మీరు మరింత వివేచనను పెంపొందింపజేసుకోగలరా?
వివేచన అంటే “ఒక విషయం నుండి మరో దాన్ని వేరు చేయగల మెదడుకున్న శక్తి లేక సామర్థ్యం.” అది “తీర్పు తీర్చడంలోని సూక్ష్మ బుద్ధి” లేక “విషయాలు లేదా ఆలోచనల మధ్యనున్న తేడాను గ్రహించే శక్తి” కూడా కాగలదు. వెబ్స్‌టర్స్ యూనివర్సల్ డిక్షనరీ అలా చెబుతుంది. స్పష్టంగా, వివేచన కోరదగిన లక్షణం. దాని విలువను సొలొమోను యొక్క ఈ మాటల్లో కనుగొనవచ్చు: “జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును . . . వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గమునుండి . . . నిన్ను రక్షించును.”—సామెతలు 2:10-12.
అవును, నేడు విస్తృతంగా వ్యాపించివున్న “దుష్టుల మార్గమును” తప్పించుకోవడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. మరి అది ఇతర అనేక ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఉదాహరణకు, తమ పిల్లలు ‘నీకు అసలు అర్థం కాదు!’ అని అనడాన్ని తల్లిదండ్రులు తరచూ వింటుంటారు. తమ పిల్లలను వేధిస్తున్న భావాలను, విషయాలను కొంత పరిశోధనతో ఎలా రాబట్టవచ్చో వివేచించే తల్లిదండ్రులకు తెలుసు. (సామెతలు 20:5) వివేచనగల భర్త వాస్తవాలన్నీ తెలుసుకోకుండా ఒక ముగింపుకు వచ్చే బదులు తన భార్య చెప్పేది విని, ఆమె ఆలోచనా విధానాన్ని మరియు భావాలను గ్రహిస్తాడు. భార్య కూడా తన భర్త విషయంలో అలాగే చేస్తుంది. అలా, “జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.”—సామెతలు 24:3.
ఒక వ్యక్తి పరిస్థితులను విజయవంతంగా చక్కబర్చుకొనేందుకు వివేచన సహాయం చేస్తుంది. సామెతలు 17:27 ఇలా చెబుతుంది: “మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.” వివేచన గల వ్యక్తి ఆలోచించకుండా ప్రతి విషయంలో తొందరపాటుతో ప్రవర్తిస్తూ, దుడుకుగా ఉండడు. తనను తాను అప్పగించుకొనే ముందు రాగల ఫలితాల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాడు. (లూకా 14:28, 29) అతడు ఇతరులతో మరింత శాంతియుతమైన సంబంధాలను కలిగివుంటాడు, ఎందుకంటే తన మాటలను జాగ్రత్తగా ఎన్నుకొనేందుకు “వివేకము” అతన్ని నడిపిస్తుంది. (సామెతలు 10:19; 12:8) కాని మరింత ప్రాముఖ్యంగా, వివేచనగల వ్యక్తి తన స్వంత పరిధులను వినయంగా గుర్తించి, నడిపింపు కొరకు మనుష్యుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తాడు. ఇది యెహోవాకు ప్రీతికరమైనది, వివేచనను పెంపొందింపజేసుకోవడానికి ఇది మరో కారణం.—సామెతలు 2:1-9; యాకోబు 4:6.
ఇశ్రాయేలీయుల వివేచనా కొరత
వివేచనను చూపించడంలో విఫలమయ్యే ప్రమాదం గురించి ఇశ్రాయేలు తొలి చరిత్రలోని ఒక సంఘటనలో చూడవచ్చు. ఆ సమయాన్ని గూర్చి ఆలోచిస్తూ, కీర్తనల రచయిత ఇలా చెప్పాడు: “ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి.”—కీర్తన 106:7.
మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు, ఆ శక్తివంతమైన ప్రపంచ శక్తిపై పది తెగుళ్లు వచ్చేలా చేయడం ద్వారా తన ప్రజలను స్వతంత్రులను చేయగలననే తన శక్తిని, నిశ్చయతను యెహోవా అప్పటికే చూపించాడు. ఫరో ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చిన తర్వాత, మోషే వారిని ఎర్ర సముద్ర తీరానికి తీసుకొని వెళ్లాడు. అయితే, వారిని తరమాలని ఐగుప్తు సైన్యాలు వారిని వెంబడించాయి. ఇశ్రాయేలీయులు చిక్కుబడినట్లు, క్రొత్తగా లభించిన వారి స్వాతంత్ర్యం అల్పాయుష్షు గలదన్నట్లుగా అనిపించింది. కాబట్టి బైబిలు వృత్తాంతం ఇలా చెబుతుంది: “ఇశ్రాయేలీయులు . . . మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.” వాళ్లు మోషేతో, “మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? . . . మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని” అంటూ ఎదురుతిరిగారు.—నిర్గమకాండము 14:10-12.
యెహోవా శక్తిని గూర్చిన పది విశేషమైన ప్రదర్శనలను వారు అప్పటికే చూశారని మనం గుర్తు చేసుకొనే వరకు వారి భయం యుక్తమైనదని అనిపిస్తుంది. “యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహా భయమువలనను సూచకక్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి”నాడని దాదాపు 40 సంవత్సరాల తర్వాత మోషే వాళ్లకు గుర్తుచేసిన విషయం వాళ్లకు స్వయంగా తెలుసు. (ద్వితీయోపదేశకాండము 26:8) గనుక, కీర్తనల రచయిత వ్రాసినట్లుగా, మోషే నడిపింపుకు ఇశ్రాయేలీయులు ఎదురు తిరిగినప్పుడు, వారు “గ్రహింప”లేదు. అయినప్పటికీ, తాను వాగ్దానం చేసినట్లుగానే, యెహోవా ఐగుప్తు శక్తులపై విశేషమైన విజయాన్ని సాధించాడు.—నిర్గమకాండము 14:19-31.
అలాగే మనం శ్రమలను సందేహంతో, సంశయంతో ఎదుర్కొంటే మన విశ్వాసం అలాగే తొట్రుపడగలదు. మనల్ని వ్యతిరేకించే ఎవరికంటే కూడా యెహోవా ఎంత గొప్పవాడో జ్ఞాపకముంచుకొని, విషయాలను ఎల్లప్పుడు ముందుగానే దృష్టించడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. యెహోవా ఇప్పటికే మన కొరకు ఏమి చేశాడో మనస్సులో ఉంచుకోడానికి కూడా వివేచన మనకు సహాయం చేస్తుంది. “తన్ను ప్రేమించువారినందరిని కాపాడు”వాడు ఆయనే అనే వాస్తవాన్ని ఎన్నడూ మరచిపోకుండా ఉండేందుకు అది మనకు సహాయం చేస్తుంది.—కీర్తన 145:18-20.
ఆత్మీయ వివేచనను పొందడం
వివేచన వయస్సుతోపాటు దానంతటదే రాదు. దాన్ని అలవర్చుకోవాలి. తన వివేచనను బట్టి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన జ్ఞానవంతుడైన సొలొమోను రాజు ఇలా చెప్పాడు: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.” (సామెతలు 3:13, 14) సొలొమోనుకు ఈ వివేచన ఎక్కడి నుండి లభించింది? యెహోవా యొద్ద నుండి. ఏ ఆశీర్వాదం కావాలని యెహోవా సొలొమోనును అడిగినప్పుడు, సొలొమోను ఇలా సమాధానమిచ్చాడు: “మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము.” (1 రాజులు 3:9) అవును, సొలొమోను యెహోవాను తన సహాయకునిగా దృష్టించాడు. ఆయన వివేచన కొరకు అడిగాడు, యెహోవా ఆయనకు దాన్ని అసాధారణమైన పరిమాణంలో ఇచ్చాడు. ఫలితం? “సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను.”—1 రాజులు 4:30.
వివేచన కొరకైన మన పరిశోధనలో మనం ఎక్కడికి వెళ్లాలో సొలొమోను అనుభవం మనకు చూపిస్తుంది. సొలొమోను వలె మనం యెహోవా వైపు చూడాలి. ఎలా? తన ఆలోచనా విధానపు అంతర్దృష్టిని మనకిచ్చేందుకు యెహోవా తన వాక్యమైన బైబిలును అందజేశాడు. మనం బైబిలును చదివినప్పుడు, వాస్తవానికి మనం, ఆత్మీయ వివేచనకు పునాదులను వేసే ఒక విలువైన జ్ఞాన మూలాన్ని త్రవ్వుతున్నాము. మన బైబిలు అధ్యయనం ద్వారా మనం సమకూర్చుకొనే సమాచారాన్ని ధ్యానించాలి. అప్పుడు సరైన నిర్ణయాలు చేసుకోవడానికి దాన్ని ఉపయోగించవచ్చు. కొంత కాలానికి, మనం “బుద్ధి విషయమై పెద్దవారమై”యుండి, “మేలు కీడులను వివేచించ”గలిగే స్థితికి మన గ్రహణశక్తి వృద్ధి చెందుతుంది.—1 కొరింథీయులు 14:20; హెబ్రీయులు 5:14; 1 కొరింథీయులు 2:10 పోల్చండి.
ఆసక్తికరంగా, యెహోవా సొలొమోనుకు ఇచ్చిన వివేచన నుండి మనం ఇప్పటికీ ప్రయోజనం పొందవచ్చు. ఎలా? జ్ఞానాన్ని సామెతల రూపంలో వ్యక్తపర్చడంలో సొలొమోను సిద్ధహస్తుడయ్యాడు, తత్ఫలితంగా అవి దైవ ప్రేరేపిత జ్ఞానపు గుళికలయ్యాయి. వీటిలో అనేకం బైబిలు పుస్తకమైన సామెతల గ్రంథంలో భద్రపరచబడ్డాయి. ఆ గ్రంథాన్ని చదవడం సొలొమోను వివేచన నుండి ప్రయోజనం పొందడానికి, మనకై మనం వివేచనను పెంపొందింపజేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.
మన బైబిలు పఠనంలో మనకు సహాయకరంగా ఉండేందుకు, మనం కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల వంటి బైబిలు పఠన సహాయకాలను ఉపయోగించుకోవచ్చు. కావలికోట 116 కంటే ఎక్కువ సంవత్సరాల నుండి యెహోవా రాజ్యమును గూర్చి దీనులకు ప్రకటిస్తోంది. తేజరిల్లు! మరియు క్రితం వేరే పేర్లతోనున్న అదే పత్రిక 1919 నుండి ప్రపంచ పరిస్థితులపై వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ రెండు పత్రికలు బైబిలు సత్యాలను పరిశీలించి, అవి క్రైస్తవమత సామ్రాజ్యంచే బోధింపబడినవైనా లేక మన స్వంత ఆలోచనా దృక్పథాలలో కనుగొనబడే తప్పులనైనా వివేచించడానికి సహాయం చేసే క్రమమైన ఆత్మీయ జ్ఞానాన్ని అందజేస్తాయి.—సామెతలు 4:18.
వివేచనను పెంపొందింపజేసుకోవడానికి మరో సహాయం సరైన సహవాసం. రాజైన సొలొమోను సామెతలలో ఒకటిలా చెబుతుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) దుఃఖకరమైనదేమిటంటే, రాజగు సొలొమోను కుమారుడైన రెహబాము తన జీవితంలోని ప్రాముఖ్యమైన తరుణంలోనే ఈ సామెతను జ్ఞాపకముంచుకోలేదు. తన తండ్రి మరణం తర్వాత, ఇశ్రాయేలు పది ఉత్తర గోత్రాల వారు తమ భారములను తగ్గించమని ఆయనను కోరడానికి వచ్చారు. రెహబాము మొదట పెద్దలను సంప్రదించాడు, తన పౌరుల మాట వినమని వారు అతన్ని ప్రోత్సహించినప్పుడు వారు వివేచనను చూపించారు. ఆ తర్వాత అతడు యౌవనుల యొద్దకు వెళ్లాడు. వారు బెదిరింపులతో ఇశ్రాయేలీయులకు సమాధానమివ్వమని రెహబామును ప్రోత్సహిస్తూ, అనుభవలేమిని, వివేచనా కొరతను చూపించారు. రెహబాము యౌవనుల మాట విన్నాడు. ఫలితం? ఇశ్రాయేలీయులు ఎదురు తిరిగారు, రెహబాము తన రాజ్యంలోని అధిక భాగాన్ని కోల్పోయాడు.—1 రాజులు 12:1-17.
వివేచనను పెంపొందింపజేసుకోవడంలో మరో ప్రాముఖ్యమైన భాగం పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరడం. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులు విడిపించబడిన తర్వాత, బైబిలు రచయితయైన నెహెమ్యా వారితో యెహోవా వ్యవహారాలను గూర్చి పునఃపరిశీలిస్తూ, “వారికి బోధించుటకు నీ యుపకారాత్మను దయచేసితివి” అన్నాడు. (నెహెమ్యా 9:20) మనల్ని వివేకవంతులను చేయడానికి కూడా యెహోవా ఆత్మ మనకు సహాయం చేయగలదు. మీకు వివేచననివ్వమని మీరు యెహోవా ఆత్మ కొరకు ప్రార్థించేటప్పుడు నమ్మకంతో ప్రార్థించండి, ఎందుకంటే యెహోవా “ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.”—యాకోబు 1:5; మత్తయి 7:7-11; 21:22.
వివేచన మరియు అంతర్దృష్టి
అన్యజనులకు సత్యాన్ని ప్రకటించినప్పుడు అపొస్తలుడైన పౌలు వివేచనను చూపించాడు. ఉదాహరణకు, ఒకసారి ఏథెన్సులో ఉండగా, ఆయన “సంచరించుచు” వారి దేవతాప్రతిమలను ‘చూశాడు.’ పౌలు చుట్టూ విగ్రహములు ఉన్నప్పుడు ఆయన ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఆయన సురక్షితమైన విధానాన్ని చేపట్టి నిశ్శబ్దంగా ఉండాలా? లేక పరితాపము కలుగజేస్తున్న ప్రబలివున్న విగ్రహారాధనను బట్టి, మాట్లాడడం ప్రమాదకరం కాగలిగినప్పటికీ, ఆయన సూటిగా మాట్లాడాలా?
పౌలు వివేచనతో ప్రవర్తించాడు. “తెలియబడని దేవునికి” అని వ్రాయబడివున్న బలిపీఠమును ఆయన చూశాడు. పౌలు యుక్తిగా, వారు విగ్రహాల ఎడల కలిగివున్న భక్తిని గుర్తించి, “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు” అనే విషయాన్ని పరిచయం చేసేందుకు ఆ బలిపీఠమును ఒక మార్గంగా ఉపయోగించుకున్నాడు. అవును, వారు ఎరగని దేవుడు యెహోవా! పౌలు అలా విషయంపై వారికున్న శ్రద్ధను గమనించి, అద్భుతమైన సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఫలితమేమిటి? “అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొంద”రితో సహా అనేకమంది ప్రజలు సత్యాన్ని హత్తుకున్నారు. (అపొస్తలుల కార్యములు 17:16-34) వివేచన విషయంలో పౌలు ఎంత మంచి ఉదాహరణగా ఉన్నాడోకదా!
నిస్సందేహంగా, వివేచన సులభంగా లేక సహజంగా రాదు. కాని సహనం, ప్రార్థన, తీవ్ర ప్రయత్నం, జ్ఞానయుక్తమైన సహవాసం, బైబిలు అధ్యయనం మరియు దాన్ని ధ్యానించడం, యెహోవా పరిశుద్ధాత్మపై ఆధారపడడం వంటివాటి ద్వారా మీరు కూడా దాన్ని అలవర్చుకోవచ్చు.