వంద సంవత్సరాల వయస్సు అయినప్పటికీ జీవం ఉట్టిపడుతోంది
రాల్ఫ్ మిట్చెల్ చెప్పినది
ఒక మోస్తరు ఎత్తున్న మా నాన్న, మెథడిస్టు ప్రచారకునిగా ఉండేవాడు. ఆయన ప్రతి రెండు లేక మూడు సంవత్సరాలకు, ఎక్కువగా చిన్న పట్టణాలలోని ఒక చర్చి నుండి మరో చర్చికి మారుతుండేవాడు, అమెరికాలోని ఉత్తర కారొలినా నందలి ఆషెవిల్లేకి కూడా అలాగే వెళ్లాడు, అక్కడే నేను 1895 ఫిబ్రవరిలో జన్మించాను. కాబట్టి క్రైస్తవమత సామ్రాజ్యంతో బాగా పరిచయం కలిగే నేను పెరిగాను.
చిన్నపిల్లవానిగా నన్ను, ఉజ్జీవ కూటాలలో, పరిశుద్ధాత్మతో నింపబడడానికి—దాన్ని వారు “మతాన్ని పొందడానికి” అని పిలుస్తారు—“దుఃఖించేవారి బల్ల” యొద్దకు తీసుకువెళ్లడం నాకు జ్ఞాపకముంది. నేను నా పాపాలను ఒప్పుకొని, పది ఆజ్ఞలు పాటించి, మంచిగా ఉండాలని నాకు చెప్పబడింది. అలాగైతే నేను చనిపోయినప్పుడు పరలోకానికి వెళతాను. నాకు నేను ఇలా అనుకున్నాను, ‘నేను పరలోకానికి వెళ్లేంత మంచిగా ఉండలేను గనుక బహుశా నేను నరకానికి వెళతానేమో.’ పెద్దవాళ్లు—ప్రాముఖ్యంగా ప్రచారకులు—మాత్రమే బైబిలు కట్టడలకనుసారంగా జీవిస్తున్నారని నేను తలంచాను.
కాని నేను యౌవనారంభంలో ఉండగానే, మతంలో వేషధారణ ఉన్నట్లుగా నేను కనుగొనడం మొదలుపెట్టాను. ఉదాహరణకు, బిషప్పుతో జరిగే సమావేశంలో, బిషప్పు నిధికి పెద్ద మొత్తం డబ్బును విరాళంగా ఇచ్చేందుకు మా నాన్న తన కుటుంబ వస్తుదాయక అవసరతలను త్యాగం చేసేవాడు. పెద్ద చర్చిలో తనకు నియామకం దొరకడానికి ఇది దోహదపడుతుందని ఆయన అపేక్షించేవాడు. పత్తి రైతు అయిన మరో స్థానిక ప్రచారకుని గురించి నాకు గుర్తుంది. ప్రముఖ స్థానం పొందాలని అతనికి కోరికగా ఉండేది, కాబట్టి అతడు ఒక వంద పత్తి బేళ్లను అమ్మి చేతినిండా డబ్బు ఉంచుకుని ఆ సమావేశానికి వెళ్లాడు. ప్రేక్షకులు అంటే వారిలో ఎక్కువమంది ప్రచారకులే, వారి దగ్గరి నుండి రావలసిన డబ్బంతా వచ్చేసిందని అనిపించిన తర్వాత, ఈ పత్తి రైతు గంతు వేసి ఇలా అరిచాడు: “మీ బిషప్పుకు మీరు ఇచ్చేదంతా ఇదేనా? మీరు ఐదు డాలర్లు విరాళంగా ఇస్తే, నేను పది డాలర్లు ఇస్తాను!” వెయ్యి కంటే ఎక్కువ డాలర్లు సేకరించబడ్డాయి, బిషప్పు ఈ వ్యక్తిని మా నాన్నపైన పర్యవేక్షకునిగా నియమించాడు. అలాంటి నియామకం దేవుని నుండి వచ్చినదని నేను నమ్మలేకపోయాను. అప్పటి నుండి, మతానికి సంబంధించినంత వరకు దేనినైనా నేను అనుమానించేవాడిని.
అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో నిమగ్నమైనప్పుడు నేను బలవంతంగా సైన్యంలో చేర్చుకోబడ్డాను. సైనిక గురువులు సైనికులమైన మాకు మన దేశం కొరకు యథార్థంగా పోరాడమని ప్రకటించడం నాకు బాగా గుర్తుంది, మతం ఎడల నాకుగల విముఖతను ఇది ఇంకా ఎక్కువ చేసిందంతే. బ్రతికి ఉండి, నా విద్యాభ్యాసం ముగించి, ఆ తర్వాత వివాహం చేసుకోవాలన్నవే నా లక్ష్యాలు. భవిష్యత్తు కొరకైన నా పథకాలలో మతానికి ఏమాత్రం స్థానంలేదు.
దృక్పథంలో మార్పు
1922లో నేను లెవెజ్ అనే యౌవనస్థురాలిని ప్రేమించాను. ఆమె కాథోలిక్ భక్తిపరురాలని తేలింది, మేము వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, కాథోలిక్ సాంప్రదాయానుసారంగా చేసుకోవాలని ఆమె ఇష్టపడింది. నాకు మాత్రం ఏవిధమైన మతసంబంధ వేడుకా ఇష్టంలేదు, కాబట్టి మేము న్యూయార్క్ నగరంలోని పురపాలక భవనంలో వివాహం చేసుకోవడానికి ఆమె అంగీకరించింది.
మొదట్లో మాకు మతపరమైన వివాదాలుండేవి కావు. నాకు మతమందు విశ్వాసం లేదని, దాని ప్రసక్తి లేనంతవరకు మనం సాఫీగా కాలం గడపవచ్చని నేను ఆమెకు స్పష్టంగా తెలియజేశాను. ఆ తర్వాత, 1924 మరియు 1937 మధ్య సంవత్సరాల్లో, పిల్లలు కలిగారు—ఒకరి తర్వాత ఒకరు, మాకు ఐదుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు కలిగారు! మా పిల్లలు కాథోలిక్ పాఠశాలకు వెళ్లాలని లెవెజ్ ఇష్టపడింది. వాళ్లకు ఏవిధమైన మతసంబంధ శిక్షణా ఇవ్వకూడదని నేననుకున్నాను, కాబట్టి మేము దాని గురించి వాదించుకున్నాము.
మతం గురించిన నా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసినదొకటి 1939 తొలిభాగంలో జరిగింది. హెన్రీ వెబ్బర్ మరియు హారి పియట్ అనే ఇద్దరు యెహోవాసాక్షులు న్యూ జెర్సీ నందలి రోసెల్లోని మా ఇంటికి వచ్చారు. నాకెంతమాత్రం చర్చించాలన్న ఆసక్తి లేని అంశం, అంటే మతం గురించి మాట్లాడాలని వాళ్లనుకుంటున్నారని వెంటనే స్పష్టమయ్యింది. ‘మీరు నరహత్య చేయకూడదు’ అని మతస్థులు చెబితే, ‘మీ దేశం కోసం పోరాడండి’ అని సైనిక గురువు చెప్పడమనే వాస్తవం వల్ల నా విశ్వాసం మరింత తగ్గిపోయింది. ఎంతటి వేషధారణ! నేను ఈ ఇద్దరు సాక్షులను సరి చేయాలనుకున్నాను. నేను వారితో ఇలా అన్నాను, “మీకొక విషయం చెప్పనివ్వండి. మీ మతం సరైనదైతే, ఇతరులందరిదీ తప్పే. ఇతర వాటిలో ఒక్కటి సరైనదైనా, మీ మతంతో సహా మిగతావన్నీ తప్పైనవే. కేవలం ఒక్క సత్యమైన మతమే ఉండగలదు.” నేను ఆశ్చర్యపోయేలా, వాళ్లు నాతో ఏకీభవించారు!
ఆ తర్వాత, వాళ్లు నన్ను నా బైబిలు తెచ్చుకోమని, 1 కొరింథీయులు 1:10 తెరవమని చెప్పారు. అక్కడ నేనిలా చదివాను: “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.” ఈ లేఖనంతో నాకు ఆసక్తి పెరిగింది. అదే సమయంలో, ఈ ఇద్దరు వ్యక్తులూ నన్ను ఏదో మతశాఖలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారేమోనని నేను భయపడ్డాను. అయినా, క్రైస్తవుల మధ్య విభేదాలు ఉండకూడదన్న విషయం నేను తెలుసుకున్నాను. నా మనస్సులో ఎన్నో ఇతర ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు, మరణమందు ప్రాణానికి ఏమి సంభవిస్తుంది? వారితో ఆ ప్రశ్న చర్చించడానికి నేనెంత ఇష్టపడ్డానో! కాని, అది ఇంట్లో మరీ ఎక్కువ మతపరమైన వివాదాన్ని రేపుతుందేమోననుకున్నాను.
ఆ తర్వాత, ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “మేము మళ్లీ తర్వాతి వారం వచ్చి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాము.” వాళ్లను యుక్తిగా పంపించి వేయాలని నేను ప్రయత్నించాను, కాని నా భార్య గట్టిగా మాట్లాడింది. ఆమె ఇలా అంది: “రాల్ఫ్, వాళ్లు మళ్లీ ఎప్పుడు రావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారు.” ఆమె నిష్ఠగల కాథోలిక్ గనుక, ఇది నన్ను ఆశ్చర్యపర్చింది! అయినా నేను, ‘మతం అనే అంశంపై బహుశా మేము కొన్ని అంగీకారమైన విషయాలను కనుగొంటామేమో’ అనుకున్నాను. కాబట్టి తర్వాతి శుక్రవారం హెన్రీ వెబ్బర్ మరియు హారి పియట్ రావడానికి నేను అంగీకరించాను.
అలా యెహోవాసాక్షులతో నేను బైబిలు పఠించడం ప్రారంభించాను. ఇది జరిగిన తర్వాత కొంత కాలానికి, న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద సమావేశానికి హాజరు కావడానికి నేను ఆహ్వానింపబడ్డాను. 1939 జూన్ 25న జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన “ప్రభుత్వం మరియు శాంతి” అనే ప్రసంగం నేను స్పష్టంగా గుర్తుతెచ్చుకోగలను. అక్కడ హాజరైన 18,000 మందిలో నేను ఒకణ్ణి. వాస్తవానికి, రేడియో ఫోన్ లైన్లను ఉపయోగిస్తూ అంతర్జాతీయ హుకప్ ద్వారా జతచేయబడిన వారిని కూడా చేరిస్తే, 75,000 మంది ఆ ప్రసంగం విన్నారు.
అయితే సంగతులు సాఫీగా సాగలేదు. కాథోలిక్ ప్రీస్టు చార్లెస్ కాగ్గిన్ అనుచరులు సమావేశాన్ని నిలిపివేస్తామని బెదిరించారు, చెప్పినట్లుగానే, సహోదరుడు రూథర్‌ఫోర్డ్ ప్రసంగం సగం అవుతుండగా, కోపోద్రిక్తులైన వందలాదిమంది ప్రజలు నిరసననను తెలియజేస్తూ, “హిట్లర్‌కు జై!” మరియు “ఫ్రాంకో జిందాబాద్!” వంటి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. గలిబిలి ఎంత ఎక్కువగా ఉందంటే, ఫోనుల్లో కూడా గొడవ వినిపించింది! ద్వారపాలకులు జనాలను నిమ్మళింపజేయడానికి దాదాపు 15 నిమిషాలు పట్టింది. ఆ సమయమంతటిలో, ప్రేక్షకులు పదే పదే చప్పట్లు కొట్టడం ద్వారా ఆయనకు మద్దతునిస్తుండగా, సహోదరుడు రూథర్‌ఫోర్డ్ బెదరకుండా మాట్లాడుతూనే ఉన్నాడు.
ఇప్పుడు, నాకు నిజంగానే ఆసక్తి కలిగింది. కాథోలిక్ ప్రీస్టు యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా అంత ద్వేషాన్ని ఎందుకు రేపాలి? రూథర్‌ఫోర్డ్ ప్రకటిస్తున్నది నిజమేనని నేను గుర్తించాను—అదేమిటంటే, నా వంటి ప్రజలు వినకూడదని మత నాయకులు కోరుకున్నదే. కాబట్టి నేను బైబిలు పఠించడం కొనసాగించి, అభివృద్ధి సాధించాను. చివరికి, 1939 అక్టోబరులో నేను నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు నా సమర్పణను తెలియజేశాను. ఆ తర్వాతి సంవత్సరం మా పిల్లల్లో కొందరు, 1941లో నా భార్య లెవెజ్ బాప్తిస్మం తీసుకున్నారు.
శ్రమలను ఎదుర్కోవడం
నేను సత్యాన్ని అంగీకరించిన అనతికాలంలోనే, మా అమ్మ గతించిపోయింది, ఆమె అంత్యక్రియలకు నేను ఉత్తర కారొలినాకు తిరిగి వెళ్లవలసి వచ్చింది. మెథడిస్టు చర్చిలో జరిగే అంత్యక్రియలకు నేను మంచి మనస్సాక్షితో హాజరవ్వలేనని నేను భావించాను. కాబట్టి ప్రయాణానికి ముందు నేను మా నాన్నకు ఫోను చేసి, శవపేటికను అంత్యక్రియల గృహంలోనే ఉంచమని కోరాను. ఆయన అంగీకరించాడు, కాని నేను అక్కడికి చేరేసరికి, వాళ్లు చర్చికి వెళుతున్నారు, నేను తప్పకుండా వాళ్లతో కలుస్తానని వాళ్లనుకున్నారు.
కాని నేను వాళ్లతో కలవలేదు, ఇది మా కుటుంబంలో చాలా అలజడి రేపింది. నేను నా చెల్లి ఎడ్నా ఎప్పుడూ ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్లం, అమ్మ అంత్యక్రియల తర్వాత ఆమె నాతో మాట్లాడలేదు. నేను ఉత్తరాలు వ్రాశాను కాని, ఆమె వాటికి సమాధానం ఇవ్వలేదు. సిటీ కాలేజీలో జరిగే ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు హాజరవ్వడానికి ఆమె న్యూయార్క్‌కు వచ్చిన ప్రతి వేసవిలో, ఆమెను చూడడానికి నేను ప్రయత్నించాను. కాని ఆమె పనితొందరలో ఉన్నానని చెబుతూ నన్ను చూడడానికి నిరాకరించేది. చివరికి నేను విడిచిపెట్టాను, ఎందుకంటే నేను ఆమెను విసిగిస్తున్నట్లనిపించింది. ఆమె మళ్లీ ఉత్తరం వ్రాయకుండానే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.
1941లో, అమెరికా మరియు కెనడాలలో ఇంకా అనేకమంది పిల్లల్లానే మా పిల్లల్లో ఆరుగురు కూడా, పతాక వందనం చేయడానికి నిరాకరించినందుకు పాఠశాల నుండి బహిష్కరించబడ్డారు. చట్టబద్ధమైన విద్యార్హతలు కలిగివుండాలి గనుక, రాజ్య పాఠశాలలు అని పిలువబడే తమ స్వంత పాఠశాలలను సాక్షులు ఏర్పాటు చేశారు. న్యూ జెర్సీలోని లేక్‌వుడ్‌లో మునుపు హోటల్‌గా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయబడిన పాఠశాలకు మా పిల్లలు వెళ్లేవారు. రాజ్యమందిరం మొదటి అంతస్తులో ఉండేది, దానితోపాటు పాఠశాల తరగతులు, వంటగది, భోజనాలు చేసే స్థలం ఉండేవి. ఆడపిల్లల పడక గదులు రెండవ అంతస్తులో, మగపిల్లల పడక గదులు మూడవ అంతస్తులో ఉండేవి. అది ఒక చక్కని పాఠశాల. అక్కడ నివసించే పిల్లలు చాలామంది కేవలం వారాంతాల్లో ఇంటికి వెళ్లేవారు. దూరంలో ఉండేవాళ్లు ప్రతి రెండో వారాంతం ఇంటికి వెళ్లేవారు.
నేను సత్యం తెలుసుకున్న తొలి సంవత్సరాల నుండి, పయినీరునవ్వాలని నాకు ఎంతో కోరికగా ఉండేది, యెహోవాసాక్షుల పూర్తికాల సువార్తికులను అలా పిలుస్తారు. ముస్సోరిలోని సెయింట్ లూయిస్నందు 1941లో జరిగిన సమావేశమందు, ఒక కార్యక్రమంలో, పన్నెండు మంది పిల్లలను పెంచుతూ కూడా పయినీరు సేవచేయగలుగుతున్నట్లు ఒక సహోదరుడు చెప్పాడు. ‘ఆయన 12 మంది పిల్లలతో పయినీరు సేవ చేయగలిగితే, 10 మంది పిల్లలతో నేను కూడా చేయగలను’ అని నేననుకున్నాను. అయితే, 19 సంవత్సరాల తర్వాతి వరకు నేను పయినీరు సేవచేయడానికి నా పరిస్థితులు నాకు అవకాశం ఇవ్వలేదు. చివరికి, 1960 అక్టోబరు 1 నుండి నేను క్రమ పయినీరుగా యెహోవాను సేవించడం ప్రారంభించగలిగాను.
ఒక హఠాత్ సందర్శనం
1975లో, నా చెల్లి ఎడ్నా నాకు ఫోను చేసింది. అప్పటికి నాకు 80 సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాల నుండి నేను ఆమెను చూడలేదు, ఆమె స్వరం వినలేదు. ఆమె విమానాశ్రయం నుండి ఫోను చేస్తూ, వచ్చి తనను తన భర్తను ఇంటికి తీసుకువెళ్లమని ఆమె కోరింది. ఎడ్నాను మళ్లీ చూడడం మంచిదే, కాని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వెల్లడికాబోతుంది. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో, ఆమె భర్త, “మీ దగ్గర మతమార్పిడి పొందిన వ్యక్తి ఉంది” అన్నాడు. ఆయనేమన్నాడో నాకు అర్థం కాలేదు. మేము ఇంటికి వచ్చినప్పుడు, ఆయన మళ్లీ, “ఇక్కడ మీ దగ్గర మతమార్పిడి పొందిన వ్యక్తి ఉంది” అన్నాడు. నా భార్య వెంటనే అర్థం చేసుకుంది. నా చెల్లివైపు తిరిగి ఆమె ఇలా అడిగింది, “ఎడ్నా, నీవు సాక్షివా?” “అవును నిజంగా నేను సాక్షినే” అని ఎడ్నా సమాధానమిచ్చింది.
ఎడ్నా సత్యాన్ని ఎలా అంగీకరించింది? 1972లో, చెదరిపోయిన మా సంబంధాన్ని తిరిగి బాగు చేసుకోవాలనే ప్రయత్నంలో, నేను ఆమెకు కావలికోట (ఆంగ్లం) బహుమాన చందా పంపించాను. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, ఎడ్నా అస్వస్థురాలై తన ఇంటి దగ్గరే ఉండిపోయింది. పత్రికలు ఇంకా వాటి కవర్లలోనే ఆమె బల్ల మీద ఉన్నాయి. ఉత్సుకతతో ఎడ్నా ఒకటి తెరిచి చదవడం ప్రారంభించింది. పత్రికను ముగించిన తర్వాత, ఆమె తనలో తాను ఇలా అనుకుంది, ‘ఇదీ సత్యం!’ యెహోవాసాక్షులు ఆమె ఇంటికి వచ్చేసరికి, ఆమె కావలికోట పత్రికలన్నీ చదివేసింది. ఆమె బైబిలు పఠనానికి అంగీకరించి, తగిన కాలంలో యెహోవాసాక్షుల్లో ఒకరయ్యింది.
నష్టాన్ని ఎదుర్కోవడం
నా భార్యకు చివరికి మధుమేహవ్యాధి సోకి, ఆమె పరిస్థితి క్షీణించి 82 సంవత్సరాల వయస్సులో, 1979లో గతించింది. లెవెజ్ మరణంతో నేను సగం చచ్చిపోయాను. నా ప్రపంచమంతా స్థంభించిపోయింది. ఏమి చేయాలో నాకు తోచలేదు. నాకు భవిష్యత్తు కొరకు పథకాలు లేవు, నాకు ప్రోత్సాహం ఎంతో అవసరమైంది. రిచర్డ్ స్మిత్ అనే ప్రయాణ కాపరి, నా పయినీరు సేవను కొనసాగించమని ఆయన నన్ను ప్రోత్సహించాడు. తమ ప్రియమైన వారిని మరణమందు కోల్పోయిన ఇతరులను ఓదార్చడంలో నాకు గొప్ప ఓదార్పు లభించేది.
1979లో వాచ్‌టవర్ సొసైటీ ఇజ్రాయేల్‌కు ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తుండింది, కాబట్టి నేను కూడా దరఖాస్తు చేశాను. ఈ ప్రయాణం నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండింది, నేను ఇంటికి తిరిగి వచ్చాక, నేను వెంటనే పయినీరు సేవ కొనసాగించాను. అప్పటి నుండి ప్రతి సంవత్సరం, దేశంలోని ఎవరూ నియమించబడని లేక తరచూ పనిచేయబడని మరో ప్రాంతానికి వెళ్లి సహాయం చేయడం నా పనిగా పెట్టుకున్నాను. నాకు వయస్సు పైబడుతున్నప్పటికీ, ఈ ఆధిక్యత కొరకు నన్ను నేను ఇప్పటికీ లభ్యపరచుకోగలుగుతున్నాను.
గడిచిన సంవత్సరాల్లో, దాదాపు 50 మంది జీవమార్గంలో నడవడానికి సహాయం చేసే ఆనందం నాకు లభించినట్లు నేను అంచనా వేస్తున్నాను. మా పిల్లల్లో ఎక్కువమంది సత్యంలో ఉన్నారు. మా కుమార్తెలిద్దరు క్రమ పయినీర్లుగా సేవచేస్తున్నారు. లెవెజ్ బ్లాన్టన్ అనే మా కుమార్తె న్యూయార్క్, బ్రూక్లిన్‌లోనున్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో తన భర్త జార్జ్‌తో కలిసి సేవచేస్తుంది, మా కుమారుల్లో ఒకరు చాలా సంవత్సరాలు పెద్దగా సేవచేశాడు.
మన మొదటి మానవ తలిదండ్రుల నుండి సంక్రమించిన అపరిపూర్ణత వల్ల మనందరికీ అనారోగ్యం, మరణం సంభవిస్తాయి. (రోమీయులు 5:12) నా జీవితం కచ్చితంగా నొప్పులు, బాధలకు అతీతంగా లేదు. ప్రస్తుతం నేను నా ఎడమ కాలులో కీళ్లనొప్పితో బాధపడుతున్నాను. కొన్నిసార్లు అది నాకు చాలా అసౌకర్యం కలిగిస్తుంది, కాని నేను లేచి తిరగకుండా అది ఆపలేదు. అది ఆపకూడదని నేను ప్రార్థిస్తాను. కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. యెహోవా నామాన్ని, సంకల్పాలను తెలియజేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తూ, అంతం వరకు పయినీరు సేవలో కొనసాగాలన్నది నా అత్యంత గొప్ప కోరిక.
[23వ పేజీలోని చిత్రం]
మా కుమార్తె రీటాతో