మీ పిల్లవాడు బోర్డింగ్ స్కూల్‌కు వెళ్లాలా?
మీరు ఒక వర్ధమాన దేశంలోని చిన్న పట్టణంలో నివసిస్తున్నారని ఊహించుకోండి. మీ పిల్లలు ప్రాథమిక పాఠశాలలో ఉన్నారు, అయితే 12 సంవత్సరాల వయస్సులో వాళ్లు మాధ్యమిక పాఠశాలకు వెళ్తారు. మీ ప్రాంతంలోని మాధ్యమిక పాఠశాలలు పిల్లలతో క్రిక్కిరిసి ఉన్నాయి, అవసరమైన పరికరాలు, తగినంతమంది సిబ్బంది లేక యోగ్యులైన సిబ్బంది లేకుండా ఉన్నాయి. సమ్మెల వల్ల కొన్నిసార్లు పాఠశాలలు వారాలపాటూ నెలల పాటూ మూతబడతాయి.
నగరంలోని బోర్డింగ్ స్కూల్‌ను వివరించే ఒక ఆకర్షణీయమైన బ్రోషర్‌ను ఎవరో మీ చేతికందిస్తారు. మంచి సౌకర్యాలున్న తరగతిగదులు, ప్రయోగశాలలు మరియు గ్రంథాలయాల్లో చదువుకుంటూ, సంతోషంగా ఉన్న, చక్కగా తయారైన విద్యార్థుల చిత్రాలను మీరు అందులో చూస్తారు. విద్యార్థులు కంప్యూటర్‌లను ఉపయోగిస్తారు, శుభ్రమైన, ఆకర్షణీయమైన డార్మెటరీ గదుల్లో ఉంటారు. “వారికి వీలైనంత ఉన్నతమైన విద్యా ప్రమాణాలను సాధించేందుకు” విద్యార్థులకు సహాయపడటం పాఠశాల ధ్యేయాల్లో ఒకటని మీరు ఆ బ్రోషర్‌లో చదువుతారు. అందులో ఇంకా ఇలా ఉంటుంది: “సౌజన్యం, సభ్యత, తలిదండ్రులను మరియు పెద్దలను గౌరవించడం, సహకారం, ఓర్పు, దయాగుణం, నిజాయతీ మరియు ఏకాగ్రత వంటి వాటిని నొక్కి చెప్పే కుటుంబంలో సాధారణంగా ఎలాంటి ప్రవర్తన అపేక్షించబడుతుందో విద్యార్థులందరూ అలాంటి ప్రవర్తనే కలిగి ఉండాలి.”
చిరునవ్వులు చిందిస్తున్న ఒక యౌవనస్థుని ఫోటో ప్రక్కన అతడు ఇలా చెప్పినట్లు వ్రాసి ఉంటుంది: “నా తలిదండ్రులు అతి శ్రేష్ఠమైన పాఠశాలకు వెళ్లగల మహత్తరమైన అవకాశాన్ని నాకు కలిగించారు.” ఒక అమ్మాయి ఇలా చెబుతుంది: “పాఠశాల సవాలుదాయకంగా ఉంటుంది, ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో సహజంగా నేర్చుకోవచ్చు.” అలాంటి బోర్డింగ్ స్కూల్‌కు మీరు మీ అబ్బాయిని లేక అమ్మాయిని పంపుతారా?
విద్యాభాసం మరియు ఆత్మీయత
శ్రద్ధగల తలిదండ్రులందరూ తమ పిల్లలకు జీవితంలో పటిష్ఠమైన పునాదిని వేయాలని ఇష్టపడతారు, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు సంపూర్ణమైన, సమతౌల్యంగల విద్యాభ్యాసం ప్రాముఖ్యం. తరచూ లౌకిక విద్యాభ్యాసం భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు ద్వారం తెరుస్తుంది, తమ ఎడల మరియు తమ భవిష్యత్ కుటుంబాల ఎడల శ్రద్ధవహించగల పెద్ద వారిగా వారు వృద్ధిచెందేందుకు ఇది యౌవనస్థులకు సహాయం చేస్తుంది.
మీరు ఇలా అడుగవచ్చు, ‘ఒక బోర్డింగ్ స్కూల్ మంచి విద్యాభ్యాసాన్ని అలాగే దానితోపాటు కొంత నైతిక నడిపింపును ఇస్తుంటే దాని ద్వారా ఎందుకు ప్రయోజనం పొందకూడదు?’ ఆ ప్రశ్నకు జవాబివ్వడంలో, క్రైస్తవ తలిదండ్రులు అత్యంత ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా పరిగణించాలి, అదేమంటే తమ పిల్లల ఆత్మీయ సంక్షేమం. యేసుక్రీస్తు ఇలా అడిగాడు: “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?” (మార్కు 8:36) నిజానికి, అందులో ఎలాంటి ప్రయోజనమూ లేదు. కాబట్టి, తమ పిల్లలను బోర్డింగ్ స్కూల్‌కు పంపించే ముందు, ఇది తమ పిల్లల నిత్యజీవ ఉత్తరాపేక్షలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండగలదనే విషయాన్ని గురించి క్రైస్తవ తలిదండ్రులు ఆలోచించాలి.
ఇతర విద్యార్థుల ప్రభావం
కొన్ని బోర్డింగ్ స్కూల్‌లు చక్కని విద్యాపర ప్రమాణాలను కలిగి ఉండవచ్చు. అయితే అలాంటి పాఠశాలలకు హాజరయ్యే వారి లేక బహుశ వాటిని నిర్వహించే వారి నైతిక ప్రమాణాల సంగతేమిటి? ఈ “అంత్యదినములలో” ఏ విధమైన ప్రజలు ఎక్కువగా ఉంటారో వారి గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.”—2 తిమోతి 3:1-5.
ఈ నైతిక మరియు ఆత్మీయ క్షీణత ప్రపంచవ్యాప్తంగా ఉంది, అది బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవించడంలో యెహోవాసాక్షుల ఎదుట సవాలును ఉంచుతుంది. ప్రతి దినం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే విద్యార్థులు, లోకసంబంధులైన తమ తోటి విద్యార్థులతో కొంత సహవాసం కూడా తమ ఆత్మీయతపై శక్తివంతమైన ప్రతికూల ప్రభావాన్ని చూపగలదని కనుగొంటారు. తమ తలిదండ్రుల నుండి అనుదినం మద్దతును, సలహాలను మరియు ప్రోత్సాహాన్ని పొందుతున్నప్పటికీ, ఆ ప్రభావాన్ని ఎదిరించడం సాక్షుల పిల్లలకు చాలా పెద్ద పోరాటమే కాగలదు.
తమ ఇళ్లనుండి దూరంగా బోర్డింగ్ స్కూళ్లకు పంపబడిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? వారు ఒంటరిగా ఉంటారు, ప్రేమగల తలిదండ్రుల క్రమమైన ఆత్మీయ మద్దతు నుండి వారు దూరం చేయబడతారు. వారు తమ తరగతి విద్యార్థులతో 24 గంటలూ గడుపుతారు గనుక, అందరిలా ఉండాలనే ఒత్తిడి ఇంటి వద్ద ఉండే విద్యార్థుల కన్నా వీరి యౌవన మనస్సులపై హృదయాలపై ఎక్కువ దృఢమైన ప్రభావాన్ని కనుపర్చుతుంది. ఒక విద్యార్థి ఇలా అన్నాడు: “నైతికపరంగా, బోర్డింగ్ స్కూల్‌లో ఉండే పిల్లవాడు ప్రొద్దున్నుంచి రాత్రి వరకూ ప్రమాదంలో జీవిస్తున్నాడు.”
పౌలు ఇలా వ్రాశాడు: “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” (1 కొరింథీయులు 15:33) దేవున్ని సేవించని వారితో తమ పిల్లలు క్రమంగా సహవాసం చేసినా వారికి ఎలాంటి ఆత్మీయ హానీ కలుగదని క్రైస్తవ తలిదండ్రులు తప్పుగా ఆలోచించకూడదు. కొంత కాలానికి దైవభయంగల పిల్లలు క్రైస్తవ విలువల విషయంలో మొద్దుబారి పోవచ్చు అలా ఆత్మీయ విషయాల ఎడల గుణగ్రహణను పూర్తిగా కోల్పోవచ్చు. కొన్నిసార్లు ఇది తమ పిల్లలు బోర్డింగ్ స్కూల్ వదలి వచ్చేంత వరకూ తలిదండ్రులకు తేటపడదు. అప్పుడు విషయాలను సరి చేసేందుకు సమయం మించిపోయి ఉంటుంది.
క్లెమెంట్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడు ఇలా చెబుతున్నాడు: “బోర్డింగ్ స్కూల్‌కు వెళ్లకముందు నాకు సత్యం ఎడల ప్రేమ ఉండేది, సహోదరులతో కలిసి నేను ప్రాంతీయ సేవకు వెళ్లేవాన్ని. మా కుటుంబ బైబిలు పఠనంలో, సంఘ పుస్తక పఠనంలో వ్యాఖ్యానించడం నాకెంతో ఇష్టంగా ఉండేది. అయితే, 14 ఏళ్ల వయస్సులో నేను బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లినప్పుడు సత్యాన్ని పూర్తిగా వదిలేశాను. బోర్డింగ్ స్కూల్‌లో నేను గడిపిన ఐదేళ్లలో నేను కూటాలకు ఎప్పుడూ హాజరవ్వలేదు. చెడు సహవాసం మూలంగా, నేను మాదకద్రవ్యాలకు, పొగత్రాగడానికి, త్రాగుబోతుతనానికి అలవాటుపడిపోయాను.”
ఉపాధ్యాయుల ప్రభావం
తమ అధికార స్థానాన్ని దుర్వినియోగం చేసే అనైతికమైన ఉపాధ్యాయులు ఏ పాఠశాలలోనైనా ఉండవచ్చు. కొందరు కఠినంగా మరియు కర్కశంగా ఉంటారు, ఇతరులు తమ విద్యార్థులను లైంగికంగా దుర్వినియోగం చేస్తారు. బోర్డింగ్ స్కూళ్లలో అలాంటి ఉపాధ్యాయుల చర్యలు చాలా వరకూ నివేదించబడకపోవచ్చు.
అయితే, అనేకమంది ఉపాధ్యాయులు పిల్లలను సంఘం యొక్క ప్రయోజనకరమైన సభ్యులనుగా, తమ చుట్టూ ఉన్న లోకానికి సరిపోయే విధంగా, తగిన విధంగా చేసేందుకు తర్ఫీదునివ్వడానికి యథార్థంగా ప్రయత్నిస్తారు. అయితే సాక్షుల పిల్లలకు ఇక్కడ మరొక సమస్య ఎదురౌతుంది. ఈ లోక విలువలు క్రైస్తవ సూత్రాలతో ఎల్లవేళలా సరితూగవు. ఈ లోకానికి తగిన విధంగా కావాలని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తుండగా, తన అనుచరులు “లోకసంబంధులు కారు” అని యేసు అన్నాడు.—యోహాను 17:16.
పిల్లలు బైబిలు సూత్రాలను అనుసరిస్తున్నప్పుడు సమస్యలు తలెత్తితే అప్పుడేమిటి? పిల్లలు స్థానికంగా ఉన్న పాఠశాలకు హాజరౌతూ, ఇంట్లోనే ఉంటుంటే వారు అలాంటి విషయాల గురించి తమ తలిదండ్రులతో చర్చించగలరు. మరి తలిదండ్రులు కూడా తమ పిల్లలకు నడిపింపునిచ్చి, బహుశ ఉపాధ్యాయునితో మాట్లాడగలరు. దాని ఫలితంగా, సమస్యలు మరియు అపార్థాలు సాధారణంగా చాలా త్వరగా పరిష్కరించబడతాయి.
బోర్డింగ్ స్కూళ్లలో పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాంటి పిల్లలు ఎల్లప్పుడూ తమ ఉపాధ్యాయుల అధీనంలో ఉంటారు. ఒకవేళ పిల్లలు క్రైస్తవ సూత్రాల పక్షంవహిస్తే, వారు తమ తలిదండ్రుల అనుదిన మద్దతు లేకుండానే అలా చేయవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు దేవునికి నమ్మకంగా నిలవడంలో కొన్నిసార్లు సఫలమౌతారు. అయితే, చాలా తరచుగా వారలా సఫలం కాలేరు. పిల్లవాడు ఉపాధ్యాయుని అభీష్ఠానికి తలవంచడం జరుగవచ్చు.
నిర్భందిత రాకపోకలు
విద్యార్థులు తమకు ఇష్టం వచ్చినట్లు తిరిగేందుకు స్వేచ్ఛను కలిగి ఉండే విశ్వవిద్యాలయాల వలె కాక బోర్డింగ్ స్కూళ్లు పిల్లల రాకపోకలను నిర్బంధిస్తాయి. అనేక పాఠశాలలు పిల్లలను ఆదివారం తప్ప మిగతా దినాల్లో పాఠశాల ఆవరణం దాటి వెళ్లేందుకు అనుమతించవు, కొన్ని పాఠశాలలు ఆదివారాల్లో కూడా వెళ్లడానికి అనుమతించవు. ఏరూ అనే పేరుగల 11 సంవత్సరాల బోర్డింగ్ స్కూల్ విద్యార్థిని ఇలా చెబుతుంది: “పాఠశాల అధికారులు మమ్మల్ని కూటాలకు ఎన్నడూ వెళ్లనివ్వరు, మరి ప్రాంతీయ సేవకైతే అసలు వీలుకాదు. పాఠశాల లోపల కాథోలిక్‌లకూ ముస్లిమ్‌లకు మాత్రమే ప్రార్థనలు జరుగుతాయి. ప్రతి విద్యార్థి ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాలి లేదా ఉపాధ్యాయుల నుండి, విద్యార్థుల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాలి. విద్యార్థులు జాతీయ గీతాన్ని మరియు చర్చి గీతాలను పాడేందుకు కూడా ఒత్తిడి చేయబడతారు.”
తలిదండ్రులు తమ పిల్లలను అలాంటి పాఠశాలలో చేర్పించేటప్పుడు, వారు తమ యౌవనులకు ఏ సందేశాన్ని అందిస్తున్నారు? లౌకిక విద్యాభ్యాసమనేది, ఆరాధనకు కూడుకోవడం మరియు శిష్యులను చేసే పనిలో భాగం వహించడం కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనదని, అంతేకాదు దేవునికి యథార్థంగా ఉండటం కంటే కూడా అదే చాలా ప్రాముఖ్యమైనదనే వర్తమానాన్ని వారికి అందిస్తుండవచ్చు.—మత్తయి 24:14; 28:19, 20; 2 కొరింథీయులు 6:14-18; హెబ్రీయులు 10:24, 25.
కొన్ని బోర్డింగ్ పాఠశాలల్లో, సాక్షుల పిల్లలు కలిసి బైబిలు చదవగల్గుతున్నారు, అయితే అది కూడా తరచూ చాలా కష్టంగా ఉంటుంది. బ్లెస్సింగ్ అనే పేరుగల 16 సంవత్సరాల అమ్మాయి తాను చదువుకుంటున్న బోర్డింగ్ స్కూల్ గురించి ఇలా చెబుతుంది: “క్రైస్తవులని చెప్పుకునే వారు ప్రతి దినం ప్రార్థించేందుకు సమకూడుతారు. మేము బైబిలు పఠించాలని వారిని బ్రతిమాలుతాము, అయితే మీ సంస్థ గుర్తించబడలేదని సీనియర్‌లు మాకు చెబుతారు. అప్పుడు మేము వారితోపాటు ప్రార్థించేలా వారు మమ్మల్ని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు. మేము నిరాకరిస్తే, వారు మమ్మల్ని శిక్షిస్తారు. ఉపాధ్యాయులకు చెప్పుకోవడం పరిస్థితిని మరింత క్షీణింపజేస్తుంది. వారు మాకు పేర్లు పెడతారు, మమ్మల్ని శిక్షించమని సీనియర్ విద్యార్థులకు చెబుతారు.”
భిన్నమైన వారిగా ఉండడం
బోర్డింగ్ స్కూల్ విద్యార్థులు యెహోవాసాక్షులుగా స్పష్టంగా తెలియబడితే, ఇది వారి ప్రయోజనానికి దోహదపడగలదు. సాక్షుల విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండే తప్పనిసరియైన అబద్ధ మత కార్యకలాపాలలో పాల్గొనడం నుండి పాఠశాల అధికారులు వారిని మినహాయించవచ్చు. తోటి విద్యార్థులు అవాంఛిత కార్యకలాపాలలో మరియు సంభాషణలో వారిని ఇమిడ్చేందుకు ప్రయత్నించకుండా ఉండవచ్చు. తోటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సాక్ష్యమిచ్చేందుకు కూడా ఇది దారి తీయవచ్చు. అంతేకాకుండా, క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా జీవించేవారు ఘోరమైన తప్పుడు పనులు చేస్తారని అనుమానించబడకపోవచ్చు, మరి వారు కొన్నిసార్లు ఉపాధ్యాయుల మరియు తోటి విద్యార్థుల గౌరవాన్ని చూరగొంటారు.
అయితే, విషయాలు ఎల్లవేళలా అలాగే ఉండవు. భిన్నమైన వారిగా ఉండటం యౌవన ప్రజలను విద్యార్థుల చేతిలో మరియు ఉపాధ్యాయుల చేతిలో హింసకూ ఎగతాళికి తరచూ గురిచేస్తుంది. బోర్డింగ్ స్కూల్‌లో చదువుకునే, 15 సంవత్సరాల ఇన్‌కా అనే అబ్బాయి ఇలా చెబుతున్నాడు: “పాఠశాలలో మీరు ఒక యెహోవాసాక్షి అనే విషయం అందరికీ తెలిసిపోతే మీరు సమస్యల పాలౌతారు. మన ఆత్మీయ మరియు నైతిక ప్రమాణాలు వాళ్లకు తెలుసు గనుక, మనలను పట్టుకునేందుకు వాళ్లు ఉచ్చులు బిగిస్తారు.”
తలిదండ్రుల బాధ్యత
పిల్లలను యెహోవాకు సమర్పించుకున్న సేవకులనుగా తీర్చిదిద్దే పనిని ఏ ఉపాధ్యాయుడు లేక పాఠశాల లేక కళాశాల కూడా తీసుకునేందుకు సరిగ్గా ప్రయత్నించలేరు. అది వారి పని కాదు మరి బాధ్యత అంతకన్నా కాదు. తమ పిల్లల ఆత్మీయ అవసరతల ఎడల తలిదండ్రులే శ్రద్ధ వహించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) తమ పిల్లలను నెలకు ఒకటి లేక రెండుసార్లు మాత్రమే చూడగలిగేలా, వారు తమకు దూరంగా బోర్డింగ్ స్కూల్‌లో ఉంటే, తలిదండ్రులు ఈ దైవిక సలహాను ఎలా అన్వయించుకోగలరు?
పరిస్థితులు ఎంతో వేరుగా ఉండవచ్చు, కానీ క్రైస్తవ తలిదండ్రులు ఈ ప్రేరేపిత వ్యాఖ్యానానికి అనుగుణంగా ప్రవర్తించేందుకు కృషి చేస్తారు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.”—1 తిమోతి 5:8.
ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
అటు బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించడం ఇటు సరైన రీతిలోలేని స్థానిక పాఠశాలలో చేర్పించడం అనే రెండే ఎంపికలు తమ ఎదుట ఉంటే తలిదండ్రులు అప్పుడేమి చేయాలి? ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్న వారు కొందరు తమ పిల్లలకు ట్యూషన్ కూడా పెట్టించవచ్చు. ఇతర తలిదండ్రులు తమ పిల్లలకు తామే ట్యూషన్ చెప్పేందుకు సమయాన్ని కేటాయిస్తారు.
పిల్లలు మాధ్యమిక పాఠశాలకు వెళ్లే వయస్సుకి రాకముందే పథకం వేసుకోవడం ద్వారా కొన్నిసార్లు తలిదండ్రులు సమస్యలను నివారిస్తారు. మీకు చిన్న పిల్లలు ఉంటే లేక పిల్లలు కలుగబోతుంటే, మీ ప్రాంతంలో సరైన మాధ్యమిక పాఠశాల ఉందేమో మీరు కనుక్కోవచ్చు. ఒకవేళ లేకపోతే, మంచి పాఠశాల ఉన్న ప్రాంతానికి మీరు తరలి వెళ్లవచ్చు.
ఒక పిల్లవానిలో యెహోవాయందు ప్రేమను నెలకొల్పేందుకు నిపుణత, సహనం మరియు చాలా సమయం కావాలన్నది తలిదండ్రులకు బాగా తెలిసిన విషయమే. పిల్లవాడు ఇంట్లో ఉంటున్నప్పుడే ఇది చేయడం కష్టంగా ఉంటే, పిల్లవాడు బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడు దాన్ని చేయడం ఇంకెంత కష్టంగా ఉండవచ్చు! పిల్లవాని నిత్యజీవం ఇందులో ఇమిడివుంది గనుక, తమ పిల్లవాన్ని బోర్డింగ్ స్కూల్‌కు అప్పజెప్పడం అంత యోగ్యమైనదేనా అనే విషయాన్ని తలిదండ్రులు గంభీరంగా మరియు ప్రార్థనాపూర్వకంగా తీర్మానించుకోవాలి. బోర్డింగ్ స్కూల్ విద్య యొక్క ప్రయోజనాల కొరకు తమ పిల్లవాని ఆత్మీయ అవసరతలను బలి చేయడం ఎంత తొందరపాటు పనిగా ఉంటుంది! అది ఒక చిన్న నగను కాపాడేందుకు, మంటల్లో కాలుతున్న ఇంట్లోకి పరిగెత్తడం వలె ఉండవచ్చు, అలా చేయడం ద్వారా మంటల్లో కాలిపోవడమే జరుగుతుంది.
దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.” (సామెతలు 22:3) ఒక చెడు పరిస్థితిని తర్వాత సరి చేయడం కంటే దాన్ని నివారించడమే శ్రేయస్కరం. ‘మా పిల్లవాడు బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లాలా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, దాని గురించి ఆలోచించడం జ్ఞానయుక్తం.
[28వ పేజీలోని బాక్సు]
యౌవన సాక్షులు బోర్డింగ్ స్కూల్‌ను గురించి వ్యాఖ్యానించడం
“బోర్డింగ్ స్కూల్‌లో సాక్షిపిల్లలు ఆత్మీయ సహవాసం నుండి వేర్పరచబడి ఉంటారు. అది తప్పు చేయాలన్న ఒత్తిడి ఎంతగానో ఉండే ప్రతికూలమైన వాతావరణం.”—11 నుండి 14 సంవత్సరాల వయస్సులో బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్న రాటిమీ.
“క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం చాలా కష్టంగా ఉండేది. నేను కేవలం ఆదివారాల్లోనే హాజరవ్వగలిగే దాన్ని, విద్యార్థులు చర్చికి వెళ్లేందుకు లైను కడుతుంటే నేను దొంగచాటుగా తప్పించుకుని వెళ్లవలసి వచ్చేది. నేను ఎన్నడూ సంతోషంగా ఉండలేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను అన్ని సంఘ కూటాలకూ హాజరయ్యేందుకు అలవాటు పడ్డాను, నేను శనివారాలూ ఆదివారాలు ప్రాంతీయ సేవకు వెళ్లేదాన్ని. పాఠశాల ప్రోత్సాహకరమైన స్థలంగా ఉండేది కాదు. నేనెంతో పోగొట్టుకున్నాను.”—ఎస్తర్, ఈమె పాఠశాలనందలి చర్చి కార్యక్రమాల్లో పాల్గొననందుకు క్రమంగా ఉపాధ్యాయులతో దెబ్బలు తినేది.
“బోర్డింగ్ స్కూల్‌లో తోటి విద్యార్థులకు సాక్ష్యమివ్వడం అంత సులభంగా ఉండేది కాదు. భిన్నమైన వారిగా ఉండటం అంత సులభం కాదు. నేనూ అందరిలా ఉండాలని అనుకున్నాను. నేను కూటాలకు వెళ్లగలిగీ ప్రాంతీయ సేవలో పాల్గొనగలిగి ఉంటే నేను ఇంకా ఎక్కువ ధైర్యంగా ఉండే దాన్నేమో. నేను సెలవుల్లో ఉన్నప్పుడే అలా చేయగలిగే దాన్ని, అంటే సంవత్సరానికి కేవలం మూడుసార్లు మాత్రమే అన్నమాట. దీపంలో నూనె అయిపోయిన వెంటనే అందులో మళ్లీ నూనె పోయాలి, లేకపోతే దాని వెలుగు మసకగా ఉంటుంది. పాఠశాలలో నా పరిస్థితి అలాగే ఉండేది.”—11 నుండి 16 సంవత్సరాల వయస్సులో బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్న లారా.
“నేనిప్పుడు ఇక బోర్డింగ్ స్కూల్‌లో లేను గనుక, నేను అన్ని కూటాలకు హాజరవ్వగల్గుతున్నాను, ప్రాంతీయ సేవలో పాల్గొనగల్గుతున్నాను మరియు కుటుంబంలోని మిగతా వారితోపాటు దినవచనాన్ని చదువుకోగల్గుతున్నాను, నేను దాన్ని బట్టి ఆనందిస్తున్నాను. బోర్డింగ్ స్కూల్‌లో ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ యెహోవాతో నాకుగల సంబంధంకంటే మరింత ప్రాముఖ్యమైనది ఏదీ లేదు.”—తనను బోర్డింగ్ స్కూల్‌లో నుండి బయటకు తీసుకెళ్లేందుకు తన తండ్రిని ఒప్పించిన నెయోమీ.