కరేయులు వారి సత్యాన్వేషణ
“సమగ్రంగా [లేఖనాల్ని] పరీక్షించండి, నా అభిప్రాయం మీద ఆధారపడవద్దు” అని కరేయుల సా.శ. ఎనిమిదవ శతాబ్దపు ప్రముఖ నాయకుడు పలికాడు. కరేయులు ఎవరు? వారి మాదిరినుండి విలువగల దేనినైనా మనం నేర్చుకోగలమా? ఈ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు, మనం వెనక్కి అనగా కరేయుల ఉద్యమానికి నడిపిన దీర్ఘకాల వివాదాస్పద చరిత్రకు వెళ్లాలి.
వివాదమెలా ఆరంభమైంది?
మన సామాన్య శకానికి ముందుగల చివరి శతాబ్దాల్లో, యూదామతంలోనే ఓ క్రొత్త తత్వం వృద్ధయింది. అదేమంటే దేవుడు సీనాయి పర్వతంవద్ద రెండు ధర్మశాస్త్రాల్ని అనగా ఒకటి వ్రాతపూర్వకంగా మరొకటి మౌఖికంగా ఇచ్చాడనే భావన.a సా.శ. మొదటి శతాబ్దానికల్లా ఈ క్రొత్త బోధను స్వీకరించిన వారికి, దానిని వ్యతిరేకించిన వారికి మధ్య తీవ్ర వాగ్వివాదాలు చెలరేగాయి. పరిసయ్యులు దానిని సమర్థించగా, సద్దూకయ్యులు ఎస్సెనీయులు దానిని వ్యతిరేకించారు.
ఈ వివాదమిలా కొనసాగుతుండగా, వాగ్దత్త మెస్సీయగా నజరేయుడైన యేసు ప్రత్యక్షమయ్యాడు. (దానియేలు 9:24, 25; మత్తయి 2:1-6, 22, 23) యూదుల ఆ భిన్న గుంపులన్నిటిని యేసు ఎదుర్కొన్నాడు. వారితోచేసిన తర్కనలో తమ పారంపర్యాచారమునుబట్టి వారు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయడాన్ని ఆయన ఖండించాడు. (మత్తయి 15:3-9) ఒక్క మెస్సీయకు మాత్రమే సాధ్యమనే విధంగా యేసు ఆత్మీయ సత్యాల్నికూడ బోధించాడు. (యోహాను 7:45, 46) అంతేకాకుండ, యేసు నిజమైన అనుచరులు మాత్రమే తమకు దైవిక మద్దతున్నట్లు రుజువుపర్చారు. వారు క్రైస్తవులని తెలియబడ్డారు.—అపొస్తలుల కార్యములు 11:26.
సా.శ. 70లో యెరూషలేము దేవాలయం నాశనం చేయబడినప్పుడు, పరిసయ్యుల మతశాఖ మాత్రమే హాని జరుగకుండా తప్పించుకుంది. ఇప్పుడు యాజకత్వం, బలులు, దేవాలయం లేకపోవడంతో, పరిసయ్యుల యూదామతం వ్రాతపూర్వక ధర్మశాస్త్ర స్థానంలో పారంపర్యాచారాన్ని, భావం చెప్పడాన్ని అనుమతిస్తూ వీటికి ప్రత్యామ్నాయాల్ని కనిపెట్టగల్గింది. ఇది క్రొత్త “పవిత్ర గ్రంథాల” రచనకు ద్వారం తెరచింది. మొదట, వారి మౌఖిక నియమానికి కూర్పుల్ని, భావాల్నిచేర్చిన మిష్నా ఉనికిలోకి రాగా, ఆ తర్వాత ఇతర వ్రాతల ఖండికలుకూడ చేర్చబడి టాల్ముడ్ అని పిలువబడ్డాయి. అదేసమయంలో, మతభ్రష్ట క్రైస్తవులు యేసు బోధల నియమిత కట్టడనుండి వైదొలగడం ప్రారంభించారు. ఈ రెండు వర్గాలు శక్తివంతమైన మత విధానాలకు అనగా ఒకవైపు చర్చి అధికారానికి, మరోవైపు రబ్బీల అధికారానికి ఊపిరిపోశాయి.
అన్య రోమ్‌తో ఆ తర్వాత “క్రైస్తవ” రోమ్‌తో యూదుల పోరాటాల కారణంగా, యూదామత కేంద్రస్థానం చివరికి బాబిలోన్‌కు మార్చబడింది. అక్కడ టాల్ముడ్ వ్రాతలు పూర్తిస్థాయిలో సరిదిద్దబడ్డాయి. దేవుని చిత్తాన్ని టాల్ముడ్ మరి సంపూర్ణంగా బయల్పరచిందని రబ్బీలు చెప్పినా, అనేకమంది యూదులు ఇతరులపై రబ్బీల అధికారం పెరగడం పసిగట్టి, మోషే తదితర ప్రవక్తల ద్వారా తమకందజేయబడిన దేవునివాక్యం కొరకు మిక్కిలి ఆశించారు.
సా.శ. ఎనిమిదవ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో, రబ్బీల అధికారాన్ని, వారి మౌఖిక నియమమందలి నమ్మకాన్ని వ్యతిరేకించిన బాబిలోన్‌లోని యూదులు ఆనానుబెన్ డేవిడ్ అనే విద్యావంతుడైన నాయకుని బోధలకు స్పందించారు. రబ్బీలుచెప్పే భావాల్ని లేదా టాల్ముడ్‌ను లక్ష్యపెట్టకుండా, నిజమైన మతానికున్న ఒకేఒక మూలాధారముగా హెబ్రీ లేఖనాల్ని నిరాటంకంగా పఠించే హక్కు ప్రతి యూదునికున్నదని అతను ప్రకటించాడు. ఆనాను ఇలా బోధించాడు: “సమగ్రంగా తోరాను [వ్రాతపూర్వక దేవుని ధర్మశాస్త్రాన్ని] పరీక్షించండి, నా అభిప్రాయం మీద ఆధారపడవద్దు.” లేఖనంపై ఇలా నొక్కిపలికినందున, ఆనాను అనుచరులు కరేయులని పిలువబడ్డారు, ఈ హెబ్రీ నామమునకు “పాఠకులు” అని భావం.
రబ్బీల, కరేయుల వివాదం
రబ్బీల వర్గాల్లో తత్తరపాటుకు కారణమైన కరేయుల బోధల కొన్ని ఉదాహరణలేవి? పాలు, మాంసం కలిపి తినడాన్ని రబ్బీలు నిషేధించారు. “మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు” అని చెప్పిన నిర్గమకాండము 23:19కి మౌఖిక నియమపు వివరణగా వారు దీనిని ప్రవేశపెట్టారు. మరోవైపున, ఆ వచనం చెప్పినదే దాని భావం—ఎక్కువలేదు, తక్కువలేదు అని కరేయులు బోధించారు. రబ్బీల నిర్బంధాలు మానవ కల్పితమని వారు వాదించారు.
రబ్బీల భావం ప్రకారం ద్వితీయోపదేశకాండము 6:8, 9నిబట్టి యూదుడు ప్రార్థించేటప్పుడు టెఫిలిన్ లేదా రక్షరేకులు ధరించాలి, ప్రతి గుమ్మానికి మెజూజె కట్టాలి.b కరేయులు ఈ వచనాలకు అలంకారార్థమైన, సూచనార్థకమైన భావం మాత్రమే ఉన్నదని పరిగణించారు, కనుక రబ్బీల అట్టి నియమాల్ని తిరస్కరించారు.
ఇతర విషయాల్లో కరేయులు రబ్బీలకంటే మరెంతో నిర్బంధంగా ఉండేవారు. ఉదాహరణకు, “విశ్రాంతిదినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు” అని చదవబడే నిర్గమకాండము 35:3ను గూర్చిన వారి తలంపును ఆలోచించండి. విశ్రాంతిదినానికి ముందు వెలిగింపబడినా వెలుగుతున్న ప్రమిదను లేదా దీపం ఉంచడాన్ని కరేయులు నిషేధించారు.
ఆనాను మరణించిన తర్వాత, కొన్ని నిషేధాల స్థాయి, రీతికి సంబంధించి కరేయుల నాయకుల్లో తరచు పొత్తుకుదరలేదు, ఎల్లప్పుడు వారి వర్తమానం స్పష్టంగా లేకుండెను. ఏ నాయకుణ్ణి గుర్తించక, రబ్బీవిధాన అధికారానికి భిన్నంగా నిలిచిన లేఖనాల వ్యక్తిగత పఠనాన్ని, భావం చెప్పడాన్ని నొక్కితెల్పినందున కరేయుల్లో ఐక్యత లేకపోయింది. ఇదిలావున్నా, కరేయుల ఉద్యమం ప్రజాదరణయందు, ప్రభావమందు వృద్ధియై బాబిలోన్ యూదామత సమాజాన్ని దాటి మధ్య ప్రాచ్యమందంతటా వ్యాపించింది. కరేయుల ఓ పెద్ద కేంద్రం సహితం యెరూషలేములో స్థాపించబడింది.
సా.శ. తొమ్మిది, పది శతాబ్దాల కాలంలో హెబ్రీ భాషా పునఃపఠనంలో కరేయుల విద్వాంసులెంతో ఉన్నతి సాధించి, ఓ విధమైన స్వర్ణయుగం అనుభవించారు. మౌఖిక ఆచారాలు కాదుగాని, లిఖిత హెబ్రీ లేఖనమే పరిశుద్ధమని వారు పరిగణించారు. కరేయుల్లో కొందరు హెబ్రీ లేఖనాల్ని బహుజాగ్రత్తగా ప్రతివ్రాయు శాస్త్రులయ్యారు. వాస్తవానికి, కరేయులు చేపట్టిన ఈ పురికొల్పే కార్యం బహు ప్రామాణికమైన బైబిలు నిశ్చితముగా నేటివరకు కాపాడబడునట్లు, యూదులమధ్య లేఖనాల్ని శాస్త్రయుక్తంగా పఠించడాన్ని ప్రోత్సహించింది.
పురోగతి వేగంగా జరిగిన ఈ కాలంలో, కరేయుల యూదామతవాదం ఇతర యూదులమధ్య బాహాటంగా మతప్రచారం సాగించింది. ఇది రబ్బీల యూదామతవాదానికి విస్పష్టమైన బెదిరింపుగా నుండెను.
రబ్బీలెలా ప్రతిస్పందించారు?
తమ లక్ష్యసాధనకు రబ్బీలు కుయుక్తిగా తమ బోధనాపద్ధతిని మారుస్తూ తీవ్రపదాలతో ప్రతిదాడి జరిపారు. ఆనాను ముట్టడి తర్వాతగల శతాబ్దంలో రబ్బీల యూదామతవాదం కరేయుల అనేక పద్ధతుల్ని స్వీకరించింది. తమ వాక్చాతుర్యమందు కరేయుల శైలిని, పద్ధతిని అవలంబిస్తూ లేఖనాల్ని ఎత్తిచెప్పుటలో రబ్బీలు మరింత ప్రవీణులయ్యారు.
కరేయులతో మాటకు ప్రతిమాటగా చేసిన ఈ ఆవృత్తికి వివాదరహిత నేతగా ఉండిన సాదియా బెన్ జోజెఫ్, సా.శ. పదియవ శతాబ్దపు మొదటి అర్ధభాగమందు బాబిలోన్‌లో యూదా సమాజానికి నాయకుడయ్యాడు. సాదియా రచించిన విశ్వాసాలు అభిప్రాయాల పుస్తకం (ఆంగ్లం) అనే ఓ ప్రముఖ గ్రంథాన్ని సామ్యెల్ రోజెన్‌బ్లాట్ ఆంగ్లంలోకి అనువదించాడు. ఆయన దాని ఉపోద్ఘాతమందు ఇలా చెప్పాడు: “తన కాలంలో టాల్ముడ్ మీద ఆయన అధికారిగావున్ననూ . . . యూదుల ఆచారపు ఈ మూలాధారాన్ని ఆయన [సాదియా] అరుదుగా ఉపయోగించాడు, ఎందుకంటే వ్రాతపూర్వక ధర్మశాస్త్రం మాత్రమే సాధికారమని సమ్మతించిన కరేయులను వారి స్వంత ఆయుధాలతోనే ఓడించాలనుటే ఆయన కోరికైయుండెననుట స్పష్టము.”
సాదియా అడుగుజాడల్ని అనుసరిస్తూ రబ్బీల యూదామతవాదం క్రమేపి మరిగొప్ప అధికారం, ప్రభావం పుంజుకుంది. కరేయుల వాదాల బలమైన రుజువును హరించేంతగా సవరించుకొనుట ద్వారా ఇది నెరవేర్చబడింది. పన్నెండవ శతాబ్దపు పేరుగాంచిన టాల్ముడ్ విద్వాంసుడగు మోసెస్ మైమోనిడెస్ చివరిదెబ్బ వేశాడు. ఐగుప్తులో తాను వ్యవహరించిన కరేయులయెడల తన సహన దృక్పథం, ఆలాగే ఒప్పింపజేసే తన పాండిత్య ఫక్కీద్వారా ఆయన వారి శ్లాఘతనుగెలిచి, వారి స్వంత నాయకత్వ స్థానాన్ని బలహీనపర్చాడు.
కరేయుల ఉద్యమం ఉరవడిని పోగొట్టుకొనుట
ఐక్యత లేకపోవడం, పరిస్థితినెదుర్కొనే పొందికైన వ్యవస్థ లేకపోవడంతో కరేయుల ఉద్యమం ఇటు ఉరవడిని అటు అనుచరులను పోగొట్టుకుంది. కాలప్రవాహంలో కరేయులు తమ తలంపుల్ని, సూత్రాల్ని మార్చుకున్నారు. కరేయుల ఉద్యమాన్ని గూర్చి వ్రాసిన గ్రంథకర్త లియా నెమోయ్ ఇలా వ్రాస్తున్నాడు: “సిద్ధాంతపరంగా టాల్ముడ్ నిషేధంలో ఉండగా, టాల్ముడ్ సంబంధిత అనేకాంశాలు మెల్లగా కరేయుల ధర్మశాస్త్ర అభ్యాసమందు, ఆచారమందు చేర్చబడ్డాయి.” సారాంశపూర్వకంగా, కరేయులు తమ ఆది సంకల్పాన్ని పోగొట్టుకొని, రబ్బీల యూదామతవాదాన్నే అధికంగా హత్తుకున్నారు.
ఇశ్రాయేలునందు ఇంకనూ దాదాపు 25,000 మంది కరేయులు ఉన్నారు. మరికొన్ని వేలమందిని ఇతర సమాజములందు, అధికంగా రష్యా, అమెరికాల్లో కనుగొనవచ్చు. అయితే, తమ స్వంత మౌఖిక నియమాల్ని కలిగియున్న వారిగా, వారు మొదటి కరేయులకు భిన్నంగా ఉన్నారు.
కరేయుల చరిత్రనుండి మనమేమి నేర్చుకోగలము? అదేమంటే ‘పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయుట’ గంభీరమైన తప్పిదమై ఉన్నది. (మత్తయి 15:6) మనుష్యుల భారమైన పారంపర్యాచారములనుండి స్వతంత్రులుగా ఉండుటకు లేఖనముల కచ్చితమైన జ్ఞానము అవసరము. (యోహాను 8:31, 32; 2 తిమోతి 3:16, 17) అవును, దేవుని చిత్తం తెలుసుకొని, దానినిచేయుటకు ప్రయత్నించువారు మనుష్యుల పారంపర్యాచారములపై ఆధారపడరు. బదులుగా, వారు పట్టుదలతో బైబిలును పరీక్షించి, దేవుని ప్రేరేపిత వాక్య ప్రయోజనకరమైన ఉపదేశాన్ని అనువర్తించుకుంటారు.
[అధస్సూచీలు]
a మౌఖిక నియమం అనబడినదాని వివరణ కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇన్‌కార్పొరేటెడ్ వారు ప్రచురించిన యుద్ధంలేని లోకం ఎన్నడైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూరులో పేజీలు 8-11 చూడండి.
b తోలుతో చేయబడిన రెండు చిన్నపెట్టెల్ని టెఫిలిన్ అనేవారు, లేఖనాలు వ్రాయబడిన చిన్న చర్మపుముక్కల్ని ఈ పెట్టెల్లో ఉంచేవారు. వారపు ఉదయకాల ప్రార్థనా సమయంలో ఆచారబద్ధంగా ఈ పెట్టెల్లో ఒకటి ఎడమచేతికి, మరొకటి తలపై ధరించేవారు. ద్వితీయోపదేశకాండము 6:4-9 మరియు 11:13-21 వ్రాయబడిన చర్మపు చుట్టను మెజూజె అనేవారు, దీనిని ఒక చిన్నపెట్టెలోవుంచి గుమ్మానికి కట్టేవారు.
[30వ పేజీలోని చిత్రం]
కరేయుల ఓ గుంపు
[క్రెడిట్ లైను]
From the book The Jewish Encyclopedia, 1910