శ్రీలంకలోని విశ్వసనీయమైన కుటుంబాలు అభివృద్ధిని త్వరితగతం చేస్తున్నాయి
పందొమ్మిదివందల డెబ్బైరెండు వరకూ సిలోనుగా పేరుగాంచిన శ్రీలంక, ఈతచెట్లున్న తీరాలూ పర్వతశిఖరాలూ చిన్న మరుభూములూ ఉన్న మనోహరమైన ద్వీపం. ఉన్నత ప్రదేశాల్లో 2,243 మీటర్ల ఎత్తునున్న ఆడమ్స్ శిఖరం నాలుగు ముఖ్యమైన మతాలకు పరిశుద్ధ స్థలం.a సమీపంలోనే, 1,500 మీటర్ల క్రిందికి ఏటవాలుగా ఉండే రాళ్ళ దగ్గర వర్ల్డ్ ఎన్డ్ అని పిలువబడే వాలుగా ఉండే కోట గోడ ఉంది. శ్రీలంకలోని చూడదగిన అతి సుందరమైన దృశ్యాల్లోని ఒకటి ఇక్కడ కనిపిస్తుంది.
శ్రీలంకలోని 1.8 కోట్ల నివాసులు ఆసక్తికరమైన పుట్టుపూర్వోత్తరాలను కల్గివున్నారు. సా.శ.పూ అయిదవ శతాబ్దం నుండి ఇండోయూరోపియన్ అసలు జాతి ప్రజలు ఆ ద్వీపంలో నివసించారు. వారు నేటి జనాబాలో మూడువంతులున్న సింహళీయులే. తర్వాత, 12వ శతాబ్దంలో, దక్షిణ భారతంనుండి తమిళులనేకమంది అలల్లా వచ్చారు; ఇప్పుడు వీరు ముఖ్యంగా ఆ ద్వీపంలో ఉత్తరాన మరియు తూర్పున నివసిస్తున్నారు. పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటీషువారు కూడా వలస ప్రభుత్వ దినాలనుండే తమ గురుతును విడిచిపెట్టారు. దానికితోడు, అరేబియా మరియు మలయన్ ద్వీపకల్పాల్లోని సముద్రవర్తకులు స్థానిక ప్రజల మధ్య స్థిరపడ్డారు. ఐరోపావారు, పార్సీవారు, చైనా దేశీయులు మరియు ఇతరుల చిన్న ఒంటరి గుంపులు కూడా ఉన్నాయి.
శ్రీలంకలో వర్గాల కలయికే కాకుండా, భాష మరియు మతం వాటి పుట్టుపూర్వోత్తరాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ ద్వీపంలోని ప్రాముఖ్యమైన భాషలు సింహళము, తమిళం మరియు ఆంగ్లం. అనేకమంది శ్రీలంకవారు మూడింటిలో కనీసం రెండింటిని మాట్లాడతారు. జాతి సంబంధిత పూర్వాపరాలు కూడా ప్రజల మతంలో ముఖ్యమైన భాగాన్ని వహిస్తాయి. అనేకమంది సింహళీయులు బౌద్ధ మతానికి చెందినవారు, అయితే అనేకమంది తమిళులు హిందువులు. అరబ్బిక్ లేక మలయన్లకు సంబంధించినవారు ముస్లిమ్ మతానికి చెందినవారై ఉంటారు మరియు ఐరోపా పూర్వరంగంగల వారు సహజంగా కాథోలిక్ మరియు ప్రొటెస్టెంట్లవంటి క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చి సభ్యులై ఉంటారు.
సవాలును ఎదుర్కోవడం
ఇదంతా కూడా, శ్రీలంకలోని యెహోవాసాక్షులకు గొప్ప సవాలును ముందుంచుతోంది. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును” అన్న యేసు ఆజ్ఞను పాటించేందుకు వీరు కష్టపడి పనిచేస్తారు. (మత్తయి 24:14) అనేక భాషలతో వ్యవహరించడమే కాకుండ, సువార్త ప్రచారకులు కొన్ని గంటల పరిచర్యలోనే బౌద్ధులతోనూ హిందువులతోనూ క్రైస్తవమత సామ్రాజ్యంలోని సభ్యులతోనూ అలాగే నాస్తికులతోనూ—అందరితోనూ మాట్లాడవల్సి ఉంటుంది.
తమ పరిచర్యలో ఫలవంతంగా ఉండేందుకు, ప్రచారకులు కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను, ఇతర బైబిలు సాహిత్యాలను తమిళంలోనూ సింహళంలోను మరియు ఆంగ్లంలోనూ తీసుకెళ్లాలి. ఆ భాషల్లో బైబిళ్లను సహితం తీసుకు వెళ్లగలవారు వాటిని కూడా తీసుకువెళతారు. దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? మరియు మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూర్లు మరియు ఈ లోకం నిలుస్తుందా? అనే కరపత్రం మూడు భాషల్లో వెంటవెంటనే వెలువడినప్పుడు ప్రచారకులు మహాదానందాన్ని పొందారు. అంటే వారి పనికి మరిన్ని ఉపకరణాలు లభించాయన్నమాట.
అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సమాఖ్యకు ఆ నాటి అధ్యక్షుడైన చార్ల్స్ తేజ్ రస్సల్ సిలోన్‌ను ఒకసారి సందర్శించినప్పటినుండి, అంటే 1912 నుండి సాక్షులు అక్కడ కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు. అయితే, 1947 నందు వాచ్‌టవర్ బైబిలు విద్యార్థుల గిలియడ్ పాఠశాల పట్టభద్రులు వచ్చేంతవరకూ ప్రాముఖ్యమైన పెరుగుదల సంభవించలేదు. ఆ నాటినుండి, శ్రీలంకలోని ప్రచారకులు తమ ప్రకటనాపనిలో మంచి ఫలితాలను అనుభవించారు. మరి 1994 నందు ప్రతినెల 1,866 మరి రాజ్య ప్రచారకులు 2,551 గృహ బైబిలు పఠనాలను నిర్వహించారు. మరి జ్ఞాపకార్థ దినానికి హాజరైన 6,930 మంది సంఖ్య కూడా అన్ని సంఘాల్లోని ప్రచారకుల సంఖ్యకు సుమారు నాలుగు రెట్లు ఎక్కువ. ఎంతటి అద్భుతమైన ఆశీర్వాదం!
ఇతర దేశాలతో పోల్చి చూస్తే శ్రీలంకలోని పురోభివృద్ధి మందకొడిగా సాగుతోందని అనిపిస్తుంది. దానికి ఒక కారణమైన గట్టి కుటుంబ సంబంధాలని అనిపిస్తోంది. అయితే, ఇవి ప్రయోజనకరంగా కూడా ఉండవచ్చు. రోమా సైన్యాధికారియైన కొర్నేలి సత్యం విషయంలో తన స్థానాన్ని తీసుకున్నప్పుడు, అతని కుటుంబమంతా అతని పక్షంలో నిలిచింది. (అపొస్తలుల కార్యములు 10:1, 2, 24, 44) అపొస్తలుల కార్యముల పుస్తకం లూదియ, క్రిస్పు మరియు పౌలు సీలతో సహా ఇతర బలమైన క్రైస్తవ కుటుంబాన్ని గూర్చి కూడా ప్రస్తావిస్తోంది.—అపొస్తలుల కార్యములు 16:14, 15, 32-34; 18:8.
వాస్తవానికి, ఎక్కడైతే మంచి వ్యవస్థీకరణ మరియు విశ్వాసంతో కూడిన పట్టుదల ఉంటుందో అక్కడ గట్టి కుటుంబ సంబంధాలు ప్రయోజనకరంగా ఉండగలవు. యెషయా 60:22 నందలి మాటలు మనస్సులో పెట్టుకుని రే మాథ్యుస్ అనే ఓ దీర్ఘకాలీన మిషనరీ ఇలా చెప్పారు: “యెహోవా కేవలం వ్యక్తుల ద్వారా కాక కుటుంబాల ద్వారా కూడా సరైన సమయంలో విషయాలను త్వరితం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.”
వ్యవస్థీకరించబడిన కుటుంబం స్తుతిని తెస్తుంది
నేడు శ్రీలంకలో నిజంగానే అలాంటి విశ్వసనీయమైన కుటుంబాలున్నాయి. ఉదాహరణకు, చక్కగా వ్యవస్థీకరించబడిన సిన్నప్ప కుటుంబం శ్రీలంకలోని ముఖ్య పట్టణమైన కొలంబోలోని ఒక మండలమైన కొట్టహెనాలో ఉంది. కుటుంబ యజమాని మరియన్ మరణించి ఎక్కువ కాలం కాకపోయినప్పటికీ ఆయన భార్య అన్నమ్మ 15 మంది పిల్లల్లో 13 నుండి 33 సంవత్సరాల వయస్సుగల 12 మంది, కుటుంబ సమేతంగా యెహోవాను సేవిస్తూనే ఉన్నారు. దీన్ని రాసే సమయానికి, ఎనిమిది మంది పిల్లలు బాప్తిస్మం తీసుకున్నారు, మరి వారిలో ముగ్గురు పూర్తికాల పరిచర్యలో క్రమపయినీర్లుగా సేవచేస్తున్నారు. మిగిలిన ముగ్గురు అప్పుడప్పుడు సహాయ పయినీరు సేవను చేస్తున్నారు. ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవారైన నలుగురు పిల్లలు బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు. దానికి తోడు, నలుగురు మనమలు ఇంకా చాలా చిన్న వయస్సువారైనప్పటికీ, యెహోవాసాక్షుల కొలంబో ఉత్తర సంఘపు క్రైస్తవ కూటాలకు హాజరౌతూ బైబిలును పఠిస్తున్నారు.
అన్నమ్మ 1978లో కావలికోట ప్రతిని అంగీకరించినప్పుడు ఆమె మొదటిసారిగా రాజ్యసువార్తను వినింది. బైబిలు పఠనం ప్రారంభమైంది, మరి నిత్యజీవమునకు నడుపు సత్యం అనే పుస్తకం సహాయంతో బైబిలు పఠనాన్ని పూర్తి చేసిన తర్వాత అన్నమ్మ తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంది, ఆ విధంగా తన ఇంటివారిలో అనేకులకు ప్రప్రథమ మాదిరిగా నిలిచింది.
సైనికుడైన కొర్నేలిలా అన్నమ్మకు తన ఇంట్లో మంచి వ్యవస్థీకరణ ఉంది. “మేము క్రైస్తవ కూటాలకూ సమావేశాలకు ముందుగా ఏర్పాటు చేసుకోవల్సివచ్చేది—ఇక పాఠశాల విషయం వేరే చెప్పనవసరం లేదు. దుస్తులు ఒక సమస్యగా ఉండేవి, కానీ యెహోవా సహాయంతో మేము ప్రతి సమావేశానికి కొత్త దుస్తులను వేసుకోగలిగేవాళ్లం. కుటుంబమంతా చక్కగా దుస్తులు ధరించుకుని మంచిగా భుజించి—పెద్ద నవ్వుతో వచ్చేది” అని అన్నమ్మ జ్ఞాపకం చేసుకుంది.
పిల్లలు తమ ఇంటి వ్యవస్థీకరణను ఆప్యాయతతో జ్ఞాపకముంచుకునేవారు. కుటుంబమంతా క్రైస్తవ కూటాలకు హాజరయ్యేలా సహాయపడేందుకు, సహజంగా వారిలో పెద్దవారికి ప్రత్యేకమైన బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు, మంగళ బట్టలు ఉతికేది, వినఫ్రెడా ఇస్త్రీ చేసేది. చిన్న వాళ్లకు బట్టలు వేసుకునేందుకు కూడా సహాయపడే వినఫ్రెడా ఇలా అంటోంది: “ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు అందరూ నిజంగా చక్కగా కనిపించేవారు.”
ఆత్మీయ అవసరతలు కూడా అలాగే చక్కగా వ్యవస్థీకరించబడేవి. ఇప్పుడు ఓ క్రమపయినీరైన పుష్పమ్ అనే కూతురు ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “ప్రతి రోజు మా కుటుంబం బైబిలును చదవడం మరియు బైబిలు ప్రతిదిన వాక్యాలను కలిసి పునఃపరిశీలించడంలో ఆనందించేది.” అన్నమ్మ ఇంకా ఇలా చెబుతోంది: “ప్రతి బిడ్డకూ బైబిలు, కావలికోట, మరితర సాహిత్యాల వ్యక్తిగతప్రతులు ఉండేవి. వారు కూటాల్లో చెప్పే వ్యాఖ్యానాలన్నింటిని నేను జాగ్రత్తగా వింటాను. ఎక్కడైతే అవసరమనిపిస్తుందో అక్కడ సరిచేసేందుకు మరియు ప్రోత్సహించేందుకు నేను మరలా ఇంటివద్ద మాట్లాడతాను. ప్రార్థనతో మా దినాన్ని ముగించేందుకు మేము ప్రతి రాత్రి కలుసుకుంటాము.”
అన్నమ్మ తన కుటుంబంలోని అందరికీ చక్కని క్రైస్తవ బోధను అందించడంలో సహాయం చేసేందుకు ఆమె పెద్ద బిడ్డలు అమూల్యమైన సహాయకంగా ఉన్నారు. అయితే, తీరికలేని పట్టిక, ఇంటి వెలుపల సువార్తను పంచుకోవాలనే వారి కోరికను ఏ మాత్రం ఆటంకపర్చలేదు. కుటుంబంలోని వివిధ సభ్యులందరూ కలిసి, చుట్టుప్రక్కల ప్రజల్లోని 57 మందితో బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. అల్లుడైన రాజన్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ఈ కుటుంబం పురోభివృద్ధిని సాధించే బైబిలు పఠనాలను నిర్వహిస్తుంది. అప్పుడే తాను పఠించే ఒక విద్యార్థి తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడం చూసే ఆధిక్యత నా భార్య పుష్పమ్కు లభించింది.”
ఇంతటి పెద్ద కుటుంబం రోమన్ కాథోలిక్ చర్చిని విడవడం కొట్టహెనాలో పెద్ద అలజడిని రేపింది. ఆ కుటుంబం ఎందుకు చర్చిని విడిచారో కనుగొనేందుకు ప్రీస్టు తానుగా ఆ కుటుంబాన్ని ఎన్నడూ సందర్శించలేదుకానీ, వివరాలు కనుక్కోమని ఆయన చర్చి సభ్యులను కోరాడు. చర్చలెన్నో జరిగాయి ఎక్కువగా త్రిత్వ సిద్ధాంతాన్ని గూర్చే. అన్నమ్మ తన విశ్వాసం పక్షంగా మాట్లాడేందుకు ఎల్లప్పుడూ యెహోవా మీద మరియు బైబిలు మీద ఆధారపడింది. ఈ చర్చల్లో ఆమెకు ప్రియమైన లేఖనం యోహాను 17:3.
మంచి వ్యవస్థీకరణ మరియు ఎడతెగని ప్రయత్నం సంతృప్తికరమైన ఫలితాలను తీసుకురాగలదని సిన్నప్ప కుటుంబం స్పష్టంగా ప్రదర్శిస్తోంది. వారి ఆసక్తితో కూడిన ప్రయత్నాల ద్వారా రాజ్య ప్రచారకుల నూతన తరం పెరుగుతోంది—అంతా యెహోవాను స్తుతించేందుకే.
వ్యతిరేకత కుటుంబాన్ని నిజమైన ఆరాధనలో ఐక్యపరుస్తుంది
రత్నం ఇల్లు, సిన్నప్ప ఇంటినుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో కొలంబోలోని మరో మండలంనందలి నర్హెన్పిట్యాలో ఉంది. వారు కూడా మునుపు రోమన్ కాథోలిక్కులే. పందొమ్మిదివందల ఎనభైరెండు నందు ఇంటింటి పరిచర్య చేస్తున్న సాక్షులు బాలేంద్రన్ను అంటే పెద్దమ్మాయి ఫాతిమా భర్తను కలిశారు. కుటుంబమంతటితోనూ బైబిలు పఠనం ప్రారంభించబడింది. కొంత కాలానికే వారి ముగ్గురు పిల్లలు తమ అమ్మమ్మ ఇగ్నాసిమల్ను దేవుని నామాన్ని గూర్చి అడగడం మొదలుపెట్టారు. పిల్లలు దానికి “యెహోవా” అని జవాబు చెప్పినప్పుడు అమ్మమ్మకు ఆసక్తి కలిగింది, అలా ఆమెతో కూడా బైబిలు పఠనం ప్రారంభించబడింది. తర్వాత, ఆమె కుమార్తెల్లో ఇద్దరైన జీవకళా మరియు స్టెల్లాకూడా పఠనానికి చేరారు, మరి 1988 కల్లా ఆ ముగ్గురూ బాప్తిస్మం తీసుకున్నారు.
ఈ మధ్యలో, బాలేంద్రన్ ఫాతిమాలు, ఫాతిమా చెల్లెలైన మల్లిక మరియు ఆమె భర్తైన యోగనాతన్తో సత్యాన్ని పంచుకున్నారు. పందొమ్మిదివందల ఎనభై ఏడు కల్లా ఈ దంపతులు బాప్తిస్మం తీసుకున్నారు మరియు తమ పిల్లల్లో యెహోవా ఎడల మిక్కుటమైన ప్రేమను నాటారు. ఇక తర్వాత ఫాతిమా మరో చెల్లెలైన పుష్ప సత్యంలోకి వచ్చింది. ఆమె సమర్పించుకుని 1990 నందు బాప్తిస్మం తీసుకుంది. ఆమె భర్త ఉన్నప్పుడు, టోక్యోలో ఆంగ్ల సంఘంలో సేవచేసేవాడు, మరి పుష్ప తమ కుమారుడు ఆల్ఫ్రెడ్ యెహోవా మార్గంలో పెరిగేందుకు సహాయపడింది.
ఇంతవరకు, రత్నం కుటుంబంలోని పదిమంది పిల్లల్లో నలుగురు సత్యారాధన విషయంలో దాని పక్షం వహించారు. సంతోషకరంగా, తమ వ్యక్తిగత బైబిలు పఠనంలో ఇంకా ముగ్గురు మంచి పురోభివృద్ధిని సాధిస్తున్నారు. పదకొండు మంది మనమళ్లలో, ఒక అమ్మాయి ప్రదీప ఇప్పటికే బాప్తిస్మం తీసుకుంది. మిగిలిన ఏడుగురు చిన్న పిల్లలు తమ బైబిలు పఠనాల ద్వారా క్రమంగా బోధించబడుతున్నారు. దానికి తోడు, చుట్టుప్రక్క ప్రాంతాల్లోని ఆసక్తిగల ప్రజలతో 24 గృహ బైబిలు పఠనాలు నిర్వహించబడుతున్నాయి.
ఇదంతా, సులభంగా జరగలేదు. మొదట్లో, కుటుంబ వ్యతిరేకత ఉండేది. తండ్రి ముత్తుపిల్లై మరియు పెద్దన్నలు, తమ కుటుంబంలోని సభ్యులెవరూ రాజ్యమందిరాల్లోని కూటాలకు హాజరవ్వడానికే లేక బహిరంగ పరిచర్యలో పాల్గొనడానికే ఏ మాత్రం అంగీకరించలేదు. దీనిలో కొంత మేరకు వ్యక్తిగత భద్రత ఎడల శ్రద్ధ వల్ల చేయాల్సి వచ్చినప్పటికీ ముత్తుపిల్లై ఇలా చెప్పాడు: “నేను పూర్తిగా ‘సెయింట్‌లకు’ అర్పితమైపోయాను మరియు నా కుటుంబం కాథోలిక్ చర్చిని విడిచిపెట్టడాన్ని నేను అంగీకరించలేదు.” అయితే ఇప్పుడు, వారి విశ్వాసం వారికి తీసుకువచ్చిన ప్రయోజనాలను ఆయన చూస్తున్నాడు కనుక ఇప్పుడు వారు నిజమైన దేవున్ని ఆరాధిస్తున్నారని నమ్ముతున్నాడు.
ఉదాహరణకు, ఒకసారి బౌద్ధమతానికి చెందిన ఇంటి యజమాని మాంత్రిక వస్తువులనుపయోగించి తన ఇంటినుండి వారిని తరిమేసేందుకు ప్రయత్నించాడు. ఒకరోజు రాత్రి ఆయన వచ్చి, “మంత్రించిన” నిమ్మకాయలను ఇంటి చుట్టూ పెట్టాడు. అంధవిశ్వాసులైనవారికి భయం వేసింది, రత్నం కుటుంబంలో ఏదో అశుభ సంఘటన జరుగుతుందని వారందరూ ఎదురు చూశారు. అయితే దీన్ని ఇగ్నాసిమల్ చూసినప్పుడు, ఆమె, ఆమె పిల్లలు వచ్చి ఏ భయమూ భీతీ లేకుండ ఆ కాయలను తీసివేశారు—మరి వారికి ఏ హానీ జరగలేదు. భయంలేని వారి చర్య తమ ఎడల గొప్ప గౌరవాన్ని ప్రజలు కల్గివుండేట్లు చేస్తూ ఆ ప్రాంతంలో మంచి సాక్ష్యమైంది. సమీప వీధుల్లో స్టెల్లా రెండు గృహ బైబిలు పఠనాలను ప్రారంభించగలిగింది. దీని వల్ల పురికొల్పబడి, కోడలైన నజీరా కూడా బైబిలు పఠనాన్ని అంగీకరించింది.
తన కుటుంబంపై కుమ్మరింపబడే అనేక ఆశీర్వాదాలను చూస్తూ ఇగ్నాసిమల్ ఇలా చెప్పింది: “కుటుంబంలోని ఆత్మీయ అభివృద్ధిని చూసి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. యెహోవా ఆశీర్వదించాడు కనుక, వ్యతిరేకత తగ్గింది మరియు మా కుటుంబ ఐక్యత పెరిగింది.”
ఈ పెద్ద కుటుంబాలు ఎంత ఆశీర్వాదకరంగా నిరూపించబడ్డాయో. శ్రీలంక అనే పేరుకు భావమైన “దేదీప్యమాన దేశం” నందు రాజ్యసువార్తను ప్రకటించే పనిని త్వరితం చేసేందుకు కృషిచేసే చిన్న కుటుంబాలకు, తలిదండ్రుల్లో ఏ ఒక్కరో ఉన్న కుటుంబాలకు మరియు ఒంటరి సాక్షులున్న కుటుంబాలతో తమ స్వరాన్ని చేర్పారు. శ్రీలంకలోని సాక్షులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ తోటి క్రైస్తవులతో పాటు పరదైసు పునఃస్థాపన కొరకు ఎదురు చూస్తున్నారు, దాన్ని ఈ మనోహరమైన శ్రీలంకలోని సముద్రతీరాలు మరియు పర్వతాలను చూసినప్పుడు మనకు జ్ఞాపకం రావచ్చు.
[అధస్సూచీలు]
a అక్కడున్న పెద్ద గొయ్యి, ముస్లిమ్లలో ఆదాము, బౌద్ధమతంలో బుద్ధుడు, హిందూ మతంలో శివుడు మరియు చర్చికథల్లోని “సెయింట్” థామస్ కాలి గురుతులని చెప్పబడుతోంది.
[24, 25వ పేజీలోని చిత్రాలు]
క్రైస్తవ ప్రకటనా పనికి, బోధకు శ్రీలంకలోని అనేకమంది ప్రతిస్పందిస్తున్నారు