మీరు మెస్సీయను గుర్తించి ఉండేవారా?
ఇశ్రాయేలీయుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తు మూడున్నర సంవత్సరాలు గడిపాడు. కాని ఆయన భూపరిచర్య ముగింపుకు వచ్చే సమయానికి, ఆయన సమకాలీకులలో అధికశాతంమంది ఆయనను మెస్సీయగా, లేక దేవుని వాగ్దత్త “అభిషిక్తునిగా” నిరాకరించారు. ఎందుకు?
మొదటి శతాబ్దపు యూదులు యేసును మెస్సీయగా ఎందుకు అంగీకరించలేదనే దానికి అనేక కారణాలను గుర్తించడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. ఈ కారణాల్లో మూడు, పరిపాలిస్తున్న మెస్సీయ రాజుగా యేసు యొక్క ప్రస్తుతదిన స్థానాన్ని అంగీకరించకుండా అనేకులను ఆటంకపరుస్తాయి.
‘ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము’
మొదటి శతాబ్దపు యూదులు మెస్సీయను గుర్తించకపోవడానికి ఒక కారణం ఏమిటంటే ఆయన మెస్సీయత్వాన్ని సూచించే లేఖనాధార సూచనలను అంగీకరించడాన్ని వారు నిరాకరించడమే. అప్పుడప్పుడూ, యేసు చెప్పేది వింటున్న ప్రజలు, తాను దేవుని వద్ద నుండి వచ్చినట్లు నిరూపించుకోవడానికి ఒక సూచన చేయమని ఆయనను కోరేవారు. ఉదాహరణకు, “బోధకుడా, నీవలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని” కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు అన్నారని మత్తయి 12:38 నివేదిస్తుంది. యేసు వారికి అప్పటికే సూచనలు చూపించలేదా? కచ్చితంగా చూపించాడు.
అప్పటికే యేసు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, చనిపోతున్న బాలున్ని స్వస్థపరిచాడు, పేతురు యొక్క రోగియైన అత్తను బాగు చేశాడు, కుష్ఠురోగిని శుద్ధి చేశాడు, పక్షవాతంగల వ్యక్తిని నడిచేలా చేశాడు, 38 సంవత్సరాలుగా అస్వస్థుడైవున్న వ్యక్తికి తిరిగి ఆరోగ్యాన్ని చేకూర్చాడు, ఒక వ్యక్తి యొక్క ఊచ చేతిని బాగు చేశాడు, అనేకమందిని వారి బాధాకరమైన రోగాలనుండి తప్పించాడు, ఒక సైనికాధికారి సేవకున్ని స్వస్థపరిచాడు, ఒక విధవరాలి కుమారున్ని మరణం నుండి తిరిగిలేపాడు, ఒక అంధ మూగ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఈ అద్భుతాలు కానా, కపెర్నహూము, యెరూషలేము, నాయీనులలో జరిగాయి. అంతేగాక, అలాంటి అద్భుతాలను గూర్చిన వార్తలు యూదయ అంతటిలోను దేశంలోని పరిసర ప్రాంతాల్లోనూ వ్యాపించాయి.—యోహాను 2:1-12; 4:46-54; మత్తయి 8:14-17; 8:1-4; 9:1-8; యోహాను 5:1-9; మత్తయి 12:9-14; మార్కు 3:7-12; లూకా 7:1-10; 7:11-17; మత్తయి 12:22.
స్పష్టంగా, యేసు మెస్సీయ అని నిరూపించే సూచనలకు కొదవలేదు. ఆయన ప్రజల ఎదుట ఎన్నో సూచనలు చేసినప్పటికీ, వారాయనయందు విశ్వాసముంచలేదు. యేసు దేవుని ద్వారా పంపబడ్డాడనేదానికి రుజువును చూసి కూడా ఆయనను మెస్సీయగా అంగీకరించనివారు ఆత్మీయంగా అంధులైయుండిరి. వారి హృదయాలు కఠినమైనవిగా, సత్యానికి అభేద్యమైనవిగా ఉండినవి.—యోహాను 12:37-41.
మన కాలంలోని మాటేమిటి? కొంతమంది “నేను నా స్వంత కళ్ళతో చూసేదాన్నే నమ్ముతాను” అని చెబుతారు. అయితే అలాంటి చర్య తీసుకోవడం జ్ఞానయుక్తమైనదేనా? మెస్సీయ రాజ్యానికి పరలోక రాజుగా యేసు అప్పటికే పట్టాభిషిక్తుడయ్యాడని బైబిలు ప్రవచనం సూచిస్తుంది. ఆయన అదృశ్యంగా ఉన్నాడు గనుక, ఈ దుష్ట విధానం యొక్క అంత్యదినాల ఆరంభాన్ని సూచించిన ఆయన పరిపాలనను గుర్తించడానికి సహాయంగా మనకు ఒక సూచన అవసరం. మీరు ఆ సూచనను గుర్తిస్తారా?—మత్తయి 24:3.
బైబిలు ప్రకారం, మెస్సీయ రాజుగా క్రీస్తు పరిపాలనారంభం విస్తృత శ్రేణిలో యుద్ధాలు, భూకంపాలు, ఆహార కొరతలు, రోగాల ద్వారా సూచించబడుతుంది. “అంత్యదినములలో” మానవ సంబంధాలు స్వార్థం, పేరాశ, అదుపులేకపోవడం వంటివాటి ద్వారా గుర్తించబడతాయి. (2 తిమోతి 3:1-5; మత్తయి 24:6, 7; లూకా 21:10, 11) కాలక్రమానుసార నిదర్శనమే కాకుండా, అంత్యదినాలను గూర్చిన 20 కంటే ఎక్కువగా ఉన్న వివిధ అంశాలు 1914లో మెస్సీయ పరిపాలనారంభాన్ని సూచిస్తాయి.—మార్చి 1, 1993 కావలికోట (ఆంగ్లం) నందలి 5వ పేజీని చూడండి.
‘ధనాపేక్షగలవారు’
యూదులు యేసును మెస్సీయగా నిరాకరించడానికి మరో కారణం వస్తుదాయకత్వం. సంపదకు అధిక ప్రాముఖ్యతనివ్వడం యేసును అనుసరించకుండా అనేకులను ఆటంకపరిచింది. ఉదాహరణకు, పరిసయ్యులు ‘ధనాపేక్ష గలవారని’ పేరుపొందారు. (లూకా 16:14) యేసును సమీపించి, నిత్యజీవాన్ని ఎలా పొందాలని అడిగిన ధనికుడైన ఒక యువ పరిపాలకుని విషయాన్ని పరిశీలించండి. “ఆజ్ఞలను గైకొను”మన్నది యేసు సమాధానం. కొన్ని ఆజ్ఞలను పాటించడంకంటే ఎక్కువే అవసరమని గ్రహించినట్లు స్పష్టంచేస్తూ ఆ యువకుడు “ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని” అడిగాడు. “పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని” యేసు ఆయనకు చెప్పాడు. మెస్సీయ శిష్యునిగా ఉండడం—ఎంత చక్కని అవకాశం! అయినప్పటికీ ఆ పరిపాలకుడు వ్యసనపడి, వెళ్లిపోయాడు. ఎందుకు? ఎందుకంటే పరలోకంలోని ధనంకంటే భూమ్మీది ధనం ఆయనకు ఎక్కువ ప్రాముఖ్యమైనది.—మత్తయి 19:16-22.
పరిస్థితి మారలేదు. మెస్సీయ రాజు యొక్క నిజమైన అనుచరుడు అవ్వడమంటే, భూసంబంధ వస్తుసంపదలతోసహా అన్నిటికంటే ఉన్నత స్థానంలో ఆత్మీయ ఆసక్తులను ఉంచడమని భావం. వస్తుదాయకత్వంతో కూడిన దృక్పథంగల ఎవరికైనా, ఇది ఒక సవాలే. ఉదాహరణకు, ఒక తూర్పు దేశంలో ఒక మిషనరీ జంట బైబిలు గురించి ఒక స్త్రీతో మాట్లాడారు. యెహోవా దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆమె ఇష్టపడుతుందని విశ్వసించి ఆ జంట ఆమెకు కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను ప్రతిపాదించారు. ఆమె ఎలా ప్రతిస్పందించింది? “నేను ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి ఈ పత్రికలు నాకు సహాయం చేస్తాయా?” అని ఆమె అడిగింది. ఆ స్త్రీ ఆత్మీయ విషయాల్లో కంటే వస్తుసంబంధమైనవాటిలో ఎక్కువ ఆసక్తి కలిగివుంది.
అదే జంట ఒక యౌవనునితో బైబిలు పఠించారు, ఆ యౌవనుడు రాజ్యమందిరంలో కూటాలకు హాజరవ్వడం ప్రారంభించాడు. “నీవు నీ సమయం వ్యర్థం చేసుకుంటున్నావు. నీవు సాయంకాలాల్లో మరో ఉద్యోగం చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి” అని అతని తలిదండ్రులు అతనికి చెప్పారు. మెస్సీయ రాజు గురించి నేర్చుకోవడంకంటే వస్తుసంబంధమైన వాటిని ముందుంచమని తలిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించడం ఎంత విచారకరం! “ఎంత సంపద ఉన్నా ఒక పరిపాలకుడు పదివేల సంవత్సరాల జీవితాన్ని కొనలేడు” అని ఒక చైనా సామెత చెబుతుంది.
మెస్సీయ రాజు గురించి తెలుసుకోవడం ఆయనను అనుసరించడం ధనాపేక్ష కలిగివుండడాన్ని అనుమతించవని అనేకులు గుర్తిస్తున్నారు. అధిక రాబడులతో తన స్వంత వ్యాపారాన్ని కలిగివున్న ఒక యెహోవాసాక్షి ఇలా తెలియజేసింది: “ఎక్కువ డబ్బు కలిగివుండడం ఎంతో బాగుంటుంది కాని అది అవసరమేమి కాదు. ఒక వ్యక్తిని సంతోషపర్చేది డబ్బుకాదు.” ఇప్పుడామె వాచ్‌టవర్ సంస్థ యొక్క యూరప్ బ్రాంచి నందలి బేతేలు కుటుంబ సభ్యురాలు.
‘యూదులకు భయపడడం’
యూదులు యేసును మెస్సీయగా అంగీకరించకపోవడానికి మరో కారణం మనుష్యులకు భయపడడం. ఆయన మెస్సీయ అని బహిరంగంగా అంగీకరించడమంటే తమ పేరు ప్రతిష్టలను ప్రమాదంలో పడవేసుకోవడమని భావం. కొందరికి ఆ మూల్యం మరీ విపరీతంగా తోచింది. మహాసభ అని పిలువబడే యూదుల ఉన్నత న్యాయస్థానంలో ఒక సభ్యుడైన నికోదేము విషయం ఆలోచించండి. యేసు సూచనలు, బోధలనుబట్టి ప్రభావితుడై, “బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని” ఆయన అంగీకరించాడు. అయితే నికోదేము బహుశా ఇతర యూదులచే గుర్తింపబడకూడదని కావచ్చు రాత్రి సమయంలో యేసు వద్దకు వచ్చాడు.—యోహాను 3:1, 2.
యేసు చెప్పేది వినిన అనేకులకు, దేవుని అంగీకారంకంటే మనుష్యుల అంగీకారం ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా ఉండినది. (యోహాను 5:44) సా. శ. 32లో పర్ణశాలల పండుగ కొరకు యేసు యెరూషలేములో ఉన్నప్పుడు, “జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను.” “యూదులకు భయపడి” ఎవ్వరూ యేసు గురించి బహిరంగంగా మాట్లాడలేదు. (యోహాను 7:10-13, ఇటాలిక్కులు మావి.) అంధత్వం నుండి యేసు స్వస్థపర్చిన వ్యక్తి తలిదండ్రులు కూడా ఆ అద్భుతం దేవుని ప్రతినిధి నుండి వచ్చినదని అంగీకరించడానికి ఇష్టపడలేదు. వారు కూడా ‘యూదులకు భయపడ్డారు.’—యోహాను 9:13-23.
నేడు, యేసు మెస్సీయ రాజుగా పరలోకం నుండి పరిపాలిస్తున్నాడని కొందరు గుర్తిస్తారు, కాని దీన్ని బహిరంగంగా అంగీకరించడానికి వారు భయపడతారు. వారికి ఇతరుల ఎదుట తమ స్థానాన్ని కోల్పోవడం యొక్క వెల మరీ ఎక్కువ. ఉదాహరణకు, జర్మనీలో ఒక యెహోవాసాక్షి ఒక వ్యక్తితో బైబిలు గురించి చర్చించాడు, ఆ వ్యక్తి ఇలా అంగీకరించాడు: “సాక్షులైన మీరు బైబిలు గురించి చెప్పేది సత్యమే. కాని ఈ రోజు నేను సాక్షినైతే, రేపటికల్లా దాని గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. పనిస్థలంలో, ఇరుగుపొరుగున, నేను నా కుటుంబం సభ్యులమైన క్లబ్బులో వాళ్లు ఏమనుకుంటారు? అది నేను సహించలేను.”
మనుష్యులకు భయపడడానికి కారణమేమిటి? గర్వం, కుటుంబం మరియు స్నేహితుల మధ్య పేరుపొందడాన్ని గూర్చిన మక్కువ, హేళన మరియు హీనంగా చూడబడతామనే భయం, అనేకుల నుండి వేరుగా ఉండడాన్ని గూర్చిన వ్యాకులత. ప్రాముఖ్యంగా యెహోవాసాక్షులతో బైబిలు పఠించనారంభించేవారికి అలాంటి భావాలు ఒక పరీక్షలా ఉంటాయి. ఉదాహరణకు, యేసుక్రీస్తు పరిపాలన క్రింద భూమిపై మెస్సీయ రాజ్యం స్థాపించే పరదైసు గురించి తెలుసుకుని ఒక యువతి ఎంతో ఉత్తేజం పొందింది. కాని ఆమెకు డిస్కో అంటే ఎంతో అభిమానం ఉండేది, ఈ నిరీక్షణ గురించి ఇతరులతో మాట్లాడడాన్ని మనుష్యుల ఎడల ఆమెకున్న భయం ఆటంకపరిచింది. చివరికి, బైబిలు గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఆమె ధైర్యాన్ని కూడగట్టుకుంది. ఆమె డిస్కో స్నేహితులు ఆమెను నిరాకరించారు, కాని ఆమె భర్త, ఆమె తలిదండ్రులు ఆసక్తి చూపించారు. ఆ స్త్రీ, ఆమె తల్లి చివరికి బాప్తిస్మం తీసుకున్నారు, ఆమె భర్త, ఆమె తండ్రి బైబిలు పఠించడం ప్రారంభించారు. మనుష్యులకు భయపడడాన్ని అధిగమించినందుకు ఎంతటి ప్రతిఫలం!
మీరు నిజంగా మెస్సీయను గుర్తిస్తారా?
యేసు హింసా కొయ్యపై మరణిస్తుండగా, ఆయన శిష్యులలో కొందరు అక్కడే ఉన్నారు. వారు ఆయనను ప్రవచింపబడిన మెస్సీయగా గుర్తించారు. చెప్పాలంటే, ఇంకా సూచనను కోరుతున్న యూదా పాలకులు కూడా అక్కడున్నారు. ‘వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు [లేక మెస్సీయ] అయినయెడల తన్నుతాను రక్షించుకొనును.’ (లూకా 23:35) వాళ్లు సూచన గురించి అడగడం ఎన్నడూ మానుకోలేదా? యేసు డజన్ల కొలది అద్భుతాలు చేశాడు. అదనంగా, ఆయన జననం, పరిచర్య, శ్రమ, శిక్ష, పునరుత్థానం అనేక హెబ్రీ లేఖనాలను నెరవేర్చాయి.—వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సంస్థ ప్రచురించిన “ప్రతి లేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం) అనే పుస్తకంలోని 343-4 పేజీలను చూడండి.
ఆయన మెస్సీయత్వ రుజువును నిరాకరించినవారై, అటుగా వెళుతున్నవారు యేసును నిందించారు. (మత్తయి 27:39, 40) సైనికులు వస్తుదాయకంగా యేసు వస్త్రాలను తమలో తాము పంచుకున్నారు, ఆయన అంగీ కొరకు చీట్లు వేశారు. (యోహాను 19:23, 24) కొన్ని సందర్భాలలో మనుష్యులను గూర్చిన భయమే ఒక కారణమయ్యింది. ఉదాహరణకు, మహాసభ సభ్యుడైన అరిమతయియ యోసేపును పరిశీలించండి. ఆయన ‘యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడయ్యాడు.’ మెస్సీయ మరణం తర్వాత యోసేపు మరియు నికోదేము యేసు శరీరం గురించి శ్రద్ధ తీసుకున్నారు. యోసేపు అలా మనుష్యులను గూర్చిన భయాన్ని అధిగమించాడు.—యోహాను 19:38-40.
మీరు మొదటి శతాబ్దంలో జీవించి ఉంటే, మీరు యేసును మెస్సీయగా గుర్తించి ఉండేవారా? అలా చేయడానికి మీరు లేఖనాధార రుజువును అంగీకరించడం, వస్తుదాయక ఆలోచనా విధానాన్ని నిరాకరించడం, మనుష్యులను గూర్చిన భయానికి లొంగిపోకుండా ఉండడం అవసరమై ఉండేవి. ఈ అంత్య దినాల్లో, మనలో ప్రతి ఒక్కరు తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నేను ఇప్పుడు యేసును పరలోక మెస్సీయ రాజుగా గుర్తిస్తానా?’ త్వరలోనే ఆయన భూసంబంధ విషయాలను చూసుకుంటాడు. అలా జరిగినప్పుడు, యేసు క్రీస్తును వాగ్దత్త మెస్సీయగా నిజంగా గుర్తించేవారిలో మీరు చేరివుంటారా?
[28వ పేజీలోని చిత్రం]
యేసు మెస్సీయ రాజు అనేదాన్ని గూర్చిన రుజువును ఎన్నడూ ఉద్దేశపూర్వకంగా అలక్ష్యం చేయకండి
[31వ పేజీలోని చిత్రం]
మెస్సీయ గురించి తెలుసుకోవడమంటే ఇతరులేమంటారనేదాన్ని గూర్చిన భయాన్ని అధిగమించడమని తరచూ భావం