కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 11/15 పేజీలు 8-13
  • శోధనలున్నా, మీ విశ్వాసానికి హత్తుకొని ఉండండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శోధనలున్నా, మీ విశ్వాసానికి హత్తుకొని ఉండండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం శోధనల్ని ఎదుర్కొన్నప్పుడు
  • జ్ఞానాన్వేషణ
  • ధనికులూ, బీదలూ అతిశయించగలరు
  • శోధనల్ని సహించుకొనువారు ధన్యులు
  • దేవుడు—శ్రేష్ఠమైన ప్రతివాటికి ఆధారభూతుడు
  • ‘వాక్యప్రకారం ప్రవర్తించువానిగా’ ఉండడం
  • ఆరాధనాపరులమని అనుకోవడం కన్నా ఎంతో ఎక్కువే ఇమిడివుంది
  • కష్టాలు ఎదురైనా ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ‘వాక్య ప్రకారం,’ ఆనందమయంగా ‘చేసేవారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • విశ్వాసము మరియు జ్ఞానము మన కెందుకవసరము?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • కష్టాలను మనమెలా దృష్టించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 11/15 పేజీలు 8-13

శోధనలున్నా, మీ విశ్వాసానికి హత్తుకొని ఉండండి!

“నా సహోదరులారా . . . మీరు నానా విధములైన శోధనలలోపడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.”—యాకోబు 1:2, 3.

1. ఏవి ఉన్నప్పటికీ యెహోవా ప్రజలు విశ్వాసంతోనూ “హృదయానందము”తోనూ ఆయనకు సేవచేస్తారు?

యెహోవా ప్రజలు ఆయన సాక్షులుగా విశ్వాసంతోనూ “హృదయానందము”తోనూ సేవచేస్తారు. (ద్వితీయోపదేశకాండము 28:47; యెషయా 43:10) అనేక శోధనలు వారిని చుట్టిముట్టినప్పటికీ వాళ్లు దీనిని చేస్తారు. తమకెన్ని కష్టాలొచ్చినా, “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి” అనే మాటల నుండి వారు ఓదార్పును పొందుతారు.—యాకోబు 1:2, 3.

2. యాకోబు పత్రికా రచయితను గురించి తెల్సినదేమిటి?

2 దాదాపు సా.శ. 62లో, యేసుక్రీస్తు సహోదరుడైన శిష్యుడగు యాకోబు ఆ మాటలు రాశాడు. (మార్కు 6:3) యాకోబు యెరూషలేము సంఘంలో ఒక పెద్ద. నిజానికి ఆయనా, కేఫా (పేతురు), యోహానులు సంఘానికి ఆధారమైన స్తంభాలుగా అంటే బలంగావుండి, సంఘంలో లోతుగా పాతుకుపోయిన “స్తంభములుగా ఎంచబడి[రి.]” (గలతీయులు 2:8) దాదాపు సా.శ. 49లో సున్నతిని గూర్చిన వివాదాంశం ‘అపొస్తలుల ఎదుటకునూ, పెద్దల ఎదుటకునూ’ తేబడినప్పుడు, యాకోబు లేఖనాలపై ఆధారపడిన ఒక ప్రతిపాదనను చేశాడు. ఆ ప్రతిపాదనను మొదటి శతాబ్దంలోని పరిపాలకసభ ఆమోదించింది.—అపొస్తలుల కార్యములు 15:6-29.

3. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎదుర్కొన్న కొన్ని సమస్యలేవి, యాకోబు పత్రిక నుండి మనమెలా అత్యధిక ప్రయోజనాన్ని పొందగలం?

3 శ్రద్ధగల ఆధ్యాత్మిక కాపరిగా, ‘పశువుల (మంద) స్థితి’ యాకోబుకు తెలుసు. (సామెతలు 27:23) ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు తీవ్రమైన శోధనలను ఎదుర్కొంటూ ఉన్నారని ఆయన గ్రహించాడు. వారిలో కొంతమంది ధనవంతుల ఎడల అభిమానాన్ని చూపిస్తున్నందున వారి ఆలోచనాసరళిని సరిదిద్దాల్సిన అవసరం ఏర్పడింది. అనేకమందికి ఆరాధన లాంఛనప్రాయమైంది. కొందరు తమ నోటిదురుసుతనంతో ఇతరులను నొప్పించారు. లౌకికాత్మ హానికరమైన పరిణామాల్ని తీసుకొచ్చింది. అనేకులు ఓర్పును కోల్పోయారు, ప్రార్థనాపూర్వకంగా ఉండడం మానుకున్నారు. నిజానికి, కొంతమంది క్రైస్తవులు ఆధ్యాత్మిక రోగులయ్యారు. క్షేమాభివృద్ధికరమైన రీతిలో అలాంటి విషయాల్ని యాకోబు పత్రిక ప్రస్తావిస్తోంది. ఆయన సలహాలు సా.శ. మొదటి శతాబ్దంలో వలెనే నేడు కూడా ఆచరణీయంగా ఉన్నాయి. మనమీ పత్రికను మనకు స్వయంగా రాయబడిన దానిగా పరిగణిస్తే, దీనినుండి మనమెంతో ప్రయోజనాన్ని పొందుతాం.a

మనం శోధనల్ని ఎదుర్కొన్నప్పుడు

4. మనం శోధనల్ని ఎలా దృష్టించాలి?

4 శోధనల్ని మనమెలా దృష్టించాలో యాకోబు మనకు చూపిస్తున్నాడు. (యాకోబు 1:1-4) దేవుని కుమారునితో తనకున్న కుటుంబ బాంధవ్యాన్ని ప్రస్తావించకుండా, ఆయన తనను తాను వినయంతో “దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసు[ణ్ణని]” పిల్చుకున్నాడు. హింసనుబట్టి మొదట్లో “చెదిరి[పోయిన]” ఆధ్యాత్మిక ఇశ్రాయేలు “పండ్రెండు గోత్రములవారికి” యాకోబు రాశాడు. (అపొస్తలుల కార్యములు 8:1; 11:19; గలతీయులు 6:16; 1 పేతురు 1:1) క్రైస్తవులుగా, మనం కూడా హింసించబడుతున్నాం. మనం ‘నానా విధములైన శోధనలను ఎదుర్కుంటున్నాం.’ అయితే శోధనల్ని ఓర్చుకొనడం మన విశ్వాసాన్ని బలపరుస్తుందని మనం గుర్తుంచుకుంటే, మనం శోధనలలో పడినప్పుడు, ‘వాటిని మహానందంగా ఎంచుకుంటాం.’ శోధనలు వచ్చినప్పుడు దేవుని ఎడల మన యథార్థతను మనం కాపాడుకుంటే, అది శాశ్వతమైన సంతోషాన్ని తెస్తుంది.

5. మన శోధనల్లో ఏవి చేరివుండవచ్చు, మనం వాటిని విజయవంతంగా సహించినప్పుడు ఏమి జరుగుతుంది?

5 మన శోధనల్లో మానవాళికి సర్వసామాన్యమైన బాధలూ చేరివున్నాయి. ఉదాహరణకు, అనారోగ్యం మనల్ని పట్టి పీడించవచ్చు. దేవుడు అద్భుతమైన స్వస్థతల్ని ఇప్పుడు చేయడంలేదు గానీ జ్ఞానం కొరకూ, అనారోగ్యంతో వ్యవహరించడానికి అవసరమైన బలం కొరకూ మనం చేసే ప్రార్థనలకు జవాబు ఇస్తున్నాడు. (కీర్తన 41:1-3) యెహోవా యొక్క హింసించబడ్డ సాక్షులుగా మనం నీతినిమిత్తం బాధించబడతాం కూడా. (2 తిమోతి 3:12; 1 పేతురు 3:14) మనం అలాంటి శోధనల్ని విజయవంతంగా సహించినప్పుడు, మన విశ్వాసం ‘పరీక్షించబడిన లక్షణంగా’ తయారౌతుందని రుజువవుతుంది. మన విశ్వాసం విజయం సాధిస్తున్నప్పుడు, ఇది “ఓర్పును పుట్టి[స్తుంది.]” శోధనల ద్వారా బలపడిన విశ్వాసం, భవిష్యత్‌ పరీక్షల్ని సహించుకునేందుకు మనకు సహాయపడుతుంది.

6. “ఓర్పు తన క్రియను” ఎలా ‘పూర్తి చేస్తుంది,’ మనం శోధించబడినప్పుడు ఏ ఆచరణీయమైన చర్యల్ని తీసుకోవాలి?

6 అయితే, “ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి [“పూర్తి చేయనివ్వండి,” NW]” అని యాకోబు చెబుతున్నాడు. లేఖనాధారంలేని మాధ్యమాల ద్వారా మనం శోధనను త్వరగా నిలిపివేయడానికి ప్రయత్నించకుండా దాన్ని కొనసాగడానికి అనుమతించినట్లైతే, విశ్వాసంలేని వారివలెగాక క్రైస్తవులుగా మనల్ని సంపూర్ణులనుచేసే “పని”ని సహనం సాధిస్తుంది. అవును, శోధన ఏదొక బలహీనతను బయల్పరిస్తే, మనం దాన్ని అధిగమించేందుకు యెహోవా సహాయాన్ని వెదకాలి. శోధన లైంగిక దుర్నీతిలో పాల్గొనేలా మరులుకొల్పేదైతే అప్పుడేమి చెయ్యాలి? ఆ సమస్యను గురించి మనం ప్రార్థించి, మన ప్రార్థనలకు అనుగుణంగా ప్రవర్తిద్దాం. మనం మన ఉద్యోగస్థలాన్ని మార్చుకోవడమో, లేక దేవుని ఎడల యథార్థతను కాపాడుకునేందుకు ఇతర చర్యల్ని తీసుకోవడమో అవసరం కావచ్చు.—ఆదికాండము 39:7-9; 1 కొరింథీయులు 10:13.

జ్ఞానాన్వేషణ

7. శోధనల్ని ఎదుర్కునేందుకు మనమెలా సహాయాన్ని పొందవచ్చు?

7 శోధనను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియకపోతే మనమేమి చెయ్యాలో యాకోబు మనకు చూపిస్తున్నాడు. (యాకోబు 1:5-8) జ్ఞానం కొదువగా ఉన్నందుకూ, మరి దాన్ని గురించి విశ్వాసంతో ప్రార్థిస్తున్నందుకూ యెహోవా మనల్ని గద్దించడు. శోధనని సరిగా దృష్టించేలా, మరి దాన్ని సహించుకునేలా ఆయన మనకు సహాయపడతాడు. తోటి విశ్వాసుల ద్వారానో లేక బైబిల్ని పఠనం చేస్తున్నప్పుడో లేఖనాలు మన అవధానానికి తేబడతాయి. దైవికనడిపింపు ద్వారా యుక్తిగా నిర్దేశించబడ్డ సంఘటనలు, మనం ఏమి చేయాలో గ్రహించేలా చేయవచ్చు. మనం దేవుని ఆత్మచే నడిపించబడవచ్చు. (లూకా 11:13) అలాంటి ప్రయోజనాల్ని అనుభవించాలంటే, మనం దేవునికీ ఆయన ప్రజలకూ సన్నిహితంగా ఉండాల్సిందే.—సామెతలు 18:1.

8. సందేహపడే వాడు యెహోవా నుండి ఏదీ ఎందుకు పొందలేడు?

8 మనం “ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడు[గుతూ]” ఉన్నట్లైతే, శోధనల్ని తాళుకునేందుకు యెహోవా మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. సందేహించువాడు “గాలిచేత రేపబడి” ఎటు ఎగిరిపడుతుందో ముందుగా తెలియని “సముద్ర తరంగమును పోలి” ఉంటాడు. మనం ఆధ్యాత్మికంగా నిలకడగా ఉండకపోతే, ‘యెహోవా నుండి మనకేమైనా దొరుకుతుందని మనం తలంచుకొనరాదు.’ ప్రార్థనలోగానీ లేక మరి ఇతరత్రాగానీ మనం “అనిశ్చయం”గానూ, “నిలకడలేని” విధంగానూ ఉండకూడదు. బదులుగా, జ్ఞానానికి మూలమైన యెహోవానందు విశ్వాసాన్ని కల్గివుందాం.—సామెతలు 3:5, 6.

ధనికులూ, బీదలూ అతిశయించగలరు

9. యెహోవా ప్రజలుగా అతిశయించడానికి మనకు ఎందుకు కారణముంది?

9 బీదరికమనేది మన శోధనల్లో ఒకటైననూ, ధనికులూ బీదలూ అయిన క్రైస్తవులు అతిశయించగలరనే విషయాన్ని మనం మనస్సునందు ఉంచుకుందాం. (యాకోబు 1:9-11) యేసు అనుచరులుకాక మునుపు, అభిషిక్తుల్లో అనేకమంది ఆస్తిపాస్తులంతగాలేని వాళ్లే, వాళ్లు లోకంచే చిన్నచూపు చూడబడ్డారు. (1 కొరింథీయులు 1:26) కానీ రాజ్య వారసులుగా ఉండే స్థాయికి వాళ్లు ‘హెచ్చించబడినందున’ అతిశయించగలిగారు. (రోమీయులు 8:16, 17) మునుపు ఘనతపొందిన ధనికులు క్రీస్తు అనుచరులుగా లోకంచే చిన్నచూపు చూడబడినందున “దీనదశను” అనుభవించారు. (యోహాను 7:47-52; 12:42, 43) అయితే లౌకిక సంపదా, ఉన్నతస్థానాలూ మనం అనుభవించే ఆధ్యాత్మిక ఐశ్వర్యంతో పోల్చితే ఎందుకూ కొరగావు గనుక యెహోవా సేవకులుగా మనమంతా అతిశయించగలం. సామాజిక హోదాకు సంబంధించి మనలో గర్వానికి తావులేనందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!—సామెతలు 10:22; అపొస్తలుల కార్యములు 10:34, 35.

10. భౌతిక సంపదను ఒక క్రైస్తవుడు ఎలా దృష్టించాలి?

10 సంపదపైనా, లౌకికంగా సాధించేవాటిపైనా మన జీవితం ఆధారపడిలేదని గ్రహించడానికి యాకోబు మనకు సహాయపడుతున్నాడు. సూర్యుని ‘తీక్షణమైన వేడికి’ వాడిపోయి రాలిపోకుండా పువ్వును దాని అందం కాపాడలేనట్లే, ధనవంతుని ఐశ్వర్యం వాని జీవితాయుష్షును పొడిగించలేదు. (కీర్తన 49:6-9; మత్తయి 6:27) తన “ప్రయత్నములలో” ఉండగానే, బహుశా వ్యాపార వ్యవహారాల్లో ఉండగానే అతడు మరణించవచ్చు. కాబట్టి, “దేవునియెడల ధనవంతుడు”గా ఉండి, రాజ్యాసక్తుల్ని పెంపొందింపచేయడంలో మనం చేయగల వాటినన్నిటినీ చేయడం ప్రాముఖ్యమైన విషయం.—లూకా 12:13-21; మత్తయి 6:33; 1 తిమోతి 6:17-19.

శోధనల్ని సహించుకొనువారు ధన్యులు

11. శోధనల్ని ఎదుర్కోవడంలో తమ విశ్వాసాన్ని హత్తుకొని ఉన్న వారికి ఎటువంటి ఉత్తరాపేక్షలు ఉన్నాయి?

11 మనం ధనికులమైనా లేక బీదలమైనా శోధనల్ని సహించుకుంటేనే సంతోషంగా ఉండగలం. (యాకోబు 1:12-15) దేవుని దృష్టికి సరియైన దానిని చేయడంలో ఆనందముంది గనుక భ్రష్టుపట్టని మన విశ్వాసంతో అలాంటి శోధనల్ని మనం సహిస్తే, మనం ధన్యులమని ప్రకటించబడగలం. మరణం వరకు తమ విశ్వాసానికి హత్తుకొని ఉండడం ద్వారా, ఆత్మవలన పుట్టిన క్రైస్తవులు ‘జీవకిరీటాన్ని’ అంటే పరలోకంలో అమర్త్యమైన జీవితాన్ని పొందుతారు. (ప్రకటన 2:10; 1 కొరింథీయులు 15:50) మనం భూ సంబంధమైన నిరీక్షణల్ని కల్గి, దేవునియందు మన విశ్వాసాన్ని కాపాడుకుంటే, మనం పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందేందుకు ఎదురుచూడవచ్చు. (లూకా 23:43; రోమీయులు 6:23) యెహోవా తన యందు విశ్వాసముంచే వారందరి ఎడలా ఎంత ఉత్తముడై ఉన్నాడో కదా!

12. మనం కఠినమైన పరిస్థితుల్ని అనుభవిస్తున్నప్పుడు, “నేను దేవునిచేత శోధింపబడుచున్నానని” మనం ఎందుకు అనకూడదు?

12 యెహోవాయే మనల్ని కఠినంగా శోధించడమనేది జరిగేపనేనా? కాదు, “నేను దేవునిచేత శోధింపబడుచున్నానని” మనం అనకూడదు. పాపం చేసేలా మనల్ని మరులుకొల్పడానికి యెహోవా ప్రయత్నించడు గానీ, మనం విశ్వాసమందు స్థిరంగా నిలిచివుంటే శోధనల్ని సహించుకోవడానికి నిశ్చయంగా మనకు సహాయపడి, దానికి అవసరమైన బలాన్నిస్తాడు. (ఫిలిప్పీయులు 4:13) దేవుడు పరిశుద్ధుడు గనుక చెడుతనాన్ని నిరోధించే మనశక్తిని బలహీనపర్చే పరిస్థితుల్లో మనల్ని ఆయన పెట్టడు. “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక” మనకుగా మనం భక్తిహీన పరిస్థితిలో పడిపోయి, ఏదొక పాపాన్ని చేస్తే, దానికి మనం ఆయనను నిందించకూడదు. మన ప్రయోజనం నిమిత్తం మనకు క్రమశిక్షణను ఇచ్చేందుకు యెహోవా ఒకానొక శోధనను బహుశా అనుమతించినప్పటికీ, చెడు ఉద్దేశంతో ఆయన శోధించడు. (హెబ్రీయులు 12:7-11) చెడును చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపించవచ్చు గానీ దేవుడు ఆ దుష్టున్నుండి మనల్ని విడిపించగలడు.—మత్తయి 6:13.

13. మనం ఒకానొక దురాశను తీసివేసుకోక పోతే, ఏమి జరగగలదు?

13 ఒకానొక పరిస్థితి పాపము చేయడానికి మనల్ని మరులుకొల్పగల్గే ఒక దురాశకు నడిపించవచ్చు గనుక మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాల్సిన అవసరం ఉంది. యాకోబు ఇలా చెబుతున్నాడు: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.” పాపభరితమైన కోరికపై లగ్నంచేయడానికి మన హృదయాన్ని మనం అనుమతిస్తే, మనం చేసిన పాపాన్నిబట్టి దేవున్ని నిందించకూడదు. మనమా కోరికను తీసివేసుకోకపోతే, ‘అది గర్భము దాల్చి’ హృదయంలో పెరిగి, “పాపాన్ని కంటుంది.” పాపం పరిపక్వమైనప్పుడు అది ‘మరణాన్ని తీసుకొస్తుంది.’ నిశ్చయంగా మన హృదయాల్ని కాపాడుకొని, పాపభరిత ఉద్దేశాల్ని నిరోధించాల్సిన అవసరంవుంది. (సామెతలు 4:23) పాపం అతన్ని జయించబోతుందని కయీను హెచ్చరించబడ్డాడు కానీ అతడు దాన్ని నిరోధించలేదు. (ఆదికాండము 4:4-8) కాబట్టి, లేఖనవిరుద్ధమైన పనిని మనం వెంబడించడం మొదలు పెడుతున్నట్లైతే అప్పుడేం చెయ్యాలి? మనం దేవునికి విరుద్ధంగా పాపం చేయకుండా ఉండేలా మనల్ని సరిదిద్దడానికి క్రైస్తవ పెద్దలు గనుక ప్రయత్నిస్తే మనం నిశ్చయంగా కృతజ్ఞులమై ఉండాలి.—గలతీయులు 6:1.

దేవుడు—శ్రేష్ఠమైన ప్రతివాటికి ఆధారభూతుడు

14. దేవుని ఈవులన్నీ ‘సంపూర్ణమైనవని’ ఏ భావంలో చెప్పబడ్డాయి?

14 యెహోవా శోధనలకు కాదుగానీ శ్రేష్ఠమైన వాటికే మూలమని మనం గుర్తుంచుకోవాలి. (యాకోబు 1:16-18) “ప్రియ సహోదరులారా” అని తన తోటి విశ్వాసుల్ని సంభోదిస్తూ, ‘శేష్ఠమైన ప్రతి యీవినీ, సంపూర్ణమైన ప్రతి వరాన్నీ’ దేవుడు అనుగ్రహిస్తాడని యాకోబు చూపిస్తున్నాడు. యెహోవా దేవుని ఆధ్యాత్మిక, భౌతిక యీవులు ‘సంపూర్ణమైనవి’ లేక కొదువలేకుండా పూర్ణంగా ఉన్నవీ అయివున్నాయి. అవి ‘పరసంబంధమైనవి’ అంటే పరలోకంలోని దేవుని నివాసస్థలం నుండి వస్తాయి. (1 రాజులు 8:39) యెహోవా ‘జ్యోతిర్మయుడు’ అంటే సూర్య చంద్ర నక్షత్రాలకు తండ్రియై ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మిక వెలుగునూ, సత్యాన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. (కీర్తన 43:3; యిర్మీయా 31:35; 2 కొరింథీయులు 4:6) గమనాగమనముల వలన ఛాయలలో మార్పుల్ని కలుగజేస్తూ, మిట్ట మధ్యాహ్నం నడినెత్తిపైకి వచ్చినప్పుడు మాత్రమే ప్రచండమైన వెలుగునిచ్చే సూర్యునివలేగాక, శ్రేష్ఠమైన వాటిని ఇవ్వడంలో దేవుడు ఎల్లప్పుడూ గరిష్ఠస్థాయిలోనే ఉంటాడు. తన వాక్యం ద్వారా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా తాను సరఫరా చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లనుండి పూర్తి ప్రయోజనాన్ని మనం పొందినట్లైతే శోధనల్ని ఎదుర్కొనేందుకు ఆయన మనల్ని తప్పక సంసిద్ధం చేస్తాడు.—మత్తయి 24:45.

15. యెహోవా దేవుని అత్యంత శ్రేష్ఠమైన యీవులలో ఒకటి ఏది?

15 దేవుని అత్యుత్తమమైన ఈవుల్లో ఒకటి ఏమైవుంది? సువార్తతో లేక “సత్యవాక్యము”తో సమ్మిళితమై పనిచేస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా ఆధ్యాత్మిక కుమారుల్ని తీసుకురావడమే. ఈ ఆధ్యాత్మిక జననం పొందినవారు, పరలోక ‘రాజ్యంగానూ యాజకులుగానూ’ ఉండేందుకు మానవజాతిలో నుండి ఏర్పర్చుకొనబడిన ‘నిర్దిష్టమైన ప్రథమఫలములు’ అయివున్నారు. (ప్రకటన 5:9; ఎఫెసీయులు 1:13, 14) యేసు పునరుత్థానుడైన తేదీన అంటే నీసాను 16న అర్పించిన బార్లీ ప్రథమ ఫలాల్ని గూర్చీ, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన పెంతెకొస్తు దినాన అర్పించబడిన రెండు గోధుమ రొట్టెల్ని గూర్చీ బహుశా యాకోబు ఆలోచిస్తూ ఉండవచ్చు. (లేవీయకాండము 23:4-11, 15-17) అలా అయితే, యేసు “ప్రథమఫలము”గానూ, ఆయన సహ వారసులు ‘నిర్దిష్టమైన ప్రథమఫలాలుగానూ’ ఉంటారు. మనం భూసంబంధమైన నిరీక్షణను కల్గివుంటే అప్పుడేమిటి? ఆ నిరీక్షణను మనస్సులో ఉంచుకోవడం, రాజ్య పరిపాలన క్రింద నిత్యజీవాన్ని సాధ్యపర్చిన “శ్రేష్ఠమైన ప్రతి యీవి”నీ అనుగ్రహించువానియందున్న మన విశ్వాసాన్ని హత్తుకొని ఉండేలా మనకు సహాయపడుతుంది.

‘వాక్యప్రకారం ప్రవర్తించువానిగా’ ఉండడం

16. మనం వినుటకు వేగిరపడుతూ మాటలాడుటకు ఎందుకు నిదానించాలి?

16 మనం విశ్వాస సంబంధమైన శోధనల్ని ఇప్పుడు ఎదుర్కున్నా, ఎదుర్కోకపోయినా మనం ‘వాక్యప్రకారం ప్రవర్తించువారమై’ ఉండాలి. (యాకోబు 1:19-25) దేవుని వాక్యప్రకారం విధేయతతో ప్రవర్తించేవారిగా మనం దాన్ని ‘వినుటకు వేగిరపడాలి.’ (యోహాను 8:47) మరోవైపున, మనం మాట్లాడే వాటిని గురించి జాగ్రత్త వహిస్తూ, ‘మాటలాడడానికి నిదానించేవారిగా’ ఉందాం. (సామెతలు 15:28; 16:23) దేవుని మూలంగా మనకు శోధనలు వస్తున్నాయని త్వరపడి మనం అనకూడదని యాకోబు ఉద్బోధిస్తుండవచ్చు. “నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు” గనుక ‘కోపించడానికి నిదానించేవారమై ఉండాలని’ కూడా మనకు సలహా ఇవ్వబడింది. ఒక వ్యక్తి అనిన దానిని బట్టి మనకు కోపంవస్తే, తిరిగి నొప్పించే సమాధానం ఇవ్వకుండా జాగ్రత్తవహించేలా మనం ‘నిదానిద్దాం.’ (ఎఫెసీయులు 4:26, 27) బహుశా మన సమస్యలకు కారణమయ్యే, ఇతరులకు శోధనగా పరిణమించే కోపస్వభావం, నీతిమంతుడైన మన దేవునియందు విశ్వాసముంచేవానికి తగిన ప్రవర్తనను కలుగజేయదు. పైగా, మనం ‘మహా వివేకంగల’ వారమైతే ‘కోపించడానికి నిదానిస్తాం,’ మరి మన సహోదర సహోదరీలు మనల్ని సమీపిస్తారు.—సామెతలు 14:29.

17. హృదయంలో నుండీ మనస్సులో నుండీ దుష్టత్వాన్ని తొలగించుకోవడం ద్వారా ఏమి సాధింపబడుతుంది?

17 “సమస్త కల్మషము” నుండి అంటే దేవుడు అసహ్యించుకునే, దాని నుండీ కోపాన్ని రప్పించే దాని నుండీ మనం తప్పక దూరంగా ఉండాలి. అంతేగాక, మనం ‘విఱ్ఱవీగు దుష్టత్వాన్ని మానివేయాలి.’ శరీరానికీ ఆత్మకూ కలిగిన ఏ అపవిత్రతనైనా మన జీవితంలో నుండి మనమంతా తీసివేయాలి. (2 కొరింథీయులు 7:1; 1 పేతురు 1:14-16; 1 యోహాను 1:9) మన హృదయంలో నుండీ మనస్సులో నుండీ దుష్టత్వాన్ని తొలగించుకోవడం, ‘లోపల నాటబడిన సత్యవాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడానికి’ మనకు సహాయపడింది. (అపొస్తలుల కార్యములు 17:11, 12) మనమెంత కాలం నుండి క్రైస్తవులముగా ఉన్నప్పటికీ, మనలో మరిన్ని లేఖన సత్యాలు నాటబడేందుకు అనుమతిస్తూ ఉండాలి. ఎందుకు? ఎందుకంటే దేవుని ఆత్మద్వారా నాటబడిన వాక్యం రక్షణను సాధించే ‘నవీనస్వభావాన్ని’ ఉత్పన్నం చేస్తుంది.—ఎఫెసీయులు 4:20-24.

18. వాక్యాన్ని కేవలం ‘వినేవాడు,’ విని దాని ప్రకారం ‘ప్రవర్తించువాని’ నుండి ఏ విధంగా భిన్నంగా ఉంటాడు?

18 దేవుని వాక్యమే మన మార్గదర్శియని మనమెలా చూపిస్తాం? “వినువారు మాత్రమైయుం[డక]” విధేయతతో “వాక్యప్రకారము ప్రవర్తించువా[రమై]” ఉండడం ద్వారానే. (లూకా 11:28) క్రైస్తవ పరిచర్యలో ఆసక్తితో చురుకుగా పాల్గొనడమూ, దేవుని ప్రజల కూటాల్లో క్రమంగా భాగంవహించడమూ వంటి పనుల్ని ఉత్పన్నంచేసే విశ్వాసం ‘వాక్య ప్రకారం ప్రవర్తించేవారికి’ ఉంది. (రోమీయులు 10:14, 15; హెబ్రీయులు 10:24, 25) వాక్యాన్ని కేవలం వినేవాడు “అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.” వాడు తన ముఖాన్ని అద్దంలో చూసుకొని, అవతలకు పోయిన తర్వాత తన స్వరూపాన్ని సరిదిద్దుకోవడానికి అవసరమైన దాన్ని గురించి మరచిపోతాడు. ‘క్రియను చేసేవానిగా’ మననుండి దేవుడు కోరుతున్న ప్రతీదీ చేరివున్న ఆయన ‘సంపూర్ణ నియమాన్ని’ మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి, దానికి విధేయత చూపించాలి. ఆ విధంగా, మనం అనుభవించే స్వాతంత్ర్యం నిత్యజీవానికి నడిపిస్తుంది గనుక అది పాప మరణాలకు దాసత్వం చేయడానికి పూర్తిగా విరుద్ధమైనదై ఉంది. కాబట్టి ఎల్లవేళలా పరిశీలించుకుంటూ, ‘సంపూర్ణమైన నియమానికి’ విధేయత చూపిస్తూ మనం ఆ నియమమందు ‘నిలకడగా’ ఉందాం. కొంచెం ఆలోచించండి! ‘విని మరచువారిగా కాక, క్రియను చేయువారిగా’ దేవుని అనుగ్రహం నుండి వచ్చే ఆనందం మనకుంది.—కీర్తన 19:7-11.

ఆరాధనాపరులమని అనుకోవడం కన్నా ఎంతో ఎక్కువే ఇమిడివుంది

19, 20. (ఎ) యాకోబు 1:26, 27 ప్రకారంగా, పరిశుద్ధ ఆరాధన మన నుండి ఏమి కోరుతుంది? (బి) నిష్కళంకమైన ఆరాధనకు కొన్ని ఉదాహరణలు ఏవి?

19 మనం దైవిక అనుగ్రహాన్ని అనుభవించాలంటే, సత్యారాధన కేవలం లాంఛనప్రాయంకాదని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. (యాకోబు 1:26, 27) యెహోవా దేవుని అంగీకృత ‘నిష్కళంక ఆరాధికులమని’ మనమనుకోవచ్చు, కానీ మనలో ప్రతి ఒక్కరమూ నిజంగా ఏమైవున్నామో అంచనావేసేది ఆయనే. (1 కొరింథీయులు 4:4) ఒక గంభీరమైన లోపం ఏమిటంటే బహుశా ‘నోటికి కళ్లెం పెట్టుకోకపోవడమే.’ మనం ఇతరులపై కొండెములు చెబుతూ, అబద్ధాలు ఆడుతూ లేక ఇతరత్రా నాలుకను దుర్వినియోగం చేస్తూ మన ఆరాధన దేవునికి ప్రీతికరమైనదని మనమనుకుంటే మనల్ని మనం మోసపర్చుకున్నట్లే. (లేవీయకాండము 19:16; ఎఫెసీయులు 4:25) ఏ కారణాన్ని బట్టైనా మన ‘భక్తి వ్యర్థంకావాలనీ,’ దేవునికి అంగీకృతం కాకూడదనీ మనం నిశ్చయంగా కోరుకోం.

20 పరిశుద్ధ ఆరాధనలో చేరివున్న ప్రతి విషయాన్నీ యాకోబు ప్రస్తావించనప్పటికీ, ‘దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించడం’ అందులో చేరివుందని ఆయన చెబుతున్నాడు. (గలతీయులు 2:10; 6:10; 1 యోహాను 3:18) విధవరాండ్రకు అవసరమైన వాటిని ఇవ్వడంలో క్రైస్తవ సంఘం ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తుంది. (అపొస్తలుల కార్యములు 6:1-6; 1 తిమోతి 5:8-10) దేవుడు విధవరాండ్రనీ, తండ్రిలేని పిల్లలనీ సంరక్షించేవాడైనందున, ఆధ్యాత్మికంగానూ, వస్తుదాయకంగానూ వారికి సహాయపడేందుకు మనం చేయగల వాటిని చేయడం ద్వారా మనం ఆయనతో సహకరిద్దాం. (ద్వితీయోపదేశకాండము 10:17, 18) పరిశుద్ధ ఆరాధన అంటే సాతాను అధికారం క్రిందనున్న నీతిమాలిన మానవ సమాజపు ఇహలోక ‘మాలిన్యం తనకు అంటకుండా ఒకడు తనను తాను కాపాడుకోవాలని’ భావం కూడా. (యోహాను 17:16; 1 యోహాను 5:19) కాబట్టి, మనం యెహోవాను మహిమపర్చేలా, ఆయన సేవలో ఉపయోగపడేలా ఇహలోక భక్తిహీన ప్రవర్తనకు దూరంగా ఉందాం.—2 తిమోతి 2:20-22.

21. యాకోబు పత్రికకు సంబంధించి, ఏ ఇతర ప్రశ్నలు మన పరిశీలనకు అర్హమైనవి?

21 ఆ విధంగా, మనం పరిశీలించిన యాకోబు సలహాలు శోధనల్ని సహించుకొని, మన విశ్వాసానికి హత్తుకొని ఉండేలా మనకు సహాయపడాలి. శ్రేష్ఠమైన ఈవుల్ని ప్రేమపూర్వకంగా అనుగ్రహించేవాని ఎడల మన ప్రశంసను అది పెంపొందించాలి. యాకోబు మాటలు పరిశుద్ధ ఆరాధనలో కొనసాగేందుకు మనకు సహాయపడతాయి. ఆయన ఇంకా ఏ విషయాల్ని మన అవధానానికి తీసుకొస్తున్నాడు? యెహోవాయందు మనకు నిజమైన విశ్వాసం ఉందని రుజువుపర్చుకునేందుకు ఏ ఇతర చర్యల్ని మనమింకా తీసుకొనగలం?

[అధస్సూచీలు]

a కుటుంబసమేతంగా లేక వ్యక్తిగతంగా మీరు ఈ శీర్షికనూ, దీని తర్వాత ఉన్న రెండు శీర్షికల్నీ పఠనంచేసే సమయంలో, విశ్వాసాన్ని బలపర్చే యాకోబు పత్రికలో ఉదహరించబడిన ప్రతీ భాగాన్నీ చదవడం విశేషంగా ప్రయోజనకరంగా ఉన్నట్లు కనుగొంటారు.

మీరు ఎలా జవాబిస్తారు?

◻ శోధనల్ని సహించుకునేందుకు మనకేది సహాయపడుతుంది?

◻ శోధనలు ఉన్నప్పటికీ, క్రైస్తవులు ఎందుకు అతిశయించగలరు?

◻ మనమెలా దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించువారిగా ఉండగలం?

◻ పరిశుద్ధ ఆరాధనలో ఏమి చేరివుంది?

[9వ పేజీలోని చిత్రం]

శోధించబడినప్పుడు, ప్రార్థనలకు జవాబునివ్వగల యెహోవా శక్తినందు విశ్వాసాన్ని ఉంచాలి

[10వ పేజీలోని చిత్రం]

‘వాక్య ప్రకారం ప్రవర్తించేవారు,’ ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి