భయం—ఇప్పుడు సర్వసాధారణమే కానీ నిత్యం కాదు!
దేవుని వాక్యాన్ని పఠించే వారు, భయం సర్వసాధారణమైపోయినందుకు ఆశ్చర్యపోవడంలేదు. యెహోవాసాక్షులు తమ పరిచర్యలో విస్తృతంగా ప్రకటించినట్లుగా, మానవ చరిత్రలో అతి గమనార్హమైన కాలంలో మనం జీవిస్తున్నామనేందుకు ఎంతో రుజువు ఉంది. బహువిస్తారమైన భయంతో అది గుర్తించబడిందని మీకు తెలుసు. అయితే ఎంతో కాలం క్రితమే యేసు మన కాలాన్ని గూర్చిన గుర్తులను చెప్పాడు లేక సూచించాడు. ఆయన తన ప్రత్యక్షతనుగూర్చి మరియు ఈ విధానాంతము లేక ‘లోకాంతము’ గూర్చి తన అపొస్తలులు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతున్నాడు.—మత్తయి 24:3.
యేసు ముందే చెప్పిన దానిలో కొంత భాగం ఇక్కడ ఉంది:
“జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును; అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును.”—లూకా 21:10, 11.
‘భయోత్పాతమైన దృశ్యాలను’ గూర్చి ఆయన వ్యాఖ్యానాన్ని మీరు గమనించారా? తర్వాత అదే జవాబులో, మీపై మరియు మీ ప్రియమైన వారిపై నేరుగాగానీ లేక నిర్ణయాత్మకంగాగానీ ప్రభావంచూపే మరో ప్రాముఖ్యమైన గమనికను యేసు చెప్పాడు. అయితే దానికి అవధానాన్నిచ్చేముందు, అంత్య దినాల్లో జీవిస్తున్నామనేందుకు గల మరికొన్ని రుజువులను మనం క్లుప్తంగా పునఃపరిశీలిద్దాము.—2 తిమోతి 3:1.
సమర్థనీయమైన యుద్ధ భయం
సైనిక వివాదాలు భూమిలోని అనేక భాగాలను వినాశనం చేసి మిగిల్చాయి. ఉదాహరణకు, జియో అనే పత్రిక ఇటీవల జరిగిన మధ్య ప్రాచ్య యుద్ధాంతానికల్లా మండుతూ మిగిలిన చమురు బావులను, “మానవులు తెచ్చిన అతి గొప్ప వాతావరణ విపత్తు”గా పేర్కొంది. యుద్ధాలు లక్షలాది ప్రజలను పొట్టనబెట్టుకున్నాయి లేక వికలాంగులను చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధంలోని సైనికులు మరియు పౌరులు మరణించడమే కాకుండ రెండవ ప్రపంచ యుద్ధంలో 5.5 కోట్ల మంది హతమయ్యారు. లోకాంతం సమీపంలో ఉందనే సూచనలో భాగంగా “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును” అని యేసు చెప్పాడని గుర్తుతెచ్చుకోండి.
జాతి నిర్మూలన అంటే యావత్ జాతులు లేక ప్రజల నాశనం చేసేందుకు మానవ ప్రయత్నాలను కూడా మనం పట్టించుకోకుండా ఉండలేము. లక్షలాది మంది అర్మేనియన్లు, కంబోడియా వారు, యూదులు, రువాండా వారు, యుక్రేనియన్లు మరియు ఇతరుల మరణాలు 20వ శతాబ్దంలో మానవజాతి రక్తాపరాధాన్ని అధికం చేశాయి. మతోన్మాదులు జాతిపరమైన ద్వేషాన్ని ప్రోత్సహించే దేశాల్లో ఈ నరమేధం కొనసాగుతోంది. అవును, ఇప్పటికీ యుద్ధాలు మానవ రక్తంతో భూమిని పూర్తిగా తడుపుతున్నాయి.
పోరాటం అంతమైనప్పటికీ ఆధునిక యుద్ధాలవల్ల ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు, భూ మందుపాతరలను అనాలోచితంగా పాతడాన్ని పరిగణనలోకి తీసుకోండి. మానవ హక్కుల పర్యవేక్షక పరిశోధనా సంస్థ నివేదించిన ప్రకారం, “ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల మందుపాతరలు ప్రజలను భయపెడుతూ ఉన్నాయి.” అలాంటి మందుపాతరలు ఉపయోగింపబడిన యుద్ధాలు ముగిసిన చాలా కాలం తర్వాత కూడా అమాయక స్త్రీపురుషులకు, పిల్లలకు అపాయకరంగా ఉంటున్నాయి. ప్రతి నెల 60 కంటే ఎక్కువ దేశాల్లో వేల కొలది ప్రజలు మందుపాతరలవల్ల వికలాంగులౌతున్నారు లేక చనిపోతున్నారు. ప్రాణాలకూ మరియు శరీరానికి తీవ్రమైన హాని కల్గించే ముప్పు ఎందుకు క్రమంగా తీసివేయబడదు? ద న్యూయార్క్ టైమ్స్ ఇలా పేర్కొంది: “ప్రతి రోజు మందుపాతరలను నిర్వీర్యం చేసే సంఖ్యకన్నా వాటిని పాతే సంఖ్యే ఎక్కువగా ఉంది, కనుక మరణించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.”
ఈ మందుపాతర్ల అమ్మకం, “సంవత్సరానికి 20 కోట్ల డాలర్ల” వ్యాపారమైందని 1993 వార్తాపత్రికలోని శీర్షిక నివేదించింది. అందులో, “340 వివిధ రకాల” మందుపాతర్ల “వ్యాపారం ఎగుమతి చేసే 48 దేశాలందు సుమారు 100 కంపెనీలు మరియు ప్రభుత్వాల ఏజెన్సీలు” ఉన్నాయి. మరీ క్రూరంగా, కొన్ని మందుపాతర్లు పిల్లలకు ఆకర్షణీయంగా కనిపించేట్లు తయారు చేయబడ్డాయి! హాని కలిగించేందుకు మరియు చంపేందుకు బుద్ధిపూర్వకంగా అమాయకులైన పిల్లలను గురిచేయడం ఊహించుకోండి! “పది కోట్ల భయంకరమైన రహస్య ప్రేలుడు పదార్థాలు” అనే అంశంగల సంపాదకీయం, ఈ మందు పాతర్లు “రసాయనిక, జీవ సంహారక మరియు అణు యుద్ధాలకంటే ఎక్కువ మంది ప్రజలను చంపాయి లేక వికలాంగులను చేశాయి” అని తెలియజేసింది.
ప్రపంచ మార్కెట్లో అమ్ముడుపోయే మరణకరమైన వస్తువుల్లో మందుపాతర్లు మాత్రమే లేవు. ఆయుధాలను అమ్మే పేరాశపరులైన విక్రయదారులు భూవ్యాప్తంగా అనేక కోట్ల డాలర్ల వ్యాపారాన్ని చేస్తున్నారు. రక్షణ సమాచార కేంద్రంవారు ప్రచురించిన ది డిఫెన్స్ మానిటర్ ఇలా నివేదిస్తున్నది: “గత దశాబ్దమంతటిలోనూ [ఓ ప్రముఖ దేశం] 13,500 కోట్ల డాలర్ల విలువగల ఆయుధాలను ఎగుమతి చేసింది.” ఈ శక్తివంతమైన దేశం, “6,300 కోట్ల డాలర్ల విలువగల ఆయుధాల అమ్మకానికి, సైనిక నిర్మాణానికి మరియు 142 దేశాల శిక్షణకు” అధికారాన్నిచ్చింది. ఆ విధంగా భవిష్యత్ యుద్ధానికీ మరియు మానవ వ్యధకు విత్తనాలు విత్తబడ్డాయి. ది డిఫెన్స్ మానిటర్ ప్రకారం, “కేవలం 1990లోనే 50 లక్షలమంది ప్రజలకు యుద్ధాలకొరకు ఆయుధ శిక్షణ ఇవ్వబడింది, దానికి 5,000 కోట్ల డాలర్లకంటే ఎక్కువ ఖర్చయింది మరియు 2.5 లక్షలమంది ప్రజలు మరణించారు వారిలో అనేకులు పౌరులే.” ఆ సంవత్సరం నుండి లక్షలాదిమందికి భయాన్ని మృత్యువును తెస్తూ చెలరేగిన అనేక యుద్ధాలను గూర్చి మీరు తప్పక జ్ఞాపకం చేసుకోగలరు!
భూమిని దానిలోని జీవాన్ని మరింత పాడుచేయడం
ప్రొఫెసర్ బారీ కమ్మోనర్ ఇలా హెచ్చరిస్తున్నారు: “ఎడతెగని భూ కాలుష్యాన్ని పట్టించుకోకపోతే, మానవులు జీవించే స్థలంగా ఉండగల ఈ గ్రహానికివున్న యోగ్యతను అది నాశనం చేస్తుందని నేను నమ్ముతున్నాను.” అసలు సమస్య విషయాలు తెలియకపోవడం కాదు గానీ బుద్ధిపూర్వకమైన దురాశేనని ఆయన ఇంకా చెప్పాడు. మన న్యాయవంతుడైన ప్రేమపూర్వకమైన దేవుడు ఎక్కువ కాలం వరకు ఈ పరిస్థితిని సహించి, అధికమౌతున్న కాలుష్య భయాన్ని మనం అనుభవించేందుకు విడిచిపెడతాడా? భూమి దోచుకోబడడం, దోపిడీదారులు లెక్క ఒప్పజెప్పేందుకు మరియు ఆ తర్వాత ఆ గ్రహపు దైవిక పునరావాసానికి పిలుపునిస్తుంది. ‘లోకాంతము’ను గూర్చి అపొస్తలులకు యేసు చెప్పిన జవాబులో అది ఒక భాగం.
దేవుడు ఆ తీర్పును ఎలా తీరుస్తాడో పరిశీలించేముందుగా, మానవ చరిత్రను గూర్చి మనం మరికాస్త పరిశీలిద్దాం. మలినపర్చే మానవుని పనులను గూర్చిన ఓ చిన్న పట్టికను చూసినప్పటికీ అదెంతో విషాదకరంగా ఉంటుంది: సమస్త అడవులను ధ్వంసం చేసే ఆమ్లవర్షం మరియు దురాశతో చెట్లు నరికివేయడం; అణ్వస్త్ర వ్యర్థపదార్థాన్ని, విషపూరితమైన రసాయనాలనూ మరియు ముడి వ్యర్థపదార్థాన్ని నిర్లక్ష్యంగా పారేయడం; రక్షణకరమైన ఓజోను తెరను బలహీనపర్చడం; మరియు వృక్షసంహారక మందులు మరియు క్రిమి సంహారక మందులు నిర్లక్ష్యంగా ఉపయోగించడం జరుగుతుంది.
వాణిజ్య ఆసక్తులు, లాభంపొందే మరో రకంగా భూమిని మలినపరుస్తున్నాయి. ప్రతి దినం టన్నుల కొలది వ్యర్థపదార్థం నదుల్లో మహాసముద్రాల్లో, గాలిలో మరియు భూమ్మీద పారేయబడుతున్నాయి. అలంకారికంగా చెప్పాలంటే, శాస్త్రజ్ఞులు ఆకాశంలోకి అంతరిక్ష చెత్తను పారేస్తూ ఆ తర్వాత ఏరకుండా వాటితో దాన్ని నింపేస్తున్నారు. భూమి చుట్టూ వేగంగా చెత్తతో నిండిన భూకక్ష్య ఏర్పడుతోంది. భూమి దానంతటదే నూత్నపర్చుకునే సహజ విధానాన్ని దేవుడు గనుక దానిలో పెట్టకపోయివుంటే, మన భూ గృహం జీవం కొనసాగేందుకు అనుమతించేది కాదు మరియు మానవుడు తన మురికి కూపంలో తానే ఎప్పుడో ఉక్కిరిబిక్కిరి అయ్యుండేవాడు.
మానవుడు తనను తాను కూడా కలుషితపర్చుకుంటున్నాడు. ఉదాహరణకు, పొగాకు మరియు ఇతర మాదక ద్రవ్యాలను తీసుకోండి. అమెరికాలో అలాంటి పదార్థాల దుర్వినియోగం, “రాష్ట్రంలోని ప్రప్రధమ ఆరోగ్య సమస్య”గా పేర్కొనబడింది. ఆ దేశానికి అది సంవత్సరానికి 23,800 కోట్ల డాలర్ల ఖర్చు అవుతుంది, దానిలో 3,400 కోట్ల డాలర్లు “అనవసరమైన [అంటే నివారించగల] ఆరోగ్య సంరక్షణపై” ఖర్చు చేయబడుతోంది. మీరు జీవించే ప్రాంతంలో, ఇటు డబ్బు రూపంలోనూ అటు జీవం రూపంలోనూ పొగాకు మూల్యమెంతైవుండవచ్చు?
అనేకులు హక్కు అని వారించే అదుపులేని మరియు ఉల్లంఘనీయమైన జీవిత విధానాలు మరణకరమైన లైంగికంగా సంక్రమించే వ్యాధుల యొక్క భయానక కోతను కోసింది, అది అనేకులను ఎంతో ముందే కాటికి చేర్చింది. నగరాల్లోని ప్రముఖ వార్తాపత్రికల్లోని మరణించినవారి సంస్మరణ కాలమ్లలో, 30 నుండి 40 వయస్సుకు మధ్య ఉన్నవారి మరణాల సంఖ్య పెరిగిందని గమనించబడింది. ఎందుకు? ఎందుకంటే తరచూ వినాశనకరమైన అలవాట్లు చివరికి వారిని కబళించివేస్తాయి. లైంగిక వ్యాధులు మరియు ఇతర వ్యాధులు అధికమవ్వడం యేసు ప్రవచనానికి సరిగ్గా సరిపోతుంది, ఎందుకంటే “అక్కడక్కడ తెగుళ్లు తటస్థించును” అని ఆయన అన్నాడు.
అయితే, అతి ఘోరమైన కాలుష్యం మానవుని మనస్సు మరియు ఆత్మలో లేక దృక్పథంలో ఉంది. ఇంతవరకు మేము ప్రస్తావించిన మలినాన్ని గూర్చి మీరు ఆలోచించినట్లైతే, వాటిలో అనేకం కలుషితమైన మనస్సునుండే కల్గిందనడం నిజంకాదా? మలినమైన మనస్సులుగల వారు ఒకరిపై మరొకరు జరిపే అత్యాచారాలూ దొంగతనాలూ మరియు ఇతర విధాలైన దుర్మార్గతలను తెచ్చిన నష్టాన్ని పరిశీలించండి. అంతేకాకుండ, ప్రతి సంవత్సరం జరుగుతున్న లక్షలకొలది గర్భస్రావాలు, మానసిక మరియు ఆత్మీయ కాలుష్యానికి సూచనగా ఉందని అనేకులు గుర్తిస్తున్నారు.
యౌవనుల దృక్పథంలో మనమెంతో చూస్తాము. తలిదండ్రులయెడల మరియు ఇతర అధికారంయెడల అగౌరవం కుటుంబ విచ్ఛిన్నానికి మరియు నియమ నిబంధనలను అతిక్రమించేందుకు దోహదమౌతుంది. యౌవనులకు ఆత్మీయత లేకపోవడం, అధికారానికి ఆరోగ్యదాయకమైన భయానికి నేరుగా సంబంధం కల్గివుంది. కనుక పరిణామ సిద్ధాంతాన్ని, నాస్తిక వాదాన్ని మరియు విశ్వాసాన్ని తీసివేసే ఇతర సిద్ధాంతాలను బోధించేవారిపై కూడా ఎంతో దోషం ఉంది. అధునాతమైనవారిగానూ “మంచి స్థాయి” గలవారిగానూ అంగీకరించబడాలనే తమ ప్రయత్నంలో దేవునికి విరుద్ధంగా తిరిగిన అనేకమంది మత బోధకులు కూడా దోషులే. వారు మరియు లోక జ్ఞానం ఎంతో ఉన్న ఇతరులూ విరుద్ధమైన మానవ సిద్ధాంతాలను బోధిస్తున్నారు.
ఫలితాలు నేడు స్పష్టంగా ఉన్నాయి. దేవుని ఎడల లేక పొరుగువారి ఎడల ప్రేమవల్ల ప్రజలు కదిలించబడలేదుగానీ, దురాశ ద్వేషం వల్ల కదిలించబడుతున్నారు. దాని చెడు ఫలితాలు విస్తారమైన అనైతికత, దౌర్జన్యం మరియు నిరాశలే. విషాదకరంగా, అందులో మానవుడు తన్ను తాను నాశనం చేసుకుంటాడేమో మరియు ఈ గ్రహాన్ని నాశనం చేస్తాడేమో అనే భయం యథార్థమైన ప్రజల భయానికి కారణమౌతోంది.
అది విషమిస్తుందా మెరుగుపడుతుందా?
భయం విషయంలో సమీప భవిష్యత్తులో మనకు ఏమి జరుగబోతోంది? భయం పెరుగుతూనే ఉంటుందా, లేక అది అధిగమించబడుతుందా? యేసు తన అపొస్తలులకు చెప్పిన వాటిని మనం మరలా గమనిద్దాము.
సమీప భవిష్యత్తునందున్న ఒక విషయాన్ని ఆయన సూచించాడు—మహా శ్రమ. ఆయన మాటలు ఇలా ఉన్నాయి: “ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.”—మత్తయి 24:29, 30.
కనుక త్వరలోనే మహా శ్రమ ప్రారంభమౌతుందని మనం నిరీక్షించవచ్చు. దానిలోని మొదటి భాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధ మతంపై పగతీర్చుకోవడం జరుగుతుందని ఇతర బైబిలు ప్రవచనాలు సూచిస్తున్నాయి. ఇంతకు క్రితమే సూచించిన అకస్మాత్ పరిణామాలు వస్తాయి దానిలో ఒక రకమైన అంతరిక్ష్య సంభ్రమాశ్చర్య సంఘటన కూడా ఇమిడివుంటుంది. కోట్లకొలది ప్రజలపైన దాని ప్రభావం ఏమైవుంటుంది?
యేసు ఇచ్చిన జవాబుకు సమాంతరమైన వృత్తాంతాన్ని పరిశీలించండి, అక్కడ మనం విపులీకరించబడిన ప్రవచన వ్యాఖ్యానాలను కనుగొంటాం:
“సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.”—లూకా 21:25, 26.
మన భవిష్యత్తునందు అదే ఉంది. అయితే, మానవుల్లో అందరూ మూర్ఛిల్లేంతగా భయపడరు. దానికి భిన్నంగా యేసు ఇలా చెప్పాడు: “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.”—లూకా 21:28.
ఆ ప్రోత్సాహకరమైన మాటలను ఆయన తన నిజమైన అనుచరులతో చెప్పాడు. భయం వల్ల మూర్ఛిల్లబడకుండా లేక దెబ్బతినకుండా, మహా శ్రమ అంతం సమీపంలో ఉందని తెలుసుకున్నప్పటికీ, వారు ధైర్యంగా తమ తలలనెత్తుకునేందుకు వారికి కారణముంటుంది. ఎందుకు భయముండదు?
ఎందుకంటే ‘మహా శ్రమలను’ సంపూర్ణంగా తప్పించకునేవారుంటారని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (ప్రకటన 7:14) దీన్ని వాగ్దానం చేసిన ఈ వృత్తాంతం, మనం ఒకవేళ ఆ తప్పించుకున్నవారిలో ఉన్నట్లైతే, మనం దేవుని హస్తం నుండి అసమాంతరమైన ఆశీర్వాదాలను అనుభవించవచ్చని చెబుతోంది. యేసు, “జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును” అన్న అభయంతో అది ముగుస్తుంది.—ప్రకటన 7:16, 17.
అలాంటి ఆశీర్వాదాలను అనుభవించేవారు—వారిలో మనం కూడా ఉండవచ్చు, నేటి ప్రజలను పీడించే భయాన్ని వారు కల్గివుండరు. అయితే దాని భావం వారికి ఎలాంటి భయమనేదే ఉండదనికాదు ఎందుకంటే మంచిదైన మరియు ఆరోగ్యదాయకమైన భయముందని బైబిలు కచ్చితంగా చూపిస్తోంది. తదుపరి శీర్షిక ఇది ఏమిటోనని మరియు అది మనపై ఎలా ప్రభావం చూపుతుందని పరిశీలిస్తుంది.
[8వ పేజీలోని చిత్రం]
యెహోవా ఆరాధికులు సమీపించే నూతన లోకం కొరకు ఆనందంగా ఎదురుచూస్తున్నారు
[7వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pollution: Photo: Godo-Foto; rocket: U.S. Army photo; trees burning: Richard Bierregaard, Smithsonian Institution