రాజ్య ప్రచారకుల నివేదిక
ఐర్లాండ్లో బైబిలు సత్యాలు ప్రకటింపబడుతునే ఉన్నాయి
ఇటీవలి సంవత్సరాల్లో అందమైన దృశ్యాలున్న దేశమగు ఐర్లాండ్లో ఎంతో అలజడి చెలరేగింది. అదే సమయంలో, యెహోవాసాక్షులు తెచ్చిన నిరీక్షణా వర్తమానానికి ఐర్లాండ్ ప్రజలు సుముఖంగా స్పందించారు. ఐర్లాండ్నుండి వచ్చిన ఈ క్రింది అనుభవాలు ఈ విషయాన్ని రుజువుపరుస్తున్నాయి.
▪ డబ్లన్లోని ఒక యెహోవాసాక్షి, ఆయన చిన్న కుమార్తె ఇంటింటి ప్రకటనాపనిలో భాగం వహిస్తున్నారు. తనకున్న అనేకమంది పిల్లలతో పనుల్లో తలమునకలౌతున్న కేథీ అనే స్త్రీని వారు కలిశారు. ప్రకటించడాన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న తన కుమార్తె, ఒక క్లుప్త వర్తమానాన్ని ఆమెతో పంచుకోవచ్చునేమో అని ఆ సాక్షి అడిగాడు. కేథీ అంగీకరించింది, ఆ చిన్న పాప స్పష్టంగా, ఎంతో చక్కగా ఆలోచించి మాట్లాడింది. ఆ అమ్మాయి ప్రదర్శించిన నిజమైన యథార్థత, గౌరవాన్నిబట్టి కేథీ ముగ్ధురాలైంది, ఇవ్వబడిన ఒక బైబిలు కరపత్రాన్ని తీసుకునేందుకు ఆమె అంగీకరించింది.
తన ఇంటికి వచ్చిన ఆ చిన్ని సందర్శకురాలి చక్కని సిద్ధపాటు మరియు మర్యాదను గురించి కేథీ తర్వాత తలంచింది. “ఒక చిన్న పాప అలాంటి ఆసక్తికరమైన వర్తమానాన్ని తన వైపు అవధానాన్ని మళ్లించుకోకుండా ఇతరులతో పంచుకోగలదని చూసి నేనెంతో ప్రభావితురాలినయ్యాను. ఈసారి యెహోవాసాక్షులు నన్ను దర్శించినప్పుడు వారు చెప్పేది నేను తప్పక వినాలని నేను తీర్మానించుకున్నాను” అని ఆమె చెప్పింది.
ఈలోపు కేథీ, కోర్క్ మరియు కెర్రీ కౌంటీల పొలిమెరలకు దగ్గర్లో, ఐర్లాండ్ నైరృతి దిశలోనున్న ఒక చిన్న పట్టణానికి తరలి వెళ్లింది. కొంత కాలం తర్వాత యెహోవాసాక్షులు ఆమెను సందర్శించారు, ఆమె వారిని లోపలికి ఆహ్వానించింది. ఆమె బైబిలును క్రమంగా పఠించేందుకు అంగీకరించింది, ఇప్పుడు ఆమె తనకున్న అనేకమంది పిల్లలతో కలిసి సంఘ కూటాలకు హాజరౌతుంది. తనతో సువార్తను పంచుకోవాలన్న ఆ చిన్న పాప యొక్క నిర్మలమైన కోరిక విషయమై కేథీ ఎంతో కృతజ్ఞత కలిగివుంది.
▪ టల్లమోర్ ప్రాంతంలో, సాక్షులు జీన్ అనే పేరుగల స్త్రీతో దాదాపు ఏడు సంవత్సరాలపాటు బైబిలును చర్చించారు. కొన్నిసార్లు ఆమె ఆసక్తి చూపించి సాహిత్యాలను అంగీకరించేది, మరికొన్నిసార్లు ఆమె ఆసక్తి అంతరించిపోయేది. ఒకరోజు, ఫ్రాన్సస్ అనే పేరుగల ఒక సాక్షి, ఆమె సహవాసి జీన్ను సందర్శించినప్పుడు, ఆమె ఎంతో అనంగీకారమైన దృక్పథంతో ఉందని వారు కనుగొన్నారు. “మేము ఏమి చెప్పినా ఆమె మరింత విసుగు చెందింది. తుదకు, ఆమె మమ్మల్ని బయటకు పొమ్మని చెప్పి, తలుపు గట్టిగా మూసేసింది” అని ఆ సాక్షి నివేదిస్తుంది.
ఆమెను మళ్లీ సందర్శించడం అదే విధమైన ప్రతిస్పందనను కలిగిస్తుందేమో అని ఫ్రాన్సస్ ఆలోచించింది. ‘ఆమెకు నిజంగా వర్తమానం ఎడల ఆసక్తి లేకపోతే ఆమెను మళ్లీ సందర్శించడం ఎంతమాత్రం యోగ్యం కాదని’ ఫ్రాన్సస్ భావించింది. అయితే, ఆమె ఈ విషయాన్ని తన భర్తయైన థామస్తో చర్చించింది, ఆయన ఎక్కువ ఆశాభావాన్ని కలిగివున్నాడు. మరోసారి వారు ఆ ప్రాంతంలో సేవ చేసినప్పుడు, జీన్ను మళ్లీ సందర్శించడం జరిగింది. ఆమె స్నేహపూర్వకంగా ఉండి, కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ప్రతులను తీసుకుంది. తర్వాత ఆమెను సందర్శించినప్పుడు కూడా ఆమె అలాగే ప్రసన్న చిత్తంతో ఉంది, అలా థామస్ మరియు ఫ్రాన్సస్లు ఆమెతో క్రమ గృహ బైబిలు పఠనాన్ని ప్రారంభించారు.
ఆ మార్పు ఎలా వచ్చింది? తాను సాక్షుల ఎడల అమర్యాదగా ప్రవర్తించిన ఆ సమయంలో, ఆమె ఆ మధ్యనే ఓ బిడ్డను కని, అప్పుడే ఆసుపత్రినుండి వచ్చిందని జీన్ వివరిస్తుంది. తన పసి పాపకు పాలివ్వడం, తన పెద్ద బిడ్డ ఎడల శ్రద్ధ వహించడం ద్వారా ఆమె రాత్రి కేవలం ఒకటిన్నర గంట మాత్రమే నిద్రపోగలిగేది. “మతాన్ని గురించి మాట్లాడటంలో నాకు అప్పుడు ఎలాంటి ఆసక్తీ లేదు” అని జీన్ చెబుతుంది.
రెండు నెలల్లో జీన్ సంఘ కూటాలన్నింటికీ హాజరవ్వడం ప్రారంభించింది, నాలుగు నెలల్లో ఆమె ప్రాంతీయసేవలో భాగంవహించడం ప్రారంభించింది. ఆమె తన బైబిలు పఠనాన్ని ప్రారంభించిన పది నెలలకు బాప్తిస్మం తీసుకుంది. ఇప్పుడు జీన్ స్వంత అనుభవం ఆమెకు పరిచర్యలో సహాయం చేస్తుంది. ఆమె ఇలా చెబుతుంది: “ఎంతో కఠినంగా ఉండే వాళ్లను ఒకవేళ నేను కలిస్తే, ఎక్కువ అవగాహన చూపేందుకు నేను ప్రయత్నిస్తాను. నేను ఎప్పుడు ఆ విషయాన్ని నోట్ చేసుకుంటాను. నేను మళ్లీ సందర్శించేసరికల్లా బహుశ పరిస్థితి మారవచ్చు; ఆ వ్యక్తి అప్పుడు బాగుండవచ్చు, ఆసక్తితో వినవచ్చు.”