తప్పుడు ఉద్దేశాలను ఆపాదించడాన్ని గురించి జాగ్రత్త వహించండి
ఒక ప్రముఖ టీవీ సువార్తీకుడు, వ్యభిచారం చేశాడని తన తోటి ప్రచారకుని గురించి ఒక తీవ్రమైన అధిక్షేపణ చేశాడు. అయితే, ఒక సంవత్సరంలోపలే, అలా నిందించిన సువార్తికుడు ఒక వేశ్యతో ఉండగా పట్టుబడ్డాడు.
మరో కేసులో, యుద్ధం చేస్తున్న దేశాల మధ్య శాంతి చేకూర్చడానికి ఒక ప్రధాన ప్రపంచ శక్తి ప్రతినిధులను పంపించింది. ఈలోగా, అదే దేశం మోసంగా తన ఆయుధ వర్తకులను కోటానుకోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు అమ్మేందుకు విదేశాలకు పంపించింది.
స్పష్టమైన వేషధారణ సర్వసాధారణమైపోయింది గనుక, నమ్మకం స్థానాన్ని అనుమానం ఆక్రమించడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా? ఇతరుల ఉద్దేశాలను ప్రశ్నించడం అనేకులకు ఒక అలవాటుగా మారిపోయింది.
క్రైస్తవులముగా మనం, అలాంటి ఉద్దేశాలు నమ్మకమైన తోటి విశ్వాసులతో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేయడాన్ని అనుమతించకుండా జాగ్రత్త వహించాలి. మనం మన శత్రువుల మధ్య “పాముల వలె వివేకులు”గా ఉండాలని యేసుక్రీస్తు మనకు ఉద్బోధించినప్పటికీ, మనం ఆయన నిజ అనుచరుల గురించి అనుమానం కలిగివుండాలని ఆయన అనలేదు. (మత్తయి 10:16) కాబట్టి, మరి, ఇతరులకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించడం యొక్క ప్రమాదాలేమిటి? అలాంటి దృక్పథాన్ని నివారించడానికి మనం ప్రాముఖ్యంగా ఏ రంగాల్లో జాగ్రత్తగా ఉండాలి? తోటి క్రైస్తవులతో మనకున్న అమూల్యమైన సంబంధాన్ని మనం ఎలా కాపాడుకోగలం?
గతం నుండి ఒక పాఠం
సహేతుకమైన కారణం లేకుండా ఇతరులకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించడం వారికి తీర్పు తీర్చడంతో సమానం. అది, వారి మాటలు లేక క్రియలు ఏదో వక్రమైనది, ద్వేషపూరితమైనది దాన్ని దాచే మిష మాత్రమేననే ముగింపుకు మనం వస్తున్నట్లుగా ఉంటుంది. తరచూ సమస్యకు అసలైన కారణం ఏమిటంటే, విషయాలను పొరపాటుగా దృష్టించడమే, దీన్ని యెహోషువ 22వ అధ్యాయంలోని బైబిలు వృత్తాంతంలో చూడవచ్చు.
ఇశ్రాయేలీయులు తాము వాగ్దాన దేశాన్ని ఆక్రమించడం ముగించి, తమ గోత్రాల ప్రాంతాలను ఇప్పుడే పొందారు. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారు యొర్దాను నది వద్ద “చూపునకు గొప్ప”దైన బలిపీఠాన్ని నిర్మించారు. ఇతర గోత్రాలవారు అది మత భ్రష్టత్వానికి సంబంధించిన చర్య అని తప్పుగా భావించారు. ఆరాధనకు నియమిత స్థలమైన షిలోహులోని కూటము జరిగే గుడారానికి వెళ్లే బదులు ఈ మూడు గోత్రాలవారు బలి అర్పించడానికి ఈ గొప్ప కట్టడాన్ని ఉపయోగించబోతున్నారని భావించడం జరిగింది. వెంటనే, నిందిస్తున్న గోత్రాలు సైనిక చర్య కొరకు సన్నాహాలు మొదలుపెట్టాయి.—యెహోషువ 22:10-12.
ఫీనెహాసు నాయకత్వం క్రింద వారు ఇశ్రాయేలీయులైన తమ సహోదరుల వద్దకు ఒక అధికారిక బృందాన్ని పంపడం ద్వారా సంభాషించడం మెచ్చుకొనదగిన విషయం. అపనమ్మకత్వం, తిరుగుబాటు, యెహోవాకు వ్యతిరేకంగా మతభ్రష్టత్వం వంటి వాటికి సంబంధించిన ఆరోపణలను విన్న తర్వాత, నిందించబడుతున్న గోత్రాలు ఈ పెద్ద బలిపీఠం దేనికో వివరించారు. అది బలి అర్పించడానికి బలిపీఠంగా ఉండడానికి బదులు, అది యెహోవాను ఆరాధించడంలో ఇశ్రాయేలు గోత్రాలు కలిగివున్న ఐక్యతకు “సాక్షి”గా ఉంటుంది. (యెహోషువ 22:26, 27) తమ సహోదరులలో తప్పేమీ లేదని సంతృప్తి చెంది ఆ బృందం ఇంటికి తిరిగివచ్చింది. అలా ఒక అంతర్యుద్ధం మరియు రక్తపాతం నివారించబడ్డాయి.
ఎప్పుడేగానీ ఇతరులకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడంలో తొందరపడకుండా ఉండడానికి అది మనకు ఎంత చక్కని పాఠం! కేవలం పైపైన చూసినప్పుడు నిజమన్నట్లు కనిపించినది తరచూ, జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పూర్తి వేరుగా కనిపిస్తుంది. ఒక క్రైస్తవుని జీవితంలోని అనేక అంశాలలో ఇది నిజం.
పెద్దలను గురించిన మన దృక్కోణం
‘దేవుని సంఘమును కాయవలసిన’ తమ బాధ్యతను నిర్వర్తించడంలో కొన్నిసార్లు పెద్దలు, సంఘంలోని వివిధ వ్యక్తులకు ఉపదేశం ఇవ్వవలసిన అవసరత ఉన్నట్లు కనుగొనవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:28) ఉదాహరణకు, చెడు సహవాసాలు లేక వ్యతిరేకలింగ వ్యక్తులతో తప్పుడు ప్రవర్తన వంటివాటికి సంబంధించి మన పిల్లల గురించి ఒక పెద్ద మనతో మాట్లాడితే మనం ఎలా ప్రతిస్పందిస్తాము? ఆయనకు రహస్యమైన ఉద్దేశమేదో ఉందని భావించి, ‘ఆయన ఎన్నడూ మన కుటుంబాన్ని ఇష్టపడలేదు’ అని మనలో మనం అనుకుంటామా? అలాంటి భావాలు మనల్ని ప్రభావితం చేసేందుకు మనం అనుమతిస్తే, ఆ తర్వాత మనం చింతించవలసి వస్తుంది. మన పిల్లల ఆత్మీయ సంక్షేమం ప్రమాదంలో పడవచ్చు, సహాయకరమైన లేఖనాధార ఉపదేశాన్ని మనం మెచ్చుకోవాలి.—సామెతలు 12:15.
సంఘ పెద్ద మనకు ఉపదేశం ఇచ్చినప్పుడు మనం ఏదో దాచబడివున్న ఉద్దేశం కొరకు చూడకుండా ఉందాము. బదులుగా, ఆయనిచ్చిన బైబిలు ఆధారిత ఉపదేశం నుండి మనం ప్రయోజనం పొందే మార్గం ఏదైనా ఉందాని మనల్ని మనం ప్రశ్నించుకుందాము. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీయులు 12:11) కాబట్టి మనం కృతజ్ఞత కలిగివుండి, విషయాల గురించి వాస్తవంగా ఆలోచిద్దాము. ఉపదేశాన్ని తీసుకోవడం మనకెంత కష్టంగా ఉంటుందో తరచూ, ఉపదేశం ఇవ్వడం పెద్దలకూ అంతే కష్టంగా ఉంటుందని జ్ఞాపకముంచుకుందాము.
తలిదండ్రులను గురించిన భావాలు
తలిదండ్రులు పెట్టే ఆంక్షలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కొంతమంది యౌవనులు తమ తలిదండ్రుల దృక్పథాలను ప్రశ్నిస్తారు. కొందరు యౌవనులు ఇలా చెప్పవచ్చు: ‘నా తలిదండ్రులు ఎందుకిన్ని కట్టడలు పెడతారు? నేను జీవితాన్ని ఆనందించడం వారికిష్టంలేదేమో.’ అయితే అలాంటి నిర్ధారణకు వచ్చే బదులు, యౌవనులు పరిస్థితిని వాస్తవికంగా తూచి చూసుకోవలసిన అవసరం ఉంది.
తలిదండ్రులు తమ పిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటూ సంవత్సరాలు గడిపారు. దాని కొరకు వారు వస్తుసంబంధంగా, మరితర విధంగా గొప్ప త్యాగం చేసివుంటారు. ఇప్పుడు, యౌవనస్థులైన తమ పిల్లల జీవితాన్ని దుఃఖకరం చేయడానికి వారు నిశ్చయించుకున్నారనే నిర్ధారణకు రావడం సహేతుకమైనదేనా? తమ పిల్లలను కాపాడడానికి, వారి గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఈ తలిదండ్రులను పురికొల్పేది ప్రేమేనని తలంచడం మరింత సహేతుకంగా ఉండదా? ఇప్పుడు జీవితంలో క్రొత్త సవాళ్లను ఎదుర్కుంటున్న తమ పిల్లలపై కొన్ని ఆంక్షలను ఏర్పరచడానికి వారిని పురికొల్పుతున్నది అదే ప్రేమ కాదా? ప్రేమగల తలిదండ్రులకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించడం ఎంత నిర్దయగా, కృతజ్ఞతా రహితంగా ఉంటుందో కదా!—ఎఫెసీయులు 6:1-3.
తోటి క్రైస్తవుల ఎడల మన దృక్పథం
అనేకులు ఇతరుల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వారి విషయంలో తీర్పుతీర్చి, వారిని వర్గాల క్రింద విభజిస్తుంటారు. మనకే అలాంటి దృక్పథం ఉండి, కొంతమంది గురించి ఒక విధమైన అనుమానం కలిగివుంటే అప్పుడేమిటి? ఈ విషయంలో మనం ప్రపంచ దృక్పథాల మూలంగా ప్రభావితం చేయబడతామా?
ఉదాహరణకు, ఒకవేళ మన ఆత్మీయ సహోదరులలో ఒకరికి మంచి ఇల్లు, ఖరీదైన వాహనం ఉన్నాయనుకోండి. ఆయన జీవితంలో రాజ్యాసక్తులకు మొదటి స్థానం ఇవ్వని భౌతికవాదని మనం వెంటనే నిర్ధారించాలా? కొంతమంది క్రైస్తవులకు మంచి వస్తువులను కలిగివుండే స్తోమత ఉండవచ్చు, కాని దాని భావం వారికి చెడు ఉద్దేశాలు ఉన్నాయనో లేక వారు ‘రాజ్యమును మొదట వెదకడం లేదనో’ కాదు. వారు ఆత్మీయ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ, బహుశా నలుగురికీ తెలిసేలా కాకుండా, వారు రాజ్యాసక్తులను పెంపొందింపజేయడంలో తమ వస్తు సంపదలను ఉదారంగా ఉపయోగిస్తుండవచ్చు.—మత్తయి 6:1-4, 33.
మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో అన్ని వర్గాల ప్రజలూ అంటే ధనికులూ, నిరుపేదలూ ఉండేవారు. (అపొస్తలుల కార్యములు 17:34; 1 తిమోతి 2:3, 4; 6:17; యాకోబు 2:5) ప్రజల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా దేవుడు వారికి విలువకట్టడు, మనం కూడా అలా చేయకూడదు. ‘పక్షపాతముతో ఏమియుచేయక,’ పరీక్షల నెదుర్కొన్న మన నమ్మకమైన తోటి విశ్వాసులను మనం ప్రేమించాలి.—1 తిమోతి 5:21.
సాతాను అధికారం క్రింద ఉన్న ఈ ప్రపంచంలో, వర్గాల క్రింద విభజించడం మరియు అనుమానించడం అనేక రూపాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి కేవలం అతని పూర్వచరిత్రనుబట్టి హింసించేవానిగా లేక భౌతికవాదిగా దృష్టించబడవచ్చు. అయితే, క్రైస్తవులముగా మనం అలాంటి దృక్పథాలను అలవర్చుకోకూడదు. యెహోవా సంస్థలో దురభిమానానికి, అనుమానానికి స్థానం లేదు. నిజ క్రైస్తవులందరూ యెహోవా దేవున్ని అనుకరించవలసిన అవసరం ఉంది, ఆయన యందు “దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు.”—2 దినవృత్తాంతములు 19:7; అపొస్తలుల కార్యములు 10:34, 35.
ప్రేమచే పురికొల్పబడండి
“అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. (రోమీయులు 3:23) యెహోవాకు అంగీకారమైన సేవను అందజేయడానికి ప్రయాసపడడంలో మనతో ఐక్యమైవున్నవారిగా మనం మన తోటి ఆరాధికులను దృష్టించవలసిన అవసరం ఉంది. మన ఆత్మీయ సహోదరుడు లేక సహోదరితో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేసేందుకు మనం అనుమానాన్ని లేక ఇతర ప్రతికూల దృక్పథాలను అనుమతించినట్లయితే, మనం సాతానుకు చిక్కకుండా ఉండడానికి అలాంటి దృక్పథంతో పోరాడేందుకు దేవుని సహాయం కొరకు ప్రార్థిద్దాము. (మత్తయి 6:13) యెహోవాకు చెడు ఉద్దేశాలు ఉన్నాయని, ఆమె సంక్షేమం గురించి ఆయన శ్రద్ధ కలిగిలేడని, ఆమెకు నిజంగా ఆనందాన్ని తీసుకురాగల స్వేచ్ఛలను ఆయన ఇవ్వకుండా ఆపుతున్నాడని అతడు హవ్వను ఒప్పించగలిగాడు. (ఆదికాండము 3:1-5) మనం మన సహోదరులకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించడం అతని లక్ష్యాన్ని నెరవేరుస్తుంది.—2 కొరింథీయులు 2:11; 1 పేతురు 5:8.
ఇతరులకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించే గుణం మనకున్నట్లు మనం కనుగొంటే, యేసు క్రీస్తు ఉదాహరణను పరిగణలోకి తీసుకోండి. ఆయన దేవుని పరిపూర్ణ కుమారుడైనప్పటికీ, ఆయన తన శిష్యుల్లో చెడు ఉద్దేశాల కొరకు చూడలేదు. బదులుగా, యేసు వారిలోని మంచి కొరకు చూశాడు. తన శిష్యులు ప్రముఖ స్థానం కొరకు పోటీ పడుతున్నప్పుడు, వారికి భ్రష్ట ఉద్దేశాలున్నాయని, కాబట్టి వారి స్థానంలో 12 మంది క్రొత్త అపొస్తలులను నియమించాలని ఆయన అనుకోలేదు. (మార్కు 9:34, 35) అపరిపూర్ణులైనందున వారు అబద్ధ యూదా మత సంస్కృతి మూలంగా, అహంభావానికీ భేదాలకు అది ఇచ్చే ప్రాముఖ్యత మూలంగా ప్రభావితమై ఉండవచ్చు. తన అనుచరుల ప్రాథమిక పురికొల్పు యెహోవా ఎడల వారికున్న ప్రేమేనని యేసుకు తెలుసు. అలాంటి ప్రేమ వ్యక్తం చేసినందుకు, యేసును అంటిపెట్టుకుని ఉన్నందుకు వారు గొప్పగా ప్రతిఫలం పొందారు.—లూకా 22:28-30.
మనం మన నమ్మకమైన తోటి విశ్వాసులను అనుమానంతో చూస్తే, అది మనం విషయాలను వికృతంగా చూపించే కటకంలో నుండి చూసినట్లుగా ఉంటుంది. ఏదీ ఉన్నదున్నట్లుగా కనిపించదు. కాబట్టి మనం ప్రేమ అనే కటకంలో నుండి చూద్దాము. యథార్థవంతులైన తోటి క్రైస్తవులు మనల్ని ప్రేమిస్తారనడానికి, మన దయగల శ్రద్ధను పొందడానికి అర్హులనడానికి కావలసినంత సాక్ష్యాధారం ఉంది. (1 కొరింథీయులు 13:4-8) కాబట్టి మనం వారికి ప్రేమను కనబర్చి, తప్పుడు ఉద్దేశాలను ఆపాదించడం గురించి జాగ్రత్త వహిద్దాము.
[26వ పేజీలోని చిత్రం]
దేవున్ని నమ్మకంగా ఆరాధించే ఇతరులను మీరెలా దృష్టిస్తారు?
[27వ పేజీలోని చిత్రం]
నమ్మకం మరియు గౌరవం యెహోవాసాక్షులను ఆనందభరితమైన ఒక్క కుటుంబంగా చేస్తుంది