కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 6/1 పేజీలు 12-17
  • క్రైస్తవులు దాయకూడని ఓ రహస్యం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవులు దాయకూడని ఓ రహస్యం!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘పవిత్ర రహస్యం’ గుర్తించబడింది
  • బయల్పర్చబడిన రహస్యాన్ని తప్పక తెలియజేయాలి!
  • సాతాను దవుడలకు గాలం వేయడం
  • మునుపెన్నటికన్నా ఇప్పుడు అధికంగా!
  • మీరు ఇతరులకు చెప్పగలిగే ఒక రహస్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఈ పత్రికలో
    తేజరిల్లు!—2018
  • “పవిత్ర రహస్యంలో . . . దేవుని తెలివి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • ఒక పరిశుద్ధ మర్మము వెల్లడియగుచున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 6/1 పేజీలు 12-17

క్రైస్తవులు దాయకూడని ఓ రహస్యం!

“నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని . . . రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.”—యోహాను 18:20.

1, 2. లేఖనాల్లో ఉపయోగించబడినట్లుగా మిస్టీరియన్‌ అనే గ్రీకు పద ప్రాముఖ్యత ఏమిటి?

మిస్టీరియన్‌ అనే గ్రీకు పదం, రిశుద్ధలేఖనముల నూతనలోక అనువాదములో (ఆంగ్లం) 25 సార్లు ‘పవిత్ర రహస్యం’ అనీ, 3 సార్లు “మర్మం” అనీ అనువదించబడింది. పవిత్రమైనదిగా పిలువబడిన రహస్యం నిశ్చయంగా ప్రాముఖ్యమైనదై ఉండాలి! అలాంటి రహస్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందే ఆధిక్యతగల వాళ్లెవరైనా సరే, విశ్వాధిపతియైన సర్వోన్నతుడగు దేవునితో ఓ రహస్యాన్ని పంచుకునేందుకు యోగ్యులుగా లెక్కించబడతారు, గనుక తాము ఉన్నతంగా గౌరవించబడినట్లు భావించాలి.

2 “మర్మము” అని అనువదించడంకన్నా అనేక సందర్భాల్లో ‘పవిత్ర రహస్యం’ అని అనువదించడమే మరింత సముచితమైనదనీ వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ ధ్రువపరుస్తోంది. మిస్టీరియన్‌ గురించి అదిలా చెబుతోంది: “[క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో] అది, (ఆంగ్ల పదంలా) మర్మభరితమైన పదం కాదుగానీ గుణగ్రహించే సహజ సామర్థ్యాన్ని మించినదని సూచిస్తోంది. అది దైవిక ప్రకటన మూలంగానే వెల్లడికాగలదు. అది దేవుడు నియమించిన కాలంలోనూ, తన పరిశుద్ధాత్మచే వెలిగొందింపబడిన వారికి మాత్రమే బయల్పర్చబడే రీతిలోనూ తెలియజేయబడ్తుంది. సామాన్య భావంలో మర్మము అంటే జ్ఞానాన్ని మరుగుపర్చడమనే అర్థాన్నిస్తోంది; దాని లేఖనాధార ప్రాముఖ్యత ఏమిటంటే సత్యాన్ని బయల్పర్చడమే. కాబట్టి ‘తెలియజేయడం,’ ‘ప్రత్యక్షపర్చడం,’ ‘బయల్పర్చడం,’ ‘ప్రకటించడం,’ ‘అవగాహితమవ్వడం,’ ‘పంచుకోవడం’ అనే పదాలు, గూఢమైన విషయాంశంతో విశేషంగా సంబంధంకల్గివున్న పదాలైవున్నాయి.”

3. మర్మభరితమైన కొన్ని మతగుంపులనుండి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ఏ విధంగా భిన్నంగావుంది?

3 ఈ వివరణ, మొదటి శతాబ్దంలో వర్ధిల్లిన మర్మభరితమైన మతాలకూ, క్రొత్తగా రూపొందిన క్రైస్తవ సంఘానికీ మధ్యనున్న ప్రధానమైన ఓ తేడాను ఉన్నతపరుస్తుంది. రహస్య మతాల్లోకి పరిచయ కార్యక్రమంతో ప్రవేశించినవారు తరచుగా మతపరమైన బోధల్ని కాపాడేందుకు రహస్యాల్ని దాస్తామనే ప్రమాణానికి కట్టుబడివుండాల్సి ఉంటుంది. అయితే క్రైస్తవులు ఎన్నడూ అలా బలవంతం చేయబడలేదు. అపొస్తలుడైన పౌలు ‘పవిత్ర రహస్యమందున్న దైవిక జ్ఞానాన్ని’ గూర్చి మాట్లాడుతూ, దాన్ని “మరుగైన జ్ఞానం” అనీ అంటే ‘ఈ విధాన పాలకులకు’ మరుగుపర్చబడిన జ్ఞానమనీ పిలువడం వాస్తవమే. ఆ జ్ఞానం బాహాటంగా తెలియజేయబడేలా దేవుని పరిశుద్ధాత్మద్వారా ఎవరికైతే వెల్లడి చేయబడిందో ఆ క్రైస్తవులకు అది మరుగుపర్చబడలేదు.—1 కొరింథీయులు 2:7-12, NW; సామెతలు 1:20 పోల్చండి.

‘పవిత్ర రహస్యం’ గుర్తించబడింది

4. ‘పవిత్ర రహస్యం’ ఎవరిపై కేంద్రీకృతమైవుంది, ఏ విధంగా?

4 యెహోవా ‘పవిత్ర రహస్యం’ యేసుక్రీస్తుపై కేంద్రీకరించబడుతోంది. పౌలు ఇలా రాశాడు: ‘కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, [యెహోవా] తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును (‘పవిత్ర రహస్యాన్ని,’ NW) మనకు తెలియజేసి . . . ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చెను.’ (ఎఫెసీయులు 1:8-10) “దేవుని పవిత్ర రహస్యమైన క్రీస్తును గూర్చిన కచ్చితమైన జ్ఞానం” కొరకైన అవసరాన్ని పౌలు సూచించినప్పుడు, ఆయన ‘పవిత్ర రహస్య’ స్వభావాన్ని గురించి మరింత నిర్దిష్టంగా తెలియజేశాడు.—కొలొస్సయులు 2:2, NW.

5. ‘పవిత్ర రహస్యం’లో చేరివున్నదేమిటి?

5 అయినప్పటికీ, పవిత్ర రహస్యం అనేక కోణాలుగల రహస్యమై ఉన్నందున, అందులో మరెంతో ఇమిడివుంది. అది కేవలం యేసును వాగ్దాన సంతానంగానో లేక మెస్సీయగానో గుర్తించడం మాత్రమే కాదు; అందులో దేవుని సంకల్పంలో నిర్వహించేందుకు ఆయనకు నియమించబడిన భూమిక చేరివుంది. “పరలోకరాజ్య మర్మములు (‘పవిత్ర రహస్యాలు,’ NW) ఎరుగుట మీకు అనుగ్రహింపడియున్నది” అని తన శిష్యులతో యేసు చెప్పినప్పుడు, ఆయన స్పష్టంగా వివరించినట్లుగానే పరలోక ప్రభుత్వమైన దేవుని మెస్సీయ రాజ్యం అందులో చేరివుంది.—ఇటాలిక్కులు మావి, మత్తయి 13:11.

6. (ఎ) ‘పవిత్ర రహస్యం అనాదినుండి రహస్యముగా ఉంచబడిందని’ చెప్పడం ఎందుకు సరియైనది? (బి) అది పురోభివృద్ధిదాయకంగా ఎలా బయల్పర్చబడింది?

6 మెస్సీయ రాజ్యం కొరకు ఓ ఆధారాన్ని ఇవ్వాలనే దేవుని సంకల్పపు మొదటి ప్రస్తావనకూ, ‘పవిత్ర రహస్యాన్ని . . . ముగింపుకు’ తేవడానికీ మధ్య సుదీర్ఘమైన కాలం గడిచిపోవాల్సి ఉంది. (ప్రకటన 10:7, NW; ఆదికాండము 3:15) ప్రకటన 10:7వ వచనాన్ని 11:15వ వచనంతో పోల్చిచూస్తే, రాజ్యం స్థాపించబడ్డంతోనే ఆ రహస్యం ముగింపుకు రావడం సంభవిస్తుందని రుజువౌతోంది. వాస్తవానికి, ఏదెనులో మొదటి రాజ్య వాగ్దానాన్ని ఇచ్చినప్పటినుండీ సా.శ. 29లో నియుక్తుడైన రాజు కన్పించేంత వరకూ, దాదాపు 4,000 సంవత్సరాలు గతించిపోయాయి. 1914లో పరలోకమందు ఆ రాజ్యం స్థాపించబడ్డానికి ముందు, మరో 1,885 సంవత్సరాలు గతించిపోయాయి. అలా, ‘పవిత్ర రహస్యం,’ దాదాపు 6,000 సంవత్సరాల కాలంలో పురోభివృద్ధిదాయకంగా బయల్పర్చబడింది. (పేజీ 16 చూడండి.) “అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము (‘పవిత్ర రహస్యం,’ NW)” గురించి మాట్లాడ్డంలో నిజానికి పౌలు సముచితంగా వ్యవహరించాడు.—రోమీయులు 16:25-27; ఎఫెసీయులు 3:4-11, NW.

7. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతినందు మనమెందుకు పూర్ణ నమ్మకాన్ని కల్గివుండగలం?

7 పరిమితమైన ఆయుష్కాలంగల మానవులకు భిన్నంగా, తొందరపాటుకొద్దీ తన రహస్యాల్ని బయల్పర్చేలా కాలం యెహోవాను ఎన్నడూ ఒత్తిడిచేయలేదు. కొన్ని బైబిలు ప్రశ్నలు మనకు సంతృప్తికరమైన రీతిలో ప్రస్తుతం వివరించబడనప్పుడు, సహనం కోల్పోకుండా ఇది మనల్ని కాపాడుతుంది. క్రైస్తవ గృహస్థులకు తగినవేళ ఆహారాన్ని ఇచ్చేందుకు నియమించబడిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి మితంగా ఉండడం, ఆ తరగతిని దూకుడుగా ముందుకు పరిగెత్తకుండా, ఇంకా విశదంకాని విషయాల్ని గురించి ఇష్టమొచ్చినట్టు అంచనావేయకుండా అరికడుతుంది. దాసుని తరగతివారు నిర్హేతుకమైనవారిగా ఉండకుండా జాగ్రత్తపడేందుకు పోరాడుతున్నారు. సామెతలు 4:18వ వచనాన్ని మనస్సులో ఉంచుకుంటూ, ప్రస్తుతం ప్రతీ ప్రశ్నకు జవాబును ఇవ్వలేమని ఒప్పుకునేంత దీనత్వం దాసుని తరగతికివుంది. కానీ యెహోవా తన నియమిత కాలంలోనూ, తన స్వంత పంథాలోనూ, తన సంకల్పాలకు సంబంధించిన తన రహస్యాల్ని బయల్పర్చడంలో కొనసాగుతాడని తెల్సుకోవడం ఎంతటి పులకింతను కల్గిస్తోంది. రహస్యాల్ని బయల్పర్చువానిని దాటి ముందుకు పోయేందుకు బుద్ధిహీనంగా ప్రయత్నించడం ద్వారా, యెహోవా ఏర్పాట్ల విషయంలో మనం ఎన్నటికీ సహనాన్ని కోల్పోయినవారంగా ఉండకూడదు. నేడు యెహోవా ఉపయోగిస్తున్న ఆ మాధ్యమం అలా చేయడంలేదని తెల్సుకోవడం, ఎంత హామీనిస్తోందో కదా! ఆ తరగతి నమ్మకమైనదీ, బుద్ధిగలదీ.—మత్తయి 24:45; 1 కొరింథీయులు 4:6.

బయల్పర్చబడిన రహస్యాన్ని తప్పక తెలియజేయాలి!

8. ‘పవిత్ర రహస్యం’ తెలియజేయబడేందుకేనని మనకెలా తెలుసు?

8 యెహోవా తన ‘పవిత్ర రహస్యాన్ని’ క్రైస్తవులకు బయల్పర్చింది, వాళ్లు దాన్ని దాచుకోవడానికి కాదు. అది తెలియజేయబడాలి అయితే, ఏదో కొద్దిమంది మతగురువుల కొరకుగాక—తన అనుచరులందరి కొరకూ యేసు ఏర్పర్చిన ఈ సూత్రానికి అనుగుణంగా అది తెలియజేయబడాలి: “మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.”—మత్తయి 5:14-16; 28:19, 20.

9. కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా, యేసుకు విప్లవాత్మక ధోరణుల్లేవని ఏది రుజువుచేస్తోంది?

9 రహస్య సంకల్పాల్ని వెంబడించే అనుచరవర్గంగల ఓ అజ్ఞాత సంస్థను రూపొందించే విప్లవాత్మక ఉద్దేశాలేవీ యేసుకులేవు. ఎర్లీ క్రిష్టియానిటీ అండ్‌ సొసైటీ అనే పుస్తకంలో రాబర్ట్‌ యమ్‌. గ్రాన్ట్‌, రెండవశతాబ్దం నాటి క్రైస్తవమతసిద్ధాంత నిరూపణకర్తయైన జస్టిన్‌ మార్టిర్‌ తొలి క్రైస్తవుల తరఫున చేసిన ప్రతివాదనను గురించి ఇలా రాశాడు: “క్రైస్తవులు గనుక విప్లవకారులైతే వాళ్లు తమ లక్ష్యాన్ని సాధించేందుకు మరుగునే ఉండేవారు.” కానీ క్రైస్తవులు “మరుగునవుంటూ” అదేసమయంలో “కొండమీదనుండు పట్టణము” వలే ఎలా ఉండగలరు? వాళ్లు తమ దీపాన్ని కుంచంక్రింద దాయలేదు! కనుకనే, ప్రభుత్వం వాళ్ల కార్యకలాపాల్నిబట్టి ఏ విధమైన భీతిని చెందలేదు. “శాంతి భద్రతలకు దోహదపడ్డంలో చక్రవర్తి శ్రేయోభిలాషులు”గా వారిని ఈ రచయిత వర్ణించాడు.

10. క్రైస్తవులు తమ గుర్తింపును ఎందుకు దాచుకోకూడదు?

10 మతశాఖలుగా పిలువబడిన వాటిలో ఒకదానికి చెందిన సభ్యులవలే తన శిష్యులు తమ గుర్తింపును రహస్యంగా ఉంచుకోవాలని యేసు కోరుకోలేదు. (అపొస్తలుల కార్యములు 24:14; 28:22) నేడు మన వెలుగును ప్రకాశింపచేయడంలో విఫలమవ్వడం, క్రీస్తునూ రహస్యాల్ని బయల్పర్చువాడైన ఆయన తండ్రినీ ప్రీతిపర్చదు. మరి అది మన సంతోషానికి కారణమవ్వదు.

11, 12. (ఎ) క్రైస్తవత్వం తెలియజేయబడాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు? (బి) యేసు ఏ విధంగా సరియైన మాదిరిని ఉంచాడు?

11 యెహోవా “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని” కోరుకుంటున్నాడు. (2 పేతురు 3:9; యెహెజ్కేలు 18:23; 33:11; అపొస్తలుల కార్యములు 17:30) యేసుక్రీస్తు విమోచన క్రయధనమందలి విశ్వాసమే పశ్చాత్తాపపడిన మానవుల పాపాల్ని క్షమించడానికి ఆధారమైవుంది. యేసు తనను తాను విమోచనక్రయధనంగా ఏ కొద్దిమంది కొరకోగాక అందరి కొరకూ అర్పించుకున్నాడు గనుకనే “[ఆయన] యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందు[తాడు].” (యోహాను 3:16) రాబోవు తీర్పు సమయంలో ప్రజలు తాము మేకలుగా కాక గొఱ్ఱెలుగా తీర్పుపొందేందుకు వారిని యోగ్యుల్ని చేసే అవసరమైన చర్యల్ని చేపట్టేందుకు వారికి సహాయాన్ని అందించడం ప్రాముఖ్యం.—మత్తయి 25:31-46.

12 నిజ క్రైస్తవత్వాన్ని మరుగుపర్చకూడదు; సాధ్యమైనంతమేరకు, సముచితమైన ప్రతీ విధానంలోనూ అది తెలియజేయబడాలి. యేసు తానే తగిన మాదిరిని ఉంచాడు. యేసు తన శిష్యుల్ని గూర్చీ, తన బోధల్ని గూర్చీ ప్రధానయాజకునిచే ప్రశ్నించబడినప్పుడు, ఆయన ఇలా చెప్పాడు: “నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.” (యోహాను 18:19, 20) ఈ దృష్టాంతాన్ని పరిగణనలోనికి తీసుకుంటే, బాహాటంగా తెలియజేయాలని దేవుడు ప్రకటించినదాన్ని రహస్యంగా ఉంచేందుకు దైవికభయంగల ఏ వ్యక్తైనా తెగిస్తాడా? నిత్యజీవానికి నడిపించే ‘జ్ఞాన కీలకాన్ని’ మరుగుపర్చడానికి ఎవడు సాహసించగలడు? అలా చేయడం, అతన్ని మొదటి శతాబ్దంనాటి మత వేషధారులవలే చేస్తుంది.—లూకా 11:52; యోహాను 17:3.

13. ప్రతీ అవకాశమందూ మనమెందుకు ప్రకటించాలి?

13 యెహోవాసాక్షులమైన మనం దేవునిరాజ్య సందేశాన్ని రహస్యంగా ఉంచామని ఎవ్వరూ ఎన్నటికీ అనలేరు! ప్రజలు ఆ సందేశాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా అది ప్రకటించబడ్తున్నదని వాళ్లు తప్పక తెల్సుకోవాలి. (యెహెజ్కేలు 2:5; 33:33 పోల్చండి.) కాబట్టి, ప్రజలు మనకు తారసపడిన ప్రతిచోటా, సత్య సందేశాన్ని వారందరితో మాట్లాడే ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుందాం.

సాతాను దవుడలకు గాలం వేయడం

14. మన ఆరాధన విషయంలో బాహాటంగా ఉండడాన్ని గూర్చి మనమెందుకు సంశయించకూడదు?

14 అనేక ప్రాంతాల్లో, యెహోవాసాక్షులు అంతకంతకూ సమాచార మాధ్యమాల్లో ఓ చర్చనీయాంశం అవుతున్నారు. తొలి క్రైస్తవుల విషయంలో జరిగినట్లుగానే, వాళ్లు తరచూ తప్పుగా చిత్రీకరించబడి, అనుమానాస్పద మతశాఖల వర్గంలోనూ రహస్యమతాల వర్గంలోనూ చేర్చబడుతున్నారు. (అపొస్తలుల కార్యములు 28:22) మనం బాహాటంగా ప్రకటించడం, మనల్ని మరింత ముట్టడికి గురయ్యేలా చేస్తుందా? అనవసరంగా వివాదాల మధ్యకు మనల్ని మనం నెట్టుకోవడం కచ్చితంగా తెలివైన పనికాదు, అది యేసు ఇచ్చిన సలహాతో పొందికలేనిదై ఉంటుంది. (సామెతలు 26:17; మత్తయి 10:16) అయితే, ప్రయోజనకరమైన రాజ్యప్రచారపు పనినీ, తమ జీవితాల్ని మెరుగుపర్చుకునేందుకు ప్రజలకు సహాయపడడాన్నీ మరుగుపర్చకూడదు. అది యెహోవాను మహిమపర్చి, ఉన్నతపరుస్తుంది. ఆయనవైపూ, ఆయన స్థాపించిన రాజ్యంవైపూ అవధానాన్ని మళ్లిస్తుంది. తూర్పు యూరప్‌లోనూ, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ బైబిలు సత్యానికి ఇటీవల వస్తున్న సంతృప్తికరమైన ప్రతిస్పందనకు పాక్షిక కారణం, అక్కడ ఇప్పుడు మరింత స్వేచ్ఛగా సత్యాన్ని ప్రకటించడం సాధ్యమవ్వడమే.

15, 16. (ఎ) మనం దాచుకొనక బాహాటంగా ప్రకటించడమూ, ఆత్మీయంగా వర్ధిల్లడమూ ఏ సంకల్పాల్ని నెరవేర్చాయి, కానీ ఇది చింతకు కారణమవ్వాలా? (బి) సాతాను దవుడలకు యెహోవా గాలం ఎందుకు వేస్తాడు?

15 యెహోవాసాక్షులు దాచుకొనక బాహాటంగా ప్రకటించడమూ, వాళ్లు అనుభవిస్తున్న ఆత్మీయ పరదైసూ, మరి వాళ్లు వస్తుసంబంధ రూపేణా మానవ వనరుల రూపేణా వర్ధిల్లడమూ గుర్తించబడకుండా పోలేదనే విషయం వాస్తవమే. ఇవి యథార్థవంతుల్ని ఆకర్షించినప్పటికినీ, వ్యతిరేకులు వికర్షించుకొనేలా చేయవచ్చు. (2 కొరింథీయులు 2:14-17) నిజానికిదే, దేవుని ప్రజలపై సాతాను శక్తులు ముట్టడిచేసేందుకు మరులుకొల్పేలా చివరకు దోహదపడవచ్చు.

16 ఇది చింతకు కారణమవ్వాలా? యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ఉన్న యెహోవా ప్రవచనం ప్రకారంగా అలా కాకూడదు. అది, మాగోగువాడైన గోగుగా వర్ణించబడిన సాతాను అంటే 1914లో రాజ్యం స్థాపించబడిన తర్వాత భూమిమీదకు పడద్రోయబడిన స్థితిలోవున్న అపవాదియైన సాతాను దేవుని ప్రజలపై ముట్టడిచేయడానికి నాయకత్వం వహిస్తాడని ప్రవచిస్తోంది. (ప్రకటన 12:7-9) యెహోవా గోగుతో ఇలా చెబుతున్నాడు: “నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు—నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశము మీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టునడుమ నివసించు జనులమీదికి తిరిగి పోయెదను.” (యెహెజ్కేలు 38:11, 12) అయితే, దేవుని ప్రజలు ఈ ముట్టడికి భయపడనక్కర్లేదని 4వ వచనం చెబుతోంది ఎందుకంటే దీన్ని యెహోవాయే చేస్తున్నాడు. కానీ శక్తియుక్తులూ ఒడ్డి తన ప్రజలపై ముట్టడిచేసేందుకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు, అవును ఎందుకు రెచ్చగొడతాడు? 23వ వచనంలో మనం యెహోవా జవాబును ఇలా చదువుతాం: “నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.”

17. గోగు త్వరలోనే చేయబోయే ముట్టడిని మనమెలా దృష్టించాలి?

17 ఆ విధంగా, గోగు ముట్టడిని గూర్చిన భయంతో జీవించడానికి బదులుగా, బైబిలు ప్రవచనపు మరొక నెరవేర్పుయైన దీనికోసం యెహోవా ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తారు. తన దృశ్యమైన సంస్థను వర్ధిల్లచేయడం ద్వారానూ, ఆశీర్వదించడం ద్వారానూ యెహోవా సాతాను దవుడలకు గాలాల్ని వేసి, వాడినీ వాడి సేననూ పరాజయం వైపుకు లాగుతాడని తెల్సుకోవడం ఎంత పులకరింతను కల్గిస్తుందో కదా!—యెహెజ్కేలు 38:4.

మునుపెన్నటికన్నా ఇప్పుడు అధికంగా!

18. (ఎ) అనేకమంది ప్రజలు ఇప్పుడు ఏ గ్రహింపుకు వస్తున్నారు, ఎందుకు? (బి) రాజ్య ప్రచారానికి వచ్చే ప్రతిస్పందన, ఓ శక్తివంతమైన ప్రేరేపణగా ఎలా పనిచేస్తోంది?

18 ఆధునికకాలంలో, తమ బైబిలు ఆధారిత దృక్పథాల్ని వ్యక్తపర్చడంలో యెహోవాసాక్షులు మరింత బాహాటంగానే ఉన్నారు. అయినప్పటికీ, ఇది అంత జనసమ్మతమైనది కాలేదు. ధూమపానంవల్లా, మాదకద్రవ్యాల దుర్వినియోగంవల్లా, క్రమశిక్షణారహితంగా పిల్లలకు ఇచ్చే తర్ఫీదు యొక్క అవివేకంవల్లా, అక్రమ లైంగిక సంబంధాలతోనూ హింసతోనూ కలుషితమైన వినోదపు చెడు ప్రభావాలవల్లా, వచ్చే అపాయాల్ని గురించీ అలాగే రక్తమార్పిడుల మూలంగా వచ్చే సమస్యల్ని గురించీ వాళ్లు దశాబ్దాలుగా హెచ్చరించారు. పరస్పరం విరుద్ధంగావున్న పరిణామసిద్ధాంతపు విషయాల్ని కూడా వాళ్లు ఎత్తి చూపించారు. “యెహోవాసాక్షులు చెప్పేది తప్పుకానే కాదు” అని అనేకమంది ప్రజలు ఇప్పుడు చెబుతున్నారు. మన దృక్పథాల్ని ప్రజలకు తెలియజేయడంలో మనమింత బాహాటంగా లేకపోతే, వాళ్లీవిధంగా ప్రతిస్పందించేవారు కాదు. వాళ్లు అలాంటి వ్యాఖ్యానాన్ని చేయడంద్వారా “సాతానా, నువ్వు అబద్ధికుడివి; యెహోవాయే సత్యవంతుడు” అని చెబుతున్న దిశలో అడుగును వేస్తున్నారనే వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బహిరంగంగా సత్యవాక్యాన్ని గూర్చి మాట్లాడే విషయంలో యేసు మాదిరిని అనుసరించడంలో కొనసాగేందుకు మనకు ఎంతటి శక్తివంతమైన ప్రేరేపణో కదా!—సామెతలు 27:11.

19, 20. (ఎ) 1922లో యెహోవా ప్రజలు ఏ నిర్ణయాన్ని వ్యక్తపర్చారు, మరి ఈ మాటలు ఇప్పటికీ అన్వయిస్తాయా? (బి) యెహోవా ‘పవిత్ర రహస్యాన్ని’ మనమెలా దృష్టించాలి?

19 ఈ విషయంలో తమ కర్తవ్యాన్నిగూర్చి యెహోవా ప్రజలు ఎంతో కాలం క్రిందటే అవగాహన చేసుకున్నారు. 1922లో జరిగిన గుర్తుంచుకోదగిన సమావేశంలో, వాచ్‌టవర్‌ సంస్థ అప్పటి అధ్యక్షుడైన జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఇలా చెప్పడంద్వారా తన శ్రోతల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు: “మత్తులుగా ఉండకండి, మెలకువగా ఉండండి, చురుకుగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రభువుకు నమ్మకమైన సత్యసాక్షులుగా ఉండండి. బబులోను ప్రతి జాడా నాశనమయ్యేంతవరకూ పోరాటంలో ముందుకు సాగండి. సందేశాన్ని సుదూర ప్రాంతాలకూ, విస్తృతంగానూ ప్రకటించండి. యెహోవాయే దేవుడనీ, యేసుక్రీస్తు రాజులకు రాజూ, ప్రభువులకు ప్రభువూ అని లోకం తెల్సుకోవాలి. దినములన్నిటిలోకెల్లా ఇదే దినము. చూడండి, రాజు ఏలుచున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.”

20 1922లోనే ఈ మాటలు అంత ప్రాముఖ్యమైనవైతే, 75 ఏళ్ల తర్వాత అంటే న్యాయాధిపతిగానూ, పగతీర్చుకొనువానిగానూ క్రీస్తు బయల్పర్చబడడం మరింత సమీపిస్తున్న తరుణంలో ఇంకెంత ప్రాముఖ్యమైనవై ఉంటాయో కదా! స్థాపించబడిన యెహోవా రాజ్యాన్ని గూర్చిన సందేశమూ, దేవుని ప్రజలు అనుభవించిన ఆత్మీయ పరదైసును గూర్చిన సందేశమూ దాచిపెట్టకూడని ఉన్నతమైన ‘పవిత్ర రహస్యం.’ యేసు తానే ఎంతో స్పష్టంగా చెప్పినట్లుగా, యెహోవా నిత్య సంకల్పంలో తన కీలకమైన స్థానాన్ని గూర్చి “భూదిగంతముల వరకు” తెలియజేయడంలో పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన అనుచరులు సాక్షులుగా ఉండాలి. (అపొస్తలుల కార్యములు 1:8; ఎఫెసీయులు 3:8-12) నిజానికి, రహస్యాల్ని బయల్పర్చే దేవుడైన యెహోవా సేవకులుగా, మనం ఈ రహస్యాల్ని మన దగ్గరే దాచుకోడానికి తెగించం!

మీరెలా జవాబిస్తారు?

◻ ‘పవిత్ర రహస్యం’ ఏమైవుంది?

◻ అది ప్రకటించబడాలని మనకెలా తెలుసు?

◻ యెహోవా ప్రజలపై గోగు ముట్టడి చేయడాన్కి కారణమేదౌతుంది, మనం దీన్ని ఎలా దృష్టించాలి?

◻ ఏం చెయ్యడానికి మనలో ప్రతిఒక్కరమూ నిర్ణయించుకోవాలి?

[16వ పేజీలోని బాక్సు]

పురోభివృద్ధిదాయకంగా బయల్పర్చబడిన ‘పవిత్ర రహస్యం’

◻ సా.శ.పూ. 4026 తర్వాత: సాతాన్ని నాశనం చేసేందుకు ఓ సంతానాన్ని ఉద్భవింపచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.—ఆదికాండము 3:15

◻ సా.శ.పూ. 1943: ఆ సంతానం అబ్రాహాముద్వారా వస్తుందని వాగ్దానం చేస్తూ, అబ్రాహాము నిబంధన అమలులోకి వచ్చింది.—ఆదికాండము 12:1-7

◻ సా.శ.పూ. 1918: ఆ నిబంధన వారసునిగా ఇస్సాకు జననం.—ఆదికాండము 17:19; 21:1-5

◻ దాదాపు సా.శ.పూ. 1761: ఆ సంతానం, ఇస్సాకు కుమారుడైన యాకోబు ద్వారా వస్తుందని యెహోవా ధ్రువపర్చాడు.—ఆదికాండము 28:10-15

◻ సా.శ.పూ. 1711: ఆ సంతానం తన కుమారుడైన యూదా ద్వారా వస్తుందని యాకోబు సూచించాడు.—ఆదికాండము 49:10

◻ సా.శ.పూ. 1070-1038: ఆ సంతానం, తన వంశీయుడే అయ్యుంటాడనీ, అతడు రాజుగా నిరంతరమూ ఏలతాడనీ రాజైన దావీదు తెలుసుకున్నాడు.—2 సమూయేలు 7:13-16; కీర్తన 89:35, 36

◻ సా.శ. 29-33: యేసు ఆ సంతానంగానూ, మెస్సీయగానూ, భవిష్యద్‌ న్యాయాధిపతిగానూ, నియుక్తుడైన రాజుగానూ గుర్తించబడ్డాడు.—యోహాను 1:17; 4:25, 26; అపొస్తలుల కార్యములు 10:42, 43; 2 కొరింథీయులు 1:20; 1 తిమోతి 3:16

◻ తనకు సహపాలకులూ సహ న్యాయాధిపతులూ ఉంటారనీ, ఆ పరలోక రాజ్యం భూసంబంధమైన అనుయాయుల్ని కల్గివుంటుందనీ, తన అనుచరులందరూ రాజ్య ప్రచారకులుగా ఉంటారనీ యేసు బయల్పర్చాడు.—మత్తయి 5:3-5; 6:10; 28:19, 20; లూకా 10:1-9; 12:32; 22:29, 30; యోహాను 10:16; 14:2, 3

◻ ఆ రాజ్యం, లోక సంఘటనల సాక్ష్యాధారంగా ఓ నిర్దిష్టమైన కాలంలో స్థాపించబడుతుందని యేసు బయల్పర్చాడు.—మత్తయి 24:3-22; లూకా 21:24

◻ సా.శ. 36: యూదులుకానివారూ రాజ్య సహవారసులుగా ఉంటారని పేతురు తెల్సుకున్నాడు.—అపొస్తలుల కార్యములు 10:30-48

◻ సా.శ. 55: ఆ రాజ్య సహవారసులు, క్రీస్తు ప్రత్యక్షతాకాలంలో అమర్త్యంగానూ నాశనరహితంగానూ పునరుత్థానులవుతారని పౌలు వివరించాడు.—1 కొరింథీయులు 15:51-54

◻ సా.శ. 96: అప్పటికే తన అభిషిక్త అనుచరులపై పరిపాలిస్తున్న యేసు, వారి తుది సంఖ్య 1,44,000 అవుతుందని బయల్పర్చాడు.—ఎఫెసీయులు 5:32; కొలొస్సయులు 1:13-20; ప్రకటన 1:1; 14:1-3

◻ సా.శ. 1879: దేవుని ‘పవిత్ర రహస్యం’ నెరవేరుతుండడంలో 1914 ఓ గొప్ప ప్రాముఖ్యమైన సంవత్సరంగా ఉంటుందని జాయన్స్‌ వాచ్‌టవర్‌ గుర్తించింది

◻ సా.శ. 1925: ఆ రాజ్యం 1914లో ఉద్భవించిందని ది వాచ్‌టవర్‌ వివరిస్తోంది; ఆ రాజ్యాన్ని గూర్చిన ‘పవిత్ర రహస్యం’ ప్రకటించబడాలి.—ప్రకటన 12:1-5, 10, 17

[15వ పేజీలోని చిత్రం]

తమ నాయకుడైన యేసువలే, యెహోవాసాక్షులు యెహోవా రాజ్యాన్ని బహిరంగంగా ప్రకటిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి