కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 7/15 పేజీలు 25-27
  • బహిష్కరణ—ప్రేమగల ఓ ఏర్పాటా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బహిష్కరణ—ప్రేమగల ఓ ఏర్పాటా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కాపుదల ఎందుకు అవసరం
  • బహిష్కరించుట ఎలా ప్రేమపూర్వకమైనది
  • ఇతరులమీదుండే ప్రభావం
  • కుటుంబ సభ్యులకు ప్రేమపూర్వక సహాయము
  • యెహోవా ఏర్పాటును గుణగ్రహించండి
  • బహిష్కరించడం ఎందుకు ప్రేమతో చేసిన ఏర్పాటు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • బహిష్కరించడం ఎందుకు ఒక ప్రేమపూర్వక ఏర్పాటు
    తేజరిల్లు!—1996
  • మనం ప్రేమించేవాళ్లు ఎవరైనా యెహోవాకు దూరమైతే . . .
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 7/15 పేజీలు 25-27

బహిష్కరణ—ప్రేమగల ఓ ఏర్పాటా?

“సర్వాధికారియు దేవుడునగు ప్రభువు (యెహోవా NW) పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” (ప్రకటన 4:8) ఆ వర్ణన ప్రకారం, యెహోవా పరిశుద్ధ కట్టడలకు మూలాధారుడైయున్నాడు. ఇవి “పరిశుద్ధలేఖనములలో” ఇవ్వబడ్డాయి, కాగా క్రైస్తవులు ఈ మార్గదర్శక సూత్రాల్ని అనుసరించే బాధత్యను కలిగివున్నారు. నిజముగా, వారు యెహోవా దృష్టిలో అశుద్ధమైన దేనినైనా విసర్జించాలి.—2 తిమోతి 3:15; యెషయా 52:11.

బైబిలు స్పష్టముగా ఇట్లు ఆజ్ఞాపిస్తున్నది: “నేను పరిశుద్ధుడనైయున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా . . . మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.” (1 పేతురు 1:15, 16) క్రైస్తవ సంఘం ఉనికిలోకి వచ్చిన 19 శతాబ్దాల పూర్వంనుండి, నిజమైన క్రైస్తవులు దానిని ఆత్మీయ, నైతిక అపరిశుభ్రతనుండి కాపాడుటకు తీవ్రంగా పోరాడారు.—యూదా 3.

కాపుదల ఎందుకు అవసరం

దేవుని సేవకులందరు నైతికంగా, ఆత్మీయంగా పరిశుభ్రంగావుండే సవాలునెదుర్కొంటున్నారు. దానికొరకు శక్తిగల ముగ్గురు శత్రువుల్ని అనగా సాతాను, ఆయన లోకం, పాపభరితమైన మన శరీర కోరికలను తప్పక ఎదిరించాలి. (రోమీయులు 5:12; 2 కొరింథీయులు 2:11; 1 యోహాను 5:19) సాతాను లోకం మీరు దుర్నీతిపరులు కావాలని, దాని పద్ధతుల్నే మీరు పాటించాలని శోధిస్తూ మీకు వస్తుసంపత్తిని, కీర్తిని, హోదాను, ప్రాధాన్యతను, అధికారాన్ని అందివ్వజూస్తుంది. అయితే సత్యారాధనను వెంబడించాలని తీర్మానించుకొనేవారు సాతాను అందించువాటిని తిరస్కరించి “ఇహలోకమాలిన్యము” తమకంటకుండా నిలిచివుంటారు. ఎందుకు? ఎందుకంటే వారు యెహోవా పరిశుభ్రమైన సంస్థయొక్క కాపుదల, ప్రేమపూర్వక శ్రద్ధక్రింద ఉండాలని కోరుకుంటారు.—యాకోబు 1:27; 1 యోహాను 2:15-17.

మానవ బలహీనతనుబట్టి సాతాను శోధనలకు క్రైస్తవ సంఘ సభ్యుడెవరైనా లొంగిపోతే అట్టివారికొరకు యెహోవా సహాయాన్ని దయచేశాడు. సంఘాన్ని కాపాడుటకు, తప్పిదస్థులు తమ పాపాన్నిబట్టి పశ్చాత్తాపము పొంది కోలుకొనుటకు అవసరమైన సవరణలు చేసుకొనేలా ప్రేమతో సహాయం చేయుటకు ఆత్మీయార్హతగల పెద్దలు నియమించబడ్డారు. తప్పిదంలో చిక్కుకున్న ఏ క్రైస్తవుడైనా పశ్చాత్తాపపడి తన మార్గాలు మార్చుకొనుటకు ఓపికగా అతనికి సహాయంచేయాలి.—గలతీయులు 6:1, 2; యాకోబు 5:13-16.

బహిష్కరించుట ఎలా ప్రేమపూర్వకమైనది

బాప్తిస్మంపొందిన యెహోవా సేవకులెవరైనా ఉద్దేశపూర్వకంగా దుష్టమార్గం అనుసరించి, మారుటకు తిరస్కరిస్తే, అట్టివారిని పశ్చాత్తాపం పొందనివారిగా దృష్టించాలి, అలావారు క్రైస్తవ సహవాసానికి అనర్హులౌతారు. (1 యోహాను 2:19 పోల్చండి.) క్రైస్తవ సంఘంలోనే నిలిచివుండి, దానిని కలుషితం చేయుటకు అట్టివ్యక్తుల్ని అనుమతించకూడదు. వారిని బహిష్కరించాలి.

దుష్టకార్యాల్ని అభ్యసించే వారిని బహిష్కరించుట యుక్తమేనని ఈ క్రింది పరిస్థితిద్వారా ఉదహరించవచ్చును: విద్యార్థులపై పెరిగిన దాడులు, హింసాయుత నేరాల కారణంగా, కొన్ని పాఠశాలలు “ఆయుధాల్ని ఉపయోగించే లేదా ఉపయోగిస్తామని భయపెట్టే విద్యార్థుల్ని పాఠశాలనుండి శాశ్వతంగా వెళ్లగొట్టే” విధానాన్ని చేపట్టాయని కెనడా, టొరొంటోలోని ఓ వార్తాపత్రికయగు ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ నివేదిస్తున్నది. హింసాయుత కృత్యాలకు గురికాకుండా విద్యా కార్యక్రమంనుండి ప్రయోజనం పొందాలనుకునే విద్యార్థుల్ని కాపాడుటకే ఈ బహిష్కరణా చర్య తీసుకోబడింది.

పశ్చాత్తాపంచూపని తప్పిదస్థుణ్ణి సంఘంనుండి బహిష్కరించుట ఎందుకు ప్రేమపూర్వకమైనది? అలాచేయుట యెహోవాయెడల, ఆయన మార్గాలయెడల ప్రేమచూపుటకే. (కీర్తన 97:10) తమపై చెడుప్రభావం చూపగల వ్యక్తిని ఈ చర్య తమమధ్యనుండి తీసివేస్తుంది గనుక అది నీతి విధానాన్ని వెంబడించే వారియెడల ప్రేమ చూపిస్తుంది. ఆలాగే అది సంఘ స్వచ్ఛతనుకూడ కాపాడుతుంది. (1 కొరింథీయులు 5:1-13) ఘోరమైన దుర్నీతి లేదా ఆత్మీయ అపరిశుభ్రత సంఘంలో ఉండటానికి అనుమతిస్తే, అది కలుషితమై పరిశుద్ధుడైన యెహోవాకు పవిత్రసేవనందించడానికి అయుక్తమౌతుంది. అంతేకాకుండ, అపరాధిని వెలివేయుట అతడు తన అదుపుతప్పిన విధానపు గంభీరతనుగాంచి, పశ్చాత్తాపంనొంది అవసరమైన మార్పులు చేసుకొని అలా మరలా సంఘంలోకి అంగీకరింపబడునట్లు అతనికి సహాయం చేయవచ్చును.

ఇతరులమీదుండే ప్రభావం

సంఘ సభ్యుడొకరు వ్యభిచారంవంటి ఓ గంభీరమైన పాపం చేసినప్పుడు అతడు యెహోవా హృదయాన్ని సంతోషింపజేయుట లేదు. (సామెతలు 27:11) లైంగిక దుర్నీతికి లొంగిపోయే ఓ క్రైస్తవుడు నిశ్చయంగా యోసేపువలె తలంచుటలేదు. పోతీఫరు భార్య ఆయనను తనతో శయనింపజేసుకొనుటకు ప్రయత్నించినప్పుడు, యోసేపు ప్రతిస్పందన ఇట్లుండెను: “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యముచేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?” (ఆదికాండము 39:6-12) యోసేపు యెహోవా పరిశుద్ధ కట్టడలను గౌరవించి అక్కడనుండి పారిపోయాడు. మరోవైపున, వ్యభిచారి తన శారీరక మోహాన్ని తృప్తిపర్చుకోవడాన్ని నిరోధించేందుకు అవసరమైనంతగా దేవునియెడల ప్రేమలేనట్లు కన్పిస్తుంది.—గలతీయులు 5:19-21.

దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘించే బాప్తిస్మంపొందిన వ్యక్తి విశ్వాసులైన తన బంధువులకు తాను కల్గించే హానిని, వ్యధనుగూర్చి చింతలేనివాడని కనుపరస్తాడు. ఆ భావోద్రేక ప్రభావం ఒకవ్యక్తి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. తన కుమారుడు దుర్నీతిపరుడని తెలిసిన తర్వాత, ఓ క్రైస్తవ స్త్రీ ఇలా విలపించింది: “మేము ఎంతగా గాయపడ్డామో, కృంగిపోయామో, . . . హృదయంలో నలిగిపోయామో అర్థంచేసుకున్న సహోదర సహోదరీలువున్నా, వారు చాలా కొద్దిమందే అన్పించింది.” యావత్‌ కుటుంబానికున్న మంచి పేరు పాడవుతుంది. మనోవ్యధ, దోషభావం నమ్మకమైన కుటుంబ సభ్యుల్ని బాధించవచ్చు. ఆ విధంగా తప్పిదస్థుని విధానం కుటుంబానికి హృదయ వేదనను తెస్తుంది.

కుటుంబ సభ్యులకు ప్రేమపూర్వక సహాయము

బహిష్కరింపబడిన వ్యక్తుల నమ్మకమైన క్రైస్తవ కుటుంబ సభ్యులు బహిష్కరణ ఇటు ప్రేమపూర్వకమైనది, అటు కాపుదలనిచ్చేదని గుర్తుంచుకోవాలి. తప్పిదస్థునికి సహాయపడేందుకు సాధ్యమైన ప్రతీ ప్రయత్నం చేయబడుతుంది. కాని అతడు దేవునికి అవిధేయుడని, మూర్ఖంగా పశ్చాత్తాపం చూపడంలేదని నిరూపించబడితే, సంఘాన్ని కాపాడాలి గనుక “ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి” అని దేవుని వాక్యం నిర్దేశించినట్టు చర్యతీసుకోవాలి, దానికిక ఏ ప్రత్యామ్నాయం లేదు. (1 కొరింథీయులు 5:13) ఓ సాక్షి “బహిష్కరణ యెహోవాయెడల యథార్థతచూపే ఒక విషయం,” అని అన్నాడు.

కుటుంబ సభ్యుడొకరు బహిష్కరింపబడినప్పుడు క్రైస్తవ బంధువులెంతో బాధననుభవిస్తారు. కాబట్టి వారికి ఆత్మీయ ఊరటనిచ్చేవారిగానుండుటకు నియమిత పెద్దలు తాము చేయగల్గినంతా చెయ్యాలి. (1 థెస్సలొనీకయులు 5:14) పెద్దలు వారితోపాటూ, వారికొరకు ప్రార్థన చేయవచ్చును. క్షేమాభివృద్ధికరమైన లేఖన తలంపుల్ని చర్చించడానికి ఈ నమ్మకమైన క్రైస్తవులను సందర్శించుట తరచు సాధ్యమౌతుంది. క్రైస్తవ కూటాలకు ముందు, ఆ తర్వాత ఈ ప్రియమైన వారిని ఆత్మీయంగా బలపరచుటకు మంద కాపరులు ప్రతి అవకాశాన్ని ఉపయోగించాలి. వారితోకూడ ప్రాంతీయ పరిచర్యలో పాల్గొంటూ అదనపు ప్రోత్సాహమివ్వవచ్చు. (రోమీయులు 1:11, 12) ఈ నమ్మకమైన యెహోవా సేవకులయెడల ఆత్మీయ కాపరులు వారికి తగిన ప్రేమ, శ్రద్ధ చూపడం అవసరం.—1 థెస్సలొనీకయులు 2:7, 8.

ఒక వ్యక్తి పాపపు విధానాన్నిబట్టి అతని కుటుంబమందు యెహోవాయెడల నమ్మకంగా నిలిచియున్న ఏ సభ్యుడినైనను అలక్ష్యం చేయడానికి ఏ కారణము లేదు. ఇశ్రాయేలు దుష్ట రాజగు సౌలును దేవుడు తిరస్కరించాడు, అయితే సౌలు కుమారుడగు యోనాతానుయెడల స్వయంగా తనకున్న అనురాగంలో దీని జోక్యాన్ని దావీదు అనుమతించలేదు. వాస్తవానికి, దావీదు యోనాతానుల మధ్యగల బంధం మరింత బలపడింది. (1 సమూయేలు 15:22, 23; 18:1-3; 20:41) కాబట్టి సంఘస్థులందరూ యెహోవాకు వ్యతిరేకంగా పాపంచేసిన బంధువులున్న క్రైస్తవులకు మద్దతునిస్తూ వారియెడల ప్రేమచూపువారై ఉండాలి.

అట్టి నమ్మకస్థుల్ని అలక్ష్యం చేయుట లేదా నిర్దయగా ఉండుట ఎంత ప్రేమలేనితనమో గదా! యథార్థపరులైన కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ప్రోత్సహింపబడవలసిన అవసరతలో ఉన్నారు. తాము ఒంటరివారమని వారు భావించవచ్చు మరియు తమ పరిస్థితి చాలాకష్టంగా ఉన్నట్లు వారు కనుగొనవచ్చు. బహుశ టెలిఫోను ద్వారా మీరు ప్రీతికరమైన ఓ ఆత్మీయాంశాన్ని లేదా క్షేమాభివృద్ధికరమైన అనుభవాన్ని వారితో పంచుకోవచ్చు. ఒకవేళ బహిష్కరింపబడిన వ్యక్తి ఫోను ఎత్తితే, అతని క్రైస్తవ బంధువుతో మాట్లాడాలని అడగండి. అట్టి కుటుంబంలోని నమ్మకమైన సభ్యుల్ని ఒకానొక సామాజిక పార్టీకి లేదా మీయింట భోజనానికి ఆహ్వానించవచ్చు. బజారుకు వెళ్లినప్పుడు మీరు వారిని కలుసుకుంటే, క్షేమాభివృద్ధికరమైన సహవాసానికి ఆ సందర్భాన్ని ఉపయోగించవచ్చు. బహిష్కరింపబడిన బంధువులున్న యథార్థపరులైన క్రైస్తవులు ఇంకనూ యెహోవా పరిశుభ్ర సంస్థలో భాగమైయున్నారని గుర్తుంచుకోండి. వారు సులభంగా ఒంటరివారిగా, నిరుత్సాహం చెందినవారిగా తయారుకాగలరు. కాబట్టి, వారియెడల దయ ప్రేమను చూపడంలో చురుకుగా ఉండండి. ఎడతెగక ‘మీతో విశ్వాసగృహానికి చేరినవారందరియెడల మేలు చేయండి.’—గలతీయులు 6:10.

యెహోవా ఏర్పాటును గుణగ్రహించండి

తన ఆరాధికుల ప్రపంచవ్యాప్త కుటుంబమందలి ప్రతివారియెడల యెహోవా దేవుడు ఆప్యాయతా శ్రద్ధ చూపిస్తున్నందుకు మనమెంతగా కృతజ్ఞత కలిగివుండగలము. తనయెదుట నీతిగా నడుచుకొనేలా మనకు సహాయం చేయుటకు ఆయన తన సంస్థద్వారా ప్రేమపూర్వకంగా ఓ ఏర్పాటుచేశాడు. కుటుంబ సభ్యుడొకరు ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాన్నిబట్టి సంఘంనుండి బహిష్కరించవలసి వచ్చినా, అతడు నిజమైన పశ్చాత్తాపం చూపితే తిరిగివచ్చే మార్గమున్నది. ఈ క్రింది ఉదాహరణ దీనిని దృష్టాంతపరస్తున్నది:

ఆన్నా అని మనం పిలిచే ఓ వ్యక్తికి సహాయం చేయడానికి పెద్దలు ప్రయత్నించారు, కాని ఆమె పొగపీల్చడం, త్రాగడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం మానలేదు. పశ్చాత్తాపం చూపనందున ఆమె సంఘంలో ఉండలేకపోయింది. అయితే అనతికాలంలోనే ఆన్నా యెహోవా పరిశుభ్ర సంఘపు ప్రేమపూర్వక సహవాస లేమికి దుఃఖపడి, సహాయం కొరకు ఆయనను ప్రార్థించింది. త్రోవతప్పిన వారియెడల పెద్దలు ఎంతశ్రద్ధ చూపిస్తారో తాను పూర్తిగా గుణగ్రహించలేకపోయానని ఆమె అంగీకరిస్తున్నది. ఆన్నా మరలా కూటాలకు హాజరుకావడం ప్రారంభించింది, ఇది ఆమెను పశ్చాత్తాపానికి నడిపింది. ఆ తర్వాత ఆమె ప్రేమపూర్వక, కాపుదలనిచ్చే సంఘంలోకి మరలా అంగీకరింపబడింది. ఆన్నా తిరిగి యెహోవా ఉన్నత నైతిక కట్టడను హత్తుకొనుచున్నది. పెద్దలుచూపిన ప్రేమకు కృతజ్ఞత కలిగి ఆమె ఇంకనూ ఇట్లంటోంది: “క్రైస్తవ సాహిత్యాలు నాకెంత సహాయం చేశాయో మీరూహించలేరు. యెహోవా మన అవసరతలయెడల నిశ్చయంగా శ్రద్ధ చూపిస్తాడు.”

అవును, సంఘంనుండి బహిష్కరించబడి ఆ తర్వాత పశ్చాత్తాపం చూపిన వారు తిరిగివచ్చే మార్గాన్ని దేవుడు దయచేశాడు. బహిష్కరణ సహితం ఒక ప్రేమగల ఏర్పాటని మనం చూశాము. అయితే మన పరిశుద్ధ దేవుని నీతిమార్గాల్ని అన్ని సమయాల్లో అంటిపెట్టుకొనుట ద్వారా ఈ దుఃఖకర అనుభవాన్ని తప్పించుకొనుట ఎంతశ్రేష్ఠమో గదా! యెహోవా పరిశుభ్రమైన, ప్రేమపూర్వకమైన, కాపుదలనిచ్చే సంస్థలో భాగంగా ఆయనను స్తుతించే ఆధిక్యతకొరకు మనం సదా కృతజ్ఞత కలిగివుందము గాక.

[26వ పేజీలోని చిత్రం]

సంఘంనుండి బహిష్కరింపబడిన వ్యక్తియొక్క నమ్మకమైన బంధువులయెడల మీరు ప్రేమ చూపిస్తున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి