కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 3/15 పేజీలు 12-17
  • హృదయపూర్వకంగా వివేచననభ్యసించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హృదయపూర్వకంగా వివేచననభ్యసించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వివేచన మరియు మన సంభాషణ
  • వివేచన మరియు మన ప్రవర్తన
  • వివేచన మరియు మన మానసిక స్థితి
  • వివేచన మరియు మన కుటుంబం
  • వివేచన మరియు జీవితంలో మన విధానం
  • ఎల్లప్పుడూ వివేచన కొరకు యెహోవావైపు చూడండి
  • ఆత్మీయ వివేచనతో వర్ధిల్లండి
  • మీరు మరింత వివేచనను పెంపొందింపజేసుకోగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • వివేచన మిమ్మల్ని కాపాడనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యేసులా ధైర్యం, వివేచన చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 3/15 పేజీలు 12-17

హృదయపూర్వకంగా వివేచననభ్యసించండి

“యెహోవాయే బుద్ధినిచ్చువాడు; జ్ఞానము వివేచన ఆయన నోటనుండి వచ్చును.”—సామెతలు 2:6, NW.

1. మనం హృదయపూర్వకంగా వివేచనను ఎలా అభ్యసించవచ్చు?

యెహోవా మన మహోపదేశకుడు. (యెషయా 30:20, 21, NW) కాని ఆయన వాక్యమందు బయల్పర్చబడిన “దేవునిగూర్చిన విజ్ఞానము” నుండి ప్రయోజనం పొందడానికి మనమేమి చేయాలి? కొంతమేరకు, మనం ‘హృదయపూర్వకంగా వివేచననభ్యసించాలి’ అంటే, ఈ లక్షణాన్ని సంపాదించుకొని ప్రదర్శించేందుకు హృదయపూర్వక కోరిక కలిగివుండాలి. దీని కొరకు మనము దేవునివైపు చూడాలి, ఎందుకంటే జ్ఞాని ఇలా తెలియజేశాడు: “యెహోవాయే బుద్ధినిచ్చువాడు; జ్ఞానము వివేచన ఆయన నోటనుండి వచ్చును.” (సామెతలు 2:1-6, NW) జ్ఞానము, బుద్ధి మరియు వివేచన అంటే ఏమిటి?

2. (ఎ) జ్ఞానమంటే ఏమిటి? (బి) మీరు బుద్ధిని ఎలా నిర్వచిస్తారు? (సి) వివేచన అంటే ఏమిటి?

2 జ్ఞానము అంటే అనుభవం ద్వారా, గమనించడం ద్వారా, లేక అధ్యయనం ద్వారా పొందిన వాస్తవాల గురించి తెలుసుకొని ఉండడం. బుద్ధి అంటే జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించగల సామర్థ్యం. (మత్తయి 11:19) ఇద్దరు స్త్రీలు ఒకే బాలుని కొరకు అడిగినప్పుడు రాజైన సొలొమోను బుద్ధిని ప్రదర్శించాడు, వివాదాన్ని పరిష్కరించడానికి, తన బిడ్డ ఎడల తల్లికుండే మమకారాన్ని గూర్చిన తన జ్ఞానాన్ని ఆయన ఉపయోగించాడు. (1 రాజులు 3:16-28) వివేచన అంటే “యుక్తాయుక్త పరిజ్ఞాన నిశితత్వం.” అది “ఒక విషయానికి మరో విషయానికి మధ్యనున్న తేడాను గ్రహించేందుకు మెదడుకున్న సామర్థ్యం లేక శక్తి.” (వెబ్‌స్టర్స్‌ యూనివర్సల్‌ డిక్షనరీ) మనం హృదయపూర్వకంగా వివేచనను అభ్యసిస్తే, యెహోవా తన కుమారుని ద్వారా దాన్ని మనకిస్తాడు. (2 తిమోతి 2:1, 7) కాని జీవితంలోని వివిధ అంశాలను వివేచన ఎలా ప్రభావితం చేయగలదు?

వివేచన మరియు మన సంభాషణ

3. సామెతలు 11:12, 13ను మీరెలా వివరిస్తారు, “బుద్ధిలేని” వారిగా ఉండడం అంటే ఏమిటి?

3 “మౌనముగా నుండుటకు మాటలాడుటకు” సమయం ఉందని గుర్తించడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. (ప్రసంగి 3:7) ఈ లక్షణం మనం చెప్పేదాని గురించి జాగ్రత్త కలిగివుండేలా కూడా చేస్తుంది. సామెతలు 11:12, 13 ఇలా తెలియజేస్తుంది: “తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.” అవును, మరో వ్యక్తిని తృణీకరించే పురుషుడైనా లేక స్త్రీయైనా “బుద్ధిలేని” వారే. నిఘంటుకారుడైన విల్‌హెల్మ్‌ గేజేనియస్‌ ప్రకారం, అలాంటి వ్యక్తి “అవగాహన కొరవడినవాడు.” ఆయనకు లేక ఆమెకు చక్కని యుక్తాయుక్త పరిజ్ఞానం ఉండదు, “బుద్ధి” అనే పదోపయోగం అంతరాత్మలోని అనుకూల లక్షణాల కొరతను చూపిస్తుంది. క్రైస్తవులమని చెప్పుకొనేవారు కొండెములు చెప్పడం లేక దూషించడం జరిగేంతగా వ్యర్థ ప్రసంగం చేస్తుంటే, సంఘంలో ఈ అనారోగ్యకరమైన స్థితిని అంతమొందించేందుకు, నియమిత పెద్దలు చర్య తీసుకోవాలి.—లేవీయకాండము 19:16; కీర్తన 101:5; 1 కొరింథీయులు 5:11.

4. ఆంతరంగికమైన సమాచారం గురించి వివేచనగల, నమ్మకమైన క్రైస్తవులు ఏమి చేస్తారు?

4 “బుద్ధిలేని” వారిలా కాకుండా, ‘వివేకముగల’ వ్యక్తులు మౌనముగా ఉండడం సరైనదైనప్పుడు మౌనముగా ఉంటారు. వారు నమ్మకద్రోహం చేయరు. (సామెతలు 20:19) అదుపులేని సంభాషణ హాని కలిగించగలదని ఎరిగి, వివేచనగల వారు “నమ్మకమైన స్వభావము” కలిగివుంటారు. వారు తోటి విశ్వాసుల ఎడల యథార్థంగా ఉండి, వారికి హాని కలిగించగల ఆంతరంగిక విషయాలను బహిర్గతం చేయరు. సంఘానికి సంబంధించిన ఏ విధమైన ఆంతరంగిక సమాచారమైనా వివేచనగల క్రైస్తవులకు తెలిస్తే, వారు ఆ విషయం యెహోవా సంస్థ తన స్వంత మాధ్యమమైన ప్రచురణల ద్వారా బయల్పర్చడం సబబని భావించేవరకు దాన్ని రహస్యంగా ఉంచుతారు.

వివేచన మరియు మన ప్రవర్తన

5. చెడు ప్రవర్తనను ‘బుద్ధిహీనులు’ ఎలా దృష్టిస్తారు, ఎందుకు?

5 వివేచనను ఉపయోగించి, అయుక్తమైన ప్రవర్తనను వారించడానికి బైబిలు సామెతలు మనకు సహాయం చేస్తాయి. ఉదాహరణకు, సామెతలు 10:23 ఇలా చెబుతుంది: “చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది. వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.” చెడు ప్రవర్తన “ఆటగా” ఉన్నవారికి తమ విధానంలోని తప్పు గురించి తెలియదు మరియు అందరూ దేవునికి లెక్క ఒప్పజెప్పవలసి ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు. (రోమీయులు 14:12) అలాంటి ‘బుద్ధిహీనులు’ దేవుడు తమ తప్పును చూడడని భావించేంత మూర్ఖపు తర్కం చేసేవారిగా తయారౌతారు. వారు తమ చర్యల ద్వారా, “దేవుడు [యెహోవా, NW] లేడని” అంటారు. (కీర్తన 14:1-3; యెషయా 29:15, 16) దైవిక సూత్రాల ద్వారా నడిపింపబడనందున, వారికి వివేచన ఉండదు, వారు విషయాల ఎడల యుక్తాయుక్త పరిజ్ఞానాన్ని కల్గివుండలేరు.—సామెతలు 28:5.

6. చెడు ప్రవర్తన ఎందుకు బుద్ధిహీనమైనది, మనకు వివేచన ఉంటే మనం దాన్నెలా దృష్టిస్తాము?

6 “వివేకి” తప్పుడు ప్రవర్తన “ఆట” లేక ఒక క్రీడ కాదని గుర్తిస్తాడు. అది దేవునికి అప్రియమైనదని, ఆయనతో మనకున్న సంబంధాన్ని నాశనం చేయగలదని అతనికి తెలుసు. అలాంటి ప్రవర్తన బుద్ధిహీనమైనది ఎందుకంటే అది ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా చేస్తుంది, వివాహాలను విచ్ఛిన్నం చేస్తుంది, మనస్సుకు శరీరానికి హాని కలిగిస్తుంది, ఆత్మీయత కోల్పోడానికి నడిపిస్తుంది. కాబట్టి మనం హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించి, చెడు ప్రవర్తనను లేక ఏ విధమైన లైంగిక దుర్నీతినైనా వారిద్దాము.—సామెతలు 5:1-23.

వివేచన మరియు మన మానసిక స్థితి

7. కోపం యొక్క శారీరక ప్రభావాలు కొన్ని ఏవి?

7 మనం హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించడం మన మానసిక స్థితిని అదుపు చేసుకోవడానికి కూడా మనకు సహాయం చేస్తుంది. “దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును” అని సామెతలు 14:29 చెబుతుంది. వివేచన గల వ్యక్తి అదుపులేని ఆగ్రహాన్ని నివారించేందుకు కృషి చేయడానికి గల ఒక కారణం ఏమిటంటే, అది అతనిపై శారీరకంగా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అది రక్తపోటును పెంచి, శ్వాస సంబంధ సమస్యలు కలిగించగలదు. కోపం మరియు ఆగ్రహం వంటి భావోద్రేకాలు ఆస్తమా, చర్మ రోగాలు, జీర్ణ సంబంధ సమస్యలు, గడ్డలువంటి బాధలను అధికం చేస్తాయని లేక వాటికి కారణమౌతాయని వైద్యులు పేర్కొన్నారు.

8. అసహనంగా ఉండడం దేనికి దారి తీయగలదు, కాని ఈ విషయంలో వివేచన మనకెలా సహాయం చేయగలదు?

8 మనం వివేచనను ఉపయోగించి, “దీర్ఘశాంతము” కలిగివుండాలన్నది కేవలం మన ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా ఉండడానికి మాత్రమే కాదు. అసహనంగా ఉండడం మనం విచారించేలాంటి మూర్ఖపు చర్యలకు దారితీయగలదు. వివేచన అదుపులేని సంభాషణ ద్వారా లేక దురుసైన ప్రవర్తన ద్వారా ఏమి సంభవించగలదో మనం పరిశీలించేలా చేసి తద్వారా, అవివేకమైనదేదైనా చేయడం ద్వారా “మూఢత్వమును బహుమానముగా” పొందకుండా కాపాడుతుంది. ప్రాముఖ్యంగా, మనం చక్కని యుక్తాయుక్త పరిజ్ఞానం కలిగి ఉండకుండేలా ఆగ్రహం మన ఆలోచనా విధానాన్ని తలక్రిందులు చేయగలదని గుర్తించడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. దైవిక చిత్తాన్ని చేయగల మన సామర్థ్యాన్ని, దేవుని నైతిక సూత్రాలకు అనుగుణంగా జీవించగల మన సామర్థ్యాన్ని ఇది కుంటుపరుస్తుంది. అవును, అదుపులేని ఆగ్రహం తెచ్చుకోవడం ఆత్మీయంగా హాని కలిగిస్తుంది. వాస్తవానికి, “క్రోధములు” దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోకుండా చేసే అసహ్యకరమైన “శరీరకార్యముల” క్రింద లెక్కించబడ్డాయి. (గలతీయులు 5:19-21) కాబట్టి వివేచన గల క్రైస్తవులముగా మనం ‘వినడానికి వేగిరపడేవారిగా, మాటలాడడానికి నిదానించేవారిగా, కోపించడానికి నిదానించేవారిగా’ ఉందాము.—యాకోబు 1:19.

9. వివేచన మరియు సహోదర ప్రేమ విభేదాలను పరిష్కరించుకోవడానికి మనకెలా సహాయం చేయగలవు?

9 మనకు కోపం వచ్చినా, వివాదాన్ని నివారించడానికి మనం మౌనంగా ఉండాలని వివేచన మనకు సూచించవచ్చు. “మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు. శాంతగుణముగలవాడు వివేకముగలవాడు” అని సామెతలు 17:27 చెబుతుంది. బాధ కలిగించేదేదైనా అనాలనే కోరికను అదుపు చేసుకోవలసిన అవసరతను గుర్తించడానికి వివేచన మరియు సహోదర ప్రేమ మనకు సహాయం చేస్తాయి. అప్పటికే ఆగ్రహం తెచ్చుకొని ఉంటే, క్షమాపణలు చెప్పుకొని మార్పులు చేసుకోవడానికి ప్రేమ మరియు దీనత్వం మనల్ని పురికొల్పుతాయి. కాని ఎవరైనా మీకు అభ్యంతరం కలిగించారనుకోండి. అప్పుడు మనం సాత్వీకంగా దీనంగా, శాంతిని పెంపొందింపజేయాలనే ప్రాథమిక ఉద్దేశంతో ఆయనతోనే మాట్లాడుదాము.—మత్తయి 5:23, 24; 18:15-17.

వివేచన మరియు మన కుటుంబం

10. కుటుంబ జీవితంలో బుద్ధి మరియు వివేచన ఏ పాత్రను నిర్వహిస్తాయి?

10 కుటుంబ సభ్యులు బుద్ధిని, వివేచనను చూపించవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ లక్షణాలు ఒక గృహాన్ని నిర్మిస్తాయి. సామెతలు 24:3, 4, NW, ఇలా చెబుతుంది: “బుద్ధివలన ఇల్లు కట్టబడును. వివేచనవలన అది స్థిరపరచబడును. జ్ఞానముచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.” బుద్ధి మరియు వివేచన విజయవంతమైన కుటుంబ జీవితానికి చక్కని ఇటుకలవంటివి. క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లల భావాలను, ఆసక్తులను తెలుసుకోవడానికి వివేచన వారికి సహాయం చేస్తుంది. వివేచనగల వ్యక్తి సంభాషించగలుగుతాడు, తన వివాహజత యొక్క భావాలను తలంపులను విని గ్రహించగలుగుతాడు.—సామెతలు 20:5.

11. వివేచనగల వివాహిత స్త్రీ ‘తన ఇంటిని ఎలా నిర్మించుకోగలదు’?

11 సంతోషకరమైన కుటుంబ జీవితానికి బుద్ధి మరియు వివేచన నిస్సందేహంగా అత్యావశ్యకం. ఉదాహరణకు, సామెతలు 14:1 ఇలా చెబుతుంది: “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును. మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును.” బుద్ధి, వివేచన గల వివాహిత స్త్రీ తన భర్తకు సరైన విధంగా విధేయురాలై కుటుంబ క్షేమం కొరకు కష్టపడుతూ తద్వారా తన కుటుంబాన్ని నిర్మించుకోవడానికి దోహదపడుతుంది. ఆమె ‘ఇంటిని నిర్మించే’ ఒక విషయం ఏమిటంటే ఆమె ఎల్లప్పుడూ తన భర్త గురించి మంచిగా మాట్లాడుతూ, ఆయన ఎడల ఇతరులకున్న గౌరవాన్ని అధికం చేస్తుంది. సామర్థ్యమూ వివేచనా కలిగి, యెహోవా ఎడల భక్తితో కూడిన భయంగల భార్య తనకు మెప్పును తెచ్చుకుంటుంది.—సామెతలు 12:4; 31:28, 30.

వివేచన మరియు జీవితంలో మన విధానం

12. ‘బుద్ధిలేనివారు’ బుద్ధిహీనతను ఎలా దృష్టిస్తారు, ఎందుకు?

12 మన వ్యవహారాలన్నిటిలో సరైన విధానాన్ని కలిగివుండడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. సామెతలు 15:21 నందు ఇది సూచించబడింది, అదిలా చెబుతుంది: “బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము. వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.” ఈ సామెతను మనమెలా అర్థం చేసుకోవాలి? మూర్ఖపు పని లేక బుద్ధిహీనత తెలివిలేని పురుషులకు, స్త్రీలకు, యౌవనులకు ఆనందంగా ఉంటుంది. మంచి ఉద్దేశం లేనందువల్ల వారు ‘బుద్ధిహీనులై’ ఉన్నారు, వారు ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే వారు మూర్ఖత్వంలో ఆనందిస్తారు.

13. నవ్వు మరియు చపలత్వం గురించి సొలొమోను ఏమి వివేచించాడు?

13 వివేచనగల ఇశ్రాయేలు రాజైన సొలొమోను అల్పమైనవి ప్రయోజనకరమైనవి కావని తెలుసుకున్నాడు. ఆయనిలా అంగీకరించాడు: “కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును;—నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను. నవ్వుతో—నీవు వెఱ్ఱిదానవనియు, సంతోషముతో—నీచేత కలుగునదేమియనియు నేనంటిని.” (ప్రసంగి 2:1, 2) సొలొమోను వివేచనగల వ్యక్తిగా సంతోషం మరియు నవ్వు మాత్రమే సంతృప్తికరమైనవి కావని, ఎందుకంటే అవి నిజమైన, నిరంతరం నిలిచే ఆనందాన్ని తీసుకురావని కనుగొన్నాడు. నవ్వు మనం మన సమస్యలను తాత్కాలికంగా మరచిపోవడానికి సహాయం చేయవచ్చు, కాని ఆ తర్వాత అవి మరింత అధిక స్థాయికి చేరవచ్చు. సొలొమోను సరిగ్గానే నవ్వు “వెఱ్ఱి”దని అనగలిగాడు. ఎందుకు? ఎందుకంటే ఆలోచనలేని నవ్వు చక్కని యుక్తాయుక్త పరిజ్ఞానాన్ని మరుగు చేస్తుంది. అది మనం ఎంతో గంభీరమైన విషయాలను తేలికగా తీసుకునేలా చేయవచ్చు. ఆస్థాన విదూషకుని మాటలు చేష్టలకు సంబంధించిన ఆనందం ప్రయోజనకరమైనదేదైనా ఉత్పత్తి చేయగలదని చెప్పలేము. నవ్వుకు సంతోషానికి సంబంధించి సొలొమోను కనుగొన్న వాటి మూలభావాన్ని వివేచించడం మనం “దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించు” వారిగా ఉండకుండా మనకు సహాయం చేస్తుంది.—2 తిమోతి 3:1, 4.

14. ‘వివేచనగల వ్యక్తి చక్కగా ఎలా ప్రవర్తిస్తాడు’?

14 వివేచనగల వ్యక్తి ‘చక్కగా ఎలా ప్రవర్తించగలడు’? ఆత్మీయ వివేచన మరియు దైవిక సూత్రాలను అన్వయించుకోవడం ప్రజలను సరైన, చక్కని ప్రవర్తన కలిగివుండేలా నడిపిస్తుంది. బయింగ్‌టన్‌ అనువాదం నిక్కచ్చిగా ఇలా చెబుతుంది: “మెదడులేని వ్యక్తికి మూర్ఖత్వమే పరమానందం, కాని తెలివిగల వ్యక్తి తిన్నగా వెళతాడు.” “వివేచనగల వ్యక్తి” తన పాదాలకు మార్గాలను సరాళం చేసుకుని, జీవితంలో దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడం మూలంగా తప్పొప్పుల మధ్య తేడాను కనుగొనగలుగుతాడు.—హెబ్రీయులు 5:14; 12:12, 13.

ఎల్లప్పుడూ వివేచన కొరకు యెహోవావైపు చూడండి

15. సామెతలు 2:6-9 నుండి మనం ఏమి నేర్చుకుంటాము?

15 జీవితంలో సరైన విధానాన్ని అనుసరించడానికి, మనమందరం మన అపరిపూర్ణతను గుర్తించి, ఆత్మీయ వివేచన కొరకు యెహోవావైపు చూడవలసిన అవసరం ఉంది. సామెతలు 2:6-9, NW ఇలా చెబుతుంది: “యెహోవాయే బుద్ధినిచ్చువాడు. జ్ఞానము వివేచన ఆయన నోటనుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.”—యాకోబు 4:6 పోల్చండి.

16. యెహోవాకు వ్యతిరేకమైన బుద్ధి, వివేచన, లేక ఉపదేశం ఏవీ ఎందుకు లేవు?

16 యెహోవాపై మనం ఆధారపడి ఉన్నామన్న విషయాన్ని గుర్తించి, ఆయన వాక్యాన్ని లోతుగా పరిశీలించడం ద్వారా మనం ఆయన చిత్తాన్ని వివేచించడానికి దీనంగా కృషి చేద్దాము. ఆయన సంపూర్ణ భావంలో బుద్ధి కలిగివున్నా, ఆయన ఉపదేశం ఎల్లప్పుడూ ప్రయోజనకరమైనదే. (యెషయా 40:13; రోమీయులు 11:34) వాస్తవానికి, ఆయనకు వ్యతిరేకమైన ఏ ఉపదేశమైనా విలువలేనిదే. సామెతలు 21:30, NW ఇలా చెబుతుంది: “యెహోవాకు విరోధమైన బుద్ధియైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.” (సామెతలు 19:21 పోల్చండి.) ‘నమ్మకమైనవాడు బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా అందజేయబడిన ప్రచురణల సహాయంతో చేసిన దేవుని వాక్య అధ్యయనం ద్వారా పెంపొందించుకొనబడిన ఆత్మీయ వివేచన మాత్రమే మనం జీవితంలో సరైన మార్గాన్ని అనుసరించడానికి మనకు సహాయం చేస్తుంది. (మత్తయి 24:45-47) కాబట్టి మనం, వ్యతిరేకమైన ఉపదేశం ఎంత నమ్మదగినదిగా అనిపించినప్పటికీ అది ఆయన వాక్యంతో సమానం కాలేదని తెలుసుకుని, మన జీవన మార్గాన్ని యెహోవా ఉపదేశానికి అనుగుణంగా మలచుకుందాము.

17. తప్పుడు ఉపదేశం ఇవ్వడంవల్ల కలిగే ఫలితం ఏమై ఉండవచ్చు?

17 ఉపదేశం ఇచ్చే వివేచనగల క్రైస్తవులు, ఆ ఉపదేశం దేవుని వాక్యంపై సంపూర్ణంగా ఆధారపడి ఉండాలని, ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు బైబిలు పఠనం మరియు ధ్యానం అవసరమని గుర్తించాలి. (సామెతలు 15:28) గంభీరమైన విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు తప్పుగా సమాధానం ఇవ్వబడితే, గొప్ప నష్టం సంభవించగలదు. గనుక, క్రైస్తవ పెద్దలకు ఆత్మీయ వివేచన అవసరం మరియు తోటి విశ్వాసులకు ఆత్మీయ సహాయాన్ని అందజేసేందుకు ప్రయత్నించేటప్పుడు యెహోవా నడిపింపు కొరకు ప్రార్థించాలి.

ఆత్మీయ వివేచనతో వర్ధిల్లండి

18. సంఘంలో ఏదైనా సమస్య తలెత్తితే, మనం మన ఆత్మీయ సమతూకాన్ని కాపాడుకోవడానికి వివేచన మనకెలా సహాయం చేయగలదు?

18 యెహోవాను ప్రీతిపర్చేందుకు మనకు ‘అన్ని విషయములయందు వివేచన’ అవసరము. (2 తిమోతి 2:7) బైబిలును అత్యాసక్తితో పఠించడం, దేవుని ఆత్మ మరియు సంస్థ యొక్క నడిపింపుతో పొందిక కలిగివుండడం, మనల్ని తప్పు మార్గంలోకి నడిపించగల పరిస్థితులనెదుర్కొన్నప్పుడు ఏమి చేయాలనేది వివేచించడానికి మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, సంఘంలో ఏదైనా మనం జరగాలని అనుకున్నట్లు జరగలేదనుకోండి. యెహోవా ప్రజలతో సహవసించడాన్ని నిలిపివేయడానికి, దేవుని సేవ చేయడాన్ని మానుకునేందుకు ఏ కారణమూ లేదని తెలుసుకోవడానికి ఆత్మీయ వివేచన మనకు సహాయం చేస్తుంది. యెహోవా సేవ చేసేందుకు మనకు గల ఆధిక్యత గురించి, మనం ఆనందించే ఆత్మీయ స్వాతంత్ర్యం గురించి, రాజ్య ప్రచారకులుగా మనం మన సేవ నుండి పొందగల ఆనందం గురించి ఆలోచించండి. సరైన అభిప్రాయాన్ని కలిగివుండడానికి, మనం దేవునికి సమర్పించుకున్నామని ఇతరులు ఏమి చేసినప్పటికీ ఆయనతో మనకు గల సంబంధాన్ని గొప్పగా ఎంచాలని గుర్తించడానికి ఆత్మీయ వివేచన మనకు సహాయం చేస్తుంది. ఒక సమస్యతో వ్యవహరించడానికి మనం దైవపరిపాలనా సంబంధంగా చేయగలిగింది ఏమీ లేకపోతే, పరిస్థితిని యెహోవా చక్కబరచాలని మనం సహనంతో ఎదురు చూడవలసిన అవసరం ఉంది. విడిచిపెట్టే బదులు, లేక కృంగుదలకు తావిచ్చే బదులు మనం “దేవునియందు నిరీక్షణ యుంచు”దాము.—కీర్తన 42:5, 11.

19. (ఎ) ఫిలిప్పీయుల కొరకు పౌలు చేసిన ప్రార్థన యొక్క సారాంశమేమిటి? (బి) మనం దేనినైనా సంపూర్ణంగా అర్థం చేసుకోకపోతే వివేచన మనకెలా సహాయం చేయగలదు?

19 దేవుని ఎడల ఆయన ప్రజల ఎడల యథార్థంగా ఉండడానికి ఆత్మీయ వివేచన మనకు సహాయం చేస్తుంది. ఫిలిప్పీనందలి క్రైస్తవులకు పౌలు ఇలా చెప్పాడు: “మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండుకొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.” (ఫిలిప్పీయులు 1:9, 10) సరిగ్గా విశ్లేషించడానికి, మనకు ‘తెలివి, సకలవిధములైన అనుభవజ్ఞానము’ అవసరం. ఇక్కడ ‘అనుభవజ్ఞానము’ అని అనువదించబడిన గ్రీకు పదం “సున్నితమైన నైతిక భావన” అనే భావాన్నిస్తుంది. మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు, దానికి దేవునితోను క్రీస్తుతోను గల సంబంధాన్ని తెలుసుకోవాలని, యెహోవా వ్యక్తిత్వాన్ని ఏర్పాట్లను అదెలా ఉన్నతపరుస్తుందనేదాని గురించి ధ్యానించాలని మనం కోరుకుంటాము. ఇది మన వివేచనను, యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు మన కొరకు చేసిన దాని ఎడల మెప్పును పెంపొందింపజేస్తుంది. మనకు ఏదైనా సంపూర్ణంగా అర్థం కాకపోతే, దేవుని గురించి క్రీస్తు గురించి దైవిక సంకల్పం గురించి మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయాలన్నిటిలో మనకున్న విశ్వాసాన్ని మనం కోల్పోకూడదని గుర్తించడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది.

20. మనం ఆత్మీయ వివేచనతో ఎలా వర్ధిల్లుతాము?

20 మనం మన తలంపులు, చర్యలు ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో పొందిక కల్గివుండేలా చూసుకుంటే మనం ఆత్మీయ వివేచనతో వర్ధిల్లుతాము. (2 కొరింథీయులు 13:5) దీన్ని నిర్మాణాత్మకమైన విధంగా చేయడం మనం దీనంగా ఉండడానికి, మొండి పట్టుదల కల్గివుండకుండా మరియు ఇతరుల గురించి విమర్శనాత్మకంగా ఉండకుండా మనకు సహాయం చేస్తుంది. సరిదిద్దబడడం నుండి ప్రయోజనం పొందడానికి, ఎక్కువ ప్రాముఖ్యతగల విషయాల గురించి శ్రద్ధ కలిగివుండడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. (సామెతలు 3:7) కాబట్టి మనం యెహోవాను ప్రీతిపర్చాలనే కోరికతో, ఆయన వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానంతో నింపబడడానికి కృషి చేద్దాము. తప్పొప్పులను వివేచించడానికి, నిజంగా ప్రాముఖ్యమైనదేదో నిశ్చయించుకోవడానికి, యెహోవాతో మనకుగల అమూల్యమైన సంబంధానికి యథార్థంగా కట్టుబడివుండడానికి ఇది మనకు దోహదపడుతుంది. మనం హృదయపూర్వకంగా వివేచనను అభ్యసిస్తే ఇదంతా సాధ్యమౌతుంది. అయినప్పటికీ, మరింకేదో అవసరం. వివేచన మనల్ని కాపాడేందుకు మనం అనుమతించాలి.

మీరెలా ప్రతిస్పందిస్తారు?

◻ మనం హృదయపూర్వకంగా వివేచనను ఎందుకు అభ్యసించాలి?

◻ వివేచన మన సంభాషణను, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేయగలదు?

◻ వివేచన మన మానసిక స్థితిపై ఏ ప్రభావాన్ని చూపగలదు?

◻ మనం వివేచన కొరకు ఎల్లప్పుడూ యెహోవా వైపు ఎందుకు చూడాలి?

[13వ పేజీలోని చిత్రం]

మన మానసిక స్థితిని అదుపు చేసుకోవడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది

[15వ పేజీలోని చిత్రం]

వివేచనగల రాజైన సొలొమోను అల్పమైనవి నిజంగా సంతృప్తికరమైనవి కావని గుర్తించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి