వివేచన మిమ్మల్ని కాపాడనివ్వండి
“ఆలోచనా సామర్థ్యం మీకు కావలి కాయును, వివేచన మిమ్మల్ని కాపాడును.”—సామెతలు 2:11, NW.
1. వివేచన మనల్ని దేని నుండి కాపాడగలదు?
మీరు వివేచనను ఉపయోగించాలని యెహోవా కోరుతున్నాడు. ఎందుకు? ఎందుకంటే అది మిమ్మల్ని అనేకమైన ప్రమాదాల నుండి కాపాడగలదని ఆయనకు తెలుసు. సామెతలు 2:10-19, NW ఈ మాటలతో ప్రారంభమౌతున్నాయి: “తెలివి మీ హృదయమున జొచ్చినప్పుడు, జ్ఞానము మీకు మనోహరముగా ఉండును. ఆలోచనా సామర్థ్యం మీకు కావలి కాయును, వివేచన మిమ్మల్ని కాపాడును.” దేని నుండి మిమ్మల్ని కాపాడాలి? “దుష్టుల మార్గము” నుండి, సరైన మార్గాలను విడిచిపెట్టేవారి నుండి, తమ ప్రవర్తనా విధానంలో వక్రంగా ఉండే ప్రజల నుండి కాపాడుతుంది.
2. వివేచన అంటే ఏమిటి, క్రైస్తవులు ప్రాముఖ్యంగా ఏ విధమైన వివేచనను కోరుకుంటారు?
2 వివేచన అన్నది మనస్సుకు సంబంధించినదని, అది దాని సహాయంతో ఒక విషయానికి మరో విషయానికి ఉన్న తేడాను గుర్తిస్తుందని బహుశా మీకు జ్ఞాపకం ఉండివుండవచ్చు. వివేచనగల వ్యక్తి ఉద్దేశాలలో లేక విషయాల్లో ఉన్న తేడాలను గ్రహించి, చక్కని యుక్తాయుక్త పరిజ్ఞానం కలిగివుంటాడు. క్రైస్తవులముగా మనం, ప్రాముఖ్యంగా దేవుని వాక్యం యొక్క కచ్చితమైన జ్ఞానంపై ఆధారపడిన ఆత్మీయ వివేచనను కలిగివుండాలని కోరుకుంటాము. మనం లేఖనాలను పఠిస్తున్నామంటే మనం ఆత్మీయ వివేచనా రాళ్లను వెలికితీస్తున్నట్లే. మనం నేర్చుకునేవి యెహోవాకు ప్రీతికరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయం చేయగలవు.
3. మనం ఆత్మీయ వివేచనను ఎలా పొందవచ్చు?
3 ఏ ఆశీర్వాదం కావాలని దేవుడు ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోనును అడిగినప్పుడు, యౌవనుడైన ఆ పరిపాలకుడు ఇలా చెప్పాడు: “నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము.” సొలొమోను వివేచన కొరకు అడిగాడు, యెహోవా ఆయనకు దాన్ని అసాధారణ స్థాయిలో దయచేశాడు. (1 రాజులు 3:9; 4:30) వివేచనను సంపాదించుకోవడానికి మనం ప్రార్థించాలి మరియు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా అందజేయబడే ఆత్మీయ జ్ఞానాన్ననుగ్రహించే ప్రచురణల సహాయంతో దేవుని వాక్యాన్ని పఠించాలి. (మత్తయి 24:45-47) “మేలు కీడులను వివేచించ [లేక తేడాను గ్రహించ]” గలిగేలా “బుద్ధి విషయమై పెద్దవార”మయ్యేంతగా ఆత్మీయ వివేచనను వృద్ధి చేసుకోవడానికి ఇది మనకు సహాయం చేస్తుంది.—హెబ్రీయులు 5:14; 1 కొరింథీయులు 14:20.
వివేచన కొరకైన ప్రత్యేక అవసరత
4. “తేటగా” ఉండే కన్నును కల్గివుండడమంటే ఏమిటి, అది మనకెలా ప్రయోజనాన్ని చేకూర్చగలదు?
4 సరైన వివేచనతో మనం యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలకనుగుణంగా ప్రవర్తించగలుగుతాము: “కాబట్టి మీరు [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు [వస్తుసంబంధమైనవి] మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:33) యేసు ఇలా కూడా చెప్పాడు: “నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమైయుండును.” (లూకా 11:34) కన్ను సూచనార్థకమైన దీపము. “తేటగా” ఉండే కన్ను యథార్థంగా, అంతా ఒకే వైపుగా కేంద్రీకరింపబడి ఉంటుంది. అలాంటి కన్నుతో మనం వివేచనను కనబర్చి, ఆత్మీయంగా తొట్రుపడకుండా నడువగలుగుతాము.
5. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి, క్రైస్తవ సంఘ సంకల్పం గురించి మనం ఏమి మనస్సులో ఉంచుకోవాలి?
5 కొందరు తమ కంటిని తేటగా ఉంచుకోవడానికి బదులు ప్రలోభపెట్టే వ్యాపార వ్యవహారాలతో తమ జీవితాలను సంక్లిష్టం చేసుకున్నారు, ఇతరుల జీవితాలనూ అలాగే చేశారు. కాని క్రైస్తవ సంఘం “సత్యమునకు స్తంభమును ఆధారమునై” యున్నదని మనం గుర్తుంచుకోవాలి. (1 తిమోతి 3:15) భవనం యొక్క స్తంభాల్లా సంఘం దేవుని సత్యానికి మద్దతునిస్తుంది కాని ఎవరి వ్యాపార సంస్థకో కాదు. యెహోవాసాక్షుల సంఘాలు వ్యాపార సంబంధమైన ఆసక్తులను వస్తువులను లేక సేవలను వృద్ధి చేసే స్థలాలుగా నెలకొల్పబడలేదు. రాజ్యమందిరంలో వ్యక్తిగత వ్యాపార కార్యకలాపాలను చేపట్టడాన్ని మనం మానుకోవాలి. యెహోవాసాక్షుల రాజ్యమందిరాలు, సంఘ పుస్తక పఠనాలు, సమావేశాలు, సదస్సులు క్రైస్తవ సహవాసానికి ఆత్మీయ చర్చకు స్థలాలని గ్రహించడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. ఏ విధమైన వ్యాపారాన్నైనా వృద్ధి చేసుకోవడానికి మనం ఆత్మీయ సంబంధాలను ఉపయోగించుకుంటే, అది ఆత్మీయ విలువల ఎడల కనీసం కొంత మెప్పైనా లేకపోవడాన్ని చూపించదా? సంఘ సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోను ఆర్థిక లాభం కొరకు దుర్వినియోగం చేయకూడదు.
6. సంఘ కూటాల వద్ద వ్యాపార ఉత్పత్తులనూ సేవలనూ అమ్మడం లేక వృద్ధి చేయడం ఎందుకు చేయకూడదు?
6 ఆరోగ్య లేక సౌందర్య ఉపకరణాలు, విటమిన్ ఉత్పత్తులు, టెలికమ్యూనికేషన్ సేవలు, నిర్మాణ వస్తువులు, ప్రయాణ వ్యవహారాలు, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు లేక పరికరాలు మొదలైన వాటిని అమ్మడానికి కొందరు దైవపరిపాలనా సంబంధాలను ఉపయోగించుకున్నారు. అయితే, సంఘ కూటాలు వ్యాపార ఉత్పత్తులను లేక సేవలను అమ్మే లేక వృద్ధి చేసుకొనే స్థలాలు కావు. యేసు “గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో—వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెన”ని మనం గుర్తుంచుకుంటే, దానిలో అంతర్లీనంగా ఉన్న సూత్రాన్ని మనం గ్రహించవచ్చు.—యోహాను 2:15, 16.
పెట్టుబడుల విషయమేమిటి?
7. పెట్టుబడులకు సంబంధించి వివేచన మరియు జాగ్రత్త ఎందుకు అవసరం?
7 వ్యాపార లావాదేవీల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నప్పుడు వివేచన మరియు జాగరూకత అవసరం. ఎవరైనా డబ్బు అప్పు కావాలని ఈ విధమైన వాగ్దానాలు చేస్తున్నారనుకోండి: “మీకు లాభం వస్తుందని నేను హామీ ఇస్తున్నాను.” “మీరేమి నష్టపోరు. ఇది నిజంగా లాభదాయకమైనదే.” ఎవరైనా అలాంటి హామీలు ఇస్తుంటే జాగ్రత్తగా ఉండండి. అతడు వాస్తవికంగా లేకపోవచ్చు లేక నిజాయితీ లేనివాడైనా కావచ్చు, ఎందుకంటే పెట్టుబడి పెట్టడమన్నది అరుదుగా లాభదాయకమైనదై ఉంటుంది. వాస్తవానికి, తీయని మాటలు చెప్పే అన్యాయస్థులు కొందరు సంఘ సభ్యులను మోసగించారు. మొదటి శతాబ్దపు సంఘంలోకి జొరబడి ‘దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచిన భక్తిహీనులైనవారిని’ ఇది జ్ఞప్తికి తెస్తుంది. వారు ఈతగాళ్లను చీల్చిచంపే నీటిక్రింద ఉండే మొనతేలిన రాళ్లవలె ఉన్నారు. (యూదా 4, 12) నిజమే, అత్యాశపరులైన మోసగాళ్ల ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, కాని వారు కూడా సంఘ సభ్యులను వలవేసి పట్టుకుంటారు.
8. లాభదాయకమైనవిగా కనిపించే వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏమి జరిగింది?
8 మంచి ఉద్దేశంగల క్రైస్తవులు కూడా లాభం చేకూర్చగలవిగా కనిపించే వాణిజ్యాన్ని గురించిన సమాచారాన్ని పంచుకుని, తామూ అలాగే తమ్మును అనుసరించిన ఇతరులు కలిసి తాము పెట్టుబడి పెట్టిన డబ్బును కోల్పోయారు. ఫలితంగా, అనేకమంది క్రైస్తవులు సంఘంలో తమ ఆధిక్యతలను కోల్పోయారు. త్వరగా ధనవంతులయ్యే వ్యాపార లావాదేవీలు మోసకరమైన పథకాలుగా నిరూపించబడినప్పుడు, లాభం పొందే ఏకైక వ్యక్తి మోసం చేసినవాడే, అతడు తరచూ వెంటనే అదృశ్యమైపోతాడు. అలాంటి పరిస్థితులను తప్పించుకోవడానికి వివేచన ఒకరికి ఎలా సహాయం చేయగలదు?
9. పెట్టుబడులకు సంబంధించిన ఆరోపణలను తూచిచూసుకోవడానికి వివేచన ఎందుకు అవసరం?
9 వివేచనకు, అనుమానాస్పదమైనదాన్ని గుర్తించగలగడమనే భావం ఉంది. పెట్టుబడుల గురించిన హామీలను తూచి చూసుకోవడానికి ఈ సామర్థ్యం అవసరం. క్రైస్తవులు ఒకరినొకరు నమ్ముతారు. తోటి విశ్వాసుల నిధులను ప్రమాదంలో పడవేయగల వ్యాపార లావాదేవీల్లో తమ ఆత్మీయ సహోదర సహోదరీలు ఇమిడి ఉండరులే అని కొందరు తర్కించవచ్చు. కాని వ్యాపారవేత్త క్రైస్తవుడన్న వాస్తవం ఆయన వ్యాపార విషయాల్లో రాణిస్తాడనడానికి, ఆయన చేసే వ్యాపారం విజయవంతమౌతుందనడానికి హామీ ఇవ్వదు.
10. కొంతమంది క్రైస్తవులు తోటి విశ్వాసుల నుండి వ్యాపార అప్పులను ఎందుకు తీసుకుంటారు, అలాంటి పెట్టుబడులకు ఏమి జరుగవచ్చు?
10 అప్పు ఇచ్చే పేరు పొందిన సంస్థలు అప్పు తీసుకొనేవారు పెట్టే ప్రమాదకరమైన వ్యాపార లావాదేవీలకు అప్పు ఎన్నడూ ఇవ్వవు గనుక కొంతమంది క్రైస్తవులు తోటి విశ్వాసుల నుండి వ్యాపార రుణాలను పొందాలనుకుంటారు. కేవలం తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఎక్కువ కృషి చేయకుండానే లేక బహుశా ఏమాత్రం కృషి చేయకుండానే అతి త్వరగా, సులభంగా లాభం పొందవచ్చునని నమ్మేలా అనేకులు మోసగించబడ్డారు. కొందరు పెట్టుబడితో ముడిపడివున్న పేరుప్రతిష్ఠలవైపు ఆకర్షించబడి, దాని ఫలితంగా జీవితంలో కూడబెట్టుకున్నదంతా కోల్పోయారు! ఒక క్రైస్తవుడు కేవలం రెండు వారాల్లో 25 శాతం రేటు లాభం వస్తుందని ఎదురు చూస్తూ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాడు. కంపెనీ దివాలా తీసిందని ప్రకటించబడినప్పుడు ఆయన ఆ డబ్బంతా కోల్పోయాడు. మరో వ్యాపార లావాదేవీలో, స్థిరాస్థిని వృద్ధి చేసే ఒక వ్యక్తి సంఘంలోని ఇతరుల వద్దనుండి పెద్ద మొత్తాల్లో డబ్బు అప్పు తీసుకున్నాడు. ఆయన అసాధారణమైన అధిక లాభాలను ఇస్తానని వాగ్దానం చేశాడు. కాని, ఆయన దివాలా తీసి అప్పు తీసుకున్న నిధులను పోగొట్టుకున్నాడు.
వ్యాపార లావాదేవీలు దివాలా తీసినప్పుడు
11. దురాశ మరియు ధనాపేక్షకు సంబంధించి పౌలు ఏ ఉపదేశం ఇచ్చాడు?
11 వ్యాపార వైఫల్యం కొంతమందికి నిరుత్సాహాన్ని కలిగించింది, సవ్యంకాని వ్యాపారాల్లోకి ప్రవేశించిన కొంతమంది క్రైస్తవులకు ఆత్మీయ నష్టం కూడా కలిగింది. వివేచన తమను కాపాడేందుకు అనుమతించక పోవడం మూలంగా హృదయవేదన, నిరాశ ఏర్పడ్డాయి. అత్యాశ అనేకులను ఉరిలో పడవేసింది. ‘మీలో లోభత్వం పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది’ అని పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 5:3) మరియు ఆయనిలా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”—1 తిమోతి 6:9, 10.
12. క్రైస్తవులు ఒకరితో ఒకరు వ్యాపారం చేస్తే, వాళ్లు ప్రాముఖ్యంగా ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి?
12 ఒక క్రైస్తవుడు ధనాపేక్షను పెంచుకుంటే, అతడు తనకు తాను ఎంతో ఆత్మీయ హాని కలుగజేసుకుంటాడు. పరిసయ్యులు ధనాపేక్షులుగా ఉండేవారు, ఈ అంత్యదినాల్లో అనేకులలో ఈ లక్షణం ఉంది. (లూకా 16:14; 2 తిమోతి 3:1, 2) దానికి బదులుగా, ఒక క్రైస్తవుని జీవన విధానం “ధనాపేక్షలేని”దై ఉండాలి. (హెబ్రీయులు 13:5) క్రైస్తవులు ఒకరితో ఒకరు వ్యాపారం చేయవచ్చు లేక కలిసి వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అయితే, వారలాంటివి చేసేటప్పుడు, చర్చలను సంప్రదింపులను సంఘ విషయాలనుండి వేరుగా ఉంచాలి. జ్ఞాపకముంచుకోండి: ఆత్మీయ సహోదరుల మధ్య కూడా వ్యాపార ఒప్పందాలను ఎల్లప్పుడూ వ్రాతపూర్వకంగా ఉంచుకోవాలి. ఈ విషయంలో, ఫిబ్రవరి 8, 1983 తేజరిల్లు! (ఆంగ్లం) నందలి 13 నుండి 15 పేజీల్లో ప్రచురించబడిన “దాన్ని వ్రాతరూపంలో ఉంచుకోండి!” అనే పేరుగల శీర్షిక ఎంతో సహాయకరంగా ఉంటుంది.
13. మీరు వ్యాపార లావాదేవీలకు సామెతలు 22:7ను ఎలా అన్వయిస్తారు?
13 సామెతలు 22:7 మనకిలా చెబుతుంది: “అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” మనల్ని మనం లేక మన సహోదరున్ని అలాంటి దాసుని స్థానంలో ఉంచడం తరచూ జ్ఞానవంతమైన పనికాదు. ఎవరైనా మనల్ని వ్యాపార లావాదేవీల కొరకు తనకు డబ్బు అప్పు ఇవ్వమని కోరితే, ఆ సొమ్ము తిరిగి ఇవ్వడానికి అతనికున్న స్తోమతను పరిశీలించడం మంచిది. నమ్మకస్థుడని, ఆధారపడదగినవాడని అతనికి పేరుందా? వ్యాపారాలనేకం విఫలమౌతాయి గనుక అలాంటి అప్పులివ్వడమంటే డబ్బును నష్టపోవడమే కాగలదని మనం గుర్తించాలి. ఒక ఒప్పందం కుదుర్చుకోవడం విజయవంతమైన వ్యాపారాన్నేమీ హామీ ఇవ్వదు. ఒక వ్యక్తి తాను నష్టం సహించగలిగినదానికంటే ఎక్కువ సొమ్మును ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కచ్చితంగా తెలివైన పనికాదు.
14. మనం మన తోటి క్రైస్తవునికి వ్యాపారం నిమిత్తం డబ్బు అప్పిచ్చినప్పుడు, ఆ వ్యాపారం విఫలమౌతే, మనం ఎందుకు వివేచనను చూపించాలి?
14 మనం ఒక క్రైస్తవునికి వ్యాపార విషయాల నిమిత్తం నిధులను అప్పిచ్చివుంటే, అందులో వంచనతో కూడిన పనులేవి లేకపోయినప్పటికీ ఆ డబ్బును నష్టపోవడం జరిగితే మనం వివేచన కనబర్చవలసిన అవసరం ఉంది. వ్యాపారం విఫలమవ్వడానికి కారణం, మన నుండి డబ్బు అప్పు తీసుకున్న మన తోటి విశ్వాసి తప్పు కాకపోతే మనకు అన్యాయం జరిగిందని మనం చెప్పగలమా? లేదు, ఎందుకంటే మనం డబ్బును స్వచ్ఛందంగానే అప్పు ఇచ్చాము, మనం బహుశా దానిపై వడ్డీ తీసుకుంటూనే ఉండి ఉండవచ్చు, మరి ఏ విధమైన అవినీతి జరగలేదు. అవినీతి అందులో ఇమిడిలేదు గనుక, అప్పు తీసుకున్న వ్యక్తిపై చట్టబద్ధమైన చర్య తీసుకోవడానికి మనకు ఏ ఆధారం లేదు. వాస్తవానికి, మంచి ఉద్దేశంగల వ్యాపార లావాదేవీలు విఫలమైనందున దివాలా తీసిన యథార్థవంతుడైన తోటి క్రైస్తవున్ని కోర్టుకు తీసుకువెళ్లడంవల్ల వచ్చే లాభమేమిటి?—1 కొరింథీయులు 6:1.
15. దివాలా తీసినట్లు చెప్పబడితే, ఏ విషయాలను పరిశీలించవలసి ఉంటుంది?
15 కొన్నిసార్లు వ్యాపార వైఫల్యాలను అనుభవిస్తున్నవారు దివాలా తీశామని చెప్పడం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. క్రైస్తవులు తమ అప్పుల గురించి బాధ్యతారహితంగా ఉండరు గనుక, కొన్ని అప్పుల నుండి చట్టబద్ధంగా తప్పించుకోగలిగినప్పటికీ మునుపు అప్పిచ్చినవారు డబ్బు తీసుకోవడానికి ఇష్టపడితే తిరిగి కట్టేందుకు ప్రయత్నించడం తమ నైతిక బాధ్యత అని కొందరు మనస్సాక్షిపూర్వకంగా భావించారు. కాని అప్పుతీసుకున్న వ్యక్తి తన సహోదరుని డబ్బును కోల్పోయి, ఆ తర్వాత విలాసవంతమైన జీవితం జీవిస్తుంటే అప్పుడేమిటి? లేక అప్పు తీసుకున్న వ్యక్తి తాను తిరిగి ఇవ్వడానికి సరిపోయేంత డబ్బును సంపాదించుకున్నప్పటికీ తన సహోదరునికి తిరిగి ఇవ్వవలసిన నైతిక బాధ్యతను అలక్ష్యం చేస్తే అప్పుడేమిటి? అలాంటి పరిస్థితుల్లో, అప్పు తీసుకున్న వ్యక్తికి సంఘంలో బాధ్యతాయుతమైన స్థానంలో సేవ చేయడానికి గల అర్హతను గూర్చి ప్రశ్నలు తలెత్తుతాయి.—1 తిమోతి 3:3, 8; కావలికోట సెప్టెంబరు 15, 1994, పేజీలు 30-1 చూడండి.
మోసం ఇమిడివుంటే అప్పుడేమిటి?
16. మనం వ్యాపారంలో మోసానికి గురైతే ఏ చర్యలు తీసుకోవచ్చు?
16 అన్ని పెట్టుబడుల నుండి లాభాలు రావని గుర్తించడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. అయినప్పటికీ, మోసం ఇమిడివుంటే అప్పుడేమిటి? మోసం అంటే “ఒక వ్యక్తికి చెందిన ఏదైనా ఒక విలువైనదాన్ని లేదా చట్టబద్ధమైన హక్కును అతని నుండి తీసేసుకోవాలనే ఉద్దేశంతో వంచనను, కుయుక్తిని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం, లేక సత్యాన్ని త్రిప్పివేయడం.” తోటి ఆరాధికుని ద్వారా మోసగించబడ్డానని ఒక వ్యక్తి భావిస్తున్నప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి యేసుక్రీస్తు తెలియజేశాడు. మత్తయి 18:15-17 ప్రకారం, యేసు ఇలా చెప్పాడు: “నీ సహోదరుడు నీయెడల తప్పిదముచేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.” దాని తర్వాత యేసు ఇచ్చిన ఉపమానం, మోసంతో సహా ఆర్థికపరమైన విషయాలు ఇమిడి ఉండే పాపాల గురించి ఆయన మాట్లాడుతుండెనని సూచిస్తుంది.—మత్తయి 18:23-35.
17, 18. క్రైస్తవుడనని చెప్పుకొనే వ్యక్తి మనల్ని మోసగిస్తే, వివేచన మనల్ని ఎలా కాపాడుతుంది?
17 మోసం జరిగినట్లు ఏ సాక్ష్యాధారం లేక చివరికి ఏ సూచన లేకపోతే మత్తయి 18:15-17 నందు పొందుపర్చబడిన చర్యలను గైకొనడానికి ఏ లేఖనాధారం ఉండదు. అయినప్పటికీ, క్రైస్తవుడనని చెప్పుకొనే వ్యక్తి వాస్తవంగా మనల్ని మోసగించినట్లైతే అప్పుడేమిటి? సంఘం యొక్క పేరును పాడు చేయగల చర్య తీసుకోకుండా వివేచన మనల్ని కాపాడుతుంది. ఒక సహోదరున్ని కోర్టుకు తీసుకువెళ్లే బదులు మీరే అన్యాయము సహించండని, చివరికి మీ సొత్తుల నపహరింపబడనివ్వండని పౌలు తోటి క్రైస్తవులకు ఉపదేశించాడు.—1 కొరింథీయులు 6:7.
18 యథార్థవంతులైన మన సహోదర సహోదరీలు, గారడీవాడైన బర్ యేసులా ‘కపటముతోను, దుర్మార్గముతోను నిండి’ ఉండరు. (అపొస్తలుల కార్యములు 13:6-12) తోటి విశ్వాసులు ఇమిడివున్న వ్యాపార లావాదేవీల్లో డబ్బు నష్టపోవడం జరిగినప్పుడు మనం వివేచనను ఉపయోగిద్దాము. మనం చట్టబద్ధమైన చర్య తీసుకోవడం గురించి ఆలోచిస్తుంటే, అది వ్యక్తిగతంగా మనపై, మరో వ్యక్తిపై లేక ఇతర వ్యక్తులపై, సంఘంపై, బయటివారిపై చూపగల ప్రభావాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. డబ్బును తిరిగి పొందడానికి చేసే ప్రయత్నం మన సమయాన్ని, శక్తిని, ఇతర వనరులను ఎంతో వ్యయపర్చవచ్చు. అది కేవలం న్యాయవాదులను ఇతర వృత్తిపనివారిని సంపన్నం చేయడానికే దారి తీయవచ్చు. విచారకరంగా, కొంతమంది క్రైస్తవులు ఈ విషయాల్లో ఎక్కువగా మునిగితేలడం ద్వారా దైవపరిపాలనా ఆధిక్యతలను కోల్పోయారు. మనం ఇలా ప్రక్కదారి పట్టడం సాతానును తప్పక ఆనందపరుస్తుంది కానీ మనం యెహోవా హృదయాన్ని ఆనందపర్చాలని కోరుకుంటాము. (సామెతలు 27:11) మరోవైపున, నష్టాన్ని భరించడం హృదయవేదనల నుండి కాపాడుతుంది, మనకు మరియు పెద్దలకు గంటల కొలది సమయాన్ని ఆదాచేస్తుంది. అది సంఘ శాంతిని కాపాడేందుకు సహాయం చేస్తుంది, మనం రాజ్యమును మొదట వెదకడానికి మనకు తోడ్పడుతుంది.
వివేచన మరియు నిర్ణయం తీసుకోవడం
19. మనం ఒత్తిడి కలుగజేసే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఆత్మీయ వివేచన మరియు ప్రార్థన మన కొరకు ఏమి చేయగలవు?
19 ఆర్థిక లేక వ్యాపార విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ఒత్తిడి కలిగించేదిగా ఉండగలదు. కాని విషయాలను తూచిచూచుకొని వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆత్మీయ వివేచన మనకు సహాయం చేయగలదు. అంతేగాక, యెహోవాపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడడం మనకు “దేవుని సమాధానము”ను తేగలదు. (ఫిలిప్పీయులు 4:6, 7) అది యెహోవాతో సన్నిహిత వ్యక్తిగత సంబంధం కలిగివుండడం ద్వారా కలిగే నెమ్మది మరియు శాంతి. నిజంగా, మనం కష్టతరమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మనం మన సమతూకాన్ని కాపాడుకోవడానికి అలాంటి సమాధానం మనకు సహాయం చేయగలదు.
20. వ్యాపార విషయాలు మరియు సంఘ విషయాలకు సంబంధించి మనం ఏమి చేయడానికి నిశ్చయించుకోవాలి?
20 వ్యాపార వివాదాలు మన శాంతిని లేక సంఘ శాంతిని పాడుచేయనివ్వకుండా ఉండేందుకు మనం తీర్మానించుకుందాము. క్రైస్తవ సంఘం మనకు ఆత్మీయంగా సహాయం చేయడానికే పనిచేస్తుంది కాని వాణిజ్య విషయాలకు కేంద్రంగా ఉండేందుకు కాదని మనం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. అన్ని సమయాల్లోను వ్యాపార విషయాలను సంఘ కార్యకలాపాల నుండి వేరుగా ఉంచాలి. వ్యాపార లావాదేవీలను ప్రారంభించేటప్పుడు మనం వివేచనను జాగరూకతను ఉపయోగించడం అవసరం. మనం రాజ్యాసక్తులను మొదట వెదకుచూ, అలాంటి విషయాల ఎడల ఎల్లప్పుడూ సమతూకమైన దృక్పథం కల్గివుందాము. తోటి విశ్వాసులు ఇమిడివున్న వ్యాపార లావాదేవీలు విఫలమౌతే, అందులో ఇమిడివున్న వారికందరికీ ఏది మంచిదో అదే చేయడానికి ప్రయత్నిద్దాము.
21. మనం ఎలా వివేచనను ఉపయోగించి ఫిలిప్పీయులు 1:9-11కు అనుగుణంగా ప్రవర్తించవచ్చు?
21 ఆర్థిక విషయాల గురించి, తక్కువ ప్రాముఖ్యతగల ఇతర విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ కలిగివుండే బదులు, మనమందరం హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించి, దేవుని నడిపింపు కొరకు ప్రార్థిస్తూ, రాజ్యాసక్తులను మొదట ఉంచుదాము. పౌలు ప్రార్థనకు అనుగుణంగా, మనం మనకు లేక ‘ఇతరులకు అభ్యంతరం కలుగకుండా, మరింత శ్రేష్ఠమైన విషయాల గురించి శ్రద్ధ కలిగివుండేలా మన ప్రేమ అనుభవజ్ఞానముతోను పూర్తి వివేచనతోనూ నిండుకొనినదై ఉండునుగాక.’ రాజైన క్రీస్తు ఇప్పుడు తన పరలోక సింహాసనంపై ఉన్నాడు గనుక, మనం జీవితంలోని ప్రతి అంశంలోనూ ఆత్మీయ వివేచనను చూపిద్దాము. సర్వోన్నత ప్రభువైన యెహోవా ‘దేవునికి మహిమయు స్తోత్రమును కలిగేలా మనం యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండుకొని’ ఉందాము.—ఫిలిప్పీయులు 1:9-11.
మీరెలా ప్రతిస్పందిస్తారు?
◻ వివేచన అంటే ఏమిటి?
◻ క్రైస్తవుల మధ్య వ్యాపార వ్యవహారాలకు సంబంధించి వివేచనను చూపించడానికి ప్రత్యేకమైన అవసరత ఎందుకు ఉంది?
◻ తోటి విశ్వాసి మనల్ని మోసగించాడని మనం భావిస్తే వివేచన మనకు ఎలా సహాయం చేయగలదు?
◻ నిర్ణయాలు తీసుకోవడంలో వివేచన ఏ పాత్ర నిర్వహించాలి?
[18వ పేజీలోని చిత్రం]
మొదట రాజ్యమును వెదకమని యేసు ఇచ్చిన ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది
[20వ పేజీలోని చిత్రం]
వ్యాపార ఒప్పందాలను ఎల్లప్పుడూ వ్రాతరూపంలో ఉంచుకోండి