మీరు సమతుల్యతగల పయినీరేనా?
తన కూతురు మొట్టమొదటి తప్పటడుగులు వేసేందుకు ఎదురుచూస్తున్న తండ్రి తన చేతులు చాచగా, ఆయన కళ్లు మెరుస్తాయి. ఆమె అకస్మాత్తుగా పడిపోయినప్పుడు, మరలా ప్రయత్నించమని ఆయన ప్రోత్సహిస్తాడు. ఆమె మరలా తన సమతుల్యాన్నీ బలాన్నీ పొందుతుందని ఆయనకు తెలుసు.
అదేవిధంగా, ఓ క్రొత్త పయినీరు సేవకుడు లేక సేవకురాలు పూర్తికాల రాజ్య ప్రచారకునిగా విజయం సాధించేందుకు అవసరమైన సమతుల్యాన్ని పొందేందుకు సమయమూ ప్రోత్సాహమూ అవసరమౌతాయి. అనేకమంది పయినీర్లు దశాబ్దాలుగా ఆనందంగా సేవలో కొనసాగుతున్నాడు. కొందరు పరిస్థితుల వల్ల తమ సమతుల్యాన్ని కోల్పోయారు. కొందరు తమ ఆనందాన్ని కూడా కోల్పోయారు. ఒక దేశంలో పయినీరు సేవ ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే 20 శాతంమంది తమ పూర్తికాల సేవను మానుకున్నారు. అత్యంత ఆనందదాయకమైన ఈ సేవనుండి ఓ పయినీరును ఏది తీసివేయగలదు? ఈ తిరోగమనాన్ని నివారించేందుకు ఏమైనా చేయగలమా?
అనారోగ్యం, ఆర్థికావసరతలు, కుటుంబ బాధ్యతలు పూర్తికాల సేవను కొందరు విడిచేటట్లు చేసినప్పటికీ ఇతరుల విషయంలో, క్రైస్తవ బాధ్యతలను నిర్వహించడంలో మంచి సమతుల్యాన్ని కాపాడుకోవడంలో విఫలంకావడమే అడ్డురాయి అవుతుంది. సమతుల్యం అంటే “ఏ భాగమైనా విషయమైనా లేక ప్రభావమైనా తక్కిన వాటికంటె ఎక్కువేమీ కాదనీ లేక ఇతరములతో పోలిస్తే ఉన్నతమైన స్థానంలో లేదనే” అర్థమిస్తుంది.
ప్రకటించి, శిష్యులను తయారు చేసే పనిని ఎలా జరిగించాలన్న విషయాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు చూపించాడు. తన స్వంత పరిచర్య ద్వారా, సమతుల్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని కూడా ఆయన ఉదహరించాడు. “మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను” అని వారితో చెప్పడం ద్వారా యూదా మత నాయకులకు సమతుల్యత లేదని యేసు చూపించాడు. వీటిని వారు చేయాల్సిందే కానీ, ఇతర వాటిని తీసివేయకూడదు.—మత్తయి 23:23.
ఈ సూత్రం నేడు కూడా అలాగే అన్వయిస్తుంది, ప్రత్యేకంగా పయినీరు సేవలో అన్వయిస్తుంది. ఆసక్తీ, మంచి ఉద్దేశాలవల్ల ప్రేరేపించబడి, కొందరు దానిలో ఉన్న విషయాలను పరిగణలోకి తీసుకోకుండా లేక దానికి పూర్తిగా సిద్ధపడకుండా పయినీరింగును చేపట్టారు. (లూకా 14:27, 28) ఇతరులు ప్రాంతీయ పరిచర్యలో ఎంతగా మునిగిపోయారంటే క్రైస్తవత్వపు ప్రాముఖ్యమైన ఇతర విషయాలను వారు ఉపేక్షించారు. వారు సమతుల్యాన్ని సాధించి దాన్ని కాపాడుకోగలరు?
ఆత్మీయంగా దృఢంగా ఉండండి!
యేసు తన ఆత్మీయతను ఎన్నడూ అలక్ష్యం చేయలేదు. ఆయన చెప్పేది వినేందుకు, స్వస్థతను పొందేందుకు వచ్చిన ప్రజలు ఆయన సమయాన్ని అధికంగా తీసుకున్నప్పటికీ, ధ్యానంతోకూడిన ప్రార్థనకొరకు ఆయన సమయాన్ని తీసుకున్నాడు. (మార్కు 1:35; లూకా 6:12) సమతుల్యమైన పయినీరు సేవ చేసేందుకు, ఆత్మీయంగా దృఢంగా ఉండేందుకు గల ఏర్పాట్లను సరిగా వినియోగించుకోవడం కూడా అవసరం. పౌలు ఇలా తర్కించాడు: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?” (రోమీయులు 2:21) ఇతరులకు ప్రకటించడంలో తమ సమయాన్నంతటినీ వెచ్చించడంలోనే మునిగి వ్యక్తిగత పఠనానికి క్రమమైన ప్రార్థనకూ తగినంత సమయాన్ని కేటాయించక అలక్ష్యం చేయడం నిశ్చయంగా తప్పవుతుంది.
కుమీకో రెండు దశాబ్దాలుగా పయినీరు సేవలో ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలూ అవిశ్వాసియైన భర్త ఉన్నప్పటికీ, తాను నిద్రపోవడానికి ముందున్న సమయం బైబిలు చదువుకోవడానికి అనువైన సమయమని ఆమె అనుభవం ద్వారా తెలుసుకుంది. ఆమె పఠిస్తుండగా, తన ప్రతిదిన పరిచర్యను తాజాగానూ ఆసక్తికరంగానూ ఉంచుకునేందుకు పరిచర్యలో ఉపయోగపడే విషయాలను వ్రాసిపెట్టుకుంటుంది. విజయవంతులైన ఇతర పయినీర్లు, ఆత్మీయ బలాన్నిపొందడాన్ని ఆనందించేందుకుగాను తమ మిగతా కుటుంబం లేచేముందుగా ప్రశాంతంగా ఉండే తెల్లవారు జామున నిద్రలేస్తారు. కూటాలకు సిద్ధపడేందుకు, అలాగే తాజా క్రైస్తవ ప్రచురణలను చదివేందుకు మీరు మరో అనువైన సమయాన్ని కల్గివుండవచ్చు. పరిచర్యలోని ఆనందాన్ని కాపాడుకోవాలనే కోరిక మీకు ఉన్నట్లయితే, వ్యక్తిగత పఠనం తొందరపాటుతో చేసేది కాదు లేక అలక్ష్యంచేసేదీ కాదు.
కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేయడం
పయినీరు తలిదండ్రులు చేసే “ప్రభువుయొక్క చిత్త”ములో అధిక భాగమందు, తమ స్వంత కుటుంబపు శారీరక, భావోద్రేక, ఆత్మీయావసరతల ఎడల శ్రద్ధవహించడం ఇమిడివుంది. (ఎఫెసీయులు 5:17; 6:1-4; 1 తిమోతి 5:8) కొన్నిసార్లు ఒకసారి భార్య లేక తల్లి పయినీరుసేవను ప్రారంభించినట్లయితే, ఆమెనుండి ఆదరణ, మద్దతూ లభించవని విశ్వాసులైన ఆమె జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు కూడా భయపడుతుంటారు. అలాంటి భావాలవల్ల, తాను పయినీరు కావాలన్న ఆమె కోరికకు ఉత్సాహంలేని ప్రతిస్పందనవచ్చేలా చేస్తుంది. అయితే, మంచి అలోచనా, ముందుచూపూ ఉండడం వల్ల సమతుల్యాన్ని కాపాడుకోవచ్చు.
అనేక మంది పయినీర్లు తమ కుటుంబ సభ్యులు ఇంట్లోలేనప్పుడే సాధ్యమైనంత ఎక్కువగా సేవ చేసేందుకు ప్రయత్నిస్తారు. ముందు ప్రస్తావించిన కుమీకో, తన కుటుంబం టిఫిన్ చేసేటప్పుడు వారితో ఉండి, తన భర్తను పిల్లలను ఉదయం సాగనంపి, మరలా వాళ్లు వచ్చేలోగానే తాను తిరిగి వస్తుంది. తాను వంటింటిలోనే పనిచేస్తూ ఉండే బదులు తన కుటుంబంతో కలిసి తాపీగా భోజనం చేసేలా తాను ముందుగానే వివిధరకాల వంటలు తయారు చేసేందుకు సోమవారాలను ఉపయోగించుకుంటుంది. వంటచేస్తూ ఇంటి పనిని చేయడం లాంటి కొన్ని పనులను ఒకే సమయంలో చేయడం కూడా అందుకు సహాయపడుతుంది. అలా చేయడం వల్ల, కుమీకో తన పిల్లల స్నేహితులను ఆహ్వానించి వారికొరకు ప్రత్యేకమైన ఆహారపానీయాలనిచ్చేందుకు సహితం సమయాన్ని కల్గివుంటుంది.
పిల్లలు తమ యౌవన ప్రాయంలోకి ఎదిగే కొలది, తమను ముంచెత్తే క్రొత్త భావోద్రేకాలు, కోరికలు, సందేహాలూ భయాలతో వారు వ్యవహరించేందుకు వారికి తమ తలిదండ్రులనుండి తరచూ అధిక అవధానం అవసరముంటుంది. అందుకు, పయినీరైన తల్లి/తండ్రికి మెలకువ కల్గివుండడం అవసరం మరియు తమ పట్టికలో మార్పును చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముగ్గురు పిల్లల తల్లియైన హీసాకోను తీసుకోండి. తన పాఠశాలలోని లౌకిక స్నేహితుల ప్రభావంవల్ల క్రైస్తవ కూటాల్లోనూ ప్రాంతీయ సేవలోనూ ఆనందాన్నీ, ఉత్సాహాన్నీ తన పెద్దకుమార్తె కనుపర్చినప్పుడు ఆమె ఏమి చేసింది? సత్యాన్ని తన స్వంతం చేసుకోవడమూ మరి లోకం నుండి వేరుగా ఉండడమే ఉత్తమమైన పద్ధతని తన కుమార్తెను పూర్తిగా ఒప్పించడమే ప్రాముఖ్యమైన అవసరతయైయుండెను.—యాకోబు 4:4.
హీసాకో ఇలా చెబుతోంది: “నేను మరలా ప్రతి దినమూ నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోనుండి ప్రాథమిక సూత్రాలను పఠించాలని నిర్ణయించుకున్నాను. మొదట్లో సరిగ్గా పఠించే సమయం వచ్చేసరికి, తీవ్రమైన కడుపు నొప్పి తలనొప్పి అని మా అమ్మాయి చెప్పడంవల్ల మేము కొద్ది నిమిషాలు మాత్రమే పఠించగల్గేవాళ్లం. అయితే నేను మాత్రం పఠనాన్ని క్రమంగా నిర్వహించేదాన్ని. కొన్నినెలల తర్వాత, ఆమె దృక్పథం ఎంతో మెరుగు పడింది, కొద్ది కాలంలోనే సమర్పించుకుని బాప్తిస్మం తీసుకునేందుకు అది నడిపింది.” ఇప్పుడు హీసాకో తన కూతురితో కలిసి పూర్తికాల పరిచర్యలో ఆనందిస్తోంది.
ఎదిగే తమ పిల్లలకు ఇవ్వవలసిన దృఢమైన భావోద్రేక సహాయాన్నీ, నడిపింపునూ అందించడంలో విఫలమయ్యేంతగా, తమ ప్రాంతంలో ఉన్న ఆసక్తిగల వారి ఎడల మరియు తమ సంఘ పనుల ఎడల శ్రద్ధ వహించడంలో మరీ నిమగ్నమవ్వకుండా ఉండేలా పయినీరింగును చేసే తండ్రులు కూడా జాగ్రత్తపడాలి. ఇది ఓ పురుషుడు తన భార్యకు అప్పగించాల్సిన పని కాదు. ఎంతో కాలంగా పయినీరుగా ఉంటూ ఓ చిన్న వ్యాపారాన్ని కూడా చేసే బిజీగా ఉండే ఓ క్రైస్తవ పెద్ద తన నలుగురు పిల్లలతో వ్యక్తిగతంగా పఠించేందుకు సమయాన్ని తీసుకున్నాడు. (ఎఫెసీయులు 6:4) దానికి తోడు, ఆయన తన కుటుంబంతో వారపుకూటాలకు సిద్ధపడతాడు. సమతుల్యతవున్న పయినీర్లు తమ కుటుంబాల వస్తుపర, ఆత్మీయావసరతలను అలక్ష్యం చేయరు.
ఆర్థిక సమతుల్యత
పయినీర్లు మంచి సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాల్సిన మరో రంగం అనుదినావసరతల ఎడల సరైన దృక్పథాన్ని కల్గివుండడం. ఇక్కడ మరలా యేసు మంచి మాదిరి మరియు ఆయన సలహాల నుండి మనం నేర్చుకోవచ్చు. వస్తుదాయకమైన విషయాల ఎడల అమిత శ్రద్ధను కల్గివుండడాన్ని గూర్చి ఆయన హెచ్చరించాడు. బదులుగా, దేవుడు తన మిగతా సృష్టి ఎడల ఎలా శ్రద్ధ వహిస్తాడో అలాగే వారి ఎడల కూడా శ్రద్ధ వహిస్తాడని వాగ్దానం చేస్తూ రాజ్యాసక్తులను ముందుంచమని ఆయన తన శిష్యులను ప్రోత్సహించాడు. (మత్తయి 6:25-34) ఈ మంచి సలహాను అనుసరించడం ద్వారా, అనేకమంది పయినీర్లు పూర్తికాల సేవలో సంవత్సరాలుగా నిలవగలిగారు మరియు ‘అనుదినాహారాన్ని’ పొందేందుకు వారు చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించాడు.—మత్తయి 6:11.
‘మీ సహేతుకతను సకల జనులకును కనబడనీయుడి’ అని అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు సలహానిచ్చాడు. (ఫిలిప్పీయులు 4:5) నిశ్చయంగా, సహేతుకత అంటే మనం మన ఆరోగ్యానికి సరైన శ్రద్ధను కనుపర్చాలి. ఇతరులు తమ ప్రవర్తనను గమనిస్తున్నారని తెలుసుకొనిన సమతుల్యం గల పయినీర్లు తమ జీవిత విధానమంతటిలోనూ మరియు వస్తుదాయకమైన విషయాల ఎడల తమ దృక్పథంలోనూ సహేతుకతను కనుపర్చే ప్రతి ప్రయత్నాన్నీ చేస్తారు.—1 కొరింథీయులు 4:9 పోల్చండి.
పయినీరు సేవను చేపట్టిన యౌవనులు తమ తలిదండ్రుల ఉదారత నుండి అయుక్తముగా ప్రయోజనం పొందడాన్ని నివారిస్తారు. వారు తమ తలిదండ్రులతో ఉంటున్నట్లయితే, ఇంటి పనుల్లో పాలుపంచుకోవడం మరియు ఇల్లు గడవడానికి తోడ్పడేందుకు తమకు సహాయపడే పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని చేయడం మంచి సమతుల్యతను మెప్పుదలను కనుపరుస్తుంది.—2 థెస్సలొనీకయులు 3:10.
సమతుల్యతగల పయినీర్లు నిజమైన ఆశీర్వాదముగా ఉంటారు
మీరు సరైన సమతుల్యతను కాపాడుకునేందుకు ఎంతో కృషిచేసే పయినీరు కావచ్చు. మీరు తప్పకుండా సమతుల్యాన్ని సాధించగలరు. ఎలాగైతే ఓ పిల్లవానికి సమతుల్యత నేర్చుకోవడానికి సమయం కావాలో, అలాగే తమ బాధ్యతలను నిర్వర్తించడంలో సమతుల్యాన్ని సాధించేందుకు సమయం పట్టిందని అనేకమంది పరిపక్వతకెదిగిన పయినీర్లు చెబుతారు.
సమతుల్యాన్ని సాధించేందుకు పయినీర్లు ప్రయత్నించే రంగాల్లో వ్యక్తిగత పఠనం చేయడం, కుటుంబ సభ్యులను చూసుకోవడం మరియు తమ స్వంత వస్తుదాయకమైన అవసరతలను తీర్చుకోవడం ఉన్నాయి. అనేకమంది పయినీర్లు గణనీయమైన రీతిలో తమ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు నివేదికలు చూపిస్తున్నాయి. వారు సంఘానికి నిజమైన ఆశీర్వాదముగా మరియు యెహోవాకు ఆయన సంస్థకు గర్వకారణంగా ఉన్నారు.