కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 10/1 పేజీలు 9-13
  • “ఆతిథ్యము ఇచ్చుచుండుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఆతిథ్యము ఇచ్చుచుండుడి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపరిచితుల ఎడల మక్కువ
  • యెహోవా పరిపూర్ణుడైన ఆతిథ్యదాత
  • ఒక ఆతిథ్యదాతగా దేవదూతల్ని సేవించడం
  • ఆతిథ్యమిచ్చే ప్రజలు
  • ఆతిథ్యం—సంతోషాన్నిచ్చే ప్రాముఖ్యమైన చర్య
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • వాళ్లకు ఆతిథ్యం ఇవ్వండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • సహోదరులను ఇంటికి ఆహ్వానించి మీకున్న మంచి విషయాలను ఇవ్వండి (మత్త. 12:35ఎ)
    మన రాజ్య పరిచర్య—2014
  • ‘ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 10/1 పేజీలు 9-13

“ఆతిథ్యము ఇచ్చుచుండుడి”

“పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.”—రోమీయులు 12:13.

1. మానవ ప్రాథమిక అవసరం ఏమిటి, అదెలా వ్యక్తపర్చబడింది?

అపరిచిత పరిసరాల్లో నిర్మానుష్యమైన వీధిలో బాగా చీకటిపడిన తర్వాత నడుచుకుంటూ వెళ్లడం ఈ రోజుల్లో కలతపర్చే అనుభవం కాగలదు. కాని జన సమూహంలోవుండి ఎవరూ తెలియకపోవడంగాని లేక గుర్తించబడకపోవడంగాని అంతే బాధాకరమైనది కాగలదు. నిశ్చయంగా మానవ స్వభావ ప్రాముఖ్య భాగమేంటంటే శ్రద్ధ చూపించబడాల్సిన, గుర్తించబడాల్సిన, ప్రేమించబడాల్సిన అవసరమే. అపరిచయస్థునివలె లేక పరాయివానివలె వ్యవహరించబడడానికి ఎవ్వరూ ఇష్టపడరు.

2. సహవాసం కొరకైన మన అవసరతను తీర్చడానికి యెహోవా ఏవిధమైన ఏర్పాటుచేశాడు?

2 సమస్తాన్ని నిర్మించి, సృజించిన యెహోవా దేవునికి సహవాసం కొరకైన మానవ అవసరతను గురించి బాగా తెలుసు. తన మానవ సృష్టి నిర్మాణకునిగా ‘నరుడు ఒంటరిగానుండుట మంచిది కాదని’ ఆదినుండి దేవునికి తెలుసు మరియు ఆ విషయంలో ఆయన కొంత చేశాడు. (ఆదికాండము 2:18, 21, 22) యెహోవా ద్వారాను ఆయన సేవకుల ద్వారాను మానవుల ఎడల వ్యక్తపర్చబడిన దయాపూర్వక కార్యాలను గూర్చిన ఉదాహరణలతో బైబిలు నిండివుంది. ఇతరుల సంతోషానందాల కొరకు మన సంతృప్తి కొరకు ‘ఆతిథ్యాన్ని’ ఎలా ‘ఇవ్వాలో’ నేర్చుకునేలా మనల్నిది చేస్తుంది.—రోమీయులు 12:13.

అపరిచితుల ఎడల మక్కువ

3. ఆతిథ్యం యొక్క ప్రాథమిక భావాన్ని వివరించండి.

3 బైబిలులో ఉపయోగించబడిన “ఆతిథ్యము” అనే పదం ‘ప్రేమ,’ ‘అపరిచయస్థుడు’ అనే అర్థాలుగల రెండు మూల పదాలతో రూపొందించబడిన ఫిలొక్సెనియా అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది. గనుక ఆతిథ్యమంటే ప్రాథమికంగా “అపరిచితుల్ని ప్రేమించడం” అని అర్థం. అయినా, ఇది కేవలమొక లాంఛనప్రాయమైన విషయమో లేక మర్యాదపూర్వకమైన విషయమో కాదు. ఇందులో ఒకని భావాలు, అనురాగాలు చేరివున్నాయి. జేమ్స్‌ స్ట్రాంగ్స్‌ ఎక్జాస్టివ్‌ కాంకర్డన్స్‌ ఆఫ్‌ ది బైబిలు ప్రకారంగా ఫీలియో అనే క్రియా పదం “([ఒక వ్యక్తి ఎడల లేక వస్తువు ఎడల] మక్కువ) స్నేహితుడై ఉండడం, అంటే (భావావేశ విషయంగాగానీ లేక భావనాపర విషయంగాగానీ వ్యక్తిగతంగా చేరువవడాన్ని సూచిస్తున్న) అనురాగాన్ని కల్గివుండడం” అని అర్థం. కాబట్టి ఆతిథ్యం సిద్ధాంతపరమైన ప్రేమకన్నా గొప్పది అంటే బహుశా కర్తవ్యాన్నిబట్టో విధినిబట్టో చేసిన దానికన్నా గొప్పది. ఇది సాధారణంగా యథార్థమైన మక్కువ, అనురాగం, స్నేహబంధాల వ్యక్తీకరణే.

4. ఆతిథ్యాన్ని ఎవరి ఎడల చూపించాలి?

4 ఈ మక్కువను అనురాగాన్ని స్వీకరించేవాడు “అపరిచితుడే” (గ్రీకులో గ్జెనోస్‌). ఇదెవరై ఉండవచ్చు? మరలా, గ్జెనోస్‌ అనే పదాన్ని ‘విదేశీయుడు (అక్షరార్థంగా పరదేశి లేక అలంకారికంగా పరాయివాడు); అంతర్గతంగా ఓ అతిథి లేక (విపర్యంగా) అపరిచితుడు’ అని స్ట్రాంగ్స్‌ కాంకర్డన్స్‌ నిర్వచిస్తోంది. కాబట్టి బైబిల్లో ఉదాహరించబడినట్లుగా ఆతిథ్యం, మనం మక్కువ కల్గివున్న ఒకని ఎడల వ్యక్తపర్చబడిన దయను ప్రతిబింబించగలదు లేక అది పూర్తిగా అపరిచితుడైనవానికి కూడా విస్తృతపర్చబడగలదు. యేసు ఇలా వివరించాడు: “మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.” (మత్తయి 5:46, 47) దురభిమానంచే భయంచే విధించబడిన విభజనను వివక్షణను యథార్థమైన ఆతిథ్యం అధిగమిస్తుంది.

యెహోవా పరిపూర్ణుడైన ఆతిథ్యదాత

5, 6. (ఎ) “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు” అని యేసు చెప్పినప్పుడు ఆయన మనస్సులో ఏమివుంది? (బి) యెహోవా ఉదారత్వం ఎలా కనుపర్చబడింది?

5 పైన క్రోడీకరించినట్లుగా మానవులు ఒకరి ఎడల మరొకరు వ్యక్తపర్చిన ప్రేమలోని లోపాన్ని ఎత్తిచూపిన తర్వాత ‘మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి’ అనే వ్యాఖ్యానాన్ని యేసు చేర్చాడు. (మత్తయి 5:48) నిశ్చయంగా యెహోవా అన్ని విషయాల్లోను పరిపూర్ణుడు. (ద్వితీయోపదేశకాండము 32:4) అయినా, ఆయన ముందు చెప్పినట్లుగానే యెహోవా పరిపూర్ణత యొక్క ఒక విశిష్ట దృక్కోణాన్ని ఇలా ఉన్నతపరుస్తున్నాడు: “[దేవుడు] చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:45) దయను చూపించే విషయానికొస్తే యెహోవాయందు ఏ పక్షపాతమూ లేదు.

6 సృష్టికర్తగా, యెహోవాయే అన్నింటికి యజమాని. “అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి” అని యెహోవా చెబుతున్నాడు. (కీర్తన 50:10, 11) అయినప్పటికీ ఆయన స్వార్థంతో దేనినీ దాచుకోలేదు. తన ఔదార్యాన్నిబట్టి ఆయన తన ప్రాణులన్నింటికీ దయచేస్తున్నాడు. కీర్తనల గ్రంథకర్త యెహోవాను గురించి ఇలా చెప్పాడు: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు.”—కీర్తన 145:16.

7. అపరిచితుల్ని, అవసరతలోవున్న వారిని యెహోవా ఆదరిస్తున్న విధానం నుండి మనమేమి నేర్చుకొనగలం?

7 ప్రజలకు అవసరమైన వాటిని యెహోవా ఇస్తున్నాడు—తనను ఎరుగని తనకు అపరిచితులైన ప్రజలకు కూడా ఇస్తున్నాడు. యెహోవా “ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని” లుస్త్ర పట్టణంలోని విగ్రహారాధికులకు పౌలు, బర్నబా జ్ఞాపకం చేశారు. (అపొస్తలుల కార్యములు 14:17) విశేషంగా అవసరతలో ఉన్నవారి విషయంలో యెహోవా దయగలవాడు, ఔదార్యంగలవాడు. (ద్వితీయోపదేశకాండము 10:17, 18) ఇతరులకు—దయను, ఔదార్యాన్ని చూపించే విషయంలోను, ఆతిథ్యమిచ్చువారిగా ఉండే విషయంలోను మనం యెహోవానుండి నేర్చుకోగల్గేదెంతో ఉంది.

8. మన ఆత్మీయ అవసరతల్ని తీర్చడం విషయంలో యెహోవా తన ఉదారత్వాన్ని ఎలా చూపించాడు?

8 తన ప్రాణుల భౌతిక అవసరాలు నిమిత్తం సమృద్ధిగా దయచేయడంతోపాటు, యెహోవా ఆత్మీయ రీతిలో వారి అవసరతల ఎడల శ్రద్ధ వహిస్తున్నాడు. ఆత్మీయంగా ప్రమాదభరితమైన స్థితిలో మనం ఉన్నామని మనలో ఎవరమూ గుర్తించక మునుపే మన ఆత్మీయ క్షేమం నిమిత్తమై యెహోవా ఎంతో ఉదాత్తమైన రీతిలో పనిచేశాడు. రోమీయులు 5:8, 10 వచనాల్లో మనమిలా చదువుతాం: “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. . . . శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో . . . సమాధానపరచబడిన వారమై” ఉన్నాం. ఆ ఏర్పాటు మన పరలోకపు తండ్రితో ఒక సంతోషకరమైన కుటుంబ బాంధవ్యంలోనికి రావడానికి పాపభరితులైన మానవులకు సాధ్యపరుస్తోంది. (రోమీయులు 8:20, 21) మన పాపభరితమైన అపరిపూర్ణ స్థితిలో ఉండడానికి బదులు జీవితాన్ని మనం విజయవంతంగా చేసుకొనగల్గేలా సరియైన నడిపింపును మార్గ నిర్దేశకత్వాన్ని మనకు దయచేయబడేలా కూడా యెహోవా చూశాడు.—కీర్తన 119:105; 2 తిమోతి 3:16.

9, 10. (ఎ) యెహోవా పరిపూర్ణుడైన ఆతిథ్యదాతయని మనం ఎందుకు చెప్పగలం? (బి) ఈ విషయంలో సత్యారాధికులు యెహోవాను ఎలా అనుకరించాలి?

9 దీని దృష్ట్యా, అనేక విధాలుగా యెహోవా నిజంగా పరిపూర్ణుడైన ఆతిథ్యదాత అని మనం చెప్పగలం. అవసరతలోను దీనస్థితిలోను పేదరికంలోను ఉన్నవారిని ఆయన అలక్ష్యం చేయడు. ఆయన అపరిచితుల ఎడల అలాగే తన శత్రువుల ఎడల సహితం యథార్థమైన ఆసక్తిని శ్రద్ధను చూపిస్తున్నాడు, ఆయన ఏ ప్రతిఫలాన్ని అపేక్షించడు. దీనంతటినిబట్టి చూస్తే ఆయనే పరిపూర్ణుడైన ఆతిథ్యదాతకు ప్రధాన మాదిరికాదా?

10 అటువంటి దయాళుత్వం ఔదార్యం కల్గిన దేవునిగా యెహోవా తన ఆరాధికులు తనను అనుసరించాలని కోరుకుంటున్నాడు. బైబిలుయందంతటా ఈ దయాపూర్వక లక్షణాన్ని కల్గిన విశిష్ట మాదిరులను మనం చూస్తాం. ది  ఎన్‌సైక్లోపీడియా జుడైకా “ప్రాచీన ఇశ్రాయేలులో, ఆతిథ్యమనేది కేవలం మంచి మర్యాదలకు సంబంధించిన విషయమే కాదుగాని ఓ నైతికపరమైన వ్యవస్థ . . . అలసిపోయిన ప్రయాణికున్ని ఆహ్వానించే, తమ మధ్యనున్న అపరిచితునికి వసతిని కల్పించే బైబిలు ఆచారాలే మాతృకయైవుంది, దాని నుండి ఆతిథ్యం, దాని సంబంధిత లక్షణాలన్నీ యూదా పారంపర్యాచారంలో ఉన్నతంగా గౌరవించబడిన ఓ సద్గుణంగా పురోభివృద్ధి చెందాయి.” ఫలాన దేశానికో లేక జాతికో చెందిన చిహ్నంగా ఉండడం మాత్రమే కాకుండా ఆతిథ్యం యెహోవా సత్యారాధికులు అందరినీ సూచించే లక్షణమైవుండాలి.

ఒక ఆతిథ్యదాతగా దేవదూతల్ని సేవించడం

11. ఆతిథ్యం ఎదురు చూడని ఆశీర్వాదాల్ని తెస్తుందని ఏ విశిష్టమైన మాదిరి చూపుతోంది? (ఆదికాండము 19:1-3; న్యాయాధిపతులు 13:11-16 వచనాలను కూడా చూడండి.)

11 ఆతిథ్యాన్ని చూపించిన ప్రసిద్ధిగాంచిన బైబిలు వివరణల్లో ఒకటి, హెబ్రోనుకు దగ్గరలోవున్న మమ్రేలోని పెద్ద వృక్షాల మధ్య అబ్రాహాము, శారా మకాం ఉన్నప్పుడు వారు చూపించిన ఆతిథ్యం. (ఆదికాండము 18:1-10; 23:19) అపొస్తలుడైన పౌలు ఈ ఉద్బోధనను ఇచ్చినప్పుడు ఆయన మనస్సులో ఈ సంఘటన ఉందనడంలో సందేహమేమీ లేదు: “ఆతిథ్యము చేయమరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి.” (హెబ్రీయులు 13:1) ఆ ఆతిథ్యం కేవలం ఆచారంవల్లో లేక చిన్ననాటి శిక్షణవల్లో వచ్చేదికాదని గ్రహించడానికి ఈ వివరణను అధ్యయనం చేయడం మనకు తోడ్పడుతుంది. బదులుగా అది అద్భుతకరమైన ఆశీర్వాదాల్ని తెచ్చిన ఒక దైవిక లక్షణమైవుంది.

12. అపరిచితుల ఎడల తన ప్రేమను అబ్రాహాము ఎలా చూపించాడు?

12 సందర్శకుల్ని అబ్రాహాము ఎరగడని, వారి రాకను ఎదురుచూడలేదని, ఆదికాండము 18:1, 2 వచనాలు సూచిస్తున్నాయి అంటే వాళ్లు దారినపోయే ముగ్గురు అపరిచయస్థులు మాత్రమే. కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పినట్లుగా, అపరిచిత ప్రాంతంలోవున్న ఓ ప్రయాణికుడు తనకు అక్కడెవరూ తెలియకపోయినా కూడా ఆతిథ్యాన్ని అపేక్షించే హక్కును కల్గివుండడమనేది ప్రాచ్యదేశస్థులమధ్యనున్న ఆచారమైవుంది. కాని అబ్రాహాము ఆ అపరిచితులు తమ హక్కును ఉపయోగించుకొనేంతవరకు వేచివుండలేదు; ఆయనే చొరవ తీసుకున్నాడు. తనకు కొంత దూరంలోవున్న ఈ అపరిచితుల్ని కలుసుకునేందుకు ఆయన ‘పరుగెత్తాడు’—ఇదంతా “ఎండవేళ” జరిగింది, అబ్రాహాముకేమో 99 ఏళ్లు! మనము అనుసరించడానికి ఓ మాదిరిగా అబ్రాహామును పౌలు ఎందుకు శ్లాఘించాడో ఇది చూపించడం లేదా? ఆతిథ్యానికి కావల్సిందంతా అదేయైవుంది అంటే అపరిచితుల ఎడల మక్కువ లేక ప్రేమ, వారి అవసరతల ఎడల శ్రద్ధే. అది ఒక అనుకూలమైన లక్షణం.

13. అబ్రాహాము సందర్శకుల ఎదుట ఎందుకు ‘వంగాడు’?

13 అపరిచితుల్ని కలుసుకున్న తర్వాత అబ్రాహాము ‘నేలమట్టుకు వంగాడని’ కూడా ఆ వివరణ మనకు చెబుతోంది. బొత్తిగా అపరిచయస్థులైనవారి ఎదుట వంగడమా? సరే, అబ్రాహాము వంగినట్లుగా వంగడం, గౌరవనీయుడైన అతిథికో లేక ఉన్నత స్థానంలోవున్న ఒకనికో చేసే అభివాదమే, దేవునికి మాత్రమే పరిమితమైన ఆరాధనా క్రియగా దృష్టించకూడదు. (అపొస్తలుల కార్యములు 10:25, 26; ప్రకటన 19:10 పోల్చండి.) వంగడంద్వారా అంటే కేవలం తలను వంచడమేకాదుగాని ‘నేలమట్టుకు వంగడం’ ద్వారా అబ్రాహాము ఈ అపరిచితుల్ని గౌరవించదగిన ప్రముఖులని అంగీకరించాడు. ఆయన ఒక పెద్ద సుసంపన్న మూలపురుష కుటుంబానికి శిరస్సే అయినా ఈ అపరిచితుల్ని తనకన్నా గొప్ప ఘనతకు పాత్రులైనవారిగా ఆయన గౌరవించాడు. అపరిచితుల్ని అనుమానించే వాడుకకీ, వేచి చూడండనే దృక్పథానికీ ఇదెంత భిన్నంగావుందో! అబ్రాహాము ఈ క్రింది వ్యాఖ్యాన భావాన్ని నిజంగా ప్రదర్శించాడు: “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.”—రోమీయులు 12:10.

14. అపరిచితులకు అబ్రాహాము చూపించిన ఆతిథ్యంలో ఏ ప్రయత్నం, త్యాగం ఇమిడి ఉన్నాయి?

14 అబ్రాహాము భావాలు యథార్థమైనవని మిగతా వివరణ చూపుతోంది. భోజనం సహితం అపూర్వమైంది. విస్తారమైన పశుసంపదను కల్గివున్న ఓ పెద్ద కుటుంబంలో కూడా “ఒక మంచి లేత దూడ” సామాన్యమైన అనుదిన భోజనం కాదు. ఆ ప్రాంతంలో ప్రబలివున్న ఆచారాల్ని గురించి జాన్‌ కిటోస్‌ డైలీ బైబిల్‌ ఇలస్ట్రేషన్స్‌ ఇలా తెలియజేస్తోంది: “కొన్ని పండుగల్లో లేక అపరిచితుడు వచ్చినప్పుడో మినహా విలాసాలు ఎన్నడూ వ్యాపకంకాలేదు; అనేకమైన పశు పక్ష్యాదుల్ని కల్గినవాళ్లు కూడా జంతు మాంసాన్ని తినేది అటువంటి సందర్భాల్లోనే.” పాడైపోయే ఏ ఆహారాన్నైనా నిల్వచేయడానికి వేడి శీతోష్టస్థితి అనువుగా ఉండదు, అంతా అక్కడికక్కడే అయిపోయేలా అటువంటి ఆహారాన్ని సిద్ధపర్చాలి. ఈ చిన్న వివరణలోనే “త్వరపడి” లేక “త్వరగా” అనే పదం మూడు సార్లు కన్పించడం, ఆహారాన్ని సిద్ధపర్చేందుకు అబ్రాహాము లాక్షిణికంగా ‘పరుగెత్తడం’ ఆశ్చర్యపర్చనక్కర్లేదు!—ఆదికాండము 18:6-8.

15. అబ్రాహాము చూపిన మాదిరిగా, ఆతిథ్యాన్ని చూపించడంలో ఆహార పదార్థాల విషయంలో సరియైన దృక్పథం ఏమిటి?

15 అయినా, ఒకరిని ప్రభావితుల్ని చేసేందుకు కేవలమొక పెద్ద విందును చేయడమే ఉద్దేశం కాదు. అబ్రాహాము, శారా ఆహారాన్ని సిద్ధపర్చి పెట్టడానికి అన్ని ప్రయత్నాల్ని చేసినప్పటికీ, అబ్రాహాము దానిని ముందుగానే ఏవిధంగా తెలియజేశాడో గమనించండి: ‘నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టుక్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందునిమిత్తమేగదా మీ దాసునియొద్దకు వచ్చితిరి.’ (ఆదికాండము 18:4, 5) ఆ “కొంచెము ఆహారము” మెత్తని పిండితో చేసిన గుండ్రని రొట్టెలు, వెన్న, పాలుతోపాటు క్రొవ్వుపట్టిన దూడ విందుగా—రాజులకు తగిన విందుగా తయారైంది. దానిలోని పాఠమేమిటి? ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఆహార పానీయాలు ఎంత విలువైనవిగా ఉంటాయి లేక ఎంత విస్తృతమైన వినోదం ఏర్పాటు చేయబడుతుంది, మొదలైనవి ప్రాముఖ్యమైన విషయంకాదు లేక నొక్కి చెప్పబడాల్సినవికావు. ఒకడు విలువైన వాటిని పెట్టగల్గుతాడా లేదా అనే దానిపై ఆతిథ్యం ఆధారపడి ఉండదు. బదులుగా, అది ఇతరుల క్షేమం కొరకైన యథార్థమైన శ్రద్ధపైన, ఒకడు తాను చేయగలిగినంత మేరకు ఇతరులకు మంచి చేయాలనే కోరికపైన ఆధారపడివుంది. “పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు” అని బైబిలు సామెత చెబుతోంది, అందులోనే యథార్థమైన ఆతిథ్యానికి కీలకంవుంది.—సామెతలు 15:17.

16. సందర్శకుల కొరకు అబ్రాహాము చేసిన దానిలో ఆత్మీయ విషయాల ఎడల తన ప్రశంసను ఎలా వ్యక్తపర్చాడు?

16 అయినా, ఈ సంఘటనయందతటా తీవ్రస్థాయిలోవున్న ఓ ఆత్మీయ సలహా కూడా ఉన్నట్లు మనం గమనిస్తాం. ఈ సందర్శకులు యెహోవా దగ్గరనుండి వచ్చిన సందేశకులని అబ్రాహాము ఏదోవిధంగా గ్రహించాడు. “ప్రభువా (“యెహోవా,” NW) నీ కటాక్షము నామీదనున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు” అనే మాటలతో వారిని సంబోధించడంలో ఇది సూచించబడింది.a (ఆదికాండము 18:3; నిర్గమకాండము 33:20 పోల్చండి.) వాళ్లు తనకోసం ఓ సందేశాన్ని తెచ్చారో లేక కేవలం దారిన పోతున్నారో ముందుగా అబ్రాహామునకు తెలియదు. ఏదేమైనా, యెహోవా సంకల్పం నెరవేరుతోందని ఆయన గుణగ్రహించాడు. యెహోవా అప్పగించిన ఓ పనిలో ఈ వ్యక్తులు నిమగ్నమైవున్నారు. దానికి ఆయన కొంత సహకరించగల్గితే అది ఆయనకు ప్రీతికరకమైనదౌతుంది. యెహోవా సేవకులు శ్రేష్ఠమైన వాటిని పొందనర్హులని ఆయన గ్రహించాడు, తన పరిస్థితులకు అనుగుణంగా ఆయన శ్రేష్ఠమైన వాటిని అందిస్తాడు. అలా చేయడం ద్వారా, తనకొరకుగాని లేక వేరొకరికిగాని ఓ ఆత్మీయాశీర్వాదం ఉంటుంది. ఆవిధంగా అబ్రాహాము, శారా తమ యథార్థమైన ఆతిథ్యాన్నిబట్టి బహుగా ఆశీర్వదించబడ్డారు.—ఆదికాండము 18:9-15; 21:1, 2.

ఆతిథ్యమిచ్చే ప్రజలు

17. తమ మధ్యనున్న అపరిచితులు మరియు అవసరతలో ఉన్నవారి విషయంలో ఇశ్రాయేలీయుల నుండి యెహోవా దేనిని ఎదురు చూశాడు?

17 అబ్రాహాము యొక్క విశిష్టమైన మాదిరిని ఆయన నుండి వచ్చిన జనాంగం మర్చిపోకూడదు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రములో వారి మధ్యనున్న అపరిచితులకు ఆతిథ్యాన్ని ఇవ్వడం కొరకైన ఏర్పాట్లు చేర్చబడ్డాయి. “మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.” (లేవీయకాండము 19:34) ప్రజలు వస్తుదాయక మద్దతు అవసరమైన వారికి ప్రత్యేకమైన శ్రద్ధను ఇవ్వాలి, వారిని తేలికగా కొట్టిపారవేయకూడదు. యెహోవా సమృద్ధికరమైన పంటలతో వారిని ఆశీర్వదించినప్పుడు, తమ పండుగల్లో వారు ఆనందించినప్పుడు, సబ్బాతు సంవత్సరాల్లో తమ కష్టాన్నుండి వారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మరితర సందర్భాల్లోను ప్రజలు అంతగా భాగ్యవంతులుకాని విధవరాండ్రును తండ్రుల్లేని బాలురను మరియు విదేశీయులను జ్ఞాపకం చేసుకోవాలి.—ద్వితీయోపదేశకాండము 16:9-14; 24:19-21; 26:12, 13.

18. యెహోవా అనుగ్రహాశీర్వాదాల్ని పొందడానికి సంబంధించి ఆతిథ్యం ఏవిధంగా ప్రాముఖ్యమైంది?

18 ఇతరుల ఎడల విశేషంగా అవసరతలో ఉన్నవారి ఎడల దయను ఉదారత్వాన్ని ఆతిథ్యాన్ని చూపించాల్సిన ప్రాముఖ్యత, ఇశ్రాయేలీయులు ఈ లక్షణాల్ని అలక్ష్యం చేసినప్పడు యెహోవా వారితో వ్యవహరించిన విధానంలో కనబడుతుంది. తన నుండి వచ్చే ఎడతెగని ఆశీర్వాదాల్ని పొందేందుకు తన ప్రజలకు ఉండాల్సిన వాటిలో, అవసరతలో ఉన్నవారి ఎడల అపరిచితుల ఎడల దయను ఉదారత్వాన్ని చూపించడం ఉన్నాయని యెహోవా స్పష్టం చేశాడు. (కీర్తన 82:2, 3; యెషయా 1:17; యిర్మీయా 7:5-7; యెహెజ్కేలు 22:7; జెకర్యా 7:9-11) వీటిని మరితర కట్టడలను అనుసరించడంలో జనాంగం నిమగ్నమైవున్నప్పుడు వారు వర్ధిల్లి భౌతికంగాను ఆత్మీయంగాను సమృద్ధిని అనుభవించారు. వాళ్లు తమ స్వార్థపర వ్యక్తిగత గమ్యాల్లో మునిగిపోయి, అవసరతలో ఉన్నవారి ఎడల ఈ దయాపూర్వక లక్షణాల్ని చూపించడాన్ని నిర్లక్ష్యపర్చినప్పుడు వారు యెహోవాచే తృణీకరించబడి, చివరకు తీవ్రమైన తీర్పు వారికి కొలిచి ఇవ్వబడింది.—ద్వితీయోపదేశకాండము 27:19; 28:15, 45.

19. మనం తర్వాత దేనిని పరిశీలించాలి?

19 కాబట్టి ఈ విషయంలో యెహోవా అపేక్షించిన వాటికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా లేదాయని మనల్ని మనం పరీక్షించుకొని, చూసుకోవడానికి ఇదెంత ప్రాముఖ్యమో కదా! ఈ లోకంలోవున్న స్వార్థపర విభాజిత స్ఫూర్తి దృష్ట్యా నేడిది విశేషంగా అవసరం. విభాగిత ప్రపంచంలో క్రైస్తవ ఆతిథ్యాన్ని మనమెలా చూపించగలం? తర్వాత శీర్షికలో చర్చించబడిన అంశమదే.

[అధస్సూచీలు]

a ఈ విషయంపై సమగ్రమైన చర్చ కొరకు కావలికోట (ఆంగ్లం) మే 15, 1988 పేజీలు 21-3లలో ఉన్న “ఎవరైనా దేవునిని చూశారా?” అనే శీర్షికను చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

◻ “ఆతిథ్యము” అని అనువదించబడిన బైబిలు పద భావం ఏమిటి?

◻ ఆతిథ్యం చూపించడంలో ఏయే విధాలుగా యెహోవా పరిపూర్ణ మాదిరికర్త?

◻ ఆతిథ్యాన్ని ఇవ్వడంలో అబ్రాహాము ఏ మేరకు వెళ్లాడు?

◻ నిజ క్రైస్తవులందరూ ఎందుకు ‘ఆతిథ్యాన్ని ఇవ్వాలి’?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి