కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 6/15 పేజీలు 12-17
  • పక్షపాతంలేని మన దేవుడైన యెహోవాను అనుకరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పక్షపాతంలేని మన దేవుడైన యెహోవాను అనుకరించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా కీర్తికి ప్రతిస్పందనలు
  • అబ్రాహాముతో, ఇశ్రాయేలీయులతో యెహోవా ఎలా వ్యవహరించాడు
  • యేసు ఒక నిష్పక్షపాత బోధకుడు
  • అనుకూల ఫలితాలు
  • దురభిమానాన్ని అధిగమించడం
  • “విశాలపరచుకొనుడి”
  • యెహోషువ, గిబియోనీయులు
    నా బైబిలు పుస్తకం
  • యెహోషువ పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • యెహోషువ గుర్తుంచుకున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించారు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 6/15 పేజీలు 12-17

పక్షపాతంలేని మన దేవుడైన యెహోవాను అనుకరించండి

“దేవునికి పక్షపాతములేదు.”—రోమీయులు 2:11.

1, 2. (ఎ) కనానీయులపట్ల యెహోవా సంకల్పమేమిటి? (బి) యెహోవా ఏమి చేశాడు, ఇది ఏ ప్రశ్నలను ఉత్పన్నం చేస్తుంది?

సా.శ.పూ. 1473లో మోయాబు మైదానంలో దిగిన ఇశ్రాయేలీయులు మోషే చెప్పిన మాటల్ని జాగ్రత్తగా విన్నారు. యొర్దాను ఆవలివైపున వారికొక సవాలు ఎదురుకాబోతుంది. వాగ్దాన దేశంలోవున్న బలంగల ఏడు కనానీయ జనాంగాల్ని ఇశ్రాయేలీయులు ఓడించాలన్న యెహోవా సంకల్పాన్ని మోషే ప్రకటించాడు. మోషే పలికిన ఈ మాటలు వారికెంతో నమ్మకం కలిగించాయి: “నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను.” ఇశ్రాయేలీయులు వారితో ఎలాంటి నిబంధన చేసికొనకూడదు, వారు అనుగ్రహార్హులు కారు.—ద్వితీయోపదేశకాండము 1:1; 7:1, 2.

2 అయినా, ఇశ్రాయేలీయులు ముట్టడివేసిన మొదటి పట్టణంనుండి యెహోవా ఒక కుటుంబాన్ని కాపాడాడు. ఇతర నాలుగు పట్టణాల ప్రజలు కూడా దేవుని రక్షణను పొందారు. వారెందుకు రక్షణ పొందారు? కనానీయులకు సంబంధించి గుర్తింపదగిన ఈ సంఘటనలు యెహోవాను గూర్చి మనకేమి బోధిస్తున్నాయి? మనమాయనను ఎలా అనుకరించగలము?

యెహోవా కీర్తికి ప్రతిస్పందనలు

3, 4. ఇశ్రాయేలీయుల విజయాల వార్తలు కనానులో ఆయావ్యక్తుల మీద ఎలాంటి ప్రభావం చూపాయి?

3 వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ముందు ఇశ్రాయేలీయులు అరణ్యంలో గడిపిన 40 సంవత్సరాల కాలంలో, యెహోవా తన ప్రజలను కాపాడి వారి పక్షంగా పోరాడాడు. వాగ్దాన దేశానికి దక్షిణాన ఇశ్రాయేలీయులు కనానీయుల రాజగు అరాదును ఎదుర్కొన్నారు. యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులు అతణ్ణి అతని ప్రజల్ని హోర్మాలో ఓడించారు. (సంఖ్యాకాండము 21:1-3) ఆ తర్వాత, ఇశ్రాయేలీయులు ఎదోము చుట్టూతిరిగి ఉత్తరదిక్కుకు ప్రయాణమై మృతసముద్రపు ఈశాన్యదిశగా వెళ్ళారు. క్రితం మోయాబీయులు నివసించిన ఆ దేశంలో, ఇప్పుడు అమోరీయులున్నారు. అమోరీయుల రాజైన సీహోను తన దేశం గుండా ఇశ్రాయేలీయులు వెళ్ళడానికి అనుమతించలేదు. అర్నోను ఏటిలోయకు ఉత్తరదిక్కునున్న యాహజువద్ద ఇశ్రాయేలీయులతో చేసిన యుద్ధంలో రాజైన సీహోను హతమయ్యాడు. (సంఖ్యాకాండము 21:23, 24; ద్వితీయోపదేశకాండము 2:30-33) సుదూరంగా ఉత్తరదిశలో, బాషానులో ఇతర అమోరీయులమీద ఓగు పరిపాలించేవాడు. ఓగు భారీకాయుడైనా అతడు యెహోవాయెదుట నిలువలేకపోయాడు. ఓగు ఎద్రెయీలో హతమయ్యాడు. (సంఖ్యాకాండము 21:33-35; ద్వితీయోపదేశకాండము 3:1-3, 11) ఈ విజయపరంపరలతో పాటు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల నిర్గమనాన్ని గూర్చిన వార్తలు కనాను దేశంలో నివసించే ఆయా వ్యక్తుల మీద బలమైన ప్రభావం చూపాయి.a

4 ఇశ్రాయేలీయులు యొర్దానుదాటి కనానులో మొదటిసారి ప్రవేశించినప్పుడు, వారు గిల్గాలులో దిగారు. (యెహోషువ 4:9-19) ప్రాకారములుగల పట్టణమైన యెరికో వారికి ఎంతో దూరంలోలేదు. కనానీయురాలైన రాహాబు యెహోవా కార్యాలను గూర్చి ఏమి విన్నదో, అదామె విశ్వాసంతో చర్య తీసుకునేలా చేసింది. తత్ఫలితంగా, యెరికో మీదికి యెహోవా నాశనం తెచ్చినప్పుడు, ఆయన ఆమెను ఆమె కుటుంబాన్ని కాపాడాడు.—యెహోషువ 2:1-13; 6:17, 18; యాకోబు 2:25.

5. గిబియోనీయులు తెలివిగా వ్యవహరించేందుకు ఏది వారిని పురికొల్పింది?

5 ఆ తర్వాత, ఇశ్రాయేలీయులు యొర్దాను లోతట్టు ప్రదేశాల్నుండి ఆ ప్రాంత మధ్యభాగంలో ఉన్న పర్వతాలకు ఎక్కివచ్చారు. యెహోవా నడిపింపును అనుసరించి, హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి యెహోషువ పొంచివుండి దాడి చేశాడు. (యెహోషువ, 8వ అధ్యాయం) తత్ఫలితంగా కలిగిన ఓటమిని గురించిన వార్తలు అనేక కనానీయ రాజులు యుద్ధం చేయడానికి కూడివచ్చేలా వారిని పురికొల్పాయి. (యెహోషువ 9:1, 2) దగ్గర్లోవున్న గిబియోనులోని హివ్వీయ పట్టణస్థులు మరోవిధంగా ప్రతిస్పందించారు. ‘వారు కపటోపాయముచేశారని’ [“తెలివిగా వ్యవహరించారని,” NW] యెహోషువ 9:4 చెబుతోంది. నిర్గమమందు అలాగే సీహోను ఓగులను ఓడించినప్పుడు యెహోవా తన ప్రజల్నెలా విడిపించాడో రాహాబువలెనే వారూ విన్నారు. (యెహోషువ 9:6-10) ఎదిరించడం వ్యర్థమని గిబియోనీయులు గ్రహించారు. కాబట్టి వారు ఎక్కడో దూరదేశంనుండి వస్తున్న వారిగా నటిస్తూ గిబియోను పక్షంగా, తమ సమీపంలోని కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీమను మూడు పట్టణాల పక్షంగా ఒక ప్రతినిధి బృందాన్ని గిల్గాలులోవున్న యెహోషువ దగ్గరకు పంపారు. వారి కపటోపాయం నెగ్గింది. యెహోషువ వారితో చేసిన నిబంధన వారు నిశ్చయంగా రక్షింపబడేలా చేసింది. మూడు రోజుల తర్వాత యెహోషువ, ఇశ్రాయేలీయులు తాము మోసపోయామని గ్రహించారు. అయినా, వారు యెహోవా నామమున నిబంధన చేసినందుకు దానికి కట్టుబడ్డారు. (యెహోషువ 9:16-19) యెహోవా ఆమోదించాడా?

6. గిబియోనీయులతో యెహోషువ చేసిన నిబంధనకు యెహోవా ఎలా స్పందించాడు?

6 ఇశ్రాయేలీయుల కొరకు, అలాగే ఆలయ గుడారమందు ‘యెహోవా బలిపీఠము’ కొరకు, కట్టెలు నరుకువారుగా నీళ్ళు చేదువారుగా పనిచేయడానికి గిబియోనీయులు అనుమతించబడ్డారు. (యెహోషువ 9:21-27) అంతేగాక, అమోరీయుల ఐదుగురు రాజులు గిబియోనీయులను బెదిరించినప్పుడు యెహోవా అద్భుతరీతిలో జోక్యం చేసుకున్నాడు. యెహోషువ సైన్యం చంపినవారికంటే వడగండ్లచేతనే ఎక్కువమంది శత్రువులు హతమయ్యారు. శత్రువులు బొత్తిగా ఓడిపోవువరకు సూర్యచంద్రులు అలాగే నిలిచియుండాలనే యెహోషువ విన్నపానికి సహితం యెహోవా జవాబిచ్చాడు. “యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను” అని యెహోషువ అన్నాడు.—యెహోషువ 10:1-14.

7. కొందరు కనానీయుల విషయంలో పేతురు గుర్తించిన ఏ సత్యం ప్రదర్శింపబడింది?

7 కనానీయురాలైన రాహాబు ఆమె కుటుంబం, అలాగే గిబియోనీయులు యెహోవాకు భయపడి తదనుగుణంగా ప్రవర్తించారు. వారికి జరిగింది క్రైస్తవ అపొస్తలుడైన పేతురు ఆ తర్వాత చెప్పిన ఈ సత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించింది: “దేవుడు పక్షపాతి కా[డు] . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.

అబ్రాహాముతో, ఇశ్రాయేలీయులతో యెహోవా ఎలా వ్యవహరించాడు

8, 9. అబ్రాహాముతో, ఇశ్రాయేలీయులతో వ్యవహరించడంలో యెహోవా నిష్పక్షపాతం ఎలా వెల్లడయ్యింది?

8 అబ్రాహాముతో ఆయన సంతానంతో వ్యవహరించినప్పుడు దేవుడు చూపిన ఉచిత కృపమీద శిష్యుడైన యాకోబు అవధానం నిలుపుతున్నాడు. అబ్రాహాము తెగ కాదుగాని ఆయన విశ్వాసమే ఆయనను ‘యెహోవా స్నేహితునిగా’ చేసింది. (యాకోబు 2:23) యెహోవాయెడల అబ్రాహాముకున్న విశ్వాసం, ప్రేమ ఆయన వారసులకు దీవెనల్ని తెచ్చాయి. (2 దినవృత్తాంతములు 20:7) “నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను” అని యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. అయితే ఆ తర్వాతి వచనంలోవున్న వాగ్దానాన్ని గమనించండి: “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.”—ఆదికాండము 22:17, 18; రోమీయులు 4:1-8.

9 ఇశ్రాయేలీయులతో వ్యవహరించినప్పుడు పక్షపాతం చూపడానికి బదులు, యెహోవా తనకు లోబడేవారికి తానేమి చేయగలడో ప్రదర్శించాడు. అలా వ్యవహరించడం యెహోవా తన నమ్మకమైన సేవకులయెడల యథార్థ ప్రేమనెలా వ్యక్తంచేస్తాడో ఉదహరిస్తుంది. ఇశ్రాయేలీయులు యెహోవాకు “స్వకీయ సంపాద్యముగా”వున్నా, ఇతర ప్రజలెవరూ దేవుని అనుగ్రహం పొందలేరని దీనర్థం కాదు. (నిర్గమకాండము 19:5; ద్వితీయోపదేశకాండము 7:6-8) నిజానికి, ఐగుప్తు బానిసత్వాన్నుంచి యెహోవా ఇశ్రాయేలీయుల్ని తిరిగికొన్నాడు, అందుకే ఆయనిలా ప్రకటించాడు: “భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను.” అయితే ప్రవక్తయైన ఆమోసు, మరితరుల ద్వారా యెహోవా ‘అన్యజనులందరి’ కొరకుకూడా అద్భుతమైన ఉత్తరాపేక్షను ఉంచాడు.—ఆమోసు 3:2; 9:11, 12; యెషయా 2:2-4.

యేసు ఒక నిష్పక్షపాత బోధకుడు

10. నిష్పక్షపాతం చూపడంలో యేసు తన తండ్రి మాదిరిని ఎలా అనుకరించాడు?

10 భూమ్మీద తన పరిచర్య కాలంలో, యెహోవాకు మూర్తిమంతంగావున్న యేసు, యెహోవా నిష్పక్షపాత స్వభావాన్ని అనుకరించాడు. (హెబ్రీయులు 1:3) ఆ కాలంలో ఆయన “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱె[ల్ని]” కనుక్కోవడం మీదే ప్రాథమికంగా శ్రద్ధనిలిపాడు. అయినా, బావి దగ్గర సమరయ స్త్రీకి ఆయన సాక్ష్యమివ్వకుండా ఉండలేదు. (మత్తయి 15:24; యోహాను 4:7-30) యూదుడుకాని ఒక సైన్యాధికారి విన్నపం మేరకు ఆయన ఒక అద్భుతం కూడా చేశాడు. (లూకా 7:1-10) దేవుని ప్రజలమీద తనకున్న క్రియాత్మక ప్రేమతోపాటు ఇతరులపై కూడా తనకు ప్రేమ ఉందని ఆయన చూపాడు. యేసు శిష్యులు కూడా విస్తృతంగా ప్రకటించారు. యెహోవా ఆశీర్వాదం పొందడానికి ఆధారం జాతి కాదుగాని, దృక్పథమేనని స్పష్టమయింది. సత్యంయెడల ఆకలితోవున్న వినయంగల యథార్థ హృదయులు రాజ్యసువార్తకు ప్రతిస్పందించారు. దీనికి విరుద్ధంగా గర్వం, అహంకారంగలవారు యేసును ఆయన సందేశాన్ని తృణీకరించారు. “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను” అని యేసు తెలిపాడు. (లూకా 10:21) ప్రేమ, విశ్వాసం ఆధారంగా మనం ఇతరులతో వ్యవహరించినప్పుడు, ఇది యెహోవా ఆమోదించే మార్గమని తెలుసుకున్నవారమై మనం నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తాము.

11. తొలి క్రైస్తవ సంఘంలో నిష్పక్షపాత వైఖరి ఎలా ప్రదర్శింపబడింది?

11 తొలి క్రైస్తవ సంఘంలోని యూదులు, యూదేతరులు ఎలాంటి భేదంలేకుండా సమంగా ఉన్నారు. “సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతములేదు” అని పౌలు వివరించాడు.b (రోమీయులు 2:10, 11) వారు యెహోవా ఉచితకృప నుండి ప్రయోజనం పొందారా లేదా అనే దానిని, వారు ఏ జాతివారనేది కాదుగాని, యెహోవాను గూర్చి ఆయన కుమారుడగు యేసు విమోచన క్రయధనం అందించే ఉత్తరాపేక్షలను గూర్చి తెలుసుకున్నప్పుడు వారుచూపిన ప్రతిస్పందన తీర్మానించింది. (యోహాను 3:16, 36) పౌలు ఇలా వ్రాశాడు: “బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు.” ఆ తర్వాత (“యూదా సంబంధిత” అంటే మెప్పుపొందిన లేదా స్తుతిపాత్రుడు అనే అర్థమిచ్చే) “యూదుడు” అనే మాట చేరియున్న పదాల్ని నేర్పుగా ఉపయోగిస్తూ పౌలు ఇంకనూ ఇలా అన్నాడు: “అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.” (రోమీయులు 2:28, 29) యెహోవా అలాంటి మెప్పును నిష్పక్షపాతంగా చూపిస్తాడు. మనమూ అలాగే చేస్తామా?

12. ప్రకటన 7:9 ఏ ఉత్తరాపేక్షను అందిస్తుంది, ఎవరికి?

12 ఆ తర్వాత, అపొస్తలుడైన యోహాను దర్శనంలో నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు “ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన” 1,44,000 మందిగల ఆధ్యాత్మిక జనాంగముగా వర్ణించబడటం చూశాడు. అటుతర్వాత, యోహాను “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము . . . తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి” ఉండటం చూశాడు. (ప్రకటన 7:4, 9) కాబట్టి, ఆధునిక క్రైస్తవ సంఘంనుండి ఏ జాతివారైనా లేదా భాషవారైనా మినహాయింపబడరు. అన్నిరకాల జీవన నేపథ్యాలనుండి వచ్చినవారికి రాబోయే “మహాశ్రమలను” తప్పించుకుని నూతన లోకంలో “జీవజలముల బుగ్గలయొద్ద” దప్పిక తీర్చుకునే ఉత్తరాపేక్ష ఉంటుంది.—ప్రకటన 7:14-17.

అనుకూల ఫలితాలు

13-15. (ఎ) జాతి, సంస్కృతి విభేదాల్ని మనమెలా అధిగమించవచ్చు? (బి) స్నేహ స్వభావం తీసుకురాగల ప్రయోజనాలకు ఉదాహరణలు చెప్పండి?

13 మంచి తండ్రికి తన పిల్లలు ఎలా తెలిసివుంటారో, అలాగే యెహోవాకు మనగురించి అంతా తెలుసు. అదేవిధంగా, ఇతరుల సంస్కృతి, జీవన నేపథ్యాలందు ఆసక్తి చూపడంద్వారా వారిని మనం అర్థం చేసుకున్నప్పుడు కలహాలు మరుగైపోతాయి. జాతివిభేదాలు కరిగిపోతాయి, స్నేహబంధం ప్రేమబంధం బలపడతాయి. ఐక్యత అధికమౌతుంది. (1 కొరింథీయులు 9:19-23) విదేశాల్లో మిషనరీ నియామకంలో సేవచేసే వారి కార్యవిధానం దీనికి మంచి రుజువుగా ఉంది. అక్కడ జీవించే ప్రజలపై వారు వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు, ఫలితంగా మిషనరీలు స్థానిక సంఘాల్లో చక్కగా యిట్టే కలిసిపోతారు.—ఫిలిప్పీయులు 2:4.

14 నిష్పక్షపాతంగా ఉన్నందువల్ల వచ్చే అనుకూల ప్రభావాలు అనేకదేశాల్లో కనబడుతున్నాయి. ఇతియోపియా నుండి వచ్చిన ఆక్లీలూ బ్రిటన్‌ రాజధాని లండన్‌లో తాను ఒంటరివాడనని తలంచాడు. ఆధునిక ఐరోపాలోని అనేక మహానగరాల్లోలానే ఇక్కడకూడా ఇతర దేశాలనుండి వచ్చిన ప్రజలయెడల స్నేహభావం లేనట్లు అనిపించడంతో అతని ఒంటరి భావాలు మరింత పెరిగాయి. యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో క్రైస్తవ కూటానికి హాజరైనప్పుడు ఆక్లీలూ అనుభవం ఎంత భిన్నంగా ఉందోగదా! అక్కడున్నవారు ఆయనను స్వాగతించారు, కొద్దిరోజుల్లోనే ఆయన తన ఇంట్లో ఉన్నట్టు భావించి, సృష్టికర్తయెడల తన మెప్పును వేగంగా వృద్ధిచేసుకున్నాడు. త్వరలోనే ఆయన అవకాశం దొరికినప్పుడల్లా ఆ జిల్లాలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఒకరోజు ఆక్లీలూ ప్రచార సహవాసి ఆయనను నీ జీవితాశయమేమిటని అడిగితే దానికి ఆక్లీలూ వెంటనే తనభాష అంహరిక్‌ మాట్లాడే సంఘంలో తానూ భాగమైయుండే రోజు కొరకు ఎదురుచూస్తున్నానని జవాబిచ్చాడు. స్థానిక ఇంగ్లీషు భాషా సంఘ పెద్దలకు ఈ విషయం తెలిసినప్పుడు, వారు సంతోషంగా ఆక్లీలూ మాతృభాషలో ఒక బహిరంగ ప్రసంగం ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లో మొదటిసారి ఏర్పాటుచేయబడిన అంహరిక్‌ భాషా బహిరంగ ప్రసంగానికి రావాలని ఇవ్వబడిన ఆహ్వానానికి మద్దతుగా స్థానికులు, విదేశీయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నేడు, ఆ ప్రాంతమందలి ఇతియోపియన్లు, ఇతరులు అంహరిక్‌ భాషా సంఘంలో కూడుకుంటున్నారు. యెహోవా పక్షంగా నిలువబడి, దీనికి సూచనార్థకంగా క్రైస్తవ బాప్తిస్మం తీసుకోవడానికి తమను ఏదీ ఆపుజేయలేదని అక్కడి అనేకులు కనుగొన్నారు.—అపొస్తలుల కార్యములు 8:26-36.

15 స్వభావాలు, నేపథ్యాలు వివిధ రకాలుగావుంటాయి. ఉన్నత లేదా న్యూనతా భావాలకు అవి ఆధారంకావు; అవి కేవలం విభిన్న విషయాలు మాత్రమే. మాల్టా ద్వీపంలో యెహోవాకు క్రొత్తగా సమర్పించుకున్న సేవకులు బాప్తిస్మం తీసుకోవడం గమనించిన బ్రిటన్‌ సందర్శకుల ఆనందబాష్పాలు చూసిన స్థానిక సాక్షుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. మాల్టాకు, బ్రిటన్‌కు చెందిన ఇరువర్గాలు తమ భావాల్ని విభిన్న రీతుల్లో వ్యక్తంచేసారు కాగా, యెహోవా యెడల వారికున్న ప్రేమ వారి క్రైస్తవ సహవాస బంధాన్ని ధృఢపర్చింది.—కీర్తన 133:1; కొలొస్సయులు 3:14.

దురభిమానాన్ని అధిగమించడం

16-18. క్రైస్తవ సంఘంలో దురభిమానాన్ని అధిగమించవచ్చని చూపే ఒక అనుభవాన్ని చెప్పండి.

16 యెహోవా యెడల మన క్రైస్తవ సహోదరుల యెడల మన ప్రేమ ప్రగాఢమౌతుండగా, మనం ఇతరులను దృష్టించే విధానంలో మరింత సన్నిహితంగా యెహోవాను అనుకరించగలము. ఫలాని జాతులు, తెగలు లేదా సంస్కృతుల యెడల మనకొకప్పుడున్న దురభిమానాన్ని మనం అధిగమించవచ్చు. ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీషు సైన్యంలో పనిచేసి, 1942లో సింగపూర్‌ పతనమైనప్పుడు జపనీయుల చేతికిచిక్కిన ఆల్బర్ట్‌ విషయమే తీసుకోండి. ఆయన ఆ పిమ్మట దాదాపు మూడు సంవత్సరాలు “మృత్యు రైలుమార్గము” దగ్గర పనిచేశాడు, ఇది ఆ తర్వాత క్వాయ్‌ నదిమీది వంతెన అని పిలువబడింది. యుద్ధం ముగిసి విడుదలయ్యేటప్పటికి ఆయన బరువు 32 కిలోలు, ఆయన ముక్కు, దవడ ఎముక విరిగాయి. అప్పటికి ఆయన విరోచనాలు, తామర, మలేరియాలతో బాధపడుతున్నాడు. వేల సంఖ్యలో తోటి సైనికులు విపరీత పరిస్థితులు ఎదుర్కొన్నారు; వారిలో చాలామంది చనిపోయారు. క్రూరదారుణాలు కళ్ళారాచూసి, అనుభవించి 1945లో ఇంటికి తిరిగివచ్చిన ఆల్బర్ట్‌ కోపిష్ఠిగా మారి దేవుడన్నా, మతమన్నా ఇష్టంలేని వానిగా తయారయ్యాడు.

17 ఆల్బర్ట్‌ భార్య ఐరీన్‌ యెహోవాసాక్షి అయింది. ఆమె సంతోషం కోసం ఆల్బర్ట్‌ యెహోవాసాక్షుల స్థానిక సంఘకూటాలకు కొన్నింటికి హాజరయ్యాడు. పాల్‌ అనే యౌవన క్రైస్తవ పూర్తికాల పరిచారకుడు ఆల్బర్ట్‌కు బైబిల్‌స్టడీ చేయడానికి ఆయనను సందర్శించేవాడు. ఫలితంగా ఆయావ్యక్తుల హృదయస్థితిని యెహోవా చూస్తాడని ఆల్బర్ట్‌ త్వరలోనే గ్రహించి, తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాడు.

18 పాల్‌ ఆ తర్వాత లండన్‌ వెళ్లి, జపాను భాష నేర్చుకుని, ఆ భాషేమాట్లాడే సంఘంలో చేరాడు. జపాను నుండి సందర్శించడానికి వచ్చిన కొంతమంది జపానీయ సాక్షుల్ని తనతోపాటు తన పాతసంఘానికి తీసుకువస్తానని పాల్‌ చెప్పినప్పుడు, జపానీయులంటేనే అస్సలు గిట్టని ఆల్బర్ట్‌ దురభిమానాన్ని అక్కడి సహోదరులు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. బ్రిటన్‌కు వచ్చిన దగ్గరనుండి, ఆల్బర్ట్‌ జపానీయుల్ని కలవడానికి ఇష్టపడేవాడు కాదు, అందువల్ల పరిస్థితి ఎలావుంటుందోనని ఆ సహోదరులు ఆందోళనపడ్డారు. వారంతగా ఆందోళనపడాల్సిన అవసరంలేదు, ఎందుకంటే ఆల్బర్ట్‌ ఆ సందర్శకుల్ని సంపూర్ణ సహోదర ప్రేమతో చేర్చుకున్నాడు.—1 పేతురు 3:8, 9.

“విశాలపరచుకొనుడి”

19. మనలో పక్షపాత వైఖరి ఉంటే అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఏ సలహా మనకు సహాయం చేయగలదు?

19 “పక్షపాతము చూపుట మంచిది కాదు” అని జ్ఞానియైన సొలొమోను రాజు వ్రాశాడు. (సామెతలు 28:21) మనకు బాగా తెలిసిన వారితో సన్నిహితంగా ఉండడం తేలికే. అయితే కొన్నిసార్లు, మనకంతగా తెలియనివారిని పెద్దగా పట్టించుకోము. అలాంటి పక్షపాతం యెహోవా సేవకునికి మంచిదికాదు. నిశ్చయంగా మనం “విశాలపరచుకొనుడి” అని పౌలు స్పష్టంగా ఇచ్చిన సలహాను పాటించడం మంచిది. అవును, వివిధ నేపథ్యాలున్న తోటి క్రైస్తవుల యెడల మన ప్రేమను విశాలపరచుకోవాలి.—2 కొరింథీయులు 6:13.

20. మన జీవితంలోని ఏ రంగాల్లో పక్షపాతంలేని మన దేవుడైన యెహోవాను అనుకరించాలి?

20 మనకు పరలోక పిలుపు అనే ఆధిక్యతవున్నా లేక భూమ్మీద నిత్యజీవ నిరీక్షణవున్నా, మనం నిష్పక్షపాతంగా ఉండటం మనం ఒకే కాపరిక్రింద ఒకే మందగా ఐక్యతను ఆనందించేందుకు సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 4:4, 5, 16) పక్షపాతంలేని మన దేవుడైన యెహోవాను అనుకరించేందుకు కృషిచేయడం, మన క్రైస్తవ పరిచర్యలో, మన కుటుంబాల్లో, సంఘాల్లో, నిజానికి మన జీవితంలోని అన్నిరంగాల్లో సహాయం చేయగలదు. ఎలా? తర్వాతి శీర్షిక ఈ అంశాన్ని తెలియజేస్తుంది.

[అధస్సూచీలు]

a యెహోవా కీర్తి ఆ తర్వాత పూజ్యకీర్తనలకు మూలాంశంగా తయారయింది.—కీర్తన 135:8-11; 136:11-20

b ఇక్కడ ‘గ్రీసుదేశస్థుడు’ అనే పదం అన్యజనులందరిని సూచిస్తుంది—యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), సంపుటి 1, 1004వ పేజీ.

మీరెలా జవాబిస్తారు?

• రాహాబు, గిబియోనీయుల యెడల యెహోవా ఎలా నిష్పక్షపాతం ప్రదర్శించాడు?

• తన బోధలో యేసు ఎలా నిష్పక్షపాతం ప్రదర్శించాడు?

• సంస్కృతికి, జాతికి సంబంధించిన ఎలాంటి దురభిమానాన్నైనా అధిగమించేందుకు మనకేది సహాయపడగలదు?

[13వ పేజీలోని చిత్రం]

కనానుమీద ఇశ్రాయేలీయుల విజయారంభం

[15వ పేజీలోని చిత్రం]

సమరయ స్త్రీకి సాక్ష్యమివ్వకుండా యేసు వెనుదీయలేదు

[16వ పేజీలోని చిత్రం]

బ్రిటన్‌లో అంహరిక్‌ బహిరంగ కూటము

[16వ పేజీలోని చిత్రం]

యెహోవాయెడల ప్రేమ దురభిమానాన్ని అధిగమించేందుకు ఆల్బర్ట్‌కు సహాయపడింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి