వారు యెహోవా చిత్తాన్ని చేశారు
మోషే మరియు అహరోను—దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించిన వారు
ఈ దృశ్యాన్ని ఊహించుకోండి: ఎనభై సంవత్సరాల మోషే మరియు ఆయన అన్న అహరోను, భూమిపైనున్న అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎదుట, అంటే ఐగుప్తు ఫరో ఎదుట నిలిచివున్నారు. ఐగుప్తీయులకు ఈ వ్యక్తి దేవుని ప్రతినిధికంటే ఎక్కువే. అతనే ఒక దేవుడని వారు విశ్వసిస్తారు. గ్రద్ద తలగల దైవమైన హోరస్ యొక్క సాక్షాత్కారంగా ఇతను దృష్టించబడుతున్నాడు. ఇసిస్ మరియు ఓసిరిస్లతోపాటు హోరస్ ఐగుప్తు దేవుళ్లు దేవతల్లో ప్రముఖ త్రిత్వంగా ఉన్నాడు.
ఫరో కిరీటం మధ్యలోనుండి ముందుకు వస్తున్న త్రాచు తల యొక్క అపశకునకరమైన బొమ్మ, అతన్ని సమీపించే ఎవరి అవధానాన్నైనా పొందకుండా ఉండదు. అది ఫరో శత్రువులపై అగ్నిని వినాశనాన్ని చిమ్ముతుందని నమ్మబడుతోంది. బానిసలైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాకు పండుగను జరుపుకునేందుకు వారిని పంపమనే అపూర్వమైన విన్నపంతో, ఇప్పుడు మోషే అహరోనులు ఈ దైవ-రాజు ఎదుటికే వచ్చారు.—నిర్గమకాండము 5:1.
ఫరో హృదయం కఠినమౌతుందని యెహోవా ఇదివరకే తెలియజేశాడు. కాబట్టి, ‘నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను’ అని అతను ధిక్కారపూర్వకంగా జవాబిచ్చినప్పుడు మోషే అహరోనులు ఆశ్చర్యపోలేదు. (నిర్గమకాండము 4:21; 5:2) అలా, ఒక నాటకీయ పోరాటానికి రంగం సిద్ధమైంది. తర్వాతి సమావేశంలో, తాము సర్వశక్తిమంతుడైన సత్యదేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్నామనే విషయానికి మోషే అహరోనులు ఫరోకు ఆశ్చర్యకరమైన సాక్ష్యాధారాన్ని అందించారు.
ఓ అద్భుతం జరుగుతుంది
యెహోవా ద్వారా ఉపదేశింపబడినట్లే, ఐగుప్తు దేవుళ్లపై యెహోవా ఆధిపత్యాన్ని నిరూపించే అద్భుతాన్ని అహరోను చేశాడు. ఆయన తన చేతికర్రను ఫరో ఎదుట క్రిందపడేశాడు, అది వెంటనే పెద్ద పామయ్యింది! ఈ అద్భుతంచేత కల్లోలితుడై, ఫరో తన శకునగాండ్రను సమావేశపర్చాడు.a దయ్యాల శక్తుల సహాయంతో, ఈ మనుష్యులు తమ స్వంత కర్రలతో అలాంటిదే చేయగల్గారు.
ఫరో మరియు అతని యాజకులు అహంభావంగా భావించివుంటే, అది కేవలం క్షణికమే. అహరోను పాము, వారి పాములన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున మ్రింగేసినప్పుడు వాళ్ల ముఖాలెలా మారివుంటాయో ఊహించుకోండి! సత్యదేవుడైన యెహోవాకు ఐగుప్తు దేవతలు ఎంతమాత్రం సాటిరావని అక్కడున్న వారందరూ చూడగల్గారు.—నిర్గమకాండము 7:8-13.
అయితే, ఇది జరిగిన తర్వాత కూడా, ఫరో హృదయం కఠినంగానే ఉండిపోయింది. దేవుడు ఐగుప్తుపై నాశనకరమైన పది తెగుళ్లను తెచ్చిన తర్వాతనే, “మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి” అని ఫరో తుదకు మోషే అహరోనులతో చెప్పాడు.—నిర్గమకాండము 12:31.
మన కొరకు పాఠాలు
ఐగుప్తు యొక్క శక్తివంతుడైన ఫరోను సమీపించేందుకు, మోషే అహరోనులకు ఏది తోడ్పడింది? మొదట్లో, నేను “నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని” చెబుతూ, మోషే తన సామర్థ్యంపై అపనమ్మకాన్ని వ్యక్తం చేశాడు. యెహోవా మద్దతును గూర్చిన నిశ్చయత ఇవ్వబడిన తర్వాత కూడా, “నీవు పంపతలంచిన వానినే పంపు”మని ఆయన వేడుకున్నాడు. వేరే మాటల్లో చెప్పాలంటే, దేవుడు మరెవరినైనా పంపాలని మోషే విన్నపం చేశాడు. (నిర్గమకాండము 4:10, 13) ఏది ఏమైనప్పటికీ, తన నియామకాన్ని నెరవేర్చడానికి అవసరమైన జ్ఞానాన్ని శక్తిని ఆయనకిస్తూ, దీనుడైన మోషేను యెహోవా ఉపయోగించుకున్నాడు.—సంఖ్యాకాండము 12:3.
నేడు, యెహోవా దేవుని మరియు యేసుక్రీస్తు సేవకులు, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి,” అనే ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. (మత్తయి 28:19, 20) ఈ నియామకాన్ని నెరవేర్చడంలో మన భాగాన్ని చేసేందుకు, లేఖన జ్ఞానాన్ని మరియు మనం కలిగివున్న మరే ఇతర సామర్థ్యాలనైనా మనం శ్రేష్ఠంగా ఉపయోగించుకోవాలి. (1 తిమోతి 4:13-16) మన బలహీనతలపై అవధానాన్ని నిలిపే బదులు, దేవుడు మనకు ఇచ్చిన ఏ నియామకాన్నైనా నమ్మకంతో అంగీకరిద్దాం. తన చిత్తాన్ని చేసేందుకు ఆయన మనల్ని యోగ్యులను చేసి, బలపర్చగలడు.—2 కొరింథీయులు 3:5, 6; ఫిలిప్పీయులు 4:13.
మోషే మానవ మరియు దయ్యాల వ్యతిరేకతకు విరుద్ధంగా ఉన్నాడు గనుక, ఆయనకు సహజాతీత సహాయం తప్పకుండా అవసరం. తత్ఫలితంగా, “ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని” అని అంటూ యెహోవా ఆయనకు అభయమిచ్చాడు. (నిర్గమకాండము 7:1) అవును, మోషేకు దైవిక మద్దతు మరియు అధికారంవున్నాయి. తనపై యెహోవా ఆత్మను కలిగివున్నవాడై మోషే ఫరోకు లేక ఆ అహంకారియైన పరిపాలకుని యోధులకు భయపడేందుకు ఎలాంటి కారణం లేదు.
మనం కూడా మన పరిచర్యను చేసేందుకు యెహోవా పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తిపై ఆధారపడాలి. (యోహాను 14:26; 15:26, 27) “నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?” అని పాడిన దావీదు మాటలను, దైవిక మద్దతుతో మనం కూడా ప్రతిధ్వనించగలం.—కీర్తన 56:11.
తన కనికరము వలన యెహోవా మోషేను ఆయన నియామకంలో ఒంటరిగా విడిచిపెట్టలేదు. బదులుగా, దేవుడిలా చెప్పాడు: “నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. . . . నీ అన్నయైన అహరోను అతనితో [ఫరోతో] చెప్పును.” (నిర్గమకాండము 7:1, 2) మోషే సహేతుకంగా చేయగలదాని పరిధుల్లోనే పనిచేయడానికి, యెహోవా ఎంత ప్రేమగలవాడో కదా!
మహోన్నతుడైన యెహోవా యొక్క సాక్షులుగా ఉండటంలోని సవాళ్లను అంగీకరిస్తున్న తోటి క్రైస్తవుల సహవాసాన్ని దేవుడు మనకు అందజేస్తున్నాడు. (1 పేతురు 5:9) కాబట్టి, మనం ఎదుర్కొనే అవాంతరాలు ఎన్ని ఉన్నప్పటికీ, దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించిన మోషే అహరోనులవలె మనం ఉందాము.
[అధస్సూచీలు]
a “శకునగాండ్రు” అని అనువదింపబడిన హెబ్రీ పదం, దయ్యాలకంటే అధికమైన సహజాతీత శక్తులను కలిగివున్నామని చెప్పుకునే మంత్రజ్ఞుల గుంపును సూచిస్తుంది. ఈ మనుష్యులు దయ్యాలను తమకు విధేయులవ్వమని ప్రేరేపించగలరని, ఈ మంత్రజ్ఞులపై దయ్యాలకు ఎటువంటి శక్తీ లేదని విశ్వసించబడేది.
[25వ పేజీలోని చిత్రం]
మోషే అహరోనులు ధైర్యంగా ఫరో ఎదుట యెహోవాకు ప్రాతినిధ్యం వహించారు