“యెహోవాను స్తుతించుడి!”
“సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక!”—కీర్తన 150:6.
1, 2. (ఎ) మొదటి శతాబ్దంలో క్రైస్తవత్వం ఎంత మేరకు వర్ధిల్లింది? (బి) అపొస్తలులు ముందే ఏమని హెచ్చరించారు? (సి) భ్రష్టత్వం ఎలా పెంపొందింది?
మొదటి శతాబ్దంలో వర్ధిల్లిన క్రైస్తవ సంఘంగా, యేసు తన శిష్యులను సంస్థీకరించాడు. తీవ్రమైన మత వ్యతిరేకత ఉన్ననూ, ‘సువార్త ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడింది.’ (కొలొస్సయులు 1:23) కాని యేసుక్రీస్తు అపొస్తలుల మరణం తర్వాత, సాతాను భ్రష్టత్వాన్ని యుక్తిగా పెంపొందింపజేశాడు.
2 దీని గురించి అపొస్తలులు ముందుగానే హెచ్చరించారు. ఉదాహరణకు, ఎఫెసు నుండి వచ్చిన పెద్దలకు పౌలు ఇలా చెప్పాడు: “దేవుడు తన స్వరక్తమిచ్చి (“స్వంత [కుమారుని] రక్తమిచ్చి,” NW) సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొస్తలుల కార్యములు 20:28-30; 2 పేతురు 2:1-3; 1 యోహాను 2:18, 19 కూడా చూడండి.) ఆవిధంగా, నాల్గవ శతాబ్దంలో, భ్రష్ట క్రైస్తవత్వం రోమా సామ్రాజ్యంతో చేతులు కలపనారంభించింది. కొన్ని శతాబ్దాల తర్వాత, పరిశుద్ధ రోమా సామ్రాజ్యం రోమ్‌లోని పోపుతో సంబంధాలు పెంచుకొని మానవజాతిలోని ఒక పెద్ద భాగంపై పరిపాలించడం ప్రారంభించింది. ఈలోగా, ప్రొటెస్టెంటు సంస్కరణోద్యమం కాథోలిక్కు చర్చి యొక్క హద్దులుమీరిన దుష్టత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది, కాని అది నిజ క్రైస్తవత్వాన్ని పునరుద్ధరించడంలో విఫలమైంది.
3. (ఎ) సృష్టంతటికీ సువార్త ఎప్పుడు మరియు ఎలా ప్రకటించబడింది? (బి) 1914లో బైబిలు ఆధారిత ఏ నిరీక్షణలు వాస్తవాలయ్యాయి?
3 అయినప్పటికీ, 19వ శతాబ్దాంతం సమీపిస్తుండగా, యథార్థపరులైన బైబిలు విద్యార్థుల గుంపొకటి ‘ఆకాశం క్రిందనున్న సమస్త సృష్టికి సువార్త నిరీక్షణను’ ప్రకటించడానికి, అందించడానికి మరలా పనిరద్దీ కలిగివుంది. బైబిలు ప్రవచనాన్ని గూర్చిన వారి అధ్యయనం ఆధారంగా ఈ గుంపు, సా.శ.పూ. 607లో యెరూషలేము నిర్మానుష్యమవ్వడంతో ఆరంభమైన “ఏడు కాలము”ల సమయం లేక 2,520 సంవత్సరాలు అంటే “అన్యజనముల కాలముల” అంతానికి గుర్తుగా 1914ను దానికి 30 సంవత్సరాలకంటే ముందే సూచించింది. (లూకా 21:24; దానియేలు 4:16) నిరీక్షించినట్లుగానే, భూమిపై మానవ వ్యవహారాలలో 1914 ఓ మలుపురాయిగా నిరూపించబడింది. పరలోకంలో కూడా చారిత్రాత్మకమైన సంఘటనలు జరిగాయి. ఆ సమయంలోనే, నిత్యత్వం యొక్క రాజు, భూమిపై నుండి సమస్త దుష్టత్వాన్ని తుడిచివేయడానికి, పరదైసును పునరుద్ధరించడానికి సిద్ధపాటుగా తన సహ రాజైన యేసుక్రీస్తును పరలోక సింహాసనంపై ఆసీనున్ని చేశాడు.—కీర్తన 2:6, 8, 9; 110:1, 2, 5.
మెస్సీయ రాజును చూడండి!
4. మిఖాయేలు అనే తన నామ భావానికి తగినట్లు యేసు ఎలా జీవించాడు?
4 ఈ మెస్సీయ రాజైన యేసు 1914లో చర్యతీసుకోవడం ప్రారంభించాడు. బైబిలులో ఆయన, యెహోవా సర్వాధిపత్యం సత్యమైనదని నిరూపించ నుద్దేశింపబడినందున “దేవునివంటి వాడెవడు?” అనే అర్థాన్నిచ్చే మిఖాయేలు అని కూడా పిలువబడ్డాడు. ప్రకటన 12:7-12నందు వ్రాయబడివున్నట్లుగా, జరుగబోవు దానిని అపొస్తలుడైన యోహాను దర్శనమందు ఇలా వర్ణించాడు: “పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా, ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.” నిశ్చయంగా బలమైన రీతిలో పడిపోవడమే!
5, 6. (ఎ) 1914 తర్వాత, పరలోకం నుండి ఏ ఉత్తేజభరితమైన ప్రకటన వెలువడింది? (బి) మత్తయి 24:3-13 దీనితో ఎలా సంబంధాన్ని కలిగివుంది?
5 ఆ తర్వాత పరలోకంలో ఒక స్వరం బిగ్గరగా ఇలా ప్రకటించింది: “రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు [నమ్మకమైన క్రైస్తవులు] గొఱ్ఱెపిల్ల [క్రీస్తుయేసు] రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.” యేసు అమూల్యమైన విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచిన, యథార్థతను కాపాడుకొనిన వారికి విడుదల అని దీని భావం.—సామెతలు 10:2; 2 పేతురు 2:9.
6 “అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని” ఒక గొప్ప స్వరము పరలోకంలో ప్రకటించింది. ఆవిధంగా ఈ భూమిని గురించి ప్రవచింపబడిన “శ్రమ” ఈ శతాబ్దంలోని ఉపద్రవాలైన ప్రపంచ యుద్ధాలు, కరువులు, తెగుళ్లు, భూకంపాలు, మరియు అక్రమాలలో వ్యక్తపర్చబడింది. మత్తయి 24:3-13 వివరిస్తున్నట్లుగా ఇవి, ‘ఈ యుగసమాప్తికి సూచనలోని’ భాగమవుతాయని యేసు ప్రవచించాడు. ప్రవచింపబడినట్లుగానే, మానవ గత చరిత్రంతటితో సరిపోల్చలేని రీతిలో 1914 నుండి మానవజాతి భూమిపై శ్రమను అనుభవించింది.
7. యెహోవాసాక్షులు ఎందుకు అత్యవసరతతో ప్రకటిస్తారు?
7 సాతాను సంబంధిత ఈ శ్రమా యుగంలో, భవిష్యత్తు కొరకైన నిరీక్షణను మానవజాతి కనుగొనగలదా? ఎందుకు కనుగొనలేదు, కనుగొంటుంది, ఎందుకంటే మత్తయి 12:21 యేసు గురించి ఇలా చెబుతుంది: “ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు”! దేశాల మధ్యనున్న ఈ దయనీయమైన పరిస్థితులు ‘ఈ యుగసమాప్తికి సూచన’ మాత్రమే కాదుగాని మెస్సీయ రాజ్యానికి పరలోక రాజుగా ‘యేసు రాకడకు సూచనగా’ కూడా ఉన్నాయి. ఆ రాజ్యానికి సంబంధించి యేసు ఇంకా ఇలా చెబుతున్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతర్వాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) నేడు భూమిపై దేవుని రాజ్య పరిపాలన యొక్క మహిమకరమైన నిరీక్షణను ప్రకటిస్తున్న ప్రజలు ఎవరు? యెహోవాసాక్షులు! నీతియుక్తమైన, సమాధానకరమైన దేవుని రాజ్యం భూ వ్యవహారాలను త్వరలోనే నియంత్రించబోతుందని వారు అత్యంతావశ్యకతతో, బహిరంగంగాను, ఇంటింటను ప్రకటిస్తున్నారు. ఈ పరిచర్యలో మీరు భాగం వహిస్తున్నారా? మీకు దీనికన్నా గొప్ప ఆధిక్యత మరొకటి ఉండదు!—2 తిమోతి 4:2, 5.
“అంతము” ఎలా వస్తుంది?
8, 9. (ఎ) తీర్పు “దేవుని ఇంటి”తో ఎలా ప్రారంభమౌతుంది? (బి) క్రైస్తవమత సామ్రాజ్యం దేవుని వాక్యాన్ని ఎలా ఉల్లంఘించింది?
8 మానవజాతి తీర్పు కాలంలోకి ప్రవేశించింది. 1 పేతురు 4:17 నందు మనకు చెప్పబడినట్లుగా, తీర్పు “దేవుని ఇంటియొద్ద” ఆరంభమయ్యింది—1914-18 మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధ ఊచకోతతో “అంత్య దినములు” ఆరంభమైనప్పటి నుండి, క్రైస్తవ సంస్థలని చెప్పుకొనే వాటి తీర్పు ఆరంభమయ్యింది. ఈ తీర్పులో క్రైస్తవమత సామ్రాజ్యం ఎలా తీర్పు తీర్చబడింది? 1914 నుండి యుద్ధాలకు మద్దతునివ్వడంలో చర్చీలు వహించిన స్థానాన్ని పరిశీలించండి. యుద్ధంలో మొదటి పంక్తిలో ఉండమని తమ ప్రసంగాల ద్వారా తెలియజేసిన మతనాయకులు “నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము”తో కళంకితులు కాలేదా?—యిర్మీయా 2:34
9 మత్తయి 26:52 ప్రకారం, యేసు ఇలా చెప్పాడు: “కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” ఈ శతాబ్దపు యుద్ధాలలో ఇదెంత వాస్తవమో కదా! యుద్ధాలలోకి వెళ్లి ఇతర యౌవనులను, చివరికి అదే మతానికి చెందిన యౌవనులను అంటే కాథోలిక్కులు కాథోలిక్కులను, ప్రొటెస్టంట్లు ప్రొటెస్టంట్లను వధించమని మతనాయకులు యౌవనస్థులను పురికొల్పారు. జాతీయవాదం దేవునికన్నా క్రీస్తుకన్నా పైగా కొనియాడబడుతోంది. ఇటీవల, కొన్ని ఆఫ్రికా దేశాలలో జాతి గుర్తింపులు బైబిలు సూత్రాలకన్నా ముందు స్థానంలో ఉంచబడ్డాయి. జనాభాలోని అధికులు కాథోలిక్కులే ఉన్న రువాండాలో జాతి దౌర్జన్యంలో కనీసం 50 లక్షల మంది వధింపబడ్డారు. వాటికన్ వార్తాపత్రికయైన ల ఒసెర్వేతో రొమానోలో పోపు ఇలా అంగీకరించాడు: “ఇది పూర్తిగా జాతి విధ్వంసమే, విచారకరంగా దానికి కాథోలిక్కులు కూడా బాధ్యులు.”—యెషయా 59:2, 3; మీకా 4:3, 5 పోల్చండి.
10. అబద్ధ మతంపై యెహోవా ఏ తీర్పును అమలు చేస్తాడు?
10 ఒకరినొకరు వధించుకొనుమని మనుష్యుల్ని ప్రోత్సహించే లేక తమ గుంపులోని సభ్యులు మరొక గుంపులోని సభ్యులను హతమారుస్తుండగా నిల్చొని చూసే మతాలను నిత్యత్వం యొక్క రాజు ఎలా దృష్టిస్తాడు? ప్రపంచ అబద్ధమత విధానమైన మహాబబులోను గురించి ప్రకటన 18:21, 24 మనకు ఇలా చెబుతుంది: “బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి—ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును. మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.”
11. క్రైస్తవమత సామ్రాజ్యంలో ఏ ఘోరమైన కృత్యాలు జరుగుతున్నాయి?
11 బైబిలు ప్రవచన నెరవేర్పుగా, క్రైస్తవమత సామ్రాజ్యంలో ఘోరమైన సంగతులు జరుగుతున్నాయి. (యిర్మీయా 5:30, 31; 23:14 పోల్చండి.) ఎక్కువగా మతనాయకుల విచ్చలవిడి దృక్పథం మూలంగా, వారి మందలు లైంగిక దుర్నీతిలో నిమగ్నమై ఉన్నాయి. క్రైస్తవ దేశమని చెప్పుకుంటున్న అమెరికాలోనే, వివాహాలన్నింటిలో దాదాపు సగం, విడాకులతో ముగుస్తున్నాయి. పిన్న వయస్సులోనే గర్భవతులు కావడం మరియు సలింగ సంయోగం వంటివి చర్చి సభ్యులలోనే విశృంఖలంగా పెరిగిపోతున్నాయి. మతనాయకులు యౌవనస్థులపై లైంగిక అత్యాచారం చేస్తున్నారు—మరి ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే కాదు. ఈ కేసులకు సంబంధించి న్యాయస్థాన తీర్మానాలకు ఒక దశాబ్దంలోనే వందకోట్ల డాలర్లను అమెరికాలోని కాథోలిక్ చర్చి చెల్లించవలసి ఉంటుందని చెప్పబడింది. 1 కొరింథీయులు 6:9, 10నందు కనుగొనబడే, అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ హెచ్చరికను క్రైస్తవమత సామ్రాజ్యం నిర్లక్ష్యం చేసింది: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.”
12. (ఎ) మహాబబులోనుకు వ్యతిరేకంగా నిత్యత్వం యొక్క రాజు ఎలా చర్యగైకొంటాడు? (బి) క్రైస్తవమత సామ్రాజ్యానికి భిన్నంగా, దేవుని ప్రజలు “హల్లెలూయా” పల్లవిని ఏ కారణంచేత పాడతారు?
12 త్వరలో, నిత్యుడగు రాజైన యెహోవా తన పరలోక సర్వసైన్యాధిపతియైన క్రీస్తు యేసు ద్వారా మహాశ్రమను తెస్తాడు. మొదట క్రైస్తవమత సామ్రాజ్యంపై, మహాబబులోనులోని ఇతర శాఖలన్నిటిపై యెహోవా తీర్పు అమలు చేయబడుతుంది. (ప్రకటన 17:16, 17) యేసు విమోచన క్రయధన బలి ద్వారా యెహోవా దయచేస్తున్న రక్షణకు అయోగ్యులమని వారు తమంతట తాము చూపించుకున్నారు. వారు దేవుని పరిశుద్ధ నామాన్ని అలక్ష్యం చేశారు. (యెహెజ్కేలు 39:7 పోల్చండి.) వారు తమ సుందరమైన మత కట్టడాలలో “హల్లెలూయా” అనే పల్లవిని ఆలపించడం ఎంతటి అపహాస్యమో కదా! వారు యెహోవా యొక్క అమూల్యమైన నామాన్ని తమ బైబిలు తర్జుమాల నుండి తొలగించారు, కాని “హల్లెలూయా” అంటే “యా ను స్తుతించుడి” అని అర్థం—“యా” అనేది “యెహోవా” యొక్క సంక్షిప్త రూపం—అనే వాస్తవాన్ని మరచి పోయినట్లు కనిపిస్తుంది. సముచితంగానే, మహాబబులోనుపై దేవుని తీర్పు అమలుచేయబడినందున జరిగే మహోత్సవంలో త్వరలోనే పాడబడే “హల్లెలూయా” పల్లవిల గురించి ప్రకటన 19:1-6 నివేదిస్తుంది.
13, 14. (ఎ) తర్వాత ఏ ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి? (బి) దేవునికి భయపడే ప్రజలకు చివరికి లభించే సంతోషభరితమైన ప్రతిఫలం ఏమిటి?
13 తర్వాత జరిగేది, దేశాలపై, ప్రజలపై తీర్పును ప్రకటించడానికి మరియు అమలు చేయడానికి యేసు ‘ఆగమనం.’ ఆయన తానే ఇలా ప్రవచించాడు: “తన మహిమతో మనుష్యకుమారుడును [క్రీస్తుయేసు] ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల [తీర్పు] సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు [భూమిపైగల] సమస్త జనములు ఆయనయెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి—నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” అని చెప్పును. (మత్తయి 25:31-34) మేకల తరగతి “నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు” అని మత్తయి 25 46వ వచనం తెలియజేస్తుంది.
14 “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు”నైన మన పరలోకపు ప్రభువైన యేసుక్రీస్తు అర్మగిద్దోనునందు, సాతాను విధానంలోని రాజకీయ, వాణిజ్య భాగాలను నాశనం చేస్తూ, ఎలా యుద్ధం చేస్తాడో బైబిలు పుస్తకమైన ప్రకటన వర్ణిస్తుంది. ఆవిధంగా క్రీస్తు, “సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత”ను సాతాను యొక్క యావత్ భూ సామ్రాజ్యంపై కుమ్మరిస్తాడు. ఈ ‘మొదటి సంగతులు గతించిపోగా,’ దేవునికి భయపడే మానవులు, ‘వారి కన్నుల ప్రతిబాష్పబిందువును దేవుడు తుడిచివేసే’ ఆ మహిమాయుతమైన నూతన లోకంలోకి ప్రవేశిస్తారు.—ప్రకటన 19:11-16; 21:3-5.
యెహోవాను స్తుతించేందుకు సమయం
15, 16. (ఎ) మనం యెహోవా ప్రవచన వాక్యాన్ని గైకొనడం ఎందుకు ప్రాముఖ్యము? (బి) రక్షణ కొరకు మనం ఏమి చేయాలని ప్రవక్తలు, అపొస్తలులు సూచించారు, నేడు కోట్లాదిమందికి దీని భావం ఏమైవుంది?
15 తీర్పును అమలుచేసే ఆ దినం ఆసన్నమయ్యింది! కాబట్టి నిత్యత్వం యొక్క రాజు యొక్క ప్రవచనాత్మక వాక్యాన్ని లక్ష్యపెట్టడం మనకు శ్రేయోదాయకం. అబద్ధమత బోధలలో, ఆచారాలలో ఇప్పటికీ చిక్కుకొని ఉన్నవారికి, పరలోకంలోని ఓ స్వరమిలా ప్రకటిస్తున్నది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.” అయితే తప్పించుకొనేవారు ఎక్కడి వెళ్లాలి? ఒకే ఒక సత్యం ఉండగలదు కాబట్టి ఒకే ఒక నిజమైన మతమే ఉంటుంది. (ప్రకటన 18:4; యోహాను 8:31, 32; 14:6; 17:3) ఆ మతాన్ని కనుగొని, దాని దేవునికి విధేయత చూపించడంపై మనం నిత్యజీవం పొందడం ఆధారపడి ఉంది. “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని” తెలియజేసే కీర్తన 83:18నందు బైబిలు ఆయనవైపుకి మనలను నడిపిస్తుంది.
16 అయితే, మనం కేవలం నిత్యత్వం యొక్క రాజు నామాన్ని తెలుసుకోవడం కన్నా మరెంతో చేయాల్సిన అవసరం ఉంది. మనం బైబిలు పఠించి, ఆయన మహిమాన్విత లక్షణాల గురించి, సంకల్పాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు తర్వాత మనం, రోమీయులు 10:9-13నందు సూచించబడినట్లుగా ఈ శకం కొరకైన ఆయన చిత్తాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ అపొస్తలుడైన పౌలు ప్రేరేపిత ప్రవక్తల ఉల్లేఖనాలను ఉదాహరిస్తూ ఇలా ముగించాడు: “ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.” (యోవేలు 2:32; జెఫన్యా 3:9) రక్షించబడడమా? అవును, నేడు క్రీస్తు ద్వారా యెహోవా ఏర్పాటు చేసిన విమోచన క్రయధనమందు విశ్వాసముంచే లక్షలాది మంది, సాతాను భ్రష్ట లోకంపైకి తీర్పు అమలు చేయబడినప్పుడు, రానైయున్న మహాశ్రమ నుండి విడుదల పొందుతారు.—ప్రకటన 7:9, 10, 14.
17. ఇప్పుడు మోషే కీర్తనను, గొఱ్ఱెపిల్ల కీర్తనను పాడడంలో చేరేందుకు ఏ ఘనమైన నిరీక్షణ మనల్ని పురికొల్పాలి?
17 తప్పించుకోవాలని నిరీక్షించేవారి కొరకు దేవుని చిత్తం ఏమైవుంది? అదేమిటంటే, ఇప్పుడు కూడా మనం నిత్యత్వం యొక్క రాజు విజయాలను అవలోకిస్తూ ఆయనను స్తుతించడంలో మోషే కీర్తనను, గొఱ్ఱెపిల్ల కీర్తనను పాడడంలో చేరడమే. ఇతరులకు ఆయన మహిమకరమైన సంకల్పాలను చెప్పడం ద్వారా మనం దీన్ని చేస్తాము. బైబిలు అవగాహనలో మనం పురోభివృద్ధి చెందుతుండగా, మనం మన జీవితాలను నిత్యత్వం యొక్క రాజుకు సమర్పించుకుంటాము. ఈ బలవంతుడైన రాజు వర్ణిస్తున్న ఏర్పాట్లలో నిరంతరమూ మనం జీవించడానికి అది నడిపిస్తుంది. దాని గురించి యెషయా 65:17-19 ఇలా తెలియజేస్తుంది: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును [యేసు యొక్క మెస్సీయ రాజ్యం] క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి.”
18, 19. (ఎ) కీర్తన 145నందలి దావీదు మాటలు ఏమి చేయడానికి మనల్ని పురికొల్పాలి? (బి) యెహోవా గుప్పిలి నుండి మనం దేన్ని నమ్మకంతో ఎదురు చూడవచ్చు?
18 కీర్తనకర్త అయిన దావీదు నిత్యత్వం యొక్క రాజును ఈ మాటలలో వర్ణిస్తున్నాడు: “యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది.” (కీర్తన 145:3) అంతరిక్షానికి, నిత్యత్వానికి అవధులు లేనట్లే ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది! (రోమీయులు 11:33) మన సృష్టికర్తను గూర్చిన, ఆయన కుమారుడైన క్రీస్తుయేసు ద్వారా ఏర్పాటుచేసిన ఆయన విమోచన క్రయధనాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందడంలో మనం కొనసాగుతుండగా, మన నిత్యత్వం యొక్క రాజును మరెంతో ఎక్కువగా మనం స్తుతించాలని కోరుకుంటాము. కీర్తన 145:11-13నందు వివరించబడినట్లుగా మనం చేయాలని అనుకొంటాము: “ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వతరాజ్యము. నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.”
19 మన దేవుడు ఈ ప్రకటనకు తగినట్లుగా చేస్తాడని మనం దృఢంగా అపేక్షించగలము: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.” నిత్యత్వం యొక్క రాజు ఈ అంత్యదినముల అంతం గుండా మనల్ని క్షేమంగా నడిపిస్తాడు, ఎందుకంటే రాజైన దావీదు మనకిలా అభయమిచ్చాడు: “యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును.”—కీర్తన 145:16, 20.
20. చివరి ఐదు కీర్తనల్లో చెప్పబడినట్లుగా, నిత్యత్వం యొక్క రాజు ఆహ్వానానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారు?
20 బైబిలులోని చివరి ఐదు కీర్తనలలో ప్రతీది “హల్లెలూయా” అనే ఆహ్వానంతో ప్రారంభించబడి ముగించబడుతుంది. అందుకే 146వ కీర్తన మనల్ని ఈ విధంగా ఆహ్వానిస్తోంది: “యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” ఆ పిలుపుకు మీరు ప్రతిస్పందిస్తారా? కచ్చితంగా ఆయనను స్తుతించాలని మీరు కోరుకుంటారు! “యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది” అని కీర్తన 148:12, 13నందు వర్ణింపబడినవారిలో మీరూ ఉందురు గాక! “యెహోవాను స్తుతించుడి” అనే ఈ ఆహ్వానానికి మనం హృదయపూర్వకంగా ప్రతిస్పందించుదుము గాక! ముక్తకంఠంతో మనమందరమూ నిత్యత్వం యొక్క రాజును స్తుతిద్దాము!
మీ వ్యాఖ్యానం ఏమిటి?
◻ దేని గురించి యేసు అపొస్తలులు ముందే హెచ్చరించారు?
◻ 1914 మొదలుకొని ఏ నిర్ణయాత్మక చర్యలు గైకొనబడ్డాయి?
◻ యెహోవా ఏ తీర్పులు అమలు చేయనైయున్నాడు?
◻ నిత్యత్వం యొక్క రాజును స్తుతించడానికి ఇది ఎందుకు అత్యంత ప్రాముఖ్యమైన సమయము?
[19వ పేజీలోని బాక్సు]
సంక్షోభంతో కూడిన ఈ విపత్కరమైన యుగం
ఇరవయ్యవ శతాబ్దారంభంలో సంక్షోభ శకం ఆరంభమైందనే నిజాన్ని అనేకులు గుర్తించారు. ఉదాహరణకు, అమెరికా శాసనసభ్యుడైన డానియేల్ పాట్రిక్ మోయనీహాన్ వ్రాసిన, 1993లో ప్రచురింపబడిన పేండమోనియమ్ అనే పుస్తకం ముందుమాటలో, “1914 నాటి విపత్తు”పై ఓ వ్యాఖ్యానం ఇలా చదువబడుతోంది: “యుద్ధం వచ్చింది, ప్రపంచం పూర్తిగా మారిపోయింది. పందొమ్మిది వందల పద్నాలుగులో ఉండి, అప్పటినుండి ఇంతవరకు తమ ప్రభుత్వ రూపాన్ని బలవంతంగా మార్చుకోని రాజ్యాలు భూమిపై నేడు ఎనిమిది ఉన్నాయి. . . . మిగిలిన 170 లేదా మరికొన్ని, సమకాలీన రాజ్యాలలోని కొన్ని రాజ్యాలు ఈమధ్య జరిగిన గొప్ప సంక్షోభం తరువాత సృష్టించబడ్డాయి.” నిజంగా, 1914 నుండి ఈ శకం ఒక విపత్తు తర్వాత మరో విపత్తును ఎదుర్కొంది!
అవుట్ ఆఫ్ కంట్రోల్—గ్లోబల్ టర్మోయిల్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది ట్వంటీ-ఫస్ట్ సెంచురీ అనే పుస్తకం కూడా 1993లో ప్రచురింపబడినదే. దాని గ్రంథకర్త అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్ మాజీ అధికారి, జూబిగ్నెఫ్ బ్రేజిన్‌స్కీ. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఇరవయ్యో శతాబ్దారంభం వివేచనా యుగం యొక్క నిజమైన ఆరంభంగా అనేకమంది వ్యాఖ్యానాలలో కొనియాడబడింది. . . . దాని వాగ్దానానికి భిన్నంగా ఇరవయ్యో శతాబ్దం మానవజాతి యొక్క అత్యంత రక్తసిక్తమైన ద్వేషపూరిత శతాబ్దంగా, రాజకీయ విభ్రాంతికర మరియు భయంకరమైన హత్యల శతాబ్దంగా తయారయ్యింది. క్రూరత్వం అపూర్వమైన స్థాయికి సంస్థీకరింపబడింది, సామూహిక హత్యలు చేయబడుతున్నాయి. మంచి కొరకైన శాస్త్రీయ సంభావ్యత మరియు నిజంగా బయల్పర్చబడిన రాజకీయ చెడు మధ్యనున్న వ్యత్యాసం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. చరిత్రలో ఇంతకు మునుపెన్నడూ హత్యలు భూగోళవ్యాప్తంగా ఇంతగా జరుగలేదు, ఇంతకు మునుపెన్నడూ ఇంతమంది జీవితాలను నాశనం చేయలేదు, అలాంటి దురహంకారపూరితమైన పశుప్రాయ గమ్యాలతో మానవ వినాశం ఇంతకు ముందెన్నడూ జరగలేదు.” అదెంత వాస్తవమో కదా!
[17వ పేజీలోని చిత్రం]
1914లో రాజ్య స్థాపన తర్వాత మిఖాయేలు సాతాను, అతని దూతలను భూమిపైకి పడద్రోశాడు