కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 9/1 పేజీలు 22-26
  • “ప్రేమ శాశ్వతకాలముండును”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ప్రేమ శాశ్వతకాలముండును”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక బైబిలు పఠన గుంపు ఏర్పడింది
  • మతనాయకుల వ్యతిరేకత
  • మా ప్రకటన పని
  • యుద్ధ సంవత్సరాలు
  • వివాహాన్ని గూర్చిన యెహోవా ప్రమాణాలు స్పష్టం చేయబడ్డాయి
  • సేవాధిక్యతలు
  • నిజమైన ప్రేమ శాశ్వతకాలముంటుంది
  • నన్ను నిజంగా ప్రేమించిన కుటుంబం
    తేజరిల్లు!—1995
  • దైవిక సంతృప్తి నన్ను బలపరచింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • అమూల్యమైన క్రైస్తవ వారసత్వం వల్ల వర్ధిల్లాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 9/1 పేజీలు 22-26

“ప్రేమ శాశ్వతకాలముండును”

సామ్యెల్‌ డా. లడెసూయి చెప్పినది

గడిచిన సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుని, సాధించబడిన దాన్నంతటిని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోతాను. భూవ్యాప్తంగా యెహోవా అద్భుతమైన కార్యాలను చేస్తున్నాడు. నైజీరియానందలి ఇలెషాలో, 1931లో ప్రకటించడం ప్రారంభించిన కొద్దిమందిమైన మేము 36 సంఘాలయ్యాము. వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ పట్టభద్రులు 1947లో మొట్టమొదటిసారిగా నైజీరియాకు వచ్చినప్పుడు అక్కడ దాదాపు 4,000 మంది ప్రకటనపని చేస్తున్నారు, వారు 1,80,000 కంటె ఎక్కువమంది అయ్యారు. తొలి దినాల్లో, వ్యాప్తి ఇంతగా ఉంటుందని మేము అపేక్షించలేదు, ఊహించలేదు. ఈ అద్భుతమైన పనిలో భాగం కలిగివుండడాన్ని బట్టి నేనెంత కృతజ్ఞుడినో! దాని గురించి నన్ను చెప్పనివ్వండి.

మానాన్న పట్టణ పట్టణానికి వెళ్లి గన్‌లు, గన్‌పౌడర్‌ల వ్యాపారం చేసేవాడు; ఆయన అరుదుగా ఇంటివద్ద ఉండేవాడు. నాకు తెలిసినంతవరకు, ఆయనకు ఏడుగురు భార్యలున్నారు, కాని అందరూ ఆయనతో కలిసి జీవించేవారు కాదు. మా నాన్న, మరణించిన తన అన్నయ్య నుండి మా అమ్మను పొందాడు. ఆమె ఆయన రెండవ భార్య అయ్యింది, నేను ఆమెతో నివసించేవాణ్ణి.

ఒకరోజు, నాన్న పొరుగు గ్రామంలో నివసిస్తున్న తన మొదటి భార్యను దర్శించిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఆయన అక్కడున్నప్పుడు, నా సవతి సహోదరుడు బడికి వెళ్తున్నాడని ఆయన తెలుసుకున్నాడు. మా సవతి తల్లి కుమారుడు పది సంవత్సరాలవాడు, సరిగ్గా నా వయస్సువాడే. కాబట్టి నేను కూడా బడికి వెళ్లాలని నాన్న నిర్ణయించాడు. ఆయన నాకు తొమ్మిది పెన్నీలిచ్చాడు—మూడు పెన్నీలు పాఠ్యపుస్తకం కొరకు, ఆరు పెన్నీలు పలక కొరకు. అది 1924లో జరిగిన విషయం.

ఒక బైబిలు పఠన గుంపు ఏర్పడింది

చిన్నప్పటి నుండి, నాకు దేవుని వాక్యమైన బైబిలు ఎడల ప్రేమ ఉండేది. బడిలో చెప్పే బైబిలు తరగతులు నాకు ఇష్టమయ్యేవి, మా సండేస్కూల్‌ బోధకులు నన్ను ఎప్పుడూ మెచ్చుకొనేవారు. కాబట్టి 1930లో, ఇలెషాలో ప్రకటించడానికి వచ్చిన మొదటివారిలో ఒకరైన, దర్శిస్తున్న ఒక బైబిలు విద్యార్థి ప్రసంగాన్ని వినే అవకాశం నాకు లభించింది. ప్రసంగం తర్వాత ఆయన నాకు యెరూబా భాషలో దేవుని వీణె (ఆంగ్లం) అనే పుస్తక ప్రతిని ఇచ్చాడు.

నేను సండేస్కూల్‌కు క్రమంగా వెళ్లేవాణ్ణి. అప్పుడు నేను దేవుని వీణె నాతోపాటు తీసుకువెళ్లడం మొదలెట్టి, అక్కడ బోధించబడే కొన్ని సిద్ధాంతాలను ఖండించేందుకు దాన్ని ఉపయోగించేవాణ్ణి. వాదనలు జరిగేవి, ఈ ‘క్రొత్త బోధకు’ వ్యతిరేకంగా చర్చి నాయకులు తరచూ నన్ను హెచ్చరించేవారు.

తర్వాతి సంవత్సరం, వీధిలో నడుస్తుండగా, ఒక వ్యక్తి ప్రసంగిస్తుంటే ప్రజలు వింటుండడం నేను చూశాను. ప్రసంగీకుడు జె. ఐ. ఓవెన్‌పా అనే ఒక బైబిలు విద్యార్థి. లాగోస్‌ నుండి రాజ్య ప్రకటన పనిని పర్యవేక్షిస్తున్న విల్యమ్‌ ఆర్‌. బ్రౌన్‌ (తరచూ బైబిల్‌ బ్రౌన్‌ అని పిలువబడేవాడు) ఆయనను అక్కడికి పంపించాడు.a ఇలెషాలో దేవుని వీణెను పఠించేందుకు ఒక చిన్న బైబిలు పఠన గుంపు ఏర్పడిందని నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను వారితో కలిశాను.

ఆ గుంపులో నేనే చిన్నవాణ్ణి—బడికి వెళ్లే దాదాపు పదహారేళ్ల అబ్బాయిని. ముప్పై అంతకంటే ఎక్కువ వయస్సుగల వారితో సన్నిహితంగా సహవసించేందుకు సహజంగా నేను సిగ్గుపడి ఉండేవాణ్ణి, భయపడి ఉండేవాణ్ణి కూడా. కాని నేను వారి మధ్యన ఉండడాన్ని బట్టి వారు ఎంతో సంతోషించేవారు, వారు నన్ను ప్రోత్సహించేవారు. వారు నాకు తండ్రులలా ఉండేవారు.

మతనాయకుల వ్యతిరేకత

త్వరలోనే మాకు మతనాయకుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవ్వడం మొదలయ్యింది. కాథోలిక్కులు, ఆంగ్లికన్లు, మునుపు ఒకరితో ఒకరు పోట్లాడుకున్న మరితరులు ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. మమ్మల్ని నిరుత్సాహపర్చేందుకు చర్యలు తీసుకోవడానికి వారు స్థానిక పాలకులతో కలిసి కుట్ర పన్నారు. మా పుస్తకాలు ప్రజలకు హాని కలిగించేవని ఆరోపిస్తూ వాటిని స్వాధీనం చేసుకునేందుకు వారు పోలీసులను పంపించారు. అయితే, పుస్తకాలు తీసుకోవడానికి వారికి హక్కులేదని జిల్లా అధికారి హెచ్చరించాడు, రెండు వారాల తర్వాత పుస్తకాలు తిరిగి ఇవ్వబడ్డాయి.

దీని తర్వాత, మమ్మల్ని ఒక సమావేశం కొరకు పిలిచారు. అక్కడ మేము పట్టణంలోని ఇతర ప్రముఖ వ్యక్తులతో పాటు ఓబా లేక ప్రధాన పరిపాలకున్ని కలిశాము. ఆ సమయంలో మేము దాదాపు 30 మంది వరకు ఉన్నాము. “హానికరమైన” పుస్తకాలను చదవడం నుండి మమ్మల్ని ఆపాలన్నది అసలు ఉద్దేశం. ఒకవేళ మేము క్రొత్తవారిమా అని వారు అడిగారు, కాని మా ముఖాలు పరికించి చూశాక వారిలా అన్నారు, “వీరిలో కొంతమంది క్రొత్తవారు ఉన్నప్పటికీ వీరు మన కుమారులే.” మాకు హాని కలిగించే మతానికి చెందిన పుస్తకాలను చదవడాన్ని మేము కొనసాగించడం వాళ్లకిష్టం లేదని వాళ్లు మాకు చెప్పారు.

ఏమి చెప్పకుండా మేము ఇంటికి వెళ్లిపోయాము, ఎందుకంటే ఆ ప్రముఖ వ్యక్తుల మాటలకు ఏమాత్రం శ్రద్ధనివ్వకూడదని మేము నిర్ణయించుకున్నాము. మేము నేర్చుకుంటున్నదాన్ని బట్టి మాలో అనేకులం ఎంతో సంతోషంగా ఉన్నాం, పఠనాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నాం. కాబట్టి, కొంతమంది భయపడి గుంపులో నుండి వెళ్లిపోయినప్పటికీ, మాలో అనేకులం ఒక వడ్రంగి దుకాణంలో మా పఠనాన్ని కొనసాగించాము. మాకు నిర్వాహకుడు లేడు. మేము ప్రార్థనతో ప్రారంభించి, పుస్తకంలోని పేరాలను చదవడంలో వంతులు తీసుకునేవాళ్లం. దాదాపు ఒక గంట తర్వాత, మేము మళ్లీ ప్రార్థించి ఇళ్లకు వెళ్లిపోయేవాళ్లం. కాని మమ్మల్ని గూఢాచారులు గమనిస్తుండేవారు, ప్రతి రెండు వారాలకు ప్రముఖులు, మతనాయకులు మమ్మల్ని పిలిపించి, బైబిలు విద్యార్థుల సాహిత్యాన్ని చదవడానికి వ్యతిరేకంగా మమ్మల్ని హెచ్చరించడం కొనసాగించారు.

ఇంతలో, ప్రజలకు సహాయం చేసేందుకు మాకున్న కొంత జ్ఞానాన్ని ఉపయోగించడానికి మేము ప్రయత్నించేవాళ్లం, అనేకులు మాతో ఏకీభవించేవారు. ఒకరి తర్వాత ఒకరుగా, వ్యక్తులు మాతో కలుస్తుండేవారు. మేము ఎంతో సంతోషించేవాళ్లం, కాని మేము సహవసిస్తున్న మతం గురించి అప్పటికీ మాకు ఇంకా ఎక్కువగా తెలియదు.

సంస్థీకరించడంలో మాకు సహాయం చేసేందుకు 1932 తొలిభాగంలో లాగోస్‌ నుండి ఒక సహోదరుడు వచ్చాడు, ఏప్రిల్‌లో “బైబిల్‌” బ్రౌన్‌ కూడా వచ్చాడు. దాదాపు 30 మందివున్న గుంపు ఉందని చూసి, సహోదరుడైన బ్రౌన్‌ పఠనంలో మేము సాగిస్తున్న అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నాడు. మాకు తెలిసినదంతా మేము ఆయనకు చెప్పాము. మేము బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పాడు.

అది వర్షాకాలం కాదు గనుక, మేము ఇలెషా నుండి నది వద్దకు వెళ్లేందుకు 14 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది, మాలో దాదాపు ముప్పైమందిమి బాప్తిస్మం తీసుకున్నాము. అప్పటి నుండి, మమ్మల్ని మేము రాజ్య ప్రచారకులుగా ఉండేందుకు అర్హతగల వారిగా దృష్టించుకొని, ఇంటింటికి వెళ్లడం మొదలుపెట్టాము. ఇది చేయాలని మేము ఎదురుచూడలేదు కాని, మాకు తెలిసినది ఇతరులతో పంచుకోవాలని అప్పుడు మేము ఎంతో ఆసక్తి కలిగివున్నాము. మాకు ఎదురయ్యే అబద్ధ సిద్ధాంతాలను తప్పని నిరూపించేందుకు బైబిలు మద్దతు పొందడం కొరకు మేము బాగా సిద్ధపడాలి. కాబట్టి, మా కూటాల వద్ద, మాకు తెలిసిన దానితో ఒకరికొకరం సహాయం చేసుకుంటూ, సిద్ధాంతాల గురించి చర్చించుకునేవాళ్లం.

మా ప్రకటన పని

మేము పట్టణాన్ని మా ప్రకటనతో నింపేశాము. ప్రజలు మమ్మల్ని వెక్కిరించి, మాపై అరిచారు, కాని మేము అదంతా పట్టించుకోలేదు. మేము నేర్చుకోవలసింది ఎంతో ఉన్నప్పటికీ, మా వద్ద సత్యం ఉంది గనుక మాకు గొప్ప సంతోషం ఉండేది.

మేము ప్రతి ఆదివారం ఇంటింటికి వెళ్లేవాళ్లం. ప్రజలు ప్రశ్నలు అడిగేవారు, మేము వారికి సమాధానమివ్వడానికి ప్రయత్నించేవాళ్లం. ఆదివారం సాయంకాలాల్లో బహిరంగ ప్రసంగం ఇచ్చేవాళ్లం. మాకు రాజ్యమందిరం ఉండేది కాదు అందుకని మేము ఆరుబయట కూటాలు జరుపుకొనేవాళ్లం. మేము ప్రజలను సమావేశపరచి, ప్రసంగం ఇచ్చిన తర్వాత ప్రశ్నలడగమని వారిని ఆహ్వానించేవాళ్లం. కొన్నిసార్లు మేము చర్చీల్లో ప్రకటించేవాళ్లం.

యెహోవాసాక్షుల గురించి ప్రజలు ఎన్నడూ వినని ప్రాంతాలకు కూడా మేము ప్రయాణించేవాళ్లం. ఎక్కువసార్లు మేము సైకిళ్లపై వెళ్లేవాళ్లం, కాని కొన్నిసార్లు మేము బస్సు అద్దెకు తీసుకొనేవాళ్లం. మేము ఒక గ్రామాన్ని చేరాక బిగ్గరగా బాకా ఊదేవాళ్లం. మొత్తం గ్రామమంతా ఆ శబ్దం వినిపించేది! ఏమి జరుగుతుందో చూడాలని ప్రజలు పరుగెత్తుకొచ్చేవారు. అప్పుడు మేము మా వర్తమానం అందజేసేవాళ్లం. మేము ముగించిన తర్వాత, మన సాహిత్యాల ప్రతులను పొందేందుకు ప్రజలు ఎగబడేవారు. మేము ఎంతో సాహిత్యాన్ని పంచిపెట్టేవాళ్లం.

దేవుని రాజ్య రాకడ కొరకు మేము ఆతురతతో ఎదురుచూసేవాళ్లం. మేము 1935 వార్షిక పుస్తకాన్ని పొందినప్పుడు, సంవత్సరమంతటి కొరకు లేఖన చర్చల పూర్తి పట్టికను చూసి సహోదరులలో ఒకరు ఇలా అడిగారు: “అర్మగిద్దోను రాకముందు మనం మరో పూర్తి సంవత్సరం గడుపుతామని దీని భావమా?”

సమాధానంగా, నిర్వాహకుడు ఇలా అడిగాడు: “బ్రదర్‌, అర్మగిద్దోను రేపు వస్తే, మనం వార్షిక పుస్తకం చదవడం మానేస్తామని మీరనుకుంటున్నారా?” కాదని సహోదరుడు చెప్పినప్పుడు, “మరి మీరెందుకు కలత చెందుతున్నారు?” అని నిర్వాహకుడు అన్నాడు. యెహోవా దినం కొరకు మేము ఆతురత కలిగివుండేవాళ్లం, ఇప్పటికీ అదే ఆతురత కలిగివున్నాము.

యుద్ధ సంవత్సరాలు

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, మన పుస్తకాలను దిగుమతి చేసుకోవడం నిషేధించబడింది. ఇలెషాలో, ఒక సహోదరుడు తెలియక సంపద (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఒక పోలీసుకు అందజేశాడు. “ఈ పుస్తకం ఎవరిది?” అని పోలీసు అడిగాడు. అది తన స్వంత పుస్తకమని సహోదరుడు చెప్పాడు. పోలీసు అది నిషేధించబడిన పుస్తకమని చెప్పి, ఆయనను స్టేషనుకు తీసుకువెళ్లి బంధించాడు.

నేను పోలీసు స్టేషనుకు వెళ్లి, వాకబు చేసిన తర్వాత, బెయిలు మీద సహోదరున్ని విడిపించాను. ఆ తర్వాత నేను లాగోస్‌లో ఉన్న బ్రౌన్‌ సహోదరునికి ఫోనుచేసి ఏమి జరిగిందో ఆయనకు తెలియజేశాను. మన పుస్తకాల పంపిణీని నిషేధించే చట్టం ఏదైనా ఉందా అని కూడా అడిగాను. మన పుస్తకాల పంపిణీ కాదు గాని దిగుమతి మాత్రమే నిషేధింపబడిందని సహోదరుడు బ్రౌన్‌ నాకు చెప్పాడు. మూడు రోజుల తర్వాత, ఏమి జరుగుతుందో చూడడానికి సహోదరుడు బ్రౌన్‌ లాగోస్‌ నుండి ఒక సహోదరున్ని పంపించాడు. మరునాడు మేమందరం పత్రికలు, పుస్తకాలు తీసుకొని ప్రకటన పనికి వెళ్లాలని ఈ సహోదరుడు నిర్ణయించాడు.

మేము వేర్వేరు దిశలలో వెళ్లాము. దాదాపు ఒక గంట తర్వాత, సహోదరులలో అనేకులు నిర్బంధించబడ్డారన్న సమాచారం నాకు అందింది. కాబట్టి వచ్చిన సహోదరుడు, నేను కలిసి పోలీసు స్టేషనుకు వెళ్లాము. పుస్తకాలు నిషేధించబడినవి కావని మేము ఇస్తున్న వివరణను వినడానికి పోలీసు నిరాకరించాడు.

నిర్బంధింపబడిన 33 మంది సహోదరులు ఈఫె నందలి ప్రధాన మేజిస్ట్రేట్‌ న్యాయస్థానానికి పంపబడ్డారు, నేను వారితో వెళ్లాను. మమ్మల్ని తీసుకువెళ్లడం చూసిన పట్టణ ప్రజలు, “ఈ రోజుతో వీళ్లపని ముగిసినట్టే, వాళ్లు ఇక మళ్లీ ఇక్కడికి రారు” అని అరిచారు.

నైజీరియావాడైన ప్రధాన మేజిస్ట్రేట్‌ ఎదుట కేసు నివేదించబడింది. పుస్తకాలు, పత్రికలు అన్నీ చూపించబడ్డాయి. ఈ ప్రజలను నిర్బంధించేందుకు ప్రధాన పోలీసు అధికారికి ఎవరు అధికారం ఇచ్చారని ఆయన అడిగాడు. జిల్లా అధికారి ఇచ్చిన సూచనలమేరకు నేను చర్య తీసుకున్నానని ప్రధాన పోలీసు అధికారి సమాధానమిచ్చాడు. ప్రధాన పోలీసు అధికారిని, నాతో సహా మా ప్రతినిధులను నలుగురిని ప్రధాన మేజిస్ట్రేట్‌ తన గదిలోకి పిలిచాడు.

మిస్టర్‌ బ్రౌన్‌ ఎవరని ఆయన అడిగాడు. ఆయన లాగోస్‌నందలి వాచ్‌టవర్‌ సంస్థ ప్రతినిధి అని మేము చెప్పాము. మా గురించి మిస్టర్‌ బ్రౌన్‌ నుండి తనకు ఒక టెలిగ్రామ్‌ వచ్చిందని ఆయన మాకు చెప్పాడు. ఆయన కేసును ఆనాటికి ముగించి, సహోదరులకు బెయిలు మంజూరు చేశాడు. మరునాడు ఆయన సహోదరులను స్వతంత్రులను చేస్తూ, వారిని నిర్దోషులుగా తీర్పుతీర్చి, పుస్తకాలు తిరిగి ఇచ్చివేయమని ఆయన పోలీసుకు ఆదేశించాడు.

పాటలు పాడుతూ మేము ఇలెషాకు తిరిగివచ్చాము. మళ్లీ ప్రజలు అరవడం మొదలు పెట్టారు కాని, ఈ సారి వాళ్లు ఇలా అన్నారు, “వాళ్లు మళ్లీ వచ్చారు!”

వివాహాన్ని గూర్చిన యెహోవా ప్రమాణాలు స్పష్టం చేయబడ్డాయి

మొదటి ముగ్గురు గిలియడ్‌ పట్టభద్రులు 1947లో నైజీరియాకు వచ్చారు. ఈ సహోదరులలో ఒకరు, టోనీ ఆట్‌వుడ్‌ ఇప్పటికీ ఇక్కడ నైజీరియా బేతేలులో సేవచేస్తూ ఉన్నాడు. ఆ సమయం నుండి నైజీరియానందు యెహోవా సంస్థలో గొప్ప మార్పులు రావడం మేము చూశాము. పెద్ద మార్పులలో ఒకటి, బహు భార్యాత్వాన్ని గూర్చిన మా దృక్పథం.

ఫిబ్రవరి 1941లో నేను ఒలాబిసి ఫాసూబాను వివాహం చేసుకున్నాను, ఒకరికన్నా ఎక్కువమంది భార్యలను చేసుకోవడం సరైనది కాదని తెలుసుకొనేంత జ్ఞానం ఉండేది. కాని 1947లో మిషనరీలు వచ్చేంత వరకు సంఘాల్లో బహుభార్యాత్వం సర్వసాధారణమై ఉండింది. ఎక్కువమంది భార్యలుగల సహోదరులు ఒకరికంటే ఎక్కువమంది భార్యలను కలిగివుండడం తప్పని తెలియక అలా చేశారు కాబట్టి, ఇద్దరు లేక ముగ్గురు, లేక నలుగురు లేక ఐదుగురు భార్యలుంటే వారు వాళ్లను ఉంచుకోవచ్చు కాని ఇక ఎవరిని చేసుకోకూడదని వారికి చెప్పబడింది. మాకు ఆ సిద్ధాంతం ఉండేది.

అనేకమంది ప్రజలు మాతో కలవాలని ఆసక్తి కలిగివుండేవారు, ప్రాముఖ్యంగా, ఇలెషాలోని చెరుబిమ్‌ మరియు సెరాపిమ్‌ సంస్థ. యెహోవాసాక్షులు మాత్రమే సత్యాన్ని బోధించే ప్రజలని వారు చెప్పేవారు. వారు మన బోధలతో ఏకీభవించి, వారి చర్చీలను రాజ్యమందిరాలుగా మార్చాలని ఇష్టపడ్డారు. దీన్ని సాధ్యపర్చాలని మేము చాలా కష్టపడేవాళ్లం. వారి పెద్దలకు శిక్షణనిచ్చేందుకు మాకు కేంద్రాలు కూడా ఉండేవి.

అప్పుడు బహుభార్యాత్వం గురించి క్రొత్త నడిపింపు వచ్చింది. మిషనరీలలో ఒకరు 1947లో సర్క్యూట్‌ సమావేశంలో ఒక ప్రసంగాన్నిచ్చాడు. ఆయన మంచి ప్రవర్తన, అలవాట్ల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన అనీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరని చెప్పే 1 కొరింథీయులు 6:9, 10ని ఉదాహరించాడు. తర్వాత ఆయనిలా జతచేశాడు: “బహుభార్యాత్వాన్ని అనుసరించేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు!” ప్రేక్షకులలో నుండి ప్రజలు ఇలా అరిచారు: “అయ్యో, బహుభార్యాత్వాన్ని అనుసరించేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరా!” విభజన ఏర్పడింది. అది ఒక యుద్ధంలా ఉండింది. క్రొత్తగా సహవసిస్తున్న అనేకులు, “దేవునికి కృతజ్ఞతలు, మేము చాలా దూరం వెళ్లలేదు” అని చెబుతూ, సహవసించడం మానేశారు.

అయితే, ఎక్కువమంది సహోదరులు, తమ భార్యలను స్వతంత్రులను చేస్తూ, తమ మార్గాలను సరిచేసుకోవడం మొదలుపెట్టారు. వారు వాళ్లకు డబ్బిచ్చి ఇలా చెప్పారు, ‘మీరు యౌవనదశలో ఉంటే వెళ్లి మరో భర్తను చూసుకోండి. నిన్ను వివాహం చేసుకోవడం ద్వారా నేను పొరపాటు చేశాను. నేను ఇప్పుడు ఒక భార్యకే భర్తగా ఉండాలి.’

త్వరలోనే మరో సమస్య తలెత్తింది. కొంతమంది ఒక భార్యతో జీవిస్తూ ఇతరులను స్వతంత్రులను చేయడానికి నిశ్చయించుకున్న తర్వాత, తమ మనస్సులు మార్చుకొని ఇతర భార్యలలో ఒకరిని తెచ్చుకొని, మునుపు తమతో ఉంటున్న భార్యను స్వతంత్రురాలిని చేయాలని కోరుకున్నారు! కాబట్టి మళ్లీ సమస్య మొదలైంది.

తర్వాత ‘యౌవనకాలమందు నీవు పెండ్లిచేసికొనిన భార్య’ అని చెప్పే మలాకీ 2:14 ఆధారంగా బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయం నుండి నడిపింపు వచ్చింది. నడిపింపు ఏమిటంటే భర్తలు తాము వివాహం చేసుకొనిన మొదటి భార్యనే తీసుకోవాలి. చివరికి అలా సమస్య పరిష్కరించబడింది.

సేవాధిక్యతలు

సంస్థ 1947లో సంఘాలను బలపర్చి వాటిని సర్క్యూట్‌లుగా సంస్థీకరించడం ప్రారంభించింది. జ్ఞానమందు అభివృద్ధి చెంది, పరపక్వతకెదిగిన సహోదరులను ఇప్పుడు ప్రాంతీయ కాపరులని పిలువబడుతున్న ‘సహోదరుల సేవకులుగా’ నియమించాలని వారనుకున్నారు. నేను అలాంటి నియామకాన్ని అంగీకరిస్తానా అని సహోదరుడు బ్రౌన్‌ నన్ను అడిగాడు. నేను బాప్తిస్మం తీసుకున్నదే యెహోవా చిత్తాన్ని చేయడానికని చెప్పి, ఇలా అన్నాను: “మీరు నాకు బాప్తిస్మం కూడా ఇచ్చారు. యెహోవాకు ఇప్పుడు మరింతగా సేవచేసే అవకాశం వచ్చినప్పుడు, నేను నిరాకరిస్తానని మీరనుకుంటున్నారా?”

ఆ సంవత్సరం అక్టోబరులో, మాలో ఏడు మందిమి లాగోస్‌కు పిలువబడ్డాము, సర్క్యూట్‌ పనిలో పంపక ముందు మాకు శిక్షణ ఇవ్వబడింది. ఆ రోజుల్లో సర్క్యూట్‌లు పెద్దగా ఉండేవి. మొత్తం దేశం కేవలం ఏడు సర్క్యూట్‌లుగా విభాగించబడేది. సంఘాలు కొన్నే ఉండేవి.

సహోదరుల సేవకులుగా మా పని కష్టతరంగా ఉండేది. మేము తరచూ అతి వేడిగా ఉండే ఉష్ణమండల అడవుల గుండా, ప్రతిరోజు అనేక కిలోమీటర్లు నడిచేవాళ్లం. ప్రతి వారం మేము ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణించాలి. అప్పుడప్పుడు నేను ఇక నా కాళ్ల పని అయిపోయిందనుకునే వాణ్ణి. కొన్నిసార్లు ఇక నేను చనిపోతున్నట్లు భావించేవాణ్ణి! కాని, సత్యాన్ని హత్తుకొనే ప్రజల సంఖ్య పెరుగుతున్నప్పుడు ప్రాముఖ్యంగా ఎంతో ఆనందంగా కూడా ఉండేది. అంతెందుకు, కేవలం ఏడు సంవత్సరాల్లోనే, దేశంలోని ప్రచారకుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది!

నేను 1955 వరకు అంటే నా ఆరోగ్యం దెబ్బతిని నేను తప్పనిసరిగా ఇలెషాకు తిరిగి వచ్చే వరకు సర్క్యూట్‌ పనిలో భాగం వహించాను, ఇలెషాలోనే నేను నగరాధ్యక్షునిగా నియమించబడ్డాను. నేను ఇంటి దగ్గర ఉండడం, నా కుటుంబానికి ఆత్మీయంగా సహాయం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించడానికి నాకు సహాయం చేసింది. నేడు నా పిల్లలు ఆరుగురూ యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారు.

నిజమైన ప్రేమ శాశ్వతకాలముంటుంది

నేను గడిచిన సంవత్సరాలన్నిటి గురించి తలంచినప్పుడు, కృతజ్ఞత కలిగివుండడానికి నాకు ఎంతో ఉంది. నిరుత్సాహాలు, చింతలు, అనారోగ్యం ఉండేవి, కాని ఎన్నో ఆనందాలు కూడా ఉండేవి. మా జ్ఞానం మరియు గ్రహింపు గత సంవత్సరాలలో పెరిగిపోయినప్పటికీ, 1 కొరింథీయులు 13:8 భావాన్ని నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను, అదిలా చెబుతుంది: “ప్రేమ శాశ్వతకాలముండును.” మీరు యెహోవాను ప్రేమించి, ఆయన సేవలో దృఢంగా కొనసాగితే, ఆయన మీ కష్టాల్లో మీకు సహాయం చేసి, మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు.

సత్యపు వెలుగు అంతకంతకు తేజోవంతమౌతోంది. మేము మొదట ప్రారంభించిన కాలంలో, అర్మగిద్దోను త్వరగా వస్తుందని మేము తలంచాము; అందుకే మేము చేయగలిగిందంతా చేయడానికి తొందరపడేవాళ్లం. కాని అదంతా మా ప్రయోజనం కొరకే. అందుకే నేను “నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను” అని చెప్పిన కీర్తనల రచయిత మాటలతో ఏకీభవిస్తాను.—కీర్తన 146:2.

[అధస్సూచీలు]

a బైబిలును తుది ప్రామాణిక గ్రంథంగా సూచించే ఆయన అలవాటును బట్టి సహోదరుడైన బ్రౌన్‌ బైబిల్‌ బ్రౌన్‌ అని పిలువబడేవాడు.—సెప్టెంబరు 1, 1992 కావలికోటలో (ఆంగ్లం) 32వ పేజీలోని “నిజమైన సువార్తికుని కోత” అనే శీర్షికను చూడండి.

[23వ పేజీలోని చిత్రం]

మిల్టన్‌ హెన్షెల్‌తో సామ్యెల్‌, 1955లో

[24వ పేజీలోని చిత్రం]

సామ్యెల్‌ తన భార్య ఒలాబిసితో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి