ఏహూదు—విశ్వాసంగల ధైర్యవంతుడు
వాగ్దాన దేశంలో ఇశ్రాయేలీయులు మొట్టమొదట అడుగిడి అనేక సంవత్సరాలు గడిచాయి. మోషే ఆయన ఉత్తరాధికారియైన యెహోషువ మరణించి చాలాకాలమైంది. విశ్వాసంగల అటువంటి వ్యక్తుల పరోక్షంలో, స్వచ్ఛారాధన కొరకైన గుణగ్రహణ తగ్గిపోయింది. ఇశ్రాయేలీయులు బయలు దేవతలనూ దేవతా స్తంభాలను కూడా సేవించడం ప్రారంభించారు.a దాని ఫలితంగా, యెహోవా తన ప్రజలను ఎనిమిది సంవత్సరాలపాటు సిరియావారి చేతికి అప్పగించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని సహాయం కొరకు మొఱ్ఱపెట్టారు. ఆయన దయతో విన్నాడు. యెహోవా తన ప్రజలను విడిపించేందుకు ఒత్నీయేలను న్యాయాధిపతిని నియమించాడు.—న్యాయాధిపతులు 3:7-11.
ఈ సంఘటనలు ఇశ్రాయేలీయులకు ఒక మౌలిక సత్యాన్ని బోధించి ఉండవలసింది—యెహోవాకు విధేయత చూపడం దీవెనలను తెస్తుంది అయితే అవిధేయత శాపాలకు దారి తీస్తుంది. (ద్వితీయోపదేశకాండము 11:26-28) అయితే, ఇశ్రాయేలీయులు ఈ పాఠాన్ని నేర్చుకోవడంలో విఫలమయ్యారు. 40 సంవత్సరాల శాంతియుత కాలం తర్వాత వారు మళ్లీ స్వచ్ఛారాధనను విడనాడారు.—న్యాయాధిపతులు 3:12.
మోయాబీయుల చేతిలో ఓడిపోయారు
ఈసారి యెహోవా తన ప్రజలను మోయాబుకు చెందిన ఎగ్లోను రాజు చేతికి అప్పగించాడు. బైబిలు అతడిని “బహు స్థూలకాయుడు” అని వర్ణిస్తుంది. అమ్మోనీయులు మరియు అమాలేకీయుల సహాయంతో, ఎగ్లోను ఇశ్రాయేలీయులపై దాడిచేసి, “ఖర్జూరచెట్ల పట్టణ”మైన ఎరికోలో తన భవనాన్ని నిర్మించుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఓడించిన మొదటి కనాను నగరం ఇప్పుడు, అబద్ధ దేవుడైన కెమోషును ఆరాధించు వాని ముఖ్య కార్యాలయానికి స్థానమయ్యిందంటే అదెంతటి అవమానకరమైన విషయం.b—న్యాయాధిపతులు 3:12, 13, 17.
ఎగ్లోను ఇశ్రాయేలీయుల నుండి ఎక్కువ పన్నులను వసూలు చేయడం ద్వారా, వారిని తర్వాతి 18 సంవత్సరాలు పీడించాడని రుజువులు చూపుతున్నాయి. క్రమంగా కప్పమును చెల్లించాలని కోరడం ద్వారా, మోయాబు దేశం తన స్వంత ఆర్థిక పరిస్థితిని దృఢపర్చుకుంటూ ఇశ్రాయేలీయుల ధనాన్ని కొల్లగొట్టింది. దేవుని ప్రజలు సహాయం కొరకు మొరపెట్టారంటే అర్థం చేసుకోవచ్చు, యెహోవా మరోసారి వారి మొర విన్నాడు. ఆయన ఈసారి వారి కొరకు ఏహూదు అనే బెన్యామీనీయుడిని రక్షకునిగా నియమించాడు. ఇశ్రాయేలీయులపై ఎగ్లోను చేస్తున్న నియంత పాలనను అంతమొందించేందుకు, మరుసటి కప్పము చెల్లించే దినాన చర్య తీసుకోవాలని పథకం వేసుకున్నాడు.—న్యాయాధిపతులు 3:14, 15.
ధైర్యంతో కూడిన ఈ చర్య కొరకు సిద్ధపడేందుకు, ఒక మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని ఏహూదు తయారు చేసుకున్నాడు. అది పొట్టి మూర అయి వుంటే, ఆ ఆయుధం దాదాపు 38 సెంటీమీటర్ల పొడవు ఉండివుంటుంది. అది బాకు అయి ఉంటుందని కొందరంటారు. కత్తిలోని పదునైన భాగానికి మరియు పిడికి మధ్య ఎలాంటి మధ్యముక్క లేదని రుజువులు చూపుతున్నాయి. కాబట్టి ఏహూదు తన చిన్న కత్తిని తన బట్టల మడతల్లో దాచుకోగలిగాడు. అంతేకాకుండా, ఏహూదు ఎడమచేతి వాటమున్నవాడు గనుక, ఆయన తన ఖడ్గాన్ని సాధారణంగా ఆయుధాన్ని పెట్టుకునే ఎడమ వైపునకాక కుడి వైపున పెట్టుకోగలిగాడు.—న్యాయాధిపతులు 3:15, 16.
ఏహూదు పథకం ప్రమాదాలు లేని సజావైనది కాదు. ఉదాహరణకు, రాజభటులు ఏహూదు వద్ద ఆయుధాలున్నాయేమోనని ఆయన్ని తనిఖీ చేస్తే ఎలా? ఒకవేళ వాళ్లు తనిఖీ చేయకపోయినా, వారు తమ రాజును ఒక ఇశ్రాయేలీయునితో ఒంటరిగా ఎంతమాత్రం విడిచిపెట్టరు! అయితే ఒకవేళ వారు అలా విడిచిపెట్టి ఎగ్లోను చంపబడినప్పటికీ, ఏహూదు ఎలా తప్పించుకుంటాడు? సంభవించిన విషయాన్ని ఎగ్లోను భటులు గుర్తించేలోగా ఆయన ఎంత దూరమని పారిపోగలడు?
ఏహూదు అలాంటి వివరాల గురించి ఆలోచించాడనేందుకు సందేహం లేదు, బహుశ అనేక విపత్కర పర్యవసానాలను కూడా ఊహించి ఉంటాడు. ఏమైనప్పటికీ, ధైర్యాన్ని ప్రదర్శిస్తూ యెహోవాయందు విశ్వాసాన్ని కలిగివుండి ఆయన తన పథకంతో ముందుకుసాగాడు.
ఏహూదు ఎగ్లోనును కలుస్తాడు
మరుసటి కప్పమును చెల్లించే దినం వచ్చేసింది. ఏహూదు మరియు ఆయన మనుష్యులు రాజభవనంలోకి ప్రవేశించారు. కొద్ది సమయానికే వారు రాజైన ఎగ్లోను సముఖానికి వచ్చారు. ఏహూదు దాడి చేసేందుకు సమయం ఇంకా ఆసన్నం కాలేదు. కప్పమును చెల్లించిన తర్వాత, ఏహూదు కప్పము మోసిన వారిని తమ దారిన వెళ్లనిచ్చాడు.—న్యాయాధిపతులు 3:17, 18.
ఎగ్లోనును హతమార్చడంలో ఏహూదు ఎందుకు విలంభం చేశాడు? ఆయన భయపడిపోయాడా? ఎంతమాత్రం కాదు! ఏహూదు తన పథకాన్ని నెరవేర్చేందుకు, రాజును ఒంటరిగా కలవాలి, అది ఆయన మొదటి సందర్శనలో అనుమతింపబడలేదు. అంతేకాకుండా, ఏహూదు త్వరగా తప్పించుకోవలసి ఉంటుంది. కప్పమును మోసిన వారందరితోపాటూ తప్పించుకోవడం కంటే తానొక్కడే తప్పించుకోవడం సులభంగా ఉంటుంది. కాబట్టి, ఏహూదు తన సమయం కొరకు వేచివున్నాడు. ఎగ్లోనును సంక్షిప్తంగా కలవడం రాజభవన నిర్మాణాన్ని ఎక్కువగా తెలుసుకునేందుకు మరియు రాజు యొక్క భద్రత ఎంత మేరకు ఉందో అంచనా వేసేందుకు ఆయనకు వీలు కలిగించింది.
“గిల్గాలు దగ్గరనున్న పెసీలీము”ను చేరుకున్న తర్వాత ఏహూదు తన మనుష్యులను వదిలి, ఎగ్లోను మందిరానికి తిరిగి వచ్చాడు. దాదాపు రెండు కిలోమీటర్ల నడక ఏహూదు తన పథకాన్ని గురించి ఆలోచించేందుకు మరియు యెహోవా దీవెన కొరకు ప్రార్థించేందుకు ఆయనకు కొంత సమయాన్నిచ్చింది.—న్యాయాధిపతులు 3:19.
ఏహూదు తిరిగి వస్తాడు
ఏహూదు రాజభవనంలోకి ఆహ్వానించబడ్డాడని స్పష్టమౌతుంది. ఆయన ఇంతకు క్రితము అర్పించిన విస్తారమైన కప్పము ఎగ్లోనును ప్రసన్నుడిని చేసి ఉంటుంది. మొదటి సందర్శనం చాలా క్లుప్తంగా ఉండినప్పటికీ, రాజుతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు అది ఏహూదుకు తగినంత అవకాశాన్ని ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ, ఏహూదు ఎగ్లోను సమక్షానికి మళ్లీ వచ్చాడు.
“రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె”నని ఏహూదు అన్నాడు. ఆయన ఇంతవరకూ వచ్చాడనే వాస్తవం, యెహోవా ఆయనను నడిపిస్తున్నాడనేందుకు ఒక సూచన అయివుంది. అయినప్పటికీ, ఒక సమస్య ఎదురైంది. ఏహూదు తీసుకువచ్చిన “రహస్యమైన మాట”ను రాజభటుల ఎదుట చెప్పకూడదు. యెహోవా గనుక జోక్యం చేసుకోబోతున్నట్లయితే, ఏహూదుకు ఆ సహాయం వెంటనే కావాలి. “ఊరకొమ్మని” రాజు ఆజ్ఞాపిస్తాడు. ఈ “రహస్యమైన మాట”ను ఎవరూ వినకూడదని ఎగ్లోను అనుకుంటాడు, అతడు తన భటులను పంపివేస్తాడు. ఏహూదు ఎంత నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని ఉంటాడో ఊహించండి!—న్యాయాధిపతులు 3:19.
“నీతో నేను చెప్పవలసిన దేవునిమాట ఒకటి యున్నదని” ఏహూదు ఎగ్లోను వద్దకు వచ్చి చెప్పినప్పుడు అతడు తన మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. ‘దేవుడు’ అని ప్రస్తావించడం ద్వారా ఏహూదు కెమోషును గురించి మాట్లాడుతున్నాడా? అలాగని ఎగ్లోను భావించి ఉండవచ్చు. ఆసక్తిగలవాడై, అతడు తన సింహాసనం పైనుండి లేచి నిలబడ్డాడు. తనపై దాడి జరుగుతుందేమోననే అనుమానం రాజుకు కలుగకుండా ఏహూదు జాగ్రత్తగా దగ్గరకు వెళ్లాడు. అప్పుడు, వేగంగా కదిలి, “ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తితీసి కడుపుమీద . . . [ఎగ్లోనును] పొడిచెను. పిడియును కత్తివెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైని కప్పుకొనినందున అతని కడుపునుండి కత్తిని తీయలేకపోయెను, అది వెనుకనుండి బయటికి వచ్చి యుండెను.”—న్యాయాధిపతులు 3:20-22.
దగ్గర్లోనే ఉన్న రాజభటులు కదలలేదు. అయితే ఏహూదు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాడు. ఎగ్లోను సేవకులు ఏ గడియలోనైనా లోనకు వచ్చి చనిపోయిన తమ రాజు శవాన్ని చూడగలరు. ఏహూదు త్వరగా పారిపోవాలి! ఆయన తలుపు వేసి గడియపెట్టి, మేడ గది నందలి పంచపాళి ద్వారా తప్పించుకుని బయటికి వెళ్లాడు.—న్యాయాధిపతులు 3:23, 24.
జరిగిన సంగతిని తెలుసుకోవడం మరియు ఓటమి
కొంత సేపటికే ఎగ్లోను సేవకులకు అనుమానం వచ్చింది. అయినప్పటికీ, రాజు యొక్క రహస్య సమావేశానికి విఘ్నం కలిగించడం ద్వారా అతడి ఆగ్రహానికి గురయ్యే సాహసం వారు చేయలేకపోయారు. అప్పుడు మేడ గది తలుపులు గడియ వేయబడి ఉన్నాయని వారు గమనించారు. “అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయి యున్నాడ”ని వారు అనుకున్నారు. అయితే, సమయం గడిచే కొలది, అనుమానం కాస్త ఆందోళనగా మారింది. ఎగ్లోను భటులు ఇక ఎంతమాత్రం ఆగలేకపోయారు. “వారు తాళపు చెవిని తెచ్చి తలుపులుతీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను.”—న్యాయాధిపతులు 3:24, 25.
అంతలో ఏహూదు తప్పించుకున్నాడు. ఆయన గిల్గాలు నందలి పెసీలీమును దాటి తుదకు ఎఫ్రాయీము కొండప్రాంతంలోని శెయీరా చేరుకుంటాడు. ఏహూదు ఇశ్రాయేలు పురుషులను సమకూర్చి, మోయాబీయులపై మూకుమ్మడి దాడి చేశాడు. “వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను పదివేలమందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు” అని ఆ వృత్తాంతం చెబుతుంది. మోయాబీయులు అణచివేయబడటంతో, ఇశ్రాయేలు దేశం 80 సంవత్సరాల పాటూ ఎలాంటి ఆటంకాన్నీ ఎదుర్కోలేదు.—న్యాయాధిపతులు 3:26-30.
ఏహూదు ఉదాహరణ నుండి నేర్చుకోవడం
ఏహూదును దేవునియందలి విశ్వాసం ప్రేరేపించింది. హెబ్రీయులు 11వ అధ్యాయం ఆయనను, ‘విశ్వాసముద్వారా రాజ్యములను జయించి; యుద్ధములో పరాక్రమశాలియై; అన్యుల సేనలను పారదోలి’న వ్యక్తి అని ప్రత్యేకంగా ప్రస్తావించడం లేదు. (హెబ్రీయులు 11:33, 34) అయినప్పటికీ, ఏహూదు విశ్వాసంతో ప్రవర్తించి మరియు రాజైన ఎగ్లోను యొక్క నియంత విధానం నుండి ఇశ్రాయేలీయులను విడిపించినప్పుడు యెహోవా ఆయనకు మద్దతునిచ్చాడు.
ఏహూదుకుగల లక్షణాల్లో సాహసం ఒకటి. ఏహూదు అంత ప్రతిభతో ఒక అక్షరార్థ ఖడ్గాన్ని ఝళిపించడానికి ధైర్యం అవసరం. దేవుని ప్రస్తుతదిన సేవకులముగా మనం అలాంటి ఖడ్గాన్ని చేతబుచ్చుకోము. (యెషయా 2:4; మత్తయి 26:52) అయినప్పటికీ, దేవుని వాక్యమనే “ఆత్మ ఖడ్గమును” మనం ఉపయోగిస్తాము. (ఎఫెసీయులు 6:17) ఏహూదు తన ఆయుధాన్ని ఉపయోగించడంలో ప్రవీణుడై ఉన్నాడు. రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా మనం కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగించడంలో నిపుణతను కలిగి ఉండవలసిన అవసరముంది. (మత్తయి 24:14) బైబిలును వ్యక్తిగతంగా చదవడం, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవ్వడం, పరిచర్యలో ఆసక్తితో భాగంవహించడం, మన పరలోకపు తండ్రిపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడటం, నిజంగా విశ్వాసంగల ధైర్యవంతుడైన ఏహూదు ప్రదర్శించిన లక్షణాలను అనుకరించేందుకు మనకు సహాయం చేస్తాయి.
[అధస్సూచీలు]
a దేవతాస్తంభాలు బహుశ లింగములై ఉంటాయి. అవి నీచమైన లైంగికదుర్నీతితో కూడిన విలాసాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి.—1 రాజులు 14:22-24.
b కెమోషు మోయాబీయుల ముఖ్య దేవత. (సంఖ్యాకాండము 21:29; యిర్మీయా 48:46) కనీసం కొన్ని సందర్భాలలో, ఈ నీచమైన అబద్ధ దేవతకు పిల్లలను బలి అర్పించేవారు.—2 రాజులు 3:26, 27.
[31వ పేజీలోని చిత్రం]
ఏహూదు మరియు ఆయన మనుష్యులు రాజైన ఎగ్లోనుకు కప్పమును చెల్లించారు
[క్రెడిట్ లైను]
Illustrirte Pracht - Bibel/Heilige Schrift des Alten und Neuen Testaments, nach der deutschen Uebersetzung D. Martin Luther’s నుండి పునరుత్పత్తి చేయబడింది