కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 ఏప్రిల్‌ పేజీలు 20-25
  • ఓదార్పు ఇచ్చే మన దేవుడి నుండి నేర్చుకుందాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓదార్పు ఇచ్చే మన దేవుడి నుండి నేర్చుకుందాం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిల్లో ఓదార్పు అనే పదానికి అర్థం
  • మనం ఇతరుల్ని ఎలా ఓదార్చవచ్చు?
  • మనకు ఓదార్పు అవసరం అయినప్పుడు ఏం చేయాలి?
  • బెతెల్‌ సేవ చేస్తున్నవాళ్లను ఓదార్చడానికి ఒక ఏర్పాటు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మనం అస్సలు ఒంటరివాళ్లం కాదు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పును ఇవ్వడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 ఏప్రిల్‌ పేజీలు 20-25

జూన్‌ 22-28, 2026

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

ఓదార్పు ఇచ్చే మన దేవుడి నుండి నేర్చుకుందాం

“దేవుని నుండి మనం పొందే ఓదార్పుతో . . . మనం ఓదార్చగలుగుతాం.”—2 కొరిం. 1:4.

ముఖ్యాంశం

యెహోవా ఎలా ఓదారుస్తాడో, ఆయన ఆదర్శాన్ని పాటిస్తూ కొంతమంది ఇతరుల్ని ఎలా ఓదార్చారో చూస్తాం. దానివల్ల మనం ఇతరుల్ని ఎలా ఓదార్చవచ్చో తెలుసుకుంటాం.

1. మనం వేరేవాళ్లను ఎందుకు ఓదార్చాలి?

ఈ రోజుల్లో మనం “రకరకాల కష్టాల వల్ల దుఃఖపడాల్సి” వస్తుంది. అందుకే మనందరికీ ఓదార్పు అవసరం. (1 పేతు. 1:6) బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఓదారిస్తే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది! కాబట్టి వేరేవాళ్లు బాధలో ఉన్నారని తెలిస్తే, మనం కూడా ఓదార్చడానికి ముందుండాలి. (మత్త. 7:12) ఓదార్చే విషయంలో యెహోవాయే మనకు ఆదర్శం. ఎందుకంటే, ఆయన “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు.” ఆయన ఇచ్చే ఓదార్పుతో మనం కూడా కష్టాల్లో ఉన్నవాళ్లను ఓదార్చగలుగుతాం. (2 కొరిం. 1:3, 4; 1 థెస్స. 4:18) ఏదో చేయాలి కదా అన్నట్టు కాదుగానీ, బ్రదర్స్‌సిస్టర్స్‌ మీదున్న ప్రేమతోనే మనం ఓదారుస్తాం. (1) ఇంతకీ బైబిల్లో ఓదార్పు అనే పదానికి అర్థం ఏంటి? (2) మనం వేరేవాళ్లను ఎలా ఓదార్చవచ్చు? (3) మనకు ఓదార్పు అవసరం అయినప్పుడు ఏం చేయాలి? వీటిగురించి ఇప్పుడు చూద్దాం.

బైబిల్లో ఓదార్పు అనే పదానికి అర్థం

2. “ఓదార్పు” అనే పదానికి ఏ అర్థాలు ఉన్నాయి?

2 బైబిల్లో “ఓదార్పు” అని అనువదించబడిన గ్రీకు పదానికి సందర్భాన్ని బట్టి రకరకాల అర్థాలు ఉన్నాయి. దానికి “ప్రోత్సహించడం,” “ఉపదేశించడం,” “వేడుకోవడం” అనే అర్థాలు ఉన్నాయి. (రోమా. 12:8) కానీ ఆ గ్రీకు పదాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే “బాధలో ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండడం లేదా తోడుగా నిలబడడం” అనే అర్థం వస్తుంది. దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇలా ఊహించుకోండి: అవసరంలో ఉన్న తన స్నేహితుని దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లాడు, అతనికి సహాయం చేస్తూ పక్కనే తోడుగా నిలబడ్డాడు. ఓదార్పు ఇవ్వడం అంటే అదే! ఒక వ్యక్తిని చాలా రకాలుగా ఓదార్చవచ్చు. అయితే, ఎలా ఓదార్చినా గానీ చివరికి బాధలో ఉన్న వ్యక్తి ఊరట పొందాలి, బలం పొందాలి.

3. బర్నబా ఓదార్పుకు మారుపేరు అని ఎందుకు చెప్పవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

3 ఓదార్పుకు మారుపేరైన ఒక క్రైస్తవుడి గురించి ఆలోచించండి. ఆయన పేరు యోసేపు. వేరేవాళ్లను ప్రోత్సహించడానికి, ఓదార్చడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవాడు. అందుకే అపొస్తలులు ఆయనకు బర్నబా అనే పేరు పెట్టారు. దానికి “ఓదార్పు పుత్రుడు” అని అర్థం. (అపొ. 4:36) ఆ పేరు ఆయనకు సరిగ్గా సరిపోతుంది. అందుకే, బైబిల్లో ఆ తర్వాతి నుండి ఆయన పేరు యోసేపు అని కాకుండా బర్నబా అనే కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో బర్నబా తన మాటల్లో, పనుల్లో తన పేరుకు తగ్గట్టు జీవించాడు. ఒక ఉదాహరణ చూడండి. క్రైస్తవుడిగా మారిన సౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు క్రైస్తవుల్ని కలవాలనుకున్నాడు. కానీ సౌలు ఇదివరకు క్రైస్తవుల్ని హింసించాడు కాబట్టి, అక్కడున్న సహోదర సహోదరీలు ఆయన్ని కలవడానికి భయపడ్డారు. కానీ బర్నబా మాత్రం భయపడకుండా ఆయన మీద దయ చూపించాడు. సౌలును అపొస్తలుల దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశాడు.—అపొ. 9:26-28.

బర్నబా దయతో సౌలును అపొస్తలుల్లో ఒకరి ఇంటికి తీసుకొస్తున్నాడు. సౌలు వస్తుంటే, ఆ ఇంట్లో ఉన్న కొంతమంది అపొస్తలులు ఆయన్ని అనుమానంగా చూస్తున్నారు.

బర్నబా తన పేరుకు తగ్గట్టు జీవించాడు (3వ పేరా చూడండి)


మనం ఇతరుల్ని ఎలా ఓదార్చవచ్చు?

4. ఇతరుల్ని ఓదార్చడానికి మనం ఏం చేయాలి? (రోమీయులు 1:11, 12)

4 వీలైతే వాళ్లను కలవండి. కొన్నిసార్లు యెహోవా ఎవరినైనా ఓదార్చడానికి తన సేవకుల్ని ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకు, ఒకసారి ఏలీయా ప్రవక్త బాధలో కూరుకుపోయాడు. అప్పుడు ఆయన్ని ప్రోత్సహించడానికి యెహోవా తన దేవదూతను పంపించాడు. (1 రాజు. 19:4-7) అపొస్తలుడైన పౌలు కూడా సహోదరుల్ని నేరుగా కలిసి ప్రోత్సహించడానికే ఇష్టపడేవాడు. ఎందుకంటే, అలా కలవడం వల్ల ఒకరినొకరు ప్రోత్సహించుకోగలుగుతారు. (రోమీయులు 1:11, 12 చదవండి.) ఒకవేళ మీరు ఎవరినైనా ఓదార్చడానికి వెళ్తుంటే వాళ్లతో కాస్త సమయం గడపడానికి ప్రయత్నించండి, అక్కడి నుండి వెంటనే వచ్చేయకండి. (1 కొరిం. 16:7) ఒకవేళ మీరు నేరుగా కలవలేకపోతుంటే వేరే విధాలుగా కూడా ఓదార్చవచ్చు. అంటే మీరు వాళ్లకు ఫోన్‌ చేయవచ్చు, ఉత్తరం లేదా కార్డు రాయవచ్చు, లేదా ఒక మెసేజ్‌ పెట్టవచ్చు. వాళ్లను ఓదార్చడానికి యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాడు. మరి మీరు ఆయనకు అవకాశం ఇస్తారా?

5. మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఓదార్చడం కొన్నిసార్లు ఎందుకు సవాలుగా ఉండవచ్చు?

5 చివరి రోజుల్లో మన జీవితం రోజురోజుకీ కష్టంగా మారిపోతుంది. దానివల్ల మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని నేరుగా కలిసి ఓదార్చడం, ఒక సవాలు అనే చెప్పవచ్చు. అలాంటప్పుడు మనం ఒనేసిఫోరులా ఉండాలి. రోములో బందీగా ఉన్న పౌలును ఆయన ఓదార్చాలనుకున్నాడు. అందుకే ఆయన ఎఫెసు నుండి రోముకు వచ్చి పౌలు కోసం వెతికాడు. నిజం చెప్పాలంటే, దానివల్ల ఆయన్ని జైల్లో పెట్టవచ్చు లేదా చంపేయవచ్చు. అది తెలిసి కూడా పౌలును కలవడానికి ఆయన వెనకాడలేదు. (2 తిమో. 1:16-18) రష్యాలో ఉన్న మన బ్రదర్స్‌సిస్టర్స్‌ కూడా అలాగే చేశారు. విశ్వాసం కారణంగా జైల్లో వేయబడిన వాళ్లను విచారణ చేస్తున్నప్పుడు, మన బ్రదర్స్‌సిస్టర్స్‌ వాళ్ల కోసం కోర్టుకు వెళ్లేవాళ్లు. అలా వాళ్లకు తోడుగా ఉన్నాం అని చూపించేవాళ్లు. అలా వెళ్తే వాళ్లను కూడా జైల్లో వేయవచ్చని తెలిసినా, వాళ్లు వెనకడుగు వేయలేదు. బైబిలు కాలంలో, మనకాలంలో చాలామంది అలా ఇతరులకు ఓదార్పును ఇచ్చారు. ఆ అనుభవాలు తెలుసుకోండి. ఎన్ని సవాళ్లు ఉన్నా వాళ్లు ఒకరికొకరు ఎలా తోడుగా ఉన్నారో, హింసలు వచ్చినా సంతోషాన్ని ఎలా కాపాడుకున్నారో ఆలోచించండి. అలా చేస్తే కష్టాల్లో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఓదార్చడానికి మీరు సిద్ధంగా ఉంటారు.

6. ఓదార్పును ఇవ్వడంలో మనం యెహోవాలా ఎలా ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

6 వాళ్లు చెప్పేదంతా వినండి. ఏలీయా ప్రవక్త తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు యెహోవాకు తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆయన చెప్పేదంతా యెహోవాకు ముందే తెలుసు, అయినా ఏలీయా చెప్పే ప్రతీ మాటను ప్రేమతో విన్నాడు. అంతేకాదు ఏలీయా చెప్పిందే మళ్లీమళ్లీ చెప్పాడు. అప్పుడు కూడా యెహోవా ఓపిగ్గా విన్నాడు! (1 రాజు. 19:9, 10, 14) హబక్కూకు ప్రవక్త కూడా తన చుట్టూ చెడుతనం పెరిగిపోయినప్పుడు, తను ఎంతలా విసిగిపోయాడో యెహోవాకు చెప్పుకున్నాడు. హబక్కూకు మాటల్ని చూస్తే యెహోవా మీద గౌరవం లేనట్టు, ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా యెహోవా ఓపిగ్గా విన్నాడు. (హబ. 1:2, 3) ఇప్పుడు కూడా యెహోవా మన ప్రార్థనల్ని వింటున్నాడు. మనం ఏం చెప్పబోతున్నామో తెలిసినా ఆయన ఓపిక చూపిస్తున్నాడు. యెహోవాలాగే మనం కూడా మన బ్రదర్స్‌సిస్టర్స్‌ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, గౌరవం చూపించాలి, వినడానికి త్వరపడాలి. వాళ్లు ఏదైనా చెప్తున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్లు దురుసుగా మాట్లాడినా, మనం దాన్ని మనసులోకి తీసుకోకూడదు. వాళ్లు చెప్పిందే చెప్తున్నా ఓపిగ్గా వినాలి.—యాకో. 1:19; ప్రసం. 7:9.

బాధలో ఉన్న సిస్టర్‌ రాత్రి పొద్దుపోయే దాకా మాట్లాడుతుంటే, ఒక సిస్టర్‌ ఓపిగ్గా వింటోంది.

మీ బ్రదర్స్‌సిస్టర్స్‌ మాట్లాడుతున్నప్పుడు, యెహోవాలా శ్రద్ధగా వినండి (6వ పేరా చూడండి)


7. బాధలో ఉన్నవాళ్లను ఎలా ఓదారిస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి మీరు ఏం చేయవచ్చు?

7 వాళ్లకు ఏం అవసరమో ఆలోచించండి. మనకు యెహోవాలా హృదయాల్ని చదివే సామర్థ్యం లేదు. కాబట్టి అవతలి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని మీరు వాళ్ల పరిస్థితిలో ఊహించుకుంటే, వాళ్లకు ఏం అవసరమో మీకు కొంతవరకు అర్థమౌతుంది. దాన్నిబట్టి వాళ్లను ఎలా ఓదారిస్తే బాగుంటుందో మీకు తెలుసని అనుకోకండి. అందరూ ఒకేలా ఉండరు. కాబట్టి సమయం తీసుకుని జాగ్రత్తగా మీ స్నేహితుడు చెప్పేది వినండి. వాళ్ల మనసు తెలుసుకోవడానికి నేర్పుగా కొన్ని ప్రశ్నలు అడగండి.—సామె. 20:5.

8. లాజరు చనిపోయినప్పుడు మార్తను, మరియను యేసు ఎలా ఓదార్చాడు? (చిత్రాలు కూడా చూడండి.)

8 లాజరు చనిపోయినప్పుడు మార్తను, మరియను యేసు ఎలా ఓదార్చాడో గమనించండి. ఇద్దరూ ఒకేలాంటి బాధను అనుభవిస్తున్నారు. కానీ యేసు వాళ్లను వేర్వేరు విధాలుగా ఓదార్చాడు. మార్త తనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు, యేసు ఆమెతో పునరుత్థానానికి సంబంధించిన సత్యాల్ని చెప్పాడు. దానిమీద విశ్వాసం ఉంచేలా సహాయం చేశాడు. కానీ మరియ తన దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు, యేసు ఆమెతో పునరుత్థానం గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. దానికి బదులు ఆమెతో కలిసి ఏడ్చాడు, లాజరును ఎక్కడ పెట్టారో అడిగాడు. (యోహా. 11:20-35) మనం ఏం నేర్చుకోవచ్చు? అందరి అవసరాలు ఒకేలా ఉండవు. కాబట్టి మనం ఒకే పద్ధతిలో అందర్నీ ఓదార్చలేం, ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్లను ఓదార్చాలి.

చిత్రాలు: ఇద్దరు బ్రదర్స్‌ వాళ్ల భార్యల్ని కోల్పోయారని వాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ కలుస్తున్న ఒక సంఘపెద్ద. 1. ఆ సంఘపెద్ద, ఏడుస్తున్న బ్రదర్‌ భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తున్నాడు. 2. ఆ సంఘపెద్ద ఒక పెద్దవయసు బ్రదర్‌తో కలిసి ఫోటో ఆల్బమ్‌ చూస్తూ, ఒక లేఖనం చూపిస్తున్నాడు.

ఎవరినైనా ఓదారుస్తున్నప్పుడు, వాళ్లకు ఏం అవసరమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి (8వ పేరా చూడండి)a


9. ఓదార్చడానికి బైబిల్ని ఎలా ఉపయోగించవచ్చు? (రోమీయులు 15:4, 5)

9 బైబిల్ని ఉపయోగించండి. ఊరటను ఇచ్చే లేఖనాలు చూపించినప్పుడు, బాధగా ఉన్నవాళ్లలో ఆశను నింపుతాం. (రోమీయులు 15:4, 5 చదవండి.) ఆ ఆశే, యెహోవా వాళ్లకు అండగా ఉన్నాడు అనే నమ్మకాన్ని వాళ్లలో పెంచుతుంది. దానివల్ల వాళ్లకు ఇంకాస్త ఓదార్పుగా అనిపిస్తుంది. (యెష. 40:31) మరి వేరేవాళ్లను ప్రోత్సహించడానికి కావాల్సిన లేఖనాలు మీకు ఎక్కడ దొరుకుతాయి? మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే పుస్తకంలో, “ఊరట” అనే అంశం కింద మీకు కొన్ని లేఖనాలు దొరుకుతాయి. ఇతరులకు ఓదార్పునిచ్చే లేఖనాలు మీకు ఎప్పుడైనా కనిపిస్తే వాటిని ఒకచోట రాసిపెట్టుకోండి. వేరేవాళ్లను ఓదార్చడానికి బైబిల్ని చక్కగా ఉపయోగించేలా మీకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. ఆయన పవిత్రశక్తి మీకు సరైన సమయంలో, సరైన లేఖనాల్ని గుర్తుచేస్తుంది.—యోహా. 14:26.

10. ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మనం ఎందుకు దయగా మాట్లాడాలి?

10 దయగా మాట్లాడండి. మనం ఇంతకుముందు చూసినట్టు, “ఓదార్పు” అనే పదానికి “ఉపదేశించడం” లేదా “వేడుకోవడం” అనే అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు తమ ఆలోచనా తీరులో మార్పులు చేసుకోమని మనం వాళ్లకు చెప్పాల్సి రావచ్చు. ఒకవేళ మీకు అలా చెప్పే పరిస్థితి వస్తే, మాట్లాడే ముందు క్షణమాగి ఆలోచించండి. మన మాటలు గాయాల్ని మాన్పేలా ఉండాలే గానీ, కొత్త గాయాలు చేసేలా ఉండకూడదు. (సామె. 12:18) ఈ విషయంలో యెహోవాయే మనకు మంచి ఆదర్శం. ఏలీయా ఉదాహరణ ఆలోచించండి. ప్రవక్తగా తన పనిని సరిగ్గా చేయలేదని, యెహోవాను ఆరాధించే వాళ్లలో ఇప్పుడు తను ఒక్కడే మిగిలాడని ఏలీయా అనుకున్నాడు. అప్పుడు యెహోవా దయగా ఏలీయా ఆలోచనల్ని సరిచేశాడు, అంతేగానీ ఆయన తప్పుల్ని ఎత్తి చూపలేదు. (1 రాజు. 19:15-18) మీరు యెహోవాలా ఉండాలంటే మాట్లాడే ముందు కాస్త ఆగి ఆలోచించండి, దయగా మాట్లాడండి. అంతేకాదు మీటింగ్స్‌లో మీరు నియామకాలు చేస్తున్నప్పుడు, కామెంట్లు చెప్తున్నప్పుడు అవి బ్రదర్స్‌సిస్టర్స్‌ని ప్రోత్సహించే విధంగా ఉండేలా చూసుకోండి.

11. బాధలో ఉన్నవాళ్లను ఇంకా ఎలా ఓదార్చవచ్చు? (1 యోహాను 3:18)

11 చేతల్లో కూడా ఓదార్పును ఇవ్వండి. కొన్నిసార్లు బాధలో ఉన్నవాళ్లకు మన మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఓదార్పును ఇవ్వాలి. (1 యోహాను 3:18 చదవండి.) బర్నబా ఉదాహరణే తీసుకోండి. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులకు సహాయం చేయడానికి ఆయన తన దగ్గరున్న కొంత భూమిని అమ్మి, ఆ డబ్బును విరాళంగా ఇచ్చాడు. (అపొ. 4:36, 37) బర్నబాలాగే ఇప్పుడు కూడా కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్‌ అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేస్తున్నారు. పోలండ్‌లో ఉన్న గాబ్రియేలా అనే సిస్టర్‌ అనుభవం చూడండి. వరదల వల్ల ఆమె ఇల్లు చాలావరకు పాడైపోయింది. ఆమె ఇలా అంటుంది: “నేను, మా అమ్మానాన్న భయపడిపోయాం, చాలా కంగారుపడ్డాం. దీన్ని అసలు ఎలా తట్టుకోవాలి అనుకున్నాను. కానీ దగ్గర్లో ఉన్న సంఘాల్లోని బ్రదర్స్‌సిస్టర్స్‌ మా ఇంటికి వచ్చి ఒక్కరోజులోనే చాలా పని పూర్తిచేశారు. అది చూసి బాధలో ఉన్నవాళ్లను ఓదార్చడానికి యెహోవా తన ప్రజల్ని ఉపయోగిస్తాడు అనే నమ్మకం ఇంకా బలపడింది.”

12. మనం కష్టాలు సహించడం చూసి బ్రదర్స్‌సిస్టర్స్‌ ఎలా ప్రోత్సాహం పొందుతారు?

12 మీకు వచ్చే కష్టాల్ని సహించండి. థెస్సలొనీకలోని క్రైస్తవులు హింసలు వచ్చినా యెహోవాకు నమ్మకంగా ఉన్నారు. దాని గురించి విన్నప్పుడు పౌలుకు ఎంతో ఊరటగా అనిపించింది, ఆయనకు కొత్త బలం వచ్చింది. ఆయన వాళ్ల కోసం పడిన కష్టం వృథా కాలేదు. (1 థెస్స. 3:5-8) పౌలు కూడా యెహోవాకు నమ్మకంగా ఉంటూ ప్రతీ కష్టాన్ని సహించాడు. ఎందుకంటే, ఆయన్ని చూసి చాలామంది సహోదర సహోదరీలు ప్రోత్సహించబడతారని ఆయనకు తెలుసు. (కొలొ. 2:1, 2) అదేవిధంగా కష్టాల్ని తట్టుకునేలా యెహోవా మనకు సహాయం చేయడాన్ని చూసి, మన బ్రదర్స్‌సిస్టర్స్‌ కూడా ప్రోత్సాహం పొందుతారు. యెహోవా మనకు సహాయం చేశాడంటే, కష్టాలు వచ్చినప్పుడు వాళ్లకు కూడా సహాయం చేస్తాడనే నమ్మకం వాళ్లలో పెరుగుతుంది.

13. ఇతరుల్ని ప్రోత్సహించడానికి మనం ఏం చేస్తూ ఉండాలి?

13 ఓపిగ్గా ఉండండి. బాధలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ని మనం ఒక్కసారి ఓదార్చినంత మాత్రాన, వాళ్లు వెంటనే బాధ నుండి బయటపడకపోవచ్చు. అందుకే బైబిలు “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ” ఉండండి అని చెప్తుంది. ఇక్కడ “ప్రోత్సహించుకుంటూ” అనే మాటను బట్టి అది ఒక్కసారి చేసేది కాదుగానీ, పదేపదే చేయాల్సిన పని అని తెలుస్తుంది. (1 థెస్స. 5:11) అలా చేయాలంటే మనకు చాలా ఓపిక కావాలి. (1 థెస్స. 5:14) నిజమే, మనం ఇతరుల్ని ప్రోత్సహించడమే కాదు, కొన్నిసార్లు మనకు కూడా ప్రోత్సాహం అవసరం. మరి అప్పుడు ఏం చేయాలి?

మనకు ఓదార్పు అవసరం అయినప్పుడు ఏం చేయాలి?

14-15. బాధలో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు మీరు ఏం చేయవచ్చు?

14 యెహోవాకు ప్రార్థించండి. మీరు బాధలో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఓదార్పును ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి. (కీర్త. 94:19) అలా ప్రార్థిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో, ఎందుకు అలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పుకోండి. (కీర్త. 62:8) నిజమే, మనం చెప్పకముందే మన మనసులో ఉన్నదంతా ఆయనకు తెలుసు. కానీ మన హృదయాల్ని ఆయన ముందు కుమ్మరించడం వల్ల, మనకు ఆయన మీద ఎంత విశ్వాసం ఉందో చూపిస్తాం. యెహోవా మనం అనుకున్న విధానంలో జవాబు ఇవ్వకపోవచ్చు గానీ, ఏదో విధంగా జవాబు అయితే ఇస్తాడు. (మార్కు 11:24) అందుకే ఫిలిప్పీయులు 4:6, 7 ఇలా చెప్తుంది: ‘మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.’

15 ఇతరుల సహాయం తీసుకోండి. మీరు బాగా నమ్మే ఒక ఫ్రెండ్‌కో లేదా సంఘపెద్దకో మీ ఫీలింగ్స్‌ చెప్పండి. మీ బ్రదర్స్‌సిస్టర్స్‌ మీకు ఓదార్పు ఇవ్వగలరు, కావాల్సిన సహాయం చేయగలరు. కానీ వాళ్లు అలా చేయాలంటే, ముందు వాళ్లకు మీ పరిస్థితి గురించి తెలియాలి. మీరు చెప్పకపోతే వాళ్లకు మీ పరిస్థితి తెలీకపోవచ్చు. (సామె. 14:10) కాబట్టి మీ బాధ వినమని, ఓదార్పునిచ్చే లేఖనం గానీ ఆర్టికల్‌ గానీ చూపించమని మీరు వాళ్లను అడగవచ్చు.

16. బ్రదర్స్‌సిస్టర్స్‌ మిమ్మల్ని ఓదార్చేటప్పుడు కొన్నిసార్లు ఏం జరగవచ్చు? కానీ మీరు ఏం గుర్తుంచుకోవాలి?

16 ఓర్పు చూపించండి, క్షమించండి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన బ్రదర్స్‌సిస్టర్స్‌ కొన్నిసార్లు పొరపాట్లు చేయవచ్చు. వాళ్ల మాటల వల్లో, పనుల వల్లో మీకు పుండు మీద కారం చల్లినట్టు అనిపించవచ్చు. ఒకవేళ అలా జరిగితే ఓర్పు చూపించండి. (1 కొరిం. 13:4, 7) ఎందుకంటే, యాకోబు 3:2 ఇలా చెప్తుంది: “ఎవరైనా మాట్లాడే విషయంలో పొరపాటు చేయకపోతే అతను పరిపూర్ణుడు.” బైబిలు ఈ మాట కూడా చెప్తుంది: “మనసు సిద్ధమే కానీ శరీరమే బలహీనం.” (మత్త. 26:41) కాబట్టి మీ బ్రదర్స్‌సిస్టర్స్‌ మీకు సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చారని ఎప్పుడూ గుర్తుంచుకోండి.

17. మనం దేనికి సిద్ధంగా ఉండాలి?

17 మనందరికీ ఓదార్పు, ప్రోత్సాహం అవసరం. రోజులు గడిచే కొద్దీ ఆ అవసరం పెరుగుతుందే గానీ తగ్గదు. ఎందుకంటే మనం చివరి రోజుల్లో జీవిస్తున్నాం. దేవుని శత్రువులు కూడా మనల్ని వ్యతిరేకించడానికి ఇంకా గట్టిగా ప్రయత్నిస్తారు. కాబట్టి ఒకరినొకరం ఓదార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉందాం.

మీరెలా జవాబిస్తారు?

  • బైబిల్లో “ఓదార్పు” అనే పదానికి అర్థమేంటి?

  • మనం ఇతరుల్ని ఓదార్చడానికి ఏం చేయాలి?

  • మనకు ఓదార్పు అవసరం అయినప్పుడు ఏం చేయాలి?

పాట 130 క్షమిస్తూ ఉండండి

a చిత్రాల వివరణ: ఈమధ్యే భార్యను పోగొట్టుకున్న బ్రదర్‌ తన బాధ చెప్తుంటే, ఒక సంఘపెద్ద సానుభూతితో వింటున్నాడు. తర్వాత ఆ సంఘపెద్ద, చాలాకాలం క్రితం భార్యను పోగొట్టుకున్న బ్రదర్‌ని కలిశాడు. ఆమెతో ఉన్న తీపి జ్ఞాపకాల్ని వాళ్లు తలుచుకుంటున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి