కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 11/1 పేజీలు 22-25
  • ‘పడద్రోయబడినను నశించినవాడను కాను’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘పడద్రోయబడినను నశించినవాడను కాను’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన ఓటమి
  • సంతోషంగల ఒక కుటుంబం
  • ఆత్మీయ పక్షవాతాన్ని అధిగమించడం
  • మరో ఓటమిని ఎదుర్కోవడం
  • నేను చేయగలిగినది చేయడం
  • దేవుని కాపుదల నుండి నేనెలా ప్రయోజనం పొందాను
    తేజరిల్లు!—1995
  • యెహోవా నిశ్చయమైన మద్దతుకు కృతజ్ఞతలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • బలహీనతలో కూడా బలం పొందుతున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • చనిపోవాలనుకున్నాను కానీ నమ్మకంతో బ్రతుకుతున్నాను
    తేజరిల్లు!—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 11/1 పేజీలు 22-25

‘పడద్రోయబడినను నశించినవాడను కాను’

ఉల్ఫ్‌ హెల్గెసన్‌ చెప్పినది

జూలై 1983లో నా మీదకు వంగుతూ ఉండిన డాక్టర్లు “ఇతడు మేల్కొన్నాడు!” అని బిగ్గరగా అన్నారు. సంక్లిష్టమైన 15 గంటల శస్త్రచికిత్సలో 12 సెంటీమీటర్ల పొడవున్న కంతి నా వెన్నుపాము నుండి తీసివేయబడింది. నాకు పూర్తిగా పక్షవాతం వచ్చేసింది.

కొన్ని రోజుల తరువాత, దక్షిణ స్వీడన్‌లోని మా స్వంత ఊరైన హాల్‌సింగ్‌బార్గ్‌ నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోనున్న ఒక ఆసుపత్రికి నేను తరలించబడ్డాను. నేను అక్కడే ఉండి ఆరోగ్యాన్ని యథాస్థితికి తెచ్చే చికిత్స పొందనారంభించాను. అది ఎంతో కష్టమైనదని ప్రకృతి చికిత్స చేసే వైద్యుడు చెప్పాడు, అయినప్పటికీ, అది ఎప్పుడు మొదలవుతుందా అనే ఆతురతతో నేను ఉన్నాను. నేను నిజంగా మళ్ళీ నడవాలని ఆశించాను. నేను ప్రతిరోజు ఐదు గంటలు అభ్యాసం చేసే కార్యక్రమాన్ని శ్రద్ధగా చేపట్టడం ద్వారా సత్వరమైన పురోభివృద్ధిని సాధించాను.

ఒక నెల తరువాత ప్రయాణ కాపరి మా సంఘాన్ని సందర్శించినప్పుడు, ఆసుపత్రిలోని నా గదిలో సంఘ పెద్దల కూటాన్ని నిర్వహించేందుకు ఆయన మరియు ఇతర క్రైస్తవ పెద్దలు సుదూర ప్రయాణం చేసి వచ్చారు. సహోదర ప్రేమను గూర్చిన ఈ రుజువును చూసి నా హృదయం ఎంతగా ఆనందించిందో! వార్డులోని నర్సులు కూటం తరువాత గుంపంతటికీ టీ మరియు సాండ్‌విచ్‌లను అందించారు.

నా అభివృద్ధిని చూసి వైద్యులు మొదట ఆశ్చర్యపోయారు. మూడు నెలల తరువాత, నేను నా వీల్‌చెయర్‌లో నిటారుగా కూర్చోవడం మరియు కొన్ని నిమిషాల వరకు నిలబడడమూ చేయగలిగాను. నేను సంతోషంగా ఉండేవాడ్ని, మళ్ళీ నడవాలనే దృఢ నిశ్చయంతో ఉండేవాడ్ని. నా కుటుంబం మరియు తోటి క్రైస్తవులు నా దగ్గరికి వచ్చినప్పుడెల్లా నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేవారు. నేను ఇంటికి వెళ్ళి కొంచెం సేపు ఉండి వచ్చేవాడ్ని.

నిజమైన ఓటమి

అయితే దాని తరువాత, నేనిక ఏ పురోభివృద్ధిని సాధించలేకపోయాను. త్వరలోనే ప్రకృతి చికిత్స చేసే వైద్యుడు “నువ్వు ఇంత కన్నా ఎక్కువగా కోలుకోలేవు!” అనే వేదనాకరమైన సందేశాన్నిచ్చాడు. వీల్‌చెయర్‌ నుండి నా అంతట నేనే కదలగలిగేలా నన్ను బలపరచాలన్నదే ఇప్పటి ధ్యేయము. నాకు ఏమి జరగబోతోంది. నా భార్య అన్నీ ఎలా చేసుకోగలదు? ఆమెకూ పెద్ద సర్జరీ జరిగింది, ఆమెకే నా సహాయం అవసరం ఉండేది. ఇక నేను ఎప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స చేయించుకోవలసి వస్తుందా? అనే ఆలోచనలోపడ్డాను.

నేను ఎంతో నిరాశ చెందాను. నా బలాన్ని, ధైర్యాన్ని మరియు శక్తిని నెమ్మదిగా కోల్పోయాను. రోజులు గడిచిపోయాయి, మరి నేనిక కదలలేక పోయాను. నాకు శారీరకంగా పక్షవాతం రావడమే కాక, భావోద్రేకంగాను ఆత్మీయంగాను కూడా నాలో స్తబ్ధత కలిగింది. నేను “పడద్రోయబడ్డాను.” నేను ఎల్లప్పుడూ నన్ను ఆత్మీయంగా బలమైనవానిగా దృష్టించేవాడ్ని. దేవుని రాజ్యంలో స్థిరంగా పాతుకొనిన విశ్వాసం నాకు ఉండేది. (దానియేలు 2:44; మత్తయి 6:10) దేవుని నీతియుక్తమైన క్రొత్త లోకంలో అన్ని రోగాలు బలహీనతలు స్వస్థపరచబడతాయని, మానవజాతి ఇక్కడే పరిపూర్ణ జీవితానికి పునఃస్థాపించబడుతుందనే బైబిలు వాగ్దానాలతో ఒప్పించబడ్డాను. (యెషయా 25:8; 33:24; 2 పేతురు 3:13) ఇప్పుడు నాకు శారీరకంగానే కాక, ఆత్మీయంగా కూడా పక్షవాతం వచ్చినట్లుగా అనిపించింది. నేను ‘నశించినవానిగా’ భావించాను.—2 కొరింథీయులు 4:9.

నేను ఇక ఎక్కువగా చెప్పే ముందు, నా పూర్వ చరిత్ర గురించి మీకు కొంత చెప్పనివ్వండి.

సంతోషంగల ఒక కుటుంబం

నేను 1934లో జన్మించాను, మరి నా ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండేది. 1950ల తొలి భాగంలో నేను ఇంగ్రెడ్‌ను కలిశాను, మేము 1958లో పెళ్ళి చేసుకుని మధ్య స్వీడన్‌లోని ఆస్టెర్‌సండ్‌ అనే పట్టణంలో స్థిరపడ్డాం. మేము 1963లో యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేయనారంభించినప్పుడు మా జీవితం ఓ మలుపుకు తిరిగింది. అప్పటికెల్లా మాకు ముగ్గురు పిల్లలు—ఏవ, బ్యోర్న్‌ మరియు లెనా—ఉన్నారు. త్వరలోనే మా కుటుంబమంతా పఠనం చేసి, బైబిలు సత్యాల జ్ఞానంలో చక్కగా ఎదగనారంభించింది.

మేము పఠనం చేయనారంభించిన కొంతకాలానికే హాల్‌సింగ్‌బర్గ్‌కు తరలివెళ్ళాము. అక్కడ, నేను నా భార్య యెహోవాకు మమ్మల్ని మేము సమర్పించుకున్నాము, 1964లో బాప్తిస్మం పొందాము. మా పెద్ద కూతురు ఏవ 1968లో బాప్తిస్మం పొందినప్పుడు మా సంతోషం ఇంకా అధికమైంది. ఏడు సంవత్సరాల తరువాత, 1975లో బ్యోర్న్‌ మరియు లెనా కూడా బాప్తిస్మం పొందారు, తరువాతి సంవత్సరం నేను క్రైస్తవ సంఘంలో పెద్దగా నియమించబడ్డాను.

నా లౌకిక ఉద్యోగం నా కుటుంబం యొక్క వస్తు సంబంధమైన అవసరాలను చక్కగా తీర్చడానికి సాధ్యం చేసింది. బ్యోర్న్‌ మరియు లెనా పూర్తికాల పరిచర్యను చేపట్టినప్పుడు మా సంతోషం అధికమైంది. ఆర్బూగాలోని యెహోవాసాక్షుల బ్రాంచ్‌ కార్యాలయంలో సేవ చేసేందుకు బ్యోర్న్‌ త్వరలోనే ఆహ్వానించబడ్డాడు. జీవితం ఆహ్లాదకరంగా ఉంది. తరువాత 1980 తొలిభాగంలో నేను శరీరంలోని కంతి వలన కలిగే ప్రభావాలను అనుభవించనారంభించాను, చివరికి 1983లో పెద్ద సర్జరీలో ఆ కంతి తీసివేయబడింది.

ఆత్మీయ పక్షవాతాన్ని అధిగమించడం

నేను ఇక ఎన్నడూ నడవలేనని నాతో చెప్పబడినప్పుడు, జీవితం ఎంతో నిరాశాజనకమైనదిగా నాకనిపించింది. నేను ఆత్మీయ బలాన్ని తిరిగి ఎలా పొందాను? అది నేననుకున్న దానికన్నా సులభమైనదే. నేను బైబిలు తీసుకుని చదవనారంభించానంతే. నేను చదివిన కొలది మరింత ఆత్మీయ బలాన్ని పొందాను. అన్నింటికన్నా ఎక్కువగా కొండమీది యేసు ప్రసంగాన్ని నేను ఎప్పుడూ ప్రశంసించేవాడిని. నేను దానిని పదే పదే చదువుకొని ధ్యానించాను.

జీవితాన్ని గూర్చిన సంతోషకరమైన నా దృక్కోణం తిరిగి లభించింది. నేను చదవడం, ధ్యానించడం ద్వారా అవాంతరాలకు బదులుగా, అవకాశాలను చూడనారంభించాను. బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకోవాలన్న ఆశ మళ్ళీ నాలో కలిగింది, ఆసుపత్రి సిబ్బందికి, నేను కలిసే ఇతరులకు సాక్ష్యమివ్వడం ద్వారా నా కోరికను తీర్చుకున్నాను. మా కుటుంబం నాకు పూర్తిగా మద్దతునిచ్చింది, నన్ను ఎలా చూసుకోవాలో తర్ఫీదును పొందింది. చివరికి నేను ఆసుపత్రి నుండి వచ్చేయగలిగాను.

తుదకు నేను ఇంటికి చేరుకున్నాను. అది మాకందరికీ ఎంత సంతోషకరమైన రోజో! మా కుటుంబం నన్ను చూసుకునే విషయం ఇమిడివున్న ఒక పట్టికను ఏర్పాటు చేసింది. నా కుమారుడు బ్యోర్న్‌ యెహోవాసాక్షుల బ్రాంచ్‌ కార్యాలయంలో పనిని వదిలి పెట్టడానికి తీర్మానించుకుని, నన్ను చూసుకోవడంలో సహాయపడేందుకు ఇంటికి వచ్చేశాడు. నా కుటుంబం నుండి నాకు అంత ప్రేమా శ్రద్ధలు లభించినందుకు నాకు ఎంతో ఓదార్పుగా ఉంది.

మరో ఓటమిని ఎదుర్కోవడం

అయితే, కాలం గడిచిన కొలది నా ఆరోగ్యం మరింత క్షీణించింది, నాకు కదలడం కూడా కష్టంగా ఉండేది. నా కుటుంబం ఎంతో శ్రద్ధాపూర్వకంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరికి, వారు నాకిక ఇంట్లో సరిగ్గా శ్రద్ధ చూపించలేకపోయారు. కాబట్టి నర్సింగ్‌ హోమ్‌కు వెళ్ళడం మంచిదని నేననుకున్నాను. మళ్ళీ మార్పులు, క్రొత్త దినచర్యలు అవసరమయ్యాయి. కాని ఇది ఆత్మీయ ఓటమయ్యేందుకు నేను అనుమతించలేదు.

నేను బైబిలు పఠనాన్ని మరియు పరిశోధనను ఆపలేదు. నేను చేయలేనివాటిని గూర్చి కాదు గాని చేయగలవాటిని గూర్చి ఆలోచిస్తూ వచ్చాను. యెహోవాసాక్షులందరూ కలిగివున్న ఆత్మీయ ఆశీర్వాదాలను గూర్చి నేను ధ్యానించాను. నేను ప్రార్థనలో యెహోవాకు సన్నిహితుడనయ్యాను, మరి ఇతరులతో ప్రకటించడానికి లభించిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాను.

ఇప్పుడు నేను పగలూ రాత్రి కొంత సమయం నర్సింగ్‌ హోమ్‌లోనే గడుపుతున్నాను. నేను మధ్యాహ్నాలను సాయంకాలాలను ఇంట్లోనో లేక మన క్రైస్తవ కూటాల్లోనో గడుపుతాను. కూటాలకు వెళ్ళేందుకు, అక్కడి నుండి తిరిగి వచ్చేందుకు, మా ఇంటికి వెళ్ళేందుకు, తిరిగి వచ్చేందుకు పురపాలక సర్వీస్‌ క్రమంగా ఏర్పాటు చేస్తుంది. శ్రద్ధగల నా కుటుంబం, సంఘంలోని సహోదరులు, నర్సింగ్‌హోమ్‌లోని సిబ్బందీ అందరూ నన్ను ఎంతో చక్కగా చూసుకుంటున్నారు.

నేను చేయగలిగినది చేయడం

నన్ను నేను పనికిరానివానిగా ఎంచడం లేదు, నా కుటుంబం గాని, నా క్రైస్తవ సహోదరులుగాని నన్నలా చూడడం లేదు. పెద్దగా ఫలవంతంగా సేవ చేయడంలో కొనసాగడానికి నాకు సాధ్యమయ్యేలా నన్ను వారు ప్రేమపూర్వకంగా చూసుకుంటున్నారు. నేను ప్రతి వారం సంఘ పుస్తక పఠనాన్ని, అలాగే రాజ్యమందిరంలో వారపు సంఘ కావలికోట పఠనాన్ని నిర్వహిస్తున్నాను. బైబిలులోని పేజీలను తిప్పడం నాకు కష్టంగా ఉంటుంది గనుక, కూటాల్లో ఆ పని చేసి నాకు సహాయపడేందుకు ఎవరైనా ఒకరు నియమించబడతారు. నేను కూటాలను నిర్వహిస్తాను, నా వీల్‌చెయర్‌లో కూర్చొని ప్రసంగాలను ఇస్తాను.

కాపరి దర్శనాలతో సహా క్రితం నేను చేసిన అనేక పనులను ఇప్పటికీ చేయగలుగుతున్నాను. (1 పేతురు 5:2) సహోదరసహోదరీలు నా సహాయం కొరకు లేదా సలహా కొరకు నా దగ్గరికి వచ్చినప్పుడు నేనీ పని చేస్తున్నాను. నేను ఇతరులకు ఫోను చేయడానికి చొరవ తీసుకుంటూ టెలిఫోను కూడా ఉపయోగిస్తున్నాను. ఇరు పక్షాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. (రోమీయులు 1:11, 12) “సరిగ్గా నేను మానసికంగా కృంగిపోయినప్పుడే అందిన మీ ఫోన్‌ కాల్‌ నాకు ధైర్యం కలిగించింది” అని ఇటీవల ఒక స్నేహితుడు చెప్పాడు. అయితే, యెహోవా నా ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడని తెలుసుకోవడం వల్ల నేను కూడా ప్రోత్సహించబడ్డాను.

కూటాలకు ముందు, తర్వాత కూడా సంఘంలోని పిల్లలతో నాకు మంచి సహవాసముంది. నేను నా వీల్‌చెయర్‌లో కూర్చుంటాను గనుక, మేము ఒకే ఎత్తులో ఉండి మాట్లాడుకుంటాం. నేను వారి యథార్థతను నిష్కపటతను మెచ్చుకుంటాను. “మీరు బలహీనులైనప్పటికీ, నిజంగా ఎంత అందంగా ఉంటారో!” అని ఒక చిన్న అబ్బాయి ఒకసారి నాతో అన్నాడు.

నేను చేయలేని వాటిని గురించి బాధపడే బదులు, నేను చేయగల్గేవాటిపై శ్రద్ధ నిలపడం ద్వారా నేను యెహోవాను సేవించడంలో ఆనందిస్తున్నాను. నాకు జరిగిన దానిలో నుండే నేను ఎక్కువగా నేర్చుకున్నాను. మనం ఎదుర్కొనే శోధనల ద్వారానే మనం తర్ఫీదు పొందుతామని బలపరచబడతామని నేను గ్రహించాను.—1 పేతురు 5:10.

నేను గమనించినంత వరకు, చాలా మంది ఆరోగ్యవంతులైన ప్రజలు మన పరలోక తండ్రి ఆరాధనను గంభీరంగా తీసుకోవలసి ఉందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మనమలా చేయకపోతే, పఠనం, కూటాలు మరియు ప్రాంతీయ పరిచర్యల మన పట్టిక కేవలం దినచర్యగా మారగలదు. ఈ లోకాంతాన్ని తప్పించుకుని దేవుడు వాగ్దానం చేసిన భూ పరదైసులో ప్రవేశించేందుకు ఈ ఏర్పాట్లు ఎంతో అవశ్యకమని నేను ఎంచుతాను.—కీర్తన 37:9-11, 29; 1 యోహాను 2:17.

దేవుని రానున్న క్రొత్త లోకంలో జీవితమనే నిరీక్షణనను మన హృదయాల్లో ఎల్లప్పుడు సజీవంగా ఉంచుకోవాలి. (1 థెస్సలొనీకయులు 5:8) నిరుత్సాహపడే ప్రతి ప్రవృత్తికి వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాడడాన్ని కూడా నేను నేర్చుకున్నాను. యెహోవాను నా తండ్రిగా, ఆయన సంస్థను నా తల్లిగా దృష్టించడం నేను నేర్చుకున్నాను. మనలో ఎవరైనా సరే ప్రయత్నం చేసినట్లయితే సఫలుడైన తన సేవకునిగా యెహోవా ఉపయోగించుకుంటాడని నేను గ్రహించగలిగాను.

నేను ‘పడద్రోయబడినవానినని’ కొన్నిసార్లు భావించినప్పటికీ, నేను ‘నశింపజేయబడలేదు.’ యెహోవాగాని ఆయన సంస్థగాని నా కుటుంబం గాని నా క్రైస్తవ సహోదరులు గాని నన్ను ఎన్నడూ ఎడబాయలేదు. నేను బైబిలు తీసుకొని దానిని చదవనారంభించడం వల్ల ఆత్మీయ బలాన్ని తిరిగి పొందాను. తనయందు మనం నమ్మకముంచినప్పుడు ‘అసాధారణమైన బలమునిచ్చు’ యెహోవా దేవునికి నేను కృతజ్ఞుడను.—2 కొరింథీయులు 4:7.

నేను యెహోవాయందలి పరిపూర్ణ విశ్వాసంతోను పరిపూర్ణ నమ్మకంతోను భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నాను. భూమిపై పునఃస్థాపించబడే పరదైసుతో పాటు అది తెచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలన్నింటిని గూర్చిన తన వాగ్దానాన్ని యెహోవా దేవుడు త్వరలోనే తీరుస్తాడని నేను నమ్ముతున్నాను.—ప్రకటన 21:3, 4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి