“నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి”
“నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి.”—మత్తయి 11:29.
1, 2. (ఎ) మీకు ఉపశమనాన్ని తీసుకొచ్చేదేన్ని మీరు మీ జీవితంలో అనుభవించారు? (బి) యేసు వాగ్దానం చేసిన ఉపశమనాన్ని పొందేందుకు ఒకరు ఏమి చేయాల్సి ఉంటుంది?
వేడిగానూ తేమగానున్న రోజు ముగుస్తుండగా, చన్నీటి స్నానం చేయడం, లేక ఎంతోసేపుపట్టిన అలసట కలిగించే ప్రయాణం తర్వాత రాత్రి మంచి నిద్ర—ఆహా, ఎంత ఉపశమనాన్నిస్తాయి! ఒక భారమైన బరువును తీసివేసినప్పుడు లేక పాపాలు మరియు తప్పులు క్షమించబడినప్పుడు కూడ అలాగే ఉంటుంది. (సామెతలు 25:25; అపొస్తలుల కార్యములు 3:19, 20) అలాంటి ఉల్లాసవంతమైన అనుభవం నుండి వచ్చిన ఉపశమనం, మనలను పునఃచైతన్యవంతులను చేస్తుంది మరియు అభివృద్ధి సాధించేందుకు మనలను శక్తిమంతులను చేస్తుంది.
2 భారమున్నట్లుగానూ అలసినట్లుగానూ ఉన్నవారు యేసు వద్దకు రావచ్చు, ఎందుకంటే సరిగ్గా దాన్నే—అంటే ఉపశమనాన్నిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అయితే, అంత కోరదగిన ఉపశమనాన్ని కనుగొనేందుకు, ఒక వ్యక్తి చేయడానికి ఇష్టపడాల్సిన ఒక విషయముంది. “మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి [“ఉపశమనం,” NW] దొరకును” అని యేసు చెప్పాడు. (మత్తయి 11:29) ఈ కాడి అంటే ఏమిటి? అది ఉపశమనాన్ని ఎలా తీసుకువస్తుంది?
సుళువైన కాడి
3. (ఎ) బైబిలు కాలాల్లో ఎలాంటి కాడులు ఉపయోగించబడ్డాయి? (బి) కాడికి సంబంధించి ఏ సూచనార్థకమైన భావం ఉంది?
3 వ్యవసాయ పరిస్థితుల్లో జీవించడం వల్ల యేసుకు, ఆయన చెప్పేది వినేవారికి కాడి సుపరిచితమే. నిజానికి, కాడి అన్నది ఓ జత జంతువుల మెడమీద సరిగ్గా కూర్చునేందుకు వీలుగా క్రింది భాగంలో ఇరువైపులా వంపులున్న ఒక పొడవైన దూలం. నాగలిని, బండిని లేక మరో భారాన్ని లాగేందుకు రెండింటినీ కలిపి జీను వేసేందుకు ఒక జత జంతువులుంటాయి—తరచూ అవి ఎద్దులై ఉంటాయి. (1 సమూయేలు 6:7) మానవులు కూడా కాడిని ఉపయోగించేవారు. ఇవి రెండు ప్రక్కలా బరువులుండి భుజాలమీద మోసుకువెళ్లే సాధారణమైన దూలాలు లేక కొయ్యలు. వాటి సహాయంతో, పనివారు బరువైన భారాలను మోసేవారు. (యిర్మీయా 27:2; 28:10, 13) భారం మరియు పనుల సంబంధంగా ఈ కాడి బైబిలునందు తరచూ సూచనార్థంగా అధికారాన్ని మరియు ఆధిపత్యాన్ని సూచించేందుకు ఉపయోగించబడింది.—ద్వితీయోపదేశకాండము 28:48; 1 రాజులు 12:4; అపొస్తలుల కార్యములు 15:10.
4. తన వద్దకు వచ్చే వారికి యేసు అందించే కాడి దేనిని సూచిస్తోంది?
4 మరి, ఉపశమనం కొరకు తన వద్దకు వచ్చేవారు మోసుకొమ్మని యేసు ఆహ్వానించిన ఆ కాడి ఏమిటి? “నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి” అని ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకంచేసుకోండి. (మత్తయి 11:29) నేర్చుకునేవాడు ఓ శిష్యుడు. కనుక యేసు కాడిని తీసుకోవడం అంటే ఆయన అనుచరుడవ్వడమనే. (ఫిలిప్పీయులు 4:3) అయితే, దీనికి అవసరమైన ఆయన బోధలను తెలుసుకోవడం మాత్రమే కాదు. అందుకు అనుగుణమైన చర్యలు అవసరం—ఆయన చేసిన పనిని చేయడం, ఆయన జీవించినట్లుగా జీవించడం. (1 కొరింథీయులు 11:1; 1 పేతురు 2:21) అందుకు కావలసింది ఆయన అధికారానికి మరియు ఆయన ఎవరికైతే అధికారాన్నిస్తాడో వారికి ఇష్టపూర్వకంగా విధేయులుగా ఉండడం. (ఎఫెసీయులు 5:21; హెబ్రీయులు 13:17) దాని భావం బాప్తిస్మం తీసుకున్న సమర్పిత క్రైస్తవుడు అవ్వడం, అలాంటి సమర్పణతో వచ్చే ఆధిక్యతలనూ మరియు బాధ్యతలనూ అంగీకరించడం. తన వద్దకు ఓదార్పు మరియు ఉపశమనం కొరకు వచ్చే వారికి యేసు ఇచ్చే కాడి అదే. మీరు దాన్ని అంగీకరించేందుకు ఇష్టపడుతున్నారా?—యోహాను 8:31, 32.
5. యేసు కాడిని తీసుకోవడం ఎందుకు కఠినమైన అనుభవం కాదు?
5 కాడిని మోయడం ద్వారా ఉపశమనాన్ని కనుగొనడమా—అవి ఒకదానికొకటి విరుద్ధంగా లేవా? వాస్తవానికి మాత్రం కాదు, ఎందుకంటే యేసు తన కాడి ‘సుళువైనది’ అని అన్నాడు. ఈ పదానికి నెమ్మదిగల, మంచిదైన, అంగీకరింపదగిన అనే భావాలున్నాయి. (మత్తయి 11:30; లూకా 5:39; రోమీయులు 2:4; 1 పేతురు 2:1) వృత్తిరీత్యా వడ్లవానిగా యేసు బహుశ నాగలిని, కాడిని చేసివుంటాడు, తద్వారా వీలైనంత సుళువుగా ఎక్కువగా పనిచేయగలిగేటట్లు ఒక కాడిని ఎలా తయారు చేయాలో ఆయనకు తెలిసేవుండవచ్చు. బహుశ ఆయన ఆ కాడుల క్రింది భాగంలో బట్టను కానీ తోలును కానీ వేసివుంటాడు. అవి మెడమీద ఎక్కువగా రాసుకోకుండా ఉండేందుకుగాను ఎన్నింటికో అలా చేయడం జరిగింది. అదే విధంగా, యేసు మనకు అందించే సూచనార్థకమైన కాడి ‘సుళువైనది.’ ఆయన శిష్యుడవ్వడంలో, కొన్ని విధులూ బాధ్యతలూ ఉన్నప్పటికీ, అది కఠినమైన లేక బాధాకరమైన అనుభవం కాదుకానీ అది ఉపశమనాన్ని కలిగించేది. ఆయన పరలోక తండ్రియైన యెహోవా ఆజ్ఞలు కూడా భారమైనవి కావు.—ద్వితీయోపదేశకాండము 30:11; 1 యోహాను 5:3.
6. “నా కాడి ఎత్తుకొని,” అని యేసు అన్నప్పుడు ఆయన భావమేమైవుండవచ్చు?
6 యేసు కాడిని “సుళువు” చేసే మరో విషయం లేక దాన్ని భరించడాన్ని సులభతరం చేసే విషయం మరొకటి ఉంది. ‘మీమీద నా కాడి ఎత్తుకొనుడి’ అని ఆయన చెప్పినప్పుడు ఈ రెండింటిలో ఒకదాన్ని చెప్పివుండవచ్చు. ఆయన మనస్సులో ఒకవేళ ఈ జమలి కాడి ఉన్నట్లైతే, అంటే రెండు జంతువులను కలిపి కట్టే విధానాన్ని గూర్చి మాట్లాడుతున్నట్లైతే, అప్పుడు ఆయన తన కాడి క్రిందికే మనలను రమ్మని ఆహ్వానిస్తున్నాడన్నమాట. అది ఎంతటి ఆధిక్యత—అదీ యేసు మనప్రక్కనుండి మనతో మన బరువును మోయడం! మరో వైపున, సాధారణమైన పని వాడు ఉపయోగించే కాడి ఆయన మనస్సులో ఉండి ఉంటే, అప్పుడు మన మీద ఉన్న ఏ బరువునైనా మనం సులభంగా మోసేందుకు లేక సరిగ్గా ఉపయోగించేందుకు అవసరమైన మార్గాలను ఆయన అందిస్తు ఉండివుండవచ్చు. ఏ విధానంలోనైనా, ఆయన కాడి నిజమైన ఉపశమనానికి మూలం, ఎందుకంటే ఆయన మనకు ఈ అభయాన్నిస్తున్నాడు: ‘నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను.’
7, 8. తాము ఒత్తిడికి గురైనప్పుడు కొందరు ఏ తప్పును చేస్తుంటారు?
7 మరి, మనం మోసే జీవిత సమస్యల భారం బొత్తిగా సహించలేకపోతున్నట్లుగానూ మరి మనం ఒత్తిడికి పూర్తిగా గురయ్యామన్నట్లుగానూ భావించినట్లైతే, అప్పుడు ఏమి చేయాలి? ప్రతిదిన జీవితపు చింతలే తమ మీద భారంగా ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు శిష్యులుగా ఉండడం అనే కాడి చాలా కఠినమైనదని, మన నుండి అది ఎంతో కోరుతుందని కొందరు తప్పుగా భావించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం మానేస్తారు, లేక పరిచర్యలో భాగం వహించడం మానేయడం ద్వారా తాము కొంత ఉపశమనాన్ని పొందుతామని అనుకుంటారు. అయితే, అది గంభీరమైన తప్పిదం.
8 యేసు అందించే కాడి ‘సుళువైనది’ అన్న విషయాన్ని మనం గుణగ్రహిస్తాం. దాన్ని మనం సరిగ్గా పెట్టుకోకపోతే అది బాగా రాసుకుపోవచ్చు. ఆ సందర్భంలో మనం భుజాలపై ఉన్న కాడిని నిశితంగా పరిశీలించాలి. ఏదో కారణవశాత్తు, ఆ కాడికి కాస్త మరమ్మత్తు అవసరమైతే, లేక అది సరిగ్గా కూర్చోకపోయినట్లైతే, దాన్ని ఉపయోగించేందుకు ఎక్కువ ప్రయత్నం అవసరమవ్వడమే కాకుండ, అది మనకు కొంత వేదనను కూడా కలిగిస్తుంది. మరో మాటలో, దైవపరిపాలనా పనులు మనకు భారంగా తోచినట్లైతే, మనం వాటిని సరైన విధంగా చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని చూడాలి. మనం చేసే వాటి ఉద్దేశమేమిటి? మనం కూటాలకు వెళ్లేటప్పుడు మనం తగిన విధంగా సిద్ధపడుతున్నామా? ప్రాంతీయసేవలో మనం పాల్గొనేటప్పుడు మనం శారీరకంగానూ మానసికంగానూ సిద్ధంగా ఉన్నామా? సంఘంలోని ఇతరులతో మనం సన్నిహితమైన, మంచి సంబంధాన్ని కలిగివున్నామా? మరి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా, యెహోవా దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మన వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది?
9. క్రైస్తవ కాడి ఎందుకు ఎన్నడూ మోయలేని భారం కాకూడదు?
9 యేసు అందించే కాడిని మనం హృదయపూర్వకంగా అంగీకరించి, దాన్ని సరైన విధంగా మోసేందుకు నేర్చుకుంటే, అది సహించలేని భారంగా కనిపించేందుకు ఏ కారణమూ లేదు. వాస్తవానికి, ఆ పరిస్థితిని మనం దృశ్యీకరించుకుంటే—అంటే ఒకే కాడిక్రింద మనతో యేసు ఉండడం దృశ్యీకరించుకుంటే నిజంగా ఎక్కువ భారాన్ని ఎవరు మోస్తున్నారో మనం చూడడం కష్టం కాదు. తప్పటడుగులు వేసే బిడ్డ తన మూడు చక్రాల బండి హాండిలు మీద ఆధారపడుతూ తానే దాన్ని ముందుకు తోస్తున్నానని అనుకుంటాడు, కానీ వాస్తవానికి, ఎలాగైతే దాన్ని తల్లిగానీ తండ్రిగానీ తోస్తుంటారో ఇదీ అలాగే ఉంటుంది. ఒక ప్రేమపూర్వకమైన తండ్రిగా యెహోవా దేవునికి మన పరిమితులు మరియు బలహీనతలు ఏమిటో తెలుసు, మరి మన అవసరతలకు యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రత్యుత్తరమిస్తాడు. “కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును” అని పౌలు అన్నాడు.—ఫిలిప్పీయులు 4:19; యెషయా 65:24 పోల్చండి.
10. అనుచరులుగా ఉండడాన్ని గంభీరంగా తీసుకునే వారి అనుభవమేమిటి?
10 అనేకమంది సమర్పిత క్రైస్తవులు, వ్యక్తిగత అనుభవం ద్వారా దీన్ని గుణగ్రహిస్తున్నారు. ఉదాహరణకు, జెన్ని ప్రతి నెల సహాయ పయినీరుగానూ ఎంతో ఒత్తిడిగల ఉద్యోగాల్లోనూ పూర్తికాలసేవలోనూ పనిచేయడం తనకు అధిక ఒత్తిడిని తెస్తుందని కనుగొన్నది. అయితే, పయినీరు పని తాను సమతుల్యతను కల్గివుండేందుకు సహాయపడుతుందని ఆమె భావిస్తోంది. ప్రజలు బైబిలు సత్యాలను నేర్చుకునేందుకు సహాయపడడం మరియు వారు తమ జీవితాలను దేవుని అంగీకారాన్ని పొందేలా మలుచుకోవడం చూడడమే తన తీరికలేని జీవితంలో అతి గొప్ప ఆనందాన్ని తెస్తుంది. “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, మరి దానికి ఆయన కష్టాన్ని చేర్చడు” అని చెప్పిన సామెతల మాటలతో ఆమె పూర్ణహృదయంతో ఏకీభవిస్తుంది.—సామెతలు 10:22, NW.
తేలికైన భారం
11, 12. ‘నా భారము తేలికైనది’ అని యేసు చెప్పడంలో భావమేమిటి?
11 ‘సుళువైన’ కాడినిస్తానని వాగ్దానం చేయడమే కాకుండ, ‘నా భారము తేలికగానున్నది’ అని యేసు మనకు అభయమిస్తున్నాడు. ‘సుళువైన’ కాడి ముందే మన పనిని సులభతరం చేస్తుంది; మన భారం కూడా తేలికైనట్లైతే, పని నిజంగా ఆనందదాయకంగా ఉంటుంది. అయితే, అలా చెప్పినప్పుడు యేసు మనస్సులో ఏమి ఉంది?
12 పొలం దున్నడం నుండి బండి లాగడానికి తన జంతువుల పనిని మార్చాలనుకున్న ఒక వ్యవసాయదారుడు ఏమి చేస్తాడో పరిశీలించండి. ఆయన మొదట నాగలిని తీసేసి ఆ తర్వాత బండిని చేరుస్తాడు. జంతువులకు నాగలినీ బండినీ చేర్చి తగిలించడం అయుక్తంగా ఉంటుంది. అలాగే, తాము అప్పటికే మోస్తున్న భారం మీద తనందించే భారాన్ని మోసుకోమని యేసు తన ప్రజలతో చెప్పడం లేదు. తన శిష్యులతో ఆయన ఇలా అన్నాడు: ‘ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు.’ (లూకా 16:13) ఆ విధంగా, యేసు ప్రజలకు ఓ ఎంపికను ఇచ్చాడు. అటు వారు బరువైన భారాలను మోస్తూనే ఉంటారా లేక వాళ్లు దాన్ని క్రింద పెట్టి ఆయన ఇచ్చే దాన్ని అంగీకరిస్తారా? యేసు వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్నిచ్చాడు: ‘నా భారము తేలికైనది.’
13. యేసు దినాల్లోని ప్రజలు ఏ భారాన్ని మోస్తున్నారు, మరి దాని ఫలితమేమిటి?
13 యేసు కాలంలో, అణగద్రొక్కే రోమా పరిపాలకులు మరియు ఆచార పట్టుగలవారు మరియు వేషధారపూర్ణమైన మత నాయకులు మోపిన భారమైన బరువు క్రింద ప్రజలు కొట్టుమిట్టాడారు. (మత్తయి 23:23) రోమా భారాన్ని తీసివేసే ప్రయత్నంలో, కొందరు ప్రజలు విషయాలను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. వారు రాజకీయ పోరాటంలో పాల్గొన్నారు, అది నాశనకరమైన అంతానికే నడిపింది. (అపొస్తలుల కార్యములు 5:36, 37) ఇతరులు వస్తుపరమైన ప్రయాసల్లో ఎంతగానో ఇమిడిపోయి, తమ పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించారు. (మత్తయి 19:21, 22; లూకా 14:18-20) తన శిష్యులయ్యేందుకు ఆహ్వానించడం ద్వారా యేసు వారికి ఉపశమనాన్ని అందించినప్పుడు, అంగీకరించేందుకు అందరూ సంసిద్ధంగాలేరు. వారు తాము మోసే భారం చాలా బరువైనదైనప్పటికీ దాన్ని క్రింద పెట్టి ఆయనది తీసుకునేందుకు వారు వెనుకాడారు. (లూకా 9:59-62) ఎంత విషాదకరమైన తప్పిదమోకదా!
14. జీవిత కోరికలు మరియు వస్తుపరమైన కోరికలు మనపై భారాన్ని ఎలా మోపగలవు?
14 మనం జాగ్రత్త వహించకపోయినట్లైతే, నేడు మనం కూడా అదే తప్పును చేసే అవకాశముంది. యేసు శిష్యులవ్వడం, లోకంలోని ప్రజలు వెంబడించే గమ్యాలు మరియు విలువలను వెంబడించడం నుండి మనలను స్వతంత్రులను చేస్తుంది. ప్రతిదిన అవసరతలను పొందేందుకు మనం ఇంకా కష్టపడి పని చేయవలసినప్పటికీ, ఈ పనులను మనం మన జీవితంలో ముఖ్యంగా చేసుకోము. అయినప్పటికీ, జీవితపు చింతలు, వస్తుపరమైన సుఖాల ఊబి మన మీద బలమైన ఉరిగా ఉంటాయి. దాన్ని మనం అనుమతించినట్లైతే, అలాంటి కోరికలు మనం ఎంతో ఆసక్తితో అంగీకరించిన సత్యాలను తీసివేస్తాయి. (మత్తయి 13:22) అలాంటి కోరికలను తీర్చుకోవడంలో మనం ఎంత నిమగ్నమైపోతామంటే చివరికి మన క్రైస్తవ బాధ్యతలను మోయడం అలసటగా ఉంటుంది మరియు వాటిని త్వరత్వరగా చేసేసి వాటినుండి విముక్తి పొందాలని మనం అనుకుంటాం. అలాంటి స్ఫూర్తితో మనం పని చేస్తే మన సేవనుండి మనం ఉపశమనాన్ని పొందగలమని ఎన్నడూ అపేక్షించలేము.
15. వస్తుపరమైన కోరికల విషయంలో యేసు ఏ హెచ్చరికలను ఇచ్చాడు?
15 సంతృప్తికరమైన జీవితం మన కోరికలన్నింటినీ తీర్చుకునేందుకు పాటుపడడం ద్వారా కాదుకాని మరి ప్రాముఖ్యమైన విషయాలను సంపూర్తిగా తెలుసుకోవడం ద్వారా వస్తుందని యేసు ఎత్తి చూపాడు. “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా?” అని ఆయన ఉపదేశించాడు. తర్వాత ఆయన ఆకాశ పక్షులకు అవధానాన్నిమ్మని చెప్పి ఇలా అన్నాడు: ‘ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు.’ అడవిపువ్వులను సూచిస్తూ ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.”—మత్తయి 6:25-29.
16. వస్తుపరమైన వాటిని వెంబడించడం వల్ల వచ్చే ఫలితాలను గూర్చి అనుభవాలు ఏమి చూపించాయి?
16 ఈ సరళమైన ఆచరణాత్మకమైన పాఠాలనుండి మనం ఏమైనా నేర్చుకోగలమా? ఒక వ్యక్తి తన జీవితంలో ఆర్థిక స్థాయిని మెరుగుపర్చుకునేందుకు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే, అంత ఎక్కువగా ఆ వ్యక్తి లౌకిక గురులలో చిక్కుకుపోతాడు మరియు తన భుజాలపై ఉన్న బరువు మరింత భారంగా తయారవ్వడం సాధారణమైన అనుభవం. తమ ఆర్థిక విజయానికి ప్రతిఫలంగా విడిపోయిన కుటుంబాలు, విచ్ఛిన్నమైన వివాహాలు, పాడైన ఆరోగ్యం, ఇంకా అనేకమైనవాటిని పొందిన వర్తకులతో లోకం నిండి ఉంది. (లూకా 9:25; 1 తిమోతి 6:9, 10) నోబేలు బహుమతి గ్రహీతయైన ఐన్స్‌టైన్ ఒకసారి ఇలా చెప్పాడు: “సంపదలూ పైపై విజయం, ప్రచారం, సుఖభోగము—నాకు ఎల్లప్పుడూ తృణీకరించదగిన విషయాలుగానే ఉండేవి. సరళమైన మరియు ఆడంబర రహితమైన జీవిత విధానమే అందరికీ మంచిదని నేను విశ్వసిస్తున్నాను.” ఇది అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సరళమైన సలహాను ప్రతిధ్వనిస్తుంది: “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.”—1 తిమోతి 6:6.
17. బైబిలు ఎలాంటి జీవిత విధానాన్ని కల్గివుండాలనే సలహానిస్తోంది?
17 మనం అలక్ష్యం చేయకూడని ఒక ప్రాముఖ్యమైన విషయముంది. “సరళమైన మరియు ఆడంబర రహితమైన జీవన విధానానికి” అనేకమైన ప్రయోజనాలున్నప్పటికీ, అది మాత్రమే సంతృప్తిని తీసుకురాదు. పరిస్థితుల ప్రభావం వల్ల సరళమైన జీవిత విధానం గల అనేకులున్నారు, అయితే వారు ఏ మాత్రం సంతృప్తికరంగా గానీ ఆనందంగా గానీ లేరు. అంటే పూర్తిగా వస్తుపరమైన ఆనందాన్ని కాదని సన్యాసి జీవితాన్ని జీవించమని బైబిలు మనకు ఉద్బోధించడం లేదు. స్వయం-సంతృప్తిని నొక్కివక్కాణించలేదు కానీ దైవ భక్తినే నొక్కివక్కాణించారు. ఈ రెండింటినీ కలిపినప్పుడే ‘గొప్పలాభాన్ని’ పొందుతాము. ఏమిటా లాభం? అదే లేఖలో ఇంకాస్త ముందు, “అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, . . . దేవునియందే నమ్మికయుంచు” వారు, “వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొను”దురని పౌలు సూచిస్తున్నాడు.—1 తిమోతి 6:17-19.
18. (ఎ) ఒకరు నిజమైన ఉపశమనాన్ని ఎలా కనుగొనగలరు? (బి) మనం చేసుకోవల్సిన మార్పులను మనం ఎలా దృష్టించవచ్చు?
18 మనం బహుశ మోసే మన వ్యక్తిగత భారాన్ని ప్రక్కన పెట్టి, యేసు అందించే తేలికైన భారాన్ని తీసుకునేందుకు నేర్చుకున్నట్లైతే మనకు ఉపశమనం లభిస్తుంది. రాజ్య సేవలో ఎక్కువగా భాగం వహించేందుకు తమ జీవితాలను పునఃసంస్థీకరించుకున్నవారు ఆనందం మరియు సంతృప్తి గల జీవనానికి నడిపించే మార్గాలను కనుగొన్నారు. నిస్సందేహంగా, అలాంటి పని చేసేందుకు ఒక వ్యక్తికి విశ్వాసం మరియు ధైర్యం కావల్సివుంటుంది, అంతేకాకుండ ఆ మార్గంలో అనేక అవరోధాలు ఉండవచ్చు. అయితే బైబిలు మనకు ఇలా జ్ఞాపకం చేస్తుంది: “గాలిని గురుతుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.” (ప్రసంగి 11:4) మనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక విషయాలు మరీ అంత కష్టంగా అనిపించవు. అతి కష్టమైన భాగమేమిటంటే మనం చేయాలని నిర్ణయించుకోవడమే. ఆ పనిని చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడంతోనే మనం అలసిపోవచ్చు. మనస్సులను ఉత్తేజపర్చుకుని ఆ సవాలును గైకొంటే, అది ఎంతటి ఆశీర్వాదంగా మారుతుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు. కీర్తనల గ్రంథకర్త ఇలా ఉద్బోధించాడు: ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి.’—కీర్తన 34:8; 1 పేతురు 1:13.
‘మీ ప్రాణమునకు ఉపశమనం’
19. (ఎ) లోక పరిస్థితులు క్షీణిస్తున్నకొలది మనం ఏమి అపేక్షించవచ్చు? (బి) యేసు కాడి క్రింద ఉన్నప్పుడు మనకు ఏ అభయముంది?
19 అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు శిష్యులకు ఇలా జ్ఞాపకం చేశాడు: ‘అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.’ (అపొస్తలుల కార్యములు 14:22) నేడు కూడా అది నిజమే. ప్రపంచ పరిస్థితులు క్షీణిస్తున్న కొలది, నీతియుక్తమైన మరియు దైవ భక్తిగల జీవితాన్ని జీవించేందుకు నిర్ణయించుకున్న వారిపై వచ్చే ఒత్తిళ్లులు మరీ ఎక్కువగా ఉంటాయి. (2 తిమోతి 3:12; ప్రకటన 13:16, 17) అయినప్పటికీ, “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము” అని పౌలు చెప్పినప్పుడు ఎలా భావించాడో మనమూ అలాగే భావిస్తాము. దాని కారణమేటంటే, మనకు బలాధిక్యాన్నిచ్చేందుకు మనం యేసుక్రీస్తుపై ఆధారపడగలము. (2 కొరింథీయులు 4:7-9) శిష్యులుగా ఉండే కాడిని మనం హృదయపూర్వకంగా అంగీకరించడం ద్వారా, యేసు వాగ్దాన నెరవేర్పును మనం అనుభవించగలం: ‘అప్పుడు మీ ప్రాణములకు ఉపశమనము దొరకును.’—మత్తయి 11:29 NW.
మీరు వివరించగలరా?
◻ యేసు అందించిన తేలికైన కాడి ఏది?
◻ మన కాడి భారమౌతున్నట్లు అనిపిస్తే, మనం ఏమి చేయాలి?
◻ ‘నా భారము తేలికైనది’ అని యేసు చెప్పినప్పుడు ఆయన భావమేమిటి?
◻ మన భారం తేలికగానే ఉండాలని మనం ఎలా నిశ్చయపర్చుకోగలం?