మరింత సంపూర్ణంగా సేవచేయాలని మీరు ఆకాంక్షిస్తున్నారా?
“నాకు యెహోవా మీద కోపం వచ్చింది” అని లారా చెబుతోంది. “నేను నా పయినీర్ సేవలో కొనసాగగలిగేలా మా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆయన మాకు సహాయం చేయాలని నేను ఎడతెగక ప్రార్థించాను, కానీ లాభం లేకపోయింది. నేను చివరికి పయినీరింగ్ వదిలేయాల్సి వచ్చింది. పయినీర్ సేవలో ఉండగలిగిన వాళ్లని చూసి నేను అసూయపడ్డానన్న సంగతి వాస్తవమే.”
యెహోవాసాక్షుల ఒక సంఘంలో పరిచర్య పరిచారకుడైన మైకల్ విషయాన్ని కూడా పరిశీలించండి. ఆయన అధ్యక్షుడవ్వాలని అపేక్షించాడు. (1 తిమోతి 3:1) అనేక సంవత్సరాల వరకూ ఆయన కోరిక నెరవేరకపోవడంతో, ఆయనకు ఎంత విసుగు కలిగిందంటే ఆయనిక ఆ ఆధిక్యతను అపేక్షించడం మానుకున్నాడు. “నేనంత నిరాశను, దుఃఖాన్ని మరోసారి భరించలేను” అని ఆయన చెబుతున్నాడు.
మీకూ అలాంటి అనుభవమే ఎదురైందా? మీకు ఎంతో ప్రియమైన ఒక దైవపరిపాలనా ఆధిక్యతను మీరు వదులుకోవలసి వచ్చిందా? ఉదాహరణకు, ఒక పయినీరుగా, ఒక పూర్తికాల రాజ్య ప్రచారకునిగా సేవ చేయడాన్ని మీరు మానుకోవలసి వచ్చిందా? లేక ఇతరులకు ఇవ్వబడిన కొన్ని సంఘ బాధ్యతలను మీరు ఆకాంక్షిస్తున్నారా? బేతేలులో లేక ఒక మిషనరీగా సేవ చేయాలని మీరు ఇష్టపడుతుండవచ్చు, మీ పరిస్థితులు అందుకు అనుమతించకపోవచ్చు.
“కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును” అని సామెతల గ్రంథం అంగీకరిస్తుంది. (సామెతలు 13:12) మీరు ఏ ఆధిక్యతల కొరకు నిరీక్షించారో వాటినే ఇతరులు పొందితే ప్రాముఖ్యంగా పరిస్థితి అలా ఉండవచ్చు. అలాంటి నిరాశలను ఎదుర్కొన్న వారికి దేవుని వాక్యం సమాచారాన్ని, ఆదరణను మరియు నిరీక్షణను అందిస్తుందా? అవును, అందిస్తోంది. నిజానికి, 84వ కీర్తన యెహోవా సేవ విషయంలో అదేవిధంగా తీరని కోరికలను కలిగివున్న దేవుని సేవకుని భావాలను వ్యక్తపరుస్తుంది.
ఒక లేవీయుని గుణగ్రహణ
ఎనభైనాలగవ కీర్తనను స్వరకల్పన చేసిన కోరహు కుమారులు యెహోవా ఆలయంలో సేవ చేసే లేవీయులు, వారు తమ సేవాధిక్యతలను ఉన్నతంగా పరిగణించారు. వారిలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.”—కీర్తన 84:1, 2.
యెహోవా ఆలయంలో సేవ చేయాలని ఈ లేవీయుడు ఎంతగా ఆకాంక్షించాడంటే, యెరూషలేముకు వెళ్లే మార్గంలోని మామూలు దృశ్యాలు కూడా ఆయనకు ఆకర్షణీయంగా కనిపించాయి. “వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు” అని ఆయన అంటున్నాడు. (కీర్తన 84:6) అవును, సాధారణంగా ఎండిన నేల కూడా ఆయనకు పచ్చిక బయలువలె అనిపించింది.
కీర్తనల గ్రంథకర్త యాజక వర్గానికి చెందని లేవీయుడు గనుక, ఆయన ఆరు నెలలకు ఒకసారి ఒక వారం రోజులు మాత్రమే ఆలయంలో సేవ చేయగలిగేవాడు. (1 దినవృత్తాంతములు 24:1-19; 2 దినవృత్తాంతములు 23:8; లూకా 1:5, 8, 9) ఆయన తన మిగిలిన సమయాన్ని లేవీయుల నగరాల్లో ఒకదానిలో ఉన్న తన ఇంట్లో గడిపేవాడు. కాబట్టి ఆయనిలా పాడాడు: “సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.” (కీర్తన 84:3) ఆలయంలో మరింత శాశ్వతమైన స్థావరాన్ని కలిగివున్న పిచ్చుకవలె ఆ లేవీయుడు ఉండగలిగితే ఆయన ఎంత ఆనందించి ఉండేవాడో!
తాను ఆలయంలో తరచుగా సేవ చేయలేనందుకు ఆ లేవీయుడు కలత చెంది ఉండేవాడే. అయితే, తనకు వీలైనంత తాను చేయగలుగుతున్నందుకు ఆయన సంతోషించాడు, యెహోవాకు పూర్ణహృదయంతో భక్తిని ప్రదర్శించడం యోగ్యమైనదని ఆయన నిజంగా గుర్తించాడు. తనకున్న సేవాధిక్యతలతో సంతృప్తి చెంది ఉండేందుకు ఈ నమ్మకస్థుడైన లేవీయునికి ఏది సహాయం చేసింది?
సంతృప్తి కలిగివుండడాన్ని నేర్చుకోండి
“నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము” అని ఆ లేవీయుడు అంటున్నాడు. (కీర్తన 84:10) యెహోవా గృహంలో ఒక దినాన్ని గడపడమైనా గొప్ప ఆధిక్యతేనని ఆయన గుణగ్రహించాడు. మరి ఆ లేవీయుడు ఆలయంలో ఒకటికంటే ఎన్నో ఎక్కువ దినాలు సేవచేయగలడు. తనకున్న ఆధిక్యతలను గురించిన సంతృప్తి ఆయన ఆనందంతో పాడేలా చేసింది.
మన విషయమేమిటి? మనం మన దీవెనలను లెక్కిస్తామా లేక యెహోవా సేవలో మనకు ఇదివరకే ఉన్న వాటిని మనం మర్చిపోతున్నామా? తన ఎడల వారికిగల భక్తినిబట్టి, యెహోవా తన ప్రజలకు ఎన్నో ఆధిక్యతలను మరియు బాధ్యతలను అప్పగించాడు. అధ్యక్షత, కాపుదల మరియు బోధనకు సంబంధించిన బరువైన బాధ్యతలు, అలాగే పూర్తికాల సేవలోని వివిధ అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే యెహోవా ఆరాధనకు సంబంధించిన ఇతర ప్రశస్తమైన సంగతులు కూడా అందులో ఇమిడివున్నాయి.
ఉదాహరణకు, క్రైస్తవ పరిచర్యను పరిశీలించండి. అపొస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించే మన ఆధిక్యతను, మనం “మంటి ఘటములలో” “ఐశ్వర్యము”ను కలిగి ఉండటానికి పోల్చాడు. (2 కొరింథీయులు 4:7) మీరు అలాంటి సేవను విలువైన సంపదగా పరిగణిస్తారా? రాజ్య ప్రకటనా కార్యకలాపానికి నాయకత్వం వహించిన యేసుక్రీస్తు విషయాలను అదే విధంగా పరిగణించాడు, అలా ఆయన మనకు మాదిరినుంచాడు. (మత్తయి 4:17) “ఈ పరిచర్య పొందినందున . . . అధైర్యపడము” అని పౌలు అన్నాడు.—2 కొరింథీయులు 4:1.
క్రైస్తవ కూటాలు కూడా, తేలికగా తీసుకోకూడని ఒక పవిత్రమైన ఏర్పాటై ఉన్నాయి. మన కూటాల్లో, మనము ప్రాముఖ్యమైన ఉపదేశాన్ని మరియు అవసరమైన సహవాసాన్ని పొందుతాము. కూటాల్లో క్రమంగా వ్యాఖ్యానించడం ద్వారా, కార్యక్రమంలో ఇతర విధాలుగా పాల్గొనడం ద్వారా మనం మన విశ్వాసాన్ని మరియు నిరీక్షణను కూడా బహిరంగంగా వ్యక్తీకరించవచ్చు. (హెబ్రీయులు 10:23-25) మన కూటాలు వాస్తవంగా విలువైన ఏర్పాటైయున్నాయి!
ముందు ప్రస్తావించబడిన మైకల్ ఈ దీవెనలను ఎంతో విలువైనవిగా ఎంచి వాటినెంతో మెచ్చుకున్నాడు. అయితే ఒక పెద్దగా సేవ చేయలేకపోతున్నాననే ఆయన నిరాశ, ఆ దీవెనల ఎడల ఆయనకున్న మెప్పును తాత్కాలికంగా మసకబారేలా చేసింది. వాటిపై మళ్లీ కేంద్రీకరించడం ద్వారా, ఆయన తన సమతౌల్యాన్ని తిరిగి పొందగలిగాడు మరియు యెహోవా చర్య తీసుకునేంత వరకూ సహనంతో ఎదురుచూడగలిగాడు.
ఓ ఫలానా ఆధిక్యతను కలిగిలేనందుకు అసంతృప్తిగా భావించే బదులు, కీర్తనల గ్రంథకర్త చేసిన విధంగా యెహోవా మనలను ఆశీర్వదిస్తున్న మార్గాలను మనం పునఃపరిశీలించుకోవడం మంచిది.a మనం కొన్ని సంగతులనే చూడగల్గుతుంటే, మన ఆధిక్యతలను మరియు ఆయన మనలను దీవిస్తున్న మార్గాలను, తన ఘనత కొరకు మనలను ఉపయోగించుకుంటున్న మార్గాలను మనం చూసేందుకు మన కన్నులను తెరువమని మనం యెహోవాను అడుగుతూ మళ్లీ చూడవలసిన అవసరముంది.—సామెతలు 10:22.
అధ్యక్షుని పదవి వంటి ప్రత్యేక ఆధిక్యతలకు ప్రత్యేక యోగ్యతలు అవసరమనే విషయాన్ని గుర్తించడం కూడా చాలా ప్రాముఖ్యం. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9) కాబట్టి మనం సరి చేసుకోవలసిన రంగాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తూ మనలను మనం పరీక్షించుకొని ఆ తర్వాత అభివృద్ధి చేసుకునేందుకు తీవ్రమైన కృషి చేయాలి.—1 తిమోతి 4:12-15.
నిరుత్సాహం చెందకండి
మనం ఏదైనా సేవాధిక్యతను పొందకపోతే, అలా పొందిన వారంటేనే యెహోవాకు ఎక్కువ ప్రేముందని లేక ఆయన మనకు మంచిది ఇవ్వకుండా దాచుతున్నాడని మనం అనుకోనవసరం లేదు. ఆ ఇతరులు దైవపరిపాలనా నియామకం ద్వారా కాకుండా మానవ పక్షపాతం వలన అయోగ్యంగా తమ ఆధిక్యతలను పొందారని మనం అసూయతో అనుకోకూడదు. అలాంటి ఆలోచనలను గురించి తలపోయటం, అసూయకు, కలతకు లేక మనం పూర్తిగా వదలుకునేందుకు దారితీయవచ్చు.—1 కొరింథీయులు 3:3; యాకోబు 3:14-16.
మొదట్లో ప్రస్తావించబడిన లారా సేవ చేయడం మానుకోలేదు. ఆమె తన కోపము మరియు అసూయా భావాలను తొలగించుకోగలిగింది. తాను పయినీర్ సేవ చేయలేకపోతున్నందుకు తనలో కలుగుతున్న ప్రతికూల భావాలను అధిగమించడానికి సహాయం కొరకు లారా దేవునికి పదే పదే ప్రార్థన చేసింది. ఆమె సంఘంలోని యోగ్యులైన వ్యక్తులనుండి మద్దతును కూడా కోరింది, అలా దేవుడు తనను ప్రేమిస్తున్నాడన్న నిశ్చయతను వారి ద్వారా పొందింది. “యెహోవా నాకు మనశ్శాంతినిచ్చాడు” అని ఆమె చెబుతుంది. “నేను నా భర్త ఇప్పుడు పయినీర్ సేవ చేయలేకపోయినప్పటికీ, మేము అప్పటి మధురస్మృతులను జ్ఞాపకం చేసుకుంటాము, అప్పుడు మాకు కలిగిన అనుభవాలనుండి శక్తిని పొందుతాము. తన పయినీర్ సేవలో మా అబ్బాయికి మేము సహాయం కూడా చేస్తున్నాం.” లారా ఇప్పుడు సంతృప్తిని కలిగినదై తమ పయినీర్ సేవలో “సంతోషించు వారితో సంతోషించ”గలుగుతోంది.—రోమీయులు 12:15.
సాధించగల లక్ష్యాలను ఏర్పరచుకోండి
మనకు ప్రస్తుతమున్న సేవాధిక్యతలతో సంతృప్తి కలిగివుండడమంటే, మనం అదనపు దైవపరిపాలనా లక్ష్యాలను ఏర్పరచుకోవడం మానుకోవాలని అర్థం కాదు. పరలోక పునరుత్థానాన్ని గురించి చర్చిస్తూ, “ముందున్న వాటికొరకై వేగిరపడుచు” ఉండటాన్ని గురించి పౌలు మాట్లాడాడు. ఆయనిలా కూడా అన్నాడు: “ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.” (ఫిలిప్పీయులు 3:13-16) దైవపరిపాలనా లక్ష్యాలు మనం వేగిరపడుతూ ఉండేందుకు మనకు సహాయం చేయగలవు. అయితే, వాటిని వాస్తవికంగా ఉంచుకోవడమే ఒక సవాలు.
వాస్తవికమైన లక్ష్యాలు సహేతుకమైనవి, వాటిని సాధించడం కూడా సాధ్యమే. (ఫిలిప్పీయులు 4:5) అనేక సంవత్సరాల కష్టతరమైన పని అవసరమయ్యే లక్ష్యం అవాస్తవికమైనదని దీని అర్థం కాదు. ఉప లక్ష్యాల లేక చర్యల పరంపరను ఏర్పరచుకోవడం ద్వారా అలాంటి దీర్ఘకాల లక్ష్యాలను క్రమంగా చేరవచ్చు. ఆత్మీయ పురోభివృద్ధికి ఇవి మైలురాళ్లుగా పని చేయగలవు. ఒక్కో చర్యను విజయవంతంగా ముగించడం మార్గంలో నిరుత్సాహాన్ని కాదు గానీ సంతృప్తినే కలిగిస్తుంది.
చక్కని సమతౌల్యం
అయితే, మన పరిస్థితులు మరియు పరిమితుల కారణంగా మనం కొన్ని ఆధిక్యతలను అందుకోలేక పోవచ్చనే విషయాన్ని గుర్తించడం ప్రాముఖ్యం. అలాంటి వాటిని లక్ష్యాలుగా ఏర్పరచుకోవడం నిరాశానిస్పృహలకే దారి తీస్తుంది. అలాంటి లక్ష్యాలను కనీసం కొంత సమయం వరకైనా ప్రక్కనబెట్టాలి. దైవిక సంతృప్తి కొరకు ప్రార్థిస్తే మరియు యెహోవా చిత్తాన్ని చేయడం మన ముఖ్యమైన పనిగా చేసుకుంటే అలా చేయడం కష్టతరంగా ఉండదు. మనం ఆధిక్యతల కొరకు యోగ్యులం కావాలనుకుంటున్నప్పుడు యెహోవా మహిమే ముఖ్యమైన విషయమవ్వాలి గానీ మన వ్యక్తిగత సాఫల్యాల గుర్తింపు ముఖ్యమైన విషయం కాకూడదు. (కీర్తన 16:5, 6; మత్తయి 6:33) బైబిలు సముచితంగా మనకిలా చెబుతుంది: “నీ పనుల భారము యెహోవామీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.”—సామెతలు 16:3.
ఎనభైనాల్గవ కీర్తనను పరిశీలించడంలో, సేవాధిక్యతల ఎడల కీర్తనల గ్రంథకర్త అలాంటి దృక్పథాన్నే వ్యక్తం చేశాడని మనం చూడగలము, యెహోవా ఆయనకు మెండైన దీవెనలిచ్చాడు. అంతేకాకుండా, ఈ కీర్తన నేటి వరకూ కూడా యెహోవా ప్రజలకు ప్రయోజనాన్ని కలిగిస్తూనే ఉంది.
యెహోవాపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడటం ద్వారా, అదనపు ఆధిక్యతల కొరకైన మీ ఆకాంక్షను మీరు ఇప్పటికే కలిగివున్న వాటి ఎడలగల సంతృప్తితో సమతూకం చేయవచ్చు. ఇంకా ఎక్కువ చేయాలన్న కోరిక, మీరు ఇప్పుడు కలిగివున్న వాటి ఎడల మెప్పును మరియు యెహోవాను నిరంతరం సేవించే ఆనందాన్ని మీనుండి దొంగిలించనివ్వకండి. యెహోవాయందు నమ్మకముంచండి, ఎందుకంటే లేవీయుని ఈ మాటల్లో చూపబడిన విధంగా, ఇది సంతోషానికి నడిపిస్తుంది: “సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.”—కీర్తన 84:12.
[అధస్సూచీలు]
a జూన్ 15, 1988 కావలికోట (ఆంగ్లం) సంచికనందలి “మీరు పవిత్రమైన వాటిని గుణగ్రహిస్తారా?” అనే శీర్షికను దయచేసి చూడండి.
[11వ పేజీలోని బాక్సు]
మనం ఏర్పరచుకోగల గమ్యాలు
బైబిలును ప్రతి దినం చదవడం.—యెహోషువ 1:8; మత్తయి 4:4
లేఖనాధార తర్ఫీదు ద్వారా మన వివేచనాశక్తులను వృద్ధి చేసుకోవడం.—హెబ్రీయులు 5:14
దేవునితో సన్నిహిత సంబంధాన్ని వృద్ధి చేసుకోవడం.—కీర్తన 73:28
ఆత్మఫలాల్లో ఒక్కొక్క దాన్నీ అలవర్చుకోవడం.—గలతీయులు 5:22, 23
మన ప్రార్థనలను మెరుగుపర్చుకోవడం.—ఫిలిప్పీయులు 4:6, 7
ప్రకటించడం మరియు బోధించడంలో మరింత ప్రభావవంతం కావడం.—1 తిమోతి 4:15, 16
కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ప్రతి సంచికను చదవడం, వాటిని ధ్యానించడం.—కీర్తన 49:3
[9వ పేజీలోని చిత్రం]
వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో దేవుని చిత్తాన్ని చేయడాన్ని ముందుంచండి