యెహోవా గొఱ్ఱెలకు వాత్సల్యంతో కూడిన శ్రద్ధ అవసరం
“యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. . . . మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.”—కీర్తన 100:3.
1. యెహోవా తన సేవకుల్ని ఎలా ఆదరిస్తాడు?
యెహోవాయే గొప్ప కాపరి. మనం ఆయన సేవకులమైతే, ఆయన మనల్ని తన గొఱ్ఱెలుగా దృష్టించి, మనకు వాత్యల్యంతో కూడిన శ్రద్ధను ఇస్తాడు. మన పరలోకపు తండ్రి మనల్ని ఆదరిస్తాడు, విశ్రాంతినిస్తాడు మరియు మనల్ని “తన నామమునుబట్టి నీతిమార్గములలో” నడిపిస్తాడు. (కీర్తన 23:1-4) మంచి కాపరియైన యేసుక్రీస్తు, మనల్ని ఎంతో ప్రేమించినందున తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు.—యోహాను 10:7-15.
2. తాము ఏ స్థితిలో ఉన్నట్లు దేవుని ప్రజలు తెలుసుకున్నారు?
2 వాత్యల్యంతో కూడిన శ్రద్ధను పొందేవారంగా, కీర్తనల గ్రంథకర్తతోపాటు మనమూ ఇలా చెప్పగలం: “సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.” (కీర్తన 100:2, 3) అవును, మనం ఆనందంగానూ సురక్షితంగానూ ఉన్నాం. అది పటిష్ఠమైన రాళ్ళతో కట్టిన గోడలు కల్గివున్న గొఱ్ఱెల దొడ్డిలో దుష్ట వినాశకారుల నుండి సురక్షితంగా ఉన్నట్లుగా మనం సురక్షితంగా ఉన్నాం.—సంఖ్యాకాండము 32:16; 1 సమూయేలు 24:3; జెఫన్యా 2:6.
ఇష్టపూర్వకంగా మందను కాచే కాపర్లు
3. నియమింపబడిన క్రైస్తవ పెద్దలు దేవుని మందను ఎలా ఆదరిస్తారు?
3 దేవుని గొఱ్ఱెలుగా మనం ఆనందభరితులమై ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు! మనలో నియమింపబడిన పెద్దలు నాయకత్వం వహిస్తారు. వారు మనల్ని పరిపాలించడానికి “ప్రభుత్వము” చేయరు లేక మన విశ్వాసంపై యజమానులుగా ఉండడానికి ప్రయత్నం చేయరు. (సంఖ్యాకాండము 16:13; మత్తయి 20:25-28; 2 కొరింథీయులు 1:24; హెబ్రీయులు 13:7) బదులుగా వారు, అపొస్తలుడైన పేతురు యొక్క ఈ సలహాను అన్వయించుకొనే ప్రేమగల కాపర్లు: “బలిమిచేతకాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీమధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి.” (1 పేతురు 5:2, 3) తోటి పెద్దలకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “దేవుడు తన [“స్వంత కుమారుని రక్తమిచ్చి,” NW] స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” పరిశుద్ధాత్మచే నియమింపబడిన ఈ పురుషులు ‘మందను వాత్సల్యంతో’ చూస్తున్నందుకు ఈ గొఱ్ఱెలు ఎంత కృతజ్ఞులై ఉంటారో కదా!—అపొస్తలుల కార్యములు 20:28-30.
4. చార్లెస్ టి. రస్సెల్, తనకు మందతోగల ఏ సంబంధాన్నిబట్టి పేరుగాంచాడు?
4 “పురుషుల్లో ఈవుల”గా అంటే కొంతమందిని, యెహోవా మందను వాత్సల్యభరితమైన రీతిలో ఆదరించే “పాస్టర్లు”గానూ లేక కాపర్లుగానూ యేసు సంఘానికి ఇచ్చాడు. (ఎఫెసీయులు 4:8, 11; కింగ్జేమ్స్ వర్షన్) ఈ పురుషుల్లో ఒకరు వాచ్‌టవర్ సొసైటీ యొక్క మొదటి అధ్యక్షుడైన చార్లెస్ టి. రస్సెల్. ముఖ్య కాపరియైన యేసుక్రీస్తు ఆధ్వర్యాన మందను కాయడంలోని తన ప్రేమపూర్వకమైన, కనికరంతో కూడిన కార్యకలాపాల్ని బట్టే ఆయన పాస్టర్ రస్సెల్గా పిలువబడ్డాడు. నేడు, యెహోవాసాక్షుల పరిపాలక సభచే క్రైస్తవ పెద్దలు నియమింపబడ్తున్నారు మరియు “పాస్టర్,” “పెద్ద” లేక “బోధకుడు” వంటి పదాలను బిరుదులుగా ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకొనబడ్తుంది. (మత్తయి 23:8-12) అయినా, ప్రస్తుత కాలంలోని పెద్దలు పాస్టరు పనిని లేక కాపరి పనిని, యెహోవా మేపు గొఱ్ఱెల ప్రయోజనార్థమై చేస్తారు.
5. క్రొత్తవారు, క్రైస్తవ సంఘంలోని నియమిత పెద్దలతో పరిచయాన్ని ఎందుకు ఏర్పర్చుకోవాలి?
5 కాపర్లుగా, పెద్దలు క్రొత్తవారి ఆత్మీయ పురోభివృద్ధిలో ఓ ప్రముఖమైన పాత్రను నిర్వహిస్తున్నారు. అందుకే, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే క్రొత్త పుస్తకం 168వ పేజీలో ఇలా చెబుతుంది: “సంఘంలోని నియమిత పెద్దలతో పరిచయం ఏర్పరచుకోండి. బైబిలునందు, అధ్యక్షులకుండాలని తెలుపబడిన అర్హతలకు వారు తగినట్లు ఉన్నారు గనుక దేవుని గూర్చిన జ్ఞానాన్ని అన్వయించుకోవడంలో వారికి ఎంతో అనుభవం ఉంది. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9) దేవుడు కోరే అర్హతలకు వ్యతిరేకమైన అలవాటును లేక లక్షణాన్ని అధిగమించడానికి మీకు ఆత్మీయ సహాయం అవసరమైతే, వారిలో ఒకరిని సమీపించేందుకు వెనుకాడకండి. పెద్దలు పౌలు యొక్క ఈ సలహాను అనుసరిస్తారని మీరు కనుగొంటారు: ‘ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.’—1 థెస్సలొనీకయులు 2:7, 8; 5:14.”
క్రొత్తవారు ప్రకటించాలని ఇష్టపడినప్పుడు
6. ఒక బైబిలు విద్యార్థి రాజ్యప్రచారకునిగా అవ్వాలని కోరుకుంటే ఏ విధానాన్ని అనుసరించాలి?
6 బైబిలు విద్యార్థి జ్ఞానాన్ని గైకొని, కొంతకాలంగా కూటాలకు హాజరైన తర్వాత సువార్త ప్రకటించే ఓ రాజ్య ప్రచారకునిగా అవ్వాలని ఆయన ఇష్టపడవచ్చు. (మార్కు 13:10) అలా ఇష్టపడిన్నట్లైతే, ఆయనతో బైబిలు పఠనం చేస్తున్న సాక్షి సంఘాధ్యక్షున్ని కలుసుకోవాలి, ఆయన బైబిలు విద్యార్థితోనూ ఆ బోధకునితోనూ సంఘ సేవా కమిటీ పెద్దలలో ఒకరు అలాగే మరో పెద్ద కలవడానికి ఏర్పాటు చేస్తాడు. ఈ చర్చ మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలోని 98 మరియు 99 పేజీలపై ఆధారపడి ఉంటుంది. ఆ క్రొత్త వ్యక్తి బైబిలు మూల బోధల్ని విశ్వసిస్తున్నాడని, దేవుని సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాడని ఈ ఇరువురు పెద్దలు గ్రహించినట్లైతే, బహిరంగ పరిచర్యలో భాగం వహించడానికి ఆయన అర్హుడనే విషయం ఆయనకు చెప్పబడ్తుంది.a ఆయన తన ప్రాంతీయ సేవా రిపోర్టును ఇవ్వడం ద్వారా తన పరిచర్యను రిపోర్టు చేసినప్పుడు, అది ఆయన పేరున వ్రాయబడిన సంఘ ప్రచారకుని రికార్డు కార్డులో ఎక్కించబడ్తుంది. ఆనందమయంగా ‘దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్న’ లక్షలాదిమంది ఇతరులతోపాటూ ఈ క్రొత్త వ్యక్తి ఇప్పుడు తన సాక్ష్యమిచ్చే కార్యక్రమాన్ని రిపోర్టు చేయవచ్చు. (అపొస్తలుల కార్యములు 13:5) ఆయనొక బాప్తిస్మం పొందని ప్రచారకుడనే ప్రకటన సంఘమందు చేయబడ్తుంది.
7, 8. బాప్తిస్మం పొందని ప్రచారకునికి పరిచర్యలో ఏయే రీతుల్లో అవసరమైన సహాయాన్ని ఇవ్వవచ్చు?
7 బాప్తిస్మం పొందని ప్రచారకునికి పెద్దలు మరియు పరిపక్వతకు ఎదిగిన ఇతర క్రైస్తవుల సహాయం అవసరమౌతుంది. ఉదాహరణకు, ఆయన ఆత్మీయ పురోభివృద్ధి ఆయన హాజరౌతున్న సంఘ పుస్తక పఠన నిర్వాహకునికి ఆసక్తికరమైన విషయమౌతుంది. క్రొత్త ప్రచారకునికి ఇంటింటి పరిచర్యలో ప్రతిభావంతంగా మాట్లాడడం అనేది కష్టతరమైన విషయంగా ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:20) కాబట్టి ఆయన సహాయాన్ని స్వీకరించడానికి విశేషంగా జ్ఞానము పుస్తకంలో నుండి తనతో బైబిలు పఠనాల్ని నిర్వహిస్తున్న వ్యక్తి నుండి సహాయాన్ని స్వీకరించడానికి ఇష్టపడవచ్చు. యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తం తన శిష్యుల్ని సిద్ధపర్చాడు గనుక అటువంటి అభ్యాససిద్ధమైన సహాయం తగినదే.—మార్కు 6:7-13; లూకా 10:1-22.
8 మన పరిచర్య ప్రతిభావంతమైనదిగా ఉండాలంటే ముందుగా బాగా సిద్ధపడడం అవసరం. కాబట్టి మొదట, మన రాజ్య పరిచర్య యొక్క నెలసరి సంచికల్లో ఇవ్వబడిన అందింపుల్ని అభ్యసించడానికి ఇరువురు ప్రచారకులు కూడుకొనవచ్చు. వారు తమ ప్రాంతీయ సేవను ప్రారంభించినప్పుడు, బాగా అనుభవమున్న వ్యక్తి మొదటి ఇంటిలోనో లేక మొదటి రెండు ఇళ్లలోనో మాట్లాడవచ్చు. స్నేహపూర్వకంగా పరిచయం చేసుకొన్న తర్వాత, సాక్ష్యమివ్వడంలో ప్రచారకులు ఇరువురూ భాగం వహించవచ్చు. కొన్ని వారాలు పరిచర్యలో కలిసి పనిచేయడం శ్రేష్ఠమైన పునర్దర్శనాలు చేయడానికి, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం నుండి ఓ గృహ బైబిలు పఠనం నిర్వహించడానికి కూడా నడిపించవచ్చు. బాగా అనుభవమున్న ప్రచారకుడు కొంత కాలం వరకూ పఠనాన్ని నిర్వహించి, తరువాత క్రొత్త రాజ్య ప్రచారకునికి దానిని అప్పగించవచ్చు. బైబిలు విద్యార్థి దేవుని గూర్చిన జ్ఞానం ఎడల ప్రశంసను కనుపరిస్తే, ఆ ఇరువురు ప్రచారకులూ ఎంత సంతోషిస్తారో కదా!
9. ఓ ప్రచారకుడు బాప్తిస్మం పొందాలని కోరుకున్నప్పుడు ఏ ఏర్పాట్లు చేయబడతాయి?
9 బాప్తిస్మం పొందని ప్రచారకుడు ఆత్మీయంగా పురోభివృద్ధి చెందుతుండగా, ఆయన ప్రార్థనలో దేవునికి సమర్పణ చేసుకొని, బాప్తిస్మం పొందాలని కోరుకొనవచ్చు. (మార్కు 1:9-11, పోల్చండి.) బాప్తిస్మం తీసుకోవాలనే తన కోరికను సంఘాధ్యక్షునికి ఆయన తెలియజేయాలి, సంఘాధ్యక్షుడు మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలోని 175 నుండి 218 వరకుగల పేజీల నందలి ప్రశ్నల్ని ప్రచారకునితో పునర్విమర్శ చేయడానికి పెద్దల్ని ఏర్పాటు చేస్తాడు. నాలుగు భాగాలుగా విభాగింపబడిన ప్రశ్నలు వీలైతే ముగ్గురు వేర్వేరు పెద్దలచే మూడు పర్యాయాల్లో పూర్తిచేయబడవచ్చు. బాప్తిస్మం పొందని ప్రచారకుడు బైబిలు బోధలపై సహేతుకమైన అవగాహనను కల్గివున్నాడని, ఇతరత్రా అర్హుడని వారు ఏకీభవిస్తే వారు ఆయనతో, మీరు బాప్తిస్మం పొందవచ్చని చెబుతారు. తన సమర్పణా బాప్తిస్మముల ఫలితంగా, ఆయన రక్షణ కొరకు ‘గుర్తు’ వేయబడిన వాడౌతాడు.—యెహెజ్కేలు 9:4-6.
ప్రత్యేక అవసరతల్ని చేరుకోవడం
10. ఒక వ్యక్తి జ్ఞానము పుస్తకం నుండి తన పఠనాన్ని పూర్తిచేసి, బాప్తిస్మం పొందిన తరువాత ఆయన తన లేఖన జ్ఞానాన్ని ఎలా వృద్ధిపర్చుకుంటాడు?
10 జ్ఞానము పుస్తకం నుండి ఒక వ్యక్తి తన బైబిలు పఠనాన్ని పూర్తి చేసి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట వంటి రెండవ పుస్తకంలో నుండి ఆయనతో నియత పఠనాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు.b ఇటీవలే బాప్తిస్మం పొందిన వ్యక్తి తాను క్రైస్తవ కూటాలకు సిద్ధపడ్తుండగానూ వాటికి క్రమంగా హాజరౌతుండగానూ ఎక్కువ నేర్చుకుంటాడు. సత్యం ఎడల గల తన దప్పిక వ్యక్తిగతంగా క్రైస్తవ ప్రచురణల్ని చదవడానికి, అధ్యయనం చేయడానికి, తోటి విశ్వాసులతో లేఖనాధార విషయాల్ని చర్చించడానికి తనను ప్రేరేపిస్తుండగా ఆయన అదనపు జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటాడు. అయితే ప్రత్యేకమైన అవసరతలు తలెత్తితే అప్పుడేమి చెయ్యాలి?
11. (ఎ) అపొల్లోకు ప్రిస్కిల్ల అకుల ఎలా సహాయపడ్డారు? (బి) వివాహం చేసుకోవాలని తలస్తున్న ఇటీవలెనే బాప్తిస్మం పొందిన యౌవనునికి ఏ సహాయాన్ని ఇవ్వవచ్చు?
11 “లేఖనములయందు ప్రవీణుడు,” యేసును గూర్చిన సంగతులు వివరంగా బోధింపబడినవాడూ అయిన అపొల్లో కూడా ప్రిస్కిల్ల అకుల అనే అనుభవనీయులైన క్రైస్తవులు “అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద”పర్చినప్పుడు ప్రయోజనాన్ని పొందాడు. (అపొస్తలుల కార్యములు 18:24-26; అపొస్తలుల కార్యములు 19:1-7 పోల్చండి.) గనుక, ఇటీవలెనే బాప్తిస్మం పొందిన యౌవనుడు బహుశా కోర్టుషిప్ని గూర్చి (జతకట్టాలని) మరియు వివాహం చేసుకోవడాన్ని గూర్చి తలంచవచ్చు. బాగా అనుభవంగల క్రైస్తవుడు వాచ్‌టవర్ ప్రచురణల్లోని ఈ అంశాలపై ఉన్న సమాచారాన్ని కనుగొనడానికి ఆయనకు సహాయపడవచ్చు. ఉదాహరణకు, యౌవనస్థులు అడుగు ప్రశ్నలు—అభ్యాసపూర్వకమైన జవాబులు అనే పుస్తకంలోని సెక్షన్ 7లో ఈ విషయాలకు సంబంధించిన సహాయకరమైన సమాచారం ఉంది.c ఆయనతో బైబిలు పఠనాన్ని నిర్వహించిన ప్రచారకుడు ఈ సమాచారాన్ని ఆ క్రొత్త వ్యక్తితో చర్చించవచ్చు, అయినా ఓ క్రమమైన పఠనం చేరివుండదు.
12. సమస్యల్ని కల్గివున్న క్రొత్తగా బాప్తిస్మం పొందిన వివాహ దంపతులకు ఏ సహాయాన్ని ఇవ్వవచ్చు?
12 మరో ఉదాహరణను పరిశీలించండి. బహుశా క్రొత్తగా బాప్తిస్మం పొందిన వివాహ జతలు, దైవిక సూత్రాల్ని అన్వయించుకోవడంలో సమస్యల్ని కల్గి ఉన్నారనుకోండి. వారు ఓ పెద్దను సంప్రదిస్తే, ఆయన వారితో లేఖనాల్ని చర్చించడానికి, వారి అవధానాన్ని వాచ్‌టవర్ ప్రచురణల్లో ఉన్న సమాచారం వైపుకి మళ్లించడానికి కొన్ని సాయంకాల వేళల్ని వెచ్చించగల్గుతాడు. అయితే, ఆ పెద్ద ఆ దంపతులతో ఓ క్రమమైన బైబిలు పఠనాన్ని పునఃస్థాపించబోడు.
క్రొత్తవ్యక్తి తప్పుచేస్తే
13. తప్పుచేసినా పశ్చాత్తాపపడిన క్రొత్తగా బాప్తిస్మం పొందినవాని ఎడల సంఘ పెద్దలు ఎందుకు దయ చూపించాలి?
13 పెద్దలు, గొప్ప కాపరియైన యెహోవాను అనుకరిస్తారు. ఆయన ఇలా చెబుతున్నాడు: “నేనే నా గొఱ్ఱెలను మే[పెదను]. . . . గాయపడినదానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును.” (యెహెజ్కేలు 34:15, 16; ఎఫెసీయులు 5:1) ఆ స్ఫూర్తికి అనుగుణంగానే, శిష్యుడైన యూదా సందేహాలున్న లేక పాపంలో పడిపోయిన అభిషిక్త క్రైస్తవులకు దయను చూపించాలని ఉద్బోధించాడు. (యూదా 22, 23) అనుభవం కలిగిన క్రైస్తవుల నుండి సరియైన రీతిగానే మనం ఎంతో ఎదురు చూస్తాము, గనుక తప్పు చేసినా పశ్చాత్తాపపడిన—గొఱ్ఱెలాంటి—క్రొత్తగా బాప్తిస్మం పొందిన వ్యక్తికి తప్పకుండా దయను చూపించాలి. (లూకా 12:48; 15:1-7) కాబట్టి, ‘యెహోవా నియమం ప్రకారం తీర్పుతీర్చు’ పెద్దలు, అటువంటి గొఱ్ఱెలకు వాత్సల్యపూరితమైన శ్రద్ధను ఇచ్చి, సాత్వికమైన మనస్సుతో వారిని సరిదిద్దాలి.—2 దినవృత్తాంతములు 19:6; అపొస్తలుల కార్యములు 20:28, 29; గలతీయులు 6:1.d
14. ఇటీవలే బాప్తిస్మం పొందిన ప్రచారకుడు గంభీరమైన పాపం చేస్తే ఏమి చెయ్యాలి, ఆయన ఎలా సహాయాన్ని పొందగలడు?
14 ఆ తర్వాత, ఇటీవలే బాప్తిస్మం పొందిన ఒక ప్రచారకుడు బహుశా మునుపే త్రాగుడు సమస్యను కల్గివుండి, ఒకటి రెండు సందర్భాల్లో మితిమీరి త్రాగాడని అనుకుందాం. లేక చాలా కాలం నుండి ఉన్న పొగాకు అలవాటును మానివేసినా, ఒకటి రెండు సార్లు రహస్యంగా ధూమపానం చేసే శోధనకు లొంగిపొయ్యాడని అనుకుందాం. మన క్రొత్త సహోదరుడు క్షమాపణ కొరకు దేవున్ని ప్రార్థించినా కూడా, పాపం అలవాటుగాకుండా ఉండు నిమిత్తం ఆయన ఒక పెద్ద సహాయాన్ని తీసుకోవాలి. (కీర్తన 32:1-5; యాకోబు 5:14, 15) పెద్దల్లో ఒకరికి తన తప్పిదాన్ని గూర్చి ఆయన తెలియజేసినప్పుడు, ఆ పెద్దే సరిదిద్దడానికి ప్రయత్నించాలి. (కీర్తన 130:3) అటుతర్వాత తన పాదాలకు మార్గాల్ని సరాళం చేసుకోవడానికి ఆయనకు సహాయపడేందుకు లేఖనాధారిత సలహాలు సరిపోవచ్చు. (హెబ్రీయులు 12:12, 13) ఈ పెద్ద మరింకే సహాయం ఇవ్వాల్సి ఉంటుందో నిశ్చయించేందుకు సంఘాధ్యక్షునితో ఆ పరిస్థితుల్ని గురించి చర్చిస్తాడు.
15. కొన్ని కేసుల్లో, ఇటీవలే బాప్తిస్మం పొందిన వ్యక్తి పాపం చేసినప్పుడు ఏది అవసరమై ఉండవచ్చు?
15 కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువే అవసరంకావచ్చు. గుర్తింపదగిన అపాయం మందకు ఉన్నట్లైతే లేక ఇతర గంభీరమైన సమస్యలువుంటే, పెద్దలసభ విషయాన్ని పరిశోధించడాన్కి ఇద్దరు పెద్దల్ని నియమిస్తుంది. ఆ విషయం న్యాయనిర్ణయ కమిటీ అవసరమయ్యేంత గంభీరమైనదిగా ఈ పెద్దలు కనుగొంటే, దానిని గురించి పెద్దలసభకు వారు నివేదించాలి. తర్వాత తప్పిదస్థునికి సహాయపడేందుకు పెద్దలసభ న్యాయనిర్ణయ కమిటీని నియమిస్తుంది. న్యాయనిర్ణయ సభ అతనిలో దయాపూర్వకమైన రీతిలో వ్యవహరించాలి. లేఖనాలతో అతన్ని సరిదిద్దడాన్కి వారు ప్రయత్నించాలి. న్యాయనిర్ణయ కమిటీ యొక్క దయగల ప్రయత్నాలకు అతను ప్రతిస్పందిస్తే అప్పుడు వారు రాజ్యమందిరంలో జరిగే కూటాల్లో వేదికపై నిర్వహింపబడే భాగాలయందు అతన్ని ఉపయోగించనందువల్ల లేక కూటాల్లో వ్యాఖ్యానించడాన్కి అతన్ని అనుమతించినందువల్ల ఏ ప్రయోజనమైనా ఉంటుందా అనేది వారు నిర్ణయించవచ్చు.
16. తప్పిదస్థునికి సహాయం చేయడాన్కి పెద్దలు ఏమి చేయగలరు?
16 ఒకవేళ తప్పిదస్థుడు ప్రతిస్పందిస్తే, న్యాయ నిర్ణయకమిటీలోని ఒక పెద్ద లేక ఇద్దరు పెద్దలు ఆయన విశ్వాసాన్ని బలపర్చే మరియు దేవుని నీతియుక్త ప్రమాణాల ఎడల ఆయన మెప్పును పెంపొందింపజేసే ఉద్దేశంతో వారు కాపరి దర్శనాన్ని చేయవచ్చు. తరచుగా వారిలో ప్రతి ఒక్కరూ ఆయనతో ప్రాంతీయ పరిచర్యలో పని చేయగలరు. బహుశా కావలికోట, తేజరిల్లు!లలోని సముచితమైన శీర్షికల్ని ఉపయోగిస్తూ వారు ఆయనతో కొన్ని లేఖనాధారిత చర్చలు చేయవచ్చు, అయితే ఓ క్రమమైన బైబిలు పఠనాన్ని ఏర్పాటు చేయరాదు. అటువంటి వాత్సల్యంతోకూడిన శ్రద్ధ మూలంగా తప్పిదస్థుడు రాబోయే దినాల్లో శరీర బలహీనతల్ని ఎదిరించడాన్కి బలపర్చబడతాడు.
17. బాప్తిస్మం పొందిన తప్పిదస్థుడు పశ్చాత్తాపపడక, తన పాపభరితమైన పనిని విడనాడకపోతే ఏ చర్యలు తీసుకోవాలి?
17 ఇటీవలే బాప్తిస్మం పొందడం, పశ్చాత్తాపపడకుండా పాపం చేయడానికి సాకేమీ కాదనుకోండి. (హెబ్రీయులు 10:26, 27; యూదా 4) బాప్తిస్మం పొందిన తప్పిదస్థుడెవరైనా పశ్చాత్తాపపడక తన పాపభరితమైన పనిని విడనాడకపోతే, అతడు సంఘం నుండి బహిష్కరింపబడతాడు. (1 కొరింథీయులు 5:6, 11-13; 2 థెస్సలొనీకయులు 2:11, 12; 2 యోహాను 9-11) ఈ చర్య అవసరమన్పిస్తే, పెద్దల సభ న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. బహిష్కరణ జరిగినట్లైతే, ఈ క్లుప్తమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది: “. . . బహిష్కరించబడ్డాడు.”e
“పరిపక్వతకు ఎదగడానికి” వారికి సహాయపడండి
18. క్రొత్తగా బాప్తిస్మం పొందిన క్రైస్తవులూ మరితరులు యెహోవాను గూర్చి ఆయన చిత్తాన్ని గూర్చి నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఎంతో ఉంటుందని, మనం ఎందుకు నిశ్చయత కల్గివుండగలం?
18 దేవుని సేవకుల్లోని అధిక సంఖ్యాకులు మందలోనే ఉంటారు. సంతోషదాయకంగా, మన పరలోకపు తండ్రిని గూర్చి ఆయన చిత్తాన్ని గూర్చి మనం ఎల్లప్పుడూ ఎంతో తెలుసుకొంటూ ఉండగలం గనుక మనలో ప్రతి ఒక్కరూ ఆయనకు మరింత సన్నిహితంకాగల్గుతాం. (ప్రసంగి 3:11; యాకోబు 4:8) సా.శ. 33లో పెంతెకొస్తునందు బాప్తిస్మం పొందిన వేలాదిమందీ తప్పకుండా తెలుసుకోవాల్సింది ఎంతోవుంది. (అపొస్తలుల కార్యములు 2:5, 37-41; 4:4) లేఖనాధారిత పరిజ్ఞానంలేని అన్యుల విషయమూ అంతే. ఉదాహరణకు, ఏథెన్సులోని అరేయొపగు కొండపై పౌలు ప్రసంగించిన తరువాత బాప్తిస్మం పొందిన వారి విషయంలోనూ ఇది వాస్తవమే. (అపొస్తలుల కార్యములు 17:33, 34) నేడు కూడా క్రొత్తగా బాప్తిస్మం పొందినవారు తెల్సుకోవాల్సింది ఎంతో ఉంది మరియు దేవుని దృష్టికి సరియైన దానిని చేస్తుండాలనే తమ దృఢ సంకల్పాన్ని బలపర్చుకోవడానికి సమయమూ సహాయమూ అవసరం.—గలతీయులు 6:9; 2 థెస్సలొనీకయులు 3:13.
19. బాప్తిస్మం పొందుతున్న వారు “పరిపక్వతకు ఎదగడానికి” ఎలా సహాయాన్ని పొందగల్గుతున్నారు?
19 ప్రతి సంవత్సరం వేలాదిమంది బాప్తిస్మం పొందుతున్నారు, వారు “పరిపక్వతకు ఎదగడానికి” సహాయం అవసరం. (హెబ్రీయులు 6:1-3, NW) మాట ద్వారాను, మాదిరి ద్వారాను మరియు పరిచర్యలో అభ్యాససిద్ధమైన సహాయం చేయడం ద్వారానూ నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి, “సత్యమును అనుసరించి నడుచు”కోవడానికి మీరు కొందరికి సహాయం చేయగల్గుతారు. (3 యోహాను 4; కొలొస్సయులు 3:9, 10) మీరు అనుభవంగల ప్రచారకులైతే, క్రొత్త తోటి విశ్వాసికి ప్రాంతీయ సేవలో సహాయం చేయడానికి లేక దేవునియందలి ఆయన విశ్వాసాన్ని, క్రైస్తవ కూటాల ఎడలగల ఆయన ప్రశంసను పటిష్ఠం చేసుకోవడానికి మరియు అలాంటి వాటిని గూర్చిన ఆయా లేఖనాధారిత అంశాల్ని ఆయనతో కొన్నివారాలు చర్చించడానికి పెద్దలు మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. మందతో కాపరులకున్న సంబంధం, ఉపదేశించడం విషయంలో తండ్రివంటిది, గారవించడం విషయంలో తల్లివంటిది. (1 థెస్సలొనీకయులు 2:7, 8, 11) అయితే, కొద్దిమంది పెద్దలు, పరిచారకులు సంఘానికి అవసరమైన ప్రతి దానిని చూడలేక పోవచ్చు. మనం అందరమూ పరస్పరం సహకరించుకొనే కుటుంబ సభ్యులవంటి వారం. మన తోటి ఆరాధకులకు మద్దతునివ్వడానికి మనలో ప్రతి ఒక్కరమూ ఎంతో కొంత చెయ్యగలం. మీరూ ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు. క్రుంగిన వారిని ఓదార్చవచ్చు, బలహీనులకు మద్దతును ఇవ్వవచ్చు.—1 థెస్సలొనీకయులు 5:14, 15.
20. దేవుని గూర్చిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి, యెహోవా మేపు గొఱ్ఱెలకు వాత్యల్యంతో కూడిన శ్రద్ధను ఇవ్వడానికి మీరేమి చేయగలరు?
20 దేవుని గూర్చిన జ్ఞానము మానవజాతికి అవసరం, దానిని వ్యాపింపచేయడంలో యెహోవాసాక్షిగా మీరూ ఆనందమయంగా భాగం వహించగలరు. యెహోవా గొఱ్ఱెలకు వాత్యల్యంతో కూడిన శ్రద్ధ అవసరం, దీనిని అందించడానికి సహాయపడడంలో ఓ ప్రేమపూర్వకమైన పాత్రను మీరు నిర్వహించగలరు. మీ పరిచర్యను యెహోవా ఆశీర్వదించి, తాను మేపు గొఱ్ఱెలకు సహాయం చేసేందుకు మీరు చేస్తున్న హృదయపూర్వకమైన ప్రయత్నాల్ని బట్టి ఆయన మీకు ప్రతిఫలం ఇచ్చును గాక.
[అధస్సూచీలు]
a ఈ స్థితిలో, క్రొత్తవ్యక్తి మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తక ప్రతిని పొందవచ్చు.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించబడింది.
c వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారిచే ప్రచురించబడింది.
d బాప్తిస్మం పొందని ప్రచారకుల కొరకైన అటువంటి ఏర్పాటు నవంబరు 15, 1988 కావలికోటనందు (ఆంగ్లం) 15-20 పేజీల్లో “దేవుని ఆరాధించేందుకు ఇతరులకు సహాయపడుట” అనే శీర్షికలో సంక్షిప్తంగా వ్రాయబడింది.
e బహిష్కరించడానికి నిర్ణయింపబడి, అప్పీలు చేయబడినట్లైతే, తుది ఫలితం తేలేంతవరకూ ప్రకటనను నిలుపు చేయాలి. మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలోని 147-8 పేజీలను చూడండి.
మీరెలా జవాబిస్తారు?
◻ యెహోవా తన గొఱ్ఱెల్ని ఎలా ఆదరిస్తాడు?
◻ క్రొత్తవారు ప్రకటించాలని కోరుకున్నప్పుడు ఏమి చెయ్యబడుతుంది?
◻ ప్రత్యేక అవసరతల్ని కల్గివున్న క్రొత్తవారికి తోటి విశ్వాసులు ఎలా సహాయపడగలరు?
◻ తప్పు చేసినా పశ్చాత్తాపపడిన వారికి పెద్దలు ఏ సహాయాన్ని ఇవ్వగలరు?
◻ క్రొత్తగా బాప్తిస్మం పొందిన వ్యక్తి “పరిపక్వతకు ఎదుగడానికి” మీరెలా సహాయపడవచ్చు?
[16వ పేజీలోని చిత్రం]
చార్లెస్ టి. రస్సెల్ మంద యొక్క ప్రేమపూర్వకమైన కాపరిగా పేరుగాంచాడు
[18వ పేజీలోని చిత్రం]
కనికరంగల కాపర్లు దేవుని మందను వాత్సల్యంతో ఆదరిస్తారు