ఆదరణ మరియు ప్రోత్సాహము—అనేక కోణాలుగల రత్నాలు
మనలో అనేకులం నిరుపేదలమని భావించిన సమయాలను అనుభవించాం—అది వస్తురూపంగా కాదుగాని మానసికంగా అయ్యుండవచ్చు. మనం నిరుత్సాహం చెంది, బాగా కృంగిపోయాం కూడా. అయినప్పటికీ, మనకు ఎంతో మంచి చేయగల విలువైనదాన్ని మనం అలాంటి సమయాల్లో మనవద్ద కలిగివుండి ఉండవచ్చు. ఆ “రత్నమే” ప్రోత్సాహం.
బైబిలులో, “ప్రోత్సాహము” మరియు “ఆదరణ” కొరకు ఒకే గ్రీకుపదం ఉపయోగించబడింది. ఆ రెండు పదాలూ ధైర్యం, శక్తి లేక నిరీక్షణ అనే భావాన్ని తెలియజేస్తాయి. మనం బలహీనంగా లేక కృంగినట్లు భావిస్తున్నప్పుడు, మనకు కావలసినవి కచ్చితంగా ఆదరణ మరియు ప్రోత్సాహమేనన్న విషయం స్పష్టం. వాటిని ఎక్కడ కనుగొనవచ్చు?
యెహోవా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని బైబిలు మనకు నిశ్చయతనిస్తుంది. (2 కొరింథీయులు 1:3) “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అని కూడా అది చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 17:27) కాబట్టి ఆదరణ, ప్రోత్సాహాలు మనకు అందుబాటులో ఉన్నాయి. యెహోవా ప్రోత్సాహాన్ని అందజేసే నాలుగు సాధారణ ప్రాంతాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండటం ద్వారా
ఆదరణనిచ్చే అత్యంత గొప్ప మూలమేమంటే యెహోవా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండటమే. అలాంటి సంబంధాన్ని కలిగివుండటం సాధ్యమౌతుందన్నదే ప్రోత్సాహాన్నిస్తుంది. ఎంతైనా, ఏ ప్రపంచ పరిపాలకుడు మనం ఫోన్ చేస్తే దానికి తిరిగి సమాధానమిస్తాడు లేక మన సమస్యల్లో వ్యక్తిగత ఆసక్తిని వ్యక్తపరుస్తాడు? అలాంటి వ్యక్తులకంటే యెహోవా ఎంతో సర్వోన్నతుడు. అయినప్పటికీ, ఆయన దీనుడు—తక్కువ స్థాయిగల, అసంపూర్ణ మానవులతో వ్యవహరించేందుకు ఆయన ఎంతో సుముఖతను కలిగివున్నాడు. (కీర్తన 18:35) మనపట్ల ప్రేమ చూపడంలో కూడా యెహోవా చొరవ తీసుకున్నాడు. మొదటి యోహాను 4:10 ఇలా చెబుతుంది: “మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను.” అంతేకాకుండా, యెహోవా ప్రేమపూర్వకంగా మనల్ని తన కుమారుని వద్దకు ఆకర్షిస్తున్నాడు.—యోహాను 6:44.
దేవునితో స్నేహానికి మీరు ప్రతిస్పందించి దానియందు ఆదరణను పొందేందుకు ప్రయత్నించారా? (యాకోబు 2:23 పోల్చండి.) ఉదాహరణకు, మీకు ప్రేమగల సన్నిహితుడైన స్నేహితుడు ఉంటే మీ చింతలు బాధలు నిరీక్షణలు ఆనందాల గురించి అతనితో మాట్లాడుతూ కొంత సమయాన్ని గడపటం మీకు ఆహ్లాదాన్ని కలిగించదా? తనతో కూడా అలాగే చేయాలని యెహోవా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయనతో ప్రార్థనలో మనం ఎంతసేపు మాట్లాడాలనే దానికి ఆయన ఎలాంటి పరిమితులను పెట్టడం లేదు, అంతేగాక ఆయన వాస్తవంగా వింటాడు. (కీర్తన 65:2; 1 థెస్సలొనీకయులు 5:15) యేసు క్రమంగా, పట్టుదలతో ప్రార్థించాడు. వాస్తవానికి, తన 12 మంది అపొస్తలులను ఎన్నుకునే ముందు, ఆయన ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపాడు.—లూకా 6:12-16; హెబ్రీయులు 5:7.
అప్పుడప్పుడు, మనలో ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా యెహోవాకు ప్రార్థన చేసేందుకు కొంత సమయాన్ని తీసుకోవాలి. కిటికీ వద్ద మౌనంగా కూర్చోవడం లేక ప్రశాంతంగా నడచి వెళ్లడం, ప్రార్థనలో యెహోవాకు మన హృదయాలను తెరవడానికి ఒక మంచి అవకాశాన్ని అందించగలదు. అలా చేయడం గొప్ప ఉపశమనానికి మరియు ఆదరణకు మూలం కాగలదు. మనం ధ్యానించేటప్పుడు, యెహోవా సృష్టిలోని ఒక అంశాన్ని మనం చూడగల్గితే, అంటే ఆకాశాన్ని, చెట్లను లేక పక్షులను చూడగల్గితే, మనపట్ల యెహోవా కలిగివున్న ప్రేమ మరియు శ్రద్ధను మనకు జ్ఞాపకంచేసే ఆదరణకరమైన అంశాలుగా అవి ఉండగలవు.—రోమీయులు 1:20.
దేవుని వాక్యం యొక్క వ్యక్తిగత పఠనం ద్వారా
యెహోవా లక్షణాలు వాస్తవంగా మనకు గోచరమయ్యేది, మన వ్యక్తిగత బైబిలు పఠనం ద్వారానే. ఆయన ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపగల దేవుడని’ బైబిలు యెహోవాను గురించి పదే పదే బయల్పరుస్తుంది. (నిర్గమకాండము 34:6; నెహెమ్యా 9:17; కీర్తన 86:15) తన భూసేవకులకు ఆదరణనివ్వాలన్న కోరిక యెహోవా వ్యక్తిత్వంలోని ఒక స్వతస్సిద్ధమైన భాగం.
ఉదాహరణకు, యెషయా 66:13నందలి యెహోవా యొక్క ఈ మాటలను పరిశీలించండి: “ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను.” తన పిల్లలపట్ల తల్లి కలిగివుండే ప్రేమ స్వయంత్యాగ పూరితమైనది యథార్థమైనది అయి ఉండేలా యెహోవా రూపించాడు. గాయపడిన తన పిల్లవానికి తల్లి ప్రేమపూర్వకంగా ఆదరణనివ్వడాన్ని మీరు ఎప్పుడైనా చూసి ఉంటే, తన ప్రజలకు తాను ఆదరణనిస్తానని యెహోవా చెప్పినప్పుడు ఆయన ఏ భావాన్ని కలిగివున్నాడో మీరు తెలుసుకుంటారు.
అనేక బైబిలు వృత్తాంతాలు అలాంటి ఆదరణను కార్యరూపంలో చూపిస్తున్నాయి. దుష్ట రాణియైన యెజెబెలు ఏలీయాను చంపుతానని భయపెట్టినప్పుడు, ఆయన తన ధైర్యాన్ని కోల్పోయి తన జీవాన్ని కాపాడుకునేందుకు పారిపోయాడు. ఆయనెంత నిరుత్సాహం చెందాడంటే ఆయన అరణ్యంలోకి ఒక దినం ప్రయాణం చేశాడు, ఆయనవద్ద నీళ్లు లేక ఏ ఆహార పదార్థాలు లేవన్నది స్పష్టమౌతుంది. తాను చనిపోవాలని కోరుకుంటున్నానని ఏలీయా దుఃఖంతో యెహోవాకు చెప్పుకున్నాడు. (1 రాజులు 19:1-4) తన ప్రవక్తకు ఆదరణనిచ్చి ఆయనను ప్రోత్సహించేందుకు యెహోవా ఏమి చేశాడు?
ఒంటరిగా, అయోగ్యునిగా భావించినందుకు మరియు భయపడినందుకు యెహోవా ఏలీయాను గద్దించలేదు. దానికి బదులుగా, “మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము”ను ఆ ప్రవక్త విన్నాడు. (1 రాజులు 19:12) మీరు 1 రాజులు 19వ అధ్యాయాన్ని చదివితే, యెహోవా ఏలీయాకు ఎలా ఆదరణనిచ్చాడో, ఆయనను ఎలా ఓదార్చాడో, ఆయన విశ్వాసాన్ని ఎలా నిర్మించాడో తెలుసుకుంటారు. ఆయన వట్టి మాటలతో ఆదరింపబడలేదు. అది ఏలీయా దుఃఖహృదయాన్ని స్పర్శించి, ముందుకు కొనసాగేందుకు ఆ ప్రవక్తను ప్రోత్సహించింది. (యెషయా 40:1, 2 పోల్చండి.) త్వరలోనే, ఆయన మళ్లీ తన నియామకాన్ని చేపట్టాడు.
అదే విధంగా, యేసుక్రీస్తు తన యథార్థ అనుచరులకు ఆదరణనిచ్చి వారిని ప్రోత్సహిస్తాడు. వాస్తవానికి, మెస్సీయను గురించి యెషయా ఇలా ప్రవచించాడు: “ప్రభువగు యెహోవా . . . నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును, . . . దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును . . . నన్ను పంపియున్నాడు.” (యెషయా 61:1-3) తన జీవితకాలంలో, ఈ మాటలు తనకు అన్వయిస్తాయనే విషయంలో యేసు ఎలాంటి సందేహాన్ని మిగల్చలేదు. (లూకా 4:17-21) మీకు ఆదరణ అవసరముందని మీరు భావిస్తే, బాధపడ్తూ అవసరతల్లోవున్న ప్రజలతో యేసు దయగా, ప్రేమగా వ్యవహరించడాన్ని మీరు ధ్యానించండి. వాస్తవానికి, బైబిలును శ్రద్ధగా పఠించడం, ఆదరణ మరియు ప్రోత్సాహానికి గొప్ప మూలం.
సంఘం ద్వారా
క్రైస్తవ సంఘంలో, ఆదరణ మరియు ప్రోత్సాహానికిగల రత్నాలు వాటి అనేక కోణాల్లో మెరుస్తుంటాయి. “యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి” అని వ్రాసేందుకు అపొస్తలుడైన పౌలు ప్రేరేపించబడ్డాడు. (1 థెస్సలొనీకయులు 5:11) సంఘ కూటాల్లో ఆదరణ మరియు ప్రోత్సాహాన్ని ఎలా కనుగొనవచ్చు?
వాస్తవానికి, ముఖ్యంగా ‘దేవునిచేత [‘యెహోవా,’ NW] బోధింపబడుటకే,’ అంటే ఆయనను గురించి ఆయన మార్గాలను గురించి ఉపదేశాన్ని పొందేందుకే మనం క్రైస్తవ కూటాలకు హాజరౌతాము. (యోహాను 6:45) అలాంటి ఉపదేశం ప్రోత్సాహాన్ని మరియు ఆదరణను ఇచ్చేదై ఉంటుంది. అపొస్తలుల కార్యములు 15:32నందు మనమిలా చదువుతాం: “యూదాయు సీలయుకూడ . . . పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.”
మీరు ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉండి క్రైస్తవ కూటాలకు వెళ్లి, ఇంటికి వచ్చేటప్పుడు మెరుగుగా భావించిన సందర్భం ఉందా? బహుశా ఒక ప్రసంగంలో, ఒక వ్యాఖ్యానంలో లేక ప్రార్థనలో చెప్పబడినది ఏదైనా మీ హృదయాన్ని స్పర్శించి, మీకు అవసరమైన ఆదరణను ప్రోత్సాహాన్ని అందజేసివుంటుంది. కాబట్టి క్రైస్తవ కూటాలకు హాజరవ్వకుండా ఉండకండి.—హెబ్రీయులు 10:24, 25.
పరిచర్యలో మరియు ఇతర సందర్భాల్లో మన సహోదరసహోదరీలతో సహవసించడం కూడా అలాంటి ప్రభావాన్నే కలిగివుండగలదు. “దగ్గరగా కట్టిపెట్టు” అనే అర్థాన్నిచ్చే అనేక హెబ్రీ క్రియాపదాలు “బలము” లేక “బలపరచు” అని కూడా సూచించబడ్డాయి—వస్తువులను దగ్గరగా కట్టిపెట్టినప్పుడు బలంగా ఉంటాయనే భావాన్ని ఇది కలిగివుంది. ఈ సూత్రం సంఘంలో కూడా వాస్తవమే. మనం సహవసించడం ద్వారా ఆదరణను పొందుతాం, ప్రోత్సహింపబడతాం అవును, బలపర్చబడతాం. బంధాలన్నిటిలోకెల్లా బలమైనదగు ప్రేమబంధం ద్వారా మనం దగ్గరగా కట్టబడతాం.—కొలొస్సయులు 3:14.
కొన్నిసార్లు మన ఆత్మీయ సహోదరసహోదరీల యథార్థత మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 థెస్సలొనీకయులు 3:7, 8) కొన్నిసార్లు వారు చూపే ప్రేమ కూడా అయ్యిండవచ్చు. (ఫిలేమోను 7) మరి కొన్నిసార్లు దేవుని రాజ్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు భుజములు కలిపి, ప్రక్కప్రక్కన పని చేయడమే ఎంతో ప్రోత్సహించగలదు. పరిచర్యలో నేను బలహీనంగా ఉన్నాను, నాకు ప్రోత్సాహం అవసరమని మీరు భావిస్తే, పెద్ద వయస్సుగల లేక ఎక్కువ అనుభవంగల రాజ్య ప్రచారకులతో కలిసి పని చేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేసుకోకూడదు? అలా చేయడంలో మీరు ఎక్కువ ఆదరణను పొందగలరు.—ప్రసంగి 4:9-12; ఫిలిప్పీయులు 1:27.
‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా
మన ఆరాధనలోని ఆదరణకరమైన అంశాలను ఎవరు సంస్థీకరిస్తారు? “తగినవేళ” ఆత్మీయ ‘ఆహారము పెట్టుటకు,’ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ తను నియమించిన ఒక తరగతిని యేసు ఏర్పాటు చేశాడు. (మత్తయి 24:2545) సా.శ. మొదటి శతాబ్దంలో, ఆత్మాభిషేకం పొందిన క్రైస్తవుల ఈ సభ అప్పటికే పని చేస్తోంది. యెరూషలేములోని పెద్దల పరిపాలక సభ, ఉపదేశాలు మరియు నడిపింపులుగల ఉత్తరాలను సంఘాలకు పంపింది. ఏ ఫలితంతో? అలాంటి ఒక ఉత్తరాన్ని చదివి సంఘాలెలా ప్రతిస్పందించాయో బైబిలు ఈ విధంగా నమోదు చేసింది: “వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.”—అపొస్తలుల కార్యములు 15:23-31.
అదే విధంగా, ఈ అపాయకరమైన అంత్యదినాల్లో, యెహోవా ప్రజలకు గొప్ప ఆదరణను మరియు ప్రోత్సాహానిచ్చే ఆత్మీయ ఆహారాన్ని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు పంచిపెడ్తున్నాడు. మీరు ఆ ఆహారంలో భాగం పొందుతున్నారా? ప్రపంచమంతటా దాసుడు అందుబాటులో ఉంచే అచ్చువేయబడిన ప్రచురణల ద్వారా అది సులభంగా లభిస్తుంది. వాచ్‌టవర్ సొసైటీ ప్రచురించే కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు అలాగే పుస్తకాలు, బ్రోషూర్‌లు మరియు కరపత్రాలు అసంఖ్యాక పాఠకులకు ఆదరణనిచ్చాయి.
ఒక ప్రయాణకాపరి ఇలా వ్రాశాడు: “మన సహోదరసహోదరీలలో అనేకులు సరైనది చేయాలని ఇష్టపడతారు, అయితే నిరుత్సాహాలు, భయాలు మరియు తమకుతాము సహాయం చేసుకునేందుకు తాము అశక్తులమనే భావాలతో వారు తరచూ పోరాడుతుంటారు. తమ జీవితాలు మరియు భావోద్రేకాలపై మళ్లీ అదుపు కలిగివుండేందుకు మన పత్రికలలోని శీర్షికలు వారికి సహాయం చేస్తున్నాయి. పైపైని ప్రోత్సాహంకంటె ఇంకా ఎక్కువే అందించేందుకు కూడా ఈ శీర్షికలు పెద్దలకు తోడ్పడతాయి.”
నమ్మకమైన దాసుని తరగతినుండి వచ్చే సాహిత్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. పరిస్థితులు మరీ కష్టతరంగా ఉన్నప్పుడు ఆదరణ పొందేందుకు, సమయానుకూలమైన ఈ పత్రికలు, పుస్తకాలు మరియు ఇతర ప్రచురణలు మనకు సహాయం చేయగలవు. మరోవైపు, కృంగిపోయివున్న వారికి ప్రోత్సాహాన్ని అందించే పరిస్థితిలో మీరు ఉంటే, ఈ పత్రికల్లోని లేఖనాధార సమాచారాన్ని ఉపయోగించండి. తరచూ అనేక వారాలు లేక నెలల కష్టసాధ్యమైన పరిశోధన, పఠనం మరియు ప్రార్థన తర్వాత ఈ శీర్షికలు ఎంతో జాగ్రత్తతో వ్రాయబడతాయి. ఈ సలహాలు బైబిలు ఆధారితమైనవి, పరీక్షించబడినవి మరియు సత్యమైనవి. కృంగిపోయినట్లు భావిస్తున్న వారితోపాటు కలిసి, ఒకటి లేక రెండు సరైన శీర్షికలను చదవడం ఎంతో సహాయకరంగా ఉంటుందని కొందరు కనుగొన్నారు. ఇది ఎక్కువ ఆదరణను మరియు ప్రోత్సాహాన్ని ఇవ్వగలదు.
మీరు అమూల్యమైన రత్నాలను కనుగొంటే, వాటిని మీరే దాచుకుంటారా లేక ఉదారతతో ఆ సంపదలోని కొంతభాగాన్ని ఇతరులతో పంచుకుంటారా? సంఘంలోని మీ సహోదరసహోదరీలకు మీరు ఆదరణకు మరియు ప్రోత్సాహానికి మూలంగా ఉండడాన్ని మీ లక్ష్యంగా చేసుకోండి. మీరు కూలదోసే బదులు నిర్మిస్తే, విమర్శించే బదులు మెచ్చుకుంటే, ‘కత్తిపోటువంటి మాటలు పలికే’ బదులు ‘బోధింపబడిన వాని మాటలు’ మాట్లాడితే, మీరు ఇతరుల జీవితాల్లో వ్యత్యాసాన్ని తీసుకురాగలరు. (యెషయా 50:4, NW; సామెతలు 12:18) నిజమైన ఆదరణ మరియు ప్రోత్సాహానికి మూలముగా, వాస్తవానికి మీరే ఒక రత్నంగా దృష్టించబడగలరు!
[20వ పేజీలోని బాక్సు]
అవసరతలో ఉన్న వారికి ఆదరణ
కావలికోట లేక తేజరిల్లు! శీర్షికలు కొన్ని యెహోవాతో తమ వ్యక్తిగత సంబంధాన్ని ఎలా దృఢపర్చాయనే విషయాన్ని గురించి అనేకమంది ప్రజలు వ్యాఖ్యానించారు. “ఈ శీర్షికను చదివిన తర్వాత, తన యావత్ మహిమ ఘనతతో యెహోవా నా ప్రక్కనే ఉన్నట్లు నేను భావించాను. ఆయన ఒక నిజమైన వ్యక్తియని నేను భావించానని” ఒక మహిళ చెబుతోంది. మరో ఉత్తరం ఇలా చెబుతోంది: “యెహోవాను దృష్టించే విషయంలో మా హృదయాలు, మనస్సులు ఎంత అకస్మాత్తుగా మార్చబడ్డాయంటే, మేము ఇక ఆ మునుపటి వ్యక్తులం ఎంతమాత్రం కాము. ఎవరో మా కళ్లజోళ్లను శుభ్రంగా తుడిచినట్లు, ఇప్పుడు మేము అంతా స్పష్టంగా చూడగల్గుతున్నట్లు అనిపిస్తుంది.”
ప్రత్యేక సమస్యలను లేక సవాళ్లను ఎదుర్కొనడానికి, తద్వారా యెహోవా తమలో కలిగివున్న వ్యక్తిగత ఆసక్తిని గురించి నిశ్చయతను అందించడానికి ఈ పత్రికలు ఎలా సహాయం చేశాయో తెలియజేసేందుకు కొందరు వ్రాస్తారు. ఒక పాఠకురాలు ఈ విధంగా వ్రాసింది: “యెహోవా తన ప్రజలపట్ల ఎంత శ్రద్ధ కలిగివున్నాడో, వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మరోసారి తెలుసుకోవడానికి మాకు సహాయం చేసినందుకు మీకెంతో ధన్యవాదాలు.” తన బిడ్డను మరణమందు కోల్పోయిన ఒక జపాన్ స్త్రీ, ఆ అంశాన్ని గురించి ఉన్న తేజరిల్లు! శీర్షికలను గూర్చి ఇలా చెబుతుంది: “దేవుని కనికరం యొక్క లోతు ఆ పుటల్లో వెల్లివిరిసింది, అది చదివి నేను రాత్రింబవళ్లు ఏడ్చాను. నేనెంతో దుఃఖంగా ఉన్నప్పుడు లేక ఒంటరిగా భావించినప్పుడు చదివేందుకు నేను ఈ శీర్షికలను సులభంగా అందుకోగల స్థలంలో పెట్టుకున్నాను.” దుఃఖిస్తున్న మరో స్త్రీ ఇలా వ్రాసింది: “నా దుఃఖ సమయాలను తట్టుకోవడానికి నాకు అవసరమైన శక్తిని, కావలికోట, తేజరిల్లు! శీర్షికలు మరియు “మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే” అనే బ్రోషూరు అందజేశాయి.”
పరిశుద్ధ లేఖనాలే ఆదరణకు ప్రాథమిక మూలాలు. (రోమీయులు 15:4) కావలికోట బైబిలును దాని అధికారిక మూలముగా హత్తుకొంటుంది, దాని సహ పత్రికైన తేజరిల్లు! కూడా అలాగే చేస్తుంది. అందుచేతనే, ఈ పత్రికలు వాటి పాఠకులకు ఆదరణను మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చేవిగా నిరూపించబడ్డాయి.
[23వ పేజీలోని చిత్రం]
సమస్త ఆదరణకుకర్త అయిన దేవుడు ప్రార్థననాలకించు వాడు కూడా