విశ్వాసముంచుట ద్వారా దేవుని వాగ్దానములకు ప్రత్యుత్తరమివ్వండి
“ఆయన [యెహోవా దేవుడు] మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు.”—2 పేతురు 1:4.
1. నిజమైన విశ్వాసముంచుటకు మనకు ఏది తోడ్పడుతుంది?
తన వాగ్దానములందు విశ్వాసముంచవలెనని యెహోవా మనల్ని కోరుచున్నాడు. అయిననూ, “విశ్వాసము అందరికి లేదు.” (2 థెస్సలొనీకయులు 3:2) ఈ లక్షణము దేవుని పరిశుద్ధాత్మ, లేక చురుకైన శక్తి ఫలమైయుంది. (గలతీయులు 5:22, 23) కావున, యెహోవా ఆత్మచే నడిపింపబడువారు మాత్రమే విశ్వాసం కలిగియుండగలరు.
2. “విశ్వాసమును” అపొస్తలుడైన పౌలు ఎలా నిర్వచించాడు?
2 మరి విశ్వాసమనగా ఏమి? అపొస్తలుడైన పౌలు దాన్ని “అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు” అని పిలిచాడు. ఈ అదృశ్యమైన నిజత్వాలు ఎంత బలంగా ఉన్నాయంటే విశ్వాసం వాటితో సరిసమానంగా చెప్పబడింది. విశ్వాసం “నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపము” అని కూడా చెప్పబడింది, ఎందుకంటె ఈ లక్షణమున్న వారికి యెహోవా దేవుడు వాగ్దానము చేసిన ప్రతిదీ నిశ్చయంగా నెరవేరినంత శ్రేష్ఠంగా ఉన్నాయనే అభయం ఉంది.—హెబ్రీయులు 11:1.
విశ్వాసము, యెహోవా వాగ్దానాలు
3. విశ్వాసముంచినట్లయితే అభిషక్త క్రైస్తవులు దేన్ని అనుభవిస్తారు?
3 యెహోవాను ప్రీతిపర్చుటకు, మనం వాగ్దానాలందు విశ్వాసముంచాలి. దీనిని అపొస్తలుడైన పేతురు దాదాపు సా.శ. 64లో వ్రాసిన తన రెండవ ప్రేరేపిత లేఖలో దీన్ని చూపించాడు. తన తోటి అభిషక్త క్రైస్తవులు విశ్వాసంగలవారైతే వారు దేవుని “అమూల్యములును అత్యధికములునైన వాగ్దానముల” నెరవేర్పును చూస్తారని సూచించాడు. తత్ఫలితంగా, “దేవస్వభావమునందు” పాలుకలిగి పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు తోడి వారసులుగా ఉంటారు. విశ్వాసంతో, యెహోవా సహాయంతో, వారు ఈ లోక కుళ్లిన అలవాట్లు, అభ్యాసముల దాసత్వము నుండి తప్పించుకొన్న వారైయున్నారు. (2 పేతురు 1:2-4) దాన్ని ఊహించండి! నిజమైన విశ్వాసముగలవారును నేడు అట్టి అమూల్యమైన స్వాతంత్ర్యము ననుభవిస్తున్నారు.
4. మన విశ్వాసానికి మనమే లక్షణాలను అమర్చాలి?
4 యెహోవా వాగ్దానాలందు విశ్వాసము మరియు దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యం విషయంలో కృతజ్ఞత మనం మాదిరికరమైన క్రైస్తవులయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నించుటకు మనలను పురికొల్పుతుంది. పేతురిలా అన్నాడు: “ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.” (2 పేతురు 1:5-7) ఆ విధంగా, మనం జ్ఞానయుక్తంగా గుర్తుంచుకోవలసిన పట్టికను పేతురు ఇస్తున్నాడు. మనమిప్పుడు ఈ లక్షణాల్ని నిశితంగా పరిశీలిద్దాము.
విశ్వాసానికి కావల్సిన ఆవశ్యక సంగతులు
5, 6. సద్గుణమంటే ఏమిటి, దాన్ని మన విశ్వాసానికి ఎట్లు అమర్చగలము?
5 సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ దయలను ఒకదానికొకటి చేర్చాలని, వాటిని మన విశ్వాసమునకు కూడా చేర్చాలని పేతురు చెప్పాడు. ఈ లక్షణాల్ని మన విశ్వాసానికి ఆవశ్యక భాగాలుగా చేయడానికి మనం గట్టిగా కృషిచేయాలి. ఉదాహరణకు, విశ్వాసం లేకుండా సద్గుణమనే లక్షణాన్ని మనం ప్రదర్శించలేము. నైఘంటికుడైన డబ్ల్యు. ఇ. వైన్ 2 పేతురు 1:5లో చెప్పబడిన “సద్గుణము విశ్వాసముంచడానికి అమర్చబడిన ఒక ఆవశ్యకమైన లక్షణమని” సూచిస్తున్నాడు. పేతురు ప్రస్తావించిన యితర లక్షణాల్లో ప్రతిదీ మన విశ్వాసాని కవసరము.
6 మొదట మనం మన విశ్వాసానికి సద్గుణాన్ని చేర్చాలి. సద్గుణవంతులుగా ఉండుట అనగా దేవుని దృష్టిలో మేలైన దానిని చేయుటని అర్థము. “సద్గుణము” అని ఇక్కడున్న గ్రీకు పదాన్ని కొన్ని భాషాంతరాలు “మంచితనము” అని అనువదించినవి. (న్యూ ఇంటర్నేషనల్ వర్షన్; ది జెరూసలేమ్ బైబిల్; టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) తోటి మానవులకు చెడు జరిగించకుండా, హానిచేయకుండా ఉండడానికి ఈ సద్గుణం మనల్ని పురికొల్పుతుంది. (కీర్తన 97:10) యితరుల ఆత్మీయ, భౌతిక, భావోద్రేక ప్రయోజనార్థమై మేలు చేయునట్లు ధైర్యంగా చర్యగైకొనుటకు కూడా అది మనల్ని ప్రోత్సహిస్తుంది.
7. మన విశ్వాసానికి, సద్గుణానికి మనం జ్ఞానాన్ని ఎందుకు అమర్చాలి?
7 మన విశ్వాసానికి, సద్గుణానికి జ్ఞానాన్ని అమర్చుడని పేతురు మనకెందుకు ఉద్బోధిస్తున్నాడు? మనం మన విశ్వాసానికి సంబంధించిన క్రొత్త సవాళ్ల నెదుర్కొనేకొలది, మంచి చెడులను వివేచించుటకు మనకు జ్ఞానం అవసరం. (హెబ్రీయులు 5:14) బైబిలు పఠనము, దేవుని వాక్యాన్ని అన్వయించుటలో మనకున్న అనుభవము, మన దైనందిన జీవితంలో ఆచరణయోగ్యమైన తెలివిని ప్రదర్శించుట ద్వారా, మనం మన జ్ఞానాన్ని వృద్ధిచేసుకుంటాము. తత్ఫలితంగా యిది మన విశ్వాసాన్ని కాపాడుకొనుటకు, పరీక్షలెదుర్కొన్నప్పుడు మనం సద్గుణంతో ప్రవర్తించుటకు మనల్ని బలపరుస్తుంది.—సామెతలు 2:6-8; యాకోబు 1:5-8.
8. ఆశానిగ్రహమంటే ఏమిటి, అది సహనమునకు ఎట్లు ముడిపెట్టబడింది?
8 విశ్వాసంతో పరీక్షలనెదుర్కొనుటకు మనకు సహాయము చేయునట్లు, జ్ఞానానికి మనం ఆశానిగ్రహాన్ని అమర్చాలి. “ఆశానిగ్రహం” కొరకు ఉపయోగింపబడిన గ్రీకు పదం మనల్ని మనం అదుపులో ఉంచుకొనే సామర్థ్యాన్ని నిర్వచిస్తున్నది. దేవుని ఆత్మ ఫలమైన ఈ లక్షణం మన తలంపులో, మాటలో, ప్రవర్తనలో హద్దులను చూపించుటకు సహాయం చేస్తుంది. పట్టుదలతో ఆశానిగ్రహం కలిగియుంటేనే మనం దానికి సహనాన్ని అమర్చగలం. “సహనము” కొరకు ఉపయోగింపబడిన గ్రీకుపదం తప్పించుకోలేని కష్టం కలిగినప్పుడు దుఃఖముఖులై యుండకుండా ధైర్యంగా, స్థిరంగా వాటినెదుర్కొనే విశేషతను తెల్పుతుంది. తనయెదుట ఉంచబడిన ఆనందమును బట్టే యేసు ఆ హింసాకొయ్యను భరించగల్గాడు. (హెబ్రీయులు 12:2) సహనముతో కూడిన దైవానుగ్రహ బలం మన విశ్వాసాన్ని బలపరచి శ్రమయందు ఆనందించుటకు, శోధన నెదుర్కొనుటకు, హింసలప్పుడు రాజీపడకుండుటకు మనకు సహాయం చేస్తుంది.—ఫిలిప్పీయులు 4:13.
9. (ఎ) భక్తి అంటే ఏమిటి? (బి) మనమెందుకు భక్తికి సహోదర ప్రేమను అమర్చాలి? (సి) మన సహోదర ప్రేమకు మనమెట్లు దయను అమర్చగలము?
9 సహనానికి భక్తిని అనగా పూజ్యతను, ఆరాధనను, యెహోవాకుచేసే సేవను మనం అమర్చాలి. భక్తిని కలిగియుండి యెహోవా తన ప్రజలతో వ్యవహరించే విధానాన్ని చూసినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. అయిననూ, భక్తిని ప్రదర్శించుటకు, మనకు సహోదర ప్రేమ అవసరం. “తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.” (1 యోహాను 4:20) యెహోవా సేవకుల యెడల నిజమైన ప్రేమ చూపించుటకు, అన్ని సమయాల్లో వారి సంక్షేమాన్ని వెదకుటకు మన హృదయం మనల్ని పురికొల్పాలి. (యాకోబు 2:14-17) అయితే సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడని మనకెందుకు చెప్పబడింది? మనం కేవలం మన సహోదరుల యెడల మాత్రమేకాక, సమస్త మానవజాతియెడల మనం ప్రేమ చూపాలని పేతురు భావం. సువార్త ప్రకటించుట ద్వారా, ప్రజలకు ఆత్మీయంగా సహాయపడుట ద్వారా ప్రత్యేకంగా ఈ ప్రేమ చూపించబడుతుంది.—మత్తయి 24:14; 28:19, 20.
విభిన్న ప్రభావాలు
10. (ఎ) మన విశ్వాసానికి సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశానిగ్రహాన్ని, సహనాన్ని, భక్తిని, సహోదర ప్రేమను, దయను అమర్చినట్లయిన మనమెట్లు ప్రవర్తిస్తాము? (బి) క్రైస్తవుడనని చెప్పుకొను వ్యక్తిలో ఈ లక్షణాలు లేనట్లయిన ఏమి సంభవిస్తుంది?
10 మన విశ్వాసానికి సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశానిగ్రహాన్ని, సహనాన్ని, భక్తిని, సహోదర ప్రేమను, దయను అమర్చినట్లయిన, మనం దేవుడు ఆమోదించిన పద్ధతుల్లో తలస్తాము, మాట్లాడతాము, ప్రవర్తిస్తాము. అలాకాకుండ, తాను క్రైస్తవుడనని చెప్పుకునే వ్యక్తి ఈ లక్షణాలు ప్రదర్శించనట్లయిన, అతడు ఆత్మీయంగా గ్రుడ్డివాడౌతాడు. అతడు దేవుని నుండి వచ్చే ‘వెలుగు విషయంలో దూరదృష్టిలేనివాడై,’ తన గత పాపముల విషయంలో తాను శుద్ధిచేయబడ్డాడనే సంగతే మర్చిపోతాడు. (2 పేతురు 1:8-10; 2:20-22) మనమెన్నడూ ఆ విధంగా తప్పిపోయి, దేవుని వాగ్దానాలందు విశ్వాసం కోల్పోయిన వారిగా ఉండకుందము.
11. యథార్థపరులైన అభిషక్తులనుండి మనము సరిగా ఏమి అపేక్షించగలము?
11 యథార్థ అభిషక్త క్రైస్తవులు యెహోవా వాగ్దానాలందు విశ్వాసముగలవారై ఆయనిచ్చిన పిలుపును, ఆయన ఎంపికను రూఢిపర్చుకొనుటకు కృషిచేస్తారు. వారి మార్గంలో ఎన్ని అడ్డంకులున్ననూ, వారీ దైవలక్షణాల్ని ప్రదర్శిస్తారని మనమపేక్షించవచ్చును. పునరుత్థానం ద్వారా ఆత్మీయ పరలోక జీవితం కొరకు నమ్మకస్థులైన అభిషక్తులకు ‘యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది.’—2 పేతురు 1:11.
12. రెండవ పేతురు 1:12-15లోని మాటలను మనమెట్లు అర్థంచేసుకోవాలి?
12 తాను త్వరలోనే చనిపోతానని పేతురు గ్రహించి, చివరకు తనకు పరలోక పునరుత్థానం అనుగ్రహింపబడుతుందని అపేక్షించాడు. అయితే ఆయన ఈ “గుడారము” నందు అనగా తన మానవ శరీరమందు సజీవముగా ఉన్నంతకాలము, దైవానుగ్రహానికి కావల్సిన సంగతులను తోటి విశ్వాసులకు గుర్తుచేస్తూ వారిని ఉత్తేజపరచి, వారి విశ్వాసమును స్థిరపరచుటకు ప్రయత్నించాడు. ఆయన మరణించిన తర్వాత, పేతురు యొక్క ఆత్మీయ సహోదర సహోదరీలు ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తమ విశ్వాసమందు బలపడగల్గిరి.—2 పేతురు 1:12-15.
ప్రవచన వాక్యమందు విశ్వాసముంచుట
13. క్రీస్తు రాకడను గూర్చి దేవుడెట్లు విశ్వాసాన్ని బలపరిచే రుజువునిచ్చాడు?
13 “ప్రభావముతోను మహా మహిమతోను” యేసు నిశ్చయంగా రావడాన్ని గూర్చి దేవుడే విశ్వాసాన్ని బలపరిచే రుజువునిచ్చాడు. (మత్తయి 24:30; 2 పేతురు 1:16-18) తమ దేవతలను గూర్చి అన్యమత పూజార్లు తమ దేవతలను గూర్చి రుజువులేని కట్టుకథలు చెప్పారు, అయితే పేతురు, యాకోబు, యోహానులు రూపాంతరమందలి క్రీస్తు మహిమాన్వితకు ప్రత్యక్షసాక్షులై యుండిరి. (మత్తయి 17:1-5) ఆయన మహిమాస్వరూపి కావడాన్ని వారు చూశారు, ఆలాగే యేసు తన ప్రియకుమారుడని గుర్తిస్తూ దేవుడు స్వయంగా మాట్లాడడాన్ని వారు విన్నారు. ఆ గుర్తింపు, ఆ తేజస్వరూపము క్రీస్తుపై ఘనతను, మహిమను కుమ్మరించినవి. ఈ దైవిక ప్రకటనను బట్టి, బహుశ హెర్మోను పర్వతపు ఆ భాగాన్ని పేతురు “పరిశుద్ధ పర్వతమని” పిలిచాడు.—నిర్గమకాండము 3:4, 5 పోల్చండి.
14. యేసు రూపాంతరము మన విశ్వాసంపై ఎట్లు ప్రభావం చూపాలి?
14 యేసు రూపాంతరం మన విశ్వాసంపై ఎలాంటి ప్రభావం చూపాలి? పేతురిలా అన్నాడు: “ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.” (2 పేతురు 1:19) ఆ “ప్రవచనవాక్యములో” కేవలము మెస్సీయను గూర్చిన హెబ్రీ లేఖనాల ప్రవచనాలే కాదు “ప్రభావముతోను మహిమతోను” తాను వచ్చెదనని యేసు చెప్పిన మాటకూడా చేరియుంది. రూపాంతరము ద్వారా ఆ వాక్యము ఎలా ‘స్థిరపర్చబడింది’? ఆ సంఘటన క్రీస్తు మహిమాన్వితుడై రాజ్యాధికారముతో వస్తాడని చెప్పిన ఆ ప్రవచన వాక్యమును రూఢిపర్చింది.
15. ప్రవచన వాక్యం యెడల ధ్యానమిచ్చుటలో ఏమి యిమిడియుంది?
15 మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి, మనమా ప్రవచన వాక్యంమీద ధ్యానముంచాలి. దీనిలో ఆ వాక్యాన్ని పఠించడం, దాన్ని క్రైస్తవ కూటాల్లో చర్చించడం, అదిచ్చే సలహాను అన్వయించడం యిమిడియున్నవి. (యాకోబు 1:22-27) దాన్ని మనం మన హృదయాల్లో “వెలుగిచ్చు దీపంగా” ప్రకాశింపనియ్యాలి. (ఎఫెసీయులు 1:18) అప్పుడు మాత్రమే అది మనలను “వేకువచుక్క,” లేదా “ప్రకాశమానమైన వేకువచుక్క” అయిన యేసు క్రీస్తు తన మహిమతో బయల్పరచబడు పర్యంతం నడిపిస్తుంది. (ప్రకటన 22:16) ఆ బయల్పరచబడటం విశ్వాసరహితులకు నాశనము, విశ్వాసముంచు వారికి ఆశీర్వాదాల్ని తెస్తుంది.—2 థెస్సలొనీకయులు 1:6-10.
16. దేవుని వాక్యమందలి ప్రవచనాలన్నీ నెరవేరుననే ప్రవచనార్థక వాగ్దానాలందు మనమెందుకు విశ్వాసముంచగలము?
16 దేవుని ప్రవక్తలు తెలివిగా ప్రవచనాలు చెప్పిన సూక్ష్మజ్ఞానులు కాదు, ఎందుకంటె పేతురిలా చెప్పాడు: “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” (2 పేతురు 1:20, 21) ఉదాహరణకు, దావీదు యిలా చెప్పాడు: “యెహోవా ఆత్మ నా ద్వారా” పలుకుచున్నది. (2 సమూయేలు 23:1, 2) పౌలు యిలా వ్రాశాడు: “దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము” (2 తిమోతి 3:16) దేవుని ప్రవక్తలు దేవుని ఆత్మచే ప్రేరేపింపబడినందున, ఆయన వాక్యమందలి ప్రవచనములన్నియు తప్పక నెరవేరునని మనం విశ్వాసముంచగలము.
వారు దేవుని వాగ్దానాలందు విశ్వాసముంచిరి
17. హేబెలు విశ్వాసానికి ఏ వాగ్దానము ఆధారమై యుండెను?
17 క్రైస్తవ కాలాలకు పూర్వమున్న ‘మేఘము వంటి’ సాక్షులకు యెహోవా వాగ్దానాలే విశ్వాసమునకు ఆధారమై యుండెను. (హెబ్రీయులు 11:1–12:1) ఉదాహరణకు, “సర్పము” తలను చితుకద్రొక్కు “సంతానమును” గూర్చిన దేవుని వాగ్దానమందు హేబెలుకు విశ్వాసముండెను. హేబెలు తలిదండ్రులకు దేవుడు విధించిన శిక్ష అది నెరవేరుననుటకు రుజువైయుండెను. ఏదెను బయట ఆదాము అతని కుటుంబము చెమటకార్చి ఆహారము సమకూర్చుకొన్నారు ఎందుకంటే శపింపబడిన నేల ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను మొలిపించెను. హవ్వ తన భర్తకొరకు వాంఛించుట, ఆదాము ఆమెను ఏలడాన్ని హేబెలు గమనించియుంటాడు. నిశ్చయముగా ఆమె తన గర్భవేదనను గూర్చి మాట్లాడింది. ఏదెను తోటను కాయుటకు కెరూబులు, ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాల ఉండెను. (ఆదికాండము 3:14-19, 24) విడుదల వాగ్దాన సంతానము ద్వారా వచ్చునని అభయమిస్తూ ఇదంతయు హేబెలుకు “నిజస్వరూపముగా” యుండెను. కావున విశ్వాసముతో హేబెలు కయీనుకంటే మరెంతో విలువైనదని నిరూపించబడిన బలిని దేవునికి అర్పించాడు.—హెబ్రీయులు 11:1, 4.
18, 19. అబ్రాహాము, శారా ఏయే విధాలుగా విశ్వాసముంచారు?
18 పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కూడా యెహోవా వాగ్దానములందు విశ్వాసముంచారు. భూమ్మీది కుటుంబములన్నీ తన సంతానము ద్వారా తమ్మునుతాము ఆశీర్వదించుకుంటారని, తన సంతానమునకు దేశము అనుగ్రహింపబడునని దేవుడు చేసిన వాగ్దానమందు అబ్రాహాము విశ్వాసముంచాడు. (ఆదికాండము 12:1-9; 15:18-21) ఆయన కుమారుడగు ఇస్సాకు, మనుమడగు యాకోబు ఆయనతో “ఆ వాగ్దానమునకు సమానవారసులై” యుండిరి. విశ్వాసము ద్వారా అబ్రాహాము “వాగ్దత్త దేశములో పరవాసులుగా” జీవిస్తూ, దానిలో తాను పునరుత్థానము పొందబోవు దేవుని పరలోక రాజ్యమగు “పునాదులుగల ఆ పట్టణము కొరకు” ఎదురుచూశాడు. (హెబ్రీయులు 11:8-10) మీకలాంటి విశ్వాసమున్నదా?
19 అబ్రాహాము భార్యయైన శారా పిల్లలుకనే వయస్సు దాటిపోయిన 90 సంవత్సరాల వయస్సులో దేవుని వాగ్దానమందు విశ్వాసముంచి “గర్భము ధరించుటకు శక్తిపొంది” ఇస్సాకును కనెను. ఆ విధంగా, పునరుత్పత్తి విషయంలో “మృతతుల్యుడగు” 100 సంవత్సరాల అబ్రాహాము ద్వారా చివరకు “సంఖ్యకు ఆకాశనక్షత్రముల వలె . . . సంతానము కలిగెను.”—హెబ్రీయులు 11:11, 12; ఆదికాండము 17:15-17; 18:11; 21:1-7.
20. పితరులు తమకు దేవుడు చేసిన వాగ్దానాల పూర్తి నెరవేర్పును చూడకపోయిననూ, వారేమి చేశారు?
20 విశ్వాసులైన ఆ పితరులు దేవుని వాగ్దానముల పూర్తి నెరవేర్పును చూడకుండానే మరణించారు. అయినను, “వీరందరు . . . [వాగ్దాన విషయాలను] దూరమునుండి చూసి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొనిరి.” అబ్రాహాము సంతానము వాగ్దాన దేశమును స్వతంత్రించుకొన్న నాటికి అనేక తరములు గతించిపోయెను. అయితే వారి జీవితమంతటిలో దైవభక్తిగల ఆ పితరులందరు యెహోవా వాగ్దానములందు విశ్వాసముంచారు. వారెన్నడునూ విశ్వాసం కోల్పోనందున, వారు త్వరలోనే దేవుడు వారికొరకు సిద్ధపరచిన “పట్టణమగు” మెస్సీయ రాజ్యాధికారమందుగల ఈ భూమిపై పునరుత్థానులౌతారు. (హెబ్రీయులు 11:13-16) అదే విధంగా, యెహోవా అద్భుతకరమైన వాగ్దానాలన్నీ వెంటనే నెరవేరడాన్ని మనం చూడకపోయిననూ విశ్వాసం మనమాయనయెడల యథార్థముగా ఉండునట్లు చేయగలదు. మన విశ్వాసం అబ్రాహాము వలెనే దేవునికి లోబడుటకు కూడ మనలను పురికొల్పుతుంది. ఆయన తన సంతానమునకు ఆత్మీయ వారసత్వాన్ని అందించినట్లే, మనం కూడ యెహోవా అమూల్యమైన వాగ్దానాలందు విశ్వాసముంచుటకు మన పిల్లలకు సహాయం చేయవచ్చును.—హెబ్రీయులు 11:17-21.
క్రైస్తవులకు విశ్వాసం ఆవశ్యకము
21. నేడు దేవునికి అంగీకృతులుగా ఉండేందుకు, మన విశ్వాసమందు దేనిని కూడా చేర్చాలి?
21 యెహోవా వాగ్దానాలన్నీ నెరవేరునని నమ్మడంకంటె విశ్వాసానికి కావల్సింది మరెంతోవుంది. మానవ చరిత్రంతటిలో, దేవుని అంగీకారం పొందాలంటే మనం వివిధ విషయాల్లో ఆయనయందు విశ్వాసం కనబర్చుట అవసరమైయుండెను. “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా” అని పౌలు సూచించాడు. (హెబ్రీయులు 11:6) నేడు యెహోవాకు అంగీకృతులై యుండాలంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు నందు, ఆయన ద్వారా దేవుడు దయచేసిన విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచాలి. (రోమీయులు 5:8; గలతీయులు 2:15, 16) ఇది యేసు చెప్పినట్లుగానే ఉంది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును.”—యోహాను 3:16, 36.
22. మెస్సీయ రాజ్యం ఏ వాగ్దానాన్ని నెరవేరుస్తుంది?
22 క్రైస్తవులు ప్రార్థించు రాజ్యాన్ని గూర్చిన దేవుని వాగ్దానముల నెరవేర్పులో యేసు కీలక పాత్ర వహిస్తాడు. (యెషయా 9:6, 7; దానియేలు 7:13, 14; మత్తయి 6:9, 10) పేతురు చూపినట్లుగా, యేసు రాజ్య ప్రభావముతో, మహిమతో వస్తాడనే ప్రవచన వాక్యాన్ని రూపాంతరం రూఢిపరచింది. ఈ మెస్సీయ రాజ్యము దేవుడుచేసిన మరో వాగ్దానాన్ని కూడ నెరవేరుస్తుంది, దాన్నిగూర్చి పేతురిలా వ్రాశాడు: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) గవర్నరుగా జెరుబ్బాబెలు, ప్రధానయాజకునిగా యేషూవ అధికారము క్రింద యూదులు బబులోను చెరనుండి సా.శ.పూ. 537లో స్వదేశము వచ్చినప్పుడు ఇలాంటి ప్రవచనమే నెరవేరింది. (యెషయా 65:17) అయితే పేతురు భవిష్యత్తు కాలాన్ని సూచించాడు, అక్కడ “క్రొత్త ఆకాశములు” అనగా పరలోక మెస్సీయ రాజ్యం “క్రొత్త భూమిని,” పరిపాలించును, అనగా అది ఈ భూగ్రహంపై జీవించు నీతియుక్తమైన మానవ సమాజము.—కీర్తన 96:1 పోల్చండి.
23. సద్గుణాన్ని గూర్చిన ఏ ప్రశ్నలు తర్వాత చర్చించబడతాయి?
23 యెహోవా యథార్థ సేవకులుగా, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అనుచరులుగా మనం దేవుని వాగ్దత్త నూతన లోకాన్ని కోరుకుంటాము. అది సమీపంగా వుందని మనకు తెలుసు, పైగా యెహోవా అమూల్యమైన వాగ్దానాలన్నీ నెరవేరుననే విశ్వాసం మనకుంది. దేవుని యెదుట అంగీకృతంగా నడుచుకోవడానికి, మనం సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశానిగ్రహాన్ని, సహనాన్ని, భక్తిని, సహోదర ప్రేమను, దయను అమర్చుకొనుట ద్వారా మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలి.a ఈ సందర్భంలో మనమిలా ప్రశ్నించవచ్చు, మనమెట్లు ఈ సద్గుణాన్ని ప్రదర్శించగలము? మనం సద్గుణం కలిగివుంటే అది మనకు, ఇతరులకు ప్రత్యేకంగా విశ్వాసముంచుట ద్వారా దేవుని వాగ్దానాలకు ప్రత్యుత్తరమిచ్చిన మన క్రైస్తవ సహవాసులకు ఎట్లు ప్రయోజనమివ్వగలదు?
[అధస్సూచీలు]
a విశ్వాసము, సద్గుణము కావలికోట యొక్క ఈ సంచికలో చర్చించబడ్డాయి. జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ ఇవి మరింత ఎక్కువగా భవిష్యత్ సంచికల్లో చర్చించబడతాయి.
మీ జవాబులేమి?
◻ “విశ్వాసమును” ఎట్లు నిర్వచింపవచ్చును?
◻ రెండవ పేతురు 1:5-7 ప్రకారము, మన విశ్వాసానికి ఏ లక్షణాల్ని అమర్చాలి?
◻ యేసు రూపాంతరము మన విశ్వాసంపై ఏ ప్రభావం చూపాలి?
◻ విశ్వాసం విషయంలో హేబెలు, అబ్రాహాము, శారా, ఆలాగే తొలికాలాల్లోని ఇతరులు ఏ మాదిరినుంచారు?
[15వ పేజీలోని చిత్రం]
యేసు రూపాంతరము ఒక వ్యక్తి విశ్వాసంపై ఎలా ప్రభావం చూపగలదో మీకు తెలుసా?