ఫ్రాన్స్‌లో అబద్ధ ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రతిక్రియ చేయడం
ఫ్రాన్స్‌లో ఉన్న యెహోవాసాక్షులు అబద్ధ ఆరోపణా వ్యూహానికి ఇటీవల గురి అయ్యారు. ప్రచార మాధ్యమాలు యూరప్ మరియు జపాన్ దేశాల్లో జరిగిన మత సంబంధ తీవ్రవాదపు తెగల ప్రమేయంతో జరిగిన విషాద సంఘటనలను ఆసరాగా చేసుకొని సాక్షులను గూర్చిన సమాచారాన్ని వక్రీకరించి చెప్పాయి. వారు తీవ్రవాదపు తెగల్లో అతి పెద్ద తెగకు, అతి ప్రమాదకరమైన తెగకు చెందినవారు అని తప్పుగా వర్ణించాయి.
విషయాలను చక్కదిద్దేందుకు, యెహోవాసాక్షులు ఒక కరపత్రాన్ని ప్రచురించారు. యెహోవాసాక్షులు ఎవరు? వారు క్రైస్తవులేనా? వారు వైద్య చికిత్సను అంగీకరిస్తారా? వారు ఇంటింటికి ఎందుకు వెళ్తారు? వారి పనికి ఆర్థిక సహాయం ఎలా లభిస్తుంది? యెహోవాసాక్షులు సమాజానికి ఎలా ప్రయోజనకారులౌతారు?—వంటి ప్రశ్నలకు ఆ కరపత్రం జవాబిచ్చింది.
యెహోవాసాక్షుల గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు అన్నదే ఫ్రెంచ్ భాషలో విషయాలను తెలియజేస్తున్న ఆ కరపత్రం శీర్షిక. ఆ కరపత్రాన్ని వీలైనంత మందికి ఇవ్వగల్గేందుకు ఒక ప్రచార పని సంస్థీకరించబడింది. 1996 మే 13 నుండి జూన్ 9 వరకూ 90 లక్షల కన్నా ఎక్కువ ప్రతులు పంపకం చేయబడ్డాయి.
ఈ కరపత్రం ప్రభుత్వాధికారులతో సహా అనేకులను ప్రభావితం చేసింది. “యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా విమర్శించడం నాకు ఎంతో కోపాన్ని కలిగిస్తుంది. మీ పనిలో ఉదారబుద్ధితో కూడిన నిస్వార్థతకోకూడిన శ్రద్ధను అనేక సార్లు మెచ్చుకున్నాను” అని ఆ కరపత్రాన్ని చదివిన తర్వాత ఒక రీజియనల్ కౌన్సిల్మ్యాన్ వ్రాశాడు. ఆ కరపత్రానికి ప్రతిస్పందిస్తూ, “మీరు భాగమైవున్న క్రైస్తవ గుంపుకు తీవ్రవాద తెగకు మధ్య గల తేడాను చాలా మంది ప్రజలు చెప్పగలరు” అని యూరోపియన్ పార్లమెంట్‌లోని ఒక సభ్యుడు వ్రాశాడు.
బ్రిటనీలో ఒక సాక్షి ఒక ప్రీస్టుకు ఈ కరపత్రాన్ని చూపించగా ఆయన వెంటనే దాన్ని స్వీకరించాడు. “మీరు చేస్తున్న పనికి నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను” అని ఆ ప్రీస్టు అన్నాడు. ఆయన ఇంకా ఇలా కూడా అన్నాడు: “మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వాలని, మీకు ఒక కప్పు కాఫీ ఇవ్వాలని మా చర్చిలోనివారిని నేను ప్రోత్సహిస్తాను. మీరు మా ఇంటికి వచ్చారని మీరు కలిసే వారితో చెప్పవచ్చు. మీ ప్రచురణలను చదివి మెచ్చుకుంటానని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను.”
ఒక కరపత్రాన్ని స్వీకరించిన తర్వాత, ఆల్సాస్లోని ఒక ప్రొటెస్టెంట్ వ్యక్తి ఒక బైబిలు పఠనాన్ని కోరుతూ వాచ్‌టవర్ సొసైటీకి వ్రాశాడు. “మా చర్చి మీది నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన నేను ఆత్మీయంగా క్రొత్తగా ఆరంభించాలని ఆశిస్తున్నాను” అని వ్రాశాడు. అప్పుడప్పుడు తమకు వ్యతిరేకంగా అబద్ధ ఆరోపణలు ఎదురౌతున్నప్పటికీ, ఫ్రాన్స్‌లో—నిజమే, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోను—ఉన్న యెహోవాసాక్షులు బైబిలులో చెప్పబడిన దేవుని సంకల్పాలను గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందేందుకు ప్రజలకు సహాయపడడంలో కొనసాగుతున్నారు.—2 తిమోతి 3:16, 17.