నిజమైన సంతోషం ఎక్కడ కనుగొనబడగలదు?
వస్తుసంపదలను ఆర్జించడం ద్వారా సంతోషాన్ని కనుగొనవచ్చు అని చాలా మంది ప్రజలు భావిస్తారు. మీ విషయమేమిటి? వస్తు సంపద మన సంతోషానికి తప్పకుండా దోహదపడవచ్చు, కానీ సంతోషాన్ని హామీ ఇవ్వదు; లేదా భౌతిక సంబంధమైన విశ్వాసాన్ని పెంపొందించలేదు లేదా ఆత్మీయ అవసరతలను తీర్చలేదు.
కొండ మీద తను చేసిన ప్రసంగంలో, యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.” (మత్తయి 5:3) యేసు ఇలా కూడా అన్నాడు: ‘మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.’—లూకా 12:15.
అనేకులు అక్రమ లైంగిక కార్యకలాపాల్లోనూ, “శరీరకార్యముల”లోనూ పాల్గొని సంతోషించాలని చూస్తారు. (గలతీయులు 5:19-21) అయినప్పటికీ, శారీరక కోరికలకు లొంగిపోవడం నిజమైన శాశ్వతమైన సంతోషాన్నివ్వదు. నిజానికి, అలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు.—1 కొరింథీయులు 6:9, 10.
ఇతరులు తమ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తూ తమలో తామే సంతోషాన్ని వెదుక్కుంటారు. లైబ్రరీలూ బుక్స్టోర్సూ వ్యక్తిగత సహాయం కొరకైన పుస్తకాలతో నిండి ఉన్నాయి. కానీ అలాంటి ప్రచురణలు ప్రజలకు శాశ్వతమైన సంతోషాన్ని తీసుకురావు. అయితే మరి నిజమైన సంతోషాన్ని మనమెక్కడ కనుగొనగలం?
నిజంగా సంతోషంగా ఉండాలంటే, జన్మసిద్ధంగావున్న మన ఆత్మీయ అవసరతను గుర్తెరగాలి. “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు” అని యేసు అన్నాడు. నిజమే, మనమీ అవసరతను గుర్తించి కూడా దాని విషయంలో ఏమీ చేయకపోతే ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు: మారథోన్ రన్నర్ తన పరుగు ముగిసిన తర్వాత నీళ్ళు కావాలన్న తన శరీర అభ్యర్థనకు ప్రతిస్పందించకపోతే ఏం జరుగుతుంది? అతడు త్వరలోనే నిర్జలీకరణాన్ని, మరితర గంభీరమైన పర్యవసానాలను ఎదుర్కోడా? అలాగే, మనం మన ఆత్మీయ పోషణావసరతకు ప్రతిస్పందించకపోతే, చివరికి అత్మీయంగా కృశించిపోతాము. ఆనందాన్నీ సంతోషాన్నీ కోల్పోయేందుకు అది కారణమవుతుంది.
యేసు తన ఆత్మీయ అవసరతను పూర్తిగా గుర్తించి, దేవుని వాక్యాన్ని క్రమంగా పఠించి, ధ్యానించేవాడు. ఆయన పరిశుద్ధ లేఖన భాగాలను సులభంగా తీసి, చదివేవాడు, అలాగే చేయమని ఇతరులకు బోధించేవాడు. (లూకా 4:16-21; ఎఫెసీయులు 4:20, 21ని పోల్చి చూడండి.) యేసు తండ్రి చిత్తాన్ని చేయడాన్ని ఆహారంతో పోల్చాడు కూడా. దేవుని చిత్తాన్ని చేయడం ఆయనకు ఎంతో సంతోషాన్నిచ్చింది.—యోహాను 4:34.
అవును, వస్తుసంపదను సంపాదించడం ద్వారా నిజమైన సంతోషాన్ని పొందలేము; లేదా పతనమైన శరీరాన్ని ప్రీతిపర్చడం ద్వారా సంతోషం కలుగదు. నిజమైన సంతోషం అనేది యథార్థ విశ్వాసంపై మరియు యెహోవా దేవునితోనున్న మంచి సంబంధంపై ఆధారపడిన హృదయ పరిస్థితి. సముచితంగానే, మరి కీర్తన గ్రంథకర్త అయిన దావీదు ఈ విధంగా పాడాడు: “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.”—కీర్తన 144:15బి.
[23వ పేజీలోని చిత్రం]
విశ్వాసమూ మరియు దేవునితో మంచి సంబంధమూ మీకు నిజమైన సంతోషాన్నిస్తాయి