కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 11/15 పేజీలు 25-27
  • మన నిష్పక్షపాత దేవున్ని మీరు అనుకరిస్తున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన నిష్పక్షపాత దేవున్ని మీరు అనుకరిస్తున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా నిష్పక్షపాత వైఖరి యొక్క రికార్డు
  • యెహోవా నిష్పక్షపాత స్వభావం నుండి నేర్చుకోవడం
  • యెహోవా లక్షణాల పూర్తి విలువను గుర్తించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • పక్షపాతంలేని మన దేవుడైన యెహోవాను అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా నిష్పక్షపాతాన్ని అనుకరించండి
    మన రాజ్య పరిచర్య—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 11/15 పేజీలు 25-27

మన నిష్పక్షపాత దేవున్ని మీరు అనుకరిస్తున్నారా?

నిష్పక్షపాతం—దాన్ని ఎక్కడ కనుగొనవచ్చు? ఏ మాత్రం పక్షపాతం లేకుండా, దురభిమానం, అభిమానధోరణి మరియు వివక్షత లేకుండా ఒకరున్నారు. ఆయన మానవజాతి సృష్టికర్తయైన యెహోవా దేవుడు. అయితే, మానవులను గురించి, 19 శతాబ్దపు ఆంగ్ల రచయితైన ఛాల్స్‌ లాంబ్‌ యథార్థంగా ఇలా వ్రాశాడు: “సరళమైన మాటల్లో చెప్పాలంటే నేను ఇష్టాయిష్టాలుగల దురభిమానముతో నిండినవాడను.”

నిష్పక్షపాతం అనే విషయానికొస్తే, మానవ సంబంధాలలో అది పూర్తిగా లోపిస్తుంది. అనేక శతాబ్దాల క్రితం, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని ఇశ్రాయేలు యొక్క జ్ఞానవంతుడైన రాజగు సొలొమోను అన్నాడు. (ప్రసంగి 8:9) జాతి విద్వేషం, జాతీయ పోరాటాలు మరియు కుటుంబకలహాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి, మానవులు తమంతట తామే నిష్పక్షపాత సమాజాన్ని ఉత్పన్నం చేయగలరని విశ్వసించడం వాస్తవికంగా ఉంటుందా?

మన దృక్పథాలను అదుపు చేసుకునేందుకు మరియు మనలో పాతుకుపోయిన దురభిమానాన్ని మననుండి తీసేయడానికి మనస్సాక్షి పూర్వకమైన ప్రయత్నం అవసరముంటుంది. (ఎఫెసీయులు 4:22-24) దాన్ని గుర్తెరగకుండా, మన సాంఘీక, విద్యా రంగాలు నెలకొల్పిన మరియు మన కుటుంబ, జాతి మరియు జాతీయ గత చరిత్రలో నాటుకుపోయిన దృక్పథాలను మనం మనలో కలిగి ఉండవచ్చు. అల్పమైనవిగా కన్పించే ఈ ఆలోచనలు తరచూ ఎంతో లోతుగా పాతుకుపోయి ఉంటాయి, పక్షపాత వైఖరికి దారి తీసే దృక్పథాలను అవి ప్రేరేపిస్తాయి. స్కాట్‌లాండ్‌ న్యాయమూర్తి మరియు సంపాదకుడైన లార్డ్‌ ఫ్రాన్సిస్‌ జెఫ్రీ కూడా ఇలా అంగీకరించాడు: “తన దురభిమానం ఎంత లోతుగా పాతుకుపోయిందోనన్న విషయాన్ని తప్ప మరింకే విషయాన్నైనా ఒక మనిషి అంత ఎక్కువ కాలం తెలుసుకోకుండా ఉండడు.”

పక్షపాత స్వభావానికి విరుద్ధంగా పోరాడాలంటే మనస్ఫూర్తిగా కృషి చేయవలసిన అవసరముందని అంగీకరించే వ్యక్తుల్లో లీనa ఒకరు. ఒకరిలో తలెత్తే పక్షపాత భావాలను అణచివేసేందుకు, “ఎంతో కృషి అవసరం ఎందుకంటే పెంపకం చాలా బలమైన ప్రభావం” అని ఆమె చెబుతుంది. ఎడతెగక జ్ఞాపకం చేయడం కూడా అవసరమని లీన అంగీకరిస్తుంది.

యెహోవా నిష్పక్షపాత వైఖరి యొక్క రికార్డు

నిష్పక్షపాత వైఖరికి యెహోవా పరిపూర్ణమైన ఉదాహరణ. బైబిలు యొక్క మొదటి పుటలనుండి, మానవులతో తాను వ్యవహరించే విధానంలో ఆయన తన నిష్పక్షపాతాన్ని ఎలా వ్యక్తం చేశాడో మనం చదువుతాము. ఈ ఉత్తమమైన మాదిరులు మరియు సలహాల నుండి మనమెంతో నేర్చుకోవచ్చు.

సా. శ. 36లో యూదుడైన అపొస్తలుడగు పేతురు కొర్నేలికి మరియు ఇతర అన్యులకు సువార్తను ప్రకటించేలా చేయడంలో యెహోవా నిష్పక్షపాతాన్ని కనబర్చాడు. ఆ సమయంలో పేతురు ఇలా చెప్పాడు: ‘దేవుడు పక్షపాతి కాడు . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.’—అపొస్తలుల కార్యములు 10:34, 35.

మానవ కుటుంబంతో ఆయనకున్న వ్యవహారాలన్నింటిలో, యెహోవా తన నిష్పక్షపాతాన్ని ఎడతెగక ప్రదర్శించాడు. క్రీస్తుయేసు తన తండ్రి గురించి ఇలా చెప్పాడు: “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:45) యెహోవాను ఒక నిష్పక్షపాత దేవునిగా ఇంకా పొగడుతూ పేతురు ఇలా సాక్ష్యమిచ్చాడు: “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”—2 పేతురు 3:9.

నోవహు కాలంలో, ‘నరుల చెడుతనము భూమిమీద గొప్పదిగా, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదిగా’ ఉన్నప్పుడు, ఆ మానవ లోకం యొక్క నాశనాన్ని గూర్చి యెహోవా ఆదేశం జారీ చేశాడు. (ఆదికాండము 6:5-7, 11, 12) అయితే, దేవుని ఆజ్ఞ మేరకు, తన సమకాలికులు గమనించే రీతిలో నోవహు ఓడను నిర్మించాడు. ఆయన, ఆయన కుమారులు ఓడను నిర్మిస్తుండగా, నోవహు ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతురు 2:5) ఆ తరం యొక్క దుష్ట ఆలోచనల గురించి తెలిసి ఉన్నప్పటికీ, యెహోవా నిష్పక్షపాతంగా వారికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపాడు. నిర్మించేందుకు మరియు ప్రకటించేందుకు నోవహును నియమించడం ద్వారా ఆయన వారి మనస్సులకు మరియు హృదయాలకు విన్నవించాడు. ప్రతిస్పందించేందుకు వారికి ప్రతి అవకాశమూ ఉంది, అయితే దానికి బదులు వారు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.”—మత్తయి 24:39.

యెహోవా నిష్పక్షపాత స్వభావానికి ఇది ఎంత అద్భుతమైన ఉదాహరణయో గదా! ఈ క్లిష్టమైన అంత్య దినములలో, అదే నిష్పక్షపాత వైఖరితో రాజ్యసువార్తను ప్రకటించేందుకు అది దేవుని సేవకులను పురికొల్పుతుంది. అంతేకాకుండా, యెహోవా ఉగ్రత దినమును గురించి ప్రకటించడాన్ని వారు మానుకోరు. ప్రజలందరూ గమనిస్తుండగా, అందరూ వినేలా వారు నిష్పక్షపాతంగా యెహోవా వర్తమానాన్ని ప్రకటిస్తారు.—యెషయా 61:1, 2.

పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానాలు ఆయన నిష్పక్షపాతంగల దేవుడని రుజువునిచ్చాయి. ‘భూలోకములోని జనములన్నియు ఆశీర్వదింపబడే’ నియమిత వ్యక్తి వారి కుటుంబవర్గం నుండే వస్తాడు. (ఆదికాండము 22:18; 26:4; 28:14) ఆ నియమిత వ్యక్తి క్రీస్తుయేసే అని నిరూపించబడ్డాడు. యేసు మరణం మరియు పునరుత్థానం మూలంగా, విధేయులైన మానవజాతి అంతటికీ యెహోవా రక్షణ మార్గాన్ని అందించాడు. అవును, క్రీస్తు విమోచన క్రయధనం యొక్క ప్రయోజనాలు పక్షపాతం లేకుండా అందుబాటులో ఉన్నాయి.

మోషే కాలంలో, సెలోపెహాదు కుమార్తెల విషయంలో యెహోవా యొక్క నిష్పక్షపాత వైఖరి ఎంతో ఆసక్తికరమైన రీతిలో బయల్పర్చబడింది. వాగ్దాన దేశంలో తమ తండ్రి స్వాస్థ్యానికి సంబంధించి ఈ ఐదుగురు స్త్రీలు ఒక సంక్లిష్టతను ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలీయుల మధ్య భూస్వాస్థ్యం ఒక మనుష్యుని కుమారుల ద్వారా వారసత్వంగా సంక్రమించే సంప్రదాయం ఉన్నందుకు అది ఏర్పడింది. అయితే, సెలోపెహాదు స్వాస్థ్యం పొందేందుకు కుమారుని కనకుండానే మరణించాడు. సెలోపెహాదు ఐదుగురు కుమార్తెలు నిష్పక్షపాత వ్యవహారం కొరకు తమ విన్నపాన్ని మోషే వద్దకు తెచ్చి: “అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రి పేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతోపాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి.” యెహోవా వారి విన్నపాలను విన్నాడు, మోషేకు ఇలా ఉపదేశమిచ్చాడు: “ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.”—సంఖ్యాకాండము 27:1-11.

ప్రేమపూర్వకమైన నిష్పక్షపాతానికి ఎంత చక్కని ప్రామాణికమో కదా! కుమార్తెలు వివాహం చేసుకున్నప్పుడు గోత్రానికి చెందిన స్వాస్థ్యము మరొక గోత్రానికి వెళ్లిపోకుండా ఉండేందుకు, “వారు తమ తండ్రి గోత్రవంశములోనే” వివాహం చేసుకోవాల్సి ఉంది.—సంఖ్యాకాండము 36:5-12.

యెహోవా యొక్క నిష్పక్షపాత వైఖరి ఎడల మరింత అంతర్దృష్టిని కలిగించేది న్యాయాధిపతి, ప్రవక్తయైన సమూయేలు కాలంలో కనుగొనబడుతుంది. బేత్లెహేమీయుడైన యెష్షయి వంశంలోని యూదా గోత్రానికి చెందిన క్రొత్త రాజును అభిషేకించమని యెహోవా ఆయనకు ఆజ్ఞాపించాడు. అయితే యెష్షయికి ఎనమండుగురు కుమారులున్నారు. రాజుగా ఎవరు అభిషేకింపబడతారు? ఏలీయాబు భౌతిక ఆకారాన్నిబట్టి సమూయేలు ప్రభావితుడయ్యాడు. అయితే, యెహోవా బాహ్య రూపాన్ని చూసి మోసపోలేదు. ఆయన సమూయేలుతో ఇలా చెప్పాడు: “అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” యెష్షయి చిన్న కుమారుడైన దావీదు ఎన్నుకొనబడ్డాడు.—1 సమూయేలు 16:1, 6-13.

యెహోవా నిష్పక్షపాత స్వభావం నుండి నేర్చుకోవడం

తోటి విశ్వాసి యొక్క ఆత్మీయ లక్షణాలను దృష్టించడం విషయంలో క్రైస్తవ పెద్దలు యెహోవాను అనుకరిస్తే ఎంతో చక్కగా ప్రవర్తించినవారైతారు. మన వ్యక్తిగత భావాలు మన తీర్పును కనుమరుగు చేసేలా అనుమతిస్తూ మన స్వంత ప్రమాణాలనుబట్టి ఒక వ్యక్తికి తీర్పు తీర్చడం సులభం. ఒక పెద్ద చెప్పిన విధంగా, “ముందుగా నిర్ణయించుకున్న నా స్వంత ఆలోచనల ఆధారంగా కాక, యెహోవాను ప్రీతిపర్చే విధంగా ఇతరులతో వ్యవహరించేందుకు నేను ప్రయత్నిస్తాను.” యెహోవా సేవకులందరూ తమ ప్రమాణంగా ఆయన వాక్యాన్ని ఉపయోగించడం వారికి ఎంత ప్రయోజనకరమో గదా!

పైన చెప్పబడిన బైబిలు ఉదాహరణలు జాతిపర లేక జాతీయ దురభిమానపు భావాలు ఏవైనా మనలో ఇంకా మిగిలివుంటే వాటితో పోరాడేందుకు అవి మనకు సహాయం చేస్తాయి. యెహోవా యొక్క నిష్పక్షపాత వైఖరిని అనుసరించడం ద్వారా, దురభిమానం, వివక్షత మరియు అభిమానధోరణి నుండి మనం క్రైస్తవ సంఘాన్ని కాపాడతాము.

“దేవుడు పక్షపాతి కాడని” అపొస్తలుడైన పేతురు తెలుసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 10:34) పక్షపాత వైఖరి నిష్పక్షపాతానికి ఒక శత్రువు, అది ప్రేమ మరియు ఐక్యతా సూత్రాలను అతిక్రమిస్తుంది. యేసు పేదలు, బలహీనులు మరియు దుర్బలులను ఆకర్షించాడు మరియు వారి భారాన్ని తేలిక చేశాడు. (మత్తయి 11:28-30) ప్రజలపై సూత్రాలతో కూడిన మోయశక్యంకాని బరువును మోపుతూ, వారిపై ఆధిపత్యం చేసిన యూదా మత నాయకులకు ఆయన ఎంతో వ్యత్యాసంగా ఉన్నాడు. (లూకా 11:45, 46) అలా చేయడం, ధనికులు మరియు ప్రముఖులకు పక్షపాతాన్ని చూపడం యేసు బోధలతో ఎంతమాత్రం పొందికగా లేదు.—యాకోబు 2:1-4, 9.

నేడు, క్రైస్తవ పెద్దలు క్రీస్తు శిరస్సత్వానికి లోబడతారు మరియు యెహోవా యొక్క సమర్పిత ప్రజలందరి ఎడలా నిష్పక్షపాత వైఖరి చూపుతారు. వారు ‘తమ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేస్తుండగా,’ ఆర్థిక స్థితి, వ్యక్తిగత విభేదాలు లేక కుటుంబ సంబంధాలనుబట్టి పక్షపాతాన్ని చూపకుండా ఉంటారు. (1 పేతురు 5:2) నిష్పక్షపాత దేవున్ని అనుకరించడం మరియు పక్షపాత చర్యలకు విరుద్ధంగా ఉండమని ఆయన హెచ్చరికలకు చెవియొగ్గడం ద్వారా, క్రైస్తవ పెద్దలు సంఘంలో నిష్పక్షపాత స్ఫూర్తిని పురికొల్పుతారు.

యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘమనేది అంతర్జాతీయ సహోదరత్వం. యేసుక్రీస్తు నడిపింపు క్రింద దురభిమానం లేని నిష్పక్షపాత సమాజం ఒక వాస్తవమౌతుంది అనేందుకు అదొక సజీవ రుజువు. సాక్షులు “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును” ధరించుకున్నారు. (ఎఫెసీయులు 4:24) అవును, నిష్పక్షపాత దేవుడైన యెహోవా యొక్క పరిపూర్ణ మాదిరినుండి వారు నేర్చుకుంటున్నారు, ఎలాంటి పక్షపాతాలూ లేని నూతన ప్రపంచంలో నిత్య జీవాన్ని పొందే ఉత్తరాపేక్ష వారికి ఉంది.—2 పేతురు 3:13.

[అధస్సూచీలు]

a మారు పేరు.

[26వ పేజీలోని చిత్రం]

దేవుడు పక్షపాతి కాడని అపొస్తలుడైన పేతురు తెలుసుకున్నాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి