దృష్టించాలి?

12 భూమిపై యెహోవాను సేవించిన ప్రవక్తల్లోకెల్లా మహాగొప్ప ప్రవక్త యేసు. (అపొస్తలుల కార్యములు 3:19-24) పౌలు ఇలా వివరించాడు: “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయనద్వారా ప్రపంచములను నిర్మించెను.”—హెబ్రీయులు 1:1, 2.

13 తొలి క్రైస్తవులకు దైవిక రహస్యాల్ని తెలియజేసిన తన కుమారుడైన యేసుద్వారా యెహోవా వారితో మాట్లాడాడు. యేసు వారితో ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యమర్మము [“రహస్యాలు,” NW] లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది.” (లూకా 8:10) అటు తర్వాత, ‘క్రీస్తు సేవకులనీ, దేవుని పవిత్ర రహస్యాల విషయములో గృహనిర్వాహకులనీ’ అభిషిక్త క్రైస్తవుల్ని గురించి పౌలు మాట్లాడాడు. (1 కొరింథీయులు 4:1, NW) నేడు, అభిషిక్త క్రైస్తవులు ఆ విధంగానే సేవచేస్తున్నారు. వాళ్లు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిగా రూపొంది, దాని పరిపాలక సభద్వారా తగినవేళ ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నారు. (మత్తయి 24:45-47) గత కాలాల్లోని దేవుని ప్రేరేపిత ప్రవక్తల్నీ, మరి విశేషంగా దేవుని కుమారున్నీ మనం ఉన్నతంగా గౌరవించినట్లైతే, ఈ క్లిష్టమైన కాలాల్లో తన ప్రజలకు ఎంతో అవసరమైన బైబిలు సమాచారాన్ని బయల్పర్చడంలో నేడు యెహోవా ఉపయోగించుకుంటున్న మానవ మాధ్యమాన్ని కూడా మనం గౌరవించమా?—2 తిమోతి 3:1-5, 13.

బాహాటంగానా లేక రహస్యంగానా?

14. క్రైస్తవులు కార్యకలాపాల్ని రహస్యంగా ఎప్పుడు నెరవేరుస్తారు, అలా వాళ్లు ఎవరి మాదిరిని అనుసరిస్తారు?

14 యెహోవా విషయాల్ని బాహాటంగా బయల్పరుస్తున్నాడు అంటే, క్రైస్తవులు అన్నివేళలా, అన్ని పరిస్థితిల్లోనూ తమకు తెల్సిన ప్రతిదాన్నీ బయల్పర్చాలని దాని భావమా? “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి” అని యేసు తన అపొస్తలులకు ఇచ్చిన సలహాను క్రైస్తవులు అనుసరిస్తారు. (మత్తయి 10:16) క్రైస్తవులు తమ మనస్సాక్షి కోరుతున్నట్లుగా దేవున్ని ఆరాధించకూడదని వాళ్లకు చెప్పబడినట్లైతే, యెహోవా ఆరాధనను నిర్బంధించే హక్కు ఏ మానవ సంస్థకూలేదని వాళ్లు గ్రహిస్తారు గనుక ‘దేవునికి విధేయత’ చూపించడంలోనే వాళ్లు కొనసాగుతారు. (అపొస్తలుల కార్యములు 5:29) దీని ఔచిత్యాన్ని యేసే చూపించాడు. మనమిలా చదువుతాం: “అటుతరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక, యేసు—నా సమయమింకను రాలేదు—మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో [అవిశ్వాసులైన తన స్వంత సహోదరులతో] చెప్పెను. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత, ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.”—యోహాను 7:1, 2, 6, 8-10.

తెలియజేయాలా, తెలియజేయకూడదా?

15. రహస్యాన్ని దాచివుంచడం, కొన్నిసార్లు చేయదగిన ప్రేమపూర్వకమైన విషయమని యోసేపు ఏ విధంగా సూచించాడు?

15 కొన్ని సందర్భాల్లో, ఓ విషయాన్ని రహస్యంగా ఉంచడం, జ్ఞానయుక్తమైనదేగాక ప్రేమపూర్వకమైనది కూడా. ఉదాహరణకు, యేసును పెంచిన తండ్రియైన యోసేపు తనకు ప్రధానం చేయబడిన మరియ “గర్భవతి” అయిందని తెల్సుకున్నప్పుడు, ఎలా ప్రతిస్పందించాడు? మనమిలా చదువుతాం: “ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.” (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 1:18, 19) ఆమెను అవమానం పాలుకావడానికి విడిచిపెట్టడం ఎంత దయలేనితనమై ఉండేదో కదా!

16. గోప్యంగా ఉంచాల్సిన విషయాలకు సంబంధించి పెద్దలూ, అలాగే సంఘంలోని ఇతర సభ్యులూ ఏ బాధ్యతను కల్గివున్నారు?

16 ఇబ్బందులకూ, బాధలకూ కారణంకాగల్గే గోప్యమైన విషయాల్ని, అనధికారిక వ్యక్తులకు బయల్పర్చకూడదు. తోటి క్రైస్తవులకు వ్యక్తిగత సలహాను ఇస్తున్నప్పుడుగానీ, వాళ్లని ఓదారుస్తున్నప్పుడుగానీ, బహుశా యెహోవాకు వ్యతిరేకంగా గంభీరమైన పాపాన్ని చేసినందున వాళ్లపై క్రమశిక్షణచర్య తీసుకున్నప్పుడుగానీ క్రైస్తవ పెద్దలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిని లేఖనాధారమైన రీతిలో నిర్వహించడం అవసరం; గోప్యమైన వివరాల్ని దానికి సంబంధించని వారికి వివరించడం అనవసరం, అది ప్రేమలేనితనం అవుతుంది. క్రైస్తవ సంఘంలోని సభ్యులు పెద్దలనుండి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నించరు కానీ గోప్యమైన విషయాల్ని రహస్యంగా ఉంచాల్సిన పెద్దల బాధ్యతను కచ్చితంగా గౌరవిస్తారు. సామెతలు 25:9 ఇలా సూచిస్తోంది: “నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము.”

17. అనేక సందర్భాల్లో గోప్యమైన విషయాల్ని క్రైస్తవులు ఎందుకు రహస్యంగా ఉంచుతారు, కానీ వాళ్లు ఎల్లప్పుడూ అలా ఎందుకు చేయరు?

17 ఈ సూత్రం, కుటుంబ వలయంలోగానీ లేక సన్నిహిత స్నేహితులమధ్యగానీ అన్వయించదగినది. అపోహలు కలుగకుండా జాగ్రత్తపడేందుకూ, బాంధవ్యాలు బెడిసికొట్టకుండా జాగ్రత్తపడేందుకూ కొన్ని విషయాల్ని గోప్యంగా ఉంచడం ప్రాముఖ్యం. “ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండెగాని [“రహస్యాల్ని బయల్పర్చువాని,” NW] నాలుక కోపదృష్టి కలిగించును.” (సామెతలు 25:23) తలిదండ్రులకూ, క్రైస్తవ పెద్దలకూ లేక ఇతర అధికారిక వ్యక్తులకూ గోప్యమైన విషయాల్ని కూడా చెప్పేలా యెహోవా ఎడలా, ఆయన నీతియుక్తమైన సూత్రాల ఎడలా నమ్మకంగా ఉండడమూ, అలాగే తప్పిదస్థుల ఎడలగల ప్రేమా అప్పుడప్పుడూ బలవంతంచేయొచ్చు.a కానీ అనేక సందర్భాల్లో, క్రైస్తవులు ఇతరుల ఆంతరంగిక రహస్యాల్ని గోప్యంగావుంచి, వాటిని తమస్వంత రహస్యాల్ని కాపాడుకున్నట్లుగానే కాపాడతారు.

18. మనం దేన్ని తెలియజేయాలి, దేన్ని తెలియజేయకూడదు అనే విషయాన్ని నిర్ణయించడానికి, ఏ మూడు క్రైస్తవ లక్షణాలు మనకు సహాయపడగలవు?

18 క్లుప్తంగా చెప్పాలంటే, ఓ క్రైస్తవుడు కొన్ని విషయాల్ని అవసరమైనప్పుడు గోప్యంగా ఉంచి, సముచితమైనప్పుడు మాత్రమే వాటిని బయల్పర్చడంద్వారా యెహోవాను అనుకరిస్తాడు. దేన్ని తెలియజేయాలో, దేన్ని తెలియజేయకూడదో నిర్ణయించుకోవడంలో, అతన్ని వినయమూ, విశ్వాసమూ, ప్రేమా నడిపిస్తాయి. ఒకడు తనకు తెల్సిన ప్రతిదాన్నీ ఇతరులకు తెలియజేయడంద్వారాగానీ లేక తాను తెలియజేయకూడని రహస్యాలతో వాళ్లలో ఉత్కంఠ రేకెత్తించడంద్వారాగానీ, వాళ్లను ముగ్ధుల్నిచేయడానికి ప్రయత్నిస్తూ తనస్వంత ప్రాముఖ్యతను పెంచుకోకుండా వినయం అతనికి పగ్గాలు వేస్తుంది. ప్రారంభంలో ఎకాయెకిన ఇతరులకు కోపాన్ని తెప్పించే విషయాల్ని చెప్పకుండా జాగ్రత్తపడుతూ, దైవికంగా దయచేయబడిన బైబిలు సమాచారాన్ని ప్రకటించేందుకు యెహోవా వాక్యమందూ, క్రైస్తవ సంఘమందూ గల విశ్వాసం అతన్ని ప్రేరేపిస్తుంది. అవును, దేవున్ని మహిమపర్చే విషయాల్నీ, ప్రజలు జీవాన్ని పొందేందుకు వాళ్లు తెల్సుకోవాల్సిన విషయాల్నీ అతడు బాహాటంగా తెలియజేసేందుకు అతన్ని ప్రేమ ప్రేరేపిస్తుంది. మరోవైపున, అతడు గోప్యంగా ఉంచాల్సిన ఆంతరంగిక విషయాల్ని బయల్పర్చడు, ఎందుకంటే అనేక సందర్భాల్లో వాటిని బయల్పర్చడం, ప్రేమలేనితనాన్ని సూచిస్తుందని అతడు గ్రహిస్తాడు.

19. నిజ క్రైస్తవుల్ని గుర్తించేందుకు ఏ చర్య దోహదపడ్తుంది, మరి అది దేనియందు ప్రతిఫలించబడ్తుంది?

19 నిజ క్రైస్తవుల్ని గుర్తించేందుకు సమతూకమైన ఈ తీరు సహాయపడుతుంది. వాళ్లు దేవుని గుర్తింపును, నామరహితమనే ముసుగులోనో లేక మర్మమైన వివరించలేని త్రిత్వ సిద్ధాంతం వెనుకో మరుగుచేయరు. తెలియబడని దేవుళ్లు, అబద్ధమతాన్నేగానీ నిజమైన మతాన్ని సూచించరు. (అపొస్తలుల కార్యములు 17:22, 23 చూడండి.) ‘దేవుని రహస్యాల విషయంలో గృహనిర్వాహకులు’గా ఉండే ఆధిక్యతను యెహోవా అభిషిక్త సాక్షులు నిజంగా ప్రశంసిస్తారు. ఈ రహస్యాల్ని ఇతరులకు బాహాటంగా బయల్పర్చడంద్వారా, వాళ్లు యెహోవా స్నేహాన్ని అన్వేషించేందుకు యథార్థవంతులను ఆహ్వానిస్తారు.—1 కొరింథీయులు 4:1, NW; 14:22-25; జెకర్యా 8:23; మలాకీ 3:18.

[అధస్సూచీలు]

a కావలికోట, (ఆంగ్లం) నవంబరు 15, 1985లోని “ఇతరుల పాపాల్లో పాలివారుకాకండి” అనే శీర్షికను చూడండి.

మీరు ఎలా జవాబిస్తారు?

◻ తన ఉద్దేశాల్ని మరుగుచేయాల్సిన అవసరం యెహోవాకు ఎందుకు లేదు?

◻ యెహోవా తన రహస్యాల్ని ఎవరికి బయల్పరుస్తాడు?

◻ గోప్యమైన విషయాలకు సంబంధించి క్రైస్తవులపై ఏ బాధ్యతవుంది?

◻ దేన్ని తెలియజేయాలి, దేన్ని తెలియజేయకూడదు అనేదాన్ని తెలుసుకోవడానికి క్రైస్తవులకు ఏ మూడు లక్షణాలు సహాయపడతాయి?

[8వ పేజీలోని చిత్రం]

యెహోవా తన వాక్యంద్వారా రహస్యాల్ని బయల్పరుస్తాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి