అభిజ్ఞాత సమ్మతికి హక్కు పునఃర్దృఢీకరించబడింది
ఇటలీలోని మసీన న్యాయస్థానంలోని ప్రిలిమినరీ దర్యాప్తుల కొరకు న్యాయమూర్తి ప్రకటించిన ఇటీవలి తీర్మానం, ఒక పెద్దవయస్కుడైన రోగి యొక్క వైద్య కోరికలను వైద్యులు అంగీకరించాలని పునఃర్దృఢీకరించింది. ఒక యెహోవాసాక్షికి సంబంధించిన కేసులో ఈ తీర్పు ఇవ్వబడింది.
హెమోఫిలియక్ రోగియైన 64 సంవత్సరాల ప్రాయుడైన, సాక్షియగు అంటోనీనో స్టెల్లర్యో లెంటీనీ, 1994 జనవరిలో మసీన నందలి తోర్మినాలో ఉన్న ఒక ఆసుపత్రికి హుటాహుటిని తరలించబడ్డాడు. రక్తం ఎక్కించడం ద్వారా ఇవ్వబడే చికిత్సకు అంటోనీనో భార్యయైన కటేన, యెహోవాసాక్షులుగా తను, తన భర్త సమ్మతించమని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసింది. (అపొస్తలుల కార్యములు 15:20, 28, 29) వారి కోరికలు గౌరవింపబడ్డాయి.
అయితే, మరొక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నప్పుడు, అంటోనినోకు ఊపిరి ఆడలేదు తుదకు విపత్కర పరిస్థితిలో అతను అక్కడికి చేరుకున్నాడు. అటు తర్వాత వెంటనే అతను మరణించాడు. కటేన కుప్పకూలిపోయింది, అయితే పునరుత్థానాన్ని గూర్చిన బైబిలు వాగ్దానం ద్వారా ఆమె గొప్ప ఆదరణను పొందింది. (అపొస్తలుల కార్యములు 24:15) తర్వాత, ఆమెకు తీవ్రమైన విభ్రాంతిని కలిగిస్తూ, మెజిస్ట్రేటులు—బహుశ ప్రసార మాద్యమం ప్రచురం చేసిన తప్పుడు సమాచారం ద్వారా తప్పుద్రోవపట్టింపబడి—ఆమె భర్తకు అవసరమని వైద్యులు భావించిన శస్త్రచికిత్సను అతనికి ఇప్పించేందుకు నిరాకరించడం ద్వారా తన భర్త మరణానికి కారణమైందని ఆమెను నిందించారు.
దాదాపు ఒక సంవత్సరంకంటే ఎక్కువ కాలం తర్వాత, 1995 జూలై 11వ తేదీన, కటేన ఏ నేరం చేయలేదని చెప్పి ఆమెను నిరపరాధిగా తీర్పుతీర్చారు. వాస్తవానికి, రోగి పరిస్థితి దృష్ట్యా శస్త్రచికిత్సకులు చర్య తీసుకోవడం ఎలాగూ నిరుపయోగం అయ్యుండేదని నిపుణుల వ్యాఖ్యలు సూచించాయి.
అయితే న్యాయమూర్తి వ్యాఖ్యానం ముఖ్యమైన వివాదాన్ని సూచించింది. రోగి లేక అతనికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు చికిత్సను నిరాకరించినప్పుడు వైద్య సిబ్బంది అందులో జోక్యం చేసుకోవడమనేది కోర్టు అంగీకరించడం చాలా కష్టమని అతను సూచించాడు. “ఏ విధంగానైనా జోక్యం చేసుకునే ముందు రోగి లేక అతనికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి యొక్క అభిజ్ఞాత సమ్మతిని పొందవలసిన అవసరతను” ఇటలీలోని వైద్య నీతిశాస్త్రం విధానం “గమనిస్తోందని” కూడా అతడు చెప్పాడు. అలా, కటేన “తన భర్త అలాంటి శస్త్ర చికిత్సకు లోనవ్వకుండా న్యాయబద్ధంగానే నివారించిందని” అతను పేర్కొన్నాడు.
పెద్దవయస్కులు అతను లేక ఆమె ఇష్టాయిష్టాలతో ఏకీభవించని వైద్య చికిత్సను నిరాకరించగల హక్కును ఈ తీర్పు పునఃర్దృఢీకరిస్తుంది.