రాజ్య ప్రచారకుల నివేదిక
నిజ క్రైస్తవులు హింసించబడతారు
హేబెలు కాలంనుండికూడా, అనేకమంది యెహోవా సేవకులు మతపర హింసను ఎదుర్కొన్నారు. (లూకా 11:49-51) దానిలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే, “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు” అని బైబిలు హెచ్చరిస్తోంది. (2 తిమోతి 3:12) ఆ ప్రకారంగా, నేడు 25 కంటే ఎక్కువ దేశాల్లో, యెహోవాసాక్షులు నిషేధంలో ఉంటూ హింసను సహిస్తున్నారు.
యెహోవాసాక్షులు నిషేధించబడడమేకాకుండా మతోన్మాదుల నుండి హింసను కూడా అనుభవించిన దేశంలో 12,000 కంటే ఎక్కువ మంది సువార్త ప్రచారకులు 15,000 మందితో బైబిలును పఠిస్తూ ఆసక్తితో పని చేస్తున్నారు. నిస్సందేహంగా, వారి ప్రకటనా పని వివేకంతో చేయబడుతుంది. సాధారణంగా, తమ ఇండ్లలో క్రైస్తవ కూటాలను జరుపుకుంటారు మరియు అలాంటి కూటాలకు ఆసక్తి గలవారిని ఆహ్వానించేటప్పుడు వారు జాగ్రత్తగా ఉంటారు.
ప్రభుత్వం, ఇటీవల సాక్షుల ఎడల మరింత దయగల వైఖరిని కల్గివుంది, వారు ఇప్పుడు తమ పనిని బలవంతమైన ఆటంకం లేకుండా చేసుకుంటున్నారు. అయితే, వివిధ మత గుంపులు సమస్యలను రేపేందుకు తమ ప్రభావాన్ని ఉపయోగించుకున్నారు.
ఒక పట్టణంలో సుమారు 200 మతఛాందస్సులతో కూడిన కోపచిత్తమైన అల్లరి మూక, సుమారు 50 మంది యెహోవాసాక్షులు ఓ ఇంట్లో జరుపుకుంటున్న సంఘ కూటం వద్దకు వెళ్లారు. ఆ అల్లరిమూకలోని కొందరు రాళ్లను పట్టుకుని, మత నినాదాలను బిగ్గరగా వల్లిస్తూ వెళ్లారు. వారి ఉద్దేశం సాక్షులపై దాడిచేసి, ఇంటిని నాశనం చేయాలన్నది. బహుశ మత నాయకులు ఈ కూటాలను కొంత కాలం వరకు చూస్తూ ఉండవచ్చు, మరి ముట్టడించేందుకు సరైన అదను కొరకు వేచివుండవచ్చు. సరిగ్గా ఆ అల్లరిమూక ఇంట్లోకి చొరబడే సమయానికి, సుమారు 15 మంది పోలీసులు వచ్చి, వారు వెళ్లిపోవల్సిందిగా ఆ గుంపును ఆదేశించారు. ఇది సాక్షులకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది, ఎందుకంటే వారిలో ఎవరికీ పోలీసులను పిలిచే సమయం లేకపోయింది.
అయితే, ఇతర సందర్భాల్లో వ్యతిరేకులు సఫలమయ్యారు. అనేకమంది సాక్షులు విచారణకు తేబడ్డారు మరియు వారికి జైలు శిక్ష విధించబడింది. ఒక కోర్టు కేసు అనేక సంవత్సరాలవరకు అలా ఉండిపోయింది, మరి బహుశ ఆ ప్రాసిక్యూటరుకు అందులో ఆసక్తి తగ్గిపోయివుంటుంది. అయినప్పటికీ, స్థానిక మతనాయకులు జోక్యం చేసుకోవడం వల్ల, ఈ విషయం మరలా కోర్టుకు వచ్చింది, మరి ఆ సాక్షికి జైలు శిక్ష విధించబడింది.
మరో ప్రాంతంలో ఒక సాక్షుల గుంపు ప్రభురాత్రి భోజనం జరుపుకునేందుకు ఓ ఇంట్లో కూడుకుంది. అది అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఆ ఇంటియజమానిని, కూటాన్ని నిర్వహించిన పెద్దను పోలీసులు అరెస్టుచేశారు. పోలీస్‌స్టేషన్ వద్ద వారు దారుణంగా కొట్టబడ్డారు. క్రూరమైన విచారణ అనేక గంటలవరకు కొనసాగింది. సాక్షుల్లో ఒకరు చన్నీటి బావిలో నిర్బంధించబడిన వానిగా ఉండే హింసను కూడా సహించారు.
పోలీసులు ఎందుకు అలా ముట్టడిస్తూవచ్చారు? మరలా, స్థానిక మతనాయకుల సహాయంతో మతఛాందస్సుల గుంపు ఒకటి ఈ పోలీసు క్రియల వెనుక ఉంది. తర్వాత, ఈ అరెస్టులు తనకు తెలియకుండా జరిగాయని పోలీసు చీఫ్ బయల్పర్చాడు. క్షమాపణ పత్రం వెలువడింది, మరి అలా కొట్టేందుకు బాధ్యులైన వ్యక్తులు శిక్షించబడ్డారు.
ఉద్ధృతమైన వ్యతిరేకత ఉన్నా సరే, ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. వారు యేసు సలహాను పాటిస్తారు: “ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.”—మత్తయి 10:16.
[31వ పేజీలోని చిత్రం]
హింసించబడినవారిలో హేబెలు మొదటివాడు