బైబిలు నిజంగా ఏమైయున్నదో దాన్నిబట్టి దానిని అంగీకరించండి
“మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.”—1 థెస్సలొనీకయులు 2:13.
1. బైబిలునందలి ఏ విధమైన సమాచారం దాన్ని నిజంగా విశేషమైన గ్రంథంగా చేస్తుంది?
పరిశుద్ధ బైబిలు విస్తృతంగా అనువదించబడిన, ప్రపంచంలో ఎక్కువగా పంచిపెట్టబడిన గ్రంథము. అది గొప్ప సాహిత్యాలలో ఒకటని వెంటనే అంగీకరించబడుతుంది. అయితే, మరింత ప్రాముఖ్యంగా, జీవితంలో వారి వృత్తి లేక స్థానం ఏదైనప్పటికీ, అన్ని జాతుల మరియు అన్ని దేశాల ప్రజలకు అత్యవసరమైన నడిపింపును బైబిలు అందజేస్తుంది. (ప్రకటన 14:6, 7) మనస్సునూ, హృదయాన్ని రెండింటినీ సంతృప్తిపరచే విధంగా, బైబిలు ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిస్తుంది: మానవ జీవిత సంకల్పమేమిటి? (ఆదికాండము 1:28; ప్రకటన 4:11) మానవ ప్రభుత్వాలు నిరంతరం నిలిచే శాంతిభద్రతలను ఎందుకు తేలేకపోతున్నాయి? (యిర్మీయా 10:23; ప్రకటన 13:1, 2) ప్రజలెందుకు మరణిస్తున్నారు? (ఆదికాండము 2:15-17; 3:1-6; రోమీయులు 5:12) కష్టాలతో నిండిన ఈ లోకంలో, మనం జీవిత సమస్యలను విజయవంతంగా ఎలా ఎదుర్కోగలము? (కీర్తన 119:105; సామెతలు 3:5, 6) భవిష్యత్తులో మన కొరకు ఏమి ఉంది?—దానియేలు 2:44; ప్రకటన 21:3-5.
2. మన ప్రశ్నలకు బైబిలు ఎందుకు పూర్తిగా నమ్మదగిన సమాధానాలను అందజేస్తుంది?
2 అలాంటి ప్రశ్నలకు బైబిలు ఎందుకు అధికారపూర్వకంగా సమాధానమిస్తుంది? ఎందుకంటే అది దేవుని వాక్యం. వ్రాయడానికి ఆయన మానవులను ఉపయోగించుకున్నా, 2 తిమోతి 3:16 నందు స్పష్టంగా చెప్పబడినట్లుగా, ‘ప్రతి లేఖనము దైవావేశమువలన కలిగింది.’ అది మానవ సంఘటనల గురించిన వ్యక్తిగత వివరణల వలన తయారైనది కాదు. “ప్రవచనము [రాబోయే వాటిని గూర్చిన ప్రకటనలు, దైవిక ఆజ్ఞలు, బైబిలు యొక్క నైతిక ప్రమాణం] ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”—2 పేతురు 1:21.
3. (ఎ) వివిధ దేశాల్లోని ప్రజలచే బైబిలు ఎంత ఉన్నతమైనదిగా ఎంచబడిందో చూపించే ఉదాహరణలను ఇవ్వండి. (బి) లేఖనాలను చదవడానికి పాఠకులు తమ జీవితాలను కూడా పణంగా పెట్టడానికి ఎందుకు ఇష్టపడ్డారు?
3 బైబిలు విలువను గుణగ్రహిస్తూ అనేకులు దాన్ని కలిగివుండి, దాన్ని చదవడం కొరకు నిర్బంధింపబడడానికి, చివరికి మరణించడానికి కూడా వెనుకాడలేదు. ప్రజలు బైబిలును తమ స్వంత భాషలో చదివినట్లయితే తమ ప్రభావం తగ్గిపోతుందేమోనని మతనాయకులు భయపడిన కాథోలిక్ స్పెయిన్నందు గడిచిన సంవత్సరాల్లో అదే నిజమైంది; మత ప్రభావాన్నంతటినీ నిర్మూలించాలని నాస్తికత్వపు పరిపాలన క్రింద కఠినమైన చర్యలు తీసుకొనబడిన అల్బేనియా విషయంలో కూడా అది నిజం. అయినప్పటికీ, దైవభయంగల వ్యక్తులు లేఖనాల ప్రతులను భద్రపరచుకొని, వాటిని చదివి, ఒకరితో ఒకరు పంచుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జాక్సన్ హవుజన్ నిర్బంధ శిబిరమునందు, ఒక జైలు గది నుండి మరొక దానికి (అలా చేయడం నిషేధింపబడినప్పటికీ) ఒక బైబిలు జాగరూకతతో అందజేయబడింది, దాన్ని పొందగలిగిన వారు ఇతరులతో పంచుకోవడానికి కొన్ని భాగాలను కంఠస్థము చేశారు. అప్పట్లో కమ్యూనిస్టు తూర్పు జర్మనీ అని పిలువబడిన దానిలో, 1950వ పడిలో, తమ విశ్వాసం కొరకై నిర్బంధింపబడిన యెహోవాసాక్షులు, రాత్రి చదువుకోవడానికి ఒక ఖైదీ నుండి మరొక ఖైదీకి బైబిలు యొక్క చిన్న చిన్న భాగాలను అందజేసుకున్నప్పుడు, వారు దీర్ఘకాల ఒంటరి నిర్బంధానికి కూడా వెనుకాడలేదు. వారలా ఎందుకు చేశారు? ఎందుకంటే బైబిలు దేవుని వాక్యమని వాళ్లు గుర్తించారు, “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాటవలన నరులు బ్రదుకుదురని” వారికి తెలుసు. (ద్వితీయోపదేశకాండము 8:3) ఆ సాక్షులు నమ్మశక్యంకాని క్రూరత్వానికి గురౌతున్నప్పటికీ వారు ఆత్మీయంగా సజీవంగా ఉండేందుకు బైబిలునందు వ్రాయబడివున్న ఈ మాటలు సహాయం చేశాయి.
4. మన జీవితాల్లో బైబిలు ఏ స్థానాన్ని కలిగి ఉండాలి?
4 బైబిలు, కేవలం అప్పుడప్పుడు చూసుకోవడానికి అలమారలో పెట్టే పుస్తకం కాదు, లేక తోటి విశ్వాసులు ఆరాధన కొరకు సమావేశమైనప్పుడు మాత్రమే ఉపయోగించడానికైనది కాదు. మనకు ఎదురయ్యే పరిస్థితులపై వెలుగు ప్రసరించి, మనం నడిచేందుకు సరైన మార్గాన్ని చూపించేలా అది ప్రతిదినము ఉపయోగించబడాలి.—కీర్తన 25:4, 5.
చదివి, గ్రహించడానికి రూపొందించబడింది
5. (ఎ) సాధ్యమైతే, మనలో ప్రతి ఒక్కరం ఏమి కలిగివుండాలి? (బి) ప్రాచీన ఇశ్రాయేలులో, లేఖనాలలో ఏం ఉందో ప్రజలు ఎలా తెలుసుకొనేవారు? (సి) బైబిలు చదవడం విషయంలో మీ దృక్పథాన్ని కీర్తన 19:7-11 ఎలా ప్రభావితం చేస్తుంది?
5 మన కాలంలో, బైబిలు ప్రతులు అనేక దేశాల్లో తక్షణమే అందుబాటులో ఉన్నాయి, కావలికోట యొక్క ప్రతి పాఠకున్ని ఒక బైబిలు ప్రతి సంపాదించుకోమని మేము కోరుతున్నాము. బైబిలు వ్రాయబడిన కాలంలో, ముద్రణాయంత్రాలు లేవు. సామాన్య ప్రజలకు వ్యక్తిగత ప్రతులు ఉండేవికావు. కాని తన సేవకులు వ్రాయబడివున్నది వినగలిగేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అందుకే, యెహోవా చెప్పినదాన్ని వ్రాసుకున్న తర్వాత మోషే ‘నిబంధన గ్రంథమును తీసికొని ప్రజల కొరకు చదివాడు’ అని నిర్గమకాండము 24:7 తెలియజేస్తుంది. సీనాయి పర్వతంనొద్ద సహజాతీతమైన ప్రదర్శనలను చూడడం ద్వారా, ఆయన తమకు చదివి వినిపించినది దేవుని నుండి వచ్చినదని, తాము ఈ సమాచారం తెలుసుకోవలసిన అవసరం ఉందని వారు గుర్తించారు. (నిర్గమకాండము 19:9, 16-19; 20:22) దేవుని వాక్యంలో ఏం వ్రాయబడి ఉందో మనం కూడా తెలుసుకోవలసిన అవసరత ఉంది.—కీర్తన 19:7-11.
6. (ఎ) ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలో ప్రవేశించకముందు, మోషే ఏం చేశాడు? (బి) మనం మోషే మాదిరిని ఎలా అనుకరించగలము?
6 వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో తమ సంచార జీవితాన్ని విడిచిపెట్టి, యొర్దాను నదిని దాటడానికి సిద్ధపడినప్పుడు వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని, వారితో ఆయన వ్యవహారాలను పునఃసమీక్షించడం సముచితమైయుండింది. దేవునిచే పురికొల్పబడి మోషే వారితో ధర్మశాస్త్రాన్ని పునఃసమీక్షించాడు. ధర్మశాస్త్ర వివరాలను గూర్చి ఆయన వారికి గుర్తుచేశాడు, అంతేగాక యెహోవాతో వారి సంబంధాన్ని ప్రభావితం చేయవలసిన మూలాధార సూత్రాలను, దృక్పథాలను ఆయన ఉన్నతపరిచాడు. (ద్వితీయోపదేశకాండము 4:9, 35; 7:7, 8; 8:10-14; 10:12, 13) నేడు మనం క్రొత్త పని నియామకాలను చేపడుతుండగా లేక జీవితంలో క్రొత్త పరిస్థితులను ఎదుర్కొంటుండగా, మనం చేసేదాన్ని లేఖనాలలోని ఉపదేశం ఎలా ప్రభావితం చేయాలనేది పరిశీలించడం మనకు ప్రయోజనకరం.
7. ఇశ్రాయేలీయులు యొర్దానును దాటిన తర్వాత కొంతకాలానికి యెహోవా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సులపై, హృదయాలపై ముద్రించడానికి ఏం చేయడం జరిగింది?
7 ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటిన తర్వాత కొంతకాలానికి, యెహోవా మోషే ద్వారా తమకు చెప్పినదాన్ని పునఃసమీక్షించడానికి ప్రజలు మళ్లీ సమకూడారు. జనులు యెరూషలేముకు 50 కిలోమీటర్లు ఉత్తరంగా సమావేశమయ్యారు. తెగలలో సగంమంది ఏబాలు కొండ ఎదుట, మరో సగంమంది గెరిజీము కొండ ఎదుట ఉన్నారు. అక్కడ యెహోషువ “ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను.” అలా, యెహోవా అనంగీకారానికి కారణమయ్యే ప్రవర్తనను అదుపుచేసే సూత్రాలను గూర్చిన మరియు ఒకవేళ యెహోవాకు విధేయులైతే వారు పొందబోవు ఆశీర్వాదాలను గూర్చిన సమయోచితమైన పునర్వ్యాఖ్యానాన్ని పరవాసులతో సహా, పురుషులు, స్త్రీలు, పిల్లలు విన్నారు. (యెహోషువ 8:34, 35) యెహోవా దృక్కోణం నుండి ఏది మంచిదో, ఏది చెడ్డదో వాళ్లు స్పష్టంగా మనస్సులో ఉంచుకోవలసిన అవసరత ఉండింది. అంతేగాక, నేడు మనలో ప్రతి ఒక్కరం చేస్తున్నట్లుగానే వారు తమ హృదయాలపై మంచి ఎడల ప్రేమను, చెడు ఎడల ద్వేషాన్ని లిఖించుకోవలసి ఉండిరి.—కీర్తన 97:10; 119:103, 104; ఆమోసు 5:15.
8. ఇశ్రాయేలులో కొన్ని జాతీయ సమావేశాలలో దేవుని వాక్యాన్ని నిర్ణీత సమయాల్లో చదవడం యొక్క ప్రయోజనం ఏమైయుండెను?
8 ఆ చారిత్రాత్మకమైన సందర్భాల్లో ధర్మశాస్త్రం చదవబడటంతో పాటు, దేవుని వాక్యాన్ని క్రమంగా చదివే ఒక ఏర్పాటు కూడా ద్వితీయోపదేశకాండము 31:10-12 నందు పేర్కొనబడింది. ప్రతి ఏడవ సంవత్సరం మొత్తం జనాంగమంతా దేవుని వాక్యం చదవబడటాన్ని వినేందుకు సమావేశమవ్వాలి. ఇది వారికి ఆత్మీయాహారాన్ని అందజేసింది. సంతానాన్ని గూర్చిన వాగ్దానాలను వారి మనస్సులలో, హృదయాలలో సజీవంగా ఉంచి, తద్వారా నమ్మకస్థులైన వారిని మెస్సీయ యొద్దకు నడిపించడానికి అది సహాయపడింది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఆత్మీయాహారం కొరకు నెలకొల్పబడిన ఏర్పాట్లు వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించాక నిలిపివేయబడలేదు. (1 కొరింథీయులు 10:3, 4) బదులుగా, ప్రవక్తల యొక్క మరిన్ని ప్రకటనలు చేర్చబడడంతో దేవునివాక్యం ఇంకా సుసంపన్నం చేయబడింది.
9. (ఎ) ఇశ్రాయేలీయులు కేవలం పెద్ద గుంపులుగా సమకూడినప్పుడు మాత్రమే వారు లేఖనాలను చదివేవారా? వివరించండి. (బి) ఒక్కొక్కరి కుటుంబాల్లో లేఖనాలయందు ఉపదేశం ఎలా ఇవ్వబడేది మరియు ఏ ఉద్దేశంతో?
9 దేవునివాక్య ఉపదేశాన్ని పునఃసమీక్షించడం కేవలం ప్రజలు పెద్ద గుంపులుగా సమావేశమైన ఆ సమయాలకు మాత్రమే పరిమితమైయుండకూడదు. దేవునివాక్య భాగాలు, వాటిలో చేరివున్న సూత్రాలు ప్రతిదినం చర్చించబడాలి. (ద్వితీయోపదేశకాండము 6:4-9) నేడు అనేక ప్రాంతాలలో, యౌవనులు తమ వ్యక్తిగత బైబిలు ప్రతిని కలిగి ఉండడం సాధ్యమే, అలా కలిగి ఉండడం వారికి ఎంతో ప్రయోజనకరం. కాని ప్రాచీన ఇశ్రాయేలులో, పరిస్థితి అలా లేకుండినది. పూర్వం, తల్లిదండ్రులు దేవుని వాక్యం నుండి ఉపదేశం ఇచ్చినప్పుడు, వారు తాము కంఠస్థం చేసిన వాటిపై మరియు వారు తమ హృదయాల్లో కలిగివున్న సత్యాలపై, అలాగే వారు వ్యక్తిగతంగా వ్రాసివుంచుకున్న చిన్న వ్యాసాలపై ఆధారపడవలసి ఉండేది. తరచుగా పునరావృతం చేయడం ద్వారా, వారు తమ పిల్లలలో యెహోవా ఎడల, ఆయన మార్గాల ఎడల ప్రేమను పెంపొందింపజేయగలిగేవారు. కేవలం మెదడులో ఆ జ్ఞానాన్ని కలిగివుండడమే కాదుగాని, యెహోవా ఎడల, ఆయన వాక్యం ఎడల ప్రేమను వ్యక్తపర్చే విధంగా జీవించడానికి కుటుంబంలోని ప్రతివ్యక్తికి సహాయం చేయడమే ముఖ్య ఉద్దేశం.—ద్వితీయోపదేశకాండము 11:18, 19, 22, 23.
సమాజమందిరాల్లో లేఖనాలు చదవడం
10, 11. సమాజమందిరాల్లో లేఖనాలు చదవడానికి సంబంధించిన ఏ కార్యక్రమం అనుసరించబడేది, ఈ సందర్భాలను యేసు ఎలా దృష్టించాడు?
10 యూదులు బబులోనుకు బందీలుగా కొనిపోబడిన తర్వాత కొంతకాలానికి, సమాజమందిరాలు ఆరాధనాస్థలాలుగా స్థాపించబడ్డాయి. ఈ సమావేశ స్థలాల్లో దేవుని వాక్యాన్ని చదివి, చర్చించేందుకు, లేఖనాల అనేక ప్రతులు తయారు చేయబడ్డాయి. హెబ్రీ లేఖనాలకు సంబంధించిన దాదాపు 6,000 ప్రాచీన చేవ్రాత ప్రతులు ఉనికిలో ఉండడానికి ఇది ఒక కారణం.
11 ఆధునిక బైబిళ్లలోని మొదటి ఐదు పుస్తకాలకు సమానమైన తోరాహా చదవడం సమాజమందిర సేవలో ప్రాముఖ్యమైన భాగమైయుండేది. సా.శ. మొదటి శతాబ్దంలో ఆ విధంగా చదవడం ప్రతి విశ్రాంతి దినాన జరిగేదని అపొస్తలుల కార్యములు 15:21 తెలియజేస్తుంది, రెండవ శతాబ్దం నాటికి, వారంలోని రెండవ మరియు ఐదవ దినాల్లో తోరాహా చదవడం కూడా ఉండేదని మిష్నా చూపిస్తుంది. నియమిత భాగాలను చదవడంలో అనేకమంది వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు భాగం వహించేవారు. పూర్తి తోరాహాను ప్రతి సంవత్సరం చదవడం బబులోనులో నివసించిన యూదుల ఆచారంగా ఉండేది; మూడు సంవత్సరాల కాలంలో చదవడం ముగించే ఆచారం పాలస్తీనాలో ఉండేది. ప్రవక్తల గ్రంథాలలో నుండి కూడా ఒక భాగం చదివి వివరించబడేది. తాను నివసిస్తున్న ప్రాంతంలో విశ్రాంతి దినాన బైబిలు చదివే కార్యక్రమాలకు యేసు వాడుకగా హాజరయ్యేవాడు.—లూకా 4:16-21.
వ్యక్తిగత ప్రతిస్పందన మరియు అన్వయింపు
12. (ఎ) మోషే ప్రజలకు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించినప్పుడు, ప్రజలు ఎలా ప్రయోజనం పొందారు? (బి) ప్రజలెలా ప్రతిస్పందించారు?
12 ప్రేరేపిత లేఖనాలను చదవడం కేవలం ఆచరణ కొరకు ఏర్పాటు చేయబడింది కాదు. అది ప్రజల ఉత్సుకతను తృప్తిపర్చడానికి మాత్రమే చేయబడేదికాదు. సీనాయి పర్వతంవైపున్న మైదానంలో మోషే ఇశ్రాయేలీయులకు “నిబంధన గ్రంథమును” చదివి వినిపించినప్పుడు, వారు దేవుని ఎదుట తమ బాధ్యతలను తెలుసుకొని, వాటిని నెరవేర్చేందుకు ఆయనలా చేశాడు. వారలా చేశారా? చదవబడినదానికి ప్రతిస్పందించ వలసియుండేది. ప్రజలు దాన్ని గుర్తించి, ఇలా చెప్పడం ద్వారా ప్రత్యుత్తరమిచ్చారు: “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము.”—నిర్గమకాండము 24:7; నిర్గమకాండము 19:8; 24:3 పోల్చండి.
13. అవిధేయత వల్ల వచ్చే శాపములను యెహోషువ చదివి వినిపించినప్పుడు, ప్రజలు ఏమి చేయవలసి ఉండిరి మరియు ఏ ఉద్దేశంతో?
13 ఆ తర్వాత వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను, శాపములు లేక శాపవచనములను యెహోషువ జనాంగానికి చదివి వినిపించినప్పుడు, ప్రతిస్పందించడం అవసరమైయుండింది. ప్రతి శాపవచనము తర్వాత, “ప్రజలందరు ఆమేన్ అనవలెను” అని ఉపదేశం ఇవ్వబడింది. (ద్వితీయోపదేశకాండము 27:4-26) అలా, ఉదాహరించబడిన తప్పులను యెహోవా ఖండించడాన్ని అంగీకరిస్తున్నట్లుగా అంశం తర్వాత అంశం పరిశీలించబడేది. మొత్తం జనాంగమంతా తమ అంగీకారాన్ని బయల్పర్చినప్పుడు అది ఎంతటి ప్రభావవంతమైన సంఘటనైయుండవచ్చు!
14. నెహెమ్యా కాలంలో, ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా చదవడం ప్రాముఖ్యంగా ఎందుకు ప్రయోజనకరమైనదిగా నిరూపించబడింది?
14 నెహెమ్యా కాలంలో, ప్రజలందరు ధర్మశాస్త్రాన్ని వినడానికి యెరూషలేములో సమకూడినప్పుడు, అక్కడ వ్రాయబడివున్న ఉపదేశాలను తాము పూర్తిగా అవలంబించడంలేదని వారు గుర్తించారు. ఆ సందర్భంలో వారు తాము నేర్చుకున్నదాన్ని కచ్చితంగా అన్వయించుకున్నారు. ఫలితమేమైయుండెను? “బహు సంతోషము పుట్టెను.” (నెహెమ్యా 8:13-17) పండుగ సమయంలో ఒక వారమంతా ప్రతిదినం బైబిలు చదివిన తర్వాత, ఇంకా ఎక్కువ అవసరమైయుందని వారు గుర్తించారు. అబ్రాహాము కాలం నాటినుండి తన ప్రజలతో యెహోవా వ్యవహారాలను గూర్చిన చరిత్రను వారు ప్రార్థనాపూర్వకంగా పునఃసమీక్షించారు. ధర్మశాస్త్రం కోరేవాటికి కట్టుబడి ఉంటామని, పరదేశులను వివాహం చేసుకోవడాన్ని నిరాకరిస్తామని, ఆలయాన్ని దాని సేవను కొనసాగించేందుకు బాధ్యతలను స్వీకరిస్తామని ప్రమాణం చేయడానికి ఇదంతా వారిని పురికొల్పింది.—నెహెమ్యా, 8-10 అధ్యాయాలు.
15. కుటుంబాల్లో చేయబడే దేవుని వాక్య ఉపదేశం కేవలం ఆచారం వంటిదై ఉండకూడదని ద్వితీయోపదేశకాండము 6:6-9 నందలి ఉపదేశాలు ఎలా చూపిస్తున్నాయి?
15 అలాగే, కుటుంబంలో, లేఖనాలను బోధించడం కేవలం ఆచారం కొరకు ఏర్పాటు చేసింది కాదు. ముందే చూసినట్లుగా, యెహోవా మార్గాల ఎడలగల తమ ప్రేమను ఉదాహరణ ద్వారా, క్రియ ద్వారా ప్రదర్శిస్తూ, ‘దేవుని వాక్యాన్ని సూచనగా చేతికి కట్టుకొనవలెనని’ ద్వితీయోపదేశకాండము 6:6-9 నందు సూచనార్థక మాటల్లో ప్రజలకు చెప్పబడింది. లేఖనాలలో పొందుపర్చబడిన సూత్రాలను తదేకంగా మనస్సునందుంచుకొని, తమ నిర్ణయాలకు వాటిని ఆధారంగా ఉపయోగిస్తూ, వారు దేవుని వాక్యాన్ని ‘తమ కన్నుల నడుమ బాసికమువలె’ కట్టుకోవలసి ఉండెను. (నిర్గమకాండము 13:9, 14-16 నందుపయోగించబడిన భాషను పోల్చండి.) తమ ఇళ్లు మరియు తమ సమాజాలు దేవుని వాక్యం గౌరవింపబడి, అన్వయింపబడే స్థలాలని గుర్తింపబడేలా, వారు ‘వాటిని తమ యింటి ద్వారబంధములమీదను తమ గవునులమీదను వ్రాసుకోవాలి.’ వేరే మాటల్లో చెప్పాలంటే, వారి జీవితాలు తాము యెహోవా నీతియుక్తమైన సూత్రాలను ప్రేమిస్తున్నామని, అన్వయిస్తున్నామని చెప్పడానికి విస్తృతమైన రుజువునివ్వవలసి ఉండెను. అది ఎంత ప్రయోజనకరమై ఉండగలదు! మన కుటుంబాల ప్రతిదిన జీవితంలో దేవుని వాక్యానికి ఆ విధమైన ప్రాముఖ్యత ఉందా? విచారకరంగా, లేఖనాలుగల డబ్బాలను, అవి తాయెత్తులైనట్లు ధరిస్తూ యూదులు దీనినంతటినీ కేవలం ఒక ఆచారంగా మార్చారు. వారి ఆరాధన హృదయం నుండి వచ్చేదికాదు గనుక యెహోవా దాన్ని నిరాకరించాడు.—యెషయా 29:13, 14; మత్తయి 15:7-9.
పర్యవేక్షించే స్థానాల్లో ఉన్నవారి బాధ్యత
16. లేఖనాలను క్రమంగా చదవడం యెహోషువకు ఎందుకు ప్రాముఖ్యమైయుండెను?
16 ఒక లేఖనాన్ని చదివే విషయంలో, జనాంగాన్ని పర్యవేక్షించేవారి ఎడల ప్రత్యేక శ్రద్ధ చూపించబడేది. యెహోషువకు యెహోవా ఇలా చెప్పాడు: “ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను.” ఆయన ఆ బాధ్యతను నెరవేర్చడం దృష్ట్యా ఆయనకిలా చెప్పబడింది: “దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహోషువ 1:7, 8) నేడు ఏ క్రైస్తవ పర్యవేక్షకుని విషయంలోనైనా ఇది నిజమైయున్నట్లే, యెహోవా తన ప్రజలకిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞలను యెహోషువ తన మనస్సులో స్పష్టంగా ఉంచుకునేందుకు ఆయన లేఖనాలను క్రమంగా చదవడం సహాయపడింది. విభిన్న పరిస్థితులలో యెహోవా తన సేవకులతో ఎలా వ్యవహరించాడనేది యెహోషువ గ్రహించడం కూడా అవసరమైయుండెను. ఆయన దేవుని సంకల్పాన్ని గూర్చిన వ్యాఖ్యానాలను చదువుతుండగా, ఆ సంకల్పానికి సంబంధించి తన స్వంత బాధ్యత ఏమిటని ఆయన ఆలోచించడం ప్రాముఖ్యము.
17. (ఎ) యెహోవా చెప్పిన విధంగా రాజులు లేఖనాలను చదవడం నుండి ప్రయోజనం పొందేందుకు, వారు చదవడంతోపాటు ఇంకా ఏమి అవసరమైయుండెను? (బి) క్రమంగా బైబిలు చదవడం మరియు ధ్యానించడం క్రైస్తవ పెద్దలకు ఎందుకు ఎంతో ప్రాముఖ్యము?
17 తన ప్రజలపై రాజుగా పరిపాలించే ప్రతి వ్యక్తి తన రాజరిక ప్రారంభంలో, యాజకుల స్వాధీనమందున్న గ్రంథమును చూచి దేవుని ధర్మశాస్త్ర ప్రతిని సిద్ధం చేసుకోవాలని యెహోవా సూచించాడు. ఆ తర్వాత ఆయన “తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.” దాని విషయాలను గుర్తుంచుకోవాలన్నది మాత్రమే దాని ఉద్దేశం కాదు. బదులుగా, “తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకుని,” “తాను తన సహోదరులమీద గర్వించ” కూడదన్నది దాని ఉద్దేశం. (ద్వితీయోపదేశకాండము 17:18-20) దీని కొరకు ఆయన తాను చదువుతున్న దాన్ని లోతుగా ధ్యానించవలసి ఉండేది. సాక్ష్యాధారంగా కొంతమంది రాజులు తాము తమ పరిపాలనా బాధ్యతలలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నందున అది చేయలేమని తలంచారు, వారి నిర్లక్ష్యం ఫలితంగా పూర్తి జనాంగం బాధపడింది. క్రైస్తవ సంఘంలో పెద్దల పాత్ర ఏ విధంగాను రాజుల వంటిది కాదు. అయినప్పటికీ, రాజుల విషయంలో ప్రాముఖ్యమైనట్లే, పెద్దలు కూడా దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించడం ప్రాముఖ్యం. వారలా చేయడం, వారి కాపుదల క్రింద ఉంచబడిన వారిని గూర్చిన సరైన దృష్టిని కలిగివుండేందుకు వారికి సహాయపడుతుంది. నిజంగా దేవున్ని ఘనపర్చి, తోటి క్రైస్తవులను ఆత్మీయంగా బలపర్చే విధంగా బోధకులుగా వారు తమ బాధ్యతను నెరవేర్చేందుకు కూడా అది వారికి సహాయం చేస్తుంది.—తీతు 1:9; యోహాను 7:16-18 పోల్చండి. 1 తిమోతి 1:6, 7 వ్యత్యాసం చూడండి.
18. బైబిలును క్రమంగా చదవడంలోను, పఠించడంలోను పౌలు చూపించిన ఏ మాదిరి, అనుకరించడానికి మనకు సహాయం చేస్తుంది?
18 మొదటి శతాబ్ద క్రైస్తవ అధ్యక్షుడగు అపొస్తలుడైన పౌలుకు ప్రేరేపిత లేఖనాలు బాగా తెలుసు. ఆయన ప్రాచీన థెస్సలొనీకలోని ప్రజలకు సాక్ష్యమిచ్చినప్పుడు, ఆయన లేఖనాల నుండి ప్రభావవంతంగా వారితో తర్కించి, భావాన్ని అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేయగలిగాడు. (అపొస్తలుల కార్యములు 17:1-4) ఆయన యథార్థమైన శ్రోతల హృదయాలను చేరాడు. తద్వారా, ఆయన మాటలు విన్న అనేకులు విశ్వాసులయ్యారు. (1 థెస్సలొనీకయులు 2:13) బైబిలును చదివి, పఠించే మీ కార్యక్రమం ఫలితంగా, మీరు లేఖనాల నుండి ప్రభావవంతంగా తర్కించగలుగుతున్నారా? బైబిలు చదవడానికి మీ జీవితంలో ఇవ్వబడిన స్థానం మరియు మీరు దాన్ని చేసే విధానం, దేవుని వాక్యాన్ని కలిగివుండడాన్ని మీరు నిజంగా మెచ్చుకుంటున్నారనేదానికి రుజువునిస్తుందా? తర్వాతి శీర్షికలో, ఎంతో ఎక్కువ పని ఉన్న వారు కూడా ఈ ప్రశ్నలకు అనుకూలమైన సమాధానాన్ని ఎలా ఇవ్వవచ్చో మనం పరిశీలిస్తాము.
మీరెలా సమాధానమిస్తారు?
◻ బైబిలును చదవడానికి ప్రజలు తమ జీవితాన్ని, స్వాతంత్ర్యాన్ని పణంగా పెట్టేందుకు ఎందుకిష్టపడ్డారు?
◻ దేవుని వాక్యాన్ని వినడానికి ప్రాచీన ఇశ్రాయేలీయుల కొరకు చేయబడిన ఏర్పాట్లను పునఃసమీక్షించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందాము?
◻ మనం బైబిలునందు చదివే వాటితో ఏమి చేయాలి?
◻ బైబిలు చదవడం మరియు ధ్యానించడం క్రైస్తవ పెద్దలకు విశేషంగా ఎందుకు ప్రాముఖ్యము?
[9వ పేజీలోని చిత్రం]
యెహోవా యెహోషువకిలా చెప్పాడు: “నీవు దానిని దివారాత్రము ధ్యానించవలెను”