అలసిన వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”—మత్తయి 11:28.
1. తన మూడవ ప్రకటనా పర్యటనలో యేసు గలిలయనందు ఏమి చూశాడు?
సా.శ. 32వ సంవత్సరారంభంలో యేసు గలిలయ ప్రాంతంలో తన మూడవ ప్రకటనా పర్యటనమీద ఉన్నాడు. “సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపర”స్తూ ఆయన ఆ పట్టణాలగుండా గ్రామాలగుండ ప్రయాణించాడు. ఆయన ఇలా చేస్తున్నప్పుడు, సమూహాలను చూసి, “వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికర”పడ్డాడు.—మత్తయి 9:35, 36.
2. యేసు ప్రజలకు ఎలా సహాయం చేశాడు?
2 అయితే, సమూహాలను చూసి యేసు జాలిపడి ఊరుకోలేదు. “కోత యజమాని” అయిన యెహోవా దేవునికి ప్రార్థించమని తన అనుచరులకు బోధించిన తర్వాత ప్రజలకు సహాయపడేందుకు వారిని పంపించాడు. (మత్తయి 9:38; 10:1) తర్వాత ఆయన ప్రజలకు నిజమైన ఉపశమనాన్ని మరియు ఓదార్పును ఇస్తాననే అభయాన్ని వ్యక్తిగతంగా ఇచ్చాడు. ఆయన వారికి ఈ హృదయానందకరమైన ఆహ్వానాన్ని అందించాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”—మత్తయి 11:28, 29.
3. యేసు ఆహ్వానం నేడు కూడా అలాగే ఎందుకు ప్రీతికరమైనది?
3 అనేకులు తమపైన ఎంతో భారముందని భావించే కాలంలో మనం జీవిస్తున్నాము. (రోమీయులు 8:22; 2 తిమోతి 3:1) జీవనోపాధి కొరకు, కొందరి సమయమూ శక్తిని ఎంతగా తినేస్తుందంటే వారు తమ కుటుంబం, స్నేహితులు లేక మరొక విషయం వచ్చేసరికి అవి ఏమీ మిగలవు. అస్వస్థత, బాధలూ కృంగుదల మరియు ఇతర శారీరక భావోద్రేక సమస్యల భారాన్ని అనేకులు అనుభవిస్తున్నారు. ఈ ఒత్తిడిని అనుభవిస్తూ, సరాదాల్లోనూ తినడంలోనూ త్రాగడంలోనూ చివరికి మాదకద్రవ్య దురుపయోగంలోనూ పూర్తిగా మునిగిపోయి, వాటినుండి ఉపశమనాన్ని పొందేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇది వారికి ఎక్కువ సమస్యలనూ ఒత్తిళ్లనూ తీసుకువస్తూ వారిని దుష్టతా వలయంలోకి పడేస్తుంది. (రోమీయులు 8:6) స్పష్టంగా, యేసు ఇచ్చిన ఆహ్వానం ఆ నాడు ఎంత ప్రీతికరమైనదో నేడు కూడా అంతే ప్రీతికరమైనది.
4. యేసు ప్రేమపూర్వకమైన ఆహ్వానం నుండి ప్రయోజనం పొందేందుకు మనం ఏ ప్రశ్నలను పరిగణించాలి?
4 యేసు వారి ఎడల కనికరపడేలా ఆయన కాలంలోని ప్రజలు “విసికి చెదరి” ఉన్నట్లు కనిపించేంతగా వారు దేనికి గురయ్యారు? వారు మోయాల్సివచ్చిన భారములూ బరువులు ఏవి మరి యేసు ఆహ్వానం వారికి ఎలా సహాయం చేస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం, అలసిపోయినవారికి యేసు అందించిన ప్రేమపూర్వకమైన ఆహ్వానం నుండి ప్రయోజనం పొందేందుకు మనకు ఎంతో సహాయకరంగా ఉంటుంది.
“ప్రయాసపడి భారము మోసికొను”వారు
5. అపొస్తలుడైన మత్తయి యేసు పరిచర్యలోని ఈ భాగాన్ని వ్రాయడం ఎందుకు సరైనది?
5 యేసు పరిచర్యలో కేవలం మత్తయి మాత్రమే ఈ సంఘటనను వ్రాశాడన్నది ఆసక్తికరం. లేవీ అనే మరో పేరుగల ఓ సుంకరిగా మత్తయికి ప్రజలు మోసే ఒక భారాన్ని గూర్చి బాగా తెలుసు. (మత్తయి 9:9; మార్కు 2:14) యేసు కాలంలోని అనుదిన జీవితం అనే పుస్తకం ఇలా చెబుతోంది: “[యూదులు] డబ్బురూపేణ మరియు వస్తురూపేణా పనిరూపేణా చెల్లించాల్సిన సుంకాలు భరించలేనంత భారమైనవి, అంతేకాకుండా ఒకేసారి చెల్లించాల్సిన పౌర సుంకం, మత సుంకం మరింత భారంగా ఉండేవి; మరి అవి తేలికగా కూడా ఉండేవికావు.”
6. (ఎ) యేసు కాలంలోని పన్ను విధానమేమిటి? (బి) సుంకరులకు ఎందుకు అంత చెడ్డపేరు ఉంది? (సి) తోటి క్రైస్తవులకు ఏ విషయాన్ని జ్ఞాపకం చేయాలని పౌలు భావించాడు?
6 ప్రత్యేకంగా దీనినంతటినీ భారంగా చేసింది ఆ నాటి పన్ను విధానమే. మాండలికాల్లో పన్ను వసూలు చేసే హక్కును ఎక్కువ వేలం పాడినవారికి ఇచ్చేటట్లుగా రోమా అధికారులు కాన్‌ట్రాక్ట్ చేశారు. దానికి ప్రతిగా, పన్ను వసూలు చేసే అసలు పనిని పర్యవేక్షించేందుకు వారు ప్రాంతీయ సమాజంలో కొందరిని ఉద్యోగాల్లో పెట్టించారు. పిరమిడ్ స్కీమ్‌లో ఉన్నవారందరూ తమతమ కమీషన్‌కు లేక వంతుకు మరికొంత చేర్చుకోవడం పూర్తిగా న్యాయోచితమని భావించారు. ఉదాహరణకు, “సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల” వ్యక్తి ఉన్నాడని లూకా చెప్పాడు. (లూకా 19:2) “సుంకపు గుత్తదారుడు” జక్కయ్య మరియు ఆయన పర్యవేక్షణలోనున్న వారు ప్రజలను శ్రమలపాలు చేసి ధనవంతులయినట్లు కనిపిస్తోంది. అక్రమ, భ్రష్టాచారాలను ఈ విధానం ప్రవేశపెట్టడం, ఈ సుంకరులను ప్రజలు పాపులతోనూ వ్యభిచారులతోనూ జమకట్టేందుకు కారణమైంది, మరి అనేక సందర్భాల్లో బహుశ, అలా చేయడం సమంజసమే. (మత్తయి 9:10; 21:31, 32; మార్కు 2:15; లూకా 7:34) ప్రజలు దాదాపు మోయలేని భారమన్నట్లు భావించారు కనుక, రోమా కాడి క్రింద విసుగుచెందకుండా, “యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. . . . అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి” అని తన తోటి క్రైస్తవులకు జ్ఞాపకం చేయవల్సిన అవసరత ఉందని అపొస్తలుడైన పౌలు భావించడంలో ఆశ్చర్యం లేదు.—రోమీయులు 13:7; లూకా 23:2 పోల్చండి.
7. రోమా శిక్షాన్యాయవిధి ప్రజల భారాన్ని ఎలా అధికం చేసింది?
7 ‘ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండుడి’ అని పౌలు క్రైస్తవులకు జ్ఞాపకంచేశాడు. (రోమీయులు 13:7) క్రూరత్వానికి మరియు శిక్షాన్యాయవిధి తీవ్రతకు రోమీయులు పేరుమోసినవారు. ప్రజలను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు కొరడాదెబ్బలు, పేముబెత్తము, కఠినమైన కారాగారం, ఉరిశిక్షలు తరచూ ఉపయోగించబడేవి. (లూకా 23:32, 33; అపొస్తలుల కార్యములు 22:24, 25) యూదా నాయకులకు కూడా అలాంటి శిక్షను విధించడం సబబని తలంచారు కనుక దాన్ని విధించే అధికారం వారికి కూడా ఇవ్వబడింది. (మత్తయి 10:17; అపొస్తలుల కార్యములు 5:40) అలాంటి విధానం క్రింద ఉన్నవారెవరికైనా అది పూర్తి అణచివేతే.
8. మతనాయకులు ప్రజలపై భారాన్ని ఎలా మోపారు?
8 అయితే, రోమా పన్నులు మరియు నియమాలకన్నా ఘోరమైనవి, నాటి మత నాయకులు సామాన్య ప్రజలపై మోపిన భారమే. వాస్తవానికి, ప్రజలు ‘ప్రయాసపడి భారము మోసే’ వారు అని యేసు వర్ణించినప్పుడు, అదే ఆయన ముఖ్యాసక్తిగా కనిపించింది. కృంగిన ప్రజలకు నిరీక్షణనూ ఉపశమనాన్ని ఇచ్చే బదులు, మత నాయకులు “మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు” అని యేసు చెప్పాడు. (మత్తయి 23:4; లూకా 11:46) మత నాయకులను—ప్రత్యేకంగా శాస్త్రులు పరిసయ్యులను అహంకారులుగానూ హృదయంలేనివారిగానూ వేషధారగుంపుగానూ సరిగ్గా చిత్రీకరించడాన్ని ఒకరు గమనించకుండా ఉండరు. వారు మామూలు ప్రజలను పామరులుగానూ అపవిత్రమైనవారిగానూ చిన్నచూపు చూసేవారు, మరి వారు తమ మధ్యనున్న విదేశీయులను అలక్ష్యం చేశారు. వారి వైఖరిని గూర్చి ఓ వ్యాఖ్యానం ఇలా పేర్కొంది: “ఈ రోజుల్లో ఒక వ్యక్తి గుర్రం మీద ఎక్కువ బరువు మోపితే చట్టబద్ధంగా శిక్షించబడతాడు. మరి 613 ఆజ్ఞలను, ఏ మత శిక్షణా లేని ‘సాధారణ ప్రజలపై’ మోపి, తర్వాత వారికి సహాయపడేందుకు ఏమీ చేయకుండ, దేవుని నమ్మనివారని నిందించిన వ్యక్తి విషయమేమిటి?” నిస్సందేహంగా అసలైన బరువు, మోషే ధర్మశాస్త్రంకాదుగానీ ప్రజలపై మోపబడిన అనేక పారంపర్యాలే.
కష్టానికి అసలైన కారణం
9. యేసు కాలంలోని ప్రజల పరిస్థితి, రాజైన సొలొమోను దినాలకు ఎలా పోల్చబడగలదు?
9 కొన్నిసార్లు, ప్రజలపై మోపబడిన వస్తుసంబంధమైన బరువు పేదరికం ఎంతో విస్తారంగా వ్యాపించేంత భారంగావుంది. ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న యుక్తమైన పన్నులను చెల్లించాల్సి ఉంది. తర్వాత సొలొమోను పరిపాలన సమయంలో, ఆలయ నిర్మాణం మరియు ఇతర కట్టడాలవంటి చాలా ఖరీదైన జాతీయ పథకాలకు ప్రజలు మద్దతునిచ్చారు. (1 రాజులు 7:1-8; 9:17-19) అయితే ప్రజలు, “తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. . . . సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి” అని బైబిలు మనకు చెబుతోంది. (1 రాజులు 4:20, 25) ఆ తేడాకు కారణమేమిటి?
10. మొదటి శతాబ్దం కల్లా ఇశ్రాయేలు పరిస్థితి అలా అయ్యేందుకు కారణమేమిటి?
10 ఆ జనాంగం నిజమైన ఆరాధన పక్షంలో దృఢంగా నిలుచున్నంతవరకు వారు యెహోవా అనుగ్రహాన్ని అనుభవించారు మరియు జాతీయ ఖర్చులకొరకు ఎంతో వ్యయం చేసినప్పటికీ, భద్రత మరియు సంపదలతో ఆయన వారిని ఆశీర్వదించాడు. అయితే, వారు “యేమాత్రమైనను [ఆయనను] వెంబడించుట మాని, [ఆయన] ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక” పోయినా వారు దాని తీవ్రమైన ప్రతిఫలాలను అనుభవిస్తారని యెహోవా హెచ్చరించాడు. వాస్తవానికి, “ఇశ్రాయేలీయులు సర్వజనములలో . . . సామెతగాను హేళనగాను చేయబడుదురు.” (1 రాజులు 9:6, 7) సరిగ్గా అలాగే జరిగింది. ఇశ్రాయేలు విదేశీ ఆధిపత్యంలోకి వచ్చింది, మరి ఒకప్పటి మహనీయమైన రాజ్యం వట్టి అధినివేశ ప్రాంతంగా తగ్గించబడింది. తమ ఆత్మీయ విధులను అలక్ష్యం చేయడంవల్ల ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చిందోకదా!
11. ప్రజలు ‘కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నారు’ అని యేసు ఎందుకు భావించాడు?
11 ఆయన చూసిన ప్రజలు ‘విసికి చెదరి యున్నారు’ అని యేసు ఎందుకు భావించాడో మనం అర్థం చేసుకునేందుకు ఇదంతా సహాయపడుతుంది. వీరు, దేవుని విధుల ప్రకారం జీవించేందుకు మరియు తమ ఆరాధనను అంగీకృతమైన విధంగా సాగించేందుకు ప్రయత్నించే యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులు. అయినప్పటికీ, రాజకీయ మరియు వాణిజ్య శక్తులు మాత్రమే కాకుండ వారిలో ఉన్న మతభ్రష్టమైన మత నాయకులు కూడా వారిని స్వలాభం కొరకు ఉపయోగించుకుని, అణగద్రొక్కారు. వారు “కాపరి లేని గొఱ్ఱెలవలె” ఉన్నారు ఎందుకంటే వారి ఎడల శ్రద్ధ వహించేవారెవరూ లేరు లేక వారిని కాపాడేవారెవరూ లేరు. వారు చేదు నిజాలను ఎదుర్కొనేందుకు వారికి సహాయమవసరమైంది. యేసు ఇచ్చిన ప్రేమపూర్వకమైన చల్లని ఆహ్వానం ఎంత సమయోచితమైనది!
నేడు యేసు ఇచ్చే ఆహ్వానం
12. కొందరు దేవుని సేవకులు మరితర యథార్థమైన ప్రజలు నేడు ఎలాంటి ఒత్తిళ్లను అనుభవిస్తున్నారు?
12 అనేక విధాల్లో నేటి విషయాలు అలాగే ఉన్నాయి. నిజాయితీగా జీవించేందుకు ప్రయత్నించే అనేకమంది యథార్థమైన ప్రజలు, కుళ్లుపట్టిన ఈ విధానపు ఒత్తిళ్లనూ అవసరతలను భరించడం చాలా కష్టంగా ఉన్నట్లు కనుగొన్నారు. తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నవారు సహితం దీని నుండి మినహాయించబడలేరు. యెహోవా సేవకుల్లో కొందరు తమ బాధ్యతలకు తగినట్లుగా జీవించాలని ఇష్టపడుతున్నప్పటికీ అలా చేయడం చాలా కష్టమౌతున్నట్లుగా కొందరు కనుగొంటున్నారని నివేదికలు కనపరుస్తున్నాయి. తమ మీద ఎంతో భారమున్నట్లుగా, అలసిపోయినట్లుగా వారు భావిస్తున్నారు. మరికొందరైతే, అంతా గాలికి వదిలేసి, ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయి, అలా తమ ఆలోచనలను స్థిమితపర్చుకోగలిగితే తాము కొంత ఉపశమనాన్ని అనుభవించగలమని భావించారు. మీరెన్నడైనా అలా భావించారా? మీకు సన్నిహితులైన వారెవరైనా అదే పరిస్థితిలో ఉన్నారా? అవును, యేసు హృదయానందకరమైన ఆహ్వానం మనకు నేడు ఎంతో భావాన్ని కల్గివుంది.
13. యేసు మనకు ఓదార్పును ఉపశమనాన్ని ఇస్తాడని మనం కచ్చితంగా ఎలా చెప్పగలం?
13 యేసు తన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఇచ్చేముందు ఆయన ఇలా పేర్కొన్నాడు: “సమస్తమును నా తండ్రిచేత నాకప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.” (మత్తయి 11:27) యేసు మరియు ఆయన తండ్రి మధ్యనున్న ఈ సన్నిహిత సంబంధం కారణంగా, యేసు ఆహ్వానాన్ని అంగీకరించి, ఆయన శిష్యులవ్వడం ద్వారా, “సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు” అయిన యెహోవాతో మనం వ్యక్తిగతమైన సంబంధాన్ని సన్నిహితత్వాన్ని అనుభవించగలమన్న హామీ మనకుంది. (2 కొరింథీయులు 1:3; యోహాను 14:6 పోల్చండి.) దానికి తోడు, ‘సమస్తమును ఆయనకప్పగించబడి ఉంది’ కనుక, మన భారాలను తేలిక చేసే శక్తి అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నాయి. ఏవి? కుళ్లుపట్టిన రాజకీయ, వాణిజ్య మరియు మత విధానం మోపిన భారాలు మరియు మన పాపమూ అపరిపూర్ణతలు మోపిన భారాలు ఉన్నాయి. మొదటినుండీ కూడా అది ఎంత ప్రోత్సాహకరమైన మరియు అభయప్రదమైన ఆలోచనో!
14. ఏ శ్రమనుండి యేసు ఉపశమనాన్ని అందించగలడు?
14 యేసు ఇంకా ఇలా చెబుతున్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకురండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్తయి 11:28) యేసు కష్టపడి పని చేయడానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్నది కచ్చితం ఎందుకంటే ప్రస్తుతం చేయవల్సిన పనిని చేసేందుకు పాటుపడమని ఆయన తరచూ తన అనుచరులకు సలహానిచ్చాడు. (లూకా 13:24) అయితే, “ప్రయాసపడి” (“కష్టపడడం,” కింగ్‌డమ్ ఇంటర్లీనియర్) అంటే ఎక్కువ కాలం ఉండేదిగానూ అలసట కలిగించేదిగానూ ఉండే పని, దానికి తరచూ ఉపయుక్తమైన ప్రతిఫలమూ ఉండదు. మరి, “భారము మోసికొను” అన్న పదానికి మామూలుగా మోయగలదానికంటే ఎక్కువ బరువు మోపడమనే భావముంది. వాటి మధ్యనున్న తేడాను, దాగివున్న సంపదకొరకు వెదికే మనిషికి మరియు లేబరు క్యాంపులో నీటి కాలువను త్రవ్వే వ్యక్తికి మధ్య ఉన్న తేడాతో పోల్చవచ్చు. వారు అలాంటి కష్టతరమైన పనిని చేస్తున్నారు. ఒకరు ఆ పనిని ఎంతో ఆసక్తితో చేస్తారు, అయితే మరొకరికి అది అంతులేని వెట్టి చాకిరీ. అసలు తేడా ఏమిటంటే ఆ పనికి ఒక ఉద్దేశం ఉండడం లేక, ఏ ఉద్దేశం లేకపోవడం.
15. (ఎ) మనం మన భుజాలపై భారమైన బరువును మోస్తున్నామని మనం అనుకుంటున్నట్లైతే మనం ఏ ప్రశ్నలను వేసుకోవాలి? (బి) మన భారం ఎక్కడనుండి వస్తుందన్న విషయాన్ని గూర్చి ఏమి చెప్పవచ్చు?
15 మీరు ‘ప్రయాసపడి భారము మోస్తున్నట్లుగా,’ మీ సమయము శక్తి నుండి చాలా కోరబడుతోందని మీరు భావిస్తున్నారా? మీరు మోసే బరువులు మీకు చాలా భారంగా ఉన్నాయా? అలాగైనట్లైతే, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఎందుకు ప్రయాసపడుతున్నాను? నేను ఎలాంటి బరువును మోస్తున్నాను?’ ఈ విషయంలో, ఓ బైబిలు వ్యాఖ్యాత 80 సంవత్సరాలకు పూర్వం ఇలా చెప్పాడు: “జీవన భారాలను మనం పరిశీలిస్తే అవి రెండు తరగతుల్లోకి చేరుతాయి; వాటిని మనం స్వయం-విధితమైనవిగా మరియు నివారించరానివిగా పేర్కొనవచ్చు: అంటే మన చర్యలవల్ల కలిగేవి మరియు మన చర్యల వల్ల కలగనివి.” ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “మనలో అనేకులం ఓ కచ్చితమైన స్వయం పరిశీలన తర్వాత, స్వయం-విధిత భారాల మొత్తం ఎంత పెద్దదో కనుగొని ఆశ్చర్యచకితులమౌతాము.”
16. అవివేకంగా మనం మన మీద ఏ భారాలను మోపుకోవచ్చు?
16 మనపై మనమే మోసుకునే కొన్ని భారాలేమి? నేడు మనం వస్తుపరమైన, విలాస ప్రియమైన మరియు అనైతిక లోకంలో జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1-5) సమర్పిత క్రైస్తవులు సహితం, లోకపు ఫ్యాషన్లకూ జీవన విధానాలకు అంటిపెట్టుకోవాలనే ఎడతెగని ఒత్తిడిని అనుభవిస్తున్నారు. అపొస్తలుడైన యోహాను ‘శరీరాశ నేత్రాశ జీవపుడంబములను’ గూర్చి వ్రాశాడు. (1 యోహాను 2:16) ఇవి మనలను సులభంగా ప్రభావితం చేయగల శక్తివంతమైన ప్రభావాలు. లౌకిక సుఖభోగాన్ని ఎక్కువగా అనుభవించాలని లేక ఒక నిర్దిష్టమైన జీవన విధానాన్ని కల్గివుండాలని కొందరు అంతకంతకూ అప్పుల్లో మునిగిపోయేందుకు ఇష్టపడుతున్నారన్న విషయం తెలిసినదే. ఆ తర్వాత తమ అప్పులను తీర్చుకునేందుకు ఉద్యోగంలో వారు అధిక సమయాన్ని గడపాలని, లేక ఎక్కువ ఉద్యోగాలను చేయాలని వారు కనుగొన్నారు.
17. ఏ పరిస్థితి మనం భారాన్ని భరించడాన్ని మరింత కష్టతరం చేస్తుంది, మరి దాని పరిష్కారమేమిటి?
17 ఇతరులు కల్గివున్న వస్తువులను మనం కల్గివుండడంలోగాని ఇతరులు చేసే పనిని మనం చేయడంలోగానీ ఏ తప్పు లేదని ఒక వ్యక్తి సర్దుకుపోయినప్పటికీ, తన భారానికి తాను అనవసరంగా ఎక్కువ భారాన్ని చేర్చుకుంటున్నాడేమో విశ్లేషించుకోవడం ప్రాముఖ్యం. (1 కొరింథీయులు 10:23) ఒక వ్యక్తి కేవలం కొంతమేరకు మాత్రమే మోయగలడు కనుక, మరో భారాన్ని తీసుకునేందుకుగాను మరి దేన్నైనా తొలగించాల్సి ఉంటుంది. తరచూ, మన ఆత్మీయ శ్రేయస్సుకు అవసరమైనవాటిని—అంటే వ్యక్తిగత బైబిలు పఠనం, కూటాలకు హాజరవ్వడం మరియు ప్రాంతీయ సేవలనే మనం మొదటిగా ప్రక్కన పెడుతుంటాము. దాని ఫలితం, ఆత్మీయ శక్తిని కోల్పోవడం, తద్వారా మనం భారాన్ని సహించడం మరింత అది కష్టతరం చేస్తుంది. “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును” అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన అలాంటి అపాయాన్ని గూర్చి హెచ్చరించాడు. (లూకా 21:34, 35; హెబ్రీయులు 12:1) ఒక వ్యక్తికి భారమెక్కువై, అలసిపోయినట్లైతే, ఆ ఉరిని గుర్తించి దాన్ని తప్పించుకోవడం కష్టమౌతుంది.
విముక్తి, ఉపశమనం
18. తన వద్దకు వచ్చేవారికి యేసు ఏమి ఇస్తున్నాడు?
18 కనుక ప్రేమపూర్వకంగా యేసు దానికి పరిహారాన్నిచ్చాడు: “నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి [“ఉపశమనం,” NW] కలుగజేతును.” (మత్తయి 11:28) ఇక్కడున్న “ఉపశమనం” మరియు 29వ వచనంలోని “ఉపశమనం” అనే పదాలు, ‘సబ్బాతుకు’ లేక ‘సబ్బాతు ఆచరించేందుకు’ సెప్టూజింట్ వర్షన్ ఉపయోగించిన హెబ్రీ పదం నుండి వచ్చిన అదే గ్రీకు పదానికి సంబంధించి ఉన్నాయి. (నిర్గమకాండము 16:23) ఆ విధంగా, తన దగ్గరకు వచ్చిన వారికి ఏ పని ఉండదని యేసు వాగ్దానం చేయలేదు, కానీ దేవుని ఉద్దేశానికి అనుగుణంగా వారు చేయవల్సిన పనికి సిద్ధంగా ఉండేందుకుగాను వారికి విశ్రాంతినిస్తానని ఆయన వాగ్దానం చేశాడు.
19. ఒకరు ఎలా ‘యేసు యొద్దకు వస్తారు’?
19 మరి అయితే ఒకరు ఎలా ‘యేసు యొద్దకు వస్తారు?’ యేసు తన అనుచరులతో ఇలా చెప్పాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) కనుక, యేసు వద్దకు రావడం అంటే ఒక బాధ్యతా భారాన్ని అంగీకరించి, దేవుడు మరియు క్రీస్తుల చిత్తానికి తమ చిత్తాన్ని అప్పగించడమూ, అలా చేయడంలో కొనసాగడమూ అని భావం. నిజంగా ఇది ఎక్కువగా కోరడమా? దీని మూల్యం చాలా అధికంగా ఉందా? అలసినవారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఇచ్చిన తర్వాత యేసు ఏమి చెప్పాడో మనం పరిశీలిద్దాం.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
◻ యేసు కాలంలోని ప్రజలపై ఏ విధాల్లో భారంమోపబడింది?
◻ ప్రజల కష్టాలకు అసలు కారణమేమిటి?
◻ మనం అధికంగా భారాన్ని మోస్తున్నామని అనుకుంటున్నట్లైతే మనం మనలను ఎలా పరిశీలించుకోవాలి?
◻ అవివేకంగా మనం మన మీద ఏ భారాలను మోపుకోవచ్చు?
◻ యేసు వాగ్దానం చేసిన ఉపశమనాన్ని మనం ఎలా పొందగలం?
[15వ పేజీలోని చిత్రం]
మనపైకి మనమే మోపుకునే కొన్ని భారములు ఏవి?
[15వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of Bahamas Ministry of Tourism