నిరాశ మధ్యన నిరీక్షణను కనుగొనే విధానం
మీరు ఈ కష్టాలను అనుభవించవలసి ఉందనుకోండి: మిమ్మల్ని దిక్కులేకుండా చేస్తూ, మీ వస్తుసంపదంతా నాశనం చేయబడింది. మీ జీవితంలోని ఆనందం అంటే, మీ పిల్లలు ఇక లేరు. మీ జీవిత భాగస్వామి మీకు నైతిక మద్దతునివ్వడం లేదు. మీ ఆరోగ్యం అక్షరార్థంగా క్షీణించిపోయింది. ప్రతీరోజూ ఒక వేదనభరితమైన విషమ పరీక్షే.
మీ పరిస్థితి అదే అయితే, జీవితాన్ని కొనసాగించడానికి కారణాన్ని కనుగొనగలరా? లేక మీరు నిరాశకు లోనవుతారా?
ఇంతక్రితమే వర్ణించబడిన దుఃఖకరమైన దురవస్థ, బైబిలు కాలాల్లో జీవించిన యోబు అనే ఒక వ్యక్తి యొక్క నిజ జీవిత అనుభవం. (యోబు, 1, 2 అధ్యాయాలు) మరీ కృంగిపోయి ఉన్నప్పుడు యోబు ఇలా విలపించాడు: “నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది.” ఆయన మరణాన్ని ఒక ఉపశమనంగా ఆహ్వానించివుండేవాడు. (యోబు 10:1; 14:13) అయితే, యోబు అత్యధికమైన వేదనను అనుభవిస్తున్నప్పటికీ, ఆయన దేవుని ఎడల తనకున్న యథార్థతను కాపాడుకున్నాడు. కాబట్టి యెహోవా “యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను.” అందుకే ఆయన “కాలము నిండిన వృద్ధుడై” సమాధానంగా మరణించాడు.—యోబు 42:12, 16.
యోబు సహనం విషయంలో చూపిన మాదిరి నేటి వరకూ ప్రశంసించబడుతోంది. ఆయన కష్టాలు ఆయన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చి, మంచి కార్యాలు చేయడానికి ఇతరులను పురికొల్పాయి. (యాకోబు 5:10, 11) అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యంగా, యోబు యొక్క నిష్కళంకమైన యథార్థత యెహోవా హృదయాన్ని ఆనందపర్చింది. (సామెతలు 27:11) కాబట్టి అలా, వేదనాభరితమైన ఒక పీడకల చివరికి యోబుకు మరియు ఆయన మాదిరి ద్వారా పురికొల్పబడిన వారందరికీ భక్తి విశ్వాస యథార్థతల ఘనవిజయమయ్యింది.
వివిధ శ్రమలు ఉన్నప్పటికీ నిరీక్షణ
యోబు అనుభవించినటువంటి శ్రమలనే మీరూ అనుభవించవచ్చు. ప్రియమైనవారిని కోల్పోవడం మిమ్మల్ని భావోద్రేకపరంగా కూలద్రోసి ఉండవచ్చు. తీవ్రమైన అనారోగ్యం మీరు జీవించివుండడాన్ని బాధాకరమైన విషమ పరీక్షగా చేసి ఉండవచ్చు. దుఃఖకరమైన విడాకుల మూలంగా మీ జీవన విధానమంతా ముక్కలైపోయినట్లు అనిపించవచ్చు. ఆర్థిక విపత్తులు మిమ్మల్ని నిరాధారులనుగా చేసివుండవచ్చు. సత్యారాధనను ద్వేషంతో వ్యతిరేకించే వారి నుండి మీరు తీవ్రమైన హింసను ఎదుర్కొంటుండవచ్చు. మీకున్న కష్టాలను ఎదుర్కోవడానికి మీరు చేసే పోరాటం, భవిష్యత్తు నిరాశాయుతంగా ఉన్నట్లు మీరు భావించేలా చేసివుండవచ్చు.—1 పేతురు 1:6.
నిరాశకు లోనయ్యే బదులు, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేనెందుకు వేదనననుభవిస్తున్నాను?’ మీరు అపవాదియగు సాతాను అయిన “దుష్టుని యందున్న” లోకంలో జీవిస్తున్నారు గనుక మీరు వేదన అనుభవిస్తున్నారు. (1 యోహాను 5:19) దాని ఫలితంగా ప్రతి ఒక్కరూ వేదనలను అనుభవిస్తున్నారు. రాజ్య సమాచారం ఎడల అపవాది ప్రేరేపిత ద్వేషానికి, ఇతరుల ప్రేమలేని మాటలకు, లేక ఈ “అపాయకరమైన కాలముల”లో సర్వసాధారణమైయున్న దైవభక్తిలేని ప్రవర్తన యొక్క భయంకరమైన చర్యలకు మనమందరం ఏదో విధంగా ప్రభావితమౌతున్నాము.—2 తిమోతి 3:1-5.
మీ జీవితంలో ఏదైనా దుర్ఘటన సంభవించివుంటే, మీరు ‘కాలవశానికి, అనూహ్యమైన సంఘటనకు’ గురైవుండవచ్చు. (ప్రసంగి 9:11) మరో వైపున, మనం వారసత్వంగా పొందిన మన స్వంత పాపాన్నిబట్టి కూడా జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. (రోమీయులు 5:12) మీరు గంభీరమైన పాపం చేసినప్పటికీ, మీరు ఒకవేళ పశ్చాత్తాపపడి ఆత్మీయ సహాయాన్ని తీసుకుంటే, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడన్నట్లు భావించకండి. (కీర్తన 103:10-14; యాకోబు 5:13-15) ఆయన మరెవ్వరికన్నా కూడా మన ఎడల శ్రద్ధ కలిగివున్నాడు. (1 పేతురు 5:6, 7) “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని మీరు నిశ్చయత కలిగివుండవచ్చు. (కీర్తన 34:18) మీ శ్రమ ఎంత దుఃఖకరమైనదీ లేక ఎంత తీవ్రమైనదీ అయినప్పటికీ, దానితో వ్యవహరించడానికి అవసరమైన జ్ఞానాన్ని యెహోవా మీకివ్వగలడు. (యాకోబు 1:5-8) యెహోవా అన్ని గాయాలనూ మాన్పగలడని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోండి. ఆయన అనుగ్రహం మీకు లభించినప్పుడు, జీవమనే బహుమానాన్ని పొందకుండా ఏదీ మిమ్మల్ని ఆపలేదు.—రోమీయులు 8:38, 39.
శ్రమల నుండి ప్రయోజనకరమైనదేదైనా రాగలదా?
ఒక పాత సామెత ఇలా చెబుతుంది, “ఒక కష్టం తర్వాత ఒక సుఖం తప్పక వస్తుంది.” అది, పరిస్థితులు ఎంత చెడ్డగా మారినా, నిరీక్షించడానికి ఎప్పుడూ మీరు ఒక కారణాన్ని కనుగొనవచ్చుననేదాన్ని సరళంగా చెప్పడమే. దేవుని వాక్యంలో వ్రాయబడిన వాటన్నిటి వెనుకనున్న సంకల్పమేమిటంటే, ‘మనకు నిరీక్షణ కలగాలన్నదే.’ (రోమీయులు 15:4) మీ దురవస్థ ఎంత తీవ్రమైనదిగా ఉన్నా, బైబిలులోని వాగ్దానాలు, సూత్రాలు మీకు పునర్నూతన ఆనందాన్ని, నిరీక్షణను తీసుకురాగలవు.
దేవున్ని ప్రేమించేవారి ఎదుట ఉంచబడిన నిత్యాశీర్వాదాలతో పోల్చినప్పుడు, ‘శ్రమ క్షణమాత్రముంటుందని, అది తేలికైనదని’ లేఖనాలు చూపుతున్నాయి. (2 కొరింథీయులు 4:16-18) శ్రమల మధ్య పెంపొందింపజేసుకున్న దైవిక లక్షణాలు గొప్ప పేరు లేక వస్తుసంపద కంటే ఎంతో విలువైనవని కూడా బైబిలు సూచిస్తుంది. (1 యోహాను 2:15-17) అలా, శ్రమ కూడా ప్రయోజనాన్ని చేకూర్చగలదు. (హెబ్రీయులు 5:8) వాస్తవానికి, శ్రమల సమయంలో నేర్చుకున్నవాటిని అన్వయించుకోవడం మీకు అనుకోని ఆశీర్వాదాలను తీసుకురాగలదు.
కష్టతరమైన శ్రమ మిమ్మల్ని మరింత సౌమ్యంగా చేయవచ్చు. ఇతరులకు చికాకు కలిగించిన, చివరికి మీ ఆత్మీయ అభివృద్దిని ఆటంకపర్చిన వ్యక్తిత్వ లోపం గతంలో మీకు ఉండినదని మీరు అంగీకరించవచ్చు. బహుశా అది అతినమ్మకం అయ్యుండవచ్చు. ఏదైనా విపత్తు మూలంగా కృంగుదల అనుభవించిన తర్వాత, మీరెంత అల్పమైనవారో, ఇతరుల అవసరత మీకు ఎంతగా ఉందో మీరు హఠాత్తుగా గుర్తించవచ్చు. మీ శ్రమ మీకా పాఠాన్ని నేర్పిస్తే, మీరు అవసరమైన మార్పులు చేసుకుంటే, దాని నుండి మీరు ప్రయోజనం పొందినట్లే.
గతంలో, మీకు మీ కోపాన్ని అదుపు చేసుకోవడం కష్టంగా ఉన్నందున మీతో వ్యవహరించడం కష్టమని ఇతరులు భావిస్తుండివుంటే అప్పుడేమిటి? ఇది మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు కొంత వేదన కలిగించి ఉండవచ్చు. (సామెతలు 14:29, 30) అయితే, మీరు ఆశానిగ్రహాన్ని అలవర్చుకునేందుకు దేవుని ఆత్మ సహాయంపై ఆధారపడుతున్నారు గనుక పరిస్థితి ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉండవచ్చు.—గలతీయులు 5:22, 23.
ఇతరుల వలె, బహుశా మీకు ఒకప్పుడు, తప్పు చేసిన ఇతరుల ఎడల కనికరం కల్గివుండడానికి కావలసిన వాత్సల్యం కొరవడి ఉండవచ్చు. మీపై దయ చూపడం ఎంతో అవసరమైన పరిస్థితిలోకి మీరే పడిపోయివుంటే, బహుశా ఇప్పుడు మీరు ఇతరుల ఎడల కనికరం కల్గివుండడానికి ఎక్కువగా మొగ్గుచూపవచ్చు. మీ ఎడల చూపబడిన దయాపూర్వకమైన జాలి, శ్రద్ధ, కనికరం, పశ్చాత్తాపపడే తప్పిదస్థుల ఎడల అలాంటి లక్షణాలనే చూపాలని మీరు గుర్తించేలా చేశాయి. మీకు కలిగిన మానసిక వేదన మీ వ్యక్తిత్వంలోని ఈ బలహీనతలను సరిచేసుకోవడానికి మిమ్మల్ని కదిలించివుంటే, మీ అనుభవం నుండి మీరు పొందిన ఒక ప్రయోజనం ఇదన్నమాట. “కనికరము తీర్పును మించి అతిశయపడును” అని మీరు నేర్చుకున్నారు.—యాకోబు 2:13; మత్తయి 5:7.
క్రైస్తవ సంఘం ఇచ్చిన క్రమశిక్షణ, మీరు అమూల్యమైన ఆధిక్యతలను, ఇతరుల గౌరవాన్ని కోల్పోయేలా చేస్తే, అప్పుడేమిటి? నిరాశకు లోనవ్వకండి. క్రమశిక్షణా చర్య సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి సహాయం చేస్తుంది, కాని తప్పిదస్థున్ని ఆత్మీయంగా పునఃస్థాపించడం కూడా దాని ఉద్దేశాల్లో ఇమిడి ఉంటుంది. “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” అని అంగీకరించవలసిందే. (ఇటాలిక్కులు మావి, హెబ్రీయులు 12:11) క్రమశిక్షణ నాశనకరమైనది కాగల్గినప్పటికీ, దీనంగా పశ్చాత్తాపపడే వ్యక్తిని అది నిరీక్షణ లేకుండా చేయదు. ప్రాచీన ఇశ్రాయేలీయుల రాజైన దావీదు తప్పిదం గురించి తీవ్రంగా శిక్షించబడ్డాడు, కాని ఆయన పశ్చాత్తాపపడి చివరికి ఆసాధారణమైన విశ్వాసంగల వ్యక్తిగా ప్రత్యేకమైన మెప్పును పొందాడు.—2 సమూయేలు 12:7-12; కీర్తన 32:5; హెబ్రీయులు 11:32-34.
ఒక శ్రమ మీ దృక్కోణంపై అపారమైన ప్రభావాన్ని చూపవచ్చు. గతంలో, మీ అవధానం వస్తుదాయక లక్ష్యాలపై మరియు ఈ ప్రపంచంలో మీకు గుర్తింపునూ సమాజంలో హోదాను తీసుకువచ్చిన లక్ష్యసాధనలపై కేంద్రీకరించబడి ఉండవచ్చు. బహుశా ఒక ఆర్థిక కష్టం లేక వస్తు సంబంధ నష్టం రావడం, మీ తలంపులను మరింత ప్రాముఖ్యమైన విషయాలపై కేంద్రీకరించేలా చేసివుండవచ్చు. (ఫిలిప్పీయులు 1:10 పోల్చండి.) పరిశుద్ధ సేవలోని ఆత్మీయ విలువలూ గమ్యాలే నిజమైన ఆనందాన్ని, నిత్య సంతృప్తిని తెస్తాయని ఇప్పుడు మీరు గుర్తిస్తారు.
యెహోవాయందు నమ్మకం
యెహోవాకు పరిశుద్ధ సేవ చేయడం మీ క్రైస్తవ నమ్మకాలను వ్యతిరేకించేవారి చేతుల్లో హింసను, వేదనను అనుభవించడానికి దారితీయవచ్చు. ఈ శ్రమ మూలంగా మీరు కృంగిపోయినట్లు భావించవచ్చు, కాని దాని ద్వారా ప్రయోజనం చేకూరగలదు. ఈ పరీక్ష మీ విశ్వాసాన్ని బలపర్చవచ్చు. అంతేగాక, హింసింపబడుతున్న ఇతరులు మీ పట్టుదలను చూసి ప్రోత్సహింపబడి, బలపర్చబడవచ్చు. మీ మంచి ప్రవర్తనను ప్రత్యక్షంగా చూసేవారు దేవున్ని మహిమపర్చడానికి పురికొల్పబడవచ్చు. మీ వ్యతిరేకులు కూడా సిగ్గుపడి, మీ మంచి క్రియలను గుర్తించవచ్చు!—1 పేతురు 2:12; 3:15, 16.
హింసించబడినప్పుడు నిరాశ చెందకుండా ఉండడానికి, మీరు యెహోవాయందు నమ్మకం కలిగివుండడం అవసరం. శ్రమనుండి ఉపశమనం తప్పక కలుగుతుందని ఆయన వాక్యం చూపిస్తుంది, కాని అది మనం కోరుకున్నంత త్వరగా రాకపోవచ్చు. ఈ మధ్య కాలంలో, “మేలుచేయుటలో విసుకవద్దు.” (2 థెస్సలొనీకయులు 3:13) కష్టాలను ఎదుర్కోవడానికి, సహించడానికి మార్గాల కొరకు వెదుకుతూ ఉండండి. పరిస్థితులు నిరాశాజనకంగా కనిపించినా, “నీ భారము యెహోవామీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:22) స్వయం జాలిలో మునిగిపోయే బదులు, యెహోవా గురించి తెలుసుకోవడానికి, ఆయన ప్రజల మధ్య ఒక స్థానం కలిగివుండడానికి, నిరంతర జీవిత నిరీక్షణను పొందడానికి మీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారో ఆలోచించండి.—యోహాను 3:16, 36.
అవసరమైన వాటిపైనే మీ మనస్సును కేంద్రీకరించండి. సహించడానికి కావలసిన బలాన్నివ్వమని అడుగుతూ, ప్రతిరోజూ యెహోవాకు ప్రార్థించండి. (ఫిలిప్పీయులు 4:6, 7, 13) మీకు బాధ కలుగజేస్తున్న వారికి ప్రతీకారం చేయాలనే ఏ తలంపునైనా తీసివేయండి. విషయాన్ని యెహోవా చేతుల్లో విడిచిపెట్టండి. (రోమీయులు 12:19) క్రైస్తవ లక్షణాలను అలవర్చుకుంటూ, మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి మార్గాల కొరకు వెదుకుతూ ఉండండి. (2 పేతురు 1:5-8) మీ ఆత్మీయ అవసరతల గురించి ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకునే పెద్దలతో సహా, ఇతరులు మీకొరకు చేసే ప్రతిదాన్ని మెచ్చుకోండి. (హెబ్రీయులు 13:7, 17) దేవుని ఎడల నమ్మకంగా ఉండండి, జీవపు బహుమానంపై మీ దృష్టిని కేంద్రీకరించండి, మరణం కూడా దాన్ని మీ నుండి దొంగిలించలేదని దృఢవిశ్వాసం కల్గివుండండి.—యోహాను 5:28, 29; 17:3.
మీరు గొప్ప దుఃఖాన్ని లేక తీవ్రమైన కష్టాలను అనుభవిస్తుంటే, “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము,” మీకున్న దుఃఖం మరియు కష్టం స్థానే చివరికి పుష్కలమైన ఆనందం లభిస్తుంది. (సామెతలు 3:5, 6; యోహాను 16:20) దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగానే మిమ్మల్నీ ఆశీర్వదించినప్పుడు దుఃఖం స్థానంలో ఆనందం నెలకొంటుంది. మీ ప్రతిఫలంతో పోల్చిచూసినప్పుడు ప్రస్తుత దిన బాధలు ఏమీ కావు. (రోమీయులు 8:18, పోల్చండి.) మీ నమ్మకమైన సహనం ఇతరులను ప్రోత్సహించి, “నవీన స్వభావము”తో వచ్చే చక్కని క్రైస్తవ లక్షణాలను అలవర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 4:23, 24; కొలొస్సయులు 3:10, 12-14) కాబట్టి, అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ జ్ఞానవంతమైన ఉపదేశాన్నిబట్టి ధైర్యం వహించండి: “కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.”—1 పేతురు 4:19.
[23వ పేజీలోని చిత్రం]
యోబులా ఉండండి. ఎన్నడూ నిరీక్షణను వదులుకోకండి
[24వ పేజీలోని చిత్రం]
యెహోవాయందు మీ పూర్ణ హృదయంతో నమ్మకముంచండి