కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 11/1 పేజీలు 25-29
  • “నలిగిన హృదయము” గలవారికి ఓదార్పు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నలిగిన హృదయము” గలవారికి ఓదార్పు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “బాధాజనక జ్ఞాపకాలు”
  • అది నిజంగా సంభవించిందా?
  • ఆశ్రయమివ్వడం
  • ఆత్మీయంగా దృఢంగా ఉండండి
  • దుర్వవహారకునిగా ఆరోపించబడినవాని విషయమేమిటి?
  • పెద్దలు ఏమి చేయగలరు?
  • అపవాదిని ఎదుర్కొనడం
  • “మునుపటివి మరువబడును”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • చెడుతనం మధ్య ప్రేమ, న్యాయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పును ఇవ్వడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • లైంగిక దాడి గురించి నేను ఏమి తెలుసుకోవాలి?—2వ భాగం: కోలుకోవడం
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 11/1 పేజీలు 25-29

“నలిగిన హృదయము” గలవారికి ఓదార్పు

నేడు, సాతాను లోకం ‘సిగ్గులేనిదై’ ఉంది. (ఎఫెసీయులు 4:19; 1 యోహాను 5:19) జారత్వమూ వ్యభిచారమూ విశృంఖులమైపోయాయి. అనేక దేశాల్లో 50 శాతం లేక అంతకంటే ఎక్కువ వివాహాలు విడాకులతో అంతమౌతున్నాయి. సలింగ సంయోగం విస్తృతంగా అంగీకరించబడుతోంది. లైంగిక దౌర్జన్యం—బలాత్కారం—వార్తల్లో తరచూ వస్తుంది. అశ్లీల సాహిత్యాలు నూరు కోట్ల డాలర్ల లాభార్జన పరిశ్రమగా ఉంది.—రోమీయులు 1:26, 27.

నీచమైన దుశ్శీలంలో, అమాయకులైన పిల్లలపై లైంగిక అత్యాచారం చేయడం ఉంది. సాతాను లోకంలోని జ్ఞానంలా, పిల్లలపై లైంగిక అత్యాచారం చేయడం ‘పశుప్రాయమైనది దయ్యముల’ సంబంధమైనది. (యాకోబు 3:15) కేవలం అమెరికాలోనే, “ప్రతి సంవత్సరం, లైంగిక అత్యాచారం జరిగిందని నిరూపించగల 4,00,000 రిపోర్టులను ఉపాధ్యాయులూ డాక్టర్ల ద్వారా అధికారిక ఫైళ్లలో నమోదు చేయబడుతున్నాయి. ఈ దురాచారానికి గురైన వారు పెద్దలైనప్పుడు, అనేకులు ఇంకా ఆ బాధాకరమైన మనోవ్యధను కల్గివుంటారు మరియు ఆ వ్యధ యథార్థమైనదే! బైబిలు ఇలా చెబుతోంది: “నరుని ఆత్మ [మానసికోద్దేశాలూ అంతరంగ భావాలూ ఆలోచనలు] వాని వ్యాధినోర్చును. నలిగిన [గాయపడిన, బాధపడిన] హృదయమును ఎవడు సహింపగలడు?”—సామెతలు 18:14.

దేవుని రాజ్య సువార్త అన్ని రకాల ప్రజలకూ ఆసక్తికరమైనదిగా ఉంటుంది, మరి వారిలో “దుఃఖాక్రాంతు”లూ “భారభరితమైన ఆత్మ” గలవారూ ఉన్నారు. (యెషయా 61:1-4) భావోద్రేకమైన బాధలో ఉన్నవారు అనేకమంది ఈ క్రింది ఆహ్వానానికి ప్రతిస్పందించడంలో ఆశ్చర్యం లేదు: “దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:17) ఇలాంటివారికి క్రైస్తవ సంఘం ఓదార్పునిచ్చే స్థానంగా ఉండవచ్చు. త్వరలోనే బాధ మరువబడిన విషయంగా ఉంటుందని తెలుసుకోవడంలో వారు ఆనందిస్తారు. (యెషయా 65:17) అయితే, ఆ కాలంవరకు వారికి ‘ఓదార్పునిచ్చి’ వారి గాయాలకు ‘కట్టుకట్టాల్సిన’ అవసరం ఉండవచ్చు. యుక్తంగానే పౌలు క్రైస్తవులకు ఈ సలహానిచ్చాడు: “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.”—1 థెస్సలొనీకయులు 5:14.

“బాధాజనక జ్ఞాపకాలు”

ఇటీవలి సంవత్సరాల్లో, ఇతరులు అర్థంచేసుకునేందుకు కష్టమైన కారణాలవల్ల కొందరు “దుఃఖాక్రాంతులు” అవ్వడం జరిగింది. వారు పెద్దలే, “బాధాజనక జ్ఞాపకాలుగా” వర్ణించబడినవాటి ఆధారంగా, తాము పిల్లలుగా ఉన్నప్పుడు లైంగికంగా హింసించబడ్డామని వారు చెబుతారు.a అనుకోకుండ వయస్సులో పెద్దవారొకరు (లేక కొందరు పెద్దవారు) తాము చిన్నవారిగా ఉన్నప్పుడు తమతో దుర్వవహారం చేసినట్లుగా పూర్వం జరిగిన సంగతి మరియు “జ్ఞాపకాలు” వచ్చేంతవరకు వారికి పీడించబడిన ఆలోచనలేవీ ఉండవు. క్రైస్తవ సంఘంలో ఎవరికైనా అలాంటి కలతపరచే ఆలోచనలున్నాయా? కొన్ని దేశాల్లో ఉన్నాయి మరియు సమర్పించుకున్న వీరు ఎంతో వ్యధను, కోపాన్ని, అపరాధభావాన్ని, సిగ్గును, లేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. దావీదులా వారు దేవుని నుండి వేరైపోయినట్లుగా భావించి, ఇలా విలపిస్తారు: “యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి యున్నావు?”—కీర్తన 10:1.

ఈ “జ్ఞాపకాల్లోని” వివిధ విషయాలను మానసిక ఆరోగ్య నిపుణులు సరిగ్గా అర్థం చేసుకోలేపోతున్నారు. అయినప్పటికీ, అలాంటి “జ్ఞాపకాలు” సమర్పిత క్రైస్తవుల ఆత్మీయతపై ప్రభావం చూపగలవు. వాటితో వ్యవహరించేందుకు సరైన నడిపింపుకొరకు మనం దేవుని వాక్యంవైపుకు నమ్మకంతో చూస్తాము. బైబిలు ‘అన్నివిషయములోనూ . .  వివేకమును అనుగ్రహించును.’ (2 తిమోతి 2:7; 3:16) దానికి సంబంధించినవారందరూ, “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవు”డైన యెహోవాయందు విశ్వసించేందుకు అది మనకు సహాయపడుతుంది.—2 కొరింథీయులు 1:3, 4.

అది నిజంగా సంభవించిందా?

ఈ ప్రపంచంలో, ఈ “జ్ఞాపకాలు” ఏమిటి అనే విషయంలోను మరియు జరిగిన అసలు విషయాలను అవి ఎంతమట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్న విషయంలో ఎంతో వివాదం ఉంది. యెహోవాసాక్షులు “లోకసంబంధులుకారు” మరియు ఈ వివాదంలో వారికి ఏ భాగంలేదు. (యోహాను 17:16) ప్రచురించబడిన నివేదికల ప్రకారంగా, కొన్నిసార్లు “జ్ఞాపకాలు” సరైనవిగా నిరూపించబడ్డాయి. ఉదాహరణకు, ఓ ప్రీస్టు తనను పీడించాడని ఇన్సూరెన్స్‌ తనిఖీ ఫ్రాంక్‌ ఫిట్స్‌పాట్రిక్‌క్కు “జ్ఞాపకమెచ్చిన” తర్వాత, సుమారు నూరు మంది ఇతరులు అదే ప్రీస్టు తమను కూడా పాడు చేశాడని చెప్పేందుకు ముందుకొచ్చారు. ప్రీస్టులు, తాము చెడుగా వ్యవహరించామని ఒప్పుకున్నట్లు తెలిసింది.

అయితే, అనేకమంది వ్యక్తులు తమ “జ్ఞాపకాలను” రూఢిపర్చలేకపోయారన్నది గమనార్హం. ఈ విధంగా బాధననుభవించినవారు ఓ వ్యక్తి తనతో దుర్వవహారం చేసినట్లుగా లేక ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో దుర్వవహారం చేసినట్లుగా స్పష్టమైన జ్ఞాపకాలు రావచ్చు. అయితే దీనికి విరుద్ధమైన యుక్త రుజువులు, ఈ “జ్ఞాపకాల” వివరాలు నిజంకావని స్పష్టం చేస్తాయి.

ఆశ్రయమివ్వడం

అయినప్పటికీ, అలాంటి “జ్ఞాపకాల” వల్ల “నలిగిన హృదయాన్ని” గలవారికి ఓదార్పు ఎలా ఇవ్వబడుతుంది? ప్రేమపూర్వకమైన సమరయున్ని గూర్చి యేసు ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఓ వ్యక్తిని దొంగలు ముట్టడించి, కొట్టి తన సంపదనంతటినీ తీసివేసుకున్నారు. సమరయుడు ఆ దారిన వెళుతున్నప్పుడు, దెబ్బలు తగిలిన ఆ వ్యక్తిని చూసి ఆయన హృదయం జాలితో కరిగిపోయింది. ఆయన ఏమి చేస్తాడు? కొట్టిన వివరాలన్నింటినీ తెలుసుకోవాలని ఆయన మొండిపట్టుపట్టాడా? లేక సమరయుడు ఆ దొంగలను గూర్చిన ఆనవాళ్లు తెలుసుకుని, వెంటనే వారిని వెంబండించాడా? లేదు. ఆ మనిషి గాయపడ్డాడు! అతని గాయాలకు నొప్పికలిగించకుండ కట్టుకట్టాడు మరియు కోలుకునేందుకుగాను సమీపంలోవున్న పూటకూళ్ల ఇంటికి ప్రేమగా తీసుకువెళ్లాడు.—లూకా 10:30-37.

నిజమే, శారీరకంగా గాయాలు తగలడానికి నిజంగా చిన్నతనంలో లైంగిక దుర్వవహారంవల్ల ‘నలిగిన హృదయానికీ’ ఎంతో తేడా ఉంది. అయితే రెండూ ఎంతో బాధాకరమైనవే. కాబట్టి, గాయపడిన యూదుని కొరకు సమరయుడు చేసినది, బాధపడుతున్న తోటి క్రైస్తవునికి సహాయపడేందుకు ఏమి చేయవచ్చుననే విషయాన్ని కనపరుస్తుంది. మొదటి ప్రాధాన్యత ప్రేమపూర్వకమైన ఓదార్పును ఇవ్వడం మరియు ఆయన కోలుకునేందుకు సహాయపడడం.

భావోద్రేకమైన లేక శారీరకమైన వేదన ఆయన యథార్థతను తుంచివేయగలదనే నమ్మకంతో అపవాది నమ్మకమైన యోబును బాధపెట్టాడు. (యోబు 1:11; 2:5) అప్పటినుండి, సాతాను బాధను ఉపయోగించి—దాన్ని అతడు నేరుగా కలుగచేసినా లేదా కలుగజేయకపోయినా—దేవుని సేవకుల విశ్వాసాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నించాడు. (2 కొరింథీయులు 12:7-9 పోల్చండి.) పిల్లల అత్యాచారాన్ని మరియు దీన్ని అనుభవించిన (లేక అలా అనుభవించినట్లుగా వచ్చే “జ్ఞాపకాలతో” వేధించబడుతున్న) అనేకమంది పెద్దల “నలిగిన హృదయమును” ఉపయోగించి క్రైస్తవుల విశ్వాసాన్ని బలహీనపర్చేందుకు అపవాది ఇప్పుడు ప్రయత్నిస్తాడా? సాతాను ముట్టడించినప్పుడు యేసు చేసినట్లుగా, బాధననుభవించినప్పటికీ తన యథార్థతను విడనాడేందుకు దృఢంగా నిరాకరించే క్రైస్తవుడు ఇలా చెబుతాడు: “సాతానా, పొమ్ము!”—మత్తయి 4:10.

ఆత్మీయంగా దృఢంగా ఉండండి

పిల్లలపై చేయబడిన అత్యాచారం విషయంలో ఆత్మీయ మరియు భావోద్రేక బాధతో సరైన విధంగా వ్యవహరించేందుకుగాను ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ తరగతి సమాచారాన్ని ప్రచురించింది. (మత్తయి 24:45-47) బాధననుభవించేవాడు “దేవుడిచ్చు సర్వాంగకవచమును” ధరించుకుని ‘ప్రభువుయొక్క మహా శక్తిని మరియు ఆయనయందలి బలముపై’ ఆధారపడగల్గినట్లైతే, అతడు సహాయాన్ని పొందగలడని అనుభవం చూపుతోంది. (ఎఫెసీయులు 6:10-17) ఈ కవచంలో బైబిలు “సత్యం” చేరివుంది, మరి అది సాతాను అసలు శత్రువుగా బయల్పరుస్తుంది మరియు అతడూ అతని మద్దతుదార్లు పనిచేసే అంధకారాన్ని అది చెదరగొడుతుంది. (యోహాను 3:19) తర్వాత, “నీతియను మైమరుపు” ఉంది. బాధననుభవించే వ్యక్తి నీతియుక్త సూత్రాలకు హత్తుకుని ఉండేందుకు గట్టి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు, తమకు తాము హాని కల్గించుకోవాలని లేక లైంగికావినీతికి పాలుపడాలనే గట్టి ప్రేరణను కొందరు అనుభవిస్తారు. ఈ ప్రేరణలను ఎదుర్కొన్న ప్రతిసారీ వారు విజయాన్ని సాధిస్తారు!

ఆత్మీయ కవచంలో “సమాధాన సువార్త” కూడా ఉంది. యెహోవా సంకల్పాలు గూర్చి మాట్లాడడం, అలా మాట్లాడే వ్యక్తిని అలాగే వినేవారెవరినైనా బలపరుస్తుంది. (1 తిమోతి 4:16) సువార్తను గూర్చి మీరు మాట్లాడడాన్ని మీకు కష్టతరం చేస్తూ మీరు “నలిగిన హృదయము” గలవారైనట్లైతే, మరో క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు ఈ ప్రాముఖ్యమైన పనిని చేస్తుండగా వారిని మీకు తోడుతీసుకువెళ్లేందుకు ప్రయత్నించండి. మరియు “విశ్వాసమను డాలును” మర్చిపోకండి. యెహోవాకు మీ ఎడల ప్రేమ ఉందని మరియు మీరు పోగొట్టుకున్నదంతా మీకు తిరిగిస్తాడనే విశ్వాసాన్ని కల్గివుండండి. ఏ సందేహాలూ లేకుండ యేసు కూడ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మరియు మీ కొరకు చనిపోవడం ద్వారా ఆయన దాన్ని నిరూపించాడని విశ్వసించండి. (యోహాను 3:16) యెహోవా తన సేవకుల ఎడల శ్రద్ధకల్గిలేడని సాతాను ఎల్లప్పుడూ అబద్ధం చెబుతూ వచ్చాడు. అతడు చెప్పిన నీచమైన, హానికరమైన అబద్ధాల్లో అది మరొకటి.—యోహాను 8:44, యోబు 4:1, 15-18;. 42:10-15 పోల్చండి.

యెహోవా మీ ఎడల శ్రద్ధ కల్గివున్నాడనే విషయాన్ని విశ్వసించడం మీ హృదయవేదనవల్ల మీకు కష్టమైనట్లైతే, ఆయన నిజంగా శ్రద్ధ కల్గివున్నాడని దృఢంగా విశ్వసించేవారితో సహవసించడం అందుకు సహాయపడతుంది. (కీర్తన 119:107, 111; సామెతలు 18:1; హెబ్రీయులు 10:23-25) సాతాను మీ జీవబహుమానాన్ని మీ నుండి దొంగిలించేందుకు అనుమతించకండి. “రక్షణయను శిరస్త్రాణము” సర్వాంగ కవచంలో ఓ భాగమని జ్ఞాపముంచుకోండి; అలాగే “ఆత్మ ఖడ్గము” కూడా. సాతాను ఓడించలేని పరిశుద్ధాత్మ ప్రేరణవల్ల బైబిలు ప్రేరేపించబడింది. (2 తిమోతి 3:16; హెబ్రీయులు 4:12) దానిలోని బాగుపర్చే మాటలు భావోద్రేకమైన వేదనను తగ్గించగలవు.—కీర్తన 107:20 పోల్చండి; 2 కొరింథీయులు 10:4, 5.

చివరికి, సహించే శక్తి కొరకు ఎడతెగక ప్రార్థించండి. (రోమీయులు 12:12; ఎఫెసీయులు 6:18) హృదయపూర్వకమైన ప్రార్థన, భావోద్రేకమైన వేదనను యేసు తట్టుకునేందుకు సహాయపడింది మరి అది మీకు కూడా సహాయపడగలదు. (లూకా 22:41-43) ప్రార్థించడం మీకు కష్టంగా ఉందా? మీ కొరకు ప్రార్థించమని, మీతో ప్రార్థించమని ఇతరులను కోరండి. (కొలొస్సయులు 1:3; యాకోబు 5:14) పరిశుద్ధాత్మ మీ ప్రార్థనలకు మద్దతునిస్తుంది. (రోమీయులు 8:26, 27 పోల్చండి.) వేదనకరమైన శారీరక అస్వస్థతవలే, గంభీరమైన భావోద్రేక గాయాలు గల కొందరు ఈ విధానంలో పూర్ణ స్వస్థతను పొందలేకపోవచ్చు. అయితే, యెహోవా సహాయంతో మనం సహించగలం, మరి యేసు విషయంలోలా ఆ సహనం విజయమే. (యోహాను 16:33) “జనులారా, యెల్లప్పుడు ఆయనయందు [యెహోవాయందు] నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.”—కీర్తన 62:8.

దుర్వవహారకునిగా ఆరోపించబడినవాని విషయమేమిటి?

ఓ పిల్లవానితో లైంగిక దుర్వ్యవహారం చేసిన ఏ వ్యక్తెనా బలాత్కారం చేసే వ్యక్తే మరి ఆ వ్యక్తిని అలాగే దృష్టించాలి. ఈ విధంగా బాధించబడుతున్నవారెవరైనా తనతో దుర్వ్యవహారం చేసే వ్యక్తిని నిందించే హక్కుకల్గివున్నాడు. అయినప్పటికీ, కేవలం అది “బాధాజనక జ్ఞాపకాల”పై మాత్రమే ఆధారపడివున్నట్లైతే, త్వరపడి నిందించకూడదు. ఈ సందర్భంలో బాధననుభవించే వ్యక్తికి ఓ మోస్తారు భావోద్రేక స్థిరత్వాన్ని తిరిగి పొందడమే అతి ప్రాముఖ్యమైన విషయం. కొంత కాలం గడిచిన తర్వాత, ఆ వ్యక్తి తన “జ్ఞాపకాలను” విశ్లేషించగల శ్రేష్ఠమైన పరిస్థితిలో ఉంటాడు మరియు వాటిని గూర్చి అతను ఏమైన చేయదలచుకున్నట్లైతే దాన్ని నిర్ణయించుకోగలడు.

డొన్నా విషయాన్ని పరిశీలించండి. నివేదిక ప్రకారం ఆమెకు సరైన ఆహార అలవాట్లు లేకపోవడంతో ఓ సలహాదారుని వద్దకు వెళ్లింది—అతను పెద్ద అర్హతగలవాడు కాదు. కొంతకాలానికే ఆమె తన తండ్రి తనతో వావివరుస తప్పి వ్యవహరించాడని ఆయనను నిందించింది మరియు ఆయన న్యాయస్థానానికి తీసుకువెళ్లబడ్డాడు. న్యాయనిర్ణేతలు ఓ నిర్ణయానికి రాలేకపోయారు కనుక తండ్రి చెరసాలలోకి వెళ్లలేదు, కానీ 1,00,000 డాలర్ల పన్ను కట్టమని న్యాయస్థానం అతనికి జరిమానా విధించింది. ఇదంతా జరిగిన తర్వాత, అలాంటి దుర్వ్యవహారం జరిగిందని తను విశ్వసించడం లేదని తన తలిదండ్రులతో డొన్నా చెప్పింది!

సొలొమోను జ్ఞానయుక్తంగా ఇలా చెప్పాడు: “ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము.” (సామెతలు 25:8) ఈ దుష్కృత్యము చేశాడని ఆరోపించబడినవాడు ఇంకా పిల్లలతో దుర్వ్యవహారం చేస్తున్నాడని అనుమానించే సరైన కారణాలేమైన ఉన్నట్లైతే, ఓ హెచ్చరికను ఇవ్వవల్సి ఉండవచ్చు. సంఘపెద్దలు ఆ విషయంలో సహాయపడగలరు. లేనట్లైతే, తొందరపడకండి. చివరికి, ఆ విషయాన్ని విడిచిపెట్టడంలో మీరు సంతృప్తి చెందగలరు. అయితే, దుష్కృత్యం చేశాడని ఆరోపించబడినవానితో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటే (రాగల ప్రతిస్పందనలను గూర్చి మీరు ఎలా భావిస్తున్నారన్న విషయాన్ని మొదట మీరు పరిశీలించిన తర్వాత) మీరు అలా చేసే హక్కు మీకుంది.

“జ్ఞాపకాలు” అనుభవించే వ్యక్తి స్వస్థతను పొందుతున్న సమయంలో కలతపర్చే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ఉదాహరణకు, తాను ప్రతిరోజూ చూసే స్త్రీగానీ పురుషుడుగానీ తనను పీడిస్తున్నట్లు స్పష్టమైన మానసిక స్వరూపాలను ఓ వ్యక్తి చూడవచ్చు. దీనితో వ్యవహరించేందుకు ఎలాంటి కట్టడలను స్థాపించేందుకు వీలు లేదు. “ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలెను గదా?” (గలతీయులు 6:5) కొన్నిసార్లు ఓ బంధువు లేక స్వంత కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇమిడియున్నారని మీరు భావించవచ్చు. దుష్కృత్యాన్ని చేశాడనే అనుమానిత వ్యక్తిని గుర్తించే విషయం వచ్చే సరికి, కొందరి “బాధాజనక జ్ఞాపకాల” సందేహాత్మక స్థితిని జ్ఞాపకముంచుకోండి. అలాంటి పరిస్థితిలో, విషయాలకు గట్టి రుజువులు దొరికేంతవరకు, కనీసం అప్పుడప్పుడు కుటుంబాన్ని దర్శించడం ద్వారా లేక ఉత్తరం వ్రాయడం ద్వారా లేక టెలిఫోన్‌ ద్వారా వారితో సంబంధం కల్గివుండాలి. అప్పుడు అది ఆ వ్యక్తి లేఖనాధారమైన పద్ధతిలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడని కనపరుస్తుంది.—ఎఫెసీయులు 6:1-3 పోల్చండి.

పెద్దలు ఏమి చేయగలరు?

పూర్వపు జ్ఞాపకాలు లేక “బాధాజనక జ్ఞాపకాలను” అనుభవించే సంఘ సభ్యుల్లోని ఒకరు పెద్దలను సమీపించినట్లైతే, వారికి సహాయపడేందుకు సాధారణంగా ఇద్దరు నియమించబడతారు. భావోద్రేకమైన వేదనను తాళుకునే విషయంపై ఈలోగా తమ దృష్టిని కేంద్రీకరించమని బాధననుభవిస్తున్నవారికి పెద్దలు దయతో ప్రోత్సాహాన్నివ్వాలి. “జ్ఞాపకం వచ్చిన” ఏ దుర్వ్యవహారకుని పేరునైనా పూర్తిగా రహస్యంగా ఉంచాలి.

పెద్దల ముఖ్యమైన పని కాపరులుగా ఉండడమే. (యెషయా 32:1, 2; 1 పేతురు 5:2, 3) ప్రత్యేకంగా వారు “జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును” ధరించుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. (కొలొస్సయులు 3:12) వారు దయతో విని, మరి లేఖనాలనుండి స్వస్థపర్చే మాటలను అన్వయించాలి. (సామెతలు 12:18) వేదనాత్మకమైన “జ్ఞాపకాలతో” బాధపడుతున్న కొందరు, క్రమంగా తమను దర్శించి లేక టెలిఫోన్‌ ద్వారా తాము ఎలా ఉన్నామో తెలుసుకునే పెద్దల ఎడల మెప్పును వ్యక్తపర్చారు. అలాంటి సంబంధానికి ఎక్కువ సమయం తీసుకోనవసరం లేదు, అయితే యెహోవా సంస్థ శ్రద్ధ వహిస్తుందని అవి కనపరుస్తాయి. క్రైస్తవ సహోదరులకు తన ఎడల హృదయపూర్వకమైన ప్రేమ ఉందని బాధననుభవించేవారు తెలుసుకున్నప్పుడు, తగుమాత్రపు భావోద్రేక సమతుల్యాన్ని పొందేందుకు అది అతనికి సహాయపడవచ్చు.

బాధననుభవించే వ్యక్తి నిందను మోపాలని నిర్ణయించినట్లైతే అప్పటి విషయమేమిటి?b అప్పుడు, మత్తయి 18:15 నందలి సూత్రం ప్రకారంగా ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ వ్యక్తిని సమీపించాలని ఇద్దరు పెద్దలు ఆయనకు సలహానివ్వవచ్చు. నిందించే వ్యక్తి ముఖాముఖిగా మాట్లాడే భావోద్రేక పరిస్థితిలో లేనప్పుడు, దాన్ని టెలిఫోన్‌ ద్వారా లేక బహుశ ఉత్తరం ద్వారా చేయవచ్చు. ఈ విధంగా ఆ వ్యక్తి యెహోవా ఎదుట తనపై మోపబడిన నిందకు జవాబుగా తన నిర్దోషత్వాన్ని తేటపర్చుకునే అవకాశం ఇవ్వబడుతుంది. బహుశ, తానట్టి అత్యాచారం చేయలేదనేందుకు అతను రుజువును కూడా అది అందించగల్గవచ్చు. లేక బహుశ నిందించబడిన వ్యక్తి తన తప్పును ఒప్పుకుని, తిరిగి సఖ్యతను పొందగలడు. అది ఎంతటి ఆశీర్వాదంగా ఉంటుంది! ఒకవేళ తప్పును ఒప్పుకున్నట్లైతే లేఖనాధారం సూత్రాలకనుగుణంగా ఇద్దరు పెద్దలు విషయాలతో వ్యవహరిస్తారు.

ఈ నింద ఖండించబడినట్లైతే, న్యాయపరంగా ఇంకేమీ చేయలేమని నిందించిన వ్యక్తికి ఆ పెద్దలు స్పష్టపర్చాలి. మరి నిందించబడిన వ్యక్తిని సంఘం నిరపరాధిగానే దృష్టిస్తుంది. న్యాయపరమైన చర్య గైకొనాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు అవసరమని బైబిలు చెబుతోంది. (2 కొరింథీయులు 13:1; 1 తిమోతి 5:19) అదే వ్యక్తి అత్యాచారం చేసినట్లుగా ఒక వ్యక్తి కంటే ఎక్కువ మందికి “జ్ఞాపకమున్నప్పటికీ,” ఇతర రుజువులు లేకుండ న్యాయపరమైన నిర్ణయాలను వాటిపై ఆధారితం చేసేందుకు ఇవి చాలా అనిశ్చయంగా ఉంటాయి. దాని భావం అలాంటి “జ్ఞాపకాలు” అబద్ధంగా దృష్టించబడుతున్నాయని (లేక అవి సత్యంగా దృష్టించబడుతున్నాయని) భావం కాదు. అయితే న్యాయపరమైన విధంలో ఓ విషయాన్ని స్థాపించేందుకు బైబిలు సూత్రాలను అనుసరించడం అవసరం.

నిందించబడిన వ్యక్తి తప్పిదాన్ని అంగీకరించపోయినప్పటికీ నిజంగా అతడు తప్పిదస్థుడైనట్లైతే అప్పటి విషయమేమిటి? దాని “శిక్షనుండి” అతను “తప్పించుకుంటాడా”? నిశ్చయంగా తప్పించుకోడు! అతనిపై ఉన్న తప్పిదం లేక నిర్దోషత్వం భద్రంగా యెహోవా చేతుల్లోకి విడిచిపెట్టబడగలదు. “కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారివెంట వెళ్లుచున్నవి.” (1 తిమోతి 5:24; రోమీయులు 12:19; 14:12) సామెతల గ్రంథం ఇలా చెబుతోంది: “నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.” “భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును.” (సామెతలు 10:28; 11:7) చివరికి, యెహోవా దేవుడు క్రీస్తుయేసులిరువురూ న్యాయంగా నిత్య తీర్పును తీరుస్తారు.—1 కొరింథీయులు 4:5.

అపవాదిని ఎదుర్కొనడం

శారీరక లేక భావోద్రేకమైన వేదన ఉన్నప్పటికీ సమర్పిత ప్రాణము సహించినప్పుడు, దేవుని ఎడల ప్రేమ మరియు వారి అంతర్శక్తికి అది ఎంతటి శ్రేష్ఠమైన రుజువు! మరియు వారు తాళుకునేలా యెహోవా ఆత్మ శక్తినిస్తుందనేందుకు అది ఎంత చక్కని సాక్ష్యం!—2 కొరింథీయులు 4:7 పోల్చండి.

పేతురు మాటలు అలాంటి వారికి అన్వర్తించబడతాయి: “విశ్వాసమందు స్థిరులై వానిని [సాతానును] ఎదురించుడి.” (1 పేతురు 5:9) అలా చేయడం సులభం కాకపోవచ్చు. కొన్నిసార్లు, స్పష్టంగానూ సహేతుకంగానూ ఆలోచించడం కూడా కష్టతరం కావచ్చు. కానీ నిరుత్సాహపడకండి! త్వరలోనే, అపవాది మరియు వాని కుతంత్రాలు ఇక ఉండనే ఉండవు. నిజంగా, “దేవుడు తానే . . . వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి” పోయే కాలం కొరకు మనం వేయికళ్లతో ఎదురుచూస్తాము.—ప్రకటన 21:3, 4.

[అధస్సూచీలు]

a మనకందరికీ వచ్చే సాధారణ జ్ఞాపకాలనుండి వాటిని భిన్నంగా చూపించేందుకు, “బాధాజనక జ్ఞాపకాలు” మరియు అలాంటి ఇతర పదాలను కొటేషన్‌ గుర్తుల మధ్య పెట్టడం జరిగింది.

b ఈ విషయం సంఘంలో అందరికీ తెలిసిపోయినట్లయితే కూడా, ఈ పేరాలో చెప్పబడిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి