కాథార్‌లు—వారు క్రైస్తవ హతసాక్షులైయుండిరా?
“వారినందరిని చంపండి; దేవుడు తన స్వంత వారిని గుర్తిస్తాడు.” దక్షిణ ఫ్రాన్సునందలి బిజెర్స్ జనాబా 1209లో ఆ వేసవికాల దినాన సంహరించబడింది. కాథోలిక్ మతయుద్ధ నాయకునిగాను, పోపు ప్రతినిధిగాను నియమింపబడిన అర్‌నాల్డ్ అమాల్‌రిక్ అనే క్రైస్తవ సన్యాసి ఏమాత్రం దయ చూపించలేదు. కాథోలిక్కులెవరో ధర్మవిరోధులెవరో ఎలా గుర్తించాలని అతని మనుష్యులు అడిగినప్పుడు, అతడు పైన ఉదాహరించబడిన అపవాదకరమైన సమాధానాన్నిచ్చినట్లు తెలిసింది. కాథోలిక్ చరిత్రకారులు దాన్నిలా తగ్గించి చెబుతారు: “చింతించకండి. కేవలం కొద్దిమందే మారతారని నేననుకుంటున్నాను.” అతని కచ్చితమైన సమాధానం ఏదైనప్పటికీ దాని ఫలితం ఏమిటంటే, కాథోలిక్ చర్చి ఉన్నత మతాధికారుల నడిపింపు క్రింద 3,00,000 మంది మతయోధుల చేతుల్లో కనీసం 20,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు హతమార్చబడ్డారు.
దేనివల్ల ఈ జనసంహారం జరిగింది? అది, ధర్మవిరోధులని పిలువబడిన వారికి వ్యతిరేకంగా మూడవ పోపు ఇన్నొసెంట్ దక్షిణ-మధ్య ఫ్రాన్సులోని లాంగెడాక్ ప్రదేశంలో ఏర్పాటు చేసిన అల్బిజెన్సుల మత యుద్ధం యొక్క ప్రారంభం మాత్రమే. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత అది ముగియక ముందు బహుశా పది లక్షలమంది ప్రజలు—కాథార్‌లు, వాల్దెన్స్‌లు, చివరికి అనేకమంది కాథోలిక్కులు—తమ ప్రాణాలు కోల్పోయారు.
మధ్యయుగంనాటి ఐరోపాలో మతసంబంధమైన వ్యతిరేకత
సా.శ పదకొండవ శతాబ్దమందు వ్యాపార రంగంలో ఏర్పడిన సత్వర అభివృద్ధి మధ్యయుగంనాటి ఐరోపా యొక్క సాంఘిక మరియు ఆర్థిక ఏర్పాట్లలో గొప్ప మార్పులను తెచ్చింది. పెరిగిపోతున్న చేతిపనివారికి, దుకాణాదారులకు వసతి కల్పించేందుకు పట్టణాలు ఉద్భవించాయి. ఇది క్రొత్త తలంపులకు అవకాశాన్నిచ్చింది. ఐరోపా అంతటిలో మరెక్కడా లేనంతగా, చెప్పుకోదగినంత సహనంగల, ఆధునిక నాగరికత వర్ధిల్లిన లాంగెడాక్‌లో మతసంబంధమైన వ్యతిరేకత వ్రేళ్లూనింది. లాంగెడాక్‌లోని టౌలూస్ నగరం ఐరోపానందలి సంపన్న నగరాలలో మూడవది. అది సంచారకవులు (ట్రాబేడర్స్) వర్ధిల్లిన కాలం, వారిలో కొందరి గేయాలు రాజకీయ, మతసంబంధ అంశాలను ప్రస్తావించాయి.
పదకొండు, పన్నెండు శతాబ్దాలలోని మత పరిస్థితిని వివరిస్తూ రెవ్యూ డి హిస్టోరె ఎట్ డె ఫిలోసోఫీ రెలిజోసిస్ (చరిత్ర మరియు మతసంబంధమైన సిద్ధాంతాల పునఃపరిశీలన) ఇలా తెలియజేసింది: “మునుపటి శతాబ్దంలోవలెనే 12వ శతాబ్దంలో కూడా మతనాయకుల నైతికతలు, వారి సంపన్నత, వారి అవినీతి, వారి లైంగిక దుర్నీతి ప్రశ్నించబడుతూనే ఉన్నాయి, కాని వారి సంపద మరియు అధికారం, లౌకిక అధికారులతో వారు కుమ్మక్కవ్వడం, వారి నీచత్వం సూత్రానుసారంగా విమర్శించ బడ్డాయి.”
సంచార ప్రచారకులు
చర్చిలోని విస్తారమైన అవినీతికి కారణం, ప్రత్యేకంగా దక్షిణ ఫ్రాన్సులో మరియు ఉత్తర ఇటలీలో వ్యతిరేకుల సంఖ్య, సంచార ప్రచారకుల సంఖ్య అధికమవ్వడమని మూడవ పోపు ఇన్నొసెంట్ కూడా గుర్తించాడు. వీరిలో అత్యధికులు కాథార్‌లు లేక వాల్డెన్స్‌లు. ప్రజలకు బోధించనందుకు ఆయన ప్రీస్టులను ఇలా నిందించాడు: “మీరు ప్రజలతో పంచుకోవడానికి ఇష్టపడని ఆత్మీయాహారం వారికి కొదువగా ఉంది.” అయితే, ప్రజలకు బైబిలు విద్యను వ్యాప్తి చేసేబదులు, “దైవిక లేఖనాలు ఎంత జ్ఞానవంతమైనవంటే, కేవలం అల్ప నిరక్ష్యరాస్యులకేకాదు, తెలివైన విద్యావంతులైన వారికి కూడా దాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించే పూర్తి సామర్థ్యం లేదు” అని ఇన్నొసెంట్ ఆరోపించాడు. మత నాయకులు తప్ప ఇతరులు బైబిలును చదవడం నిషేధించబడింది, వారు కూడా లాటిన్‌లో మాత్రమే చదవడానికి అనుమతించబడేవారు.
వ్యతిరేకుల సంచార ప్రచారాన్ని నిరర్థకం చేసేందుకు, సన్యాసి ప్రచారకులను లేక డొమినికన్లను కనుగొనడాన్ని పోపు ఆమోదించాడు. సంపన్నమైన కాథోలిక్ మతనాయకులకు భిన్నంగా, ఈ సన్యాసులు దక్షిణ ఫ్రాన్సులో “ధర్మవిరోధులకు” వ్యతిరేకంగా కాథోలిక్ మతాన్ని కాపాడేందుకు నియమింపబడిన ప్రయాణ ప్రచారకులై ఉంటారు. కాథార్‌లతో తర్కించి, వారిని మళ్లీ కాథోలిక్ గుంపులోకి తీసుకురావడానికి పోపు తన ప్రతినిధులుగా నియమింపబడిన మతగురువులను కూడా పంపించాడు. ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి అలాగే అతని ప్రతినిధులలో ఒకరు బహుశా ధర్మవిరోధి చేతుల్లో చంపబడ్డాడు గనుక, 1209లో అల్బిజెన్సుల మత యుద్ధం జరగాలని మూడవ ఇన్నొసెంట్ ఆజ్ఞాపించాడు. అల్బి అనే పట్టణంలో ప్రాముఖ్యంగా కాథార్‌లు అధిక సంఖ్యలో ఉండేవారు కాబట్టి చర్చి వృత్తాంతాలు కాథార్‌లను అల్బిజెన్సులని (ఫ్రెంచ్, అల్బిజియోయిస్) సూచించాయి, ఆ ప్రాంతంలో ఉన్న వాల్డెన్స్‌లతో సహా “ధర్మవిరోధు”లందరిని సూచించడానికీ ఆ పదాన్నే ఉపయోగించాయి. (క్రిందవున్న పేజీలోని బాక్సును చూడండి.)
కాథార్‌లు ఎవరై ఉండిరి?
“కాథార్” అనే పదం కా·థో·రోస్ అనే గ్రీకు పదం నుండి వస్తుంది, దానికి “స్వచ్ఛమైన” అని భావం. పదకొండవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు కాథారిసమ్ ప్రాముఖ్యంగా లొంబార్డీ, ఉత్తర ఇటలీ, లాంగెడాక్‌లలో వ్యాపించింది. కాథార్‌ల విశ్వాసాలు బహుశా విదేశీ వ్యాపారులు మరియు మిషనరీలచే దిగుమతి చేయబడిన తూర్పుదేశాల ద్వందవాదం మరియు ఆత్మజ్ఞానవాదాల మిశ్రమం. కాథార్ ద్వందవాదం “రెండు సూత్రాల”లో విశ్వాసముంచేదని, “ఒకటి మంచి, ఇది ఆత్మీయమైన వాటన్నిటినీ నడిపించేదని, మరొకటి చెడు, మనిషి శరీరంతో సహా వస్తుదాయక ప్రపంచానికి ఇది కారణమని” ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రెలీజన్ నిర్వచిస్తుంది. మార్చలేని విధంగా నాశనానికి నిర్ణయించబడిన వస్తుదాయక లోకాన్ని సాతాను సృష్టించాడని కాథార్‌లు నమ్మేవారు. వస్తుదాయక చెడు లోకం నుండి తప్పించుకోవాలన్నది వారి నిరీక్షణ.
కాథార్‌లు రెండు వర్గాలుగా విభాగింపబడ్డారు, పరిపూర్ణులు, విశ్వాసులు. కన్సోల్‌మెంటమ్ అని పిలువబడే ఆత్మీయ బాప్తిస్మమనే ఆచారాన్ని ఆచరించడం ద్వారా పరిపూర్ణులు తయారయ్యేవారు. ఒక సంవత్సరం శిక్షణ తర్వాత వారిపై చేతులుంచడం ద్వారా ఇది నిర్వహించబడేది. ఈ ఆచారం అభ్యర్థిని సాతాను పరిపాలన నుండి విడుదలచేసి, పాపాలన్నిటి నుండి అతన్ని పవిత్రున్ని చేసి, పరిశుద్ధాత్మనిస్తుందని భావించబడేది. ఇది “పరిపూర్ణులు” అనే హోదాను ఉత్పన్నం చేసింది, ఇది విశ్వాసులకు పరిచారకులుగా పనిచేసే, సాపేక్షంగా చిన్న ప్రత్యేకమైన గుంపుకు వర్తిస్తుంది. పరిపూర్ణులు సౌఖ్యాన్ని త్యజించడం, యథార్థత, దారిద్ర్యతల గురించి ప్రతిజ్ఞ చేసేవారు. వివాహితులైతే పరిపూర్ణులైన అతడుగాని ఆమెగాని తన జతను విడిచిపెట్టవలసి ఉంటుంది, ఎందుకంటే లైంగిక సంపర్కమే ప్రాథమిక పాపమని కాథార్‌లు విశ్వసించేవారు.
విశ్వాసులంటే సన్యాసి జీవన విధానాన్ని అవలంబింపక పోయినప్పటికీ, కాథార్ బోధలను అంగీకరించిన వ్యక్తులు. మెల్యోరమెంటమ్ అని పిలువబడే ఒక ఆచారంలో పరిపూర్ణుల ఎడల గౌరవంతో మోకరించడం ద్వారా విశ్వాసి క్షమాపణను, ఆశీర్వాదాన్ని కోరుతాడు. తాము మామూలు జీవితాలు గడపడానికి సహాయపడేందుకు విశ్వాసులు పరిపూర్ణులతో ఒక కాన్‌వెనెన్‌జా లేక ఒప్పందం కుదుర్చుకున్నారు, దాని ప్రకారం వారు మరణ శయ్యపై ఆత్మీయ బాప్తిస్మం లేక కన్సోల్‌మెంటమ్ పొందేవారు.
బైబిలు ఎడల వారి దృక్పథం
కాథార్‌లు తరచూ బైబిలును ఉదాహరించినప్పటికీ, వారు దాన్ని ప్రాథమికంగా కట్టుకథలకు, పురాణాలకు మూలంగా దృష్టించేవారు. హెబ్రీ లేఖనాలలోని ఎక్కువ భాగం అపవాది నుండి వచ్చినవని వారు భావించేవారు. తమ ద్వంద సిద్ధాంతాన్ని బలపర్చుకోవడానికి, ఆత్మకు శరీరానికి ఉన్న వ్యత్యాసాన్ని చూపించే లేఖనాల వంటి గ్రీకు లేఖనాల భాగాలను వారు ఉపయోగించేవారు. వారు ప్రభువు ప్రార్థనలో “మా అనుదినాహారం” అని ప్రార్థించే బదులు “మా అవాస్తవమైన ఆహారం” (అంటే “ఆత్మీయాహారం” అని భావం) అని ప్రార్థించేవారు, వారి దృష్టిలో భౌతిక సంబంధమైన ఆహారమనేది అనివార్యమైన చెడు విషయం.
కాథార్‌ల బోధలనేకం బైబిలుకు పూర్తి వ్యతిరేకంగా ఉండేవి. ఉదాహరణకు, వారు ఆత్మ అమరత్వాన్ని పునర్‌జన్మను విశ్వసించేవారు. (ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4, 20 పోల్చండి.) వారు అప్రమాణిక లేఖనాల ఆధారంగా కూడా తమ నమ్మకాలను ఏర్పర్చుకొనేవారు. అయినప్పటికీ, కాథార్‌లు లేఖన భాగాలను ఇతర భాషల్లోకి తర్జుమా చేసినంతమేరకు, చాలా వరకు, మధ్య యుగాల్లో బైబిలు అందరికీ సుపరిచిత పుస్తకమయ్యేలా వారు చేశారు.
క్రైస్తవులు కాదు
పరిపూర్ణులు తాము న్యాయంగా అపొస్తలుల వారసులమని భావించేవారు, తత్ఫలితంగా వారు తమను తాము “క్రైస్తవుల”ని పిలుచుకుంటూ, “నిజమైన” లేక “మంచి” అనే పదాలు జతచేయడం ద్వారా వారు దీన్ని నొక్కి తెలియజేశారు. అయితే వాస్తవానికి కాథార్‌ల అనేక నమ్మకాలు క్రైస్తవత్వానికి వెలుపలివే. కాథార్‌లు యేసును దేవుని కుమారునిగా గుర్తించినప్పటికీ, ఆయన శరీరం దాల్చి రావడాన్ని, ఆయన విమోచనా బలిని వారు నిరాకరించారు. శరీరాన్ని, లోకాన్ని బైబిలు ఖండించడాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ భౌతిక పదార్థమంతా చెడునుండి ఉద్భవించిందేనని వారు భావించేవారు. యేసు కేవలం ఆత్మీయ శరీరాన్ని మాత్రమే కలిగివుండగలడని, ఆయన భూమ్మీదికి వచ్చినప్పుడు మాత్రం భౌతిక శరీరం ఉన్నట్లుగా కనిపించివుంటాడని వారు తలంచారు. మొదటి శతాబ్దపు అబద్ధ క్రైస్తవులవలె, కాథార్‌లు “యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని” వారు.—2 యోహాను 7.
మిడీవల్ హియర్‌సే అనే తన పుస్తకంలో ఎమ్. డి. లాంబెర్ట్, కాథారిసమ్ “తప్పనిసరి సన్యాసత్వం ద్వారా క్రైస్తవ నైతికత స్థానాన్ని ఆక్రమించింది, . . . [క్రీస్తు మరణం యొక్క] రక్షించే శక్తిని అంగీకరించేందుకు నిరాకరించడం ద్వారా విమోచనను నిర్మూలించింది” అని వ్రాశాడు. పరిపూర్ణులకు తూర్పుదేశాల సన్యాసి బోధకులతో, చైనా మరియు భారత దేశంలోని బౌద్ధ సన్యాసులతో, ఫకీర్లతో అలాగే సోదె సంబంధమైన నిపుణులతో, లేక తొలిక్రైస్తవ సన్యాస సంబంధ బోధకులతో నిజమైన బాంధవ్యాలున్నాయని ఆయన భావిస్తున్నాడు. కాథార్‌ల నమ్మకం ప్రకారం రక్షణ యేసుక్రీస్తు యొక్క విమోచన క్రయధన బలి ఆధారంగా కాదు గాని కన్సోల్‌మెంటమ్ లేక పరిశుద్ధాత్మలోకి బాప్తిస్మం తీసుకోవడం ద్వారానే కలుగుతుంది. అలా పవిత్రం చేయబడినవారికి, మరణం భౌతిక పదార్థం నుండి విముక్తిని తెస్తుంది.
ఒక అపవిత్ర మత యుద్ధం
బలవంతంగా డబ్బులాగడానికి అలవాటుపడిన మతనాయకుల కోరికలు మరియు వారి విపరీత పతనం వల్ల విసుగు చెందిన సామాన్య ప్రజలు కాథార్ల జీవన విధానంవైపు ఆకర్షితులయ్యారు. కాథోలిక్ చర్చిని దాని అధికార ఏర్పాటును ప్రకటన 3:9 మరియు 17:5 నందు చెప్పబడిన “సాతాను సమాజ”మని “వేశ్యలకు . . . తల్లి” అని పరిపూర్ణులు గుర్తించారు. కాథారిసమ్ వర్ధిల్లుతూ, దక్షిణ ఫ్రాన్సులోని చర్చి స్థానాన్ని చేజిక్కించుకుంటున్నది. అల్బిజెన్సుల మత యుద్ధం అని పిలువబడిన దాన్ని ప్రారంభించి, దానికి ఆర్థిక సహాయాన్నివ్వాలని మూడవ పోపు ఇన్నొసెంట్ తలంచాడు, అది క్రైస్తవులమని చెప్పుకుంటున్న ప్రజలకు వ్యతిరేకంగా క్రైస్తవమత సామ్రాజ్యంలోనే ఏర్పాటు చేయబడిన మొదటి మత యుద్ధం.
పోపు ఉత్తరాలు మరియు రాయబారుల ద్వారా ఐరోపాలోని కాథోలిక్ రాజులను, ప్రభువులను, సైన్యాధికారులను, సైనిక యోధులను హింసించాడు. “ఏవిధంగానైనా” భిన్నమతావలంబనను నిర్మూలించడానికి పోరాడే వారందరికీ లాంగ్‌డాక్ యొక్క విలాసాలను, సంపదలను ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన విన్నపం అలక్ష్యం చేయబడలేదు. కాథోలిక్ ఉన్నత మతాధికారులు మరియు క్రైస్తవ సన్యాసుల ఆధ్వర్యం క్రింద ఉత్తర ఫ్రాన్సు, ఫ్లాండర్స్ మరియు జర్మనీ నుండి మతయుద్ధం చేసేవారి మిశ్రమ సైన్యం దక్షిణంగా క్రిందికి రోన్ లోయ వైపుకు ప్రయాణించింది.
అగ్ని రక్తాల ఉన్మత్తతలో లాంగెడాక్‌ను నాశనం చేసినటువంటి విజయం కొరకైన యుద్ధం ప్రారంభం కావడానికి బిజెర్ల నిర్మూలన కారణమైంది. ఆల్బీ, కారాకాస్సోన్, కాసెస్, ఫోక్స్, నార్‌బోన్, టెర్‌మెస్, టాలౌస్ వంటి ప్రాంతాలన్నీ రక్తదాహంగల మతయోధుల స్వాధీనమయ్యాయి. కాస్సెస్, మినర్‌వే, లావొర్‌లవంటి రక్షణ దుర్గాలలో వందలాదిమంది పరిపూర్ణులు మ్రానుపై కాల్చబడ్డారు. క్రైస్తవ సన్యాసుల చరిత్రకారుడైన పెయర్ డెస్ వాక్స్‌డిసెర్నే చెప్పినదాని ప్రకారం, మతయోధులు ‘తమ హృదయాల్లో ఆనందంతో పరిపూర్ణులను సజీవంగా దహించారు.’ ఇరవై సంవత్సరాల కలహం మరియు నాశనం తర్వాత, 1229లో లాంగెడాక్ ఫ్రెంచి పరిపాలన క్రిందికి వచ్చింది. కాని వధ ఇంకా ముగియలేదు.
మతవిచారణ చావుదెబ్బ కొట్టడం
సాయుధ పోరాటానికి మద్దతునిచ్చేందుకు 1231లో తొమ్మిదవ పోప్ గ్రెగోరి పాపల్ మతవిచారణను ప్రారంభించాడు.a విచారణా విధానం మొదట నిందలు మరియు నిర్బంధాల ఆధారంగా ఆ తర్వాత క్రమపద్ధతిలో జరిగే హింస ఆధారంగా చేయబడింది. ఖడ్గం నిర్మూలించ లేకపోయినదాన్ని నిర్మూలించాలన్నదే దాని ఉద్దేశం. మతవిచారణ చేసే న్యాయమూర్తులు—ఎక్కువమంది డొమినికన్ మరియు ఫ్రాన్సిస్‌కన్ సన్యాసులు—కేవలం పోపుకే జవాబుదారులై ఉండిరి. దహించి చంపడమే భిన్నమతావలంబనకు అధికారపూర్వకమైన శిక్ష. మతవిచారణకర్తల మూఢత్వం మరియు క్రూరత్వం ఎంతగా ఉండేవంటే, అల్బీ, టౌలోస్, ఇతర స్థలాల్లో తిరుగుబాటులు చెలరేగాయి. అవిన్యానేలో, మతవిచారణా న్యాయసభలోని సభ్యులందరూ వధించబడ్డారు.
అనేకమంది పరిపూర్ణులకు చివరి ఆశ్రయమైన మాన్‌ట్సేగర్ కొండకోట 1244లో స్వాధీనం చేసుకోబడడం కాథారిసమ్‌కు చావుదెబ్బ వంటిదే. దాదాపు 200 మంది పురుషులు స్త్రీలు మ్రానుపై సామూహిక దహనాలలో మరణించారు. గడిచిన సంవత్సరాల్లో, మతవిచారణ మిగిలిన కాథార్‌లను వెలుగులోకి తెచ్చింది. చివరి కాథార్ 1330లో లాంగ్‌డాక్‌లో మ్రానుపై కాల్చబడినట్లు నివేదించబడింది. మిడీవల్ హియర్‌సే అనే పుస్తకం ఇలా తెలియజేసింది: “కాథారిసమ్ పడిపోవడమే మతవిచారణ యొక్క ప్రాముఖ్యమైన విజయం.”
కాథార్‌లు కచ్చితంగా నిజ క్రైస్తవులు కాదు. కాని వారు కాథోలిక్ చర్చిని విమర్శించారు గనుక క్రైస్తవులని పిలువబడేవారిచేత వారు క్రూరంగా నిర్మూలించబడడం న్యాయమేనా? వారి కాథోలిక్ హింసకులు, హంతకులు దేవున్ని మరియు క్రీస్తును అగౌరవపర్చి, ఆ వేలాదిమంది వ్యతిరేకులను హింసించి వధించడం ద్వారా వారు క్రైస్తవత్వానికి తప్పు ప్రాతినిధ్యం వహించారు.
[అధస్సూచీలు]
a మధ్యయుగం నాటి మతవిచారణ గురించి మరిన్ని వివరాల కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇంకార్పోరేటెడ్ ప్రచురించిన ఏప్రిల్ 22, 1986 తేజరిల్లు! (ఆంగ్లం) నందలి 20-3 పేజీలలోగల “భయంకరమైన మతవిచారణ” అనే శీర్షికను చూడండి.
[28వ పేజీలోని బాక్సు]
వాల్డెన్స్‌లు
సా.శ 12వ శతాబ్దం చివరికల్లా, లియోన్స్‌కు చెందిన పియరే వాల్డీస్ లేక పీటర్ వాల్డో అనే ధనికుడైన వ్యాపారి, దక్షిణ మరియు దక్షిణతూర్పు ఫ్రాన్సునందు వాడుకలో ఉన్న భాషయైన ప్రోవెన్‌కల్ యొక్క అనేక స్థానిక భాషల్లోకి బైబిలు భాగాలు మొట్టమొదటిసారిగా తర్జుమా చేయబడడానికి డబ్బు వెచ్చించాడు. యథార్థమైన కాథోలిక్‌యైన అతడు, తన వ్యాపారాన్ని విడిచిపెట్టి, సువార్త ప్రకటించడానికి తనను తాను సమర్పించుకున్నాడు. లంచగొండులైన మతనాయకుల వల్ల విసుగుచెంది, అనేకమంది ఇతర కాథోలిక్కులు ఆయనను అనుసరించి సంచార ప్రచారకులయ్యారు.
వాల్డో త్వరలోనే స్థానిక మతనాయకుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు, ఆయన బహిరంగ సాక్ష్యాన్ని నిషేధించేందుకు వాళ్లు పోప్‌ను ఒప్పించారు. ఆయన సమాధానం ఇలా ఉండిందని నివేదించబడింది: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.” (అపొస్తలుల కార్యములు 5:29 పోల్చండి.) వాల్డో తన మొండితనాన్ని బట్టి బహిష్కరించబడ్డాడు. వాల్దెన్స్‌లు లేక ల్యాయన్స్ యొక్క పేదవారు అని పిలువబడిన ఆయన అనుచరులు, ఇద్దరిద్దరు కలిసి ప్రజల ఇండ్లలో ప్రకటిస్తూ ఆయన మాదిరిని అనుకరించడానికి ఆసక్తితో ప్రయాసపడ్డారు. దీని ఫలితంగా వారి బోధలు ఫ్రాన్సు యొక్క దక్షిణ, తూర్పు మరియు ఉత్తర భాగాలలో అలాగే ఉత్తర ఇటలీలో త్వరితంగా వ్యాపించాయి.
ఎక్కువగా, వారు తొలి క్రైస్తవత్వపు నమ్మకాలను ఆచారాలను పునఃప్రారంభించారు. వారు ఇతర బోధలలో పర్‌గేటరీ, మృతుల కొరకు ప్రార్థనలు, మరియమ్మ ఆరాధన, “పరిశుద్ధులకు” ప్రార్థనలు, సిలువను పూజించడం, విలాసాలు, ప్రభురాత్రి భోజనం, శిశు బాప్తిస్మం వంటివాటిని సవాలు చేశారు.b
వాల్డెన్స్‌ల బోధలు కాథార్‌ల క్రైస్తవేతర ద్వంద బోధలకు పూర్తి భిన్నంగా ఉండేవి, తరచూ అవి పొరపాటున కాథార్‌లవని భావించబడేవి. ప్రాముఖ్యంగా, వాల్డెన్స్‌ల ప్రచారాన్ని ఆల్బిజెన్సుల లేక కాథార్‌ల బోధలతో సమానం చేయాలని ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిన కాథోలిక్ తార్కికుల మూలంగా ఈ గందరగోళం ఏర్పడింది.
[అధస్సూచీలు]
b వాల్డెన్స్‌ల గురించి మరింత సమాచారం కొరకు ఆగష్టు 1, 1981 కావలికోట (ఆంగ్లం) నందలి 12-15 పేజీలలో గల “వాల్డెన్స్‌లు—ధర్మవిరోధులా లేక సత్యాన్వేషకులా?” అనే శీర్షికను చూడండి.
[29వ పేజీలోని చిత్రం]
మతయోధులు 20,000 మంది పురుషులను స్త్రీలను పిల్లలను ఊచకోత కోసిన బిజెర్స్‌లో అక్కడున్న సెంట్ మేరీ మాగ్దలేనె చర్చిలో ఏడు వేల మంది మరణించారు